• facebook
  • whatsapp
  • telegram

క్షారాలు, లవణాలు

క్షారాలు
ధర్మాలు:
* క్షారాలు రుచికి చేదుగా ఉంటాయి. తాకితే జారిపోయే స్వభావంతో ఉంటాయి.
* క్షారాలు కూడా సూచికల రంగును మారుస్తాయి.
    క్షార ద్రావణాలు ఎర్ర లిట్మస్ కాగితాన్ని నీలి రంగులోకి మారుస్తాయి.
    ఇవి మిథైల్ ఆరెంజ్ సూచికను పసుపు రంగులోకి మారుస్తాయి.
    ఫినాఫ్తలీన్ సూచికను క్షార ద్రావణాలు గులాబీ రంగులోకి మారుస్తాయి.
* క్షారాలు, ఆమ్లాలతో చర్య జరిపి లవణాలు, నీటిని ఏర్పరుస్తాయి.

వర్గీకరణ:

బలమైన క్షారాలు: జల ద్రావణంలో 100% అయనీకరణం చెంది ఎక్కువ మొత్తంలో హైడ్రాక్సిల్ అయాన్‌లను (OH-) ఇచ్చేవి 'బలమైన క్షారాలు'.
బలహీన క్షారాలు: జల ద్రావణంలో పాక్షికంగా వియోజనం (అయనీకరణం) చెంది తక్కువ మొత్తంలో హైడ్రాక్సిల్ అయాన్‌లను (OH-) ఇచ్చేవి 'బలహీన క్షారాలు'.

తయారీ: లోహ ఆక్సైడ్‌లను నీటిలో కరిగిస్తే క్షారాలను తయారు చేయవచ్చు. లోహ ఆక్సైడ్ + నీరు   క్షారం
ఉదా: సోడియం ఆక్సైడ్ + నీరు  సోడియం హైడ్రాక్సైడ్
మెగ్నీషియం ఆక్సైడ్ + నీరు   మెగ్నీషియం హైడ్రాక్సైడ్
* లోహ ఆక్సైడ్‌లు క్షార స్వభావం ఉన్న పదార్థాలు.

క్షారాల ఉపయోగాలు
1. సోడియం హైడ్రాక్సైడ్: దీన్ని 'కాస్టిక్ సోడా' అని అంటారు. దీనికి కారణం సోడియం హైడ్రాక్సైడ్‌కు చర్మాన్ని కాల్చే స్వభావం ఉంటుంది.
 * దీన్ని సబ్బులు, మందులు (ఔషధాలు), కృత్రిమ సిల్క్ (రేయాన్), నైలాన్ తయారీలో వాడతారు.
 * దీన్ని ప్రయోగశాలల్లో చర్యాకారకంగా కూడా ఉపయోగిస్తారు.
2. పొటాషియం హైడ్రాక్సైడ్: దీన్ని 'కాస్టిక్ పొటాష్' అని అంటారు. దీనికి చర్మాన్ని కాల్చే స్వభావం ఉంటుంది.
 * దీన్ని ఎరువులు, సబ్బుల తయారీలో ఉపయోగిస్తారు.
 * బ్యాటరీల తయారీలో ఉపయోగిస్తారు. (ఆల్కలీన్ బ్యాటరీలు).
3. మెగ్నీషియం హైడ్రాక్సైడ్: దీన్ని 'మిల్క్ ఆఫ్ మెగ్నీషియా' అని పిలుస్తారు.
* కడుపులో ఎసిడిటీని తగ్గించే యాంటాసిడ్‌గా ఉపయోగిస్తారు.
4. కాల్షియం హైడ్రాక్సైడ్: దీన్ని 'మిల్క్ ఆఫ్ లైమ్' లేదా 'సున్నపు తేట' లేదా 'తడి సున్నం' అని పిలుస్తారు.
* బ్లీచింగ్ పౌడర్ తయారీకి, నీటిలోని తాత్కాలిక కాఠిన్యాన్ని తొలగించడానికి, జంతువుల చర్మాన్ని శుద్ధి చేయడానికి, గోడలకు సున్నం వేయడానికి ఉపయోగిస్తారు.
* కార్బన్ డై ఆక్సైడ్‌ను గుర్తించడానికి సున్నపు తేటను ఉపయోగిస్తారు. CO2 సున్నపుతేటను పెరుగు లాంటి తెల్లటి అవక్షేపంగా మారుస్తుంది.
5. అల్యూమినియం హైడ్రాక్సైడ్: కడుపులో ఎసిడిటీని తగ్గించే యాంటాసిడ్‌గా ఉపయోగిస్తారు. అగ్నిమాపక పదార్థాల తయారీలో వాడతారు.
6. అమ్మోనియం హైడ్రాక్సైడ్: గాజు వస్తువులను శుభ్రపరిచే గ్లాస్‌క్లీనర్‌గా, దుస్తులపై గ్రీజు మరకలను తొలగించడానికి ఉపయోగిస్తారు.
7. కాల్షియం ఆక్సైడ్: దీన్ని 'పొడి సున్నం' అని అంటారు.
* దీన్ని సిమెంట్, గాజు తయారీలో ఉపయోగిస్తారు.
* కాల్షియం ఆక్సైడ్ (CaO)ను క్రిమిసంహారిణిగా, నిర్జలీకారిణిగా ఉపయోగిస్తారు.
8. అమ్మోనియా: దీని రసాయన ఫార్ములా NH3.
* దీన్ని నత్రజని ఎరువుల తయారీలో వాడతారు.
* ద్రవ అమ్మోనియాను 'శీతలీకరణి' గా ఉపయోగిస్తారు.
* ఫినాల్, అమైనో ఆమ్లాలు, నత్రికామ్లం తయారీలో వినియోగిస్తారు.

తటస్థీకరణం
* ఆమ్లం, క్షారంతో చర్య జరిపి లవణం, నీటిని ఏర్పరచడాన్ని 'తటస్థీకరణం' అంటారు.
* తటస్థీకరణ చర్య ఒక ఉష్ణమోచక చర్య. ఈ చర్యలో వెలువడే ఉష్ణాన్ని 'తటస్థీకరణోష్ణం' అంటారు.
ఆమ్లం + క్షారం  లవణం + నీరు + ఉష్ణం
* ఒక బలమైన ఆమ్లం, బలమైన క్షారంతో చర్య జరిపితే 13.7 కి. కేలరీల తటస్థీకరణోష్ణం వెలువడుతుంది.
* కడుపులో ఎసిడిటీని తగ్గించే యాంటాసిడ్‌గా ఉపయోగిస్తారు.
4. కాల్షియం హైడ్రాక్సైడ్: దీన్ని 'మిల్క్ ఆఫ్ లైమ్' లేదా 'సున్నపు తేట' లేదా 'తడి సున్నం' అని పిలుస్తారు.
* బ్లీచింగ్ పౌడర్ తయారీకి, నీటిలోని తాత్కాలిక కాఠిన్యాన్ని తొలగించడానికి, జంతువుల చర్మాన్ని శుద్ధి చేయడానికి, గోడలకు సున్నం వేయడానికి ఉపయోగిస్తారు.
* కార్బన్ డై ఆక్సైడ్‌ను గుర్తించడానికి సున్నపు తేటను ఉపయోగిస్తారు. CO2 సున్నపుతేటను పెరుగు లాంటి తెల్లటి అవక్షేపంగా మారుస్తుంది.
ఉదా: హైడ్రోక్లోరిక్ ఆమ్లం + సోడియం హైడ్రాక్సైడ్  సోడియం క్లోరైడ్ + నీరు + 13.7 కి.కేలరీలు.
* ఒక బలమైన ఆమ్లం, బలహీన క్షారం లేదా బలమైన క్షారం, బలహీన ఆమ్లం లేదా బలహీన ఆమ్లం, బలహీన క్షారాల మధ్య చర్య జరిపితే వెలువడే తటస్థీకరణోష్ణం 13.7 కి.కేలరీల కంటే తక్కువగా ఉంటుంది.

 

లవణాలు 
* ఒక ఆమ్లం ఏదైనా క్షారంతో తటస్థీకరణ చర్య జరిపితే ఏర్పడే అయానిక సమ్మేళనాన్ని 'లవణం' అంటారు.
ఉదా: సోడియం క్లోరైడ్, సోడియం కార్బొనేట్, కాల్షియం కార్బొనేట్ మొదలైనవి.

లవణాల ఉపయోగాలు
1. సోడియం క్లోరైడ్: దీని రసాయన ఫార్ములా NaCl. దీన్ని 'సాధారణ ఉప్పు' లేదా 'సాధారణ లవణం' లేదా ' టేబుల్ సాల్ట్' అని అంటారు.
* దీన్ని ఆహారం రుచి పెంచడానికి, ఆహార పదార్థాలను నిల్వ ఉంచడానికి (Pickling). ఉపయోగిస్తారు.
* దీన్ని సోడియం హైడ్రాక్సైడ్, వంట సోడా, బట్టల సోడా, బ్లీచింగ్ పౌడర్, క్లోరిన్ వాయువు తయారీకి ముడి పదార్థంగా ఉపయోగిస్తారు.
* మంచుతో కలిపి దీన్ని 'హిమీకరణ మిశ్రమం'గా ఉపయోగిస్తారు.
రాతి ఉప్పు: ప్రపంచంలో చాలా ప్రాంతాల్లో ఘన సోడియం క్లోరైడ్ స్ఫటికాలు మలినాలతో కలిసిపోయి జేగురు రంగులో నిక్షేపాలుగా లభిస్తాయి. దీన్ని 'రాతి ఉప్పు' అంటారు. పూర్వం సముద్ర జలాలు ఎండిపోవడం వల్ల రాతి ఉప్పు మేటలు ఏర్పడ్డాయి.
2. సోడియం బై కార్బొనేట్: దీని రసాయన ఫార్ములా NaHCO3. దీన్ని 'బేకింగ్ సోడా' లేదా 'వంట సోడా' లేదా 'తినే సోడా' అని అంటారు.
* బేకింగ్ సోడా + టార్టారిక్ ఆమ్లం = బేకింగ్ పౌడర్.
* దీన్ని యాంటాసిడ్ మాత్రల తయారీలో ముఖ్య అణుఘటకంగా వాడతారు.
* అగ్నిమాపక యంత్రాల్లో దీన్ని 'సోడా ఆమ్లం'గా ఉపయోగిస్తారు.
* బేకింగ్ పౌడర్‌ను నీటిలో కలిపినప్పుడు లేదా వేడి చేసినప్పుడు కార్బన్ డై ఆక్సైడ్ (CO2)వెలువడుతుంది. దోసెలు లేదా కేక్‌ల తయారీలో బేకింగ్ పౌడర్‌ను కలిపినప్పుడు, ఆ పదార్థాల నుంచి CO2 వాయువు రంధ్రాలు చేసుకుని బయటకు వెళ్లడం వల్ల అవి వ్యాకోచించి మెత్తగా మారతాయి.
3. సోడియం కార్బొనేట్: అనార్ద్ర సోడియం కార్బొనేట్‌ను 'సోడా భస్మం' అంటారు. దీని ఫార్ములా Na2CO3.
* సోడియం కార్బొనేట్ డెకాహైడ్రేట్ లవణాన్ని 'వాషింగ్ సోడా' లేదా 'ఉతికే సోడా' లేదా 'చాకలి సోడా' లేదా 'బట్టల సోడా' అని అంటారు. దీని రసాయన ఫార్ములా Na2CO3.10H2O.
* దీన్ని కాగితం, గాజు పరిశ్రమల్లో ఉపయోగిస్తారు.
* సబ్బులు, డిటర్జంట్‌లు, టూత్‌పేస్ట్‌ల తయారీలో దీన్ని ఉపయోగిస్తారు.
* బోరాక్స్ తయారీకి, నీటి శాశ్వత కాఠిన్యతను తొలగించడానికి ఉపయోగిస్తారు.
4. సోడియం నైట్రేట్: దీన్ని 'చిలీ సాల్ట్ పీటర్' అంటారు. దీని ఫార్ములా NaNO3. దీన్ని ఎరువులు, పొగ బాంబుల (Smoke bombs) తయారీలో ఉపయోగిస్తారు.
5. ప్లాస్టర్ ఆఫ్ పారిస్: దీని రసాయన నామం 'కాల్షియం సల్ఫేట్ హెమీ హైడ్రేట్'. దీని రసాయన ఫార్ములా CaSO4.1/2 H2O
* శరీరంలో విరిగిన ఎముకలను తిరిగి సక్రమంగా అతికించడానికి వేసే కట్టులో ఉపయోగిస్తారు.
* దీన్ని నీటిలో చేర్చినప్పుడు 'జిప్సం' అనే ఒక దృఢమైన ఘన పదార్థంగా మారుతుంది.
* దీన్ని బొమ్మల తయారీ, వినాయక విగ్రహాలు, అలంకరణకు ఉపయోగించే వస్తువుల తయారీలో ఉపయోగిస్తారు.
* ఇది ఒక తెల్లటి నిర్మాణ పదార్థం. గోడలు, ఇతర కట్టడాల ఉపరితలాలను నునుపు చేయడానికి, ఇళ్ల పైకప్పుల అలంకరణ కోసం ఉపయోగిస్తారు.
6. జిప్సం: దీని రసాయన నామం 'కాల్షియం సల్ఫేట్ డైహైడ్రేట్'. దీని రసాయన ఫార్ములా CaSO4.2H2O. 
* దీన్ని నల్లబల్ల సుద్ద తయారీలో, ఎరువుగా ఉపయోగిస్తారు.
* సిమెంట్ కాంక్రీట్ గడ్డకట్టకుండా ఉండే సమయాన్ని పెంచడానికి దీన్ని సిమెంట్‌లో కలుపుతారు.
7. పొటాషియం నైట్రేట్: దీని రసాయన ఫార్ములా KNO3
* దీన్ని ఎరువులు, గన్‌పౌడర్, టపాకాయల తయారీలో ఉపయోగిస్తారు.
* టూత్‌పేస్ట్‌ల తయారీలో వినియోగిస్తారు.
8. కాల్షియం కార్బొనేట్: దీని రసాయన ఫార్ములా CaCO3. దీన్ని 'సున్నపు రాయి' లేదా 'పాలరాయి' అని అంటారు.
* దీన్ని సుద్ద తయారీకి, చక్కెర, ఇనుమును శుద్ధి చేయడానికి వాడతారు.
9. బ్లీచింగ్ పౌడర్: దీని రసాయన నామం 'కాల్షియం హైపో క్లోరైట్'. దీని రసాయన ఫార్ములా Ca(OCl)2
* తాగునీరు, ఈత కొలనులో క్రిములను చంపడానికి 'క్రిమి సంహారిణి'గా ఉపయోగిస్తారు.
* వస్త్ర పరిశ్రమలో నూలు, కాగిత పరిశ్రమలో కలప గుజ్జును విరంజనం చేయడానికి ఉపయోగపడుతుంది.
10. బోరాక్స్: దీని రసాయన నామం 'సోడియం టెట్రాబోరేట్ డెకాహైడ్రేట్' దీని రసాయన ఫార్ములా Na2 B4O7.10H2O
* నీటి కాఠిన్యతను తొలగించడానికి, శిలీంధ్రనాశినిగా, కీటకనాశినిగా, యాంటీసెప్టిక్‌గా ఉపయోగిస్తారు.
11. హైపో: రసాయన నామం సోడియం థయోసల్ఫేట్ పెంటాహైడ్రేట్. రసాయన ఫార్ములా Na2S2O3.5H2O
* దీన్ని సయనైడ్ విషానికి విరుగుడుగా ఉపయోగిస్తారు.
* నీరు, బ్లీచింగ్ పౌడర్‌లో క్లోరిన్ శాతాన్ని లెక్కించడానికి, దుస్తులపై సిరా మరకలను తొలగించడానికి వాడతారు.
12. సోడియం హైపో క్లోరైట్: దీని రసాయన ఫార్ములా NaClO
* దీన్ని టీ, కాఫీ మరకలను తొలగించడానికి ఉపయోగిస్తారు.
* పళ్లపై మరకలను శుభ్రపరచడానికి వాడతారు.
* మరుగుదొడ్లను శుభ్రపరచడానికి 'ద్రవ బ్లీచ్‌'గా ఉపయోగిస్తారు.
13. సిల్వర్ అయోడైడ్: దీని రసాయన ఫార్ములా 'Agl'
* దీన్ని కృత్రిమ వర్షాలు కురిపించడానికి ఉపయోగిస్తారు.

ఆర్ద్ర లవణాలు: ఒక లవణం ఫార్ములా యూనిట్‌లో నిర్దిష్ట సంఖ్యలో ఉండే నీటి అణువులను 'స్ఫటిక జలం' అంటారు. స్ఫటిక జలం ఉన్న లవణాలను 'ఆర్ద్ర లవణాలు' అంటారు.
ఉదా: అనార్ద్ర కాపర్ సల్ఫేట్ CuSO4 తెల్లటి పదార్థం.
          ఆర్ద్ర కాపర్ సల్ఫేట్ CuSO4. 5H2O నీలిరంగు లవణం.
* పొటాష్ ఆలమ్ నీటిని శుద్ధి చేయడానికి ఉపయోగిస్తారు.
* జింక్ పాస్ఫేట్‌ను ఎలుకలకు విషంగా ఉపయోగిస్తారు.
* సాధారణ ఉప్పు వర్షాకాలంలో తడిగా మారడానికి అందులో ఉండే 'మెగ్నీషియం క్లోరైడ్' అనే మలినం కారణం.

pH - స్కేలు
* ద్రావణాల ఆమ్ల లేదా క్షార స్వభావాన్ని కచ్చితంగా చెప్పడానికి ఎస్.పి.ఎల్. సొరెన్‌సెన్ అనే శాస్త్రవేత్త pH స్కేలును ప్రతిపాదించారు.
* ఒక ద్రావణంలో ఉన్న హైడ్రోజన్ అయాన్‌ల (H+) గాఢత రుణ సంవర్గమానాన్ని pH అంటారు.
* pH = -log10 [H+]
* pH స్కేలు '0' నుంచి '14' వరకు వ్యాప్తిచెంది ఉంటుంది. అంటే వివిధ ద్రావణాల pH విలువలు 0 నుంచి 14 వరకు ఉంటాయి.
* pH = 7 అంటే తటస్థ ద్రావణాలు.
* pH < 7 అంటే ఆమ్ల ద్రావణాలు.
* pH > 7 అంటే క్షార ద్రావణాలు.
* pH విలువ ఎంత తక్కువ ఉంటే ఆమ్లం అంత బలమైందని అర్థం.
* pH విలువ ఎంత ఎక్కువ ఉంటే అంత బలమైన క్షారమని అర్థం.

నిర్వచనాలు
అర్హీనియస్ భావన: నీటిలో కరిగించినప్పుడు హైడ్రాక్సిల్ అయాన్‌లను (OH-) ఇచ్చే పదార్థాలను క్షారాలు అంటారు.
బ్రాన్‌స్టెడ్-లౌరీ భావన: క్షారాలు హైడ్రోజన్ అయాన్‌లను (H+) స్వీకరించే ప్రవృత్తి ఉన్న పదార్థాలు.
లూయీ భావన: ఒక ఎలక్ట్రాన్ జంటను దానం చేసే రసాయన పదార్థాలు క్షారాలు. 

Posted Date : 17-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌