• facebook
  • whatsapp
  • telegram

అంతరిక్ష విజ్ఞాన శాస్త్రం

కర్మన్‌ రేఖ


* సముద్ర మట్టం నుంచి 100 కి.మీ. లేదా 62 మైళ్ల ఎత్తున గీసే ఊహాజనిత రేఖను ‘కర్మన్‌ రేఖ’గా పేర్కొంటారు. దీని తర్వాత వాతావరణంలో ఇమిడి ఉన్న పొరలు అత్యంత పలుచగా ఉంటాయి. ఈ ప్రదేశం విమానాల ప్రయాణానికి ప్రతికూలంగా ఉంటుంది. 

* కర్మన్‌ రేఖకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంటుంది. దీని తర్వాత ఉన్న బాహ్య అంతరిక్షంపై ఏ దేశానికీ గుర్తింపు, అజమాయిషీ ఉండదు. కర్మన్‌ రేఖకు జాతీయ, అంతర్జాతీయ హద్దులు ఉండవు. అక్కడ మానవ చట్టాలు వర్తించవు. 

* అంతరిక్ష పరిశోధనలకు ఆద్యుడు, మార్గదర్శకుడైన ‘థియోడర్‌ వాన్‌ కర్మన్‌’ సేవలకు గుర్తుగా దీన్ని కర్మన్‌ రేఖ అనే పేరుతో పిలుస్తారు.

అంతరిక్షం

* అంతరిక్షం తక్కువ సాంద్రత ఉన్న పదార్థాలతో నిర్మితమై ఉంటుంది. ఇందులో ముఖ్యంగా హైడ్రోజన్‌ ప్లాస్మా, హీలియం, ఎలక్ట్రోమాగ్నటిక్‌ తరంగాలు, న్యూట్రినోలు, దుమ్ము, కాస్మిక్‌ కిరణాలు ఉంటాయి.

* ఖగోళ శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం ‘‘అంతరిక్షంలో ఉన్న పదార్థాలకు ద్రవ్యరాశి, శక్తి శూన్యంలో ఉన్న శక్తి నుంచి కాకుండా, కృష్ణ పదార్థం (కృష్ణబిలం) నుంచి లభ్యమవుతాయి’’. 

* అంతర్జాతీయ అంతరిక్ష చట్టాల నమూనా (Framework for International Space Law), ఐక్యరాజ్య సమితి అంతరిక్ష ఒప్పందం  1967 ప్రకారం అంతరిక్షంపై ఏ దేశ సార్వభౌమాధికారమూ చెల్లుబాటు కాదు. అన్ని దేశాలు అంతరిక్షాన్ని నూతన అన్వేషణల కోసం ఉపయోగించుకోవచ్చు. 

* 1979లో జరిగిన చంద్ర గ్రహ ఒప్పందం (The moon treaty) ప్రకారం గ్రహాలను, వాటి మధ్య ఇమిడి ఉన్న కక్ష్యా స్థలాలను, సరిహద్దులను అంతర్జాతీయ సమాజం ఎలాంటి వివక్షకు తావు లేకుండా ఉపయోగించుకోవచ్చు.

ఉపయోగాలు: అంతరిక్షరంగంలో విప్లవాత్మక పరిశోధనలు, సాంకేతికత ద్వారా మానవాళికి అనేక సౌకర్యాలు కల్పించారు. దీని వల్ల సమాజ స్థితిగతులు కూడా మారిపోయాయి. 

* ఆరోగ్యం, విద్య, సమాచార వ్యవస్థల్లో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. భూమి, నీటి వనరుల నిర్వహణ, వాతావరణ హెచ్చరికలు, విపత్తు నిర్వహణ లాంటివి సులభతరం అయ్యాయి.

* భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాల్లో నెలకొని ఉన్న భౌగోళిక పరిస్థితుల కారణంగా అక్కడ వాహనాల రాకపోకలకు కష్టంగా ఉండేది. అంతరిక్ష సాంకేతికతతో ఉపగ్రహ చిత్రాలను ఉపయోగించి దీన్ని అధిగమించారు. ప్రస్తుతం ఈశాన్య రాష్ట్రాలు స్థానిక స్థాయి ప్రణాళికలు, వ్యవసాయం, మౌలిక వసతులు, రవాణారంగాల్లో సుస్థిరాభివృద్ధి దిశగా పయనిస్తున్నాయి.

* అంతరిక్ష సాంకేతిక అనువర్తనాలు ఆహార నిల్వల నుంచి, గుండె శస్త్రచికిత్సల వరకు; చేపల వేట నుంచి చోదకవాహనాల (Automobiles) వరకు విస్తరించాయి. 

* అంతరిక్ష విజ్ఞానం నూతన ఉద్యోగాలు, వ్యాపారాలకు నాంది పలికింది. ప్రజల జీవన ప్రమాణ స్థాయిని పెంచింది. పర్సనల్‌ కంప్యూటర్స్‌ నుంచి స్మార్ట్‌ ఫోన్ల వినియోగం వరకు అంతరిక్ష విజ్ఞానంతో అన్నీ అభివృద్ధి చెందాయి. 

* సౌరశక్తి, క్రయోజెనిక్స్, రోబోటిక్స్‌ లాంటి నూతన సాంకేతికతతో అంతరిక్షరంగాన్ని అనుసంధానించాలని శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. ఇవి విజయవంతం అయితే ఆరోగ్యం, శక్తి, పర్యావరణ రంగాల్లో విప్లవాత్మక మార్పులు వస్తాయి. 

* మనం ప్రస్తుతం ఉపయోగిస్తున్న అనేక పరికరాలు అంతరిక్ష పరిశోధనల కోసం రూపొందించినవే. వాటిలో కొన్ని: కాలిక్యులేటర్లు, సెల్‌ఫోన్లు, డిజిటల్‌ వాచ్‌లు, ఇన్‌ఫ్రారెడ్‌ కెమేరాలు, ఫేస్‌మేకర్‌ బ్యాటరీలు, పర్సనల్‌ కంప్యూటర్లు, సన్‌గ్లాసెస్, శాటిలైట్‌ టీవీ, టెఫ్లాన్, వాటర్‌ ప్యూరిఫికేషన్‌ వ్యవస్థ, స్క్రాచ్‌ రెసిస్టెంట్‌ లెన్స్‌లు, ధర్మామీటర్లు, శాటిలైట్‌ నావిగేషన్, స్మోక్‌ డిటెక్టర్స్‌ మొదలైనవి.

ఉపగ్రహ సమాచార వ్యవస్థ

* అంతర గ్రహ వాహక నౌకలు, ఉపరితల నౌకా ప్రయోగాల సమయంలోనే (1980 దశకంలో) ఉపగ్రహ సమాచార వ్యవస్థ మొదలైంది. అప్పుడే సమాచార ప్రసార మాధ్యమాలు టెలివిజన్‌ ప్రసారాల వరకు విస్తరించాయి.

* ఉపగ్రహాల ద్వారా అంటార్కిటికా ఖండంపై ఉన్న ఓజోన్‌ పొరలోని రంధ్రాన్ని గుర్తించారు. 1986లో జరిగిన చెర్నోబిల్‌ విపత్తు చిత్రాలను కూడా ఉపగ్రహాలు పంపించాయి. 

* ఈ ఉపగ్రహ ప్రయోగాల ద్వారా నక్షత్ర మండలాలు, పాలపుంతలు, కొత్తగా గుర్తించిన వివిధ నక్షత్రాల స్వరూపాలు - వాటి నూతన దిశల్లో ఉన్న చిత్రాలను గుర్తించారు.

అంతరిక్షంలో మానవయానం

* రష్యాకు చెందిన వోస్తాక్‌ 1 వాహకనౌక ద్వారా అంతరిక్షంపైకి మొదటిసారి విజయవంతంగా మానవయానం ప్రారంభమైంది.  1961, ఏప్రిల్‌ 12న యూరీ అలెక్సేవిచ్‌ గగారిన్‌ వోస్తాక్‌ 1లో భూకక్ష్యలో 1 గంట 48 నిమిషాలు ప్రయాణించాడు. ఈయన రష్యాకు చెందిన వ్యోమగామి.

* అమెరికాకు చెందిన అలెన్‌ షెపర్డ్‌ 1961, మే 5న మెర్క్యురీ రెడ్‌స్టోన్‌-3 అనే వాహక నౌక ద్వారా 15 నిమిషాలు భూకక్ష్యలో ప్రయాణించాడు.

* సోవియట్‌ యూనియన్‌కు చెందిన వాలెంటీనా తెరిష్కోవా అంతరిక్షయానం చేసిన మొదటి మహిళగా గుర్తింపు పొందారు. ఈమె వోస్తాక్‌ 6 వాహక నౌకలో 1963, జూన్‌ 16న ప్రయాణించారు. 

స్కైలాబ్‌: ఇది అమెరికా సంయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేసిన మొట్టమొదటి అంతరిక్ష కేంద్రం. దీన్ని 1973, మే 14న నాసా (నేషనల్‌ ఏరోనాటిక్స్‌ అండ్‌ స్పేస్‌ అడ్మినిస్ట్రేషన్‌) ప్రయోగించింది. 

* ఇది 1973 మే నుంచి 1974 ఫిబ్రవరి మధ్య 24 వారాలు అంతరిక్షంలో అన్వేషణలు జరిపింది. 

* దీన్ని ముగ్గురు వ్యోమగాముల బృందం విడివిడిగా నిర్వహించింది. అవి: స్కైలాబ్‌-2, స్కైలాబ్‌-3, స్కైలాబ్‌-4. 

* స్కైలాబ్‌ విజయవంతంగా అంతరిక్షంలోకి వెళ్లినప్పటికీ, క్షేమంగా భూమిపైకి తిరిగి రాలేదు. దీన్ని నాసా తొమ్మిదేళ్ల పరిశోధనల కోసం ప్రయోగించింది. 

* దీన్ని ఆ కాలంలోనే అత్యంత అధునాతనంగా రూపొందించారు. స్కైలాబ్‌ ముఖ్య ఉద్దేశం బాహ్య అంతరిక్షంలో వ్యోమగాములు జీవించడానికి అవసరమైన అవకాశాలను పరిశీలించడం - అన్వేషించడం, ఖగోళశాస్త్రాన్ని అధ్యయనం చేయడం. 

* స్కైలాబ్‌ శాటర్న్‌ అపోలో లాంటి మెషిన్లను సమర్థవంతంగా వినియోగించుకుని, అన్వేషణలను కొనసాగించింది. అయినప్పటికీ అది 1979, జులై 11న వాతావరణంలో విచ్ఛిన్నమై హిందూ మహాసముద్రం, పశ్చిమ ఆస్ట్రేలియా ప్రాంతాల్లో అంతరిక్ష వ్యర్థాలను వెదజల్లుతూ కూలిపోయింది.

* స్కైలాబ్‌ ప్రయోగం వరకు అమెరికా, సోవియట్‌ రష్యాలు అంతరిక్ష ప్రయోగాల్లో తమ ఆధిపత్యం కోసం వాహక నౌకలను ప్రయోగించాయి. అయితే ఈ రెండు దేశాలు మొదటిసారి అంతరిక్ష పరిశోధనల కోసం అపోలో-సోయజ్‌ (Apollo-Soyuz) టెస్ట్‌ మిషన్‌ను సంయుక్తంగా ప్రయోగించాయి.

కొలంబియా వాహక నౌక (Space Shuttle Columbia): దీన్ని నాసా 1981, ఏప్రిల్‌ 12న పౌర, రక్షణ వ్యవహారాల కోసం ప్రయోగించింది. ఈ వాహక నౌక (Space Transportation System - STS) ద్వారా అంతరిక్ష అన్వేషణల్లో మరిన్ని ప్రయోగాలకు అవకాశం దొరికింది.

* 1986లో షటిల్‌ ఛాలెంజర్‌ వాహక నౌకను ప్రయోగించిన కొద్దిసేపటికే కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించారు.

* కొలంబియా STS- 107 వాహక నౌక కూడా 2003, ఫిబ్రవరి 1న భూమిని చేరే కొద్ది నిమిషాల ముందు కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించారు. ఈ రెండిటినీ అంతరిక్ష రంగంలో జరిగిన ఘోర ప్రమాదాలుగా పేర్కొంటారు.

అంతర్జాతీయ అంతరిక్ష ఉపగ్రహ ప్రయోగాలు

స్పుత్నిక్‌ 1: ప్రపంచవ్యాప్తంగా మొదటిసారి అంతరిక్ష కక్ష్యలోకి ప్రవేశించిన ఉపగ్రహం స్పుత్నిక్‌ 1. దీన్ని 1957, అక్టోబరు 4న సోవియట్‌ యూనియన్‌ ప్రయోగించింది. ఇది మానవ రహిత ఉపగ్రహం. భూమికి 250 కి.మీ.ల ఎత్తులో ఉన్న కక్ష్యా మార్గంలో దీన్ని ప్రవేశపెట్టారు.

* ప్రపంచవ్యాప్తంగా అంతరిక్షాన్ని శాంతియుత ప్రయోజనాలకు మాత్రమే ఉపయోగించాలని 1967, అక్టోబరు 4న అంతర్జాతీయ ఒప్పందం జరిగింది. ఈ రెండు సంఘటనలకు గుర్తుగా ఏటా అక్టోబరు 4 నుంచి వారం రోజులపాటు అంతర్జాతీయ అంతరిక్ష వారంగా (International space week) జరుపుతున్నారు.

లూనా 10: ఇది చంద్రుడిపై ప్రవేశపెట్టిన మొట్టమొదటి కృత్రిమ ఉపగ్రహం. దీన్ని 1966, మార్చి 31న ప్రయోగించారు.

అపోలో 11: 1969, జులై 20న మానవుడు మొదటిసారి మరో గ్రహంపైకి ప్రవేశించాడు. ఈ ప్రయోగాన్ని అమెరికా నిర్వహించింది. అపోలో 11 అనే అంతరిక్ష వాహక నౌకను నీల్‌ ఆమ్‌స్ట్రాంగ్‌ ఆధ్వర్యంలో చంద్రుడిపైకి పంపారు. ఇతడు 6 గంటల 39 నిమిషాలు చంద్రయానం చేశాడు. 

* అపోలో 11 వాహక నౌక అంతరిక్షయానాన్ని ముగించుకుని విజయవంతంగా భూమిపైకి వచ్చింది. వివిధ రకాల అంతరిక్ష ప్రయోగాలకు ఈ విజయం ఎంతో ఉపయోగపడింది. 

* అంతర గ్రహ ఉపరితల వాహక నౌకలను మొదటిసారి సోవియట్‌ యూనియన్‌ ప్రయోగించింది. 1970లో వెనీరా-7 శుక్రగ్రహ ఉపరితలంపై 23 నిమిషాలు ప్రయాణం చేసింది. 

* 1971లో మార్స్‌ 3 ల్యాండర్‌ కుజగ్రహం ఉపరితలంపై కేవలం 20 సెకన్లు మాత్రమే ఉంది. అయినప్పటికీ ఈ ప్రయోగం తర్వాతి అనేక పరిశోధనలకు మార్గం సుగమం చేసింది. 

* 1975లో అమెరికా ప్రయోగించిన యూఎస్‌ వైకింగ్‌-1, 1982లో సోవియట్‌ రష్యాకు చెందిన వెనీరా-13 వాహక నౌకలు వీటికి ఉదాహరణలుగా చెప్పొచ్చు.

Posted Date : 22-01-2022

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు