• facebook
  • whatsapp
  • telegram

ప్రాంతీయ తత్వం, ఉప ప్రాంతీయ తత్వం - కొత్త రాష్ట్రాల ఏర్పాటు డిమాండ్‌ - జాతీయ సమైక్యత - భారత ఐక్యతకు ముప్పు/ సవాళ్లు

* మనదేశంలో సామాజిక గతిశీలతలో స్పష్టంగా గోచరించే సామాజిక ధ్రువీకరణ, స్వయం ప్రతిపత్తి భావాలు, క్రియాశీలత ఉన్న ఉద్యమాలు ప్రాంతీయ, ఉపప్రాంతీయ వాదాలకు దారితీశాయి.
* Region అనే ఆంగ్ల పదం లాటిన్ భాషలోని Regio అనే పదం నుంచి వచ్చింది. Regio అంటే భౌగోళికంగా ప్రత్యేకతలు ఉన్న పరిపాలనా యూనిట్ అని అర్థం.
* భారతదేశంలో అనేక ప్రాంతాల్లో పలు రకాల ప్రజలు నివసిస్తున్నారు. వీరు వివిధ సంస్కృతులు, అలవాట్లు కలిగి ఉన్నారు. అయితే కొన్ని వర్గాల ప్రజలు వారి సంస్కృతికి, సంప్రదాయాలకు ప్రమాదం ఏర్పడిందని భావించినప్పుడు తమ సంస్కృతిని కాపాడుకునేందుకు ప్రత్యేక ప్రతిపత్తిని అడగడమో లేదా కొన్నిసార్లు దేశం నుంచి విడిపోవాలని కోరడమో జరుగుతుంది.
* అస్సాంలోని బోడోలాండ్ ప్రాంతంలో గిరిజనేతరుల (నాన్ ట్రైబల్స్)ను వారి ప్రాంతాల నుంచి పంపివేయడానికి గిరిజనులు (ట్రైబల్స్) ప్రయత్నిస్తున్నారు.
* పశ్చిమ బెంగాల్‌లోని గూర్ఖాలాండ్ ప్రాంతంలో గూర్ఖాలు ఇతరులపై చేసిన దాడులు ప్రజల మధ్య అనవసరమైన ఘర్షణలకు కారణమవుతున్నాయి.
* ఈశాన్య రాష్ట్రాలు చాలా చిన్న ప్రాంతాలైనప్పటికీ, ఇప్పటికీ ప్రత్యేక రాష్ట్రాలు, ప్రత్యేక స్వయంప్రతిపత్తి కోసం అక్కడ ఉద్యమాలు జరుగుతున్నాయి.
* ప్రాంతీయవాదం అంటే ఒక స్థిరమైన భౌగోళిక ప్రాంతంలో ప్రత్యేక భాష, సంస్కృతి, పరిపాలనా సామీప్యతతో చాలాకాలంపాటు నివసించడం ద్వారా ఆ ప్రాంతం పట్ల ఏర్పడే భావోద్వేగ, మానసిక అనుబంధంతో కూడిన భావం. దీన్నే భూమిపుత్రుల (Sons of Soil) సిద్ధాంతం అని కూడా అంటారు.
* ఈ భావం పరిమితుల్లో ఉన్నంత వరకూ బాగానే ఉంటుంది. కానీ మితిమీరిన లేదా తీవ్ర భావజాలం వేర్పాటువాదానికి దారితీయవచ్చు.
* భాషా ప్రాతిపదికన ఏర్పడిన రాష్ట్రాలన్నీ ప్రాంతీయవాదం అనే భావజాలం వల్లే ఏర్పడ్డాయి.
* భాషా ప్రాతిపదికపైన ఏర్పడిన రాష్ట్రాల్లో ప్రత్యేకమైన సంస్కృతి, ఆచారాలు, సంప్రదాయాలు, తెగలు, జాతులు ఉండవచ్చు. ప్రాంతీయ అసమానతలు కూడా ఉండవచ్చు.
* తమ ప్రత్యేకతను చాటుతూ వారి గుర్తింపు, అస్తిత్వం కోసం ఉద్యమాలు, పోరాటాలు చేయవచ్చు. దీన్నే ఉప ప్రాంతీయవాదం అంటారు.
* పశ్చిమ బెంగాల్‌లోని గూర్ఖా ఉద్యమం, అస్సాంలోని బోడో ఉద్యమం, ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ఉద్యమం, మహారాష్ట్రలోని విదర్భ ఉద్యమం, ఉత్తర్ ప్రదేశ్‌లోని హరితప్రదేశ్ ఉద్యమాలు ఉపప్రాంతీయవాదంలో అంతర్భాగాలే.

ప్రాంతీయవాదం - అభివృద్ధి - మూలాలు
* మనదేశంలో ప్రాంతీయవాద ఉద్యమం తొలిసారిగా తమిళనాడులో ప్రారంభమైంది. 20వ శతాబ్దిలో తమిళనాడులో బ్రాహ్మణులు, బ్రాహ్మణేతరులుగా ప్రారంభమైన ఈ ఉద్యమం తర్వాత కాలంలో హిందీ వ్యతిరేక ఉద్యమంగా మారి, భారతదేశ సమైక్యతను ప్రశ్నార్థకం చేసింది.
* ఈ ఉద్యమంలో దక్షిణాది రాష్ట్రాలన్నీ కలిసి, ద్రవిడనాడు/ ద్రవిడస్థాన్ గా ఏర్పాటు కావాలనే డిమాండ్ ప్రారంభమైంది.
* 1953, అక్టోబరు 1న తెలుగు భాష ఆధారంగా కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కావడంతో ఇతర ప్రాంతాల్లో భాషాప్రయుక్త రాష్ట్రాలు కావాలనే ఉద్యమాలు ఊపందుకున్నాయి. ఈ ఉద్యమాలు కొన్నిసార్లు హింసాత్మకంగా పరిణామం చెంది దేశసమగ్రతను ప్రశ్నించేవిగా మారాయి.
* మహారాష్ట్రలో శివసేన పార్టీ నేతృత్వంలో మహారాష్ట్రేతరులకు వ్యతిరేకంగా భూమి పుత్రుల సిద్ధాంతం, పంజాబ్‌లో పంజాబియేతరులకు వ్యతిరేకంగా ఖలిస్థాన్ ఉద్యమం, ఆంధ్రప్రదేశ్‌లో ఉత్తరాంధ్ర, రాయలసీమ ఉద్యమం; అస్సాంలో బెంగాలీలు, బిహారీలకు వ్యతిరేకంగా ULFA - యునైటేడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం, బోడోలాండ్ ఉద్యమాలు ప్రాంతీయ, ఉపప్రాంతీయవాద ఉద్యమాలుగా పేరొందాయి.

ప్రాంతీయవాదం - కారణాలు
* భిన్నత్వలో ఏకత్వం ఉన్న భారతదేశంలో 7 సహజ మండలాలు ఉన్నప్పటికీ విభిన్న భౌగోళిక వైరుధ్యాలు ఉన్నాయి. ఈ వైరుధ్యాలతోపాటు అనేక ఇతర కారణాలు ప్రాంతీయవాదానికి దారితీస్తున్నాయి.
అవి:

 

ఆర్థిక, సామాజిక వ్యత్యాసాలు:
* 1947లో మనదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ప్రభుత్వాలు అనుసరించిన వ్యూహాలు లోపభూయిష్టంగా ఉండటం వల్ల దేశంలోని అన్ని ప్రాంతాల్లో సమతౌల్య అభివృద్ధి జరగలేదు.
* పాలకులు వారి సొంత ప్రాంతాల పట్ల ప్రత్యేక శ్రద్ధను కనపరచి, మిగిలిన ప్రాంతాలను విస్మరించడం మూలంగా అనేక ప్రాంతాలు అభివృద్ధిలో వెనుకబాటుకు గురయ్యాయి.
* పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల అభివృద్ధితో పోలిస్తే, ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ధిలో చాలా వెనుకబడి ఉన్నాయి.
* ఈశాన్య రాష్ట్రాల్లో పరిశ్రమల స్థాపన, విద్యాసౌకర్యాలు, ఉపాధి కల్పన, రవాణా సదుపాయాలు లాంటివి ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందలేదు.
* ఈ ప్రాంత ప్రజల్లో వచ్చిన ఆలోచనా విధానంలోని మార్పుల ఫలితంగా తమ ప్రాంత అభివృద్ధి కోసం ఉద్యమాలు ప్రారంభించారు. ఈ ఉద్యమాలు కొన్నిసార్లు ఆయుధాలు చేపట్టడంతో హింసాత్మకంగా మారాయి.

రాజకీయ నాయకుల స్వప్రయోజనాలు
* రాజకీయ నాయకులు అధికారానికి రావడానికి, వచ్చిన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ప్రజల్లో ప్రాంతీయ భావజాలాన్ని రేకెత్తించడం, కేంద్ర ప్రభుత్వాన్ని బలహీనపరచడానికి ప్రజల్లో భాష, సంస్కృతి, చారిత్రక నేపథ్యం లాంటి భావోద్వేగాలను రెచ్చగొట్టి తమ స్వప్రయోజనాల కోసం ప్రాంతీయవాదానికి కారణమవుతున్నారు.
మాండలిక భేదాలు, భౌగోళిక ప్రత్యేకతలు
* ఒక రాష్ట్రంలో ఒకే భాష మాట్లాడినప్పటికీ యాస, మాండలికాల్లో స్పష్టమైన వ్యత్యాసాలు కనిపిస్తాయి. సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ, రాయలసీమ, సర్కారు జిల్లాల యాసల్లో స్పష్టమైన తేడా కనిపిస్తుంది.
* సంస్కృతి, సంప్రదాయాలు, ఆహార, ఆచారాల్లో కూడా వ్యత్యాసం ఉండి, వాటిని పరిరక్షించుకునేందుకు ఉపప్రాంతీయ వాదానికి ఆజ్యం పోస్తారు.

భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు
* భాషా ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటు ఇతర భాషల వారికి కూడా ప్రేరణ కలిగిస్తుంది. మద్రాస్ నుంచి తెలుగు భాషను మాట్లాడేవారితో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడటంతో మిగిలిన ప్రాంతాల్లో కూడా ఉద్యమాలు ప్రారంభమయ్యాయి.

భారతదేశంలో ప్రాంతీయవాద ఉద్యమాలు

ద్రవిడ ఏర్పాటు ఉద్యమం
* తమిళనాడులో 1960లో స్వతంత్ర ప్రాంత ఏర్పాటుకు సంబంధించి భారీ ఉద్యమం ప్రారంభమైంది. ద్రవిడ మున్నేట్ర కజగం (D.M.K.) పార్టీ నాయకత్వంలో మద్రాస్, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక ప్రాంతాలు కలిసి ప్రత్యేక ద్రవిడ రిపబ్లిక్‌గా ఏర్పడాలని డిమాండ్ చేశాయి.
* సి.ఎన్. అన్నాదురై నాయకత్వంలో ఉద్యమం ఉద్ధృతమై జాతీయ సమగ్రతకు విఘాతం కలిగిస్తున్న సమయంలో నెహ్రూ ప్రభుత్వం 1963లో 16వ రాజ్యాంగ సవరణ ద్వారా జాతి సమగ్రతకు, సార్వభౌమత్వానికి భంగం కలిగించే ఉద్యమాలను దేశ ద్రోహంగా పరిగణిస్తారని నిర్దేశించడంతో ఉద్యమం తగ్గుముఖం పట్టింది.
* తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి నాయకత్వంలో 1971లో ద్రవిడ యూనియన్ ఉద్యమం ప్రారంభమై మద్రాస్, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక రాష్ట్రాలను స్వతంత్ర ప్రతిపత్తితో ఏర్పరచాలని డిమాండ్ చేశారు.

ఖలిస్థాన్ వేర్పాటు ఉద్యమం
* అకాలీదళ్‌ పార్టీ స్వతంత్ర పంజాబ్ రాజ్యం కోసం ఉద్యమాన్ని లేవనెత్తింది. ఆ పార్టీలోని తీవ్రవాద వర్గం 1981లో ప్రత్యేక ఖలిస్థాన్ దేశాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ హింసాత్మక చర్యలకు పూనుకుంది.
* ఈ ఉద్యమం తీవ్రమై హిందువులపై దాడి, విపరీతమైన ఆస్తినష్టం కలిగించడంతో కేంద్రప్రభుత్వం 1984లో పటిష్ట చర్యలను చేపట్టి ఆపరేషన్ బ్లూస్టార్ అనే సైనిక చర్య ద్వారా ఖలిస్థాన్ వేర్పాటు ఉద్యమాన్ని అణిచివేసింది.

బాంబే రాష్ట్రవిభజన
* రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ కమిషన్ బాంబే రాష్ట్రాన్ని మరాఠీ, గుజరాతీలతో కూడిన ద్విభాషా రాష్ట్రంగా కొనసాగించాలని సూచించినప్పటికీ మరాఠీలు, గుజరాతీలు రాష్ట్రాన్ని భాషా ప్రాతిపదికపైన విడగొట్టాలని డిమాండ్ చేయడంతో 1960లో బాంబే రాష్ట్రాన్ని మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలుగా విభజించారు.

విదర్భ డిమాండ్
* మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతం సాంఘికంగా, ఆర్థికంగా వెనుకబడి ఉండటంతో ఆ ప్రాంత ప్రజలు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని ఉద్యమాన్ని ప్రారంభించారు. అటవీ సంపద, విలువైన ఖనిజ సంపదలకు నిలయమైన విదర్భ ప్రాంతం సారవంతమైనదైనప్పటికీ రైతుల ఆత్మహత్యలు సాధారణమయ్యాయి. దీంతో ఈ ప్రాంత స్వయంప్రతిపత్తి కోసం నేటికీ ఉద్యమం కొనసాగుతుంది.

పంజాబ్ రాష్ట్ర విభజన
* పంజాబ్‌లో పంజాబీ భాషను మాట్లాడే సిక్కులు తమ భాష ఆధారంగా ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండ్ చేశారు. వీరు హిందీ భాషను మాట్లాడుతున్న ఇతర ప్రాంతాల వారిని పంజాబ్ నుంచి వేరు చేయాలని ఉద్యమించడంతో 1966లో పంజాబ్‌ను పంజాబ్, హర్యానా రాష్ట్రాలుగా విభజించారు.

ప్రత్యేక తెలంగాణ ఉద్యమం
* 1956, ఫిబ్రవరి 20న న్యూఢిల్లీలో ఆంధ్ర, తెలంగాణ నాయకుల మధ్య జరిగిన పెద్దమనుషుల ఒప్పందం ఫలితంగా 1956, నవంబరు, 1న ఆంధ్ర ప్రాంతంలో హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ విలీనమై ఆంధ్రప్రదేశ్‌గా ఏర్పడింది. ఈ ఏర్పాటులో అంతర్భాగంగా తెలంగాణ ప్రాంతానికి కొన్ని ప్రత్యేక హక్కులు, సదుపాయాలు, షరతులను కల్పించారు. అయితే పాలకుల లోపభూయిష్ట విధానాల వల్ల తెలంగాణ ప్రాంతం వారికి కల్పించిన హక్కులు, సదుపాయాలు సక్రమంగా అమలు కాలేదు.
* ఫలితంగా ప్రత్యేక భౌగోళిక అంశాలు, అభివృద్ధిపరంగా వెనుకబడటం, తమ సంస్కృతి సంప్రదాయాలను సంరక్షించుకోవాలనే లక్ష్యంతో 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. ఈ ఉద్యమం తీవ్రరూపం దాల్చడంతో ఇందిరాగాంధీ ప్రభుత్వం తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేక రక్షణలు కల్పిస్తూ, ఆర్టికల్, 371(D), 371(E) లను రాజ్యాంగంలో పొందుపరచడంతో ఉద్యమం తగ్గుముఖం పట్టింది.
* 2001లో కె. చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్ర సాధన సమితి పేరుతో ఉద్యమాన్ని ప్రారంభించి, తీవ్రతరం చేయడంతో ఉద్యమం హింసాత్మక రూపాన్ని సంతరించుకుంది. కేంద్ర ప్రభుత్వం 2014, జూన్, 2న ఆంధ్రప్రదేశ్‌ను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలుగా విభజించింది.

 

భారతదేశంలో - స్వయంప్రతిపత్తి ఉద్యమాలు
* విభిన్న భౌగోళిక పరిస్థితులకు నిలయమైన భారతదేశంలో ప్రాంతీయతత్వం అనేది సాధారణమైపోయింది. అనేక ప్రాంతాలవారు తమకు ప్రత్యేక స్వయం ప్రతిపత్తి కావాలని ఉద్యమిస్తుండటం దేశ సమైక్యత, సమగ్రతకు సవాల్‌గా నిలుస్తోంది.
నాగాల స్వయం ప్రతిపత్తి ఉద్యమం
* నాగాలాండ్, మణిపూర్, ఉత్తర బర్మా లాంటి ప్రాంతాల్లో నాగా జాతి విస్తరించి ఉంది. నాగా జాతిలో అంగమి, తాంగ్‌షంగ్, కోన్యక్, లోథా, రెంగ్మా సుమి, మరం, తాంగ్‌కుల్, ఫోమ్, సెమనాగ లాంటి ఉపతెగలు ఉన్నాయి. వీరందరూ తమకు ప్రత్యేక స్వతంత్ర రాజ్యం ఏర్పాటు చేయాలని ఉద్యమిస్తున్నారు.
* 1918లో నాగా క్లబ్ పేరుతో కోహిమాలో కొంతమంది విద్యావంతులు ఉద్యమాన్ని ప్రారంభించారు. భారత్ నుంచి తమను వేరుచేసి ప్రత్యేక దేశాన్ని ఏర్పాటు చేయాలని వీరు ఉద్యమం ప్రారంభించారు.
* 1940లో అంగమి జఫ్ర ఫిజో నాయకత్వంలో ప్రత్యేక నాగా ఉద్యమం మరింత ఉద్ధృతమైంది.
* 1944లో నాగా క్లబ్ 'నాగా జాతీయమండలి'గా మారింది. ఇది జాతీయ కాంగ్రెస్ విధానాలను వ్యతిరేకించి, నాగాల ప్రత్యేక దేశం కోసం గెరిల్లా పోరాటాలను ప్రారంభించింది.
* 1947, ఆగస్టు 14న స్వతంత్ర నాగాదేశం ఏర్పడినట్లు ఫిజో ప్రకటించారు. ఇతడిని 1948లో భారత ప్రభుత్వం నిర్బంధించింది.
* 1950లో ఫిజో విడుదలైన తర్వాత నాగా జాతీయ మండలికి అధ్యక్షుడయ్యాడు. 1952లో జవహర్‌లాల్ నెహ్రూ, ఫిజో మధ్య జరిగిన సమావేశం విఫలమైంది.
* ఫిజో తూర్పు పాకిస్థాన్ మీదుగా లండన్ వెళ్లి 1990లో మరణించాడు.
* 1980, జనవరి, 31న నేషనలిస్ట్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ (NSCN) ఏర్పడింది. దీని ఏర్పాటులో ఇసాక్ చిసిస్వు, ఎస్.ఎస్. కాప్లాంగ్, తుయంగ్‌లెంగ్ కీలక పాత్రను పోషించారు.
* నాగాలు నివసిస్తున్న మొత్తం ప్రాంతాలు, ఉత్తర బర్మాలను కలిపి, నాగాలిం ఏర్పాటు చేయాలనేది NSCN (Nationalist Socialist Council of Nagaland) లక్ష్యం.
* వీరు బాప్టిస్ట్‌ను తమ మతంగా ప్రకటించుకుని, నాగాలాండ్ రాష్ట్ర ప్రభుత్వానికి సమాంతరంగా ప్రభుత్వాన్ని నడుపుతున్నారు.
* 2015, ఏప్రిల్ 6న NSCL (Reforms) అనే సంస్థను వై. వాంగిటన్, పి. తికక్ స్థాపించారు.
* 2015, ఆగస్టు 3న NSCN (Reforms) నాయకుడు ముయివా, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సమక్షంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో శాంతి ఒప్పందం చేసుకున్నారు.

 

బోడో ఉద్యమం - అస్సాం
* బోడో తెగకు చెందిన గిరిజనులు బ్రహ్మపుత్ర లోయలో తొలిసారిగా స్థిరపడి ఆ ప్రాంతాన్ని తమ అధీనంలో ఉంచుకున్నారు. అహోమ్ తెగకు చెందినవారు ఈ ప్రాంతంపై దాడిచేసి స్థిరపడటంతో బోడోల ప్రభావం తగ్గింది.
* స్వాతంత్య్రానంతరం బోడోలను ఎస్టీల జాబితాలో చేర్చారు.
* ప్లెయిన్స్ ట్రైబల్ కౌన్సిల్ ఆఫ్ అస్సాం (PTCA) 1960లో ఏర్పడింది. ఇది తమ హక్కుల కోసం జరిగిన ఉద్యమానికి కృషి చేసింది.
* 1967 నుంచి PTCA బోడోలు అధికంగా ఉన్న ప్రాంతాలను అస్సాం నుంచి వేరుచేసి ఉదయాచల్ అనే పేరుతో కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది.
* PTCA విఫలం చెందడంతో 1980లో ఆల్ బోడో స్టూడెంట్స్ యూనియన్ (ABSU) ఏర్పడి ప్రత్యేక బోడో రాష్ట్రం కోసం ఉద్యమాన్ని ప్రారంభించింది.
* 1987, మార్చి 2న ABSU బోడో యూనియన్ ఉపేంద్రనాథ్ బ్రహ్మ నాయకత్వంలో ఉద్యమాన్ని చేపట్టి అస్సాంను సగం సగం (50 - 50)గా విభజించాలని డిమాండ్ చేసింది.
* 1993, ఫిబ్రవరి 20న బోడోలాండ్ అటానమస్ కౌన్సిల్ (BAC) ను ఏర్పాటు చేశారు.
* ప్రత్యేక బోడోలాండ్ రాష్ట్రం కోసం బోడోలాండ్ లిబరేషన్ టైగర్స్ ఫోర్స్ (BLTF) హింసాత్మక ఉద్యమాన్ని పట్టింది.
* 2003, ఫిబ్రవరి, 10న బోడోలాండ్ టెరిటోరియల్ కౌన్సిల్ (BTC) స్థాపనతో హగ్రామ మోహిలరి న్యాయకత్వంలో పోరాటం చేస్తున్న BLTF దళాలు 2003, డిసెంబరు 6న హింసను వదలివేయడానికి అంగీకరించాయి.
* BTCలో 46 మంది కార్యనిర్వాహక సభ్యులుంటారు. BTC అధికార పరిధి బోడోలాండ్ టెరిటోరియల్ ఏరియా జిల్లాల (BTAD)కు పరిమితమై ఉంటుంది. ఈ ప్రాంతంలో 70% గిరిజన తెగలైన బోడోలు, రాబాలు, గారోలు నివసిస్తున్నారు.
* రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్ కింద BTCను ఏర్పాటు చేశారు.


మిజో తిరుగుబాటు
* మిజో అనే గిరిజన తెగలు అధికంగా నివసించే మిజో ప్రాంతం అస్సాంలో ఒక జిల్లాగా ఉండేది. అస్సాం ప్రభుత్వం తమ ప్రయోజనాలను నిర్లక్ష్యం చేస్తుందని భావించిన మిజో ప్రజలు తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలని ఉద్యమాన్ని నిర్వహిస్తూ మిజో నేషనల్ ఫ్రంట్ (MNF) ను ఏర్పాటు చేసుకున్నారు.
* మౌటమ్ అనే తీవ్రక్షామం మిజో ప్రాంతంలో సంభవించి జనజీవనం అస్తవ్యస్తం అయినప్పుడు అస్సాం ప్రభుత్వం తగిన రీతిలో స్పందించలేదని, తమను సంప్రదించకుండానే అస్సామీ భాషను అధికార భాషగా ప్రవేశపెట్టారని మిజోలు తిరుగుబాటును ఉద్ధృతం చేశారు.
* MNF లో ఒక వర్గం ప్రత్యేక మిజో రాష్ట్రాన్ని కోరగా, మరో వర్గం మిజో తెగలతో ప్రత్యేక దేశంగా ఏర్పడాలని భావించింది.
* MNF నాయకుడైన లాల్ డెంగా తూర్పు పాకిస్థాన్‌లో పర్యటించి, పాకిస్థాన్ ప్రభుత్వం ద్వారా ఆయుధాలను పొందేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న అస్సాం ప్రభుత్వం లాల్ డెంగాను దేశద్రోహ నేరం కింద అరెస్ట్ చేసింది.
* లాల్ డెంగా తన ప్రవర్తనను మార్చుకుంటానని చెప్పడంతో ప్రభుత్వం అతడిని 1964లో విడుదల చేసింది. దీంతో మళ్లీ MNF తిరుగుబాట్లు ప్రారంభమయ్యాయి.
* 1965లో భారత్ - పాకిస్థాన్ మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో ఆపరేషన్ జరికో అనే రహస్య సంకేత నామంతో మిజో ప్రాంతాన్ని ఆక్రమించి, స్వతంత్ర దేశంగా చేయాలని లాల్ డెంగా వ్యూహం పన్నాడు.
* లాల్ డెంగా 1966, ఫిబ్రవరి 28న అస్సాం రైఫిల్స్ స్థావరాలు, సరిహద్ధు భద్రతా దళాల స్థావరాలపై దాడులు జరిపి, ముఖ్య కార్యాలయాలన్నింటినీ తన ఆధీనంలోకి తీసుకుని, అస్సాం, భారత ప్రభుత్వాల్లోని ప్రసార, రవాణా సౌకర్యాలను, పౌర పరిపాలనను స్తంభింపజేశాడు. దీంతో ఐజ్వాల్‌తో సహా కీలక పట్టణాలన్నీ MNF పరిధిలోకి వచ్చాయి.
* లాల్ డెంగా 1966, మార్చి 1న మిజోను స్వతంత్ర దేశంగా ప్రకటించి, భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతి పౌరుడు పోరాడాలని సందేశం ఇచ్చాడు.
* ఈ సమయంలో అస్సాం ముఖ్యమంత్రిగా బిమల ప్రసాద్ చలిహా, భారత హోంశాఖామంత్రిగా గుల్జారీలాల్ నందా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం 1966, మార్చి 3న అస్సాం, దాని పరిధిలోని ప్రాంతాలపై కర్ఫ్యూ విధించింది.
* మొత్తం మిజో ప్రాంతం MNF విప్లవకారుల ఆధీనంలో ఉండటం వల్ల ఆ ప్రాంతానికి రహదారుల ద్వారా చేరుకునే వీలులేకపోవడంతో భారత ప్రభుత్వం 1966, మార్చి 4న వైమానిక దాడులను నిర్వహించి తిరుగుబాటును అణిచివేసింది. మిజో ప్రజలు ప్రతి సంవత్సరం మార్చి, 4ను జో రామ్ డేగా జరుపుకుంటున్నారు.
* 1966, మార్చి 25 నాటికి MNF ఆధీనంలోని ప్రాంతాలన్నింటినీ భారత ప్రభుత్వం స్వాధీనపరచుకుంది.
* 1967లో భారత సైన్యం సాధారణ ప్రజలను, తిరుగుబాటుదారులను వేరుచేయడం కోసం సమూహ విధానాన్ని ప్రారంభించింది. దీనిలో భాగంగా 80% పల్లె ప్రజలను వేరే ప్రాంతానికి తరలించారు. భారత ప్రభుత్వం తిరుగుబాటుదారులకు క్షమాభిక్షను ప్రసాదించింది.
* 1972, జనవరి 21న మిజోరం ప్రాంతాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించారు. దీనివల్ల మిజో వేర్పాటువాదం 1976 నాటికి అంతరించింది.
* 1987, ఫిబ్రవరి 20న ఐజ్వాల్ రాజధానిగా మిజోరం రాష్ట్రం ఏర్పడింది.


గూర్ఖాలాండ్ ఉద్యమం - పశ్చిమ బెంగాల్
* పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ కొండ ప్రాంతంలో నేపాలీ భాష మాట్లాడే గూర్ఖా జాతి ప్రజలు తాము నివసించే ప్రాంతాలన్నింటినీ కలిపి, ప్రత్యేక గూర్ఖాలాండ్ రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్‌ను గూర్ఖా నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ (GNLF) కొనసాగించింది.
* 1988లో సుభాష్ ఘీసింగ్ గూర్ఖాలాండ్ హిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (GHDC)ను ఏర్పాటు చేసి, ఉద్యమాన్ని మరింత ఉద్ధృతపరిచాడు.
* 2007లో ప్రత్యేక గూర్ఖాలాండ్ రాష్ట్ర సాధన కోసం బిమల్ గురుంగ్ గూర్ఖాలాండ్ జనముక్తి మోర్చా (GJM)ను స్థాపించాడు. ఇది ఉద్యమాన్ని ఉద్ధృతం చేయడంతో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం 2011, సెప్టెంబరు 2న గుర్ఖాలాండ్ టెరిటోరియల్ అడ్మినిస్ట్రేషన్ (GTA)బిల్లును ఆమోదించింది. దీని ప్రకారం డార్జిలింగ్, కలింపాంగ్, కుర్సియోంగ్ అనే డివిజన్లతో GTA ఏర్పడింది.
* GTAకు శాసనాధికారాలు మినహా పాలన, కార్యనిర్వాహక, ఆర్థిక అధికారాలు బదిలీ అవుతాయి.
* 2011, అక్టోబరు 29న గుర్ఖాలాండ్ జనముక్తి మోర్చా, అఖిల భారత ఆదివాసీ పరిషత్ ల మధ్య కీలకమైన 18 సూత్రాల ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం గుర్ఖాలాండ్ టెరిటోరియల్ అడ్మినిస్ట్రేషన్ (GTA) స్థానంలో గుర్ఖాలాండ్ అండ్ ఆదివాసీ టెరిటోరియల్ అడ్మినిస్ట్రేషన్ (GATA) ఏర్పడింది. దీని వల్ల డోయెర్సీ, తెరాయి తెగలు కూడా ఈ వ్యవస్థలో అంతర్భాగమయ్యాయి.
* డోయెర్సీ, తెరాయి ప్రాంతాలను గుర్ఖాలాండ్ టెరిటోరియల్ అడ్మినిస్ట్రేషన్‌లో కలపాలని, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నియమించిన శ్యామ్‌కుమార్ సేన్ కమిటీ సిఫార్సు చేసింది.
* GTA పరిధిలోని 45 నియోజక వర్గాలకు 2012, ఆగస్టు 4న ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో బిమల్‌ గురుంగ్‌కు చెందిన గూర్ఖాలాండ్ జనముక్తి మోర్చా (GJM) అభ్యర్థులు విజయం సాధించారు.


జార్ఖండ్ ఉద్యమం
* బీహార్ దక్షిణ ప్రాంతంలో ముండాలు, ఒరయోన్లు, సంతాల్, హోలీ లాంటి గిరిజన తెగలు అనాదికాలం నుంచి నివసిస్తున్నాయి. ఈ ప్రాంతంలో అత్యధికంగా ఖనిజ వనరులు ఉన్నాయి. ఈ ప్రాంతంలోని గిరిజనులు, గిరిజనేతరులు వడ్డీవ్యాపారులు, అటవీ అధికారుల దోపిడికి వ్యతిరేకంగా, తమ సంస్కృతీ సంప్రదాయాలను పరిరక్షించుకునే లక్ష్యంతో 1920లో జార్ఖండ్ ఉద్యమం ప్రారంభించారు.
* ఉన్నతి సమాజ్ అనే సంస్థ 1928లో తమ హక్కులను సంరక్షించమని, తమకు ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని సైమన్ కమిషన్‌కు నివేదికను సమర్పించింది.
* 1947, డిసెంబరు 28న ప్రత్యేక రాష్ట్రసాధన కోసం అఖిల భారత జార్ఖండ్ పార్టీని జైపాల్‌ సింగ్ స్థాపించారు.
* జైపాల్‌ సింగ్ తర్వాత అఖిల భారత జార్ఖండ్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో కలపడంతో దాన్ని వ్యతిరేకించిన శిబూసోరెన్, ఎ.కె. రాయ్, మహతో ధీరజ్ లాంటి నాయకులు జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM)పార్టీని స్థాపించారు.
* జార్ఖండ్ ఉద్యమంలో భాగంగా శిబూసోరెన్ 1969లో సోనత్ సంతాల్ సభను, 1980లో జార్ఖండ్ క్రాంతిదళ్‌సభను స్థాపించారు.
* 1950 - 60 దశకంలో భారీ ప్రభుత్వరంగ పరిశ్రమల నిర్మాణం వల్ల అనేకమంది గిరిజనులు తమ ఆవాసాలను కోల్పోయారు.
* 1987, సెప్టెంబరు 25న విద్యార్థి సంఘాలు జార్ఖండ్ బంద్‌కు పిలుపునిచ్చాయి.
* 1995లో ప్రభుత్వం జార్ఖండ్ డెవలప్‌మెంట్ అటానమస్ కౌన్సిల్ (JDAC)ను 18 జిల్లాల్లో శిబూసోరెన్ ఛైర్మన్‌గా ఏర్పాటు చేసింది.
* అనేక ఉద్యమాల తర్వాత వాజ్‌పేయీ నాయకత్వంలోని NDA ప్రభుత్వం 2000, నవంబరు 15న రాంచీ రాజధానిగా ప్రత్యేక జార్ఖండ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది.


ప్రాంతీయతత్వం - నివారణా మార్గాలు

జాతీయ వారసత్వాన్ని, చరిత్రను ప్రచారం చేయడం
* ఒకదేశ ప్రజలకు ఆ దేశం ఔన్నత్వాన్ని తెలియజేస్తే వారికి తమదేశంపై గౌరవభావం ఏర్పడుతుంది. తమ ప్రాంతం దేశం మొత్తంలో ఒక భాగమని భావిస్తారు. ఇతర ప్రాంతాలు కూడా దేశ ప్రగతికి పాటుపడతాయని భావిస్తారు. దీని వల్ల ప్రాంతీయతత్వం, ప్రాంతీయ దురభిమానం తొలగుతాయి.
* వార్తాపత్రికలు, మ్యాగజైన్‌లు, డాక్యుమెంటరీ చిత్రాలు, ఎలక్ట్రానిక్ మీడియా సహకారంతో జాతీయభావాలను ప్రజల్లో పెంపొందించాలి. వారిలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంచాలి.
* దేశ ప్రజలందరి మధ్య సౌభ్రాతృత్వం పెంపొందించాలి. దేశంలోని అన్ని ప్రాంతాలు సమగ్రంగా అభివృద్ధి చెందేలా ప్రణాళికలు రూపొందించి, అమలుపరచాలి.
* జాతీయ పండగలు, జాతీయ క్రీడలు, జాతీయస్థాయి సదస్సులు... ఇలా జాతీయతకు సంబంధించిన అన్ని కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా దేశ ప్రజల మధ్య జాతీయ స్ఫూర్తిని పెంపొందించవచ్చు.
ఆధునిక రవాణా సౌకర్యాలను మెరుగుపరచడం
* ఒక ప్రాంతంలోని ప్రజలు మరొక ప్రాంతానికి వెళ్లి వారిని కలవడం ద్వారా ఇరువురి మధ్య ఒక అవగాహన కలుగుతుంది. రాజస్థాన్‌లోని కొందరు వ్యవసాయదారులు దేశంలోని ఇతర ప్రాంతాలను సందర్శిస్తూ, మిగతా ప్రాంతాల వారిని కలుస్తుంటారు.
* హిందూ సమాజం కొన్ని మతపరమైన యాత్రలను ప్రోత్సహిస్తుంది. దీనివల్ల ఇతర ప్రాంతాల వారి అలవాట్లు, కట్టుబాట్లు, పద్ధతులు, విధానాలు తెలుస్తాయి.
* పాలనా శాస్త్రవేత్త ఎస్.ఆర్. మహేశ్వరి ప్రకారం ప్రాంతీయవాదం ఒక బలమైన ఐక్యభావన; తమను ఇతరుల నుంచి వేరుగా చూసుకునే ధోరణి. ఒక రాష్ట్రంతో/ దేశంతో/ మతసమూహంతో లేదా భాషా సమూహంతో సమైక్యమై ప్రత్యేక ప్రతిపత్తిని కోరుకోవడమే ప్రాంతీయవాదం.
* మించైల్ హెచ్చర్ అభిప్రాయం ప్రకారం 'ప్రాంతీయవాదం ప్రధానంగా అంతర్గత వలస వాదం వల్ల వస్తుంది. ఒక ప్రాంత ప్రజలపై మరో ప్రాంత ప్రజల ఆధిపత్యాన్ని అంతర్గత వలస వాదంగా చెప్పవచ్చు'.
* మనదేశంలో జాతి/మతం/తెగ/భూభాగం... ఇలా పలు రకాల ప్రత్యేక ఉద్యమాలు వచ్చాయి. అవన్నీ తమ స్థానీయ, ప్రాంతీయ అభివృద్ధిని కోరుకునే అస్థిత్వాలుగా కింది విధంగా వ్యక్తమయ్యాయి.
ఉదాహరణకు...
* దేశభక్తికి బెంగాలీలు, శౌర్యానికి పంజాబీలు, హిందీ భాష వ్యతిరేకతకు తమిళలు తార్కాణాలుగా నిలుస్తారు.
* సిక్కులు తాము ఎక్కడ నివసిస్తున్నా పంజాబీలు గానే ఉంటారు.
* భారతదేశంలో ఉత్తర ప్రాంతం వారు, దక్షిణ ప్రాంతం వారు అనే తేడాలు ఆర్యుల కాలం నుంచి కొనసాగుతున్నాయి.
* తెలంగాణా వాసులు తరచూ కింది విధంగా వ్యాఖ్యానిస్తూ ఉంటారు. నిజాం రాజునే ఎదిరించిన చరిత్ర మాది, పోరాటాల పురిటి గడ్డ నుంచి వచ్చిన వాళ్లం అని అంటుంటారు.
* తమిళులు ఏ దేశం వెళ్లినా వారి భాషను మరిచిపోరు అనేది ప్రచారంలో ఉంది.
* ఉత్తర భారతదేశ చక్రవర్తులు దక్షిణాదిపై చూపినంత ఆధిపత్యం, దక్షిణాది చక్రవర్తులు ఉత్తర భారతదేశంపై చూపలేకపోయారు.


జాతీయ సమైక్యత - సవాళ్లు
* వ్యక్తులు తాము నివసిస్తున్న దేశం పట్ల తిరుగులేని విధేయతను ప్రదర్శించడమే జాతీయ సమైక్యతకు తార్కాణం. జాతీయ సమైక్యత అనేది ఒక ప్రధానమైన మానసిక భావోద్వేగం. ఒక ప్రాంతంలో కొన్ని సంవత్సరాల పాటు జీవించినప్పుడు ఆ ప్రాంతం పట్ల మమకారం, ప్రేమ, అనుబంధం ఏర్పడతాయి. ఇలాంటి పరిస్థితుల్లో జాతి, మత, కుల, లింగ, ప్రాంత భేదాలు లేకుండా తామంతా ఒక్కటే అనే విశాలమైన భావనను కలిగి ఉండటమే జాతీయ సమైక్యతగా చెప్పవచ్చు.
* ప్రముఖ విద్యావేత్త, తత్త్వవేత్త, దౌత్యవేత్త అయిన మన తొలి రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రకారం 'జాతీయ సమైక్యత అనేది ప్రజా బాహుళ్య ఆలోచనల పరంపర నుంచి వెదజల్లే మేధో కాంతి లాంటిది. అది మనుషులను తట్టిలేపే చైతన్య ఉనికి లాంటిదని పేర్కొన్నారు.
* భిన్నత్వంలో ఏకత్వం ఉన్న భారతదేశం విభిన్న మతాలు, సంస్కృతులు, జాతులు, భాషలు, తెగలు, కులాలకు నిలయంగా వర్థిల్లుతుంది. ఇన్ని వైరుధ్యాలున్న భారతదేశంలో సామాజిక, సాంస్కృతిక నిర్మితి; కుల, మత ప్రాతిపదికపై ఉన్న నిర్మితి జాతీయ సమైక్యతను ప్రశ్నిస్తూనే ఉంటుంది.


సవాళ్లు

మతతత్వం
* మతం అనేది వ్యక్తిగత జీవితానికి పరిమితం కాకుండా వికృత రూపాన్ని ధరిస్తే అది మతమౌఢ్యంగా మారుతుంది. మతం నల్లమందు లాంటిది.
* ప్రాచీన కాలం నుంచి భారతదేశం అనేక మతాలకు నిలయంగా నిలుస్తుంది. భారత రాజ్యాంగ ప్రవేశికలో లౌకిక తత్వాన్ని ఉద్బోధించారు. దీని ప్రకారం రాజ్యం అన్ని మతాల పట్ల సమాన గౌరవం, తటస్థ విధానాన్ని అనుసరిస్తుంది.
* రాజ్యాంగంలోని ఆర్టికల్ - 25 నుంచి 28 వరకు మత స్వేచ్ఛను ప్రాథమిక హక్కుగా పొందుపరిచారు.
* క్రీ.శ. 712లో అరబ్ నాయకుడైన మహ్మద్‌బీన్ ఖాసిం సింధును జయించడంతో భారత్‌లో మత వైరుధ్యాలు ప్రారంభమయ్యాయి.
* క్రీ.శ. 1813 చార్టర్ చట్టం ద్వారా ఆంగ్లేయులు మనదేశంలో మొదటిసారిగా క్రైస్తవ మిషనరీల రాకను ఆహ్వానించారు.
* 1909 నాటి మింటో - మార్లే సంస్కరణల ద్వారా మనదేశంలో తొలిసారిగా ముస్లింలకు ప్రత్యేక మత నియోజక వర్గాలను నిర్దేశించారు. లార్డ్ మింటో భారత్‌లో మత నియోజక వర్గాల పితామహుడిగా పేరొందారు.
* బ్రిటిషర్ల కాలంలో మత ప్రాతిపదికపై ఏర్పాటైన సంస్థలు, ప్రత్యేక ఓటర్లు, ఆంగ్లేయుల విభజించు - పాలించు విధానం, 1906లో ఢాకాలో సలీముల్లా ఖాన్ ప్రోత్సాహంతో ముస్లింలీగ్ స్థాపన జరగడం, మహ్మద్ అలీజిన్నా ద్విజాతి సిద్ధాంతం, 1947లో భారత యూనియన్ భారత్ - పాకిస్థాన్‌లుగా చీలిపోవడానికి కారణమైంది.
* దేశవిభజన ఫలితంగా వేలాది హిందు - ముస్లిం కుటుంబాలు తమ అస్థిత్వాన్ని కోల్పోయాయి. వేలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.
* బెంగాల్‌లోని నోవఖలీ ప్రాంతంలో చెలరేగిన మతఘర్షణల నివారించడానికి గాంధీజీ విశ్వప్రయత్నం చేశారు.
* స్వాతంత్య్రానంతరం వివిధ రాజకీయ పక్షాలు మత ప్రాతిపదికపైన ప్రజలను సమీకరించే ప్రయత్నం చేశాయి. ఓటు బ్యాంకు రాజకీయాల వల్ల ప్రజల్లో మత ఘర్షణలు చెలరేగాయి.
* ఉత్తర్‌ప్రదేశ్, పంజాబ్, జమ్మూ కశ్మీర్, బిహార్, గుజరాత్‌లలో తరచూ మత ఘర్షణలు జరుగుతున్నాయి.
* 1984లో ఇందిరాగాంధీ హత్యానంతరం సిక్కు వ్యతిరేక సంఘర్షణలు, 1992, డిసెంబరు 6న బాబ్రీ మసీద్ సంఘటన, గుజరాత్‌లో జరిగిన గోద్రా మతఘర్షణలు, ఒడిశాలో క్రైస్తవ గురువులను హతమార్చడం, బాంబే పేలుళ్లు, నానాటికీ విస్తరిస్తున్న ఉగ్రవాదం లాంటివి భారతదేశ సమైక్యతకు సవాళ్లుగా నిలుస్తున్నాయి.


కులతత్వం
* మలివేద కాలం నుంచి మనదేశంలో విజృంభిస్తున్న కుల వ్యవస్థ ప్రారంభంలో కొంత సంఘీభావానికి కారణమైనప్పటికీ తర్వాత కాలంలో వికృత రూపాన్ని సంతరించుకుని కులతత్వంగా మారి జాతీయ సమైక్యతకు సవాల్ విసురుతోంది.
* ఒక కులం వారు మరొక కులం పట్ల ఈర్ష్య, ద్వేషం, పక్షపాతంతో వ్యవహరిస్తూ, తమకు ఉన్న సాంఘిక, ఆర్థిక, రాజకీయ ప్రాబల్యాలతో తమ కులం వారికి ప్రాధాన్యం ఇస్తూ, ఇతర కులస్తులను చిన్నచూపు చూడటం కులతత్వంగా చెప్పవచ్చు.
* ఎన్నికల్లో ఓట్లు పొందడం కోసం కొన్ని రాజకీయ పార్టీలు కులాన్ని ఓటు బ్యాంకుగా ఉపయోగిస్తుండటంతో, సమాజం కుల ప్రాతిపదికన విడిపోతుంది.
* కుల ప్రాతిపదికన కల్పిస్తున్న రిజర్వేషన్లు జాతీయ సమైక్యతను ప్రశ్నిస్తున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అనేక కులాలవారు రిజర్వేషన్ల కోసం చేస్తున్న పోరాటాలు హింసాత్మకంగా మారుతున్నాయి.
* రాజస్థాన్, హరియాణ రాష్ట్రాల్లో జాట్‌లు; గుజరాత్‌లో పటేదార్లు, ఆంధ్రప్రదేశ్‌లో కాపు వర్గం చేసిన రిజర్వేషన్ల పోరాటాలు ఉద్ధృతమై, హింసాత్మకంగా మారి, జాతీయ సమైక్యతను సవాల్ చేస్తున్నాయి.


రాజకీయాల్లో నేరగాళ్లు
* ఆధునిక ప్రజాస్వామ్య ప్రక్రియకు విఘాతం కలిగిస్తూ, పరోక్షంగా జాతీయ సమైక్యతకు సవాల్ విసురుతున్న మరో అంశం రాజకీయాలు నేరమయం కావడం.
* వ్యవస్థీకృత నేరగాళ్లతో రాజకీయ నాయకులు సంబంధాలు కలిగి ఉండటం, చట్టవ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడటం, ఎన్నికల్లో అవినీతి, అక్రమాలకు పాల్పడటం; గూండాయిజం లాంటివన్నీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ, జాతీయ సమైక్యతను ప్రశ్నిస్తున్నాయి.
* 1993లో ఎన్.ఎన్. వోహ్రా కమిటీ రాజకీయ నాయకులతో నేరస్థులకు ఉన్న సంబంధాలను బట్టబయలు చేసింది.
* ప్రారంభంలో రాజకీయ నాయకులు నేరస్థుల సహకారంతో గెలిచేవారు. కానీ ప్రస్తుతం నేరచరిత్ర ఉన్నవారే రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నారు.
* అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే స్వచ్ఛంద సంస్థ భారత ఎన్నికల సంఘం నుంచి సేకరించిన వివరాల ప్రకారం కింది విషయాలు వెల్లడయ్యాయి.
* 2014లో జరిగిన 16వ లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసిన 5380 మంది అభ్యర్థులు ఇచ్చిన అఫిడవిట్ పత్రాల్లో 17% పైగా అభ్యర్థులపైన నేర ఆరోపణలు ఉన్నాయి. 10% పైగా అభ్యర్థులపై తీవ్రమైన నేరారోపణలు ఉన్నాయి.
* ఉత్తర్‌ప్రదేశ్ - 30%, మహారాష్ట్ర - 26%, బిహార్ - 16%, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 11% అభ్యర్థులపై నేర ఆరోపణలు ఉన్నాయి.
* నేరమయ రాజకీయాలు ప్రజాస్వామ్యానికి, జాతీయ సమైక్యతకు గొడ్డలి పెట్టులాంటివి.


ఉగ్రవాదం
* సమాజాన్ని అభద్రతాభావంలోకి నెట్టి, తీవ్రమైన శాంతిభద్రతల సమస్యకు కారణమవుతున్న ఉగ్రవాదం జాతీయ సమ్యైకతకు పెనుసవాల్‌గా నిలిచింది.
* ఉగ్రవాదం వల్ల ఇబ్బంది పడుతున్న దేశాల్లో భారతదేశం కూడా ఒకటి.
* మనదేశంలో ప్రధాన నగరాలైన ముంబయి, దిల్లీ, కోల్‌కతా, హైదరాబాద్‌ల్లో పలు ఉగ్రవాద దాడులు జరిగాయి.
* హైదరాబాద్‌లో దిల్‌సుఖ్‌నగర్, లుంబినీ పార్కులో బాంబు పేలుళ్లు, కశ్మీర్‌లో నిత్యం జరిగే ఉగ్రదాడులు భారత సమగ్రతకు సవాల్‌గా నిలుస్తున్నాయి.


ప్రాంతీయతత్వం
* ప్రాంతీయ దురభిమానం ఉన్నవారు రెచ్చగొట్టే ప్రాంతీయ వాదం కూడా జాతీయ సమైక్యతకు సవాల్‌గా మారుతోంది. స్వాతంత్య్రానంతరం దేశంలో వివిధ ప్రాంతాల మధ్య అభివృద్ధి విషయంలో తారతమ్యాలు, పాలకులు అనుసరించిన సమతౌల్య అభివృద్ధి వ్యూహాలు విఫలం కావడంతో వెనుకబడిన ప్రాంతాల ప్రజలు తమ ప్రత్యేకమైన అస్థిత్వాన్ని కాపాడుకోవడానికి, అభివృద్ధి ఫలాలను అందుకోవడానికి ప్రారంభించిన ప్రాంతీయ ఉద్యమాలు జాతీయ సమైక్యతకు ముప్పుగా నిలిచాయి.
* గిరిజనులు, దళితులు, పేద రైతులు, కార్మికులు, వివిధ సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఈ ఉద్యమాలు కొన్ని సందర్భాల్లో హింసాత్మకంగా మారడంతో జాతీయ సమ్యైక్యతకు సవాలుగా నిలిచాయి.
* తమిళనాడులో ప్రారంభించిన హిందీ వ్యతిరేకోద్యమం, పంజాబ్‌లో ప్రారంభమైన ఖలిస్థాన్ ఉద్యమం, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రత్యేక తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాలు జాతీయ సమైక్యతను ప్రశ్నించాయి.


జాతీయ సమైక్యతను పెంపెందించే మార్గాలు
* ప్రజల్లో శాస్త్రీయ దృక్ఫథాన్ని పెంపొందించే విద్యను వ్యాప్తి చేయాలి.
* మత, కుల, ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టే రాజకీయ పార్టీలపై 1950 నాటి భారత ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలి.
* దేశంలోని అన్ని విద్యాలయాల్లో జాతీయ సమైక్యతను పెంపొందించే కార్యక్రమాలను అమలు చేయాలి.
* ఎలక్ట్రానిక్ మీడియా, డాక్యుమెంటరీ చిత్రాల ద్వారా జాతీయ సమైక్యతను పెంపొందించాలి.
* 1961లో ఏర్పడిన జాతీయ సమైక్యతా మండలిని క్రియాశీలం చేయాలి.
* దేశ ప్రజలందరి మధ్య సౌభ్రాతృత్వాన్ని పెంపొందించాలి.
* జాతీయ క్రీడలు, జాతీయ పండగలను విస్తృతంగా నిర్వహించాలి.
* దేశంలోని అన్ని ప్రాంతాలు సమతౌల్య అభివృద్ధి సాధించేందుకు ప్రయత్నించాలి.

Posted Date : 31-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌