• facebook
  • whatsapp
  • telegram

వ్యవసాయం

     ప్రపంచంలో సుమారు పదివేల సంవత్సరాల కిందట వ్యవసాయం ప్రారంభమైందని శాస్త్రజ్ఞుల అంచనా. పూర్వం ఆసియా, యూరప్‌, మధ్య ఇరాక్‌ - టర్కీ దేశాల్లో సుమేరియా కాలంలో బార్లీ, గోధుమ పంటలను పండించేవారు. ఇవే మొదటి అటవీ ఉత్పత్తులు. మన దేశంలో 2500 ఏళ్ల కిందట కాంస్యయుగం సింధూలోయ నాగరికత కాలంలో పూర్వపు రాజస్థాన్‌లోని కాలీబంగన్‌ ప్రాంతంలో మొదటిసారిగా వ్యవసాయం చేసినట్లు చారిత్రక ఆధారాలు లభించాయి.

     2018 జాతీయ వ్యవసాయ గణాంకాల ప్రకారం దేశ జనాభాలో 54% ప్రజలు, 50% కిపైగా శ్రామికశక్తి వ్యవసాయ రంగంలో జీవనం కొనసాగిస్తున్నారు. ఈ రంగం దేశ జీడీపీ (స్థూల జాతీయోత్పత్తి)లో 17% వాటా కలిగి ఉంది. భారత్‌ 328.73 మిలియన్‌ హెక్టార్ల భౌగోళిక వైశాల్యంతో ప్రపంచంలో ఏడో స్థానంలో ఉంది. మొదటి ఆరు స్థానాల్లో వరుసగా రష్యా, కెనడా, అమెరికా, చైనా, బ్రెజిల్‌, ఆస్ట్రేలియాలు ఉన్నాయి. వ్యవసాయ భూమి పరంగా ప్రపంచంలో 11% వాటాతో భారత్‌ మొదటి స్థానంలో ఉంది. దేశ వైశాల్యంలో నికర వ్యవసాయ భూమి 198.36 మిలియన్‌ హెక్టార్లు ఉండగా (60%) 157.82 మిలియన్‌ హెక్టార్ల (48%) భూమి సాగవుతోంది. దీనిలో స్థూల నీటి పారుదల వైశాల్యం 96.46 మిలియన్‌ హెక్టార్లు (29%), నికర నీటిపారుదల వైశాల్యం 68.38 మిలియన్‌ హెక్టార్లు (20%). విస్తార వ్యవసాయ భూమిని కలిగినప్పటికీ భారతదేశం వ్యవసాయంలో వెనుకబడి ఉంది. కరవుకాటకాలు సంభవించడం, నీటిపారుదల వసతులు లేకపోవడం, శాస్త్రీయ విధానంపై అవగాహనలేమి, నిరక్షరాస్యత దీనికి ప్రధాన కారణాలు.
 

భూకమతాలు
ఒక కుటుంబం సగటున ఎంత భూభాగాన్ని కలిగి ఉందో తెలియజేయడాన్ని భూకమతం అంటారు. మన దేశంలో అయిదేళ్లకోసారి కేంద్ర వ్యవసాయ, పశుగణాభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్వహణలో వ్యవసాయ భూకమతాల లెక్కలు చేపడతారు. దేశంలో మొదట 1970-71లో భూకమతాల లెక్కలు సేకరించారు. 2015-16 సంవత్సరానికిగానూ కేంద్ర వ్యవసాయ, పశుగణాభివృద్ధి మంత్రిత్వ శాఖ 2018 అక్టోబరు 1న పదో జాతీయ వ్యవసాయ భూకమతాల గణాంకాలను విడుదల చేసింది.
 

ఈ గణాంకాల ప్రకారం...
* దేశంలో మొత్తం భూకమతదారులు 2010-11లో 138.35 మిలియన్లు ఉండగా, 2015-16లో 146.45 మిలియన్లకు (5.86%) పెరిగారు.
* దేశ మొత్తం వైశాల్యంలో భూకమతాల సాగు వైశాల్యం 2010-11లో 159.59 మిలియన్‌ హెక్టార్లు ఉండగా, 2015-16లో 157.82 మిలియన్‌ హెక్టార్లతో 1.11% తగ్గింది.
* దేశంలో భూకమతదారులు ఉత్తరప్రదేశ్‌ (23.82 మిలియన్లు)లో అత్యధికంగా ఉన్నారు. తర్వాతి స్థానంలో బిహార్‌ (16.41 మి.), మహారాష్ట్ర (15.29 మి.) ఉన్నాయి. సిక్కింలో అత్యల్పంగా 72 వేలమంది, గోవాలో 75 వేలమంది, మిజోరాంలో 90 వేల మంది భూకమతదారులు ఉన్నారు.
* భూకమతాల వైశాల్యం అత్యధికంగా రాజస్థాన్‌ (20.87 మి.హె.), మహారాష్ట్ర (20.51 మి.హె.), ఉత్తరప్రదేశ్‌ (17.45 మి.హె.) లలో ఉండగా, అత్యల్పంగా గోవా (82 వేల హెక్టార్లు), సిక్కిం (91 వేల హెక్టార్లు), మిజోరాం (112 వేల హెక్టార్లు) లలో ఉంది.
* అత్యధికంగా భూకమతదారులు పెరిగిన రాష్ట్రాలు మధ్యప్రదేశ్‌ (12.74%), ఆంధ్రప్రదేశ్‌ (11.85%), మహారాష్ట్ర (11.58%), రాజస్థాన్‌ (11.12%). దేశంలో సగటు భూకమతాల పరిమాణం 2010-11లో 1.15 హెక్టార్లు ఉంటే, 2015-16 లో 1.08 హెక్టార్లు ఉంది. సగటు భూకమతాల పరిమాణం మేఘాలయలో అత్యధికంగా ఉండగా, కేరళలో అత్యల్పంగా ఉంది.

 

భూకమతదారులను అయిదు గ్రూపులుగా వర్గీకరిస్తారు
1) ఉపాంతదారులు (Margined) - 1 హెక్టారు లేదా 2.5 ఎకరాలు
2) చిన్న కమతదారులు (Small) - 2 హెక్టార్లలోపు లేదా 5 ఎకరాలు
3) సన్న/ఉపమధ్యకమతదారులు (Semi - Medium) - 4 హెక్టార్లలోపు లేదా 10 ఎకరాలు
4) మధ్య కమతదారులు (Medium) - 10 హెక్టార్లలోపు లేదా 25 ఎకరాలు
5) పెద్ద కమతదారులు (Large) - 10 హెక్టార్ల కంటే ఎక్కువ లేదా 25 ఎకరాల కంటే ఎక్కువ

 

2015-16 ప్రకారం సామాజిక వర్గాల వారీగా....
భూకమతదారుల సంఖ్య : షెడ్యూల్డ్‌ కులాలు 11.84%, షెడ్యూల్డ్‌ తెగలు 8.65%, సంస్థాగతమైనవి 0.18%, ఇతర వర్గాలు 79.33%.
 

భూకమతాల వైశాల్యం
షెడ్యూల్డ్‌ కులాలు 8.54%, షెడ్యూల్డ్‌ తెగలు 11.27%, సంస్థాగత మైనవి 0.98%, ఇతర వర్గాలు 79.21%.
2015-16 ప్రకారం మొత్తం భూకమతదారుల్లో ఉపాంతదారులు 68.45%, చిన్న కమతదారులు 17.62%, ఉప మధ్యకమత దారులు 9.55%, మధ్యకమతదారులు 3.80%, పెద్ద కమతదారులు 0.57% ఉన్నారు.

Posted Date : 29-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌