• facebook
  • whatsapp
  • telegram

సామాజిక వికాస ప్రయోగాలు

పల్లెసీమల్లో నవోదయం!


పల్లె సీమల్లో ప్రగతి వెలుగులు నింపి, గ్రామీణుల జీవన ప్రమాణాలను పెంచే లక్ష్యంతో శతాబ్దంపైగా సామాజిక వికాస ప్రయోగాలు సాగుతున్నాయి. సమాజంలో సమానత్వాన్ని, చైతన్యాన్ని పెంపొందించి, స్వయం సమృద్ధిని సాధించడం ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశం. ఇందుకోసం వ్యక్తులు, సంస్థలు మొదలు ప్రభుత్వాల వరకు ఎందరో కృషి చేశారు. అనేక విధానాలు, పథకాలను అమలు చేశారు. ఆ వివరాలను పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి.

   

గ్రామీణ ప్రాంతాల సమగ్రాభివృద్ధికి, ప్రజలకు గౌరవప్రదమైన జీవనాన్ని అందించేందుకు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా వివిధ కార్యక్రమాలను చేపట్టారు. విద్య, ఆరోగ్యం, సామాజిక చైతన్యమే ధ్యేయంగా స్వాతంత్య్రానికి పూర్వం పలువురు వ్యక్తుల ఆధ్వర్యంలో అవి జరిగాయి. స్వాతంత్య్రానంతరం అదే తరహాలో ఉపాధి, ఇల్లు, ఇతర మౌలిక వసతుల కల్పన లక్ష్యంగా ప్రభుత్వాలు పలు పథకాలను అమలు చేస్తున్నాయి.

సుందర్బన్స్‌ ప్రయోగం(1903): పశ్చిమ బెంగాల్‌లోని ‘సుందర్బన్స్‌’ గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు 1903లో ‘డేనియల్‌ హామిల్టన్‌’ శ్రీకారం చుట్టారు. గ్రామంలో మెరుగైన మౌలిక సదుపాయాలను కల్పించి ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు ప్రయత్నించారు.

గుర్గావ్‌ ప్రయోగం (1920): 1920లో పంజాబ్‌లోని ‘గుర్గావ్‌’ జిల్లాలో ఎఫ్‌.ఐ.బ్రేయన్‌ అనే డిప్యూటీ కమిషనర్‌ గ్రామీణ అభివృద్ధి ఉద్యమాన్ని ప్రారంభించారు. 1933 నుంచి ‘గుర్గావ్‌ గ్రామీణాభివృద్ధి ఉద్యమం’ విస్తృతంగా కొనసాగింది. దీని ప్రాధాన్యాన్ని గుర్తించిన ప్రభుత్వం 1935-36లో రూ.కోటి కేటాయించి ప్రోత్సహించింది.

కీలకాంశాలు: 1) అభివృద్ధి పథకాలను వ్యవస్థీకరించడం. 2) వివాహం, ఉత్సవం, విందు, వినోదాల్లో జరిగే ధనవ్యయాన్ని తగ్గించి సమాజ అభివృద్ధికి వినియోగించడం. 3) వ్యవసాయోత్పత్తిని, ప్రజారోగ్యాన్ని పెంపొందించడం. 4) మహిళా విద్య, గ్రామీణ పారిశుద్ధ్యాన్ని పెంపొందించడం.

మార్తాండం ప్రయోగం(1921): తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో మార్తాండం ప్రాంతంలో అమెరికన్‌ వ్యవసాయ రంగ నిపుణుడు ‘స్పెన్సర్‌ హాచ్‌’ దీనికి ఆద్యుడు. సుమారు 70 గ్రామాలకు చెందిన ప్రజల సమగ్రాభివృద్ధి కోసం వైఎంసీఏ (యంగ్‌ మెన్స్‌ క్రిస్టియన్‌ అసోసియేషన్‌)ను ఏర్పాటు చేసి, ఈ ప్రయోగం నిర్వహించారు. 

కీలకాంశాలు: 1) అభివృద్ధిపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడం. 2) గ్రామీణ పునర్నిర్మాణం. 3) మౌలిక రంగాల్లో ప్రజలకు తర్ఫీదునివ్వడం. 4) అధునిక సాగు పద్ధతులను అవలంబించడం. 5) పాడి పరిశ్రమ, తేనెటీగల పెంపకం.

శ్రీనికేతన్‌ ప్రయోగం (1922): విశ్వకవి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ కలకత్తాలోని శాంతినికేతన్‌లో దీన్ని ప్రారంభించారు. సామాజిక వికాస ప్రయోగాల్లో ఆత్మగౌరవాన్ని కీలకాంశంగా తీసుకున్నారు.

కీలకాంశాలు: 1) చిన్నతరహా, కుటీర పరిశ్రమల ఏర్పాటు, నిర్వహణ. 2) ఆత్మగౌరవంతో స్వయంసమృద్ధి సాధించడం. 3) వయోజన విద్య, ప్రజల ఆరోగ్య సంరక్షణ.

బరోడా ప్రయోగం (1932):  బరోడా సంస్థానంలో ‘దివాన్‌’గా పనిచేసిన వి.టి.కృష్ణమాచారి 1932లో సమాజ అభివృద్ధి సాధనలో భాగంగా ఈ ప్రయోగం చేపట్టారు.

కీలకాంశాలు: 1) గ్రామీణ యువతీ యువకులను చైతన్యపరచి సమాజ అభివృద్ధిలో భాగస్వామ్యం చేయడం. 2) రోడ్ల నిర్మాణం, పాడి పరిశ్రమ, కోళ్ల పెంపకం ద్వారా సమాజ ప్రగతికి కృషి చేయడం.

సేవాగ్రామ్‌ ప్రయోగం(1933):  మహారాష్ట్రలోని ‘వార్ధా’ ప్రాంతంలో మహాత్మాగాంధీ 1933లో దీన్ని ప్రారంభించారు. ఆచార్య వినోబా భావే, లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌ తదితరులు విస్తృతపరిచారు.

కీలకాంశాలు: 1) సర్వోదయ, నవోదయ సిద్ధాంతాల ఆధారంగా సమాజాన్ని నిర్మించడం. 2) ఆర్థిక, సామాజిక సమానత్వాన్ని సాధించేందుకు కృషి చేయడం.3) ప్రాతిపదిక విద్య (Basic Education)లో శిక్షణ ఇవ్వడం ద్వారా ప్రజల స్వయంసమృద్ధికి పాటుపడటం.

ఫిర్కా ప్రయోగం (1946): టంగుటూరి ప్రకాశం మద్రాస్‌ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న కాలంలో ‘ఫిర్కా’ ప్రయోగానికి శ్రీకారం చుట్టారు.

కీలకాంశాలు: 1) తాలుకాలను ఫిర్కాలుగా విభజించి వాటి సమగ్రాభివృద్ధికి కృషి చేయడం. 2) వెనుకబాటుతనం ఆధారంగా ఫిర్కాలను ఎంపిక చేయడం. 3) కుటీర పరిశ్రమల ఏర్పాటు, నిర్వహణ. 4) సహకార సంస్థల ఏర్పాటు. 5) అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రభుత్వేతర సంస్థల భాగస్వామ్యం.

* 1952లో భారత ప్రభుత్వం ‘సమాజ అభివృద్ధి పథకం’ (Community Development Programme - CDP) ప్రవేశపెట్టడంతో ఫిర్కాలను ‘బ్లాకు’ల్లో విలీనం చేశారు.

ఇటావా ప్రయోగం(1948): ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఇటావా జిల్లా ‘మహేవా’ ప్రాంతంలో ఆల్బర్ట్‌ మేయర్‌ దీన్ని ప్రారంభించారు. సుమారు 97 గ్రామాలను ఎంపిక చేసుకుని పౌర సౌకర్యాలు కల్పించేందుకు ప్రయత్నించారు.

కీలకాంశాలు: 1) కళారూపాలతో ప్రజల్లో సామాజిక చైతన్యం పెంచడం. 2) వ్యవసాయం, పాడి పరిశ్రమ, చేనేత పరిశ్రమలకు ప్రోత్సాహం. 3) పరిపాలనా వికేంద్రీకరణ ద్వారా గ్రామ పంచాయతీల ఏర్పాటుకు కృషి.

నీలోఖరి ప్రయోగం (1948):  హరియాణాలోని కర్నాల్‌ జిల్లా ‘నీలోఖరి’ ప్రాంతంలో దీన్ని ప్రారంభించారు. దేశ విభజన సందర్భంగా నిరాశ్రయులైన సుమారు 7 వేల మందికి పునరావాసం కల్పించడం ఈ ప్రయోగం లక్ష్యం. ఈ విషయంలో కీలక పాత్ర పోషించిన ప్రముఖుడు సురేంద్ర కుమార్‌ డే (ఎస్‌కే డే). 

కీలకాంశాలు: 1) స్వయంశక్తితో అభివృద్ధి చెందే విధంగా ప్రజలను ప్రోత్సహించడం. 2) వ్యవసాయ పనిముట్ల తయారీ, ఇంజినీరింగ్‌ వర్క్స్‌లో శిక్షణ ఇవ్వడం. 3) గృహ వసతి, మార్కెటింగ్‌ సదుపాయాలు కల్పించడం.

గ్రో మోర్‌ ఫుడ్‌ కాంపెయిన్‌ (1942): క్విట్‌ ఇండియా ఉద్యమ కాలంలో బెంగాల్‌లో కరవు, తుపానుల ఫలితంగా ఆహార ధాన్యాలకు తీవ్రమైన కొరత ఏర్పడింది. ఈ సమస్యను అధిగమించేందుకు ఆహారధాన్యాల ఉత్పత్తిని పెంచే విధంగా బ్రిటిషర్లు 'Grow More Food Campaign'ను 1942లో ప్రారంభించారు. కానీ ఆశించిన ఫలితాలివ్వలేదు.

* 1947, ఆగస్ట్‌ 15న దేశానికి స్వాతంత్య్రం వచ్చే సమయానికి దేశం తీవ్రమైన ఆహార సంక్షోభం ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితిని మార్చేందుకు ప్రభుత్వం ‘గ్రో మోర్‌ ఫుడ్‌’ లక్ష్యంతో ఆహార ధాన్యాల ఉత్పత్తిని గణనీయంగా పెంచాలని నిర్ణయించింది.

* మొదటి పంచవర్ష ప్రణాళిక రూపకల్పనలో భాగంగా గ్రామీణాభివృద్ధిపై వి.టి.కృష్ణమాచారి అధ్యక్షతన కమిటీ ఏర్పాటైంది. దాని సిఫారసుల మేరకు దేశంలో ఎంపిక చేసిన 50 జిల్లాల్లోని 55 బ్లాకుల్లో (సమితులు) 1952, అక్టోబరు 2న ‘సమాజ అభివృద్ధి కార్యక్రమం’ (CDP) ప్రారంభించారు.

సమాజ అభివృద్ధి కార్యక్రమం (1952): అమెరికాలో అమలైన ‘బ్లాక్‌’ (Block) ను అభివృద్ధికి నమూనాగా తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి అమెరికాకు చెందిన ఫోర్డ్‌ ఫౌండేషన్‌ ఆర్థిక సహకారం అందించింది. అప్పటి అమెరికా రాయబారి చెస్టర్‌ బౌల్స్‌ ద్వారా 5 మిలియన్‌ డాలర్లు సమకూర్చింది. 1971 నాటికి ఫోర్డ్‌ ఫౌండేషన్‌ అందించిన ఆర్థిక సహకారం సుమారు 104 మిలియన్‌ డాలర్లు.


ఎంపిక చేసిన అంశాలు: 1) పేదరికం, నిరుద్యోగం నిర్మూలన. 2) గ్రామీణ సమాచార వ్యవస్థ, వ్యవసాయం, కుటీర పరిశ్రమలు. 3) ప్రాథమిక విద్య, ప్రజారోగ్యం, సాంఘిక సంక్షేమం. 4) వ్యవసాయం, కుటీర పరిశ్రమలు, గృహవసతి.


సీడీపీ లక్ష్యాలు: 1) ప్రజలు సంఘటితమై తమకు అవసరమైన ప్రణాళికలను రూపొందించుకోవడం. 2) వ్యక్తి సంక్షేమం ద్వారా సమాజ సంక్షేమం సాధించడం. 3) దేశ ప్రగతిలో ప్రజలందరినీ భాగస్వాముల్ని చేయడం.


కీలకాంశాలు:  1) ఈ పథకాన్ని మొదటిసారిగా ఎంపిక చేసిన 50 జిల్లాల్లోని 55 బ్లాకుల్లో ప్రారంభించారు. ప్రతి బ్లాకులో సుమారు 100 గ్రామాలు, 70 వేల జనాభా ఉంటుంది.  2) ప్రతి బ్లాకుకు కార్యనిర్వహణాధికారిగా బ్లాక్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ వ్యవహరిస్తారు. 3) సీడీపీని ప్రచారం చేయడానికి గ్రామస్థాయిలో ‘గ్రామ్‌సేవక్‌’ అనే అధికారిని నియమించారు. 4) ప్రజలు స్వయం సమృద్ధి సాధించేందుకు అవసరమైన ఆర్థిక, సాంకేతిక సహకారాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. 5) సీడీపీ తర్వాత కాలంలో 5011 బ్లాకులకు విస్తరించింది.

జాతీయ విస్తరణ సేవా కార్యక్రమం: సీడీపీకి కొనసాగింపుగా దేశంలోని 1700 బ్లాకుల్లో ‘జాతీయ విస్తరణ సేవా కార్యక్రమం (National Extension Service Scheme n- NESS)’ ను 1953, అక్టోబరు 2న ప్రారంభించారు. సీడీపీని మూడేళ్ల కాలపరిమితితో రూపొందించగా, ‘ఎన్‌ఈఎస్‌ఎస్‌’ను శాశ్వత ప్రాతిపదికన చేపట్టారు.

* ఎన్‌ఈఎస్‌ఎస్‌ ద్వారా వ్యవసాయం, కుటీర పరిశ్రమలు, విద్యా రంగాలు అభివృద్ధి చేయాలని సంకల్పించారు.

వివిధ స్థాయుల్లో అమలు:

కేంద్ర స్థాయి: సమాజ అభివృద్ధి, సహకార మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో అమలవుతుంది.

రాష్ట్ర స్థాయి: ముఖ్యమంత్రి అధ్యక్షతన ఉండే ‘రాష్ట్ర అభివృద్ధి సంఘం’ పర్యవేక్షణలో అమలవుతుంది.

జిల్లా స్థాయి: కలెక్టర్‌ పర్యవేక్షణలో అమలవుతుంది.

బ్లాకు స్థాయి: బ్లాక్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ పర్యవేక్షణలో అమలవుతుంది.

గ్రామ స్థాయి: విలేజ్‌ లెవల్‌ వర్కర్స్‌ (వీఎల్‌డబ్ల్యూ) పథకం అమలుకు కృషి చేస్తారు.

* సీడీపీ, ఎన్‌ఈఎస్‌ఎస్‌ ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్‌గా ఎస్‌.కె.డే వ్యవహరించారు. ఎన్‌ఈఎస్‌ఎస్‌ పథకం ‘సుశిక్షితులైన తోటమాలి నిర్వహించే చక్కటి ఉద్యానవనం వంటిది’ అని ఆయన పేర్కొన్నారు.

* ఎన్‌ఈఎస్‌ఎస్‌ పథకం భారతదేశంలో ‘ఒక నిశ్శబ్ద విప్లవం’ వంటిదని జవహర్‌లాల్‌ నెహ్రూ అభివర్ణించారు.

* ఎన్‌ఈఎస్‌ఎస్‌ పథకం అమలులో గ్రామస్థాయిలో కీలకపాత్ర పోషించేది విలేజ్‌ లెవల్‌ వర్కర్స్‌.  వీరికి అన్ని రంగాల్లోనూ శిక్షణ ఇచ్చేవారు. అందుకే వీరిని మల్టీపర్పస్‌ వర్కర్స్‌గానూ పిలిచేవారు.

రచయిత: బంగారు సత్యనారాయణ

Posted Date : 14-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌