• facebook
  • whatsapp
  • telegram

ఆంధ్రలో క్విట్‌ ఇండియా ఉద్యమం - ముందు సంఘటనలు

తగలబెట్టి.. తీగలు తెగ్గొట్టి!


బ్రిటిష్‌ పాలన అంతమే లక్ష్యంగా భారతదేశం అంతటా ఉవ్వెత్తున ఎగసిన ప్రజాఉద్యమమే క్విట్‌ ఇండియా. అప్పటి వరకు అంశాలవారీగా బ్రిటిష్‌ విధానాలను వ్యతిరేకిస్తూ జరిగిన జాతీయోద్యమం, ఆ పోరాటంతో మేలిమలుపు తిరిగింది. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో గాంధీజీ పిలుపుతో మొదలై, తర్వాత ఎక్కడికక్కడ ప్రజల సారథ్యంలోనే ముందుకు సాగి వలస పాలకులను గడగడలాడించింది. ఆంధ్రలో ఆ తీవ్రత ఎక్కువగా కనిపించింది. ఆంగ్లేయులను తిరిగిపోమ్మంటూ, రైల్వే స్టేషన్‌ను తగలబెట్టి, టెలిఫోన్‌ తీగలను తెగ్గొట్టి ఇక్కడి జనం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలతో భారతదేశాన్ని ఇక ఎంతమాత్రం నియంత్రించలేమనే సత్యం బ్రిటిష్‌ పాలకులకు బోధపడింది. ఈ ఉద్యమం ప్రారంభం కావడానికి ముందు దేశంలో ఏర్పడిన పరిణామాలు, నాటి ప్రపంచ రాజకీయాల గురించి పరీక్షార్థులు తెలుసుకోవాలి. అదే సమయంలో ఆంధ్రుల్లో చైతన్యాన్ని పెంచి స్వాతంత్య్ర పోరాటంలోకి దింపిన పార్టీలు, ప్రముఖ నాయకులు నడిపిన  ఉద్యమాలు, ఆ సమయంలో నిర్వహించిన ఎన్నికల్లో వెలువడిన ఫలితాలతో ఆంధ్రలో వచ్చిన పాలనాపరమైన మార్పులపై అవగాహన పెంచుకోవాలి.


దండి సత్యాగ్రహం సమయంలోనే లండన్‌లో రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు జరిగాయి. వీటిలో కాంగ్రెస్‌ పార్టీ కేవలం ఒక సమావేశానికే హాజరైంది. డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్, జిన్నా లాంటి ప్రముఖులు మొత్తం మూడు సమావేశాలకు హాజరయ్యారు. వాటి తర్వాత సామ్యవాద భావజాలంతో కూడిన అనేక పార్టీలు భారతదేశంలో   ఏర్పాటయ్యాయి.

కాంగ్రెస్‌ సోషలిస్ట్‌ పార్టీ (1934): ఈ పార్టీ వ్యవస్థాపకులు ఆచార్య నరేంద్రదేవ్, జయప్రకాశ్‌ నారాయణ, రామ్‌మనోహర్‌ లోహియా. 1942లో జరిగిన క్విట్‌ ఇండియా ఉద్యమంలో కాంగ్రెస్‌ సోషలిస్ట్‌ పార్టీ ప్రధాన పాత్ర పోషించింది. ఈ పార్టీ ఆంధ్రా కార్యదర్శి తెన్నేటి విశ్వనాథం. ఆంధ్రాలో దీని మొదటి సమావేశం గుంటూరులో జరిగింది. పార్టీ ప్రముఖులు ఆంధ్రాలోని యువకులకు రాజకీయ, అర్థశాస్త్ర విషయాలు బోధించారు. ఇందుకోసం పాఠశాలలు స్థాపించారు. ఆంధ్రాలో తొలి రాజకీయ పాఠశాలను 1937 వేసవిలో అప్పటి గుంటూరు జిల్లాలోని కొత్తపట్నం వద్ద ప్రారంభించారు. ఆచార్య ఎన్‌జీ రంగాతోపాటు అనేక మంది అధ్యక్షులుగా పనిచేశారు.

కొత్తపట్నం పాఠశాల: ఇందులో రాజకీయ అర్థశాస్త్రం బోధించేవారు. ఈ కళాశాలకు వెళ్లిన వారిపై మద్రాసు ప్రభుత్వం తీవ్రమైన చర్యలకు పాల్పడింది. కమ్యూనిస్టు భావజాలం ఉన్న ఎన్‌జీ రంగా 1938లో సోషలిస్టు పార్టీ తరఫున మదనపల్లి, మంతెనవారిపాలెం వద్ద పాఠశాలలు స్థాపించారు.

ఆంధ్రా సోషలిస్టు పార్టీ (1934): ఈ పార్టీ స్థాపకులు, అధ్యక్షులు ఎన్‌జీ రంగా. కార్యదర్శి మద్దూరి అన్నపూర్ణయ్య. సుభాష్‌ చంద్రబోస్‌ స్థాపించిన ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీలో చేరిన మొదటి ఆంధ్రుడు అన్నపూర్ణయ్య. ఈ పార్టీ ప్రధాన కేంద్రం విజయవాడ. పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావు మొదలైనవారు దీనిలో సభ్యులు. వీరిద్దరూ కార్ల్‌మార్క్స్‌ సిద్ధాంతాలకు ప్రభావితులై 1934లో ఆంధ్రా కమ్యూనిస్టు పార్టీ స్థాపించారు.

ఆంధ్రా కమ్యూనిస్టు పార్టీ (1934): ఆంధ్రా ప్రాంతంలోని కమ్యూనిస్టులు విజయవాడలోని కాట్రగడ్డ నారాయణరావు తోటలో సమావేశమయ్యారు. కమ్యూనిస్టు సిద్ధాంతాలను వ్యాప్తి చేయడానికి పుచ్చలపల్లి సుందరయ్య నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. అదే సమయంలో బ్రిటిషర్లు 1934, జులై 23న జాతీయ కమ్యూనిస్టు పార్టీపై నిషేధం విధించారు. దీంతో కమ్యూనిస్టు పార్టీ సభ్యులు ఎన్‌జీ రంగా సోషలిస్టు పార్టీలో చేరి కమ్యూనిస్టు   సిద్ధాంతాలను ప్రచారం చేశారు.

ఆంధ్రా స్వరాజ్‌ పార్టీ (1934, ఫిబ్రవరి 12): గాంధీజీ ఉప్పు సత్యాగ్రహం నిలిపివేయడం ఇష్టం లేని కాంగ్రెస్‌ నాయకులు విజయవాడలో ఈ పార్టీని స్థాపించారు. వీరిలో ముఖ్యులు గాడిచర్ల హరిసర్వోత్తమరావు,  వి.రామదాసు, జి.వి.సుబ్బారావు.

రైతు ఉద్యమం: ఆంధ్రాలో రైతు ఉద్యమం చేపట్టిన నాయకుడు ఎన్‌జీ రంగా. 1934లో రైతు జనోద్ధరణకు రైతు సంఘం ఏర్పాటు చేశారు. ఈ ఉద్యమ నిర్వహణకు కిసాన్‌ పాఠశాలను నిడుబ్రోలు వద్ద స్థాపించారు. ఈయన అనుచరులు పుల్లెల శ్యామసుందరరావు, గౌతు లచ్చన్న. వీరి నాయకత్వంలో శ్రీకాకుళంలో రైతులు అనేకసార్లు జమీందారులపై దాడి చేశారు.

1937 ఎన్నికలు: భారత ప్రభుత్వ చట్టం - 1935 ప్రకారం 1937, ఫిబ్రవరి 15-20 తేదీల్లో ఎన్నికలు జరిగాయి. మతతత్వ పార్టీలైన ముస్లింలీగ్, హిందూ మహాసభ దారుణంగా ఓడిపోయాయి. ఆంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్‌ ప్రచార కమిటీ అధ్యక్షుడు టంగుటూరి ప్రకాశం, ప్రధాన కార్యదర్శి బులుసు సాంబమూర్తి. ఈ ఎన్నికల సందర్భంగా 1936లో జవహర్‌లాల్‌ నెహ్రూ ఉత్తరాంధ్రలో విస్తృత ప్రచారం నిర్వహించారు. సరోజినీ నాయుడు తూర్పుగోదావరి జిల్లాలో ఎన్నికల ప్రచారం చేశారు. నాటి ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధిక స్థానాల్లో గెలిచింది. కాంగ్రెసేతర ప్రముఖులైన బొబ్బిలి రాజా, పిఠాపురం రాజా ఓడిపోయారు. అంతవరకు మద్రాసు కేంద్రంగా అధికారం చెలాయిస్తూ వచ్చిన జస్టిస్‌ పార్టీ నామరూపాలు లేకుండా పోయింది. పిఠాపురం జమీందారు మినహా జస్టిస్‌ పార్టీ సభ్యులంతా ఘోర పరాజయం పొందారు. 11 రాష్ట్రాలకు ఎన్నికలు జరగగా, 8 రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 1937, జులైలో మద్రాసులో ఏర్పడిన ప్రభుత్వానికి సి.రాజగోపాలాచారి ముఖ్యమంత్రి అయ్యారు. ఈయన మంత్రివర్గంలో ముగ్గురు ఆంధ్రులు.. టంగుటూరి ప్రకాశం (రెవెన్యూ), బెజవాడ గోపాల్‌రెడ్డి (స్థానిక పాలన), వి.వి.గిరి (కార్మిక సంక్షేమం, పరిశ్రమలు) ఉన్నారు. శాసనసభ స్పీకర్‌గా బులుసు సాంబమూర్తి, పార్లమెంటు కార్యదర్శులుగా అయ్యదేవర కాళేశ్వరరావు, తెన్నేటి విశ్వనాథం, మాగంటి బాపినీడు నియమితులయ్యారు. దేశ పరిపాలనకు భారత ప్రభుత్వ చట్టం (1935) సరిపోదని, కొత్త రాజ్యాంగం రూపకల్పనకు చర్యలు తీసుకోవాలని మొదటిసారిగా మద్రాసు శాసనసభ తీర్మానం చేసింది.

1937లో ఏర్పడిన మంత్రివర్గం నిర్వహించిన పనులు: దండి సత్యాగ్రహం సమయంలో ఉద్యోగాలు పోగొట్టుకున్నవారికి తిరిగి ఉద్యోగాలిచ్చారు. రాజకీయ ఖైదీలను   విడుదల చేశారు. పత్రికలకు సెక్యూరిటీ ధరావత్తులను తిరిగి ఇచ్చేశారు. 1932-34ల్లో విధించిన అపరాధ రుసుం బకాయిలు రద్దు చేశారు. తీర ప్రాంతాల్లో ఉప్పు తయారీ హక్కును ఆయా గ్రామస్థులకు కల్పించారు. మద్యపానం నిషేధించారు. జమీందారీ రైతుల సంక్షేమం కోసం ప్రకాశం అధ్యక్షతన ఒక సంఘాన్ని ఏర్పాటు చేశారు. హరిజనుల దేవాలయాల ప్రవేశానికి చట్టం చేశారు. కొన్నిచోట్ల వృత్తి విద్యాపథకాన్ని ప్రవేశపెట్టారు. వయోజన విద్య, స్థానికసంస్థల పాలన, సహకార రంగం, కుటీర పరిశ్రమల స్థాపన, ప్రజారోగ్యం, కరవు నివారణ కార్యక్రమాల్లో కొన్ని చెప్పదగిన మార్పులు చేశారు. అయితే ఈ మంత్రివర్గం 1939, అక్టోబరు 20న రాజీనామా చేసింది. ఈ సంస్కరణలను ఈ మంత్రివర్గం అమలు చేయకపోయినప్పటికీ పరిపాలనలో మార్పును ప్రజలకు తెలిసేలా చేసింది.

వ్యక్తి సత్యాగ్రహాలు (1940): రాంగఢ్‌లో 1940, మార్చిలో కాంగ్రెస్‌ సమావేశం జరిగింది. ఇందులో పాల్గొన్న గాంధీజీ.. ప్రతి కాంగ్రెస్‌ కమిటీ సత్యాగ్రహ కమిటీగా మారాలని, ఖాదీకి ప్రోత్సాహం ఇవ్వాలని, ప్రతి వ్యక్తి, సత్యాగ్రహ సైనికుడిగా మారి ఉద్యమం నడపాలని సూచించారు. ఈ మేరకు విశాఖ, తూర్పుగోదావరి, కడప జిల్లాల కాంగ్రెస్‌ కమిటీలు సత్యాగ్రహ కమిటీలయ్యాయి. సంపూర్ణ స్వరాజ్యం పొందడమే తమ ధ్యేయమని ప్రకటించాయి. 1940లో ఆంగ్లేయులు ఆగస్టు ఆఫర్‌ను ప్రకటించిన తర్వాత, బ్రిటిష్‌ విధానాలను వ్యతిరేకిస్తూ గాంధీజీ వ్యక్తి సత్యాగ్రహాన్ని ప్రకటించారు. మొదటి సత్యాగ్రహిగా ఆచార్య వినోబా భావేను నిర్ణయించారు. ఆంధ్రాలో వావిలాల గోపాలకృష్ణయ్య సత్యాగ్రహం చేశారు. ఈ ఉద్యమం సమయంలో ప్రకాశం పంతులు, అయ్యదేవర కాళేశ్వరరావు, పట్టాభి సీతారామయ్య సహా అనేకమంది నాయకులు అరెస్టయ్యారు. వీరి అరెస్టును ఖండిస్తూ ఒంగోలు పురపాలక సంఘం తీర్మానం చేసింది.

క్విట్‌ ఇండియా ఉద్యమం (1942): పోలండ్‌లోని డాజింగ్‌ ఓడరేవుపై 1939, సెప్టెంబరు 1న హిట్లర్‌ సేనలు దాడి చేయడంతో రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. ఈ యుద్ధంలో చురుకుగా పాల్గొన్న ఆసియా దేశం జపాన్‌ 1941, డిసెంబరు 7న అమెరికాలోని పెరల్‌ హార్బర్‌పై దాడి చేయడంతో యుద్ధ స్థితిగతుల్లో గుణాత్మకమైన మార్పులు వచ్చాయి. బ్రిటిష్‌ పాలిత ప్రాంతాలపై కూడా జపాన్‌ దాడులు ప్రారంభించింది. 1942, ఏప్రిల్‌ 6న   విశాఖపట్నం, కాకినాడపై జపాన్‌ విమానాలు బాంబులు వేశాయి. రాబోయే ప్రమాదం గురించి సి.రాజగోపాలాచారి, నెహ్రూ ఆందోళన చెందారు. అదేసమయంలో భారత్‌లో పర్యటిస్తున్న స్టాఫర్డ్‌ క్రిప్స్, గాంధీజీతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో గాంధీజీ 1942, ఆగస్టు 8న క్విట్‌ ఇండియా ఉద్యమం ప్రారంభించారు. ఆంధ్రాలో క్విట్‌ ఇండియా ఉద్యమం సమయంలో ఏం చేయాలో చెబుతూ కర్నూలు సర్క్యులర్‌ జారీ అయ్యింది. దీని ప్రకారం ఉద్యమం అహింసాయుతంగానే జరగాలి. కార్మికులు సమ్మెలు చేయాలి. గొలుసులు లాగి రైళ్లు ఆపడం, టికెట్‌ లేని ప్రయాణాలు చేయడం, టెలిఫోన్, టెలిగ్రాఫ్‌ తీగలు కత్తిరించడం లాంటివి చేయాలి. నిషేధం ఉల్లంఘించి ఉప్పు తయారు చేయాలి. పన్నులు నిరాకరించాలి.   సైనికులను ఎంపిక చేసే కార్యాలయాల ముందు పికెటింగ్‌ చేయాలి. ప్రభుత్వ భూములపై కాంగ్రెస్‌ జెండాలు ఎగరవేయాలి. ఈ ఉద్యమంలోకి కాంగ్రెసేతరులను ఆహ్వానించాలి. బ్రిటిష్‌ ప్రభుత్వం ఈ ఉద్యమాన్ని ఎదుర్కొనేందుకు సన్నద్ధమైంది. అనేకమందిని నిర్బంధించింది. అయినప్పటికీ 1942, ఆగస్టు 12న తెనాలిలో హర్తాళ్‌ జరిగింది. రైల్వేస్టేషన్‌ను తగలబెట్టారు. పోలీసు కాల్పుల్లో ఏడుగురు మరణించారు. 11 మంది గాయపడ్డారు. అదేరోజు   చీరాలలో 500 మంది సబ్‌మెజిస్ట్రేట్‌ కోర్టును మూసివేయించి, సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం, సేల్స్‌టాక్స్‌ కార్యాలయాలపై దాడి చేశారు. టెలిఫోన్, సిగ్నల్‌ వైర్లు తెంపేశారు. స్టేషన్‌ భవనానికి నిప్పంటించారు. అక్కడ పనిచేసే ఉద్యోగులతో ‘గాంధీకి జై’ అనే నినాదాలిప్పించారు. గుంటూరులో ఆగస్టు 13న జరిగిన పోలీసు కాల్పుల్లో ఇద్దరు మరణించారు. ఈ సమయంలో పాలకొండ రైల్వేస్టేషన్‌పై విద్యార్థులు దాడి చేశారు. కొన్నిచోట్ల రైలు పట్టాలు తొలగించారు. ఈ ఉద్యమ కాలంలో ప్రధాన పాత్ర పోషించింది విద్యార్థులే. ఆగస్టు 17న భీమవరంలో రెండు వేల మంది జిల్లా మున్సబు కోర్టుకు వెళ్లి మూసివేయించారు. రెవెన్యూ డివిజినల్‌ కార్యాలయానికి నిప్పంటించారు. ఈ ఉద్యమాన్ని అణచివేసేందుకు బ్రిటిష్‌ ప్రభుత్వం సామూహిక అపరాధ సుంకం విధించింది. ఆంధ్రాలో అనంతపురం, కడప, పశ్చిమ గోదావరి, గుంటూరు, కృష్ణా, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో ఈ పన్ను విధించారు. చివరకు గాంధీజీ మూడు వారాలు నిరాహార దీక్ష చేసినా బ్రిటిష్‌ ప్రభుత్వం స్పందించలేదు.


రచయిత:  గద్దె నరసింహారావు

 
 

Posted Date : 27-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌