అధిక ఉత్పత్తికి.. ఆర్థిక ప్రగతికి!
ఒక బిజినెస్ పెట్టారు. అమ్మకాలు బాగా పెరిగాయి. వ్యాపారాన్ని ఇంకా విస్తరించాలంటే ఉత్పత్తి పెంచాలి. అందుకోసం మరికొన్ని యంత్రాలు, భవనాలు, పరికరాలు, ఇతర మౌలిక సౌకర్యాలు కావాలి. వాటినే మూలధన వనరులు అంటారు. మరోవిధంగా చెప్పాలంటే ఒక సంస్థలోని వస్తుసేవల ఉత్పత్తిని పెంచడానికి ఉపయోగించే మానవ నిర్మిత ఆస్తులు లేదా వనరులే మూలధన వనరులు. వీటి వల్ల ఉత్పాతదకతోపాటు లాభాలూ పెరుగుతాయి. ఆర్థిక అభివృద్ధిలో అతి ముఖ్యమైన ఈ మూలధన వనరుల రకాలను, వాటి ప్రయోజనాలను, విత్త మార్కెట్ల వివరాలను పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి.
ఆర్థికాభివృద్ధిలో మూలధనం కీలకం. ఆచార్య రాగ్నర్ నర్క్స్ ప్రకారం వెనుకబడిన దేశాలలో పేదరికపు విషవలయాలను ఛేదించాలంటే మూలధన సంచయనం అవసరం. పెట్టుబడి అంటే మార్కెట్ల నుంచి వాటాలు, బాండ్లు, డిబెంచర్లు, రుణాలు, సెక్యూరిటీల అమ్మకం మొదలైనవి. దీనినే విత్త పెట్టుబడి అని కూడా అంటారు.
* పెట్టుబడి ఒక ప్రవాహం, మూలధనం ఒక నిల్వ.
* ‘వాస్తవిక పెట్టుబడి అంటే ఉత్పత్తి సంస్థలు, యంత్రాలు, డ్యామ్‌లు, రోడ్లు, భవనాలు వంటి ప్రజా ఆస్తులు’ - జె.ఎమ్.కీన్స్
మూలధనం - ప్రయోజనాలు:
* అవస్థాపనా సదుపాయాలు పెరుగుతాయి.
* సాంకేతిక అభివృద్ధి జరుగుతుంది.
* జనాభా పెరుగుదలను ఎదుర్కొంటుంది.
* ఉద్యోగితను పెంచుతుంది.
* విదేశీ వ్యాపార లోటు తీరుస్తుంది.
* ద్రవ్యోల్బణాన్ని నివారిస్తుంది.
* ఆర్థిక సంక్షేమం పెరుగుతుంది.
మూలధనం - రకాలు:
మూలధనాన్ని రెండు రకాలుగా విభజిస్తారు.
మానవ మూలధనం: విద్య, వైద్యం, నైపుణ్యాలపై చేసే ఖర్చు.
భౌతిక మూలధనం: యంత్రాలు, ఫ్యాక్టరీలు, దీర్ఘకాలిక పెట్టుబడులు.
భౌతిక మూలధనం మూడు అంశాలపై ఆధారపడి ఉంటుంది.
1) పొదుపు
2) ఆర్థిక సంస్థలు (బ్యాంకులు)
3) ఉద్యమదారులు
పొదుపు: ఆర్థిక సంస్థల్లో జమ అయ్యి, ఉత్పత్తిదారులకు రుణం రూపంలో పెట్టుబడిగా లభిస్తుంది.
పొదుపు ⇒ పెట్టుబడి ⇒ మూలధనం
పెట్టుబడి పెరిగే కొద్దీ మూలధన సంచయనం జరుగుతుంది.
మూలధననాన్ని సేకరించే మార్గాలు
1. దేశీయ మార్గాలు: పొదుపు, లోటు బడ్జెట్, దేశీయ రుణాలు, విదేశీ వాణిజ్యంలో మిగులు
2. విదేశీ మార్గాలు: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, సంస్థాగత పెట్టుబడుల్లో విదేశీ సంస్థల ఆర్థిక సహకారం
* దేశీయ మార్గాల ద్వారానే అధిక పెట్టుబడి లభిస్తుంది. దేశీయ మార్గాల్లో ముఖ్యమైనది పొదుపు. దేశీయ పొదుపును గ్రాస్ డొమెస్టిక్ సేవింగ్స్ (జీడీఎస్) అంటారు. ఈ పొదుపు 3 రకాలుగా జరుగుతుంది.1) గృహరంగాలు 2) కార్పొరేట్ రంగాలు 3) ప్రభుత్వ రంగం
గృహ రంగంలో 2 రకాలుగా పొదుపు చేస్తారు.
1. భౌతిక పొదుపు: బంగారం, వెండి వంటి లోహాలు, గృహ నిర్మాణాలు.వాటి రూపంలో ఉంటుంది.
2. విత్త పొదుపు: బ్యాంకుల్లో డిపాజిట్ల రూపేణా పొదుపు
భారత్‌లో విత్త పొదుపు 6.6%గా ఉంటే భౌతిక పొదుపు 10.6%గా ఉంది.
మూలధన సంచయనం: ఒక ఆర్థిక సంవత్సరంలో లభించిన స్థూల, స్థిర మూలధనాన్ని మూలధన సంచయనం అంటారు.

మూలధన సంచయనంలో అధికంగా 74% ప్రైవేటు రంగం కల్పిస్తే, 26% ప్రభుత్వ రంగం కల్పిస్తోంది.
విత్త మార్కెట్లు
ఆర్థిక వ్యవస్థలో విత్త మార్కెట్లు ముఖ్యమైనవి. దేశంలోని పొదుపును సమీకరించి పెట్టుబడిగా తరలించడానికి విత్త మార్కెట్లు దోహదం చేస్తాయి. ఇవి రెండు రకాలు.
1) ద్రవ్య మార్కెట్
2) మూలధన మార్కెట్
ద్రవ్య మార్కెట్
ఇది స్వల్పకాలిక మార్కెట్. ఇందులో మంజూరయ్యే రుణాల కాలవ్యవధి ఒక రోజు నుంచి ఒక సంవత్సరం వరకు ఉంటుంది. దీనిని స్వల్పకాలిక పరపతి మార్కెట్ అంటారు. ద్రవ్య మార్కెట్లో ప్రత్యక్షంగా ద్రవ్యం ఉండదు. సమీప ద్రవ్యంగా పిలిచే వర్తకపు బిల్లులు, ట్రెజరీ బాండ్లు, ప్రభుత్వ సెక్యూరిటీలు, ప్రామిసరీ నోట్లు, బ్యాంకుల అంగీకార పత్రాలు మొదలైనవి ఉంటాయి. ఈ పత్రాలకు అధిక ద్రవ్యత్వం ఉంటుంది. ద్రవ్య మార్కెట్ స్థూలంగా రెండు రకాలుగా ఉంటుంది. అవి 1) అసంఘటిత ద్రవ్య మార్కెట్ 2). సంఘటిత ద్రవ్య మార్కెట్
అసంఘటిత ద్రవ్య మార్కెట్: ఇది 3 రకాలు.
1. క్రమబద్ధీకరించని నాన్ బ్యాంకింగ్ విత్త సంస్థలు:
ఉదా: విత్త కంపెనీలు, చిట్‌ఫండ్ కంపెనీలు, నిధి కంపెనీలు మొదలైనవి.
2. దేశీయ బ్యాంకర్లు: ప్రాచీన కాలం నుంచి దేశీయ బ్యాంకర్ల వ్యవస్థ ఉంది. ఇవి నాణేలను భద్రపరచి రుణాలుగా ఇచ్చేవి.
ఉదా: బెంగాల్లో జగత్ సేఠ్లు, పట్నాలో షాలు, సూరత్‌లో నాథ్జీ, అంబాజీలు: మద్రాస్‌లో చెట్టియార్లు
3) వడ్డీ వ్యాపారులు
సంఘటిత ద్రవ్య మార్కెట్: భారతీయ సంఘటిత ద్రవ్య మార్కెట్లో రిజర్వు బ్యాంకు, వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులు సంఘటిత మార్కెట్లో ఉంటాయి.అందులో వివిధ రకాల ఉప మార్కెట్లు ఉంటాయి.
1. కాల్ మనీ మార్కెట్: ఇది ప్రధాన నగరాలైన ముంబయి, కోల్కత్తా, చెన్నై, దిల్లీ, అహ్మదాబాద్‌లలో ఎక్కువగా ఉంటుంది. 1970 నుంచి ఎల్ఐసీ, యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (యూటీఐ) ద్రవ్య మార్కెట్లో రుణదాతలుగా వ్యవహరించేవి. 1987లో వాఘల్ వర్కింగ్ గ్రూప్ నివేదిక ప్రకారం నాన్ బ్యాంకింగ్ విత్త సంస్థలను కూడా రుణదాతలుగా అనుమతించారు.
* 1988లో ‘డిస్కౌంట్ అండ్ ఫైనాన్స్ హౌస్ ఆఫ్ ఇండియా’ (డీఎఫ్‌హెచ్‌ఐ) నెలకొల్పారు.
2. ట్రెజరీ బిల్లుల మార్కెట్: ద్రవ్య మార్కెట్లో అత్యంత ప్రధానమైనది బిల్లుల మార్కెట్. ఈ మార్కెట్లో స్వల్పకాల వ్యవధి ఉన్న బిల్లుల క్రయవిక్రయాలు జరుగుతాయి. సాధారణ ట్రెజరీ బిల్లులకు 91 రోజుల కాలపరిమితి ఉంటుంది. వీటిని ఆర్బీఐ వాణిజ్య బ్యాంకులకు, రాష్ట్ర ప్రభుత్వాలకు, వాణిజ్య ప్రభుత్వ సంస్థలకు, విత్త సంస్థలకు విక్రయిస్తుంది.
1986లో 182 రోజుల ట్రెజరీ బిల్లులు, 1992లో 364 రోజుల ట్రెజరీ బిల్లుల్ని ప్రవేశపెట్టారు. 1997లో 14 రోజుల ట్రెజరీ బిల్లులు వచ్చాయి. 2001లో వీటిని నిలిపివేశారు.
3. వాణిజ్య బిల్లుల మార్కెట్: ఒక వ్యాపార సంస్థ, మరొక వ్యాపార సంస్థ పేరు మీద విడుదల చేసే బిల్లులను వాణిజ్య బిల్లు అంటారు. సాధారణంగా దీని కాల వ్యవధి మూడు నెలలు ఉంటుంది. వాణిజ్య బిల్లులు అనేక రకాలుగా ఉన్నాయి. 1. డిమాండ్ బిల్లులు 2. కాలపరిమితి బిల్లులు 3. వ్యాపార బిల్లులు 4) విత్త బిల్లులు 5. దేశీయ బిల్లులు 6. విదేశీ బిల్లులు.
* భారతదేశంలో అనాదిగా ఆచరణలో ఉన్న వ్యాపార బిల్లులను హుండీలు అంటారు.
4) వాణిజ్య పత్రాలు: వాఘల్ వర్కింగ్ గ్రూప్ సిఫార్సు మేరకు 1989, మార్చిలో రిజర్వ్ బ్యాంక్ వాణిజ్య పత్రాలను ప్రవేశపెట్టింది. కంపెనీలు జారీ చేసే వాణిజ్య పత్రాలు విలువ కనీసం రూ.కోటి ఉండాలి.
5) డిపాజిట్ సర్టిఫికెట్స్: వీటిని సిఫార్సు చేసినది వాఘల్ కమిటీ (1989). వ్యక్తులు, కంపెనీలు, సంస్థలు తమ వద్ద ఉంచిన డిపాజిట్లపై బ్యాంకులు జారీ చేసే సర్టిఫికెట్స్‌ను డిపాజిట్ సర్టిఫికెట్లు అంటారు. 1991-92లో అఖిల భారత విత్త సంస్థలైన IDBI, ICICI, IFCIలు కూడా ఈ సర్టిఫికెట్స్‌ను జారీ చేయడానికి ఆర్బీఐ అనుమతి ఇచ్చింది.
6) మ్యూచువల్ ఫండ్స్: ద్రవ్య మార్కెట్లో ‘మ్యూచువల్ ఫండ్స్’ని ఆర్బీఐ 1992 ఏప్రిల్‌లో ప్రవేశపెట్టింది.
వ్యక్తిగత పెట్టుబడిదారులకు అదనపు స్పల్పకాలిక పెట్టుబడి అవకాశాన్ని ఇవ్వడం ఈ పథకం ఉద్దేశం.
2007, మార్చి 7 నుంచి ద్రవ్య మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్‌ను సెబీ నిబంధన పరిధిలోకి తెచ్చారు.
మూలధన మార్కెట్
పరిశ్రమలకు అవసరమైన దీర్ఘకాలిక మొత్తాన్ని సమకూర్చే మార్కెట్‌ను మూలధన మార్కెట్ అంటారు.
ప్రభుత్వ మార్కెట్‌ను Gilt Edge అని కూడా అంటారు. Gilt Edge అంటే ‘అత్యంత శ్రేష్టమైన బంగారంతో సమానం’ అని అర్ధం. మూలధన మార్కెట్‌ను నియంత్రించే సంస్థ సెబీ. భారతదేశంలో ‘సెబీ’ గుర్తించిన స్టాక్ ఎక్స్ఛేంజ్లు 23. వీటిలో శాశ్వతమైనవి 5. అవి.
1) అహ్మదాబాద్ స్టాక్ ఎక్స్ఛేంజ్
2) బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్
3) కోల్కత్తా స్టాక్ ఎక్స్ఛేంజ్
4) మగధ స్టాక్ ఎక్స్ఛేంజ్
5) నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్
బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ): ముంబయిలోని దలాల్ స్ట్రీట్‌లో 1875లో ప్రారంభమైంది. ఆసియాలో మొదటి, పురాతన స్టాక్ ఎక్స్ఛేంజ్ ఇది. 1986లో Sensex (Sensitivity Index) పేరుతో ఒక సూచీని ప్రవేశపెట్టారు. 1978-79 దీని ఆధార సంవత్సరం. 30 కంపెనీల వాటాధరలను పరిగణిస్తూ భార సగటు పద్ధతిలో ప్రతి 15 సెకన్లకు ఒకసారి లెక్కిస్తారు. సూచీ జవాబును Points అంటారు. ప్రస్తుతం బీఎస్ఈ ఛైర్మన్ ఎస్ఎస్ ముంద్రా.
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ): నాదకర్ణి కమిటీ సిఫార్సుతో 1992, నవంబర్ 1న ముంబయిలో ఎన్ఎస్ఈ ప్రారంభమైంది. UTI, IDBI, SBI, PNB, LIC మొదలైన ఆర్థిక సంస్థలు దీన్ని స్థాపించాయి. 1996 NIFTY (National Stock Exchange Fifty) పేరుతో సూచీ ప్రవేశపెట్టారు. 1995-96 దీని ఆధార సంవత్సరం. 50 కంపెనీల వాటాల ధరలను ప్రతి 15 సెకన్లకు ఒకసారి భార సగటు పద్ధతిలో లెక్కించి పాయింట్స్ ప్రకటిస్తారు. ప్రస్తుతం ఎన్ఎస్ఈ ఛైర్మన్ ఆశీష్ కుమార్ చౌహాన్.
సెబీ (Securities and Exchange Board of India): షేర్వాణీ కమిటీ సిఫార్సుల మేరకు 1988లో బొంబాయిలో సెబీ ప్రారంభమైంది. 1992లో చట్టబద్ధత కల్పించారు. ఈ సంస్థ స్టాక్‌మార్కెట్‌ను క్రమబద్ధం చేస్తుంది. ప్రస్తుతం సెబీ ఛైర్మన్ మాధాబి పూరి బచ్.
షేర్ మార్కెట్ కుంభకోణాలు:
*1991లో హర్షద్ మెహతా కుంభకోణంపై బీఎస్ఈ జానకీ రామన్ కమిటీని వేసింది.
*2001లో కేతన్ పరేఖ్ కుంభకోణంపై ‘ప్రకాష్ మణి త్రిపాఠి’ అధ్యక్షతన కమిటీ నియామకం.
Bull (బుల్): స్టాక్ మార్కెట్లో వాటాల ధరలు పెరుగుతుంటే బుల్ అంటారు.
Bear (బేర్): స్టాక్ మార్కెట్లో వాటాల ధరలు తగ్గితే బేర్ అంటారు.
స్టాక్ బ్రోకర్ : స్టాక్ మార్కెట్లో వాటాల కొనుగోలు, అమ్మకాలకు మధ్యవర్తిగా వ్యవహరించే వారిని బ్రోకర్ అంటారు. వీరు ప్రతి లావాదేవీపై కమిషన్ వసూలు చేస్తారు.
రచయిత: ధరణి శ్రీనివాస్