• facebook
  • whatsapp
  • telegram

ఆంధ్రాలో 1857 తిరుగుబాటు

ఉద్ధృతి లేని ఉద్యమం!

ఆధునిక భారతదేశ చరిత్రలో ప్రథమ స్వాతంత్య్ర పోరాటంగా ప్రసిద్ధికెక్కిన సిపాయిల తిరుగుబాటు ఆంగ్లేయులను గడగడలాడించింది. దేశ ప్రజలను ఏకం చేసి జాతీయ భావాలను, స్వాతంత్య్ర కాంక్షను రగిలించింది. కానీ ఆ ఉద్యమాన్ని వలస పాలకులు క్రూరంగా అణచివేశారు. ఉత్తర భారతంలో ఉవ్వెత్తున వ్యాపించిన విప్లవం ఆంధ్ర ప్రాంతంలో అంతగా ప్రభావాన్ని ప్రదర్శించలేదు.అందుకు అనేక చారిత్రక కారణాలు ఉన్నాయి. వాటిని అభ్యర్థులు తెలుసుకోవాలి. నాడు ఆంధ్ర ప్రాంతంలో నెలకొన్న పరిస్థితులతో పాటు కంపెనీ పాలనలో అమలైన భూమి శిస్తు  విధానాలపైనా అవగాహన పెంచుకోవాలి. 

ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంగా ప్రసిద్ధికెక్కిన 1857 తిరుగుబాటును సిపాయిల తిరుగుబాటు, ముస్లింలకు - క్రైస్తవులకు మధ్య జరిగిన తిరుగుబాటు, నాగరికులకు - అనాగరికులకు మధ్య జరిగిన తిరుగుబాటు వంటి పేర్లతో పిలుస్తారు. ఈ పోరాటం మొదట బెంగాల్‌లోని బారక్‌పుర్‌లో 1857, మే 10న  మొదలైంది. దీనికి ముఖ్య కారణం రాజ్యసంక్రమణ సిద్ధాంతం. తక్షణ కారణం సైన్యంలో ఎన్‌ఫీల్డ్‌ రైఫిల్స్‌ను లార్డ్‌ కానింగ్‌ ప్రవేశపెట్టడం.


ఉత్తర భారతదేశంలో ఈ తిరుగుబాటు అలీపుర్, మెయిన్‌పురి, బులంద్‌షహర్, మధుర, అట్టక్‌ తదితర ప్రాంతాల్లో జరిగింది. ముఖ్యంగా బెంగాల్, బిహార్‌లో గ్రామ గ్రామానికి వ్యాపించింది. ఆ సమయంలో మొత్తం సిపాయిలు 2,32,000 మంది ఉన్నారు. వీరికి స్థానిక రాజులు, జమీందారులు, భూస్వాముల సైన్యం సహాయపడింది.


ఆంధ్రాలో ప్రభావం: 1857 తిరుగుబాటు ప్రభావం ఆంధ్రాలో తక్కువ. కడప, మచిలీపట్నం, విశాఖపట్నంలో కొంత స్పందన కనిపించింది. తిరుగుబాటుదారులు రెండో బహదూర్‌ షా జాఫర్‌ను చక్రవర్తిగా ప్రకటించారు. ఈ వార్త వ్యాపించడంతో కడప మసీదుల్లో ప్రార్థనలు చేశారు. షేక్‌ పీర్‌ సాహెబ్‌ అనే ముస్లిం బ్రిటిషర్లకు వ్యతిరేకంగా జీహాద్‌ (పవిత్ర యుద్ధం) ప్రకటించాడు. ఇతడిని అరెస్టు చేయడంతో ఆ తిరుగుబాటు అంతమైంది. ఆయన కడపకు పెట్టిన పేరు మహమ్మద్‌ పట్టణం.


విశాఖపట్టణంలో మొహర్రం పండగ సందర్భంగా ముస్లింలను రెచ్చగొడూతూ ఒక పోస్టర్‌ వెలిసింది. అందులో ముస్లింలు తిరుగుబాటులో ఎందుకు పాల్గొనాలో చెబుతూ, విశాఖపట్టణానికి మహమ్మద్‌ పట్టణం పేరు పెట్టాలన్న డిమాండ్‌ ఉంది. గంజాం, గోదావరి జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులు ‘దండసేనుడు’ నాయకత్వంలో కంపెనీ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. అందులో ‘సవర’ జాతి వాళ్లు పాల్గొన్నారు. దీంతో సవర జాతి అటవీ ఉత్పత్తుల అమ్మకాలను బ్రిటిష్‌ ప్రభుత్వం  నిలిపేసింది. ఈ తిరుగుబాటును కెప్టెన్‌ విల్సన్‌ అణచి   వేశాడు. ఆ తర్వాత దండసేనుడిని ఉరితీశారు.


కోరుకొండ సుబ్బారెడ్డి తిరుగుబాటు (ఆగస్టు 1857): బ్రిటిషర్లను దేశం నుంచి వెళ్లగొట్టడానికి మహారాష్ట్ర వీరుడు నానాసాహెబ్‌ గొప్ప సైన్యంతో వస్తున్నాడన్న వదంతిని గోదావరి జిల్లా కోరటూరు ప్రాంత గ్రామ మున్సబ్‌ అయిన సుబ్బారెడ్డి నమ్మాడు. గోదావరి ప్రాంతంలో గిరిజనులను సమీకరించి ఎర్రన్నగూడెం కేంద్రంగా తిరుగుబాటు లేవదీశాడు. సుబ్బారెడ్డి కార్యక్రమాలను బుట్టాయగూడెం గ్రామ మున్సబ్‌ సుంకర స్వామి ఆంగ్లేయులకు చేరవేశాడు. దీంతో బ్రిటిషర్లు తిరుగుబాటును అణచివేసి సుబ్బారెడ్డిని ఉరితీశారు. 


ఉత్తర భారతదేశంలో తిరుగుబాటు తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు చిత్తూరు, నెల్లూరు, గుంటూరు, విజయవాడ, రాజమండ్రి మొదలైన ప్రాంతాల్లో బహిరంగ సభలను ఏర్పాటుచేసి బ్రిటిష్‌ ప్రభుత్వానికి ప్రజలు మద్దతు పలికారు. ముస్లిం రాజుల పాలన కంటే బ్రిటిష్‌ పాలన వేయి రెట్లు మంచిదని వీరంతా భావించారు.


నిజాం రాష్ట్రంలో 1857 తిరుగుబాటు: దత్త మండలాలను ఆంగ్లేయులకు నిజాం ఇచ్చిన నాటి నుంచి హైదరాబాద్‌లోని కొన్నివర్గాల వారికి వారిపై వ్యతిరేకత ఉంది. 1839లో ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన వహాబీలు, కంపెనీ పాలనను కూలదోయడానికి నాటి హైదరాబాద్‌ నవాబు నసీరుద్దౌలా సోదరుడైన ముబారిజుద్దౌలా ప్రోత్సాహంతో కుట్రపన్నారు. దానిని పసిగట్టిన ఆంగ్లేయులు ముబారిజుద్దౌలాను 1854లో చనిపోయేవరకు గోల్కొండ కోటలో బంధించారు. వహాబీలతో చేతులు కలిపిన కర్నూలు నవాబు గులాం రసూల్‌ ఖాన్‌ను తిరుచునాపల్లి జైలులో బంధించారు. 1857లో ఉత్తర భారతదేశంలో తిరుగుబాటుదారులు సాధించిన విజయాలు హైదరాబాద్‌ ప్రాంతంలోని ముస్లింలలో ఒక వర్గాన్ని ఉత్తేజపరిచాయి. మసీదుల వద్ద ఉద్రేకపూరిత ప్రసంగాలు చేశారు. బ్రిటిషర్లపై జీహాద్‌కు ప్రజలను రెచ్చగొట్టారు. బ్రిటిష్‌ ప్రభుత్వాన్ని ముస్లింలకు ప్రథమ శత్రువుగా అభివర్ణించారు.


ఎన్‌ఫీల్డ్‌ తుపాకుల వినియోగంపై ఔరంగాబాద్‌లోని సిపాయిల్లో అసంతృప్తి నెలకొని ఉంది. 1857 తిరుగుబాటు అందుకు ఆజ్యం పోసింది. వీరి అసంతృప్తిని గుర్తించిన కంపెనీ అధికారులు 1857, జూన్‌ 23న 90 మంది సిపాయిలను నిరాయుధులను చేసి జైలుకు పంపారు. కెప్టెన్‌ అబ్బాట్‌ ఆనే ఆంగ్ల అధికారిని కాల్చిచంపడానికి ప్రయత్నించిన ఫైదా అలీ అనే డఫేదారును ఉరితీశారు. హైదరాబాద్‌ నగరంలో బ్రిటిషర్ల రెసిడెన్సీపై రొహిల్లా జమీందారు తుర్రెబాజ్‌ఖాన్‌ 1857, జులై 17న 5000 మందితో దాడిచేశాడు. ఈ దాడిని సమర్థoగా ఎదుర్కొన్న డేవిడ్‌సన్‌ అనే అధికారి తుర్రెబాజ్‌ఖాన్‌ను కాల్చిచంపాడు. ఖాన్‌కు సహాయపడిన మౌల్వీ అల్లావుద్దీన్‌కు ద్వీపాంతరవాస శిక్ష విధించారు. ఆ సమయంలో  హైదరాబాద్‌ ప్రధానమంత్రి సాలార్‌జంగ్‌ బ్రిటిషర్లకు సహాయపడ్డాడు.


ఆంధ్రాలో 1857 తిరుగుబాటు పెద్దగా జరగకపోవడానికి  కారణాలు: 

1) ఆంధ్రాలో సిపాయిలు బ్రిటిష్‌ ప్రభుత్వంపై విశ్వాసం ప్రకటించడం 

2) ఆంగ్లేయులు రాక ముందు అనేక అనవసర యుద్ధాలు జరుగుతూ శాంతిభద్రతలు సక్రమంగా ఉండేవి కావు. అలాంటి పరిస్థితులు బ్రిటిష్‌ పాలనలో లేకపోవడం. శాంతిభద్రతలు స్థిరంగా ఉండటం.

3) ఆంధ్రా ప్రాంతంలో జమీందారులు బ్రిటిషర్లకు అండగా ఉండటం. 

4) బ్రిటిష్‌ పాలనను కూలదోసినప్పటికీ జనానికి మేలు జరుగుతుందనే నమ్మకం ప్రజలకు   లేకపోవడం.


ఫలితం: ఈస్ట్‌ఇండియా కంపెనీ పాలన రద్దయి బ్రిటిష్‌ సార్వభౌమాధికారం ప్రారంభమైంది. ఈ మేరకు 1858, నవంబరు 1న విక్టోరియా మహారాణి ప్రకటన చేసింది. దీంతో ఆంధ్రాలో కూడా బ్రిటిషర్ల ప్రత్యక్ష పాలన ప్రారంభమైంది.


భూమిశిస్తు విధానం: కంపెనీ పరిపాలనలో ప్రభుత్వానికి ముఖ్య ఆదాయం భూమి శిస్తు. జిల్లా అధికారుల ముఖ్య విధి భూమిశిస్తు వసూలు చేయడం. ఆంధ్రా ప్రాంతంలో నాలుగు రకాల పన్ను విధానాలు ఉండేవి.


1) వేలం వేసే విధానం: 1773లో వారన్‌ హేస్టింగ్స్‌ కాలంలో ఈ విధానం ఉండేది. ఎవరు ఎక్కువ పాట పాడితే వారికి శిస్తు వసూలు అధికారం వచ్చేది. రాయలసీమ జిల్లాల్లో ఇది అమలైంది. దీనివల్ల రైతులకు, ప్రభుత్వానికి నష్టం జరిగేది. ఈ పద్ధతిపై వేసిన కమిటీ సర్‌క్యూట్‌ కమిటీ. రాయలసీమ ప్రాంతంలో ఈ పద్ధతిని తొలగించిన థామస్‌ మన్రో, తర్వాత రైత్వారీ పద్ధతిని ప్రవేశపెట్టాడు. 


2) జమీందారీ విధానం: ఉత్తర సర్కారు జిల్లాల్లో ఈ పద్ధతిని మొదటిగా 1793లో ప్రవేశపెట్టినవారు కారన్‌ వాలీస్‌. ఇందులో రైతుకు, ప్రభుత్వానికి ప్రత్యక్ష సంబంధం ఉండదు. ప్రభుత్వం భూమిశిస్తు వసూలు కోసం విశాలమైన భూములను జమీందార్లకు కేటాయిస్తుంది. వారు నిర్ణీత పన్నును ప్రభుత్వానికి చెల్లిస్తారు. ఈ మొత్తాన్ని ‘షేష్‌కష్‌’ అంటారు. జమీందారులు భూములను అభివృద్ధి చేస్తారని బ్రిటిషర్లు భావించారు. కానీ పెరిగిన ఆదాయం వల్ల వారే లబ్ధి పొందారు.


3) గ్రామవారీ విధానం: ఈ పద్ధతిని ప్రయోగాత్మకంగా నెల్లూరు జిల్లాలో ప్రవేశపెట్టారు.గ్రామ అధికారులు భూమిశిస్తు వసూలు చేసి ప్రభుత్వానికి చెల్లిస్తారు. ప్రభుత్వానికి, రైతులకు ఎలాంటి ప్రత్యక్ష సంబంధం ఉండదు. ఈ విధానం ఉత్తర సర్కారులు, నెల్లూరు, రాయలసీమలో వాడుకలో ఉండేది.


4) రైత్వారీ విధానం: థామస్‌ మన్రో రాయలసీమ జిల్లాలో ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు. దీనిని మొదట ప్రతిపాదించినవారు కెప్టెన్‌ రీడ్‌. అభివృద్ధి చేసినవారు థామస్‌ మన్రో. 1802-1805ల మధ్య  రాయలసీమ ప్రాంతంలో గ్రామంలోని పొలాలను సర్వే చేయించి శిస్తు నిర్ణయించారు. రైతులకు  తండ్రి స్థానంలో ఆంగ్లేయులు ఉండి కాపాడాలని పేర్కొన్నారు. భూమి శిస్తు 50 శాతంగా  నిర్ణయించారు. కఠినంగా పన్ను వసూలు చేశారు. దీంతో పన్ను చెల్లించలేక రైతులు గ్రామాలను  వదిలివెళ్లిపోయేవారు.
 


రచయిత: గద్దె నరసింహారావు 

Posted Date : 25-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌