• facebook
  • whatsapp
  • telegram

విజయనగర సామ్రాజ్యం 

(సాళువ - ఆరవీటి వంశాలు)

దాయాదుల పోరు.. దండయాత్రల జోరు!

రాజ్య పాలనలో, సైనిక పాటవాల ప్రదర్శనలో, సాహితీ పోషణలో, హిందూ సంస్కృతి పరిరక్షణలో చిరకీర్తిని సంపాదించుకున్న విజయనగర సామ్రాజ్యం దక్షిణ భారతదేశ చర్రితలో అత్యంత ప్రత్యేక అధ్యాయాన్ని సొంతం చేసుకుంది. నిరంతర దండయాత్రలు, అంతర్యుద్ధాలను ఎదుర్కొంటూనే నాలుగు వంశాలు మూడు శతాబ్దాలకు పైగా పాలన సాగించాయి. ముస్లింల దాడులను తట్టుకుని, దక్షిణాదిపై ఇస్లాం మత ప్రభావాన్ని నిలువరించాయి. అందులోని సాళువ వంశ పాలకులు సామ్రాజ్యాన్ని శక్తిమంతంగా మారిస్తే, ఆరవీటి రాజులు అనేక తిరుగుబాట్లను అణచి వేసినప్పటికీ, శత్రు దాడులతో, దాయాదుల అంతర్గత కలహాలతో క్రమంగా పాలనను క్షీణ దశకు చేర్చారు. ఈ నేపథ్యంలో సాళువ,  ఆరవీటి వంశ పాలకుల చరిత్ర, వారి పాలనాశైలి, ఎదుర్కొన్న యుద్ధాలు, చేసిన సాహిత్య సేవ గురించి అభ్యర్థులు వివరంగా తెలుసుకోవాలి. రాజు బలహీనమైన ప్రతిసారీ అంతర్గతంగా వచ్చిన తిరుగుబాట్లు, రాజధానులు మారిన క్రమాన్ని అర్థం చేసుకోవాలి.


సాళువ వంశం (1485-1505)


సాళువ రాజుల జన్మస్థలం కర్ణాటకలోని ‘కల్యాణపురం’. సాళువ మంగు బిరుదు ‘ప్రతిపక్ష సాళువ’. దక్షిణప్రాంత ఆక్రమణలో కుమార కంపరాయలకు సహాయపడ్డాడు. విజయనగర రాజుల నుంచి చంద్రగిరి రాజ్యంలోని ‘నారాయణవనం’ అనే ప్రాంతాన్ని పొందాడు. సాళువ మంగు సంతతి వారు నారాయణవనాన్ని విస్తరించి, చంద్రగిరిని రాజ్యంగా చేసి విజయనగర రాజులకు సామంతులుగా మారారు.సాళువ మంగు కుమారుడు గీతరాజు. అతడి కుమారుడు గండరాజు. ఇతడి కుమారులు నరసింహరాజు, తిమ్మరాజు.విజయనగర సామ్రాజ్యంలో సాళువ వంశ పాలనను సాళువ నరసింహరాయలు ప్రారంభించాడు.


సాళువ నరసింహరాయలు (1485-1491): ఇతడు గొప్పయోధుడు. రాజనీతి కలిగినవాడు. సాళువ వంశస్థాపకుడు. ఈ వంశ పాలన గురించి ‘దేవులపల్లి శాసనం’ తెలియజేస్తోంది. దానిని వేయించింది సాళువ నరసింహరాయలు. విరూపాక్ష రాయల దుష్టపరిపాలన వల్ల విచ్ఛిన్నమవుతున్న రాజ్యాన్ని రక్షించడానికి శక్తివంచన లేకుండా ప్రయత్నించాడు. చంద్రగిరి ప్రాంత పాలకుడిగా ఉన్నప్పుడే 1470లో తీరాంధ్రలో కృష్ణానది వరకు జయించాడు. ఈ విజయాల కారణంగా ‘రాయ మహారసు’ అనే బిరుదు పొందాడు.


సాళువ నరసింహరాయల విజయనగర సింహాసన ఆక్రమణ దురాక్రమణే అయినప్పటికీ పరిస్థితుల ప్రభావం వల్ల అది తప్పనిసరైంది. విజయనగరాన్ని నరసింహరాయలు ఆక్రమించకపోయి ఉండకపోతే ఈ సామ్రాజ్యం పదిహేనో శతాబ్దం చివరికే అంతరించి పోయి ఉండేదని, విచ్ఛిన్నమైపోయేదని, ఈ దురాక్రమణ కారణంగానే తల్లికోట యుద్ధం మరో 80 ఏళ్ల తర్వాత జరిగిందని చరిత్రకారుల అభిప్రాయం. సాళువ నరసింహరాయలు కేవలం ఆరేళ్లు పరిపాలించాడు. ఇతడి కాలంలో పురుషోత్తమ గజపతి విజయనగరంపై దండెత్తి ఉదయగిరి దుర్గాన్ని ఆక్రమించాడు (1513లో శ్రీకృష్ణదేవరాయలు జయించే వరకు ఉదయగిరి గజపతుల ఆధీనంలోనే ఉంది). ఉదయగిరితో పాటు కొండవీటి రాజ్యం కూడా గజపతుల ఆధీనంలోకి వెళ్లిపోయింది. కృష్ణా - తుంగభద్ర అంతర్వేది, రాయచూర్‌ దుర్గం బహమనీ సుల్తానుల ఆధీనంలో ఉన్నాయి. ఈ ప్రాంతాలను ఆక్రమించకుండానే నరసింహరాయలు మరణించాడు. తన పాలనాకాలంలో అరేబియా నుంచి గుర్రాలను దిగుమతి చేసుకున్నాడు. అరబ్బు అశ్వికదారులను సైన్యంలో చేర్చుకున్నాడు. ఇతడి ఆస్థాన కవుల్లోని రాజనాథడిండిముడు సాళువాభ్యుదయం గ్రంథాన్ని రాశాడు. పిల్లలమర్రి పినవీరభద్రుడు శృంగార శాకుంతలం, జైమినీ భారతం రచించాడు. జైమినీ భారతంలో పినవీరభద్రుడు ‘వాణి నా రాణి’ అనే పదాన్ని ఉపయోగించాడు. సాళువ నరసింహరాయుడి గ్రంథం ‘రామాభ్యుదయం’. ఇతడి సేనాని తుళువ నరసనాయకుడు. ప్రముఖ వాగ్గేయకారుడు, పదకవితా పితామహుడైన తాళ్లపాక అన్నమాచార్య సాళువ నరసింహరాయలకు సమకాలీకుడు.


ఇమ్మడి నరసింహరాయలు (1491-1505): సాళువ నరసింహరాయల తర్వాత సింహాసనాన్ని తిమ్మరాయలు అధిష్టించాడు. అతడు కొద్దికాలానికే మరణించడంతో అతడి తమ్ముడు ఇమ్మడి నరసింహరాయలు పాలనా పగ్గాలు చేపట్టాడు. కానీ వాస్తవ అధికారాన్ని చెలాయించింది తుళువ నరసనాయకుడు. ఇమ్మడి నరసింహరాయలకి యుక్తవయసు వచ్చిన తర్వాత, నరసనాయకుడి ప్రాబల్యాన్ని సహించలేక, అతడిని తొలగించి నాదెండ్ల తిమ్మరసుని ప్రధానమంత్రిగా నియమించాడు.దాంతో నరసనాయకుడు పెనుగొండకు వెళ్లి సైన్యాన్ని సమకూర్చుకుని వచ్చి, విజయనగరంపై దండెత్తి తిమ్మరసును వధించాడు. ఇమ్మడి నరసింహరాయలను పెనుగొండ దుర్గంలో బంధించాడు. ఇది విజయనగర చరిత్రలో రెండో దురాక్రమణ. నరసనాయకుడి దురాక్రమణపై ఆగ్రహించిన సామంతులు తిరుగుబాటు చేశారు. ఆ తిరుగుబాటును నరసనాయకుడు అణచివేశాడు. ఈ సమయంలోనే గజపతుల రాజు ప్రతాపరుద్రుడు, బీజాపూర్‌ పాలకుడు యూసఫ్‌ ఆదిల్‌ షా విజయనగరంపై దండెత్తారు. దాన్ని నరసనాయకుడు తిప్పికొట్టాడు. నరసనాయకుడు విజయనగర సింహాసనాన్ని ఆక్రమించినప్పటికీ ఇమ్మడి నరసింహరాయలకి సంరక్షకుడిగానే ఉన్నాడు. ఈ కాలంలోనే 1498 మే, 17న వాస్కోడిగామా భారతదేశానికి వచ్చాడు. తుళువ నరసనాయకుడు 1503లో మరణించాడు. ఇతడికి ముగ్గురు భార్యలు, నలుగురు కుమారులు వీరనరసింహరాయలు (తల్లి తిప్పాంబ), శ్రీకృష్ణదేవరాయలు (తల్లి నాగులాంబ), రంగరాయలు, అచ్యుతరాయలు (తల్లి ఓబాంబిక). నరసనాయకుడి మరణాంతరం రాజ్యాధికారం వీరనరసింహరాయల చేతికి వచ్చింది. పెనుగొండలో బందీగా ఉన్న ఇమ్మడి నరసింహరాయలను వధించి 1505లో పట్టాభిషేకం చేసుకున్నాడు. ఈ ఘటనతో సాళువ వంశపాలన అంతమై, తుళువ వంశ పాలన ప్రారంభమైంది.

ఆరవీటి వంశం (1570-1680)

ఈ వంశస్థాపకుడు తిరుమల రాయలు. రాజధాని ‘పెనుగొండ’. అయిదుగురు రాజులు 110 సంవత్సరాలు పరిపాలించారు. కర్నూలు జిల్లా ఆరవీడు కేంద్రంగా ప్రసిద్ధులు కావడంతో వీరి వంశానికి ఆరవీటి వంశం అనే పేరొచ్చింది. వీరు కాకతీయుల కాలంలో మహారాష్ట్ర నుంచి వచ్చి ఆంధ్రలో స్థిరపడ్డారు. ఆరవీటి సోమరాజు అనెగొందిలో ముస్లింలపై పోరాటం చేశాడు. విజయనగర రాజుల కొలువులో చేరాడు. సాళువ నరసింహరాయల వద్ద సేనాధిపతిగా పనిచేసిన ఆరవీటి తిమ్మరాజు కుమారులే రామరాయలు, వెంకటాద్రి, తిరుమలరాయలు. వీరిలో రామరాయలు, వెంకటాద్రి తళ్లికోట యుద్ధంలో మరణించారు. ఓటమి నిశ్చయమైన తర్వాత తిరుమలరాయలు విశేష ధనరాశులతో మంత్రి సదాశివరాయలను వెంటబెట్టుకుని పెనుగొండకు పారిపోయాడు. ధ్వంసమైన విజయనగరం (హంపి)ని పునర్నిర్మించేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. సదాశివరాయల మరణం తర్వాతŸ తుళువ వంశం అంతమైంది.


తిరుమల రాయలు (1570-1572): ఇతడు ఆరవీటి వంశస్థాపకుడు. రాజధాని పెనుగొండ. పట్టాభిషేకం జరిగే సమయానికి 90 ఏళ్ల వృద్ధుడు. కేవలం రెండేళ్లు పరిపాలించాడు. వయోవృద్ధుడు కావడంతో ముస్లింలు ఆక్రమించుకున్న రాజ్యాలను తిరిగి పొందలేకపోయాడు. కానీ గత వైభవాన్ని పొందడానికి ప్రయత్నించాడు. గొప్ప సాహితీవేత్త. జయదేవుని గీతగోవిందానికి వ్యాఖ్యానం రాశాడు. ఇతడి ఆస్థాన కవి రామరాజ భూషణుడు ‘వసుచర్రిత’ అనే గ్రంథం రాసి తిరుమల రాయలకి అంకితం ఇచ్చాడు.


మొదటి శ్రీరంగరాయలు (1572-1585): ఇతడు తిరుమల రాయుడి కుమారుడు. ఇతడు సమర్థుడైనప్పటికీ మధుర, జింజి, తంజావూరు సామంతుల తిరుగుబాట్లు ఎదుర్కొన్నాడు. ఇతడి కాలంలో బహమనీ సుల్తానులు తరచూ దండయాత్రలు చేశారు. బంధువులు, సామంతుల నమ్మకద్రోహం వల్ల ఆ దాడులను సమర్థంగా ఎదుర్కోలేకపోయాడు.  ఆ సమయంలోనే కులీ కుతుబ్‌షా కొండవీడును, ఇస్మాయెల్‌ ఆదిల్‌ షా కర్నూలును ఆక్రమించుకున్నారు.


రెండో వేంకటపతి రాయలు (1585-1614): ఇతడు మొదటి శ్రీరంగరాయల సోదరుడు. విజయనగర రాజుల్లో ఎక్కువ కాలం పరిపాలన చేసినవాడు. రెండో శ్రీకృష్ణదేవరాయలుగా, రెండో ఆంధ్రభోజుడిగా పేరుపొందాడు. మొగల్‌ చక్రవర్తి అక్బర్‌కి, గోల్కొండ రాజు మహ్మద్‌ కులీకుతుబ్‌షాకి సమకాలీనుడు. ముస్లింలు ఆక్రమించిన ప్రాంతాలను తిరిగి పొందాలని ప్రయత్నించారు. గోల్కొండ సుల్తాన్‌ కుతుబ్‌షా దాడులను వీరోచితంగా ఎదుర్కొన్నాడు. బీజాపూర్‌ సుల్తాన్‌ దాడులను తిప్పికొట్టి, అతడు ఆక్రమించుకున్న ప్రాంతాలను తిరిగి పొందాడు. మైసూరు, రాయలసీమ, తమిళనాడుల్లో సామంతుల తిరుగుబాట్లను అణచివేశాడు. రాజధానిని  పెనుగొండ నుంచి చంద్రగిరికి, అక్కడి నుంచి వెళ్లూరుకు మార్చాడు.తన సార్వభౌమాధికారాన్ని అంగీకరించమని  అక్బర్‌ రాయబారిని పంపితే ‘‘నేను మహ్మదీయుల పాదాలు ముట్టను. అక్బర్‌ దండెత్తి వస్తే యుద్ధం తప్పనిసరి’’ అని బదులిచ్చాడు. హిందూ స్వతంత్ర లక్షణాన్ని చాటి ధీరుడై నిలిచాడు. విదేశీయుల పట్ల గౌరవ మర్యాదలతో వ్యవహరించాడు. పోర్చుగీసు రాజుతో, స్పెయిన్‌ రాజు రెండో ఫిలిప్‌తో సత్సంబంధాలు ఉన్నాయి. డచ్‌ వారికి ‘పులికాట్‌’ వద్ద వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అనుమతిచ్చాడు. చంద్రగిరిలో క్రైస్తవ మత ప్రచారానికి, చర్చి నిర్మాణానికి ఆమోదం తెలిపాడు. ఇతడు సాహితీ పోషకుడు. ఆస్థానంలో అయ్యప్ప దీక్షితులు (శైవార్క్‌ మణిదీపిక), విరూపాక్ష పండితుడు   (చెన్న బసవపురాణం), భట్టలంక దేవుడు (జైన వ్యాకరణం) లాంటి కవులున్నారు.


రెండో శ్రీరంగరాయలు (1614-1616): రెండో వేంకటపతిరాయల మరణానంతరం సింహాసనం కోసం ఆరవీటి వంశంలో అంతర్యుద్ధం ఏర్పడింది. సామంతులు రెండు వర్గాలుగా విడిపోయారు. అన్న కుమారుడైన రెండో శ్రీరంగరాయలు అధికారాన్ని పొందాడు. చివరకు హత్యకు గురయ్యాడు. తర్వాత అతడి కుమారుడు రామదేవరాయలు రాజయ్యాడు.


రామదేవ రాయలు (1616-1630): ఇతడు తాను రాజు కావడానికి కారకుడైన జగ్గారాయుడి సోదరుడు యతిరాజు కుమార్తెను వివాహం చేసుకున్నాడు. ఇది నచ్చని యాచమ నాయకుడి కొడుకైన వెలుగోటి కస్తూరి రంగప్ప తిరుగుబాటు చేశాడు. అనంతర కాలంలోనూ అనేకమంది సామంతులు తిరుగుబాట్లు చేశారు.


మూడో వేంకటపతిరాయలు (1630-1643): రామదేవ  రాయల తర్వాత అతడి పినతండ్రి మూడో వేంకటపతిరాయలకి రాజ్యాధికారం దక్కింది. కానీ ఇతడి పరిపాలనా కాలం అధికంగా యుద్ధాలతో గడిచింది. వేంకటాద్రి, అయ్యప్పల మధ్యవర్తిత్వంతో మద్రాసును ఆంగ్లేయులకు అప్పగించాడు. ఇతడి కాలంలో ‘సర్‌ ఫ్రాన్సిస్‌ డే’ మద్రాసు వద్ద సెయింట్‌ జార్జ్‌ కోటను నిర్మించాడు.


మూడో శ్రీరంగరాయలు (1643-1680): ఈ వంశంలో చివరివాడు. బీజాపూర్‌ సుల్తాన్‌ సహాయంతో గోల్కొండ రాజుల దాడిని తిప్పికొట్టాడు. కానీ బీజాపూర్‌ సుల్తాన్, గోల్కొండ సుల్తాన్‌లు సంయుక్తంగా దాడి చేయడంతో మైసూర్‌ పారిపోయాడు. చివరకు గోల్కొండ సుల్తాన్‌ అబ్దుల్లా హుస్సేన్‌ చేతిలో ఓడిపోయి, 1680లో అనెగొంది వద్ద మరణించాడు. ఇతడి మరణంతో విజయనగర సామ్రాజ్యం  అంతమైంది.


రచయిత: గద్దె నరసింహారావు 

Posted Date : 05-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌