• facebook
  • whatsapp
  • telegram

జైన మతం

                   క్రీ.పూ.6వ శతాబ్దంలో భారతదేశంలో జైన, బౌద్ధ మతాలు ఆవిర్భవించాయి. నాటి దేశ ఆర్థిక, సామాజిక, మత, రాజకీయ రంగాల్లో ఉన్న పరిస్థితులే నూతన మతాల ఆవిర్భవానికి దోహదం చేశాయి. ప్రపంచంలో అనేక మంది నూతన మతాలను స్థాపించి కొత్త సిద్ధాంతాలను అందించారు. చైనాలో కన్ఫ్యూషియస్, లౌత్సలు; పర్షియా (ఇరాన్‌)లో జొరాస్టర్‌ లాంటి తత్త్వవేత్తలు నూతన మత సిద్ధాంతాలను ప్రచారం చేశారు.
 

 నూతన మతాల ఆవిర్భవానికి కారణాలు

         భారతదేశంలో క్రీ.పూ.6వ శతాబ్దంలో ఉన్న ఆధ్యాత్మిక అశాంతి, బ్రాహ్మణ ఆధిక్యత, యజ్ఞ యాగాల నిర్వహణ లాంటి మత కారణాలతోపాటు షోడశ మహాజనపథాలు ఆవిర్భవించడం; రాచరిక, గణ రాజ్యాల పాలనలోని వ్యత్యాసాలు నూతన మతాల ఏర్పాటుకు దోహదం చేశాయి. నగరాలు, పట్టణాలు ఆవిర్భవించడం; చేతివృత్తుల వారు వివిధ శ్రేణులుగా ఏర్పడటం, వర్తక వాణిజ్యాలు అభివృద్ధి చెందడం, నాణేలు చలామణిలోకి రావడం, వ్యవసాయ రంగంలో ఇనుము వాడకం ద్వారా అధిక వృద్ధిని సాధించడం వంటి ఆర్థిక పరిణామాలు కూడా ఈ నూతన మతాల పుట్టుకకు కారణమయ్యాయి. ముఖ్యంగా నాటి సమాజంలో వర్ణ వ్యవస్థ/కుల వ్యవస్థ విస్తరించడం, వివిధ నూతన వర్గాల ఆవిర్భావం లాంటి సామాజిక పరిణామాలు కూడా దోహదపడ్డాయి. వైదిక మతాచారాలకు (అధిక వ్యయంతో కూడుకున్న యజ్ఞ యాగాది క్రతువుల నిర్వహణ, బ్రాహ్మణ ఆధిక్యత, జంతుబలి లాంటి మతాచారాలు), నూతనంగా విజృంభిస్తున్న సాంఘిక వర్గాల ఆలోచనా విధానానికి మధ్య ఉండే తేడా వల్ల ఘర్షణలు మొదలై జైన, బౌద్ధ మతాలు ఆవిర్భవించాయి.
ప్రధానంగా అన్ని రంగాల్లోనూ రాజుల కంటే బ్రాహ్మణులకే ఆధిక్యత ఉండటం వల్ల వజ్జి, మల్ల గణ రాజ్యాల్లో యువరాజులుగా ఉన్న వర్ధమాన మహావీరుడు జైనమతాన్ని, గౌతమ బుద్ధుడు బౌద్ధమతాన్ని స్థాపించారు. ఈ కాలంలో అజీవకులు, చార్వాకులు అనే నూతన మతాలు వచ్చినప్పటికీ ప్రజలు మహావీరుడు, గౌతమబుద్ధుడి వ్యక్తిత్వం వల్ల జైన, బౌద్ధ మతాలనే ఆదరించారు.

 

        జైనమత స్థాపన విషయంలో చరిత్రకారులు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశారు. చారిత్రకంగా జైనమత స్థాపకులు రుషభనాథుడు, పార్శ్వనాథుడని; వాస్తవంగా స్థాపించింది మాత్రం వర్ధమాన మహావీరుడని అనేకమంది చరిత్రకారులు సిద్ధాంతీకరించారు.
 

 శాఖలు

జైనమతంలో క్రమంగా అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా జైనమతం దిగంబరులు, శ్వేతాంబరులు అనే రెండు శాఖలుగా చీలిపోయింది. వస్త్రాలు ధరించని వారిని దిగంబరులు అంటారు. వీరికి నాయకుడు భద్రబాహుడు. తెల్లని వస్త్రాలు ధరించే జైనులను శ్వేతాంబరులు అంటారు. వీరికి నాయకుడు స్థూలబాహుడు/స్థూలభద్రుడు. ప్రవర్తనా నియమావళికి సంబంధించి ఇరువర్గాల మధ్య తలెత్తిన భిన్నాభిప్రాయాలు చీలికకు కారణమయ్యాయి.
 

 పంచవ్రతాలు

జైనమత సిద్ధాంతాలను పంచవ్రతాలు అంటారు.
1. అసత్యం: అబద్ధం ఆడకూడదు/సత్యమునే పలకాలి
2. అహింస: జీవహింస చేయరాదు/అహింసను పాటించాలి.
3. అస్తేయ: దొంగతనం చేయకూడదు. 
4. అపరిగ్రాహ:  ఆస్తిని కలిగి ఉండరాదు.
5. బ్రహ్మచర్యం: ప్రతి వ్యక్తి బ్రహ్మచర్యాన్ని పాటించాలి.

 

        జైనమత గ్రంథాలను అంగాలు అంటారు. ఇవి మొత్తం 12 కాబట్టి ద్వాదశాంగాలు అని కూడా పిలుస్తారు. ప్రతి జైనుడు తప్పనిసరిగా పాటించాల్సిన నియమాలను త్రిరత్నాలు అంటారు. అవి సరైన విశ్వాసం, సరైన జ్ఞానం, సరైన నడవడిక. అంటే తీర్థంకరుల బోధనల పట్ల విశ్వాసాన్ని, వాటిని అర్థం చేసుకునే జ్ఞానాన్ని, అవి పాటించడం ద్వారా ప్రతి జైనుడు మోక్షాన్ని పొందుతాడని జైనుల నమ్మకం. త్రిరత్నాలను జైన, బౌద్ధ మతాలు రెండింటిలోనూ ప్రస్తావించారు. బౌద్ధమతంలో బుద్ధుడు, ధర్మం, సంఘం అనే వాటిని త్రిరత్నాలుగా పేర్కొన్నారు.
 

 తీర్థంకరులు

            జైనమత గురువులను తీర్థంకరులు అంటారు. తీర్థంకరుడు అంటే ‘జీవన స్రవంతిని దాటడానికి వారధి’ లాంటివాడని అర్థం. జైనమత సాహిత్యం, సంప్రదాయంలో మొత్తం 24 మంది తీర్థంకరులు ఉన్నారు. ఇందులో మొదటి తీర్థంకరుడు రుషభనాథుడు, 21వ తీర్థంకరుడు నేమినాథుడు, 22వ తీర్థంకరుడు అరిష్టనేమి, 23వ తీర్థంకరుడు పార్శ్వనాథుడు, 24వ తీర్థంకరుడు వర్ధమాన మహావీరుడు.
 

తీర్థంకరులు                     గుర్తు
రుషభనాథుడు                ఎద్దు
నేమినాథుడు                   నీలి గులాబి
 అరిష్టనేమి                      శంఖం
 పార్శ్వనాథుడు               పాము
 వర్ధమాన మహావీరుడు     సింహం

 

     జినుడు (వర్ధమానుడు) పేరు మీదుగా జైనమతం అనే పేరు వచ్చింది కాబట్టి జైన మత స్థాపకుడు వర్ధమన మహావీరుడు అని చెబుతారు. కానీ జైనమత తొలి తీర్థంకరుడు రుషభనాథుడు అని కొంతమంది చరిత్రకారులు పేర్కొంటారు. జైనమత సిద్ధాంతాలను పంచవ్రతాలు అంటారు. 
 

        దీనిలో మొదటి నాలుగు వ్రతాలైన అహింస, అస్థేయ, అసత్య, అపరిగ్రాహలను 23వ తీర్థంకరుడైన పార్శ్వనాథుడు తెలియజేశాడు కాబట్టి అతడే జైనమతాన్ని స్థాపించాడని మరికొంతమంది చరిత్రకారులు పేర్కొన్నారు. అయిదో వ్రతం బ్రహ్మచర్యాన్ని వర్ధమాన మహావీరుడు తెలియజేశాడు.
 

 పరిషత్తులు

     జైనమత అభివృద్ధికి రెండు ముఖ్యమైన సమావేశాలు (పరిషత్తులు) నిర్వహించారు. మొదటి జైన పరిషత్తు పాటలీపుత్రంలో స్థూలభద్రుడి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలోనే జైనమత గ్రంథంగా ఉన్న 14 పర్వాల స్థానంలో 12 అంగాలను ప్రవేశపెట్టారు.
 

    రెండో జైన పరిషత్తును వల్లభిలో క్షమశ్రవణుడు/దేవార్థి క్షమపణ నిర్వహించాడు. ఈ సమావేశంలో 12 ఉపాంగాలను సంకలనం చేశారు.
 

 వర్ధమాన మహావీరుడు

    జైనమత స్థాపకుడు వర్ధమాన మహావీరుడు. ఈయన క్రీ.పూ.540లో ప్రస్తుత బిహార్‌లోని కుంద గ్రామంలో జన్మించాడు. తండ్రి సిద్ధార్థుడు, తల్లి త్రిశాల. భార్య యశోద, కుమార్తె ప్రియదర్శిని/అనోజ్ఞ. ఇతడు వైశాలి రాజ్యానికి చెందిన (వజ్జి గణ రాజ్యం) జ్ఞాత్రిక క్షత్రియ వంశస్థుడు. వర్ధమానుడు తన 30వ ఏట ఇల్లు విడిచి 12 ఏళ్లపాటు రిజుపాలిక నదీతీరంలోని జృంభిక అనే గ్రామంలో సాలవృక్షం కింద తపస్సు చేసి 42వ ఏట ‘జినుడు’ అయ్యాడు. జినుడు అంటే కోర్కెలను/ఇంద్రియాలను జయించినవాడని అర్థం. వర్ధమానుడు మహావీరుడు, కేవలి, నిర్గంగ్రథుడు లాంటి బిరుదులను పొందాడు. తన అనుచరులను జైనమతంగా ఏర్పరిచి, మత సిద్ధాంతాలను ప్రచారం చేస్తూ క్రీ.పూ.468లో బిహార్‌లోని పావాపురి ప్రాంతంలో నిర్యాణం చెందాడు.
 

 బోధనలు

      పంచవ్రతాల్లో చివరిదైన బ్రహ్మచర్యాన్ని ప్రతిపాదించింది వర్ధమానుడే. ఇతడు ద్వైత సిద్ధాంతాన్ని లేదా సాద్వాదాన్ని విశ్వసించాడు. దీని ప్రకారం సృష్టిలో ఆత్మ, పదార్థం అనే రెండు అంశాలు ఉంటాయని తెలిపాడు. పదార్థం నశించిపోతుంది కానీ కోరికల వల్ల ఆత్మ అనేది జన్మ, పునర్జన్మ చట్రంలో ఇరుక్కుపోయి స్వేచ్ఛను కోల్పోతుందని పేర్కొన్నాడు. ఈ చక్రబంధనం నుంచి విముక్తి పొందడం ఎలా అనే దానికి సమాధానం కనుక్కోవడానికే అతడు పరివ్రాజకుడయ్యాడు. సత్యాన్ని అన్వేషిస్తూ ఇల్లు వదిలి వెళ్లడాన్ని పరివ్రాజకుడు అంటారు. వర్ధమానుడు 30వ ఏట, గౌతమ బుద్ధుడు 29వ ఏట పరివ్రాజకులయ్యారు. వేదాలు ప్రామాణికంకాదని, యజ్ఞ యాగాల వల్ల మోక్షం రాదని, జీవహింస చేయరాదని ప్రచారం చేశాడు. ముఖ్యంగా వర్ధమానుడు ప్రచారం చేసిన సిద్ధాంతాన్ని సల్లేఖన వ్రతం అంటారు. అంటే వ్యక్తి అన్న పానాదులు మాని శరీరం శుష్కించేవరకు కఠోరమైన తపస్సు చేస్తే మోక్షం వస్తుందని బోధించాడు
 

  మహావీరుడికి గణధారులు (పీఠాధిపతులు) అనే 11 మంది సన్నిహితులైన శిష్యులు/ధర్మదూతలు ఉండేవారు. వారిలో ఆర్య సుధర్ముడు వర్ధమానుడి అనంతరం జైనమతానికి ప్రధాన గురువు (థేరా) కాగా ఈయన తర్వాత జంబు మతగురువు అయ్యాడు. ముఖ్యంగా ధననందుడి పాలనాకాలంలో వర్ధమానుడి తర్వాత సంభూత విజయ గొప్ప జైన మతాచార్యుడిగా పేరొందాడు. ఒక వ్యక్తి కేవలం జ్ఞానాన్ని పొందడానికి 14 ఆధ్యాత్మిక దశలు (పూర్వాలు) దాటాలని పేర్కొన్నారు. చంద్రగుప్త మౌర్యుడి కాలంలో ఆరో మతగురువు (థేరా)గా పేరొందిన వ్యక్తి భద్రబాహుడు. ఇతడు కల్పసూత్రాలు అనే గ్రంథాన్ని రాశాడు.
 

 వాస్తుకళాభివృద్ధి

   జైనమతం భారతదేశ మత, సాహిత్య, వాస్తుకళా రంగాల్లో ఎన్నో మార్పులకు కారణమైంది. ముఖ్యంగా చంద్రగుప్త మౌర్యుడు, ఖారవేలుడు; కదంబులు, గాంగులు, చాళుక్యులు, రాష్ట్రకూటులు లాంటి రాజవంశాలు జైనమతాన్ని అవలంబించి అనేక జైన దేవాలయాలను నిర్మించారు. కవులను పోషించి జైన సాహిత్యాభివృద్ధికి కృషిచేశారు. కర్ణాటకలోని శ్రావణబెల్గోళ (గోమఠేశ్వర మఠం), ఒడిశాలోని ఉదయగిరి గుహాలయాలు, రాజస్థాన్‌లోని మౌంట్‌ అబూ పర్వతంపై ఉన్న దిల్వారా జైన దేవాలయాలు, మహారాష్ట్రలోని ఎల్లోరా గుహాలయాలు జైనమతం వల్ల అభివృద్ధి చెందాయి.
 

     జైనమత ప్రేరణతోనే మధుర శిల్పకళ ఆవిర్భవించింది. ప్రాకృత, సంస్కృత, ప్రాంతీయ భాషల్లో అనేక మంది పండితులు జైన సాహిత్యాన్ని అందించారు. జైనమత గ్రంథాలైన ద్వాదశాంగాలను ప్రాకృత భాషలో రచించారు. భద్రబాహుడి కల్పసూత్రాలు, అమోఘవర్షుడి కవి రాజ మార్గం లాంటి గ్రంథాలు ఈ మతానికి సంబంధించినవే.
 

     ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో ఉన్న కొనగండ్ల, తెలంగాణలో నల్గొండ జిల్లాలోని కొలనుపాక గొప్ప జైన ఆశ్రమాలుగా పేరొందాయి.
 

 రచయిత: బొత్స నాగరాజు

Posted Date : 01-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌