• facebook
  • whatsapp
  • telegram

మహమ్మద్‌ ఘోరీ దండయాత్రలు

ఘోరీ తొలి దాడులు


ఘోరీ క్రీ.శ. 1175లో మొదట ముల్తాన్‌పై దాడి చేసి, ఆక్రమించాడు. క్రీ.శ. 1182లో దిగువ సింధూను జయించాడు.


*  క్రీ.శ. 1179లో గుజరాత్‌లోని అన్హిల్‌వాడపై దండెత్తాడు. దాని పాలకుడైన రెండో భీముడు ఘోరీని ఓడించాడు. ఈ పరాభవాన్ని ఘోరీ ఊహించలేదు. దీంతో భారత్‌లో ప్రవేశించడానికి గుజరాత్‌ సరైన మార్గం కాదని భావించాడు. దానికి ప్రత్యామ్నాయంగా పంజాబ్, సింధ్‌లను ఎంచుకున్నాడు. క్రీ.శ.1179లో పెషావర్‌ను ఆక్రమించాడు.


*  క్రీ.శ. 1185లో పంజాబ్, సియాల్‌ కోటలను జయించాడు. లాహోర్‌ కోటను ముట్టడించి దాని పాలకుడు ఖుస్రూను ఖైదు చేశాడు. దీంతో ఘోరీ పంజాబ్‌పై పూర్తి అధికారాన్ని పొందాడు. భారత్‌లోకి రావడానికి ఇది తోడ్పడింది.


తరైన్‌ యుద్ధాలు


మొదటి తరైన్‌ యుద్ధం (క్రీ.శ.1191) 


ఘోరీ వరుస దాడుల నేపథ్యంలో అజ్మీర్‌ పాలకుడు పృథ్వీరాజ్‌ చౌహాన్‌ అతడ్ని ఎదుర్కొనేందుకు రాజపుత్ర రాజ్యాలతో ఒక సమాఖ్యను ఏర్పాటు చేశాడు. కనౌజ్‌ పాలకుడు జయచంద్రుడు, బెంగాల్‌ పాలకుడు లక్ష్మణసేనుడు, అన్హిల్‌వాడ పాలకుడు రెండో భీముడు ఇందులో ఉన్నారు.


*  ఘోరీ పంజాబ్‌లోని భటిండా కోటను ఆక్రమించాక, క్రీ.శ.1191లో చౌహాన్‌పై దండెత్తాడు. ఆ యుద్ధం తరైన్‌ అనే గ్రామం వద్ద జరిగింది. అందుకే దీన్ని మొదటి తరైన్‌ యుద్ధంగా పేర్కొన్నారు. ఇందులో ఘోరీ ఓడిపోయాడు. భటిండా చౌహాన్‌ పరమైంది.


రెండో తరైన్‌ యుద్ధం (క్రీ.శ.1192) 


మొదటి తరైన్‌ యుద్ధంలో పృథ్వీరాజ్‌ చౌహాన్‌ విజయం సాధించడంతో తోటి రాజపుత్రులు అసూయ చెంది, సమాఖ్యను విచ్ఛిన్నం చేశారు.


*  ఇది తెలుసుకున్న ఘోరీ మళ్లీ క్రీ.శ.1192లో అజ్మీర్‌పై దాడి చేశాడు. రెండు సైన్యాలు తరైన్‌ వద్ద తలపడ్డాయి. దీన్ని రెండో తరైన్‌ యుద్ధం అంటారు. ఇందులో పృథ్వీరాజ్‌ ఓడిపోయాడు. ఢిల్లీ, అజ్మీర్‌లు ఘోరీ వశమయ్యాయి. ఈ తరైన్‌ యుద్ధాలను ‘స్థానేశ్వర్‌ యుద్ధాలు’ అంటారు.


*  ఘోరీ తన ప్రతినిధిగా ఢిల్లీలో కుతుబుద్దీన్‌ ఐబక్‌ను నియమించాడు. అజ్మీర్‌ను పృథ్వీరాజ్‌ కుమారుడు గోవిందరాజుకు అప్పగించి, కప్పం వసూలు చేశాడు. 


*  క్రీ.శ.1195-96లో బయానా, గ్వాలియర్‌లను ఆక్రమించాడు. 


*  రెండో తరైన్‌ యుద్ధం తర్వాత భారతదేశంలో ముస్లిం రాజ్యాధికారం స్థిరపడింది. దీనికి కారణం ఘోరీ రాజప్రతినిధులు కుతుబుద్దీన్‌ ఐబక్, మహ్మద్‌ బిన్‌ భక్తియార్‌లు. 


*  మహమ్మద్‌ ఘోరీ పంజాబ్‌ నుంచి ఆఫ్ఘనిస్థాన్‌ వెళ్లే మార్గంలో క్రీ.శ.1206లో హత్యకు గురయ్యాడు.


ప్రాముఖ్యత: ముస్లింలు దాదాపు ఆరున్నర శతాబ్దాలపాటు భారతదేశాన్ని పాలించడానికి రెండో తరైన్‌ యుద్ధం ఉపయోగపడింది.


* అప్పటివరకు ఉత్తరభారత రాజకీయాల్లో కనౌజ్‌ ముఖ్య పాత్ర వహిస్తే యుద్ధం తర్వాత నుంచి ఆ స్థానం ఢిల్లీకి మారింది.


ఇతర దండయాత్రలు


ముస్లింలను భారతదేశం నుంచి తరిమివేయడానికి రాజపుత్రులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. పృథ్వీరాజ్‌ సోదరుడు హరిరాజ్‌ రణ్‌థంబోర్‌లో ముస్లింలను ఎదుర్కొనే దిశగా కూటమి ప్రయత్నాలు ప్రారంభించాడు. ఇది తెలుసుకున్న ఘోరీ మీరట్, ఢిల్లీ, బులంద్‌ షహర్‌ కోటలను ముట్టడించి, ఆక్రమించాడు.


*  కనౌజ్‌ను ఆక్రమిస్తే తనకు స్థిరత్వం లభిస్తుందని ఘోరీ భావించాడు. కనౌజ్‌పై దండయాత్రకి కుతుబుద్దీన్‌ ఐబక్‌ నాయకత్వంలో సేనలను పంపాడు. క్రీ.శ.1194లో చందేవార్‌ వద్ద కనౌజ్‌ పాలకుడు జయచంద్రుడితో కుతుబుద్దీన్‌ యుద్ధం చేసి, ఓడించాడు. కనౌజ్, బెనారస్‌లు ఘోరీ అధీనంలోకి వచ్చాయి.


*  కుతుబుద్దీన్‌ క్రీ.శ.1196లో గ్వాలియర్‌ పాలకుడు శుక్తపాలుడ్ని; కలంజర్‌ను ముట్టడించి పరమార్ధదేవుడ్ని ఓడించాడు. బుందేల్‌ఖండ్‌ను ఆక్రమించాడు. 


*  క్రీ.శ.1197లో ఐబక్‌ అన్హిల్‌వాడపై దండెత్తి రెండో భీమదేవుడ్ని ఓడించాడు.


*  ఘోరీ సేనాని మహ్మద్‌ బిన్‌ భక్తియార్‌. ఇతడు బెంగాల్‌ పాలకుడైన లక్ష్మణ సేనుడ్ని ఓడించాడు. క్రీ.శ. 1197లో బిహార్, బెంగాల్‌లు ముస్లింల వశమయ్యాయి. భక్తియార్‌ బెంగాల్‌ నుంచి బిహార్‌ వెళ్లే మార్గమధ్యలో నలందా విశ్వవిద్యాలయాన్ని నేలమట్టం చేశాడు. వేదాంతపురి, విక్రమశిల విశ్వవిద్యాలయాలను కూడా భక్తియార్‌ నాశనం చేశాడు. 


 ముస్లిం విజయాలకు కారణాలు 


ఎలాంటి వనరులు లేని ఆఫ్గనిస్థాన్‌కి చెందిన తురుష్కులు (టర్కీలు) భారతదేశాన్ని జయించడం ‘అంతుచిక్కని రహస్యం’గా చరిత్రకారులు పేర్కొన్నారు. భారతీయ సైనికుల సంఖ్య శత్రు సేనల కంటే ఎన్నో రెట్లు ఎక్కువ, అయినప్పటికీ ఓటమి తప్పలేదు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి:


*  భారతీయ పాలకుల్లో ఐక్యత కొరవడటం. సరిహద్దులను కాపాడే శక్తిమంతమైన సార్వభౌముడు లేకపోవడం. 


*  ఉత్తర భారతదేశం దాదాపు 15 చిన్న రాజ్యాలుగా విడిపోయి, తమలో తాము కలహించుకున్నాయి. ఇది ముస్లింలకు అవకాశంగా మారింది. వారు విదేశీయులను ఎదుర్కోవడంపై దృష్టి సారించలేదు. 


*  భారతీయుల అహింసా సిద్ధాంతాలు, ఆచార సంప్రదాయాలు, మూఢ విశ్వాసాలు ఓటమికి కారణమయ్యాయి.


*  యుద్ధాల్లో నూతన పద్ధతులు పాటించలేదు. క్రమశిక్షణ, నాయకత్వ లోపం ప్రధాన సమస్యలు. 


*  ముస్లింలు శారీరకంగా బలవంతులు. దీంతో వారు తేలిగ్గా భారతీయ రాజులను ఓడించారని చరిత్రకారుల అభిప్రాయం.


*  గజనీకి, ఘోరీకి మధ్య దాదాపు 150 సంవత్సరాల తేడా ఉన్నా భారతీయులు విదేశీ దండయాత్రలను ఎదుర్కోవడంలో విఫలమయ్యారు. 


*  మహమ్మద్‌ గజనీ సోమనాథ్‌ ఆలయంపై దాడి చేసిన దాదాపు 168 ఏళ్లకు తరైన్‌ యుద్ధం జరిగింది. ఇందులో హిందువులు ఎలాంటి ప్రభావం చూపలేకపోయారు. 


*  భారతీయ సైనికులకు నైతిక విలువలు ఉండేవి. శత్రువులకు అవి లేవు. నమ్మించి మోసం చేయడం వారికి అలవాటు. ముస్లింలు దీన్ని భారతీయులపై బాగా ఉపయోగించారు.


*  హిందువులు యుద్ధాన్ని ఒక నైతిక ధర్మంగా భావిస్తారు. దీనికి విధి విధానాలు పాటిస్తారు. ముస్లిం సేనలు శత్రువులను అంతం చేయడానికి ఎన్నో పాశవిక, దుర్మార్గపు, క్రూర కృత్యాలకు పాల్పడేవారు.


*  రాజుల మధ్య ఉన్న భేదాల కారణంగా వారు తమకు నచ్చని రాజ్య సమాచారాన్ని ముస్లిం పాలకులకు అందించారు.


*  హిందూ సమాజం కుల వ్యవస్థ పేరుతో విడిపోయింది. క్షత్రియులు మాత్రమే యుద్ధాలు చేయాలి, మిగిలిన వారు పాలితులు అనే భావన నాటి సమాజంలో ఉండేది. దీంతో మిగిలిన వర్గాలు యుద్ధాల్లో పాల్గొనలేదు.


*  తురుష్కులు మతోన్మాదంతో ఇస్లాం మత వ్యాప్తికి కృషి చేశారు. భారతీయ సైన్యాలకు ఇలాంటి లక్ష్యాలు లేవు.


*  చివరగా, మహమ్మద్‌ ఘోరీ తన ఆశయాలను కార్యరూపంలో సాధించాడు. భారతదేశంలో తురుష్కుల సామ్రాజ్యాన్ని స్థాపించాడు. గొప్ప విజేతగా, విశాల సామ్రాజ్య నిర్మాతగా భారతదేశ చరిత్రలో నిలిచిపోయాడు.

ముఖ్యాంశాలు

దాహిర్‌ - సింధ్‌ పాలకుడు, రేవార్‌ యుద్ధంలో


 *  మహమ్మద్‌-బిన్‌-కాశీం చేతిలో ఓడిపోయాడు.


*  ఖురాన్‌ - ఇస్లాం మత పవిత్ర గ్రంథం.


*  ఖలీఫా - ఇస్లాం రాజ్యానికి గురువు (లేదా) ఇస్లాం మత పెద్ద.


*  ముల్తాన్‌ - బంగారు నగరంగా పేరొందింది.


*  జౌహర్‌ - అగ్నిలో దూకి ఆత్మాహుతి చేసుకోవడం. దీన్ని రాజపుత్రులు పాటిస్తారు.


*  మహమ్మద్‌-బిన్‌-ఖాసిం - హల్‌ హజ్జజ్‌ బావమరిది, సింధ్‌ను ఆక్రమించిన యువరాజు. 


*  భారతదేశంపై ఇస్లాం రాజ్యాన్ని స్థాపించిన మొదటివాడు.


*  రాణీబాయి - దాహీర్‌ భార్య. 


* సూరజ్‌దేవి, పెర్మల్‌దేవి - దాహీర్‌ కుమార్తెలు.


*  గజనీ మహమ్మద్‌ బిరుదులు - యామిన్‌ ఉద్దౌలా (సామ్రాజ్యానికి కుడిహస్తం), అమీన్‌-ఉల్‌-మిల్లత్‌ (మత సంరక్షకుడు).


*  ఖాదిర్‌ బిలాల్‌ - ఖలీఫా. ఇతడు గజనీని భారతదేశంపై దండెత్తమని ప్రోత్సహించాడు.


*  ఉద్బీ - మహమ్మద్‌ గజనీ ఆస్థాన పండితుడు.


* సోమనాథ్‌ దేవాలయం - ఇది గుజరాత్‌లో ఉంది. శివుడి దేవాలయం. అప్పటి గుజరాత్‌ పాలకుడిగా ‘భీమదేవుడు’ ఉన్న సమయంలో గజనీ మహమ్మద్‌ క్రీ.శ.1025-26లో ఈ దేవాలయంపై దాడిచేసి అపార సంపదను దోచుకున్నాడు.


*  ఫిర్దౌసి - మహమ్మద్‌ ఘోరీ ఆస్థాన పండితుడు. ‘షానామా’ అనే గ్రంథాన్ని రచించాడు. 


* ఘోరీ - గజనీ, మీరట్‌ల మధ్య ఉన్న రాజ్యం.


 

Posted Date : 26-10-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌