• facebook
  • whatsapp
  • telegram

ఆంధ్రరాష్ట్ర ఉద్యమం

  అనేక త్యాగాలతో ఆంధ్రుల కల సాకారం!

భారతదేశంలో మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. మద్రాసు రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలైన రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాలతో కలిపి ఏర్పాటైంది. ఈ పరిణామం అనంతర కాలంలో దేశ రాజకీయ చిత్రపటాన్ని సమూలంగా మార్చేసింది. మద్రాసు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం కావాలని మొదలైన ఈ పోరాటాన్ని ముందుండి నడిపించిన  నాయకులు, చేసిన దీక్షలు, రాజకీయ పరిణామాలు, కేంద్రం నియమించిన కమిటీలు, వాటి నివేదికల గురించి పరీక్షార్థులు తప్పకుండా  తెలుసుకోవాలి. పొట్టిశ్రీరాములు ఆత్మార్పణతో స్పందించిన కేంద్ర ప్రభుత్వం చివరికి మద్రాసు లేకుండానే రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన తీరుపై అవగాహన పెంచుకోవాలి. 

భారతదేశానికి 1947, ఆగస్టు 15న స్వాతంత్య్రం వచ్చింది. దీంతో తమ చిరకాల ఆశయం అయిన ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కూడా ఏర్పాటవుతుందని ఆంధ్రులు ఆశపడ్డారు. కాంగ్రెస్‌పార్టీ 1946 ఎన్నికల ప్రణాళికలో చేసిన ప్రకటన కూడా ఇందుకు కారణం. దేశంలోని రాష్ట్రాలను భాష, సంస్కృతి ఆధారంగా పునర్‌వ్యవస్థీకరించాల్సి ఉంటుందని నాడు కాంగ్రెస్‌ప్రకటించింది. టంగుటూరి ప్రకాశం, ఎన్‌.జి.రంగా లాంటి ప్రముఖులు సర్దార్‌వల్లభాయ్‌పటేల్‌ను కలిసి కొత్త రాజ్యాంగ రచన  జరగక ముందే ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా అభ్యర్థించారు. కానీ స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా ఆంధ్రరాష్ట్రం ఏర్పాటు కార్యరూపం దాల్చలేదు. ఇది ఆంధ్రుల్లో విపరీతమైన అసంతృప్తిని మిగిల్చింది. ఈ అంశాన్ని కాంగ్రెసేతర పార్టీలు, ముఖ్యంగా కమ్యూనిస్టు పార్టీ పెద్ద ఎత్తున లేవనెత్తాయి. దాంతో 1948లో నెహ్రూ విశాఖపట్నంలో పర్యటించినప్పుడు భాషాప్రయుక్త రాష్ట్రాల పరిశీలనకు ఒక కమిటీని నియమిస్తున్నట్లు ప్రకటించారు.

ధార్‌కమిషన్‌: 1948, జూన్‌17న భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ఈ కమిటీ ఏర్పాటైంది. కమిటీ అధ్యక్షుడు అలహాబాద్‌హైకోర్టు మాజీ న్యాయమూర్తి ధార్‌. ఇందులో సభ్యులు డాక్టర్‌పన్నాలాల్‌(ఐసీఎస్‌అధికారి), జగత్‌నారాయణలాల్‌(రాజ్యాంగ పరిషత్‌సభ్యులు).

ఈ కమిటీ పరిశీలించాల్సిన అంశాలు:

1) కొత్త రాష్ట్రాల ఏర్పాటు, వాటి సరిహద్దుల నిర్ణయం.

2) కొత్త రాష్ట్రాల ఏర్పాటు ఆర్థికంగా, పాలనా పరంగా, రాజకీయంగా ఎలాంటి ఫలితాలకు దారితీస్తుంది.

ధార్‌కమిటీ 1948, సెప్టెంబరులో మద్రాసులో పర్యటించింది. ఈ సందర్భంగా ‘విశాలాంధ్ర’ ఏర్పాటు చేయాలంటూ ఆంధ్ర మహాసభ వినతిపత్రం సమర్పించింది. ఆంధ్ర పొటెన్షియల్‌కాంగ్రెస్‌కమిటీ ఎన్‌.జి.రంగా అధ్యక్షతన భాషా ప్రయుక్త రాష్ట్రాల సంఘానికి 1948లో వినతిపత్రం ఇచ్చింది. మద్రాసుతో కూడిన ప్రత్యేక రాయలసీమ కావాలని హెచ్‌.ఎన్‌.శాస్త్రి ఆ కమిటీని కోరగా, ప్రత్యేక ఆంధ్రా విషయాన్ని వాయిదా వేయాలని నీలం సంజీవరెడ్డి కోరారు. ఈ సంఘం 1948, డిసెంబరు 10న తన నివేదికను సమర్పించింది. ప్రస్తుతానికి కొత్త రాష్ట్రాల ఏర్పాటు అవసరం లేదని పేర్కొంది. కేవలం భాష ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పాటు చేస్తే దేశంలో దీర్ఘకాలిక ప్రయోజనాలకు విఘాతమని పేర్కొంది. ఈ నివేదిక ఆంధ్ర దేశంలో తీవ్రమైన అలజడిని సృష్టించింది. దాంతో ప్రజలను శాంతింపజేయడానికి భాషా రాష్ట్రాల ఏర్పాటును పరిశీలించేందుకు మరో కమిటీని ఏర్పాటు చేశారు.

జేవీపీ కమిటీ (1948): జవహర్‌లాల్‌నెహ్రూ, వల్లభాయ్‌పటేల్, పట్టాభి సీతారామయ్యలతో కూడిన కమిటీ. సభ్యుల పేర్లలోని మొదటి అక్షరాలతో ఈ కమిటీ ప్రసిద్ధి చెందింది. ఇది ధార్‌కమిటీ నివేదికను పరిశీలించేందుకు ఏర్పడింది. 1949, ఏప్రిల్‌లో కాంగ్రెస్‌వర్కింగ్‌కమిటీకి నివేదికను సమర్పించింది. భాషా రాష్ట్రాల ఏర్పాటును కొన్నేళ్లపాటు వాయిదా వేయాలని సిఫార్సు చేసింది. ఆంధ్రులు మద్రాసును వదులుకుంటే ఆంధ్రరాష్ట్ర ఏర్పాటుకు అడ్డంకి ఉండదని పేర్కొంది. కానీ మద్రాసును వదులుకోవడం ఆంధ్రా నాయకులకు ఏమాత్రం ఇష్టం ఉండదని కాంగ్రెస్‌అధిష్ఠానానికి స్పష్టంగా తెలుసు.

పార్టీషన్‌కమిటీ: జెవీపీ కమిటీ నివేదికను అంగీకరించిన భారత ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు చర్యలు తీసుకోమని మద్రాసు ప్రభుత్వానికి సూచన చేసింది. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడితే ఆస్తుల పంపకాలను నిర్దేశించడానికి పి.ఎస్‌.కుమారస్వామి రాజు అధ్యక్షతన కమిటీ సిద్ధమైంది. అందులో సీమాంధ్ర సభ్యులు టంగుటూరి ప్రకాశం, కళా వెంకట్రావు, బెజవాడ గోపాల్‌రెడ్డి, నీలం సంజీవరెడ్డి; తమిళ సభ్యులు టి.టి.కృష్ణమాచారి, భక్తవత్సలం, మాధవమీనన్‌ఉన్నారు. ఈ కమిటీ 1950, జనవరి 4న నివేదిక సమర్పించింది. 1950, జనవరి 26న రాష్ట్రం ఏర్పడాలని భావించినప్పటికీ కమిటీ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాల వల్ల సాధ్యం కాలేదు. 

గొల్లపూడి సీతారామశాస్త్రి నిరాహార దీక్ష: ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం మొదటిసారిగా 30 రోజులు నిరాహార దీక్ష చేసినవారు సీతారామశాస్త్రి. 1951, అక్టోబరు 2 లోపు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడాలని, మద్రాసు నగర భవితవ్యం ఆ తర్వాత మూడేళ్ల లోపు నిర్ణయించాలని, అంతవరకు అధికారాన్ని ఆంధ్రులు కానీ, తమిళులు కానీ కోరకూడదని సీతారాం ప్రకటించారు. అయితే ప్రత్యేక రాష్ట్రం కోసం నిరాహార దీక్ష చేయడం సమంజసం కాదని, తగిన సమయంలో ఈ విషయాన్ని పరిశీలిస్తామని నెహ్రూ హామీ ఇచ్చి వినోభా బావేను పంపారు. ఆయన గొల్లపూడి దీక్షను 1951, సెప్టెంబరు 20న విరమింపజేశారు. దీక్ష విరమించినప్పటికీ ఆంధ్ర రాష్ట్ర ఉద్యమాన్ని సజీవంగా ఉంచడానికి గొల్లపూడి తీవ్రంగా పోరాడారు.

ఖోస్లా కమిటీ: మొదటి నుంచి ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు రాజగోపాలాచారి వ్యతిరేకి. ఆంధ్రులు తమ ప్రయోజనాలకు భంగకరమైన కృష్ణా - పెన్నా ప్రాజెక్టును వ్యతిరేకించడంతో నెహ్రూ 1951లో ఖోస్లా కమిటీని నియమించారు. అది కృష్ణా - పెన్నా ప్రాజెక్టును తిరస్కరించి, ఆంధ్రా ప్రాంతానికి లాభదాయకమైన నాగార్జునసాగర్‌ప్రాజెక్టును నిర్మించాలని సిఫార్సు చేసింది.

పొట్టి శ్రీరాములు: ఈయన 1901, మార్చి 16న నెల్లూరు జిల్లాలో ఆర్య వైశ్య కుటుంబంలో జన్మించారు. శ్రీరాములుకు 30 ఏళ్లలోపే ఆయన తల్లిదండ్రులు, భార్య, కుమారుడు మరణించడంతో జీవితంపై విరక్తి చెంది గాంధీజీ సబర్మతి ఆశ్రమంలో చేరారు. ఈయనను అక్కడ ‘ఆంధ్రా శ్రీరాములు భాయ్‌’గా పిలిచేవారు. చివరిదశలో నెల్లూరు జిల్లా వేదికగా హరిజనోద్దరణకు తీవ్రంగా కృషి చేసి, దేవాలయ ప్రవేశం కల్పించారు. 1948లో హరిజనోద్దరణ కోసం 29 రోజులు నిరాహార దీక్ష చేశారు. ఈ కారణంగా నెహ్రూ సంవత్సరంలో ఒకరోజు హరిజన దినోత్సవంగా జరపాలని నిర్ణయించి, వారి సంక్షేమం కోసం రూ.కోటి కేటాయించారు. శ్రీరాములు ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు 1952, అక్టోబరు 19న మద్రాసులోని బులుసు సాంబమూర్తి ఇంట్లో మూడు షరతులతో నిరాహార దీక్ష ప్రారంభించారు. అవి

1) కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆంధ్రరాష్ట్ర నిర్మాణ ప్రకటన చేయాలి.  

2) ఆంధ్ర రాష్ట్ర నాయకులు ఐక్యంగా ఉండాలి.

3) మద్రాసు నగరాన్ని చీఫ్‌కమిషనర్‌రాష్ట్రంగా ఏర్పాటు చేయాలి.

ఆంధ్ర రాష్ట్రం ఇస్తామని నెహ్రూ టెలిగ్రామ్‌పంపినప్పటికీ ఆయన మాటను విశ్వసించకుండా శ్రీరాములు దీక్షను కొనసాగించారు. 58 రోజుల అనంతరం 1952, డిసెంబరు 15న మరణించారు. శ్రీరాములు త్యాగం ఆంధ్ర దేశంలో కల్లోల వాతావరణం సృష్టించింది. అనేకమంది శాసన సభ్యులు,  శాసనమండలి సభ్యులు పదవులకు రాజీనామా చేశారు. దీంతో నెహ్రూ స్పందించి మద్రాసు నగరం మినహా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఇవ్వాలని 1952, డిసెంబరు 19న పార్లమెంటులో ప్రకటన చేశారు. పొట్టి శ్రీరాములు గుర్తుగా నెల్లూరు జిల్లాకు 2008లో ‘పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా’ అని పేరు పెట్టారు.

కైలాసనాథ్‌వాంఛూ కమిషన్‌: 1953, ఫిబ్రవరిలో ఏర్పడిన ఈ కమిటీ ప్రధాన ఉద్దేశం ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు. అధ్యక్షుడిగా అప్పటి రాజస్థాన్‌హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కైలాసనాథ్‌వాంఛూ 1953, మార్చి 23న నివేదిక సమర్పించారు. దీనిపై 1953, మార్చి 25న నెహ్రూ ప్రకటన చేశారు. 1953, అక్టోబరు 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడుతుందని చెప్పారు. రాజధానికి సంబంధించి ఆంధ్రా నాయకులే నిర్ణయం తీసుకోవాలని ప్రకటించారు. చివరికి కర్నూలు రాజధానిగా రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాలతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు, గవర్నర్‌చందూలాల్‌మాధవ త్రివేది.
 

 

రచయిత: గద్దె నరసింహారావు 

Posted Date : 22-07-2024

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు