• facebook
  • whatsapp
  • telegram

సేంద్రియ వ్యవసాయం (ఆర్గానిక్‌ ఫార్మింగ్‌)

ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ సంప్రదాయ వ్యవసాయ పద్ధతుల స్థానంలో సేంద్రియ సాగు వైపు మొగ్గు చూపుతున్నాయి. 


* సంప్రదాయ వ్యవసాయంలో రసాయన ఎరువులు, కీటక నాశనుల వినియోగం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా వ్యవసాయ అవసరాల కోసం ఎక్కువగా బాహ్య వనరులపై ఆధారపడటం; పనిముట్లు, యంత్రాల వినియోగం, వ్యయం అధికం కావడం లాంటివి ఉంటాయి. ఇవేకాకుండా పర్యావరణం, జీవవైవిధ్యం, నేల నాణ్యత మొదలైనవాటిపై అత్యంత ప్రతికూల ప్రభావం ఉంటుంది. 


సంప్రదాయ వ్యవసాయంలో వాడిన పద్ధతులు సేంద్రియ వ్యవసాయంలో చాలా తక్కువ స్థాయిలో ఉంటాయి. వీటి స్థానంలో సహజ ఉత్పత్తులు వాడతారు. సహజ ఎరువులు, కీటక నాశనులను పంట మొక్కలకు అందిస్తారు. 


సహజ ఎరువులు అంటే పంట వ్యర్థాలు, పశువుల నుంచి వచ్చే వ్యర్థాలు మొదలైనవి. వీటివల్ల ఆరోగ్యవంతమైన ఆవరణ వ్యవస్థను పొందడంతో పాటు, సారవంతమైన మృత్తికలకు రక్షణ కల్పించవచ్చు. సహజ కీటక నాశని వ్యవస్థ కలిగిన పద్ధతుల ద్వారా చీడపీడలను అరికడతారు.


సేంద్రియ వ్యవసాయంలో ఎక్కువ శ్రామికులు అవసరమవుతారు. అంతేకాకుండా కొన్ని రకాల పంటల ఉత్పత్తికి ఎక్కువ సమయం కావాలి. ఇవి సేంద్రియ సాగులో ప్రతికూల అంశాలు. అయితే ఈ పద్ధతుల ద్వారా నేల స్వభావాన్ని, జీవవైవిధ్యాన్ని  మెరుగుపరిచి తద్వారా సుస్థిరాభివృద్ధిని సాధించవచ్చు. 


ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్న భారత ప్రభుత్వం సేంద్రియ సాగును ఎంతగానో ప్రోత్సహిస్తోంది. రైతులు, ప్రకృతి, మానవ ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి ఇది ఉపయోగపడుతుందని ప్రభుత్వం పేర్కొంది. 


సేంద్రియ సాగులోని ముఖ్య అంశాలు 


ఈ రకమైన వ్యవసాయ పద్ధతుల్లో కింది అంశాలు కీలక పాత్ర పోషిస్తాయి. 


కావాల్సిన లక్షణాలతో ఉన్న వంగడం లేదా మొక్కలను ఎంపిక చేయటం. 


నేల ఆరోగ్యాన్ని పరిరక్షించడం. దీనికోసం క్రాప్‌ రొటేషన్‌ లాంటి పద్ధతులను అవలంబించటం. 


నీటి నిర్వహణ పద్ధతులు. 


జన్యు వైవిధ్యతను కాపాడటం. 


కలుపు మొక్కలు, చీడపీడలు, వ్యాధుల నివారణ. 


రకాలు 


ఇంటిగ్రేటెడ్‌ ఆర్గానిక్‌ ఫార్మింగ్‌: 


ఈ పద్ధతిలో జీవావరణ వ్యవస్థ సమతౌల్యాన్ని కాపాడటానికి పంటలకు అవసరమైన అన్ని రకాల పోషకాలను కలిపి అందిస్తారు. మెరుగైన పంట దిగుబడి కోసం కొన్ని రకాల పర్యావరణహిత రసాయనాలను కూడా వినియోగిస్తారు. వీటి సాయంతో చీడపీడలను కూడా సమర్థవంతంగా నిర్మూలించవచ్చు. 


ప్యూర్‌ ఆర్గానిక్‌ ఫార్మింగ్‌: 


ఈ రకమైన సాగులో కృత్రిమ రసాయనాల వినియోగాన్ని పూర్తిగా నిషేధిస్తారు. పంటలకు కావాల్సిన అన్ని రకాల ఎరువులు, కీటక నాశనులను సహజ పద్ధతుల ద్వారానే అందిస్తారు.  

లాభాలు 

సేంద్రియ వ్యవసాయంలో ఖరీదైన ఎరువులు, కీటక నాశనులను ఉపయోగించరు. దీన్ని రైతులకు లాభదాయకమైందిగా పేర్కొంటారు. ఈ పద్ధతి వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. 


* అత్యంత ఎక్కువ పోషక విలువలతో కూడిన ఆహారం పొందొచ్చు. 


* భూసారాన్ని కాపాడటంతోపాటు సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు సాధించొచ్చు. సంప్రదాయ వ్యవసాయ పద్ధతులతో పోలిస్తే, రెండు లేదా మూడు పంటల తర్వాత కూడా సేంద్రియ వ్యవసాయంలో మెరుగైన వ్యవసాయ దిగుబడిని పొందొచ్చు. 


* భారత ప్రభుత్వం కొన్ని సేంద్రియ సాగు ప్రాంతాలను ఎకో టూరిజం ప్రదేశాలుగా గుర్తించింది. ఇక్కడికి పర్యాటకులు కూడా ఎక్కువగా వస్తుంటారు. ఇవి ఆదాయ ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. 

లోపాలు 

* సేంద్రియ సాగు ప్రాముఖ్యత, విధానాలపై రైతుల్లో అవగాహన లేకపోవడం. ఈ సాగు పద్ధతులకు కావాల్సిన మౌలిక వసతులు, మార్కెటింగ్‌ సదుపాయాలు అభివృద్ధి చెందకపోవడం. 

* ఈ సాగులో అత్యంత ఎక్కువగా బాహ్య వనరులను (external inputs) అందించాల్సి రావడం.

* సేంద్రియ ఆహార పదార్థాలు సాధారణ ఆహార పదార్థాలతో పోలిస్తే 40 శాతం ఎక్కువ ధరను కలిగి ఉంటాయి. దీంతో ఇవి సామాన్యులకు అందుబాటులో ఉండవు. 

* వీటికి తక్కువ షెల్ఫ్‌ లైఫ్‌ పీరియడ్‌ ఉంటుంది. అంటే ఆహార పదార్థాలు త్వరగా పాడవుతాయి. నీ ప్రపంచంలో ప్రస్తుతం సేంద్రియ ఆహారానికి ఉన్న డిమాండ్‌కి అనుగుణంగా ఆహార పదార్థాల దిగుబడి లేదా సేంద్రియ సాగు అందుబాటులో లేదు. 

* సంప్రదాయ వ్యవసాయ రైతులకు ఉన్న సబ్సిడీలు లేదా సర్టిఫికేషన్‌ పద్ధతులు సేంద్రియ ఉత్పత్తులకు కల్పించలేదు.


భారతదేశంలో సేంద్రియ వ్యవసాయం


4000 సంవత్సరాలకు పూర్వమే మన దేశంలో సేంద్రియ సాగుకి సంబంధించిన ఆధారాలు లభించాయి. బ్రిటిష్‌ వారి రాకతో వ్యవసాయ పంటల స్వరూపం పూర్తిగా మారిపోయి, కృత్రిమ ఎరువులు, యంత్రాల వాడకం మొదలైంది.


* 1960 దశకంలో భారతదేశంలో ఆహార స్వయం సమృద్ధి కోసం మొదలైన హరిత విప్లవం కొంతవరకు రుణాత్మక ప్రభావాన్ని నమోదు చేసింది. దీన్ని గమనించిన భారత ప్రభుత్వం మన పూర్వ సంప్రదాయాలతో కూడిన సేంద్రియ సాగుపై దృష్టి సారించింది. 


* అగ్రికల్చరల్‌ అండ్‌ ప్రాసెస్డ్‌ డెవలప్మెంట్‌ అథారిటీ (APEDA) 2021లో ప్రచురించిన అంచనాల ప్రకారం, భారతదేశం ప్రపంచంలోనే సేంద్రియ పద్ధతుల్లో సాగు చేసే భూమిని కలిగి ఉన్న ఆరో దేశంగా, అత్యధిక సంఖ్యలో సేంద్రియ రైతులను కలిగిన మొదటి దేశంగా ఉంది. 


2023, మార్చి 31 నాటికి భారతదేశంలో సేంద్రియ పద్ధతులను అవలంబించే సర్టిఫికేషన్‌ కలిగిన భూమి వైశాల్యం 10.17 మెగా హెక్టార్లుగా ఉంది. 2022-23 నాటికి సుమారు 2.9 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల సర్టిఫైడ్‌ ఆర్గానిక్‌ పదార్థాలను ఉత్పత్తి  చేస్తున్నారు. వీటిలో నూనె ధాన్యాలు, చెరకు, ఆహార ధాన్యాలు, సిరి ధాన్యాలు, పత్తి, సుగంధ ద్రవ్యాలు, ఔషధ మొక్కలు (మెడిసినల్‌ ప్లాంట్స్‌), కాఫీ, టీ, పండ్లు, డ్రై ఫ్రూట్స్, కూరగాయలు, ప్రాసెస్డ్‌ ఫుడ్స్‌ ఉన్నాయి. 


* వీటి ఎగుమతుల ద్వారా భారత్‌ సుమారు 708 మిలియన్‌ అమెరికన్‌ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది. వీటిలో ముఖ్యంగా అవిసె గింజలు, నువ్వులు, సోయాబీన్స్, టీ, మెడిసినల్‌ ప్లాంట్స్‌ మొదలైనవి ఉన్నాయి.


* ఈ పదార్థాలను ముఖ్యంగా అమెరికా సంయుక్త రాష్ట్రాలు, యూరోపియన్‌ యూనియన్, కెనడా, బ్రిటన్, స్విట్జర్లాండ్, టర్కీ మొదలైన దేశాలకు ఎగుమతి చేస్తున్నారు.


* భారతదేశంలో ప్రస్తుతం సేంద్రియ ఉత్పత్తులను అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రంగా మధ్యప్రదేశ్‌ ఉంటే మహారాష్ట్ర, రాజస్థాన్‌ కర్ణాటక, ఒడిశా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.   


* 2016లో ప్రపంచంలోనే తొలి సేంద్రియ రాష్ట్రంగా (పూర్తిస్థాయి) సిక్కిం నిలిచింది. రసాయన రహిత సేంద్రియ పంటల ఉత్పత్తి, వినియోగంలో ఈశాన్య రాష్ట్రాలు దేశంలోనే ముందంజలో ఉన్నాయి. 


* పూర్వం కొన్ని తెగలకు చెందిన ప్రజలు మాత్రమే సేంద్రియ సాగు చేసేవారు.

ప్రభుత్వ ప్రోత్సాహకాలు 

నేషనల్‌ పాలసీ ఆన్‌ ఆర్గానిక్‌ ఫార్మింగ్‌: భారత ప్రభుత్వం సేంద్రియ సాగుపై రైతుల్లో చైతన్యం కలిగించడానికి, పరిశోధనా రంగంలో ఉన్న ఔత్సాహికులను ప్రోత్సహించడానికి 2005లో నేషనల్‌ పాలసీ ఆన్‌ ఆర్గానిక్‌ ఫార్మింగ్‌ను ప్రవేశపెట్టింది. దీనిద్వారా సేంద్రియ సాగును దేశమంతా దశలవారీగా అమలు చేయాలని భావించింది.

మిషన్‌ ఆన్‌ ఆర్గానిక్‌ వాల్యూ చైన్‌ డెవలప్‌మెంట్‌ ఫర్‌ నార్త్‌ ఈస్ట్‌ రీజియన్‌(MOVCD):  దీన్ని భారత ప్రభుత్వం 2015లో ప్రారంభించింది. కేంద్రం అందించే ఈ స్కీం ద్వారా ఈశాన్య రాష్ట్రాలైన అసోం, మేఘాలయ, అరుణాచల్‌ ప్రదేశ్, మిజోరం, మణిపుర్, సిక్కిం, నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాల్లో సేంద్రియ సాగుకు సంబంధించిన సర్టిఫికేషన్‌ అందిస్తారు. దీంతోపాటు సేంద్రియ ఉత్పత్తుల కల్పన, వాటి మార్కెటింగ్‌ లింక్‌ కోసం వాల్యూ చైన్‌ పద్ధతుల ద్వారా సేంద్రియ సాగుకు ప్రోత్సాహం అందించింది.

పరంపరాగత్‌ కృషి వికాస్‌ యోజన (PKVY): దీన్ని 2015లో ప్రారంభించారు. దీని ఉద్దేశం గ్రామీణ ప్రాంతాల్లో సామూహిక భాగస్వామ్యంతో సేంద్రియ సాగును ప్రోత్సహించడం (Promoting organic farming through cluster based approach)


*  ఇవే కాకుండా ప్రభుత్వం 2018లో అగ్రి ఎక్స్‌పోర్ట్‌ పాలసీ, ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్, వన్‌ డిస్ట్రిక్ట్‌ వన్‌ ప్రొడక్ట్‌ ప్రోగ్రామ్స్‌ను ప్రారంభించింది. వీటి ద్వారా సేంద్రియ సాగును ప్రోత్సహించాలనేది ప్రభుత్వ లక్ష్యం. 


*  భారత ప్రభుత్వం 2023 బడ్జెట్లో వచ్చే మూడేళ్లలో కోటిమంది రైతులను సేంద్రియ సాగు దిశగా మళ్లించాలని ప్రతిపాదించింది. ఈ బడ్జెట్లో PM PRANAM (ప్రోగ్రాం ఫర్‌ రిస్టోరేషన్, అవేర్‌నెస్, నరిష్మెంట్‌ అండ్‌ అమెలియోరేషన్‌ ఆఫ్‌ మదర్‌ ఎర్త్‌) అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కృత్రిమ ఎరువుల స్థానంలో పర్యావరణహిత ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహిస్తారు.


 

Posted Date : 26-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌