• facebook
  • whatsapp
  • telegram

ఆంధ్రాలో సంఘ సంస్కరణోద్యమాలు

కందుకూరి వీరేశలింగం యుగం

* కందుకూరి వీరేశలింగం యుగం 19వ శతాబ్దం అర్ధభాగంలో ప్రారంభమైంది. ఈయన జీవించిన కాలాన్ని (1848-1919) ఒక యుగంగా పేర్కొంటారు. ఈ కాలంలో కవులు, పండితులు, కళాకారులు తమ రచనల ద్వారా సమాజంలోని లోపాలను ఎత్తిచూపారు.

* రాజా రామ్మోహన్‌రాయ్, కేశవ చంద్రసేన్, దేవేంద్రనాథ్‌ ఠాగూర్‌ లాంటి బ్రహ్మసమాజ నాయకుల బోధనలతో అనేక మంది ప్రభావితులయ్యారు. ఆ కాలంలో కందుకూరి వీరేశలింగం ఆంధ్రాలో సంస్కరణలకు పాటుపడి ‘యుగ పురుషుడు’, ‘ఆంధ్రా నవయుగ వైతాళికుడి’గా పేరొందారు.

* వీరేశలింగం 1848, ఏప్రిల్‌ 16న రాజమండ్రిలో జన్మించారు. ఈయన తల్లిదండ్రులు కె.సుబ్బారాయుడు, పూర్ణమ్మ.

* వీరి పూర్వికులది ప్రకాశం జిల్లాలోని కందుకూరి గ్రామం. అక్కడి నుంచి రాజమండ్రికి వలస వెళ్లి స్థిరపడ్డారు. దీంతో వారి ఇంటిపేరు కందుకూరిగా మారింది.

* వీరేశలింగం రాజమండ్రి వీధి బడిలో చదవడం, రాయడం నేర్చుకున్నారు. నాలుగో ఏటే తండ్రి  మరణించడంతో పెదనాన్న, నాయనమ్మ సంరక్షణలో పెరిగారు.

* అయిదేళ్ల వయసులోనే బాలరామాయణం, అమరం, ఆంధ్రనామసంగ్రహం, రుక్మిణీ కల్యాణం, సుమతీ శతకం, కృష్ణ శతకం నేర్చుకున్నారు.

* దూసి సోమయాజుల వద్ద సంస్కృతం నేర్చుకున్నారు. చిన్నతనం నుంచే అన్ని తరగతుల్లో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. 12వ ఏట రాజమండ్రి ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్లం నేర్చుకున్నారు. 

* 13వ ఏట బాపమ్మ (కందుకూరి రాజ్యలక్ష్మమ్మ)ను బాల్యవివాహం చేసుకున్నారు.

* చిన్నతనం నుంచే విగ్రహారాధనను, లంచగొండితనాన్ని, అవినీతిని, అబద్ధాలు చెప్పడాన్ని, మూఢనమ్మకాలను వ్యతిరేకించారు.

* విద్యార్థిగా ఉన్నప్పుడే ప్రధానోపాధ్యాయుడికి వ్యతిరేకంగా సమ్మె చేసి, ఆయన్ను బదిలీ చేయించారు. మెట్రిక్యులేషన్‌ పరీక్ష పాసై రాజమండ్రి పాఠశాలలో ఉపాధ్యాయులుగా చేరారు.

* కేశవ చంద్రసేన్, పాశ్చాత్య నాగరికతకు చెందిన పుస్తకాల ప్రభావం ఈయనపై ఎక్కువగా ఉండేది. 

* 1872లో కోరంగి ఆంగ్ల పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా చేరారు. తర్వాత రాజమండ్రి ప్రభుత్వ కళాశాల, మద్రాస్‌ ప్రెసిడెన్సీ కళాశాలలో తెలుగు అధ్యాపకులుగా పనిచేశారు. చివరి వరకు అదే వృత్తిలో కొనసాగారు. ఉపాధ్యాయ వృత్తి ఉత్తమమైందని, సంస్కరణాభిలాషకు వృత్తి కొంతమేర దోహదపడుతుందని నమ్మారు.

* విద్యార్థులు, అధ్యాపక వృత్తి సంస్కరణ రచనా వ్యాసంగానికి తోడ్పడ్డాయి. ఆయన రచనలే సమాజ సంస్కరణకు సాధనాలుగా మారాయి. 
 

సంస్కర్తగా.. వీరేశలింగం విద్యార్థి దశ నుంచే హేతువాదాన్ని నమ్మి, బ్రహ్మసమాజ సిద్ధాంతాలతో ప్రభావితం అయ్యారు. నాటి  సమాజంలో మూఢ నమ్మకాలు ఎక్కువ. వితంతువులకు పునర్వివాహాలు లేవు. బాల్యవివాహాలు ఉండేవి. స్త్రీలకు విద్య లేదు. అందుకే ఈ యుగాన్ని ఆంధ్రాలో ‘చీకటియుగం’గా పేర్కొంటారు. సమాజంలో వచ్చే విప్లవాత్మక మార్పు ద్వారానే వీటిని అధిగమించవచ్చని వీరేశలింగం అభిప్రాపపడ్డారు. ప్రజల ఆలోచనా విధానంలో మార్పు రావడానికి సాహిత్యం, పత్రికలు ఉపయోగపడతాయని గ్రహించి అనేక రచనలు చేశారు.

* మూఢనమ్మకాలపై పోరాడి నూతన సంస్కరణలకు నాంది పలికారు. శకునాలు, మంత్రతంత్రాలు, జ్యోతిషం, భూతవైద్యం, దేవుని అవతారాలను నమ్మలేదు. వర్ణాశ్రమ ధర్మాలను అంగీకరించలేదు. వేదాలు, బైబిల్, ఖురాన్‌లలో రాసిన మహిమలన్నీ నమ్మశక్యాలు కావని పేర్కొన్నారు.

* స్త్రీ విద్య కోసం ఉద్యమించి, వారి కోసం బాలికా పాఠశాలను స్థాపించారు. స్త్రీ, పురుష లింగభేదం లేకుండా సహ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు. అణగారిన కులాలకు చెందిన పిల్లలను బడిలో చేర్చుకుని సమాన అవకాశాలు కల్పించారు.

* పోలీసులు, న్యాయవాదుల దౌర్జన్యాలను తన రచనల ద్వారా విమర్శించారు.

* అప్పట్లో న్యాయస్థానాల్లో తీర్పు చెప్పేందుకు న్యాయమూర్తులు డబ్బు ఆశించేవారు. ఆ విధానాన్ని తన వివేకవర్ధిని పత్రికలో విమర్శించారు.
 

నాటకాలు: వీటిని వీరేశలింగం సంస్కృతం నుంచి తెలుగులోకి అనువదించారు. అవి: అభిజ్ఞాన శాకుంతలం, మాళవికాగ్నిమిత్రం, రత్నావళి, హరిశ్చంద్ర, ప్రబోధ చంద్రోదయం.
 

పౌరాణిక గ్రంథాలు: సత్యవతి చరిత్ర, చంద్రమతి, దశకుమార చరిత్ర అనే గ్రంథాలను రచించారు.


చారిత్రక గ్రంథాలు: ఏసుక్రీస్తు చరిత్ర, విక్టోరియా రాణి చరిత్ర, ఆంధ్ర కవుల చరిత్ర.


నవలలు: అలీవర్‌ గోల్డ్‌ స్మిత్‌ రాసిన ‘వికార్‌ ఆఫ్‌ వేక్‌ ఫీల్డ్‌’ గ్రంథం ఆధారంగా వీరేశలింగం ‘రాజశేఖర చరిత్ర’ అనే నవలను రచించారు. దీన్ని ‘Fortune of Wheels’ పేరుతో ఆంగ్లంలోకి అనువదించారు. తెలుగు నుంచి ఆంగ్లంలోకి అనువదించిన తొలి నవల ఇదే.

* లంకాద్వీపం, అడుమలయాళం అనే రెండు భాగాలతో సత్యరాజా పూర్వదేశ యాత్రలు అనే పేరుతో హాస్య నవలను రచించారు. స్విఫ్ట్‌ రాసిన గలివర్‌ ట్రావెల్స్‌ గ్రంథం దీనికి ఆధారం.

ఆంగ్లం నుంచి తెలుగులోకి అనువదించిన  వీరేశలింగం గ్రంథాలు:

1. Comedy of Errors -  చమత్కార రత్నావళి

2.  Sheridens duese  - రాగమంజరి

3. Dorivals - కల్యాణ కల్పవల్లి

4. Cowpers Jungism - దుర్మార్గపు చరిత్ర

* బ్రిటిష్‌ ప్రభుత్వం ఈయనకు ‘రావు బహద్దూర్‌’ అనే బిరుదును ఇచ్చింది. 

* 1919, మే 27న కొమర్రాజు లక్ష్మణరావు నివాస గృహం (వేద నివాసం)లో వీరేశలింగం మరణించారు. ఈయన సమాధిని రాజమండ్రిలోని స్వగృషంలో నిర్మించారు.

* ఈయన ఆంధ్ర సంస్కరణ ఉద్యమ పితామహ, ఆంధ్ర పునర్వికాస పితామహ, ఆంధ్ర వైతాళికుడు, గద్య తిక్కన, యుగకర్త, గద్య వాజ్మయ బ్రహ్మ అనే బిరుదులు పొందారు.

* ఎం.జి.రనడే అనే సంఘసంస్కర్త వీరేశలింగానికి ‘దక్షిణ భారత దేశ విద్యాసాగరుడు’ అనే బిరుదును ఇచ్చారు.

* ఈ విధంగా కందుకూరి వీరేశలింగం ఆంధ్ర సమాజంలో నూతన ఒరవడిని సృష్టించారు. ఈయన పుట్టినరోజును ‘తెలుగు నాటక రంగ దినోత్సవం’గా జరుపుకుంటారు.


వితంతు పునర్వివాహం

బాల్య వివాహాలకు వ్యతిరేకించారు. కుల నిర్మూలనకు ఎంతో కృషి చేశారు. వేశ్యా వ్యవస్థకు వ్యతిరేకంగా ‘వివేకవర్ధిని’లో అనేక వ్యాసాలు ప్రచురించారు. ఆయన చేపట్టిన వితంతు పునర్వివాహాలు ఆ రోజుల్లో సంచలనం సృష్టించాయి. ఈ దురాచారాన్ని రూపుమాపడానికి 1881, డిసెంబరు 11న తన ఇంట్లోనే మొట్టమొదటి వితంతు వివాహం చేశారు.

* తిరువూరు తాలూకా రేవూడికి చెందిన 9 ఏళ్ల బాలవితంతువు గౌరమ్మకు, గోగులపాటి శ్రీరాములుతో వివాహం జరిపించారు. ఇది ఆందోళనలకు దారితీసింది. పెళ్లిలో పాల్గొన్న వారిని సమాజం నుంచి వెలేశారు. దీని తర్వాత సుమారు 40 వితంతు వివాహాలు చేశారు. వీటికి పైడా రామకృష్ణయ్య ధన సహాయం చేశారు. ఈయన కాకినాడలో వ్యాపారి.

* కందుకూరి వీరేశలింగం చేపట్టిన కార్యక్రమాలకు ఆయన మిత్రులైన పైడా రామకృష్ణయ్య, ఆత్మూరి లక్ష్మీ నరసింహం, బసవరాజు గవర్రాజు, విద్యార్థులు అండగా ఉండేవారు.

* ఆయన స్త్రీల కోసం సతీహితబోధిని అనే పత్రికను నడిపారు. వితంతు శరణాలయాన్ని స్థాపించారు. స్త్రీ విద్య కోసం 1874లో ధవళేశ్వరంలో బాలికల పాఠశాలను నెలకొల్పారు. మల్లాది అచ్చనశాస్త్రి  దీనికి మొదటి ప్రధానోపాధ్యాయులుగా వ్యవహరించారు. పిఠాపురం రాజా ఇచ్చిన రూ.పదివేలతో స్త్రీ విద్య

కోసం రాజమండ్రిలో ఒక ఉన్నత పాఠశాలను స్థాపించారు. 

* సమాజంలోని దురాచారాలను రూపుమాపి, తన భావాలను ప్రచారం చేయడానికి ‘వివేకవర్ధిని’ అనే పత్రికను ప్రారంభించారు. దీని ప్రధాన లక్ష్యాలు సమాజంలోని రుగ్మతలను, ప్రభుత్వ వ్యవస్థలోని అవినీతిని ఎత్తి చూపడం, దురాచారాల నిర్మూలన.

* హాస్య సంజీవిని (1876) అనే హాస్య పత్రికను ప్రారంభించారు. తెలుగులో మొదటి ప్రహసనాన్ని ఇందులోనే ప్రచురించారు. వ్యంగ్య రూపకాలనూ అచ్చువేశారు.

* సమాజసేవ కోసం 1905లో ‘హితకారిణి’ అనే ధర్మ సంస్థను స్థాపించి తన ఆస్తిని దానం చేశారు.

* యుగకర్తగా పేరొంది, గద్య తిక్కన అనే బిరుదుపొందారు.


స్త్రీల పట్ల సానుభూతి

* 1887లో రాజమండ్రిలో సంఘ సంస్కరణ సమాజాన్ని స్థాపించారు. దీనిద్వారా స్త్రీల స్థితిగతులను మెరుగుపరచడానికి, వారి దుస్థితిని తొలగించడానికి నిర్విరామంగా కృషి చేశారు. బాల్యవివాహాలు, కన్యాశుల్కం, వరకట్నం, భోగం వారికి కట్నాలు ఇవ్వడం మొదలైన దురాచారాలను తీవ్రంగా వ్యతిరేకించారు.


సాహిత్యసేవ

సంఘసేవకే కాకుండా  వీరేశలింగం సాహిత్యానికీ ఎనలేని సేవ చేశారు. చదువుకునే రోజుల నుంచే వ్యాసాలు రాయడం, వ్యవహారిక భాషలో రచనలు చేయడాన్ని అలవరుచుకున్నారు. 130కి పైగా గ్రంథాలు రాశారు. వ్యవహారిక భాషలో రచనలు చేసిన ప్రథమ రచయితల్లో ఈయన ఒకరు. 

* ఆంగ్ల, సంస్కృత గ్రంథాలను తెలుగులోకి అనువదించారు. నీతిచంద్రిక (తెలుగు పంచతంత్రం)లోని సంధి, విగ్రహ భాగాలను పరవస్తు చిన్నయసూరి వదిలేయగా వీరేశలింగం పూర్తిచేశారు.
 

ఇతర విశేషాలు...

* స్త్రీ విద్యను ప్రోత్సహించడానికి వివేకవర్ధిని (1874), స్త్రీజనోద్ధరణ కోసం సతీహిత బోధిని (1883), సత్యసంవర్ధిని, సత్యదూత, చింతామణి, తెలుగు జనానా (1904), సత్యవాదిని (1905) పత్రికలను నిర్వహించారు. 

* వివేకవర్ధినికి శాశ్వత చందాదారుడిగా ఇ.పి.మెట్కాఫ్‌ అనే ఆంగ్లేయుడు సభ్యత్వం తీసుకున్నారు. దీనికి చందాదారుడిగా చేరిన తొలి విదేశీయుడూ ఈయనే.

* రాజమండ్రిలో టౌన్‌హాల్‌ను నిర్మించారు.

* కొక్కొండ వెంకటరత్నం పంతులుకు కందుకూరి వీరేశలింగం సామాజిక సంస్కరణలు నచ్చక తన ‘ఆంధ్రభాషా సంజీవని’ పత్రికలో ‘వీరిగాడు’ అనే పాత్రను సృష్టించి, కందుకూరిని అవహేళన చేశారు. పంతులు దానికి పోటీగా ‘హస్య సంజీవని’ పత్రికలో ‘కొ.కొ.కొ.క్కొండ’ అనే నత్తిపాత్రను సృష్టించి వెంకటరత్నాన్ని విమర్శించారు. వెంకటరత్నం తెలుగులో వెండి అనే పేరుతో సంతాన ఛందస్సును ప్రవేశ పెట్టారు. ఈయనకు మహా మహోపాధ్యాయ అనే బిరుదు ఉంది.

* వీరేశలింగం 1875లో సంఘ సంస్కరణ సమాజాన్ని స్థాపించారు. 

* వితంతు పునర్వివాహ సంఘానికి 1880లో మానింగ్‌ అనే బ్రిటన్‌ మహిళ 50 పౌండ్లను ఇచ్చారు.

* వీరేశలింగం తెలుగు సాహిత్యంలో స్వీయ చరిత్రలు, గద్య, నవలా రచనలు, ప్రకృతి-స్త్రీ రచనలు, ప్రహసన రచనలకు నాంది పలికారు.
 

వీరేశలింగం తర్వాతి యుగం

రఘుపతి వెంకటరత్నం నాయుడు (1862-1939)

* ఈయన్ను ‘దివాన్‌ బహదూర్‌’, ‘సర్‌’ అని పిలిచేవారు.

* విద్యావేత్తగా, సంఘసంస్కర్తగా, బ్రహ్మసమాజ ప్రచారకుడిగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు.

* వెంకటరత్నం నాయుడు 1862, అక్టోబరు 1న మచిలీపట్నం (కృష్ణా జిల్లా)లో జన్మించారు. తల్లిదండ్రులు అప్పాయనాయుడు,  శేషమ్మ. తండ్రి మద్రాస్‌ సైనికదళంలో సుబేదారుగా విధులు నిర్వహించారు. వీరి పూర్వీకులు మద్రాస్, తూర్పు ఇండియా వర్తకసంఘ సైన్యంలో కమాండర్లుగా పనిచేశారు.

* తండ్రి ఉద్యోగరీత్యా వివిధ ప్రాంతాల్లో పనిచేయడం వల్ల ఈయన విద్యాభ్యాసం అనేకచోట్ల జరిగింది. ప్రాథమిక విద్య చంద్రాపూర్‌ (మహారాష్ట్ర)లో, మాధ్యమిక విద్య హైదరాబాద్‌లోని నిజాం ఉన్నత పాఠశాలలో  అఘోరనాథ్‌ ఛటోపాధ్యాయ వద్ద పూర్తిచేశారు.

* మద్రాస్‌ క్రిస్టియన్‌ కాలేజీలో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేశారు. మద్రాస్‌ యూనివర్సిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పట్టా పొందారు.
 

సంఘ సంస్కరణ సేవ: 

19వ శతాబ్దం నాటికి ఆంధ్రాలో అనేక ఆచార సంప్రదాయాలు, సాంఘిక దురాచారాలు ఉండేవి. వాటిని రూపుమాపడానికి వెంకటరత్నం ఎంతో కృషి చేశారు. సమాజం, మతంలోని లోపాలను విమర్శిస్తూ సాంఘిక సంస్కరణలకు పూనుకున్నారు.

* వెంకటరత్నం కాకినాడలో సంఘ సంస్కరణోద్యమాన్ని ప్రచారం చేశారు.

* ఈయన వేశ్యావృత్తిని వ్యతిరేకించారు. అప్పట్లో ‘భోగం’ కులానికి చెందిన స్త్రీలను దేవదాసీలుగా మార్చేవారు. దీన్ని పూర్తిగా రూపుమాపారు. 

* పిల్లల కోసం కాకినాడలో ‘కరుణాలయం’ అనే శరణాలయాన్ని స్థాపించారు. దీనికి పిఠాపురం మహారాజు ఆర్థికసాయం అందించారు. 

* మద్యపానానికి వ్యతిరేకంగా ఉద్యమించారు. ఇది మద్రాస్‌లో ప్రారంభమై ఆంధ్రా అంతటా వ్యాపించింది. 

* కాకినాడలో అనాథ శరణాలయాన్ని, హరిజన బాలికల కోసం వసతి గృహాన్ని ఏర్పాటు చేశారు. ఆదాయంలో ఎక్కువభాగం పేద విద్యార్థులకే ఖర్చు చేశారు.

* దేవేంద్రనాథ్‌ ఠాగూర్, కేశవ్‌ చంద్రసేన్‌ల వల్ల బ్రహ్మసమాజ సాహిత్యానికి ఆకర్షితుడై 1885లో బ్రహ్మసమాజంలో చేరారు.

* 189495లో విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ, ఏలూరు ప్రాంతాల్లో బ్రహ్మసమాజ సిద్ధాంతాలపై అనేక ఉపన్యాసాలు ఇచ్చారు.

*  పిఠాపురం రాజా సహకారంతో కాకినాడలో బ్రహ్మోపాసన మందిరాన్ని నిర్మించారు. ఇవే కాకుండా ధర్మ ప్రచారక నిధి, ఆంధ్ర బ్రహ్మ అనే సంస్థలను స్థాపించారు.

* బెంగాల్‌ భాషలోని బ్రహ్మసమాజ గ్రంథాలను తెలుగులోకి అనువదించేందుకు   పిఠాపురం రాజా బ్రహ్మప్రచారకులకు లక్షరూపాయల మూలధనంతో ఒక నిధిని కేటాయించారు.

* 1891లో ‘సాంఘిక శుద్ధి' (Social Purity Association)' అనే సమాజాన్ని స్థాపించారు. నిజాయతీగల పౌరులను తయారుచేయడం దీని లక్ష్యం.

* వితంతు పునర్వివాహాలను ప్రోత్సహించారు.

* 1932లో బ్రహ్మసమాజం ఈయనకు ‘బ్రహ్మర్షి’ అనే బిరుదు ఇచ్చింది.

* కందుకూరి వీరేశలింగం, రఘుపతి వెంకటరత్నం నాయుడు, దేశిరాజు పెదబాపయ్యలను ‘బ్రహ్మసమాజ త్రయం’గా పిలుస్తారు.

* ఈయన ‘బ్రహ్మప్రకాశిక’, ‘ఫెల్లోవర్కర్‌’, ‘పీపుల్స్‌ ఫ్రెండ్‌’ అనే పత్రికలను స్థాపించారు. ఇవి సాంఘిక సంస్కరణకు, దేవదాసీ వ్యవస్థ నిర్మూలనకు దోహదం చేశాయి.

* ఈయనకు 1884లో వివాహం జరిగింది. 1889లో భార్య మరణించినా, పునర్వివాహం చేసుకోకుండా తెల్ల దుస్తులు ధరించారు. అందుకే ఆయన్ను ‘శ్వేతాంబర రుషి’ అని పిలిచేవారు.


విద్య కోసం కృషి- సంస్కరణలు: 

* William words worth, ఎమర్సర్, Mincobert వంటి ఆంగ్లకవులకు వెంకటరత్నం ఆకర్షితులయ్యారు.

* మద్రాసులోని పుచ్చయప్ప కళాశాలలో ఆంగ్ల ఆచార్యునిగా మొదలుపెటి, 1899-1904 వరకు సికింద్రాబాద్‌ మహబూబ్, ముంబయి కాలేజీల్లో పనిచేశారు.

* 1904లో కాకినాడలోని పిఠాపురం రాజా కళాశాలకు(పి.ఆర్‌.కళాశాల) ప్రిన్సిపాల్‌గా చేశారు.

* 1911లో మొదటిసారిగా మహిళలను కళాశాలలో చేర్చుకుని సహవిద్యను ప్రోత్సహించారు.

* 1925-28లలో మద్రాస్‌ విశ్వవిద్యాలయ ఉపకులపతి(వైస్‌ఛాన్సలర్‌)గా వ్యవహరించారు.

* మద్రాస్‌ విశ్వవిద్యాలయ ఉపకులపతిగా పనిచేసిన మొదటి ఆంధ్రుడుగా నాయుడు ప్రసిద్ధి చెందారు.

* ఆంధ్ర విశ్వవిద్యాలయ స్థాపన బిల్లు(ఆంధ్ర విశ్వకళా పరిషత్‌)ను రూపొందించి శాసనసభలో ఆమోదింపజేశారు. ఈ విశ్వవిద్యాలయానికి వి.సి.గా పనిచేశారు.

* విజ్ఞానాభివృద్ధికి తన గురువైన డాృృ మిల్లర్‌ పేరిట మద్రాస్‌ విశ్వవిద్యాలయంలో 10వేల రూపాయలతో ఒక నిధిని ఏర్పాటు చేశారు.

* 1923లో మద్రాస్‌ శాసన మండలి సభ్యునిగా ఉన్నప్పుడు, మద్యపాన నిషేధం బిల్లు ఆమోదం కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు.

* 1924లో బ్రిటిష్‌ ప్రభుత్వం నుంచి విద్య, సంఘ సంస్కరణ కృషికి ‘నైట్‌హుడ్‌’ పురస్కారాన్ని పొందారు. ఒక అనధికార విద్యావేత్తకు ఈ బిరుదు దక్కడం ఇదే ప్రథమం.

* 1927లో ఆంధ్ర విశ్వకళాపరిషత్‌ మొదటి స్నాతకోత్సవంలో గౌరవ డాక్టరేట్‌ అందుకున్నారు.

* భాషావేత్తలకు డాక్టరేట్‌ డిగ్రీలను ఇచ్చే సంప్రదాయాన్ని మొదటగా నాయుడు ప్రారంభించగా, అది నేటికీ కొనసాగుతోంది.

* తమిళ సాహిత్యంలో డాక్టరేట్‌ అందుకున్న మొదటి వ్యక్తిగా స్వామినాథ్‌ అయ్యర్‌ గుర్తింపు పొందారు.

* రఘుపతి వెంకటరత్నం నాయుడు అపర సోక్రటీస్, కులపతి, కైజర్‌-ఇ-హింద్‌’ అనే బిరుదులు కూడా ఉన్నాయి.

* ఉర్దూ, పర్షియన్, హిందీ భాషలలో కూడా మంచి ప్రావీణ్యం పొందారు.

* ‘సాంఘిక సంస్కరణ’ అనే గ్రంథం రచించారు.

* గురు-శిష్యుల జంటగా నాయుడుని- వేమూరి రామక్రిష్ణారావులను పేర్కొంటారు.

* రఘుపతి వెంకటరత్నం సోదరుడు - రఘుపతి వెంకయ్యనాయుడు. ఇతను ఆంధ్రాలో ప్రముఖ సినీ నిర్మాతగా, పంపిణీదారుగా పేరొందారు.

* వెంకటరత్నం గౌరవార్థం ఆయన విగ్రహాన్ని హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై నెలకొల్పారు.

* ఆంధ్రదేశ సాంఘిక వైతాళికులలో అగ్రగణ్యుడుగా నిలిచారు.

* 1939 మే 26న, 76 సంవత్సరాల వయసులో మరణించారు.


 దేశిరాజు పెదబాపయ్య (1877-1903)

* ఈయన 1877లో మచిలీపట్నంలో జన్మించారు. 

* కందుకూరి వీరేశలింగానికి ఆత్మబంధువుగా ఈయన్ను పేర్కొంటారు. 

* స్త్రీ విద్యను, వితంతు పునర్వివాహాలను ప్రోత్సహించారు. 

* బ్రహ్మసమాజ సిద్ధాంతాల పట్ల ప్రభావితుడై, సంఘ సంస్కరణకు కృషి చేశారు.

* ‘వాయిస్‌ ఆఫ్‌ ట్రూత్‌’ అనే పత్రికను నడిపారు. 

* టెంపరెన్స్‌ సోషల్‌ ప్యూరిటీ, యంగ్‌ మెన్స్‌ ప్రియర్‌ యూనియన్‌’ సంస్థలను స్థాపించారు. 


వేమూరి రామకృష్ణారావు (1876-1939)

* ఈయన రఘుపతి వెంకటరత్నం నాయుడు శిష్యుడు. వెంకటరత్నం ఈయన్ను తన నీడగా అభివర్ణించారు.

* వెంకటరత్నం ప్రవచనాలను, అధ్యక్షోపన్యాసాలను, ఉపన్యాసాలను 8 వాల్యూమ్స్‌గా ప్రచురించారు.


వావిళ్ల రామస్వామి శాస్త్రులు (1812-91)

* ఈయన 1812లో నెల్లూరులోని విదవలూర్‌లో జన్మించారు.

* ‘సరస్వతి ముద్రాలయం’ అనే తెలుగు పబ్లిషింగ్‌ హౌస్‌ను స్థాపించారు. తర్వాత, దీని పేరు ‘వావిళ్ల ప్రెస్‌’గా  మార్చారు.

* 1854లో చెన్నపట్నంలో ‘హిందూ భాషా సంజీవని’ పేరుతో మరో ప్రెస్‌ను స్థాపించారు. ఇది తెలుగులో ఏర్పాటైన మొదటి ప్రింటింగ్‌ ప్రెస్‌.

* ఈయన 50కి పైగా తెలుగు, సంస్కృత గ్రంథాలను ముద్రించారు.

* 1860లో ‘ది గ్రేట్‌ ప్రైమర్‌’ అనే టైప్‌ రైటింగ్‌ను రూపొందించారు.

* తెలుగు భాషకు ఈయన చేసిన కృషికి సి.పి. బ్రౌన్‌ అభినందించారు. 

* ‘ఆది సరస్వతి నిలయం’ అనే సంస్థను స్థాపించారు.

* రామస్వామి అనంతరం ఆయన కుటుంబసభ్యులు ఈ ప్రెస్‌ను కొనసాగించారు.

కందుకూరి వీరేశలింగం పంతులు యుగం తర్వాత 19, 20 శతాబ్దాల్లో ఆంధ్రాలో సామాజిక రుగ్మతలకు వ్యతిరేకంగా అనేక మంది పోరాటం చేశారు. వారిలో గురజాడ వెంకట అప్పారావు ముఖ్యులు. 

గురజాడ అప్పారావు (1862-1915)

* ఈయన 1862, సెప్టెంబరు 21న విశాఖపట్నం జిల్లా యలమంచిలి తాలుకా ఎస్‌ రాయవరంలో జన్మించారు. తల్లిదండ్రులు వెంకట రామదాసు, కౌసల్యమ్మ.  

* ప్రముఖ రచయిత, మహాకవి, సాహితీవేత్త, సంఘసంస్కర్త, హేతువాది, అభ్యుదయ వాదిగా గుర్తింపు పొందారు.

* తన రచనల ద్వారా సమాజంలో మార్పు తెచ్చేందుకు ప్రయత్నించారు. తెలుగు వ్యాసాంగాన్ని సంప్రదాయ శైలి నుంచి ఆధునిక శైలికి మార్చారు.

* ఈయన పూర్వీకులది కృష్ణా జిల్లా గురజాడ గ్రామం. అందుకే వీరి ఇంటిపేరు గురజాడగా మారింది. తర్వాత విశాఖపట్నానికి వలస వచ్చారు.

* వెంకట రామదాసు విజయనగర సంస్థానంలో వివిధ హోదాల్లో పనిచేశారు.

* అప్పారావు తన పదేళ్ల వయసు వరకు చీపురుపల్లిలో విద్యాభ్యాసాన్ని కొనసాగించారు. తర్వాత ఎం.ఆర్‌.కాలేజీ ప్రిన్సిపల్‌ సి.చంద్రశేఖర శాస్త్రి ప్రోత్సాహంతో ఉన్నత విద్యను అభ్యసించారు. 

* 1882లో మెట్రిక్యులేషన్, 1884లో ఎఫ్‌ఏ పూర్తిచేసి ఎం.ఆర్‌. హైస్కూల్‌లో ఉపాధ్యాయుడిగా చేరారు.

* విజయనగరంలో బీఏ పూర్తి చేశారు. అక్కడే వాడుకభాష/ వ్యవహారిక భాషోద్యమ నాయకుడు గిడుగు రామ్మూర్తి పంతులుతో పరిచయం ఏర్పడింది.

* 1885లో నరసమ్మతో వివాహం జరిగింది.

* 1889లో ఆనంద గజపతి డిబేటింగ్‌ క్లబ్‌కు ఉపాధ్యక్షుడిగా వ్యవహరించారు. 1891లో విజయనగర సంస్థానంలో శాసన పరిశోధకుడిగా పనిచేశారు.

* 1886లో డిప్యూటీ కలెక్టర్‌ హెడ్‌ ఆఫీస్‌లో హెడ్‌ క్లర్క్‌గా; 1887లో మహారాజ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేశారు. 

* 1887లో విజయనగరంలో జరిగిన కాంగ్రెస్‌ పార్టీ సమావేశంలో పాల్గొని సామాజిక చైతన్యం, సమాజం ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రసంగించారు. 

* విశాఖపట్నం వాలంటరీ సర్వీసుల్లో చేరారు.

* 1882లో మొదటిసారిగా ‘ది - కాకు’ అనే కవితను రాశారు. ‘ఇండియన్‌ లీజర్‌  అవర్‌’ పత్రిక దీన్ని ప్రచురించింది. 

* ఆనంద గజపతి మరణించాక, ఆయన సోదరి దేవా మహారాణి అప్పల కొండాయమ్మ వద్ద ఆంతరంగిక కార్యదర్శిగా పనిచేశారు. ఆమె అభీష్టం మేరకు 1907లో నీలగిరి పాటలను రచించారు.

* గురజాడ తన తమ్ముడు శ్యామలరావుతో కలిసి ఆంగ్ల పద్యాలను రాశారు. ‘సారంగధర’ (1883) కవిత వీరికి మంచి పేరు తెచ్చింది. ఇది ఇండియన్‌ లీజర్‌ అవర్‌ పత్రిక విజయనగరం ఎడిషన్‌లో అచ్చయ్యింది. ఆ సమయంలో దీని సంపాదకులుగా గుండుకుర్తి వెంకట రమణయ్య ఉన్నారు.

* 1896లో ‘ప్రకాశిక’ పత్రికను ప్రారంభించారు.

* 1910లో ‘దేశమును ప్రేమించుమన్నా.. మంచి అన్నది పెంచుమన్నా’ అనే ప్రముఖ గేయాన్ని రచించారు.

* 1911లో మద్రాస్‌ యూనివర్సిటీ బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌లో సభ్యత్వం పొందారు.

* గురజాడ తన స్నేహితులతో కలిసి ‘ఆంధ్రాసాహిత్య పరిషత్‌’ను ప్రారంభించారు.

* 20వ శతాబ్దం తొలినాళ్లలో గిడుగు రామ్మూర్తి పంతులుతో కలిసి వ్యవహారిక భాషోద్యమంలో పాల్గొన్నారు. 

* 1913లో అప్పారావు అధ్యాపకుడిగా పదవీ విరమణ చేశారు. 

* 1915, నవంబరు 30న 53 ఏళ్ల వయసులో మరణించారు. ఈ సందర్భంగా దేవులపల్లి కృష్ణశాస్త్రి ‘ఆయన చనిపోలేదు, జీవించడం ప్రారంభించారు’ అని వ్యాఖ్యానించారు.

* మద్రాస్‌ విశ్వవిద్యాలయం అప్పారావును ‘ఫెల్లో’ బిరుదుతో సత్కరించింది.


రచనలు

కన్యాశుల్కం: ఆంధ్రా ప్రాంతంలో ముఖ్యంగా విజయనగర సంస్థానంలో కన్యాశుల్కం, వేశ్యావృత్తి, బాల్యవివాహాలు లాంటి సాంఘిక దురాచారాలు ఎక్కువగా ఉండేవి. వీటికి వ్యతిరేకంగా  కన్యాశుల్కం పేరుతో గురజాడ తెలుగు వాడుక భాషలో నాటకాన్ని రచించారు. ఆంధ్రా ప్రాంతంలో తొలి సాంఘిక వచన

నాటకం ఇదే. దీన్ని విజయనగరం రాజైన ఆనంద గజపతికి అంకితం ఇచ్చారు. 

* కన్యాశుల్కం నాటకం మొదటి కూర్పు 1897లో జరిగింది. దీన్ని అయిదు అంకాలు, 132 రంగాలు, 109 పేజీలతో పూర్తిచేశారు.

* శూద్రకుడు రచించిన మృచ్ఛకటికం (సంస్కృత నాటకం) స్ఫూర్తితో గురజాడ కన్యాశుల్కాన్ని రచించారు. ఇందులోని శకారునితో గిరీశం పాత్రను; వసంత సేనతో మధురవాణి పాత్రను సృష్టించారు. ఈ నాటకంలో శ్రీకాకుళం మాండలికాన్ని తొలిసారి వాడారు. 

* ఈ నాటకం రెండో కూర్పు 1909లో ఉదక మండలంలో జరిగింది. ఇందులో ఏడు అంకాలు, 133 రంగాలు, 199 పేజీలు ఉన్నాయి. 

* ఈ నాటకాన్ని మొదట 1892లో జగన్నాథ విలాసిని సంస్థ ప్రదర్శించింది. 

* ఈ నాటకంలో సత్యకాలపు వితంతువుగా బుచ్చమ్మ, సంస్కారం ఉన్న వేశ్యగా మధురవాణి, చదువుకున్న వంచకుడిగా గిరీశం, ఛందస్సు పండితుడిగా అగ్నిహోత్రావధానులు, సంస్కర్తగా సౌజన్యరావు, ఢాంబికుడిగా రామప్ప పంతులు మొదలైన పాత్రలు ఉన్నాయి.

* కట్టమంచి రామలింగా రెడ్డి, అబ్బూరి రామకృష్ణారావు ఈ నాటకాన్ని మహాకావ్యంగా, ఆంధ్రా సాహిత్యంలో శాశ్వత స్థానం పొందిందని వ్యాఖ్యానించారు.

* గిడుగు రామ్మూర్తి పంతులు, కాశీభట్ల బ్రహ్మయ్య శాస్త్రి ఈ నాటకం విలువలను ఎంతో ప్రశంసించారు.

* 1897లో కన్యాశుల్కం నాటకాన్ని వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్‌ సన్స్‌ (మద్రాస్‌) వారు ప్రచురించారు.

* కన్యాశుల్కం నాటకాన్ని కన్నడ, తమిళం, హిందీ, ఫ్రెంచ్, రష్యన్, ఆంగ్ల (రెండుసార్లు) భాషల్లోకి అనువదించారు.

* 100 ప్రదర్శనలు పూర్తిచేసుకున్న మొదటి  తెలుగు సాంఘిక నాటకం ఇదే.

* గురజాడ అప్పారావు రాసిన కన్యాశుల్కం నాటకానికి సాటి వచ్చే రచన భారతీయ సాహిత్యంతో మృచ్ఛకటికం తప్ప మరొకటి లేదని శ్రీశ్రీ వ్యాఖ్యానించారు. ఇది బీభత్సరస ప్రధాన విషాదాంత నాటకమని పేర్కొన్నారు.

* ‘పుత్తడి బొమ్మ పూర్ణమ్మ’ అనే సుప్రసిద్ధ గేయాన్ని గురజాడ రాశారు. ఇందులోని ఇతివృత్తం కూడా కన్యాశుల్కమే. ఇందులో బాల్యవివాహ వ్యవస్థ వల్ల జరిగే అనర్థాలను వివరించారు.

* కొండుభట్టీయం, ముత్యాలసరాలు (1910), కన్యక, సత్యవతి శతకం, సుభద్ర, లంగరెత్తుము (1915), దించులంగరు (1914), లవణరాజు కల, కథానికలు, సౌదామిని, మీపేరేమిటి, దిద్దుబాటు, మెటిల్డా, సంస్కర్త హృదయం, మతం-విమతం, పుష్పాలవికలు మొదలైన రచనలు చేశారు. 

* తెలుగు సాహిత్యంలో ముత్యాలసరాలు అనే నూతన ఛందస్సును ప్రవేశపెట్టారు.

* ‘బిల్హణీయం’ అనే గ్రంథం అసంపూర్ణ రచనగా మిగిలింది.

* కొండుభట్టీయం అనే గ్రంథంలో గిరీశం పాత్రను రెండోసారి ప్రవేశపెట్టారు.

* లవణరాజు కల అనే కథలో కుల వ్యవస్థను ఖండించారు.

* దిద్దుబాటు, సంస్కర్త హృదయం రచనల్లో వేశ్యావృత్తిని వివరించారు.

* చారిత్రక గ్రంథాలైన పూసపాటి గజపతుల చరిత్ర, విశాఖ చాళుక్యుల చరిత్ర, కళింగరాజుల చరిత్ర మొదలైనవి ఈయన రచనలే.
 


చిలకమర్తి లక్ష్మీనరసింహం (1867-1940)

* ఈయన 1867, సెప్టెంబరు 26న పశ్చిమ గోదావరి జిల్లా పెరవలి మండలం ఖండవల్లిలో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. తండ్రి వెంకయ్య, తల్లి రత్నమ్మ.

* నరసాపురం, రాజమండ్రిలో విద్యాభ్యాసాన్ని కొనసాగించారు. 

* సంఘ సంస్కరణలో కేశవ చంద్రసేన్, ఎం.జి.రనడే లాంటి వారి నుంచి స్ఫూర్తి పొందారు.

* కవిగా, రచయితగా, నాటకకర్తగా, పాత్రికేయుడిగా, సంఘ సంస్కరణవాదిగా, విద్యావేత్తగా, సాహిత్యకారుడిగా, దేశభక్తుడిగా, స్వాతంత్య్ర సమరయోధుడిగా గుర్తింపు పొందారు.

* 1889లో రాజమండ్రిలోని ఆర్య పాఠశాలలో, ఇన్నీసుపేట మున్సిపల్‌ స్కూల్‌లో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేశారు.

* 1899లో హిందూ లోయర్‌ సెకండరీ పాఠశాలను స్థాపించారు. తర్వాత దీన్ని వీరేశలింగం ఉన్నత పాఠశాలగా మార్చారు.

* 30 ఏళ్ల వయసులో ఈయనకు రేచీకటి వ్యాధి వచ్చింది.

రచనలు: 1889లో మొదటిసారి ‘కీచకవధ’ అనే నాటకాన్ని రచించారు. 188990 మధ్య కాలంలో  ద్రౌపది పరిణయం, గయోపాఖ్యానం, శ్రీరామజననం, సీతాకల్యాణం, పారిజాతాపహరణం లాంటి నాటకాలు రాశారు. 1922లో చతుర చంద్రహాసం అనే రచన చేశారు.

నవలలు: రామచంద్ర విజయం (1894), హేమలత (1896), అహల్యాబాయి (1897), సుధా శరచ్ఛంద్రం, సౌందర్య తిలక (1898-1900), పార్వతీ పరిణయం.

* ఈయన రాసిన గణపతి అనే హాస్య నవల బాగా ప్రాచుర్యం పొందింది. 

* 1893లో న్యాపతి సుబ్బారావు నిర్వహించిన పోటీల్లో రామచంద్ర విజయం ఉత్తమ నవలగా ఎంపికైంది. సుబ్బారావు నిర్వహించిన చింతామణి పత్రికలో హేమలత, గణపతి, అహల్యాబాయి నవలలు ప్రచురితమయ్యాయి.

* కల్నల్‌ టాడ్‌ రాసిన రాజస్థాన్‌ కథాకళిని చిలకమర్తి తెలుగులోకి అనువదించారు. ఇది ఒక చారిత్రక గ్రంథం.

* లులాయి అనే శతకాన్ని రచించారు.

* పోలవరం జమీందారు స్థాపించిన సరస్వతి పత్రికకు సంపాదకులుగా పనిచేశారు.

* 1906లో మనోహర, 1907లో దేశమాత పత్రికలను నడిపారు.


సంఘసంస్కర్తగా..: 

* 1909లో సామాజికంగా వెనుకబడిన వర్గాల కోసం ఒక పాఠశాలను స్థాపించారు. నిమ్నవర్గాల వారి కోసం మరో హరిజన పాఠశాలను నెలకొల్పారు.

* బ్రహ్మసమాజం, హితకారిణి నిర్వహించే సమాజ కార్యక్రమాల్లో పాల్గొనేవారు.

* దేశమాత అనే వారపత్రిక ద్వారా బ్రిటిష్‌ పాలనకు వ్యతిరేకంగా వ్యాసాలు రాశారు.

* దళితులకు చేసిన సేవలకు అప్పటి మద్రాస్‌ గవర్నర్‌ లార్డ్‌ పెంట్‌లాండ్‌ ఈయన్ను ప్రశంసించారు.

* పండిత శివనాథ శాస్త్రి ఈయన్ను ‘లోకల్‌ షేక్‌స్పియర్‌’ అని ప్రశంసించారు. ‘చిలకమర్తిది ఫొటోజెనిక్‌ మెమొరీ’ అని వాసురాయ కవి పేర్కొన్నారు.

* చిలకమర్తి రాసిన ‘గయోపాఖ్యానం’ నాటకం ప్రతులు లక్షకు పైగా అమ్ముడయ్యాయి.

* స్వాతంత్రోద్యమ సమయంలో ఈయన ‘భరత ఖండంబు చక్కని పాడియావు హిందువులు లేగదూడలై ఏడ్చుచుండ’  అనే గేయాన్ని రాశారు. ఇది బాగా ప్రాచుర్యం పొందింది.

* 21 అధ్యాయాలతో చిలకమర్తి లక్ష్మీనరసింహం స్వీయచరిత్ర రాసుకున్నారు. ఆయన రచనలు 10 సంపుటాలుగా ప్రచురితమయ్యాయి.

* 1907, ఏప్రిల్‌ 19న రాజమండ్రిలో జరిగిన సభలో బిపిన్‌ చంద్రపాల్‌ ఆంగ్ల ఉపన్యాసాలను తెలుగులోకి అనువదించారు.

* చతురకవి, ఆంధ్రా స్కాట్, ఆంధ్రుల అంధకవి అనే బిరుదులు పొందారు.

* ఆంధ్రా తొలి తెలుగు జాతీయకవిగా చిలకమర్తి గుర్తింపు పొందారు.

* ఈయన 1940, జూన్‌ 17న మరణించారు.

* 1943లో ఆంధ్రా విశ్వవిద్యాలయం ‘కళాప్రపూర్ణ’ పురస్కారంతో ఈయన్ను సత్కరించింది.
 

మాదిరి ప్రశ్నలు

1. ‘కరుణాలయం’ అనే శరణాలయాన్ని స్థాపించింది ఎవరు?

1) వీరేశలింగం పంతులు     2) రఘుపతి వెంకటరత్నం నాయుడు

3) వీరస్వామి        4) ఎవరూకాదు

2. ‘సాంఘిక శుద్ధి’ అనే సమాజాన్ని స్థాపించింది ఎవరు?

1) రఘుపతి వెంకటరత్నం నాయుడు     2) అనంత రామశాస్త్రి

3) వీరేశలింగం       4) వీరసామయ్య

3. ‘బ్రహ్మర్షి’ అనే బిరుదు ఎవరికి ఉంది?

1) వీరసామయ్య      2) లక్ష్మీ నరసింహం     3) వీరేశలింగం       4) రఘుపతి వెంకటరత్నం నాయుడు

4. కింది ఎవరిని బ్రహ్మసమాజ త్రయంగా పిలుస్తారు?

1) కందుకూరి వీరేశలింగం, రఘుపతి వెంకటరత్నం నాయుడు, దేశిరాజు పెదబాపయ్య

2) లక్ష్మీ నరసింహం, కందుకూరి వీరేశలింగం, దేశిరాజు పెదబాపయ్య

3) సామినేని ముద్దు నరసింహం, అనంత రామశాస్త్రి, కందుకూరి వీరేశలింగం

4) ఎవరూకాదు


 

5. శ్వేతాంబర రుషి అని ఎవరిని పిలుస్తారు?

1) వీరేశలింగం పంతులు         2) గాజుల లక్ష్మీనరసుశెట్టి

3) దేశీరాజు పెదబాపయ్య         4) రఘుపతి వెంకటరత్నం




6. బ్రహ్మ ప్రకాశిక, ఫెల్లో వర్కర్, పీపుల్స్‌ ఫ్రెండ్‌ పత్రికలను స్థాపించిన వారు?

1) దేశిరాజు పెదబాపయ్య           2) వీరేశలింగం

3) రఘుపతి వెంకటరత్నం నాయుడు      4) శ్రీనివాస పిళ్లై




7. మద్రాస్‌ విశ్వవిద్యాలయ ఉపకులపతిగా పనిచేసిన మొదటి ఆంధ్రుడు? 

1) రఘుపతి వెంకటరత్నం నాయుడు      2) అనంత రామశాస్త్రి

3) వీరేశలింగం పంతులు      4) శివనాథ శాస్త్రి


సమాధానాలు: 1-2;  2-1;  3-4;  4-1; 5-4;  6-3;  7-1.

Posted Date : 05-08-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌