• facebook
  • whatsapp
  • telegram

ఢిల్లీ సుల్తానులు - తుగ్లక్‌ వంశం

మహమ్మద్‌బిన్‌ తుగ్లక్‌ పరిపాలనా సంస్కరణలు

రాగి నాణేల ముద్రణ

మహమ్మద్‌బిన్‌ తుగ్లక్‌ సింహాసనాన్ని అధిష్టించేనాటికి బంగారం, వెండి లోహాల కొరత ఏర్పడింది. అప్పటికే ప్రపంచంలో కాగితం కరెన్సీ అమల్లోకి వచ్చింది. 


* దానధర్మాలు, రాజధాని మార్పు, కరవు, మంగోలుల దాడులు, సైనిక ఖర్చు పెరగడం మొదలైన కారణాలతో ఖజానా ఖాళీ అయ్యింది. 


* చైనాలో కుబ్లాయ్‌ ఖాన్, పర్షియాలో కైడు ఖాన్‌ కాగితం కరెన్సీని ప్రవేశపెట్టారు. దీని ప్రభావం తుగ్లక్‌పై పడింది. 


* తుగ్లక్‌ స్వతహాగా విద్యావేత్త కావడంతో ద్రవ్య విధానంలో కొత్త పరిశోధనలకు అవకాశం కల్పించాడు. బంగారం, వెండి నాణేల కొరత తగ్గించేందుకు వాటి బదులు రాగి నాణేలు ముద్రించి, చలామణిలోకి తేవాలని భావించాడు. 


* దానికి అనుగుణంగా క్రీ.శ.1329-30లో రాగి నాణేలు ముద్రించాడు. అందుకే చరిత్రకారులు ఇతడ్ని ‘ప్రిన్స్‌ ఆఫ్‌ మనియర్స్‌’ అని పేర్కొన్నారు.


* తుగ్లక్‌ బంగారు నాణేలకు ఉండే విలువనే రాగి నాణేలకు ఇచ్చాడు. ఈ నిర్ణయం రాజ్యాన్ని కోలుకోలేని దెబ్బ తీసింది.


* అప్పటికే భారతదేశంలో ముద్రణా విధానం కుటీర పరిశ్రమగా ఉంది. ప్రతి కంసాలి ఇల్లు టంకశాలగా మారింది. దీంతో ద్రవ్యానికి చలామణి తగ్గి, ధరలు పెరిగాయి. ప్రజల్లో అసంతృప్తి ఎక్కువైంది. 


* ఈ పరిస్థితిని చక్కదిద్దే ఉద్దేశంతో సుల్తాన్‌ రాగి నాణేలకు బదులు బంగారు నాణేలను చెల్లిస్తానని ప్రకటించాడు. దీన్ని ప్రజలు మరింత ఉపయోగించుకున్నారు. 


* వారు తమవద్ద ఉన్న రాగి నాణేలను ప్రభుత్వం వద్ద మార్చుకుని, బంగారు నాణేలు పొందారు. దీంతో కోశాగారం ఖాళీ అయ్యింది.


* ఈ విధానం తప్పు కాదు, అయితే అమల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటించకపోవడంతో ఇది విఫలమైంది. 


* అందుకే చరిత్రకారులు ఇతడ్ని ‘‘తొందరపడి 500 సంవత్సరాల ముందే పుట్టిన ఆర్థిక సంస్కర్త’’ అని వ్యాఖ్యానించారు. 


వైఫల్యానికి కారణాలు:


ప్రభుత్వం మినహా ప్రజలెవరూ నాణేలు ముద్రించకూడదని తుగ్లక్‌ ఫర్మానా జారీ చేయలేదు. 


* దొంగ నాణేలు ముద్రించిన వారిపై చర్యలు తీసుకోలేదు. దీంతో ప్రతి ఇల్లు టంకశాలగా మారింది. కుప్పలుతెప్పలుగా రాగి నాణేలు ముద్రించారు. దీంతో విలువ పడిపోయింది. 


* వర్తకం, విదేశీ వ్యాపారం దెబ్బతిన్నాయి. సుల్తాన్‌కు ముందుచూపు లేకపోవడంతో ఈ సంస్కరణ పూర్తిగా విఫలమైంది.


సాంఘిక - న్యాయ సంస్కరణలు 


మహమ్మద్‌బిన్‌ తుగ్లక్‌ పరమత సహనం పాటించాడు. 


* హోళీ పండుగలో పాల్గొన్న మొదటి ఢిల్లీ సుల్తాన్‌ ఈయనే. 


* ‘ఖలీఫా’ పేరును నాణేలపై ముద్రించాడు. 


* సదర్‌-ఇ-జహాన్‌ అనే న్యాయమూర్తిని నియమించాడు. శిక్షలు కఠినంగా ఉండేవి. 


‘డాక్‌ చౌకీ’ (తపాలా విధానం) కొనసాగించాడు.


దండయాత్రలు 


తుగ్లక్‌ ఖురసాన్, ఇరాక్‌ ఆక్రమణకు 3.75 లక్షల సైన్యానికి ముందుగా జీతం చెల్లించి తర్వాత విరమించుకున్నాడు. 


* క్రీ.శ. 1337లో నాగర్‌కోట్‌ను ఆక్రమించి, తిరిగి ఇచ్చేశాడు. 


* క్రీ.శ. 1337-38లో ‘కారాజల్‌’ ప్రాంతాలపై దాడిచేయగా పెద్ద సంఖ్యలో సైన్యాన్ని నష్టపోవాల్సి వచ్చింది. 


* చైనా, ఖురసాన్‌పై దాడులు విఫలమయ్యాయి.


ఫిరోజ్‌షా తుగ్లక్‌ 


మహమ్మద్‌బిన్‌ తుగ్లక్‌ మరణించాక అతడి పినతండ్రి కుమారుడైన ఫిరోజ్‌షా తుగ్లక్‌ ఢిల్లీ సుల్తాన్‌ అయ్యాడు. ఇతడు క్రీ.శ. 1351 నుంచి క్రీ.శ.1388 వరకు రాజ్యపాలన చేశాడు. 


షరియత్‌ (ఇస్లాం ధార్మిక న్యాయశాస్త్రం) ప్రకారం రాజ్యపాలన చేస్తానని ప్రకటించాడు. ప్రజాసంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాడు. ఖలీఫాకు ప్రాధాన్యం ఇచ్చాడు. ఖలీఫా ఇతడికి నాయబ్‌-ఇ-అమీర్‌-ఉల్‌-ఫిరోజ్‌ అనే బిరుదు ఇచ్చాడు. 


* ఫిరోజ్‌షాకి ప్రధానిగా ఖాన్‌ జహమక్బూల్‌ పనిచేశాడు.


* ఫిరోజ్‌షా సింహాసనాన్ని అధిష్టించాక బెంగాల్‌ పాలకుడు హబీ ఇలియాజ్‌ తిరుగుబాటు చేశాడు. క్రీ.శ.1353, క్రీ.శ.1360లోనూ ఇతడు తన తిరుగుబాటును కొనసాగించాడు. వీటిని అణచివేయడంలో ఫిరోజ్‌షా విఫలమయ్యాడు.


* హిందువులపై జిజియా పన్ను విధించాడు. జాగీర్దారీ విధానాన్ని పునరుద్ధరించాడు. సైనికులకు జీతాలిచ్చే పద్ధతిని రద్దు చేశాడు. 


* నీటిపారుదల అభివృద్ధి కోసం యమునా నది నుంచి ఫిరోజాబాద్‌కు, సట్లెజ్‌ నది నుంచి మాంఘీర్‌ వరకు, మండవ నుంచి హిస్సార్‌ వరకు కాలువలు తవ్వించాడు. వ్యాపారాన్ని ప్రోత్సహించాడు. వెండి, రాగి మిశ్రమంతో తయారైన నాణేలను ఆదా, బిఖ్‌ అనే పేర్లతో విడుదల చేశాడు.


* దానధర్మాల కోసం దివాన్‌-ఇ-ఖైరాత్‌ అనే శాఖను నెలకొల్పాడు. 


* ఇతడి పాలనా కాలంలో ఫిరోజాబాద్, హిస్సార్, జాన్‌పూర్‌ లాంటి కొత్త నగరాలు వెలిశాయి. 


* ఫిరోజ్‌షా ‘దివాన్‌-ఇ-బందగాన్‌’ అనే బానిసశాఖను స్థాపించాడు. ఇతడి పోషణలో లక్షాఎనభైవేల మంది బానిసలు ఉండేవారని చరిత్రకారులు పేర్కొన్నారు. 


* ఫిరోజ్‌షా కవి, పండితుడు. ఇతడు తన ఆత్మకథను ‘ఫతూహాత్‌-ఇ-ఫిరోజ్‌షాహి’ పేరుతో రాశాడు. 


* ఇతడి ఆస్థానంలో బదౌని, సిరాజ్, ఆసిఫ్‌ లాంటి ప్రసిద్ధ చరిత్రకారులు ఉండేవారు. 


* అశోకుడు మీరట్, తోప్రాలో వేయించిన స్తంభాలను ఢిల్లీకి తెప్పించాడు.


* ఫిరోజ్‌షా సమాధి దిల్లీలోని హౌజ్‌ ఖాస్‌లో ఉంది.


* క్రీ.శ. 1388లో ఫిరోజ్‌షా మరణించాక క్రీ.శ. 1414 వరకు తుగ్లక్‌ వంశస్తులు ఢిల్లీని పాలించారు. క్రీ.శ.1398లో జరిగిన తైమూర్‌ దండయాత్రలు ఢిల్లీ రాజ్యానికి తీవ్రనష్టం కలిగించాయి. తుగ్లక్‌ వంశ చివరి పాలకుడైన దౌలత్‌ఖాన్‌ను ఖజీర్‌ఖాన్‌ ఓడించి, సయ్యద్‌ వంశ పాలనను ఢిల్లీలో ప్రారంభించాడు.


సయ్యద్‌ వంశం


తుగ్లక్‌ వంశం అంతమయ్యాక ఖజీర్‌ఖాన్‌తో సయ్యద్‌ వంశపాలన ప్రారంభమైంది. ఈ వంశస్తులు క్రీ.శ. 1414 నుంచి క్రీ.శ.1451 వరకు రాజ్యపాలన చేశారు.


* ఖజీర్‌ఖాన్‌ అసమర్థత కారణంగా మాళ్వా, గుజరాత్, జాన్‌పూర్‌ పాలకులు స్వతంత్రం ప్రకటించుకున్నారు. ఇతడు క్రీ.శ. 1421లో మేవార్‌పై దాడిచేసి తిరిగి వస్తుండగా మార్గమధ్యలో అనారోగ్యంతో మరణించాడు. 


* ఖజీర్‌ఖాన్‌ వారసుల్లో ముబారక్‌షా (క్రీ.శ. 1421-1434) ‘దయామయుడు’గా పేరొందాడు. ఇతడు ‘ముబారకాబాద్‌’ను నిర్మించాడు. 


* ఇతడి తర్వాత మహమ్మద్‌బిన్‌ ఫరీద్‌ (క్రీ.శ. 1434-41), అల్లాఉద్దీన్‌ ఆలమ్‌షా (క్రీ.శ. 1441-51) ఢిల్లీని పాలించారు. వీరంతా అసమర్థులు. రాజకీయ సుస్థిరతను సాధించలేకపోయారు.


* సయ్యద్‌ వంశంలో చివరివాడు ఆలమ్‌షా. లాహోర్, సర్‌ హింద్‌ రాష్ట్రాల గవర్నర్‌గా పనిచేసిన బహలాల్‌ లోడీ క్రీ.శ.1451లో అల్లాఉద్దీన్‌ ఆలమ్‌షాను ఓడించి ఢిల్లీ సింహాసనంపై లోడీ వంశ అధికారాన్ని స్థాపించాడు.


లోడీ వంశం 


వీరు ఆఫ్గన్‌ తెగకు చెందినవారు. ఈ వంశీకులు క్రీ.శ. 1451 నుంచి క్రీ.శ. 1526 వరకు ఢిల్లీని పాలించారు. ఢిల్లీ సుల్తానుల్లో లోడీ వంశం చివరిది.


బహలాల్‌ లోడీ 


ఇతడు లోడీ వంశస్థాపకుడు. క్రీ.శ.1451 నుంచి 1489 వరకు రాజ్యపాలన చేశాడు. 


* ఇతడు జాన్‌పూర్‌పై దండెత్తి దాని పాలకుడైన హుస్సేన్‌షాను ఓడించాడు. ఆ రాజ్యాన్ని ఢిల్లీలో కలిపాడు. తర్వాత గ్వాలియర్‌పై దండయాత్ర చేసి ఆక్రమించాడు. 


* బహలాల్‌ లోడీ ప్రతిభావంతుడే అయినప్పటికీ తన పాలనా కాలంలో ఢిల్లీ వైభవాన్ని పునరుద్ధరించలేకపోయాడు.


సికిందర్‌ లోడీ 


క్రీ.శ. 1489 నుంచి క్రీ.శ. 1517 వరకు రాజ్యపాలన చేశాడు. ఇతడు బహలాల్‌ లోడీ కుమారుడు. అసలు పేరు నిజాం ఖాన్‌. సికిందర్‌ లోడీ బిరుదుతో సింహాసనాన్ని అధిష్టించాడు. 


* ‘షరియత్‌’ ప్రకారం రాజ్యపాలన చేశాడు. 


* ఇతడు అనేక హిందూ దేవాలయాలను ధ్వంసం చేశాడు. మధుర, నాగర్‌కోట, చందేరిలలోని ఆలయాలను నాశనం చేశాడు. యమునా నదిలో స్నానాలు చేయడాన్ని నిషేధించాడు. 


క్రీ.శ. 1504లో ఆగ్రా నగరాన్ని నిర్మించాడు.


ఇబ్రహీం లోడీ 


సికిందర్‌ లోడీ తర్వాత అతడి కుమారుడు ఇబ్రహీం లోడీ క్రీ.శ. 1517-26 వరకు రాజ్యపాలన చేశాడు. 


* ఇతడు నిరంకుశుడు. తనకు ఇబ్బందులు కలిగించే ఢిల్లీ సర్దారుల పట్ల క్రూరంగా వ్యవహరించాడు. 


* తన సోదరులు జాన్‌పూర్‌ గవర్నర్‌ జలాల్, గ్వాలియర్‌ గవర్నర్‌ ఆజమ్‌లను క్రూరంగా శిక్షించాడు. ఇతడు ముక్కోపి. 


* ఇతడి మరో సోదరుడైన దౌలత్‌ఖాన్‌ లోడీ విదేశీయుడైన బాబర్‌ను భారతదేశంపైకి దండెత్తాల్సిందిగా ఆహ్వానించాడు. 


* బాబర్‌ క్రీ.శ. 1526లో ఢిల్లీపై దండెత్తి మొదటి పానిపట్‌ యుద్ధంలో ఇబ్రహీం లోడీని ఓడించి, చంపాడు. దీంతో ఢిల్లీలో లోడీల పాలనతోపాటు, ఢిల్లీ సుల్తాన్‌ల పాలన కూడా అంతమైంది. వీరి స్థానంలో మొగల్‌ పాలన ప్రారంభమైంది.


* ఢిల్లీని పాలించిన చివరి రెండు రాజవంశాలు సయ్యద్, లోడీ. ఈ వంశాల రాజులు బలహీనులు. వీరు సామంత రాజులను నిలువరించలేకపోయారు. వీరు తమ పాలనాకాలాన్నంతా తిరుగుబాట్లను అణచడానికి వెచ్చించారు. దీంతో ఢిల్లీ సామ్రాజ్యం పతనమైంది.

     
 

Posted Date : 04-01-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌