• facebook
  • whatsapp
  • telegram

విత్త వ్యవస్థ - మూలధన మార్కెట్‌

సాధనాలు

1) వాటాలు     2) రుణ పత్రాలు     

3) బాండ్లు    4) డెరివేటివ్స్‌     

5) మ్యూచువల్‌ ఫండ్స్‌


విధులు


సమాజంలో పొదుపును సమీకరించి, పెట్టుబడి మార్గంలోకి మళ్లిస్తుంది.


పరిశ్రమలు, వ్యాపార సంస్థలకు విత్తాన్ని సమకూరుస్తుంది.


మూలధన నిధులను అనుత్పాదక రంగాల నుంచి ఉత్పాదక రంగాలకు తరలిస్తుంది.


ద్రవ్య నిల్వదారులను ప్రోత్సహించి, వినిమయానికి దోహదం చేస్తుంది.


వనరుల సమర్థవంతమైన వినియోగం ద్వారా ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి, ఉద్యోగిత పెరుగుదలకు తోడ్పడుతుంది.


దేశ ఆర్థికాభివృద్ధిలో తన వంతు సాయం చేస్తుంది.


విభాగాలు


భారతీయ మూలధన మార్కెట్‌లో అనేక విభాగాలు ఉన్నాయి. వీటిలోని సంస్థలు కొన్ని సెక్యూరిటీల ద్వారా వ్యాపారానికి ద్రవ్య సహాయం అందిస్తాయి. వాటి ద్వారానే దీర్ఘకాలిక విత్తాన్ని పరిశ్రమలు, వ్యాపార సంస్థలు, ప్రభుత్వం సమకూర్చుకుంటాయి. వాటిలో ముఖ్యమైనవి: సెక్యూరిటీస్‌ మార్కెట్, అభివృద్ధి విత్త సంస్థలు.


సెక్యూరిటీస్‌ మార్కెట్‌


 ద్రవ్యం లేదా విత్త సంబంధ ఆస్తులపై ఉన్న హక్కును తెలిపే పత్రాలను సెక్యూరిటీలు అంటారు.


దీర్ఘకాలిక వ్యవధి ఉన్న సెక్యూరిటీల కొనుగోలు, అమ్మకాలను నిర్వహించే మార్కెట్‌ను సెక్యూరిటీల మార్కెట్‌ లేదా స్టాక్‌ మార్కెట్‌ అంటారు. 


మూలధన మార్కెట్‌ ప్రధాన విభాగం సెక్యూరిటీల మార్కెట్‌. దీన్ని రెండు రకాలుగా విభజించారు. అవి: 


ఎ) ప్రభుత్వ సెక్యూరిటీల మార్కెట్‌ 


బి) ప్రైవేట్‌ సెక్యూరిటీల మార్కెట్‌ 


ప్రభుత్వ సెక్యూరిటీలు(Gilt-Edged Securities):  వీటినే శ్రేష్ఠ సెక్యూరిటీల మార్కెట్‌ అని కూడా అంటారు. ప్రభుత్వ లేదా ప్రభుత్వ హామీ పొందిన సెక్యూరిటీల క్రయ, విక్రయాలు జరిగే మార్కెట్‌ను శ్రే˜ష్ఠ సెక్యూరిటీల మార్కెట్‌గా పేర్కొంటారు.


ప్రభుత్వానికి చెందిన ఖజానా బిల్లులు, బాండ్ల మార్కెట్‌ ఇందులో భాగం.


కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలు, నగర పాలక సంస్థలు, పురపాలక సంస్థలు, ప్రభుత్వ పోర్ట్‌ ట్రస్ట్‌లు, రాష్ట్ర విద్యుత్‌ మండళ్లు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ రంగ అభివృద్ధి బ్యాంకులు జారీ చేసిన సెక్యూరిటీలను ప్రభుత్వ సెక్యూరిటీలు అంటారు.


శ్రేష్ఠ సెక్యూరిటీలకు ప్రభుత్వ హామీ ఉంటుంది. కాబట్టి నష్ట భయం ఉండదు.


ప్రభుత్వ సెక్యూరిటీలన్నీ స్టాక్‌ సర్టిఫికెట్స్‌ (సబ్సిడరీ జనరల్‌ లెడ్జర్‌లో నమోదు), ప్రామిసరీ నోట్లు, బేరర్‌ బాండ్ల రూపంలో ఉంటాయి. ఇవి ఎక్కువగా ప్రామిసరీ నోట్ల రూపంలో ఉంటాయి. ప్రభుత్వ సెక్యూరిటీలు రూ.100, రూ.1000 విలువల్లో ఉంటాయి.


ప్రైవేట్‌ సెక్యూరిటీల మార్కెట్‌: దీన్ని పారిశ్రామిక మార్కెట్‌ లేదా కార్పొరేట్‌ సెక్యూరిటీ మార్కెట్‌ అని కూడా అంటారు. ఇందులో రెండు రకాలు ఉన్నాయి. అవి:


1) కొత్త జారీల మార్కెట్‌(New Issues Market)


2) పాత జారీల మార్కెట్‌ (Old Issues Market)


కొత్త జారీల మార్కెట్‌: దీన్ని ప్రాథమిక మార్కెట్‌ (Primary Market) Í అని కూడా అంటారు. ఇవి ఈక్విటీ వాటాలు, ఆధిక్యపు వాటాలు, డిబెంచర్ల రూపంలో ఉంటాయి. 


వీటిద్వారా నిధులు సమకూర్చుకునే సంస్థలు కొత్తవి కావచ్చు లేదా విస్తరణకు ప్రయత్నిస్తున్న పాత సంస్థలు అవ్వొచ్చు. ః కొత్త జారీల ద్వారా పారిశ్రామిక సంస్థలు, వ్యాపార సంస్థలు తమకు కావాల్సిన మూలధనాన్ని సమకూర్చుకుంటాయి. మార్కెట్‌లో వాటాలు, డిబెంచర్లు అమ్మడం ద్వారా నిధులు సేకరిస్తాయి.


పాత జారీల మార్కెట్‌: దీన్నే ద్వితీయ మార్కెట్‌ (Secondary Market) అంటారు. ఇందులో అప్పటికే అమల్లో ఉన్న సెక్యూరిటీలు లేదా పాత జారీల క్రయ, విక్రయాలను నిర్వహిస్తారు. ఈ సెక్యూరిటీలకు ద్రవ్యత్వం కల్పించడమే ఈ మార్కెట్‌ ప్రధాన విధి.


ద్వితీయ మార్కెట్‌ను రెండు భాగాలుగా విభజించారు. అవి:


1) సంఘటిత స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌


2) ఓవర్‌ ది కౌంటర్‌ మార్కెట్‌


అభివృద్ధి విత్త సంస్థలు


దేశంలో పరిశ్రమల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా పారిశ్రామిక ఆర్థిక సహాయ సంస్థలను స్థాపించాలని 1953లో పారిశ్రామిక విత్త సంస్థల విచారణ సంఘం (Industrial Finance Corporation Enquiry Committee) సిఫార్సు చేసింది. 


 దీని ఆధారంగా ప్రభుత్వం అనేక విత్త సంస్థలను ఏర్పాటు చేసింది. 1991లో ఏర్పాటైన నరసింహం కమిటీ వీటిని అభివృద్ధి విత్త సంస్థలుగా పేర్కొంది. 


* వీటితో పాటు అనేక పెట్టుబడి సంస్థలను కూడా నెలకొల్పారు. విత్త మార్కెట్‌లో ఇవన్నీ ఒక ముఖ్య భాగం. అభివృద్ధి పెట్టుబడి సంస్థలు మూడు రకాలు. అవి:


1) జాతీయ సంస్థలు     2) రాష్ట్రస్థాయి సంస్థలు


3) ఇతర విత్త సంస్థలు


జాతీయ సంస్థలు 


i)  అఖిల భారత అభివృద్ధి బ్యాంకులు: 


1. ఇండస్ట్రియల్‌ ఫైనాన్షియల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఐఎఫ్‌సీఐ). దీన్ని 1948లో ఏర్పాటు చేశారు.


2. ఇండస్ట్రియల్‌ క్రెడిట్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఐసీఐ). 1955లో నెలకొల్పారు.


3. ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఐడీబీఐ).1964లో ఏర్పాటైంది.


4. స్మాల్‌ ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఐడీబీఐ). 1990లో నెలకొల్పారు.


ii)   పెట్టుబడి సంస్థలు


1. లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌ఐసీ). 1956లో నెలకొల్పారు.


2. యూనిట్‌ ట్రస్ట్‌ ఆఫ్‌ ఇండియా (యూటీఐ మ్యూచువల్‌ ఫండ్స్‌). 1964లో ఏర్పాటైంది.


3. ఫైనాన్స్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎఫ్‌ఐసీ). 1972లో నెలకొల్పారు.


iii)   పునర్విత్త సంస్థలు:


1. నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంక్‌ (ఎన్‌హెచ్‌బీ). 1988లో స్థాపించారు.


2. నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ (నాబార్డ్‌). 1982లో ఏర్పాటైంది.


iV) ప్రత్యేక విత్త సంస్థలు:


1) ఎగ్జిమ్‌ బ్యాంక్‌ (1982)


2) ఐఎఫ్‌సీఐ వెంచర్‌ క్యాపిటల్‌ ఫండ్స్‌ (1988)


3) టూరిజం ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా - టీఎఫ్‌సీఐ (1989)


4) ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా - ఐడీఎఫ్‌సీఐ (1990)


V)  మధ్యవర్తిత్వ సంస్థలు (Intermediary Institutions): మార్కెట్‌ బ్యాంకులు, మ్యూచువల్‌ ఫండ్స్, లీజింగ్‌ కంపెనీలు, వెంచర్‌ క్యాపిటల్‌ కంపెనీలు మొదలైనవి.


 

Vi ) స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌/ స్టాక్‌ మార్కెట్‌ (Stock Exchange/ Stock Market): వ్యవస్థీకృత మూలధన మార్కెట్‌లో స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లు ముఖ్య భాగం.


* పారిశ్రామిక, వ్యాపార సంస్థల వాటాలు, డిబెంచర్లు, ప్రభుత్వ బాండ్లు, ఇతర సెక్యూరిటీల క్రయ-విక్రయాలు జరిగే మార్కెట్‌ వ్యవస్థనే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌/ స్టాక్‌ మార్కెట్‌ అంటారు. 


* దీన్ని దేశంలోని ఆర్థిక వాతావరణానికి ‘భారమితి’గా పేర్కొంటారు.


* 1956 సెక్యూరిటీ కాంట్రాక్టుల (క్రమబద్ధం) చట్టం ప్రకారం, సెక్యూరిటీల కొనుగోళ్లు - అమ్మకాల వ్యాపారాన్ని లేదా వర్తకాన్ని నియంత్రించడానికి లేదా సులభతరం చేయడానికి ఏర్పాటైందే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌. ఇందులో నమోదైన లేదా నమోదు కాని వ్యక్తులు సంఘంగా ఉంటారు.


* కంపెనీల చట్టం ప్రకారం, కంపెనీలు తమ సెక్యూరిటీలను స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ అధికారిక జాబితాలో నమోదు చేసుకోవచ్చు. ఇందులో చేర్చిన సెక్యూరిటీల అమ్మకాలు, కొనుగోళ్లు స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ పరిధిలో జరుగుతాయి. జాబితాలో చేర్చని సెక్యూరిటీల అమ్మకాలు, కొనుగోళ్లను బ్రోకర్లు ఎక్స్ఛేంజ్‌ బయట నిర్వహిస్తారు. ప్రభుత్వ సెక్యూరిటీలకు రిజర్వ్‌ బ్యాంకు అనుమతి పొందిన ప్రభుత్వ బ్రోకర్లు ఉంటారు.


 

Posted Date : 22-10-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌