• facebook
  • whatsapp
  • telegram

జాతీయోద్యమంలో ఆంధ్ర మహిళలు

వలస పాలనపై వీరనారుల పోరాటాలు!
 

భారత స్వాతంత్య్ర పోరాటంలో ఆంధ్ర ప్రాంత మహిళలు అత్యంత కీలక పాత్ర పోషించారు. నాటి సామాజిక కట్టుబాట్లను ఛేదించుకుని, ధైర్యంగా ముందుకొచ్చి వలస పాలకులపై పోరాటాలు చేశారు. మహిళా సంఘాలుగా ఏర్పాటై రాజకీయ హక్కుల కోసం ఉద్యమించారు. సమాజంలో స్త్రీల స్థితిగతులను మెరుగుపరిచేందుకు, సాంఘిక దురాచారాలను రూపుమాపేందుకు సంస్కరణల కోసం సమరం సాగించారు. జాతీయ కాంగ్రెస్‌ కార్యకలాపాలకు ఆర్థికంగా అండగా నిలిచారు. ఆ విధంగా జాతీయోద్యమంలో వీరనారీమణులుగా వెలిగిన ఆంధ్రా మహిళా నేతలు, వారి కృషి, త్యాగాల గురించి పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. గాంధీజీ నాయకత్వంలో పెరిగిన మహిళల చైతన్యం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్‌ ఇండియా లాంటి కీలక ఉద్యమాలను విజయవంతం చేసిన తీరు, ప్రాంతాల వారీగా చేసిన పోరాటాలపై అవగాహనతో ఉండాలి.

భారత జాతీయోద్యమంలో మహిళలు ప్రముఖ పాత్ర పోషించారు. మరీ ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన స్వాతంత్య్ర పోరాటంలో అతివలు అత్యంత కీలకంగా వ్యవహరించారు. నాటి సాంఘిక దురాచారాలను వ్యతిరేకించారు. సమాజంలో వారికి తగిన స్థానం కోసం పోరాడుతూ, జాతీయోద్యమంలో కూడా చురుగ్గా పాల్గొన్నారు. కందుకూరి వీరేశలింగం పంతులు, చిలకమర్తి లక్ష్మీనరసింహం, ఉన్నవ లక్ష్మీ నారాయణ లాంటి అభ్యుదయ వాదులు బాలికల స్థితిని మెరుగుపరచడానికి గట్టిగా కృషిచేశారు. ఆంధ్రలో ఆనాడు ప్రబలంగా ఉన్న దేవదాసీ వ్యవస్థ నిర్మూలనకు యామిని పూర్ణతిలకం పోరాడారు. బ్రహ్మసమాజం, ఆర్యసమాజం లాంటి సంస్థలు మహిళల కోసం ఉద్యమాలు చేశాయి.


మహిళా సంఘాలు: ఈ సంఘాలు మహిళల్లో రాజకీయ చైతన్యం కలిగించడానికి, వారి రాజకీయ భావాల వ్యక్తీకరణకు వేదికలయ్యాయి. 1902లో ఆంధ్రాలో మొదటగా రాజమండ్రిలో కోటిలపూడి సీతమ్మమహిళా సంఘం స్థాపించారు. ఆ తర్వాత బండారు అచ్చమాంబ, ఓరుగంటి రత్నమాంబ మచిలీపట్నంలో మహిళా సంఘం నెలకొల్పారు. 1904లో కాకినాడలో పాలగుర్తి లక్ష్మీ నరసమాంబ, 1911లో కర్నూలులో బుర్రా బుచ్చి బంగారమ్మ మహిళా సంఘాలను స్థాపించారు. 1911లోనే విజయనగరంలో కొందరు మహిళలు కలిసి సత్యవర్ధిని అనే సంఘాన్ని ప్రారంభించారు. అదే ఏడాది రాజమండ్రి, ఏలూరులో ప్రార్థనా సమాజం మహిళా సమావేశాలు నిర్వహించింది. 1912లో శ్రీకాకుళంలో మహాలక్ష్మి సంఘం మొదలైంది.


భారత జాతీయ కాంగ్రెస్‌లో ఆంధ్ర మహిళలు: 1885లో ఏర్పాటైన కాంగ్రెస్‌ మహిళలకు కూడా రాజకీయ వేదికగా నిలిచింది. దీని వల్ల దేశ రాజకీయ కార్యకలాపాల్లో మహిళలు పాల్గొనడం ప్రారంభించారు. ఆంధ్రా నుంచి భారత జాతీయ కాంగ్రెస్‌ సమావేశానికి హాజరైన తొలి మహిళ పొనకా కనకమ్మ.


1917లో భారతదేశంలోని విభిన్న ప్రాంతాల మహిళలు ఆనాటి వైశ్రాయ్‌ చెమ్స్‌ఫర్డ్‌కు వినతిపత్రం ఇచ్చారు. దాన్ని సరోజినీ నాయుడు రూపొందించారు. మహిళలకు రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనే హక్కు ఉండాలని అందులో డిమాండ్‌ చేశారు. ఫలితంగా తర్వాత కాలంలో మహిళలకు రాజకీయ హక్కులు లభించాయి.


* 1918లో జరిగిన ఆంధ్ర రాష్ట్ర సదస్సులో మహిళలకు ఓటు హక్కు కావాలని డిమాండ్‌ చేశారు. తర్వాత అన్నిరాష్ట్రాల శాసన సభలు  మహిళలకు ఓటు హక్కు కల్పించాయి. ఈ క్రమంలోనే ముత్తు లక్ష్మీరెడ్డి 1926లో మద్రాసు శాసనమండలి సభ్యురాలిగా నామినేట్‌ అయ్యారు. ఆ తర్వాత ఆమె డిప్యూటీ స్పీకర్‌ అయ్యారు. ప్రపంచంలోనే ఆమె తొలి శాసనమండలి సభ్యురాలు.


* వందేమాతరం ఉద్యమ సమయంలో బిపిన్‌ చంద్రపాల్‌ ఆంధ్రాలో పర్యటించినప్పుడు ఆయన ప్రసంగానికి పొనకా కనకమ్మ లాంటి మహిళా నేతలు ప్రభావితమయ్యారు. ఓరుగంటి మహాలక్ష్మమ్మ, జయంతి సూరమ్మ ఆంధ్రాలో హోంరూల్‌ ఉద్యమానికి మద్దతిచ్చారు. వందేమాతర ఉద్యమంలో మహిళలు పెద్దగా పాల్గొనకపోయినప్పటికీ, స్వాతంత్రోద్యమంలో ఎక్కువగా పాల్గొన్నారు. ఇందుకు ప్రధాన కారణం గాంధీజీ వ్యక్తిత్వం. ఆయన నాయకత్వంలో మహిళల సంరక్షణ పట్ల విశ్వాసం పెరిగింది. మహాత్ముడి ప్రేరణతో ఎందరో మహిళలు నూలు వడికారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలనే తేడా లేకుండా ప్రతి ఇంట్లోనూ చరఖా చేరింది. తాము స్వతంత్రంగా జీవించగలమనే భావనను స్త్రీలకు కలిగించింది. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మాగంటి అన్నపూర్ణా దేవి నిరంతరం నూలు వడికేవారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన దువ్వూరి సుబ్బమ్మ విరామ సమయంలో నూలు వడికేవారు. గాంధీజీ జాతీయోద్యమం కోసం విరాళాలు కోరినప్పుడు వీరంతా అధిక మొత్తంలో అందించారు. ఆయన పిలుపు మేరకు హరిజనోద్ధరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. చాలామంది హరిజనుల కోసం పాఠశాలలు స్థాపించారు. తెనాలిలో కొల్ల యాదమ్మ, నెల్లూరులో అల్లాడి అన్నపూర్ణాదేవి హరిజనుల కోసం పాఠశాలలు, హాస్టళ్లు   ప్రారంభించారు.


సహాయ నిరాకరణోద్యమం: దువ్వూరి సుబ్బమ్మ సహాయ నిరాకరణ ఉద్యమ యోధురాలిగా నిలిచిపోయారు. ఈమె ఉప్పు సత్యాగ్రహం, క్విట్‌ ఇండియా ఉద్యమాల సమయంలో చురుకైన పాత్ర పోషించారు.మరికొందరు మహిళా కాంగ్రెస్‌లో ‘దేశ నేవికలు’ అనే ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసుకుని అహింసా విధానాల ద్వారా స్వరాజ్య ప్రచారం చేశారు. 1921లో గాంధీజీ కాకినాడను సందర్శించినప్పుడు దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ రూ.5000 భారీ విరాళం ఇచ్చారు. ఆ సమయంలో దేవదాసీ, ముస్లిం మహిళలతో సమావేశం ఏర్పాటు చేయగా గాంధీజీ ప్రసంగించారు. ఆయన ఉపన్యాసాన్ని దుర్గాబాయి తెలుగులోకి అనువదించారు. సహాయ నిరాకరణోద్యమ సమయంలో రావూరి అలివేలు మంగతాయారమ్మ అనే వృద్ధురాలితో సహా 12 మంది మహిళలను అరెస్టు చేశారు. అదే సమయంలో అనేక మంది మహిళలు అటవీ నియమాలను వ్యతిరేకించి పుల్లరి సుంకం చెల్లించేందుకు నిరాకరించారు. అటవీశాఖ అధికారులను బహిష్కరించారు. ఈ క్రమంలో 8 మంది మహిళలను అరెస్టు చేశారు. ఆ ఘటనకు వ్యతిరేకంగా గుంటూరులో జరిగిన హర్తాళ్‌లో ఉన్నవ లక్ష్మీబాయమ్మ, యామిని పూర్ణతిలకం క్రియాశీలక పాత్ర పోషించారు. ఈ నిరసనలో పెద్దఎత్తున మహిళలు పాల్గొన్నారు.


1923లో కాకినాడలో జరిగిన జాతీయ కాంగ్రెస్‌ సమావేశంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యనిర్వాహక సభ్యులుగా, వాలంటీర్లుగా సేవలందించారు. ఆహ్వాన సంఘంలో దువ్వూరి సుబ్బమ్మ ఉన్నారు. అనేక మంది మహిళలను ఈ సమావేశంలో పాల్గొనే విధంగా వేదాంతం కమలాదేవి ప్రోత్సహించారు. మహిళా వాలంటీర్లకు నాయకురాలిగా మాగంటి అన్నపూర్ణమ్మ బాధ్యత వహించారు.


ఉప్పుసత్యాగ్రహ సమయంలో కూడా అనేకమంది మహిళలు పాల్గొన్నారు. మహిళా వాలంటీర్లు తూర్పుగోదావరి జిల్లా చొల్లంగి వద్ద ఉప్పు తయారుచేశారు. ఈ సమయంలో దువ్వూరి సుబ్బమ్మను అరెస్టు చేశారు. 1930, ఏప్రిల్‌ 9న కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సత్యాగ్రహం జరిగింది. అందులో ఉన్నవ లక్ష్మీబాయమ్మ, రుక్మిణి లక్ష్మీపతి పాల్గొన్నారు. మద్రాసు ప్రభుత్వం రుక్మిణి లక్ష్మీపతిని అరెస్టు చేసింది. ఈమె దేశంలోనే ఉప్పు సత్యాగ్రహ సమయంలో అరెస్టయిన మొదటి మహిళ. ఈ ఉద్యమంలో గాడిచర్ల శేషాబాయి, తల్లాప్రగడ విశ్వసుందరి, దిగుమర్తి బుచ్చికృష్ణమ్మ, భారతిదేవి రంగా పాల్గొన్నారు.


క్విట్‌ ఇండియా ఉద్యమంలోనూ ఆంధ్రా మహిళలు చురుగ్గా పాల్గొన్నారు. పెద్దాపురంలో దువ్వూరి సుబ్బమ్మపై లాఠీఛార్జి జరిగింది. గుంటూరు జిల్లాలో 17 ఏళ్ల బాలిక చిత్తూరు అన్నపూర్ణాదేవి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కరపత్రాలు పంచడంతో ఆమెను అరెస్టు చేశారు. మద్రాసు వద్ద క్వీన్‌మేరీస్‌ కళాశాల విద్యార్థులు అనసూయారెడ్డి, శకుంతల, మరియా జోసెఫ్‌లను బ్రిటిషర్లు అరెస్టు చేశారు.


కమ్యూనిస్టు ఉద్యమం: జాతీయోద్యమంలో భాగంగా అనేక మహిళా సంఘాలు ప్రారంభమయ్యాయి. ప్రథమ ఆంధ్రరాష్ట్ర మహాసభ 1929, డాక్టర్‌ ముత్తు లక్ష్మీరెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సదస్సులో దేవదాసీ వ్యవస్థ నిర్మూలన, బాల్యవివాహాల నిషేధం, తండ్రి ఆస్తిలో కుమార్తెకు వాటా లాంటి వాటిని ఆమోదించారు. గుంటూరు, కృష్ణా, గోదావరి, గంజాం జిల్లాల్లో మహిళా సంఘాలు బాగా పనిచేశాయి. మద్రాసు నుంచి బరంపురం వరకు అనేక స్థానిక సంఘాలు మహిళా ఉద్యమాల వ్యాప్తికి తోడ్పడ్డాయి. కమ్యూనిస్టు ఉద్యమంలో కూడా మహిళలు పాల్గొన్నారు. కమ్యూనిస్టు సంఘాల్లో ప్రధానమైనవి ఆంధ్ర మహిళా సమాఖ్య, ఆంధ్రప్రదేశ్‌ మహిళా సంఘం.


దుర్గాబాయి దేశ్‌ముఖ్‌: రాజమండ్రిలో జన్మించిన ఈమె ఆంధ్రాలో హిందీ భాష ప్రచారానికి, ఖాదీ అభివృద్ధికి, స్త్రీ మానసిక వికాసానికి కృషి చేశారు. ఉప్పుసత్యాగ్రహ సమయంలో మూడు సార్లు జైలుకెళ్లారు. వితంతువుల కోసం    ఉద్యమాలు చేశారు. 1942లో ఆంధ్ర మహిళ పత్రికను స్థాపించారు. ఈమెను 1975లో భారత ప్రభుత్వం పద్మభూషణ్‌ పురస్కారంతో గౌరవించింది.

 

 

 

రచయిత:  గద్దె నరసింహారావు

Posted Date : 15-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు