• facebook
  • whatsapp
  • telegram

1857 సిపాయిల తిరుగుబాటు

ఆధునిక భారతదేశ చరిత్రలో బ్రిటిష్‌ వలస పాలన, విధానాలకు వ్యతిరేకంగా జరిగిన గొప్ప సంఘటనే  ‘1857 సిపాయిల తిరుగుబాటు’. ప్లాసీ యుద్ధం (1757 జూన్‌ 23) జరిగిన వందేళ్లకు ఈ తిరుగుబాటు సంభవించింది. దీన్ని ‘ప్రథమ భారత స్వాతంత్య్ర సంగ్రామం’, ‘సిపాయిల పితూరి’, ‘విప్లవోద్యమం’గా చరిత్రకారులు అభివర్ణించారు.
* దీన్నే ‘జాతీయ తిరుగుబాటు’, ‘సైనిక, పౌర తిరుగుబాటు కలయిక’ అని పేర్కొన్నారు.
* ఈ తిరుగుబాటు ప్రారంభం నాటికి లార్డ్‌కానింగ్‌ బ్రిటిష్‌ గవర్నర్‌ జనరల్‌గా భారతదేశానికి వచ్చారు. ఆ సమయంలో భారతదేశాన్ని మొగల్‌ పాదుషా బహదూర్‌ షా జాఫర్‌ పాలిస్తున్నారు. ఈయన నామమాత్ర  చక్రవర్తిగా ఉన్నారు.
* బ్రిటిష్‌వారు ప్రవేశపెట్టిన ఆర్థిక విధానాలు, కారన్‌వాలీస్‌ శాశ్వత భూమిశిస్తు విధానం, వెల్లస్లీ సైన్యసహకార పద్ధతి, డల్హౌసీ రాజ్యసంక్రమణ సిద్ధాంతం, బ్రిటిష్‌ సైనిక, ఆయుధ సంపత్తి వల్ల భారతదేశంలోని అనేక ప్రాంతాలపై తమ రాజకీయ సార్వభౌమాధికారాన్ని నెలకొల్పారు. వీటి వల్ల భారతదేశంలో ప్రతిఘటన ఉద్యమాలు జరిగాయి.
* 1857 సిపాయిల తిరుగుబాటు కంటే ముందు 1763 నుంచి 1856 వరకు సివిల్, గిరిజన, సిపాయిల తిరుగుబాట్లు జరిగాయి. 
ఉదా: సన్యాసుల తిరుగుబాట్లు (1763 - 1800), చూర్‌ (1799), దళ్‌భమ్‌ (1769 - 74), రంగపూర్‌ (1783),  బిష్నుపూర్‌ (1789), ఒడిశా పాయికుల తిరుగుబాటు (1804 - 17), వేలుతంపి (1809), కట్టబొమ్మన్‌ (1798 - 1802), పాలకొండ విజయరామరాజు (1831 - 32), గుసూరుషి, కరభంజి (1800 - 05), ధనుంజయ భంజి (1835-37), కోయిలకుంట్ల (కర్నూల్‌) నరసింహారెడ్డి (1846 - 47), రామోసి (1826 - 29), గడ్కారి (1844), సంతాల్‌ తిరుగుబాటు (1855), భిల్లుల తిరుగుబాటు (1817 -19, 1825), , బరైలీ తిరుగుబాటు (1816), కోల్‌ ఉద్యమం (1831 - 33), కాంగ్రా జస్వర్‌ రాజుల ఉద్యమం (1848) మొదలైనవి బ్రిటిష్‌వారికి వ్యతిరేకంగా జరిగాయి. వీటన్నింటిలో ప్రధానమైంది 1857 సిపాయిల తిరుగుబాటు.
* ఈ తిరుగుబాటులో భారతీయ సిపాయిలే అత్యధిక సంఖ్యలో బ్రిటిష్‌వారి విధానాలకు వ్యతిరేకంగా పోరాడారు. అనేక ఏళ్ల నుంచి ప్రజల్లో ఏర్పడిన అసంతృప్తి ఫలితమే ఈ తిరుగుబాటు. 
* దీనికి గల కారణాలను రాజకీయ, ఆర్థిక, సాంఘిక, మత, సైనిక అంశాలుగా విభజించవచ్చు.


ఆర్థిక కారణాలు
    వ్యవసాయ రంగానికి ప్రోత్సాహకం కల్పించకపోవడంతో వ్యవసాయాభివృద్ధి కుంటుపడింది. వ్యవసాయ వాణిజ్యీకరణ వల్ల రైతులు నష్టపోయారు. కరవు సమయాల్లో పన్నులు పెంచడం, కట్టలేని వారి భూములు జప్తు చేయడం, బ్రిటిష్‌ భూమిశిస్తు విధానాలు రైతులను ఆర్థికంగా దెబ్బతీశాయి. ఇంగ్లండ్‌లో వచ్చిన పారిశ్రామిక విప్లవం వల్ల అక్కడి వస్తువులు భారత్‌కు దిగుమతి అయి, ఇక్కడి కుటీర, చిన్నతరహా, లఘు పరిశ్రమలను పూర్తిగా దెబ్బతీశాయి. చేతివృత్తులవారు జీవనోపాధిని కోల్పోయారు. ఒకప్పుడు ఢాకా మస్లిన్‌ వస్త్రాలకు ప్రసిద్ధి. కానీ ఇంగ్లండ్‌ నుంచి దిగుమతి అయిన అనేక వస్తువులను తక్కువ ధరకు వాటిని అమ్మి విపరీత లాభాలు ఆర్జించారు. బ్రిటిష్‌వారికి పోటీ కాకూడదని ఢాకా నేతపనివారి చేతివేళ్లను నరికారు.
* భారతదేశ ఎగుమతులపై బ్రిటిష్‌ వారు ఎక్కువ సుంకాలు విధించారు. పత్తి, జనుము, నీలిమందు, పొగాకు లాంటి వాటిని బ్రిటన్‌కు ఎగుమతిచేసి లాభాలు గడించారు. మర్కంటైలిజాన్ని (Mercantilism)  అమలుచేసి భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీశారు. 
* పారిశ్రామిక విప్లవ కాలానికి బ్రిటిష్‌వారు భూమిశిస్తు ద్వారా 27%, పన్నుల ద్వారా 10% ఆదాయాన్ని పెంచుకున్నారు. అయితే బ్రిటిష్‌ గవర్నర్‌ జనరల్స్‌ అయిన ఆక్లాండ్, కర్జన్‌ విధానాలు, డల్హౌసీ, హార్డింజ్‌ యుద్ధాల వల్ల బ్రిటిష్‌వారు భారతీయులకు 59 మిలియన్లకు పైగా బాకీ పడ్డారు.
* ఉద్యోగాలు కోల్పోయినవారు నీలిమందు, తేయాకు తోటల్లో కూలీపని చేశారు. ఆదాయం లేక పేదరికంలో మగ్గారు. వీరంతా సిపాయిల తిరుగుబాటులో పాల్లొన్నారు.


సాంఘిక, మత కారణాలు
    అనాది నుంచి భారతీయ ప్రజలు తమ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను విశ్వసిస్తూ వచ్చారు. అయితే లార్డ్‌ వెల్లస్లీ 6వ రెగ్యులేషన్‌ ద్వారా స్త్రీ, శిశుహత్యలను నిషేధించారు. దీన్ని రాజపుత్రులు వ్యతిరేకించారు.
* లార్డ్‌ విలియం బెంటింక్‌ 1829లో సతీసహగమన నిషేధ చట్టం, 1856లో వితంతు పునర్వివాహ చట్టం, భారతీయ వారసత్వ చట్టాన్ని ప్రవేశపెట్టారు. ఇవి వివాదాస్పదమయ్యాయి.
* 1813, 1833 చార్టర్‌ చట్టాల ద్వారా క్రైస్తవ మిషనరీలు భారతదేశంలో ప్రవేశించాయి. వీటికి బ్రిటిష్‌ ప్రభుత్వం గ్రాంట్‌-ఇన్‌-ఎయిడ్‌ ను మంజూరు చేసింది. ఇవి మత మార్పిడులకు ప్రయత్నించడంతో భారతీయులు ఆందోళనకు గురయ్యారు.
* హిందుత్వాన్ని విడిచి క్రైస్తవ మతాన్ని స్వీకరించిన వారికి ఆస్తిహక్కు (1850) కల్పించారు. దీన్ని ప్రజలు వ్యతిరేకించారు.
* ‘మేజర్‌ ఎడ్వర్డ్‌’ భారతీయులను క్రైస్తవంలోకి మార్చడమే ఆంగ్లేయుల ప్రధాన లక్ష్యమని ప్రకటించడం హిందూ, ముస్లిం వర్గాల్లో అలజడి రేపింది.
* ఆంగ్ల విద్యాభివృద్ధికి నిధులు ఖర్చు చేయడం, పర్షియన్‌ స్థానంలో ఇంగ్లిష్‌ను రాజభాషగా ప్రకటించడం, డల్హౌసీ ప్రవేశపెట్టిన తంతితపాలా, రైల్వేలు, టెలిగ్రాఫ్, పోస్టల్‌ సేవలు భారతీయులకు సందేహాలు కలిగించాయి.
* రైళ్లలో జాతి, మత, కుల, వర్గ, వర్ణ లింగ భేదాలు లేకుండా ఒకే చోట వివిధస్థాయుల వారు ప్రయాణించడం వల్ల వర్ణాశ్రమ ధర్మాలకు ఆటంకం కలిగిందని హిందువులు భావించారు.


తక్షణ కారణాలు
    1856 డిసెంబరులో బ్రిటిష్‌వారు రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ తుపాకీని ప్రవేశపెట్టారు. దీనికి వాడే తూటాల చివరి భాగాన్ని నోటితో కొరికి ఉపయోగించాల్సి ఉండేది. ఈ తుటాల చివర ఆవు, పంది కొవ్వు పూసినట్లు వదంతులు  వ్యాపించాయి. ఆవు హిందువులకు పవిత్రం, పంది ముస్లింలకు నిషేధం. కాబట్టి తూటాలను కొరకడాన్ని భారతీయ సిపాయిలు నిరాకరించారు. ఈ కొత్తరకం తుపాకులు ఇంగ్లండ్‌లోని వూల్‌వ్రచ్‌లోని ఆయుధ ఫ్యాక్టరీలో తయారయ్యేవి.
* ఇది హిందూ, ముస్లిం సైనికులను క్రైస్తవులుగా మార్చడానికి పన్నిన కుట్రగా భావించిన సిపాయిలు తిరుగుబాటుకు పూనుకున్నారు.
* 1857 మార్చి 29న సిపాయిలు ‘బారక్‌పూర్‌’లో కొత్త రకం తూటాలను వాడటానికి నిరాకరించారు. మార్చి 29న ‘మంగళ్‌పాండే’ అనే సిపాయి ఐరోపా అధికారి లెఫ్టెనెంట్‌ బాగ్‌ను కాల్చి చంపగా, అతన్ని నిర్బంధించి ఏప్రిల్‌ 8, 1857లో ఉరితీశారు. ఇతడు 34వ పటాలానికి చెందినవాడు.
* 1857 ఫిబ్రవరి 26న ‘బరహంపూర్‌’ శిబిరంలోని 19వ పదాతి దళానికి చెందిన సిపాయిలు కవాతులో పాల్గొనడానికి నిరాకరించారు.
* దీని ఫలితంగా 19, 34 పదాతి దళాలను బ్రిటిష్‌వారు రద్దు చేసి, సిపాయిలందరినీ ఉద్యోగం నుంచి తొలగించారు.
* ఇలాంటి సంఘటనలు విశాఖపట్నం (1780), వెల్లోర్ (1806) బర్మా యుద్ధం (1824) సమయంలో జరిగాయి. 47వ పదాతి దళానికి చెందిన సిపాయిలు సముద్రం దాటడానికి నిరాకరిస్తే, వారిని బ్రిటిష్‌వారు కాల్చిచంపి ఆ దళాన్ని రద్దు చేశారు.


సైనిక కారణాలు
    1853లో కార్ల్‌ మార్క్స్‌ ‘ఇండియా ఖర్చుతో, భారతీయులే సిపాయిలుగా ఉన్న భారత సైన్యమే భారతదేశాన్ని ఇంగ్లిష్‌ వారి బానిసత్వంలో అణచి ఉంచుతుంది’ అని పేర్కొన్నారు. ఆ సిపాయిలే అసంతృప్తికి గురై 1857 సిపాయిల తిరుగుబాటుకు పూనుకున్నారు.
* బ్రిటిష్‌ సైన్యంలో యూరోపియన్లను సోల్జర్‌గా, భారతీయులను సిపాయిలుగా పేర్కొన్నారు. 1856 నాటికి సైన్యంలో 2,32,234 మంది సిపాయిలు, 45 వేల మంది బ్రిటిష్‌ సైనికులు ఉండేవారు. భారతీయ సిపాయిలే అధిక సంఖ్యలో యుద్ధాల్లో పాల్గొని బ్రిటిష్‌ విశాల సామ్రాజ్య స్థాపనకు కృషి చేశారు. కానీ వారి కష్టానికి తగిన గుర్తింపు లేదు.
* సిపాయిలు, సైనికుల మధ్య స్నేహభావం లోపించింది. ఎన్నేళ్లు పని చేసినా ‘సుబేదార్‌’కి మించి హోదా లభించేది కాదు. సిపాయిలకు జీతభత్యాలు, ప్రత్యేక సౌకర్యాలు తక్కువగా ఉండేవి. వీటి వల్ల తీవ్ర వివక్షకు గురయ్యారు. ఆజ్ఞలు జారీచేసే అధికారం బ్రిటిష్‌ సైనికులకు మాత్రమే ఉండేది. సుబేదార్‌ జీతం కేవలం రూ.6070 మాత్రమే. ఇవి సిపాయిల ఆత్మాభిమానాన్ని దెబ్బతీశాయి.
* కుల, మత, ఆచారాలకు వ్యతిరేకంగా తలపాగాలు ధరించరాదని, పొడవైన జట్టు, గడ్డం ఉండకూడదని, అందరు ఒకేలా యునిఫాం ధరించాలని, విదేశాల్లో యుద్ధాలు చేసేందుకు సముద్రాలు దాటాలని ఆజ్ఞలు జారీ చేశారు.
* 1856లో లార్డ్‌ కానింగ్‌ ‘సామాన్య సేవా నియుక్త చట్టం (General Service Enlistment Actz)ను ప్రవేశపెట్టాడు. దీని ప్రకారం ప్రభుత్వ ఆదేశాల మేరకు భారతీయ సిపాయిలు ఎక్కడైనా, ఎప్పుడైనా పనిచేయాలని ఆజ్ఞాపించడంతో సైనికులు తిరగబడ్డారు.


రాజకీయ కారణాలు
లార్డ్‌ వెల్లస్లీ ప్రవేశపెట్టిన ‘సైన్య సహకార పద్ధతి’ (Subsidiary Alliance) ప్రకారం బ్రిటిష్‌ సైన్యాన్ని భారతీయ సంస్థానాధీశులే పోషించాలి. దీంతో వారు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు.
* చిట్టచివరి మొగల్‌ చక్రవర్తి రెండో బహదూర్‌షా జాఫర్‌ పాలన కేవలం ఢిల్లీకే పరిమితమైంది. దీంతో ఈస్టిండియా కంపెనీ దేశాన్ని పాలించే శక్తిగా ఎదిగింది. దీన్ని భారతీయులు అంగీకరించలేదు. అదే సమయంలో సిరాజ్‌ ఉద్దౌలా (బెంగాల్‌ నవాబ్‌), టిప్పు సుల్తాన్‌ (మైసూర్‌) దేశం, ఆత్మగౌరవం కోసం పోరాడారు. ఇది దేశప్రజల్లో నూతనోత్సాహాన్ని కలిగించింది.
* సిపాయిల తిరుగుబాటుకు ప్రధాన కారణం డల్హౌసీ ప్రవేశపెట్టిన ‘రాజ్యసంక్రమణ సిద్ధాంతం’  (Doctrine of Lapse). దీని ప్రకారం వారసులు లేని రాజ్యాలను బ్రిటిష్‌వారు స్వాధీనం చేసుకోవచ్చు. దీన్ని దేశ సంస్థానాధీశులు, ప్రజలు వ్యతిరేకించారు.
* రాజ్య సంక్రమణ సిద్ధాంతం ప్రకారం సతారా (1848), జైపూర్, సంబల్‌పూర్‌ (1849), ఉదయ్‌పూర్ (1852), ఝాన్సీ (1853), నాగపుర్‌ (1854) సంస్థానాలను బ్రిటిష్‌వారు ఆక్రమించారు. 
* పరిపాలన సక్రమంగా చేయడంలేదనే నెపంతో అయోధ్య నవాబు వజీద్‌ అలీషాను 1856లో పదవి నుంచి తప్పించి, అతడి రాజ్యాన్ని బ్రిటిష్‌ సామ్రాజ్యంలో విలీనం చేశారు. ఈ చర్యను అన్ని వర్గాల ప్రజలు వ్యతిరేకించారు.
* చివరి మొగల్‌ చక్రవర్తి రెండో బహదూర్‌ షా జాఫర్‌ బిరుదు ‘జిలై- ఇల్లాహి’ (Shadow of God) అతడి తర్వాత రద్దవుతుందని ప్రకటించడం, ‘పాదుషా’ హోదా ఉండదని చెప్పడం భారతీయ, ముస్లిం వర్గాల్లో తీవ్ర సంచలనం రేపింది.
* చివరి పీష్వా రెండో బాజీరావు దత్తపుత్రుడు ‘నానాసాహెబ్‌’ దత్తత చెల్లదని ప్రకటించి భరణాన్ని రద్దుచేశారు.
* బహదూర్‌షా అనంతరం ఎర్రకోట బ్రిటిష్‌వారికి చెందుతుందని, మొగల్‌ చక్రవర్తి నివాసం ఎర్రకోట నుంచి కుతుబ్‌మినార్‌కు మారుస్తామని లార్డ్‌ కానింగ్‌ ప్రకటించడంతో భారతీయుల మనోభావాలు దెబ్బతిన్నాయి.
* బ్రిటిష్‌ ప్రభుత్వం అప్పటివరకు వాడుకొని తొలగించిన కిరాయి సైనికులు, పిండారీలు, దగ్గులు (దారి దోపిడి దొంగలు) సిపాయిలకు సాయపడ్డారు.
* స్వదేశీ రాజుల కొలువుల్లో పనిచేసిన ఉన్నత వర్గాలు పదవులు కోల్పోవడం, తిరుగుబాటుకు ముందు దాదాపు 20 వేల ఎస్టేట్లను బ్రిటిష్‌ ప్రభుత్వం రద్దుచేయడం, రైతులను భూస్వాములు, జమీందారులపై ఉసిగొల్పడం, ఇంగ్లండ్‌ నుంచి పాలించడం భారతీయులకు నచ్చలేదు. వీరంతా సిపాయిలతో కలిసి తిరుగుబాటులో పాల్గొన్నారు.
* ఈశ్వరీప్రసాద్‌ అనే చిత్రకారుడు ‘‘డల్హౌసీ భారతదేశంలో రాజకుటుంబాలు లేకుండా చేయడంతో, సాంఘిక, ఆర్థిక విధానాల్లో కలిగిన మార్పులు తీవ్ర అసంతృప్తికి కారణాలై ఈ గొప్ప తిరుగుబాటును లేవదీశాయి’’ అని అభిప్రాయపడ్డారు.

 

తిరుగుబాటు స్వభావం
1857 సిపాయిల తిరుగుబాటు స్వభావం గురించి చరిత్రకారుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఈ తిరుగుబాటును సైనిక పితూరీ, ప్రథమ భారత స్వాతంత్య్ర పోరాటమని కొందరు; క్రైస్తవులకు వ్యతిరేకంగా జరిగిన మత యుద్ధమని కొందరు; నల్లవారికి, తెల్లవారికి మధ్య చెలరేగిన జాతి ఘర్షణ అని; పాశ్చాత్య - ప్రాచ్య సంస్కృతుల మధ్య జరిగిన పోరాటమని మరికొందరు భిన్నాభిప్రాయాలు వెలిబుచ్చారు.
* బ్రిటిష్‌ చరిత్రకారుడు జె.డబ్ల్యూ.కేయ్‌ తన ‘ఎ హిస్టరీ ఆఫ్‌ సిపాయి వార్‌’ (1880) గ్రంథంలో ఈ తిరుగుబాటును ‘సిపాయిల పితూరీ’గా పేర్కొన్నారు.
* బెంజిమన్‌ డిస్రేలి ఈ తిరుగుబాటును ‘జాతీయ తిరుగుబాటు’గా అభివర్ణించాడు.
* అశోక్‌ మెహతా ‘ద గ్రేట్‌ రెబెలియన్‌’ గ్రంథంలో తిరుగుబాటుకు ‘జాతీయ స్వభావం’ ఉందని తెలిపారు. ఇతడు 
* ఎయిటీన్‌ ఫిప్టీ సెవెన్‌’ అనే మరో గ్రంథాన్ని రాశారు.
* వి.డి.సావర్కర్‌ ‘ద ఇండియన్‌ వార్‌ ఆఫ్‌ ఇండిపెండెన్స్‌’ ్బ1909్శ గ్రంథంలో 1857 తిరుగుబాటును ‘యోజిత ప్రథమ జాతీయ స్వాతంత్య్ర సమరం’ అని పేర్కొన్నాడు.
* ఆర్‌.సి.మజుందార్‌ ద సిపాయి మ్యూటినీ అండ్‌ ద రివోల్ట్‌ ఆఫ్‌ 1857, బ్రిటిష్‌ పారమౌంటసీ అండ్‌ ద ఇండియన్‌ రినైజాన్స్‌ గ్రంథాల్లో 1857 తిరుగుబాటు ‘స్వాతంత్ర సమరం’ కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీనికి కారణం తిరుగుబాటు వివిధ ప్రాంతాల్లో, వివిధ రూపాల్లో ఉండటం.
* సురేంద్రనాథ్‌ సేన్‌ ‘ఎయిటీన్‌ ఫిప్టీ సెవెన్‌’ గ్రంథంలో 1857 సిపాయిల తిరుగుబాటును ‘ఒక స్వాతంత్ర సమరం’గా వ్యాఖ్యానించారు.
* ఎస్‌.బి.చౌదరి తన ‘సివిల్‌ రెబిలియన్‌ ఇన్‌ ద ఇండియన్‌ మ్యూటినీస్‌ - 1857-59’ గ్రంథంలో 1857 సిపాయిల తిరుగుబాటును ‘సైనిక, పౌర తిరుగుబాటు పరంపరల కలయిక’గా పేర్కొన్నారు.
* భారతదేశ తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ ద డిస్కవరీ ఆఫ్‌ ఇండియా ్బ1946్శ గ్రంథంలో ఇది ప్రథమ భారత స్వాతంత్య్ర సమరం కాదని, భూస్వాముల తిరుగుబాటని అభివర్ణించారు.


వైఫల్యానికి కారణాలు
* దేశం మొత్తం వ్యాపించకుండా కొన్ని ప్రాంతాలకే పరిమితమవడంతో బ్రిటిష్‌వారు ఎక్కడికక్కడ సత్వరమే అణచివేయగలిగారు. నాయకత్వ లేమి, అభిప్రాయ భేదాలు సిపాయిల తిరుగుబాటు ఉద్యమాన్ని బలహీనం చేశాయి.
* సిపాయిలకు అవసరమైన ఆహారం, యుద్ధ సామగ్రి, దుస్తుల కొరత ఏర్పడటంతో వారు దోపిడీలకు పాల్పడ్డారు. దీంతో రైతులు, వ్యాపారస్తుల మద్దతు కోల్పోయారు. 
* ఉద్యమం, పోరాటాలకు ప్రసిద్ధి చెందిన సిక్కు, గూర్ఖా సైన్యాలు బ్రిటిష్‌ వారికి విధేయులుగా ఉండి తిరుగుబాటును అణచివేయడానికి తోడ్పడ్డారు.
* సంస్థానాధీశుల్లో ఎక్కువమంది బ్రిటిష్‌ వారికి సాయపడ్డారు. ఉదా: హైదరాబాద్, గ్వాలియర్‌ సంస్థానాధీశులు.
* సిపాయిల వద్ద ఆధునిక ఆయుధాలు, సరైన సమాచార వ్యవస్థ లేకపోవడం, అధునాతన యుద్ధ పద్ధతులు తెలియకపోవడం, భారతీయుల్లో జాతీయభావం లోపించడం, రాజుల మధ్య అనైక్యత, మేధావులు, విద్యావంతులు ఉద్యమానికి సహకరించకపోవడం, ప్లవకారుల్లో ఒక ధ్యేయం, లక్ష్యం లేకపోవడం వల్ల సిపాయిల తిరుగుబాటు నీరుగారిపోయింది.
* బ్రిటిష్‌ సైన్యంలో అనుభవజ్ఞులైన సేనానులు కాంప్‌బెల్, నెయిల్, హడ్సన్, హ్యూరోస్, ఔట్రాం, హేవ్‌లాక్‌ లాంటివారు పూర్తి అంకితభావంతో పనిచేశారు. బ్రిటిష్‌ సైన్యంలోని క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, యుద్ధ వ్యూహాలు, కుట్రలు, కుతంత్రాల ముందు భారతీయులు నిలవలేకపోయారు. 
* 1857లో హైదరాబాద్‌లో తుర్రెబాజ్‌ఖాన్‌ తిరుగుబాటు చేసినా నిజాం నవాబు దాన్ని అణచివేశాడు. భారతీయ రాజులే ఉద్యమానికి అవరోధంగా మారారు. ఈ కారణాల వల్ల 1857 సిపాయిల తిరుగుబాటు విఫలమైంది.


తిరుగుబాటు ఫలితాలు
* 1857 సిపాయిల తిరుగుబాటు పాలన, సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలను ప్రభావితం చేసింది.
* ఈ తిరుగుబాటు ఫలితంగానే 1858 నవంబరు 1న విక్టోరియా మహారాణి ప్రకటన విడుదలైంది. ఈ ప్రకటనతో భారతదేశంలో ఈస్టిండియా కంపెనీ పాలన రద్దై, బ్రిటిష్‌ ప్రభుత్వ ప్రత్యక్ష పాలన (క్రౌన్‌ రూల్‌) ప్రారంభమైంది.
* గవర్నర్‌ జనరల్‌ పదవి స్థానంలో ‘వైస్రాయ్‌’ (రాజప్రతినిధి) అనే అధికారిని నియమించారు.
* బ్రిటిష్‌ ప్రభుత్వ మంత్రిమండలిలో వైస్రాయ్‌ సభ్యుడిగా, 15 మంది సభ్యులతో కూడిన ఒక సలహా మండలి ఏర్పాటైంది.
* భారతదేశ కార్యదర్శి అనే పదవిని ఏర్పాటు చేశారు.
* స్వదేశీ సంస్థానాధీశుల అంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోబోమని బ్రిటిష్‌ వారు ప్రకటించారు.
* రాజ్య సంక్రమణ సిద్ధాంతం రద్దయ్యింది.
* కొన్ని రంగాల్లో జాతి, మత, ప్రాంత భేదాలు లేకుండా భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వడానికి బ్రిటిష్‌ వారు అంగీకరించారు.
* 1861 కౌన్సిల్‌ చట్టం, భారత న్యాయ చట్టాలను రూపొందించారు. వీటి ద్వారా  భారతీయ ఆచార, సంప్రదాయాలకు గుర్తింపు లభించింది.
* భవిష్యత్‌లో ఇలాంటి తిరుగుబాట్లు జరగకుండా సైనిక వ్యవస్థలో మార్పులు చేశారు. ఆంగ్ల సైనికుల సంఖ్యను పెంచి, భారతీయ సిపాయిల సంఖ్యను తగ్గించారు.
ఉదా: 1864 నాటికి సిపాయిల సంఖ్య 2,05,000 కాగా, ఆంగ్ల సైనికుల సంఖ్య 65,000.
* సైన్యంలో అగ్రకులాల వారి సంఖ్యను తగ్గించి, గూర్ఖాలు, సిక్కులు, రాజపుత్రులను చేర్చుకున్నారు. ప్రధాన సైనిక స్థావరాల్లో బ్రిటిష్‌ దళాలు ఉండేలా ఏర్పాట్లు చేశారు.
* 1857 సిపాయిల తిరుగుబాటు అనంతరం ‘విభజించి, పాలించు’ విధానాన్ని పూర్తిగా అమలుచేశారు.
* ఈ తిరుగుబాటు తర్వాత హిందూ, ముస్లిం వర్గాల మధ్య బ్రిటిష్‌ వారు మత వైషమ్యాలు, విభేదాలను కల్పించారు. సామ్రాజ్య విస్తరణకు బదులు దోచుకునేందుకు ప్రాధాన్యమిచ్చారు.అయితే, 1857 సిపాయిల తిరుగుబాటు భారత జాతీయోద్యమానికి ప్రారంభంగా పేర్కొనవచ్చు.

Posted Date : 03-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌