• facebook
  • whatsapp
  • telegram

ఘన వ్యర్థ కాలుష్యం - నిర్వహణ

పోగుపడే వ్యర్థాలతో పొంచి ఉన్న ప్రమాదాలు!

 పర్యావరణ వ్యవస్థకు, మనిషి ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారిన వాటిలో ఘన వ్యర్థ కాలుష్యం ఒకటి. అభివృద్ధి పోకడలు, వస్తు వినియోగం, ఆహార వృథాతో వ్యర్థాలూ పెరిగిపోతున్నాయి. గాలి, నీరు, నేలలను కలుషితం చేస్తున్నాయి. పరిసరాలు దెబ్బతినడానికి, అంటువ్యాధులు ప్రబలడానికి ఈ పరిణామమే ప్రధాన కారణం. ప్లాస్టిక్, విద్యుత్తు, ఎలక్ట్రానిక్‌ వ్యర్థాల వంటివి మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థలకు సవాలు విసురుతున్నాయి. సమస్త జీవజాలానికి సమస్యలు సృష్టిస్తున్న ఈ ఘన వ్యర్థాలు, వాటి మూలాలు, రకాలను అభ్యర్థులు తెలుసుకోవాలి. వాటి నిర్వహణ, దుష్ప్రభావాలను తగ్గించగలిగే శాస్త్రీయ విధానాల గురించి అవగాహన పెంచుకోవాలి.

ప్రజల జీవన ప్రమాణాలు పెరిగి, ఆధునిక జీవనశైలి అలవరుచుకుంటున్నారు. దాంతో వస్తు వినియోగం అధికమైంది. ‘ఉపయోగించు-పారవేయు’ పద్ధతిలోనే వస్తువులను తయారు చేస్తుండటంతో వాటి ఉత్పత్తి పెరుగుతోంది. ఫలితంగా ఘన వ్యర్థాల సమస్య అంతకంతకూ ఎక్కువవుతోంది. పట్టణ, నగర జనావాసాల్లో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంది. ‘జాతీయ కాలుష్య నియంత్రణ బోర్డు’ నివేదిక ప్రకారం మన దేశంలో రోజుకు సుమారు 1.60 లక్షల టన్నుల వ్యర్థాలు పోగు పడుతున్నాయి. ఇందులో 95.4% సేకరిస్తున్నారు. అత్యధిక వ్యర్థాలు ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లో మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌ తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. నగరాలపరంగా దిల్లీ, ముంబయి, చెన్నై ముందంజలో ఉన్నాయి.


దుష్ప్రభావాలు: ఘనవ్యర్థాల నిర్వహణ సక్రమంగా లేకపోతే అనేక రకాల పర్యావరణ, ఆరోగ్య, ఆర్థికపరమైన దుష్ప్రభావాలు తలెత్తుతాయి.


* ఘనవ్యర్థాలు పోగుపడటం వల్ల భూ, జల వనరులు కలుషితమవుతాయి. ఫ్లోరిన్, పాదరసం, సీసం లాంటి భారలోహ కాలుష్యాలు మానవ ఆహార శృంఖలాల్లో జీవ ఆవర్తనం చెంది ప్రజలు ఫ్లోరోసిస్, డయేరియా, మతిభ్రమించడం లాంటి వ్యాధులకు గురవుతారు.


* ఘనవ్యర్థాలు కుళ్లి గాలి విషవాయువులతో దుర్గంధమై వ్యాధులు సంక్రమిస్తాయి.


* ఘనవ్యర్థాలు పేరుకుపోయి పరిసరాలు సహజ సౌందర్యాన్ని కోల్పోతాయి.


* ఎలుకలు, పందికొక్కులు లాంటి పరాన్నబుక్కులు ఎక్కువై సూక్ష్మజీవుల ప్రవాహకాలుగా మారి ప్లేగు తదితర వ్యాధులు విజృంభించడానికి కారణమవుతాయి.


* గుట్టలుగా పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించడం స్థానిక సంస్థలకు ఆర్థిక భారంగా మారుతోంది.


ఘన వ్యర్థ మూలాలు


1) గృహసంబంధ వ్యర్థాలు: మున్సిపాలిటీలు, మెట్రో నగరాల్లో గృహ సంబంధ వ్యర్థాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. వంటింట్లో మిగిలిన, పాడైన ఆహార పదార్థాలు, చిరిగిన దుస్తులు, కాగితం, లెదర్‌ లాంటి జీవక్షయం చెందే వస్తువులు/పదార్థాలు ఇందులో ఉంటాయి. ప్లాస్టిక్, పాలిథిన్, గ్లాసు, లోహ సంబంధమైన జీవక్షయం చెందని వస్తువులూ ఉంటాయి.


2) పారిశ్రామిక వ్యర్థాలు: ఇనుము, ఉక్కు, అల్యూమినియం కర్మాగారాలు; రబ్బరు, ప్లాస్టిక్, గాజు తయారుచేసే పరిశ్రమల్లో మిగిలిపోయిన వ్యర్థాలు; సిమెంట్‌ కర్మాగారాల నుంచి వెలువడే ఫ్లైయాష్‌ లాంటి పారిశ్రామిక ఘనవ్యర్థాలు భూమి, జలాలను కలుషితం చేస్తాయి.


3) రేడియోధార్మిక వ్యర్థాలు: యురేనియం, థోరియం మూలకాలను భూమి నుంచి వెలికి తీసినప్పుడు లేదా వాటిని శుద్ధి చేసినప్పుడు వెలువడే వ్యర్థాలను నీటిలో/భూమిలో కలపకూడదు. భూమి లోపల ప్రత్యేక జాలీల్లో భద్రపరచాలి.


4) మైనింగ్‌ వ్యర్థాలు: గనుల తవ్వకాల్లో, ఖనిజాల్లోని మలినాలు తొలగించినప్పుడు ఏర్పడిన స్లాగ్‌ కూడా భారీగా పోగుపడిన ఘన వ్యర్థమే. బొగ్గు, ఇనుప గనుల నుంచి వెలువడే ధూళి తీవ్రస్థాయి శ్వాసకోస వ్యాధులను కలగజేస్తుంది.


5) వ్యవసాయ సంబంధ వ్యర్థాలు: వ్యవసాయ రంగంలో ఉత్పత్తులను పెంచుకోవడానికి విచక్షణారహితంగా ఉపయోగిస్తున్న రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు నేల, నీటిపై పేరుకుపోతాయి. వీటివల్ల నేలలు నిస్సారంగా మారుతున్నాయి. జీవజాతులకు పలు అనారోగ్యాలకు గురవుతున్నాయి.


6) బయో మెడికల్‌ వ్యర్థాలు: ఆస్పత్రుల్లో వాడేసిన సిరంజీలు, సెలైన్‌ బాటిళ్లు, బ్యాండేజీలు, బ్లేడ్‌లు, రక్తవ్యర్థాలు లాంటి వాటిని బయోమెడికల్‌ వ్యర్థాలు అంటారు. ఘన వ్యర్థాలన్నింటిలో ఇవి చాలా హానికరమైనవి. వీటిని సరైన పద్ధతిలో నిర్వహించాలి.


7) ఎలక్ట్రానిక్‌ వేస్ట్‌: కాలం చెల్లిన, పాడైపోయిన కంప్యూటర్లు, టెలివిజన్లు, ప్రింటర్లు, ఎలక్ట్రానిక్‌ పరికరాల్లో ఉపయోగించే విషపూరిత రసాయనాలు; లోహ సంబంధ భాగాల ద్వారా చేరిన వ్యర్థాలను ఈ-వేస్ట్‌ లేదా ఎలక్ట్రానిక్‌ వేస్ట్‌ అంటారు. వీటి నుంచి ఆర్సెనిక్, బేరియం, కాడ్మియం, కోబాల్ట్, సీసం, పాదరసం, జింక్‌ లాంటి హానికర మూలకాలు విడుదలై తిరిగి మానవ జీవనంపై దుష్ప్రభావం చూపుతాయి.


8) కెమికల్‌ వేస్ట్‌: వినియోగించని ఔషధాలు, నెయిల్‌ పాలిష్‌ టిన్నులు, పెర్‌ఫ్యూమ్‌ బాటిళ్లు, టాయిలెట్‌ కెమికల్స్, కాస్మోటిక్‌ వ్యర్థాలు లాంటి వాటిని కెమికల్‌ వేస్ట్‌ అంటారు. ఈ రసాయన మూలకాల వ్యర్థాల వల్ల హాని కలుగుతుంది. ముఖ్యంగా చిన్నారులు ఎక్కువగా ప్రభావానికి గురవుతారు.


ఘన వ్యర్థాల నిర్వహణ: ఇది మున్సిపాలిటీలకు భారంగా మారుతోంది. వ్యర్థాలను సేకరించడం, తరలించడం, నిల్వ చేయడం ప్రభుత్వాలకు తలకు మించిన భారంగా మారుతోంది. అయితే కొన్ని నిర్వహణ విధానాల ద్వారా వాటి దుష్ప్రభావాన్ని తగ్గించవచ్చు.


వ్యర్థాలను వేరుచేసే ప్రక్రియ: వ్యర్థ పదార్థాలను సేకరించినప్పుడే తడి, పొడి చెత్తను వేరు చేయాలి. ఆ తర్వాత అందులోని జీవక్షయం చెందే తడి చెత్తను గుంతలు తీసి పూడ్చివేయాలి. ఇది క్రమంగా కుళ్లిపోయి ఎరువుగా మారుతుంది. ఈ విధానం వల్ల చెత్త పరిమాణం తగ్గించుకోవచ్చు.


5 R విధానం: ఘన వ్యర్థాల నిర్వహణకు ఇది అత్యంత శాస్త్రీయమైన పద్ధతి. ఈ విధానంపై ప్రజలకు పూర్తిగా అవగాహన కల్పించాలి.


1) Refuse -  చెత్త వేయకూడదు.


2) Reduce - చెత్త ఉత్పత్తిని తగ్గించుకోవాలి


3) Re-use - నీళ్ల సీసాలు, ప్యాకింగ్‌ మెటీరియల్స్‌ లాంటివి తిరిగి ఉపయోగించుకోవాలి.


4) Re-purpose - ఇతర ప్రయోజనాలకు ఉపయోగించాలి.


ఉదా: మెటల్‌ క్యాన్లు, బకెట్‌లను మొక్కలు పెంచుకోవడానికి వాడాలి.


5) Recycle - వ్యర్థాలను పునఃచక్రీయం చేయాలి.


ఉదా: కాగితం, ప్లాస్టిక్, లోహాలు, గాజు లాంటి వ్యర్థాలతో పరిశ్రమల ద్వారా తిరిగి కొత్త వస్తువులు తయారుచేయాలి.

పల్వరైజేషన్‌: సేకరించిన వ్యర్థాలను గ్రైండింగ్‌ మిషన్స్‌ ద్వారా ముక్కలు చేసి వాటి భౌతిక స్వరూపాన్ని, పరిమాణాన్ని మార్చే విధానం. ముక్కలైన వ్యర్థాలు రుచి, లక్షణాలు మారి కీటకాలను ఆకర్షించలేని విధంగా తయారవుతాయి. ఈ పదార్థాలను గుంతల్లో పూడ్చవచ్చు. అయితే ఈ ప్రక్రియ ఖర్చుతో కూడుకున్నది.


లోతట్టు ప్రాంతాల్లో పూడ్చవచ్చు: జీవక్షయం కాని, పునర్వినియోగానికి, పునఃచక్రీకరణకు పనికిరాని వ్యర్థాలను లోతట్టు ప్రాంతాల్లో మట్టితో కప్పివేయాలి. దీన్ని ల్యాండ్‌ ఫిల్లింగ్‌ అంటారు.


సముద్రాలకు దూరంగా పారబోయడం: ప్రపంచంలో సముద్రాల్లోకి అత్యధికంగా వ్యర్థాలను విడుదల చేస్తున్న దేశాల్లో చైనా, భారత్‌ ముందంజలో ఉన్నాయి. ఇది జలచరాలకు అత్యంత ప్రమాదకరంగా మారుతోంది. తీర ప్రాంత పట్టణాల్లోని చెత్తను తీరానికి 20 కి.మీ. దూరంలో, 30 మీటర్ల లోతైన ప్రాంతాల్లోకి తరలించాలి.


ఉపాధి సృష్టి: జీవక్షయం చెందే వ్యర్థాలను కంపోస్ట్‌ చేయడం ద్వారా ఎరువు, మీథేన్‌ వాయువును ఉత్పత్తి చేయవచ్చు. వ్యర్థాన్ని వానపాముల చర్య ద్వారా వర్మికంపోస్ట్‌గా మార్చొచ్చు. ఆస్పత్రి సంబంధ వ్యర్థాలను 800 డిగ్రీల సెంటీగ్రేడ్‌ వద్ద వేడి చేసి ‘ఇన్సినరేషన్‌’ ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చు.


బయోమెడికల్‌ వ్యర్థాల నిర్వహణ

ఎ) తెలుపు రంగు డబ్బాలు: సూదులు, బ్లేడ్లు వేయాలి.


బి) నీలి రంగు డబ్బాలు: గాజు సీసాల వ్యర్థాలు వేయాలి.


సి) పసుపు రంగు డబ్బాలు: జంతు, మానవ, ప్రయోగశాలల వ్యర్థాలు; శరీర ద్రవాలు వేయాలి.


డి) ఎరుపు రంగు డబ్బాలు: సిరంజీలు, సెలైన్‌ బాటిళ్లు, ట్యూబ్‌లు, క్యాథటర్స్‌ లాంటివి వేయాలి.

ఈ-వేస్ట్‌ నిర్వహణ: కాలం చెల్లిన, ఉపయోగంలో లేని ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్‌ సంబంధ వ్యర్థాలను ఈ-వేస్ట్‌ అంటారు. అసోచామ్‌ గ్రూప్‌ నివేదిక ప్రకారం మన దేశం ఏటా 20 లక్షల టన్నుల ఈ-వేస్ట్‌ ఉత్పత్తితో ప్రపంచంలో అయిదో స్థానంలో ఉంది. దేశంలో ఈ-వేస్ట్‌ ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర, నగరం ముంబయి.


ఈ-వేస్ట్‌లు మూడు రకాలు 


1) White Goods: పాడైపోయిన వాషింగ్‌ మిషిన్లు, గ్రైండర్లు, రిఫ్రిజిరేటర్లు.

2) Brown Goods:వాణిజ్య సముదాయాలు, గృహాల నుంచి ఉత్పత్తయ్యే పాడైపోయిన టెలివిజన్లు, కెమెరాలు.

3) Grey Goods: ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాలు, వాణిజ్య సముదాయాల్లోని పాడైపోయిన కంప్యూటర్లు, స్కానర్లు, ప్రింటర్లు, మొబైల్‌ ఫోన్లు.

రచయిత: జల్లు సద్గుణరావు

 

Posted Date : 25-09-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌