• facebook
  • whatsapp
  • telegram

జలకాలుష్యం

 హానికర జలాలు.. అనర్థాలకు మూలాలు!

 



 

జలుబు చేయడం, జ్వరం రావడం, శ్వాసకు ఇబ్బంది కలగడం, నాడీవ్యవస్థ సక్రమంగా పనిచేయకపోవడం, అతిసారం, జలాశయాల్లో వ్యర్థాల తెట్టు ఏర్పడటం, సముద్రపు అలలు ఎర్రగా మారడం, మొక్కలు పెరగకపోవడం, పంటల దిగుబడులు తగ్గిపోవడం తదితరాలన్నింటికీ కారణం కలుషిత జలాలు. మనిషి ఆరోగ్య సమస్యలకు, మరెన్నో జీవరాశుల ప్రాణాలకు నీరు ప్రమాదకరంగా పరిణమించడానికి మూలం కాలుష్యం.  ఈ నేపథ్యంలో జలకాలుష్యం రకాలు, దాని వల్ల కలిగే వ్యాధులు, నివారణకు ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలపై పోటీ పరీక్షార్థులకు తగిన అవగాహన ఉండాలి. 

భూమిని ఆవరించి ఉన్న జలావరణంలోని సముద్రాలు, మహాసముద్రాల్లో 97.25% ఉప్పునీరు, మిగిలిన 2.75% మంచినీరు ఉంది. ఆ మంచినీటిలోనూ 2% హిమం, హిమానీ నదాల్లోనే ఉంది. వాస్తవానికి జలావరణంలో సుమారు 1% మాత్రమే మనిషి అవసరాలకు భూగర్భం, భూఉపరితలం నుంచి మôచినీరుగా లభిస్తోంది. ఇదే సమస్త జీవరాశుల మనుగడకు ఆధారం. కానీ మనిషి అదుపు లేని అభివృద్ధి కార్యకలాపాల వల్ల అందుబాటులో ఉన్న ఆ కాస్త నీరు కూడా కలుషితమైపోతోంది.  

ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన నిర్వచనం ప్రకారం ‘ఏవైనా అవాంఛనీయ పదార్థాలు నీటిలో కలిసి భౌతిక, రసాయనిక, జీవసంబంధ మార్పులకు కారణమై, ఆ నీటిని తాగడానికి, మొక్కలు ఆహ్లాదకరంగా పెరగడానికి వీలు లేకుండా చేయడాన్ని జలకాలుష్యం అంటారు’. భారతీయ ప్రమాణాల సంస్థ (ఐఎస్‌ఐ) ప్రకారం నాణ్యమైన తాగునీటికి రంగు, రుచి, వాసన అనే లక్షణాలు ఉండవు. నీటి గాఢత 6.0  9.0 pH మధ్యలో ఉంటుంది. నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్‌ 3 ppm (పార్ట్స్‌ పర్‌ మిలియన్‌) ఉండాలి.

 పరిశ్రమల నుంచి వెలువడే అనేక కర్బన, అకర్బన పదార్థాలు; విషతుల్య రసాయనాలు జలాలను కలుషితం చేస్తున్నాయి. గృహ సంబంధ వ్యర్థాలు, ఎరువులు, క్రిమిసంహారక మందుల వినియోగం వల్ల వచ్చిన వ్యవసాయ సంబంధ వ్యర్థాలు, అణు రియాక్టర్ల నుంచి వెలువడే రేడియోధార్మిక పదార్థాలు, సముద్రాలపై పేరుకుపోయిన చమురు తెట్టులాంటి అనేక వ్యర్థాలు నిత్యం స్వచ్ఛ జలాలు కాలుష్యం బారిన పడేందుకు కారణమవుతున్నాయి.

వివిధ అంచనాలు: జలకాలుష్యాన్ని రకరకాలుగా అంచనా వేస్తారు.

1) విలీన ఆక్సిజన్‌ (DO - డిజాల్వ్‌డ్‌ ఆక్సిజన్‌): నీటిలో కరిగిన ఆక్సిజన్‌ను విలీన ఆక్సిజన్‌ అంటారు. ఇది నీటి నాణ్యతను నిర్ధారించేందుకు మంచి కొలమానం. జలాల్లో ఆక్సిజన్‌ పరిమాణం 5ppm కంటే ఎక్కువగా ఉన్నప్పుడే ఆ నీరు తాగడానికి, వ్యవసాయానికి, జలచరాల నివాసానికి ఉపయోగపడుతుంది. విలీన ఆక్సిజన్‌ 5ppm కంటే తగ్గితే ఆ జలాలు కాలుష్యం బారిన పడినట్లు పేర్కొంటారు.

2) జీవ ఆక్సిజన్‌ గిరాకీ (BOD - బయోలాజికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌): నిర్ణీత ఘనపరిమాణం ఉన్న నీటిలో కర్బన వ్యర్థ పదార్థాలను సూక్ష్మజీవులు జీవ, రసాయన ఆక్సీకరణ చర్య జరపడంలో వినియోగించుకునే ఆక్సిజన్‌ పరిమాణాన్ని జీవ ఆక్సిజన్‌ గిరాకీ అంటారు. నీటిలో ఆక్సిజన్‌ పరిమాణం సూక్ష్మజీవులు 5 లేదా 7 రోజులకు వినియోగించుకోగలిగిన అవధి ఆధారంగా జీవ ఆక్సిజన్‌ గిరాకీని కొలుస్తారు. 

3) రసాయన ఆక్సిజన్‌ గిరాకీ (COD- కెమికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌): నిర్ణీత ఘనపరిమాణం ఉన్న నీటిలో కర్బన పదార్థాలను ఆక్సీకరించడానికి, బలమైన రసాయన కారకాలకు అవసరమైన ఆక్సిజన్‌కు సమానంగా పొటాషియం డై క్రోమేట్‌ ద్రావణం నుంచి పొందగలిగే ఆక్సిజన్‌ను రసాయన ఆక్సిజన్‌ గిరాకీ అంటారు. గంటల వ్యవధిలో ఎంత ఆక్సిజన్‌ అవసరం ఉంటుందనే అంశం ఆధారంగా రసాయన ఆక్సిజన్‌ డిమాండ్‌ను లెక్కిస్తారు.

4) యూట్రోఫికేషన్‌: జలాశయాల్లో పోషకాల పరిమాణం పెరిగినప్పుడు ఆకుపచ్చని శైవలాలు, అకశేరుకాలు గుంపుగా నీటిపై చేరి తెట్టు మాదిరిగా తేలియాడుతుంటాయి. దాంతో నీరు చిక్కగా, ఆకుపచ్చగా మారి చెడు వాసనను వెదజల్లుతుంది. ఈ స్థితిని యూట్రోఫికేషన్‌ అంటారు. దీన్నే శైవల మంజరులుగా వ్యవహరిస్తారు. ఈ చర్య వల్ల నీటిలోని ఆక్సిజన్‌ తగ్గి చేపలు, జలచరాలు చనిపోతాయి. పంట పొలాలు, రొయ్యలు, చేపల చెరువుల నుంచి వెలువడే ఫాస్ఫేట్స్, నైట్రేట్స్‌ లాంటి పోషకాల వల్ల; నివాస, పారిశ్రామిక ప్రాంతాల నుంచి విడుదలయ్యే మురుగు నీటి వల్ల యూట్రోఫికేషన్‌ కాలుష్యం ఏర్పడుతుంది. ఫలితంగా నీటి ద్వారా సంక్రమించే పోలియో, అతిసారం, టైఫాయిడ్, కామెర్ల లాంటి వ్యాధులు వస్తాయి. టెర్రర్‌ ఆఫ్‌ బెంగాల్‌గా పిలిచే నీటి ‘హైయాసింత్‌’ ప్రపంచంలోనే అత్యంత సమస్యాత్మకమైన నీటి కలుపు మొక్క. పోషకాలు ఎక్కువగా ఉన్న యూట్రోఫిక్‌ నీటి ఆవాసాల్లో ఇవి ఎక్కువగా పెరుగుతాయి. తద్వారా నీటి కుంటల జీవావరణ వ్యవస్థ దెబ్బతింటుంది. 

5) ఓలిగోట్రోఫికేషన్‌: ఇది యూట్రోఫికేషన్‌కు వ్యతిరేకమైన స్థితి. కొత్తగా తవ్విన బావులు, చెరువులు, సరస్సుల్లో సాధారణంగా నీరు నిలకడగా ఉంటుంది. సరైన పోషక పదార్థాలు ఉండక యూట్రోఫికేషన్‌ కాలుష్యం జరగదు. నీరు స్వచ్ఛంగా ఉంటుంది. జలాశయాలకు ఉండే ఈ స్థితినే ఓలిగోట్రోఫికేషన్‌ అంటారు.

6) రెడ్‌ టైడ్స్‌: సముద్రాల్లోకి మానవ జనిత ఉద్గారాలు చేరినప్పుడు ఆ వ్యర్థాలను విచ్ఛిన్నం చేసే ప్రక్రియలో అక్కడి డైనోఫ్లాజెల్లేట్స్‌ అనే సూక్ష్మజీవులు కొన్ని రసాయనాలను నీటిలోకి విడుదల చేస్తాయి. ఫలితంగా ఆ ప్రాంతంలో సముద్రపు నీరు ఎర్రగా మారుతుంది. దీని ప్రభావం వల్ల తీరం వద్ద అలలు ఎర్రగా కనిపిస్తాయి. వీటిని రెడ్‌ టైడ్స్‌ అంటారు. 

7) భారలోహ కాలుష్యం: పరిశ్రమల నుంచి విడుదలయ్యే వ్యర్థాలు నీటిలో కలవడంతో జింక్, కాపర్, కాడ్మియం, మెర్క్యురీ, ఆర్సెనిక్, క్రోమియం, కోబాల్ట్‌ లాంటి భార లోహాల వల్ల మానవులు అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. 

8) చమురు కాలుష్యం: సముద్ర నీటిపై ఓడల నుంచి ఆయిల్‌ స్పిల్‌ జరిగి సముద్ర జలాలు చమురుతో కలుషితమవుతున్నాయి. వీటి నుంచి విడుదలయ్యే పారాఫిన్, మీథేన్, ఈథేన్‌ లాంటి వాయువులను పీల్చినప్పుడు శ్వాస సంబంధ వ్యాధులు వస్తాయి. ఆక్సిజన్‌ నీటిలో కరగకుండా చమురు తెట్టు అడ్డుకుంటుంది. దాంతో ఆక్సిజన్‌ డిమాండ్‌ పెరిగి సముద్ర జలచరాలకు ప్రాణహాని కలుగుతుంది. సముద్ర జలాల్లో పేరుకుపోయిన చమురును సూడోమోనాస్‌ బ్యాక్టీరియా ద్వారా విక్షాళనం చెందించవచ్చు. భారత సంతతికి చెందిన ఆనంద చక్రవర్తి అనే అమెరికన్‌ శాస్త్రవేత్త సముద్ర జలాల్లోని చమురు కాలుష్యాన్ని తొలగించే ‘ఆయిల్‌ ఈటింగ్‌ బ్యాక్టీరియా’ అనే సూపర్‌ బగ్‌ను రూపొందించారు.


వ్యాధులు: కొన్ని రకాల భార లోహాలు కరిగిన నీటిని తాగడం వల్ల రకరకాల వ్యాధులు వస్తాయి. 

పాదరసం: సాధారణంగా నీటిలో 0.001 మి.గ్రా./లీటర్‌ పాదరసం కరిగి ఉండటం వల్ల ఎలాంటి హాని ఉండదు. కానీ ఆ మోతాదుకు మించి పాదరసం నీటిలో కలిస్తే పెదవులు, చేతులు స్పర్శజ్ఞానాన్ని కోల్పోవడం, వినికిడి సామర్థ్యం, కంటి చూపు తగ్గిపోవడం లాంటి సమస్యలు తలెత్తుతాయి. జపాన్‌లోని మినమాటా గ్రామంలో ఇలాంటి వ్యాధి లక్షణాలు గమనించడం వల్లే దీన్ని మినమాటా వ్యాధి అంటారు. కాగితం, రంగుల పరిశ్రమల నుంచి వచ్చే మెర్క్యురీ జలాల్లో కలిసి డై మిథైల్‌ మెర్క్యురీగా నీటిలో కరుగుతుంది. ఈ నీటిలోని చేపలను ఆహారంగా తీసుకునే మనిషిలోకి ఇది ప్రవేశిస్తుంది.

కాడ్మియం: ఇది సాధారణంగా జలాల్లో 0.01 మి.గ్రా./లీటర్‌ కరిగి ఉంటే ప్రమాదం లేదు. అంతకుమించి ఉంటే మూత్రపిండాలు, కేంద్రీయ నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ఎముకలు విరూపణ చెందడం, రక్తహీనత, స్త్రీలలో సంతానోత్పత్తి శక్తి తగ్గిపోవడం లాంటి సమస్యలు ఏర్పడతాయి. జింక్‌ తయారు చేసే పరిశ్రమల నుంచి కాడ్మియం విడుదలవడం వల్ల జపాన్‌లోని ఇటాయ్‌ ప్రాంతంలో దీని ప్రభావాన్ని మొదట కనుక్కున్నారు. అందుకే ఆ వ్యాధిని ఇటాయ్‌ ఇటాయ్‌ అంటారు.

నైట్రేట్స్‌: తాగునీటిలో సాధారణంగా 4.5 మి.గ్రా/లీటర్‌ పరిమాణంలో నైట్రేట్స్‌ ఉంటే సరిపోతుంది. అంతకంటే ఎక్కువ పరిమాణంలో ఉంటే అవి రక్తంలోని హిమోగ్లోబిన్‌తో కలిసి మెటా హిమోగ్లోబినియాగా మారి శరీర కణజాలాలకు ఆక్సిజన్‌ సరఫరా తగ్గిపోతుంది. దాంతో దుష్ప్రభావాలు కలుగుతాయి. శిశువులు నీలి రంగులో జన్మించడం, క్యాన్సర్‌ వ్యాధులు ప్రబలడం లాంటి పరిణామాలు జరుగుతాయి. తాగునీటిలో నైట్రేట్‌ మలినాలు ఎక్కువగా చేరడానికి కారణం పరిమితికి మించి ఎరువులను వినియోగించడం, భూగర్భజలంలో నైట్రేట్స్‌ గాఢత పెరిగిపోవడమే.

కాపర్‌: తాగేనీటిలో కాపర్‌ అధికంగా ఉంటే అధిక రక్తపోటు, అప్పుడప్పుడు జ్వరం రావచ్చు.

క్రోమియం: తాగునీటిలో ఎక్కువ పరిమాణంలో క్రోమియం ఉంటే క్యాన్సర్, కేంద్రనాడీ మండలానికి సంబంధించిన రుగ్మతలు, మూత్రపిండాల వాపు లాంటివి సంభవిస్తాయి.

కోబాల్ట్‌: పరిమితికి మించి కోబాల్ట్‌ నీటిలో కరిగి ఉంటే ఆ నీటిని స్వీకరించడం వల్ల పక్షవాతం, అతిసారం, రక్తపోటు తగ్గడం,  ఎముకల బలహీనత లాంటివి వస్తాయి.


జల కాలుష్య నివారణ చర్యలు:

ట్రిక్లింగ్‌ ఫిల్టర్‌: ఇదో రకమైన మురుగు నీటి శుద్ధి వ్యవస్థ. చిన్న గులకరాళ్లతో తయారుచేసిన బెడ్‌ లాంటి నిర్మాణం. దీనిపైకి మురుగు నీటిని ప్రవేశపెట్టినప్పుడు నీరు వడపోతకు గురై పరిశుభ్రమైన నీరుగా మారుతుంది.

రొటేటింగ్‌ బయలాజికల్‌ కాంటాక్టర్‌: వలయాకార ప్లాస్టిక్‌ ఫలకలు ఒకదాని పక్కన మరొకటి అమరి ఉంటాయి. వీటిపై మురుగు నీరు ప్రవేశించినప్పుడు సూక్ష్మజీవులు సేంద్రియ పదార్థాన్ని విచ్ఛిన్నం చేస్తాయి.

తిరోగమన ద్రవాభిసరణ: ఇది నీటిలో కరిగి ఉన్న అవాంఛనీయ లవణాలను తొలగించే ప్రక్రియ. ఎక్కువ గాఢత నుంచి తక్కువ గాఢతకు అయాన్లు, అణువులను రవాణా చేసి నీటిని శుద్ధి చేసే కార్యక్రమం.

అడ్వాన్స్‌డ్‌ సీవేజ్‌ ట్రీట్‌మెంట్‌: ఇది యంత్రాల ద్వారా జరిగే నీటి శుద్ధి కార్యక్రమం. ఇదొక ఆధునిక మురుగు శుద్ధి ప్రక్రియ.


నీటి కాలుష్య నివారణకు ప్రభుత్వం చేపట్టిన చర్యలు: 

* జల కాలుష్య నియంత్రణ చట్టం - 1974 

* గంగా కార్యాచరణ ప్రణాళిక - 1985 

* జాతీయ నదీ సంరక్షణ కార్యక్రమం - 1995 

* జాతీయ గంగానది పరీవాహక అథారిటీ - 2009 

* నమామి గంగే - 2015 - 22

రచయిత: జల్లు సద్గుణరావు

Posted Date : 23-08-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌