• facebook
  • whatsapp
  • telegram

 దారాలు - దుస్తులు

అవసరాలకు.. ఆడంబరాలకు! 


 

 ఆది మానవుడి నుంచి ఆధునిక మనిషి ఆవిర్భవించడంలో వేషధారణకు ప్రధాన పాత్ర ఉంది. మారుతున్న జీవనశైలి, సౌకర్యాలకు అనుగుణంగా వస్త్రాల్లోనూ విప్లవాత్మక మార్పులు వచ్చాయి. సామాన్యుల నుంచి కుబేరుల వరకు స్తోమతకు తగిన దుస్తులు అందుబాటులో ఉన్నాయి. వీటి తయారీకి వినియోగించే సహజ, కృత్రిమ దారాలు, వాటి వనరులు, ఉత్పత్తి దశల గురించి పోటీ పరీక్షార్థులకు తగిన అవగాహన ఉండాలి. పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా సహజ దారాల లభ్యత సరిపోకపోవడంతో, కృత్రిమ దారాలను వినియోగిస్తున్న తీరును, అందులోని సాంకేతిక అంశాలనూ తెలుసుకోవాలి.

 ఎండ, వాన, చలి నుంచి శరీరాన్ని కాపాడుకోవడానికి మనుషులు దుస్తులు ధరిస్తారు. రక్షణ, అందంతో పాటు హోదాకు కూడా వస్త్రాలను సంకేతంగా భావిస్తారు. ఇవి అందరికీ ప్రాథమిక అవసరం. పిల్లలు, పెద్దలు, పలు రకాల దుస్తులు వేసుకుంటారు. పండగలు, పెళ్లిళ్లు లాంటి సందర్భాల్లో సంప్రదాయం ఉట్టిపడే ఆడంబరమైన దుస్తులతో ముస్తాబవుతారు. వివిధ వృత్తులవారు తమ వృత్తికి సంబంధించిన ప్రత్యేక దుస్తులను ధరిస్తారు. వాతావరణం, కాలానుగుణంగా పలు రకాల దుస్తులు అవసరమవుతాయి. వేసవిలో చెమట పీల్చుకొనే నూలు దుస్తులు, చలికాలంలో శరీరానికి వెచ్చదనాన్నిచ్చే ఉన్ని దుస్తులు, వర్షాకాలంలో త్వరగా ఆరిపోయే పాలియస్టర్‌ లాంటి దుస్తులు ధరించాలి. బైండింగ్‌లో ఉపయోగించే వస్త్రాన్ని ‘కాలికో’ అంటారు. పూర్వకాలంలో లోహాలతో కూడా దుస్తులను తయారుచేసేవారు. 

దారాలు:  దారాలు వాటి కర్బన పదార్థాల పాలిమర్ల నుంచి ఏర్పడతాయి. ఇవి సహజ దారాలు, కృత్రిమ దారాలు అని రెండు రకాలు.

1) సహజ దారాలు: మొక్కలు, జంతువుల నుంచి లభించే దారాలను సహజ దారాలు అంటారు. మొక్కల దారాల్లో సెల్యులోజ్, జంతువుల దారాల్లో ప్రొటీన్లు ఉంటాయి.

ఉదా: పత్తి (నూలు), ఉన్ని, పట్టు, గోగునార, జనపనార, కలబంద, కిత్తనార, కొబ్బరినార.

పత్తి: పత్తి పంటకు నల్లరేగడి నేలలు అనుకూలంగా ఉంటాయి. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో ఈ పంట అధికంగా పండిస్తారు. మొదట పత్తి నుంచి గింజలు తొలగిస్తారు. దూదిని వేళ్లతో పట్టుకుని లాగి పురిపెడుతూ దారాన్ని తయారుచేస్తారు. ఈ దారం మరింత గట్టిగా ఉండేలా తకిళి/రాట్నం లాంటి పరికరాలతో పురిపెడతారు. పత్తి నుంచి గింజలను తొలగించడాన్ని జిన్నింగ్, నూలు దారాలను వడకడాన్ని స్పిన్నింగ్‌ అంటారు.

పత్తికాయ జిన్నింగ్‌ నూలు పోగు శుభ్రపరచడం కడగడం దువ్వడం వడకడం  దారం నేయడం వస్త్రం

రెండు తెలుగు రాష్ట్రాల్లో చేనేత వస్త్ర పరిశ్రమ బాగా అభివృద్ధి చెందింది. ఉప్పాడ, వెంకటగిరి, ధర్మవరం, పొందూరు, చీరాల, మంగళగిరి ప్రాంతాల్లో చేనేత పరిశ్రమలు ప్రసిద్ధి పొందాయి. కలంకారీ అనేది ఒక రకమైన చేతి ముద్రిత నూలు వస్త్ర పరిశ్రమ. మచిలీపట్నం, పెడన కలంకారీ పరిశ్రమకు పేరు పొందిన ప్రాంతాలు. మచిలీపట్నం తివాచీ పరిశ్రమకు కూడా చిరునామాగా నిలిచింది. తెలంగాణలో గద్వాల్, సిరిసిల్ల, పోచంపల్లి, కొత్తకోట, నారాయణపేట ప్రాంతాల్లో చేనేత పరిశ్రమలున్నాయి.

జనపనార: జనుము మొక్కల కాండాల నుంచి దారాలను తయారుచేస్తారు.పూత దశకు వచ్చిన జనుము మొక్కల కాండాలను కొద్దిరోజులు నీటిలో నానబెడతారు. దాంతో వాటి కాండంపై బెరడు తొలగిపోయి దారాలు లభిస్తాయి. దీనినే ‘బంగారు దారం’ అంటారు. భారతదేశంలో జనపనార పంటను పశ్చిమ బెంగాల్, అస్సాం, ఒడిశా, బిహార్, ఉత్తర్‌ప్రదేశ్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రాల్లో ఎక్కువగా పండిస్తున్నారు. ఒక్క పశ్చిమ బెంగాల్‌ నుంచే 50% పైగా జనపనార ఉత్పత్తవుతోంది.

కొబ్బరి నార: భారతదేశంలో గ్రామీణ పరిశ్రమల్లో కొబ్బరి పీచు పరిశ్రమ ఒకటి. సుమారు 5 లక్షల మంది చేతివృత్తుల వారికి ఇది ఆదాయ వనరు. కొబ్బరి పీచు పరిశ్రమ కార్మికుల్లో 80% మహిళలే. ప్రధానంగా కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో ఈ పరిశ్రమ ఉంది.

కొబ్బరి పీచు ఉత్పత్తులు: కొబ్బరి పీచు నుంచి ప్రధానంగా పీచు, పొట్టు, తాళ్లు తయారుచేస్తారు. ఇవి పురాతన కాలం నుంచి వాడుకలో ఉన్నాయి. కొబ్బరి పీచును వ్యవసాయ, గృహ ప్రయోజనాలకు, నేలకోత నివారణకు ఉపయోగిస్తారు. పుట్టగొడుగుల పెంపకానికి ఒక ఆధార పదార్థంగా వాడతారు. గోధుమ రంగు కొబ్బరి పీచును టూత్‌బ్రష్‌లు, డోర్‌మ్యాట్లు, పరుపులు, సంచుల తయారీకి వినియోగిస్తారు.

పట్టు (సిల్క్‌): పట్టుపురుగు ఒక రకమైన కీటకం. శాస్త్రీయ నామం బాంబెక్స్‌ మోరి. దీని నుంచి పట్టు దారం తీస్తారు. ఈ పురుగుల ఆహారం మల్బరీ ఆకులు. పట్టు పురుగుల పెంపకాన్ని ‘సెరికల్చర్‌’ అంటారు. పట్టులో మల్బరీ పట్టు, టస్సారి పట్టు, ఈరీ పట్టు, ముంగా పట్టు అని నాలుగు రకాలుంటాయి. తెలుగు రాష్ట్రాల్లోని గిరిజనులు టస్సారి పట్టును ఉత్పత్తి చేస్తారు. దీనినే ‘దేశాలి పట్టు’ అంటారు. పట్టులో ఉండే ప్రొటీన్‌లు సిరిసిన్, ఫైబ్రోయిన్‌. పట్టుదారం తీసే రీలింగ్‌ కేంద్రాలు హైదరాబాద్, కరీంనగర్, నందికొట్కూర్‌లో ఉన్నాయి. సగటున ఒక పట్టుకాయ నుంచి లభించే దారం 1000 - 3000 అడుగులు. పట్టు పరిశ్రమల్లో పనిచేసే వారికి చర్మ, శ్వాస సంబంధ వ్యాధులు వస్తాయి.

* తెలంగాణలో పట్టు పట్టణం పోచంపల్లి (నల్గొండ). పోచంపల్లి పట్టునే టై అండ్‌ డై/జమదాని పట్టు అంటారు.

ఉన్ని (ఊలు): దీనిని జంతువుల వెంట్రుకల నుంచి తయారుచేస్తారు. ఉన్ని ఇచ్చే జంతువులు గొర్రె, మేక, జడల బర్రె, లామా, ఒంటె, అల్వకా. మేలైన ఉన్నిని ఇచ్చేవి మెరినో జాతి గొర్రెలు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో డెక్కన్‌ జాతి గొర్రెలను మాంసం, ఉన్ని కోసం పెంచుతారు. ఒంటె నుంచి లభించే ఉన్ని గరుకుగా ఉంటుంది. దీంతో కోట్లు, బ్లేజర్స్‌ తయారుచేస్తారు. లద్దాఖ్, టిబెట్‌ ప్రాంతాల్లో పెంచే జడల బర్రెల నుంచి పొడవైన వెంట్రుకలున్న ఉన్ని లభిస్తుంది. అంగోరా అనే పేరున్న కుందేలు నుంచి మెత్తని, తెలుపు రంగు ఉన్ని లభిస్తుంది. దీనితో రంగురంగుల కోట్లు తయారుచేస్తారు. అంగోరా మేక నుంచి లభించే ఉన్నిని మొహయిర్‌ అంటారు. కెష్మియర్‌ మేక నుంచి అతి ఖరీదైన ఉన్ని లభ్యమవుతుంది. దక్షిణ అమెరికాలో ఉన్ని కోసం పెంచే పొడవైన వెంట్రుకలున్న జంతువులు అల్వకా, లామా.

ఉన్ని దుస్తుల తయారీ దశలు: 1) కత్తిరించడం (షీరింగ్‌) 2) కడగడం (స్కోరింగ్‌) 3) వేరుచేయడం (సార్టింగ్‌) 4) విరంజనం చేయడం (బ్లీచింగ్‌) 5) రంగులు అద్దడం (డైయింగ్‌) 6) దువ్వడం (కార్డింగ్‌) 7) వడకడం (స్పిన్నింగ్‌) 8) అల్లడం (నిట్టింగ్‌) 9) చుట్టలు చుట్టడం (రోలింగ్‌) 10) ఉన్ని దుస్తులు (Wool)


2) కృత్రిమ దారాలు: వీటినే మానవ నిర్మిత దారాలు అంటారు.పెట్రో రసాయనాలతో తయారుచేస్తారు. ఇవి ప్రధానంగా నాలుగు రకాలు.

ఎ) నైలాన్‌: ప్రపంచంలో మొదటిసారిగా కృత్రిమ పద్ధతిలో దీనిని తయారుచేశారు. రెండో ప్రపంచ యుద్ధంలో ప్రాచుర్యం పొందిన దారమిది. చాలా దృఢంగా ఉంటుంది. నీటిని పీల్చుకోదు. గరుకుగా, మెరుపుతో ఉంటుంది. నైలాన్‌ మంటలకు త్వరగా మండిపోతుంది. ఈ దుస్తుల నుంచి స్థిర విద్యుత్తును పొందవచ్చు.

ఉపయోగాలు: నైలాన్‌ దారాలను టూత్‌బ్రష్‌లు, వలలు, వాహనాల టైర్లు, పరుపులు; పర్వతారోహణకు పారాచూట్‌ తాళ్లు, గుడారాల పైకప్పులు, ఈత దుస్తులు, గొడుగులు, తెరలు, తెరచాపల్లో ఉపయోగిస్తారు.


బి) రేయాన్‌: కలప గుజ్జుతో తయారుచేస్తారు. సెల్యులోజ్‌ దారం అని పిలుస్తారు. పట్టుకు ప్రత్యామ్నాయంగా తయారుచేయడంతో దీనిని కృత్రిమ పట్టుగా వ్యవహరిస్తారు. ఈ దారం మృదువుగా ఉండి, నీటిని బాగా పీల్చుకుంటుంది.

ఉపయోగాలు: చిన్నపిల్లల డైపర్స్‌లో ఉపయోగిస్తారు. ఎముకలు విరిగినప్పుడు, గాయాలైనప్పుడు కట్టు కట్టడానికి రేయాన్‌ వస్త్రాలు వాడతారు. రేయాన్‌ ఇతర దారాలతో సులువుగా కలిసిపోతుంది. రేయాన్, నూలు కలిపి బెడ్‌షీట్లు, రేయాన్, ఉన్ని కలిపి తివాచీలు తయారుచేస్తారు.


సి) ఆక్రలిన్‌: 1941లో దీనిని మొదటిసారిగా కనుక్కున్నారు. ఉన్నికి ప్రత్యామ్నాయంగా తయారుచేయడంతో ‘నకిలీ ఉన్ని’ అని పిలుస్తారు. ఇది మెరిసే గుణం, సాగే స్వభావంతో ఉంటుంది.

ఉపయోగాలు: దీనిని అల్లిక దారాలు, బ్యాగులు, బొమ్మలు, క్రీడాదుస్తులు, వాహనాలపై కప్పే కవర్లు, తక్కువ ఖరీదు స్వెటర్లు, శాలువాలు, కంబళ్ల తయారీకి వాడతారు.


డి) పాలిస్టర్‌: ప్రపంచంలో ప్రస్తుతం విరివిగా ఉపయోగిస్తున్న దారం పాలియస్టర్‌. దుస్తుల సంస్కృతిలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. అధికం సాగే గుణంతో, మృదువుగా ఉంటుంది.

ఉపయోగాలు: దుస్తుల తయారీలో, పొడవైన తాళ్ల తయారీలోనూ ఎక్కువగా వాడతారు. ఎక్స్‌-రే ఫిల్మ్‌లు, సోడా సీసాల్లోనూ ఉపయోగిస్తారు.

* అత్యంత ప్రసిద్ధి చెందిన పాలిస్టర్‌ ‘టెర్లిన్‌’

* టెర్లిన్‌ + ఉన్ని  టెరి ఊల్‌

* టెర్లిన్‌ + పట్టు టెరిసిల్క్‌

* టెర్లిన్‌ + నూలు టెరికాట్‌



మాదిరి ప్రశ్నలు

1. కిందివాటిలో మొక్కల నుంచి లభించే దారం?

1) ఉన్ని  2) పట్టు  3) నూలు  4) పైవన్నీ


2. కిందివాటిలో జంతువుల నుంచి లభించే దారం?

1) జనప నార   2) చాగమట్ట   3) నూలు   4) పట్టు

3. పత్తి నుంచి గింజలను తొలగించడాన్ని ఏమని పిలుస్తారు?

1) జిన్నింగ్‌   2) కార్డింగ్‌   3) స్పిన్నింగ్‌   4) డైయింగ్‌

4. కొబ్బరిపీచును కిందివాటిలో దేనికి ఆధార పదార్థంగా ఉపయోగిస్తారు?

1) పట్టుపురుగులు   2) మల్బరీ ఆకులు  3) పుట్టగొడుగులు   4) తేనెటీగలు

5. కిందివాటిలో నాణ్యమైన ఉన్ని ఇచ్చే జంతువు?

1) మేక   2) గొర్రె   3) కుందేలు   4) ఒంటె


6. దక్షిణ అమెరికాలో పొడవైన వెంట్రుకలున్న ఉన్ని కోసం పెంచే జంతువులు?

1) గొర్రెలు   2) ఒంటెలు   3) జడల బర్రెలు   4) అల్వకా, లామా

7. ప్రపంచంలో మొదటిసారిగా తయారుచేసిన కృత్రిమ దారం?

1) ఆక్రలిన్‌   2) పాలిస్టర్‌   3) రేయాన్‌   4) నైలాన్‌

8. కృత్రిమ పట్టుగా పిలిచే దారం?

1) నైలాన్‌   2) రేయాన్‌   3) ఆక్రలిన్‌   4) పాలిస్టర్‌

9. బంగారు దారంగా పిలిచే దారం?

1) నూలు దారం   2) కొబ్బరి నార   3) పట్టు దారం   4) జనుము దారం

10. ‘నకిలీ ఉన్ని’గా పిలిచే దారం?

1) రేయాన్‌   2) నైలాన్‌   3) ఆక్రలిన్‌   4) పాలిస్టర్‌


సమాధానాలు: 1-3; 2-4; 3-1; 4-3; 5-2; 6-4; 7-4; 8-2; 9-4; 10-3.



రచయిత: చంటి రాజుపాలెం

Posted Date : 27-10-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌