• facebook
  • whatsapp
  • telegram

ఏపీ విభజన సమస్యలు

ఉమ్మడి సచివాలయ భవంతుల అప్పగింత

అప్పటి ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్‌ నిర్ణయం ప్రకారం సచివాలయం బ్లాకుల్లో జె, కె, ఎల్‌, ఉత్తర హెచ్‌ బ్లాకులను ఆంధ్రప్రదేశ్‌కి కేటాయించారు. ఏపీ ప్రభుత్వం మొదట ఈ బ్లాకుల నుంచే 13 జిల్లాల పరిపాలన కొనసాగించింది. ప్రజల వద్దకు పరిపాలన తీసుకు వెళ్లాలనే లక్ష్యంతో 2016లో ప్రభుత్వ యంత్రాంగాన్ని తరలించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్‌కి కేటాయించిన భవంతులు ఖాళీగా ఉన్నాయి. వీటిని వినియోగించుకోకుండానే కరెంటు బిల్లులు, ఆస్తి పన్ను, నీటి సరఫరా వ్యయాన్ని భరించాల్సి వచ్చింది. ఈ సందర్భంలో తెలంగాణ ప్రభుత్వం ఏపీ బ్లాక్‌లను తమకు ఇస్తే సచివాలయాన్ని పునర్నిర్మించుకుంటామని అభ్యర్థనలు చేసింది. కేవలం సచివాలయ ఆస్తుల విషయంలోనే కాదు షెడ్యూల్‌ 9, 10 సంస్థల ఆస్తులు, నిధుల పంపిణీ, ఉద్యోగుల విభజన జరిపినప్పుడే రెండు రాష్ట్రాలకు మేలు జరుగుతుందని గత ప్రభుత్వం పేర్కొంటూ భవంతుల అప్పగింతకు నిరాకరించింది. సార్వత్రిక ఎన్నికల అనంతరం ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌ కొత్త ప్రభుత్వం రెండు రాష్ట్రాల మధ్య సహకారం, సఖ్యత ప్రధానమని భావించి అప్పగింతకు సిద్ధమైంది.
అప్పగింత ప్రక్రియ: తెలంగాణ ప్రభుత్వం ఉమ్మడి గవర్నర్‌ని ఏపీ భవనాలను తమకు అప్పగించాలని మొదట కోరింది. ఆయన మద్దతు తెలపడంతో ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి అంగీకరించారు. ఫలితంగా ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం సెక్షన్‌ 8, 2014 ద్వారా సంక్రమించిన అధికారాలను ఉపయోగిస్తూ గవర్నర్‌ ఉమ్మడి రాజధానిలో ఆంధ్రప్రదేశ్‌కి కేటాయించిన భవంతులను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించారు. మొదటి దశలో కే, ఉత్తర హెచ్‌ బ్లాకులను అప్పగించారు. రెండో దశలో మిగతా బ్లాకులను అప్పగించారు.

షెడ్యూల్‌ 9, 10 వివాదాలు

షెడ్యూల్‌ 9 లో పేర్కొన్న 91 సంస్థలకుగానూ 44 సంస్థల విభజన పూర్తయింది. సార్వత్రిక ఎన్నికల అనంతరం ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌ కొత్త ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం షెడ్యూల్‌ 9, 10 సంస్థలకు చెందిన వివాదాలను పరిష్కరించుకోవడానికి చర్యలు ప్రారంభించాయి. షెడ్యూల్‌ తొమ్మిది ఆస్తుల విషయంలో ఒక ముగింపు పలకాలని ఇరు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులను ఆయా ప్రభుత్వాలు ఆదేశించాయి. కానీ 38 సంస్థల విషయంలో నిర్ణయం తీసుకునే పరిస్థితి లేకపోవడంతో ముఖ్యమంత్రుల స్థాయి సమావేశాన్ని ప్రతిపాదించారు. ముఖ్యమంత్రులు ఇరువురు ఈ విషయాలను సుహృద్భావ వాతావరణంలో పరిష్కరించుకోవాలని చెప్పారు.
మొదట కేంద్ర హోంశాఖ రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించడానికి ఆగస్టు 8, 2019న ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులతో సమావేశాన్ని ప్రతిపాదించారు. దీనిలో ఎనిమిది అంశాలపై చర్చించాలనుకున్నారు. వాటిలో ప్రధానమైంది 9, 10 షెడ్యూల్‌ సంస్థల ఆస్తుల వివాదం. అందులో భాగంగా ఏపీ భవన్‌ విభజనకు సంబంధించిన విషయాలను చర్చించాలని భావించారు. విద్యుత్తు బకాయిల చెల్లింపు, ఏపీహెచ్‌ఎంఈఎల్‌ వివాదం లాంటి ఇతర అంశాలూ ఉన్నాయి. పాలనా పరమైన కారణాల వల్ల ఆ మీటింగ్‌ను కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసింది.

నదీజలాల సహకారం

ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 పార్ట్‌ 9లో సెక్షన్‌ 84 నుంచి 91 వరకు నదీ జలాల నిర్వహణకు సంబంధించిన విషయాలను పేర్కొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు గోదావరిలోని మిగులు జలాలను కృష్ణానదికి తరలించి కృష్ణా పరీవాహక ప్రాంతంలోని వ్యవసాయ భూములకు తగిన నీటి సరఫరా చేయాలనే ఆలోచనకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అంగీకరించారు. ఆ దిశగా అధికారులు చర్చలు జరుపుతున్నారు.

అమరావతి నిర్మాణం నుంచి తొలగిన సంస్థలు

అమరావతి సస్టెయినబుల్‌ స్ట్రక్చర్‌ అండ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్‌ నుంచి ప్రపంచ బ్యాంకు వైదొలగినట్లు ప్రకటన చేసింది. ఈ ప్రాజెక్టు మొత్తం అంచనా 715 మిలియన్‌ డాలర్లు (రూ.4922 కోట్లు). ఇందులో 300 మిలియన్‌ డాలర్ల (రూ.2,066 కోట్లు) ఆర్థిక మద్దతు ఇచ్చేందుకు ప్రపంచబ్యాంకు మొదట సూత్రప్రాయంగా అంగీకరించింది. కేంద్రం సూచనల మేరకు నిష్క్రమిస్తున్నట్లు వెల్లడించింది. ఏషియన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్‌వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌ 200 మిలియన్‌ డాలర్ల ఆర్థిక మద్దతును వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మాత్రం బడ్జెట్‌ నిధుల్లో రూ. 500 కోట్లు రాజధాని అభివృద్ధి కోసం 2019 -20 సంవత్సరానికి కేటాయించింది.

ఆంధ్రప్రదేశ్‌కు కొత్త గవర్నర్‌

ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం 2014, సెక్షన్‌ 7 ప్రకారం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు రాష్ట్రపతి నిర్ణయించిన కాలం వరకు ఒకరే గవర్నర్‌ ఉంటారు. ఈ నిబంధన ప్రకారమే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ రెండు తెలుగు రాష్ట్రాలకు గవర్నర్‌గా కొనసాగారు. జులై 24 2019న నవ్యాంధ్రప్రదేశ్‌ మొట్టమొదటి పూర్తి స్థాయి గవర్నర్‌గా బిశ్వ భూషణ్‌ హరిచందన్‌ ప్రమాణ స్వీకారం చేశారు.

అమరావతి-అనంతపురం ఎక్స్‌ప్రెస్‌ హైవే


ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పర్యావరణ హితమైన 6/4 లైన్‌లతో అమరావతి-అనంతపురం ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణానికి ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించిన నిధులు అనుమతుల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా కోరింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వంద కోట్ల రూపాయల నిధులను ఈ ప్రాజెక్టుకు కేటాయించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో ఈ ప్రాజెక్టు నిర్మితమవుతుంది. హైవే పొడవు 557 కిలోమీటర్లు.

బకాయిల కోసం తెలంగాణ డిమాండ్‌

అయిదు సంవత్సరాలుగా రాజ్‌భవన్‌, హైకోర్టు నిర్వహణకు సంబంధించి రూ.290 కోట్లు చెల్లించాలని తెలంగాణ ఆంధ్రప్రదేశ్‌ని కోరింది. జనాభా శాతం ఆధారంగా ఈ లెక్కలు తీసుకున్నట్లు పేర్కొంది. రాజ్‌భవన్‌ నిర్వహణలో వాటాగా రూ.25 కోట్లు, హైకోర్టు నిర్వహణలో వాటాగా రూ.230 కోట్లు, మిగతా చట్టబద్ధ సంస్థల నిర్వహణ కింద మరో రూ.35 కోట్లు ఆంధ్రప్రదేశ్‌ చెల్లించాలని తెలంగాణ కోరింది. తెలంగాణ డిస్కమ్‌లకు రూ.2,406 కోట్లు చెల్లించాలని డిమాండ్‌ చేసింది.

విభజన సమస్యల పర్యవేక్షణ కమిటీ

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఈ కమిటీ పనిచేస్తుంది. సజ్జల రామకృష్ణారెడ్డి (ముఖ్యమంత్రికి ప్రజా వ్యవహారాల సలహాదారు), రాష్ట్ర న్యాయ శాఖ కార్యదర్శి ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. మెంబర్‌ కన్వీనర్‌గా గత కమిటీ నుంచి కొనసాగుతున్న ఎల్‌. రామచంద్రారెడ్డి కొనసాగుతారు.


శాసన సభ, శాసన మండలి భవనాలు

రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడినప్పుడు శాసన ప్రక్రియలో అవరోధాలను తొలగించేందుకు ఉమ్మడి రాష్ట్రాల పాత అసెంబ్లీ హాలుని ఆంధ్రప్రదేశ్‌కు, కొత్త అసెంబ్లీ హాల్‌ను తెలంగాణకు కేటాయించారు. ఉమ్మడి రాష్ట్రంలో శాసన మండలి సమావేశాలు జరిపిన హాల్‌ని ఆంధ్రప్రదేశ్‌కి ఇచ్చారు. తెలంగాణ శాసనమండలి సమావేశాల కోసం జూబ్లీ హాల్లో తాత్కాలిక ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం ఈ భవనాలనూ తెలంగాణకు ఇచ్చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేసిన తాత్కాలిక అసెంబ్లీ, శాసన మండలి భవనాల్లోనే గత రెండు సంవత్సరాలుగా సమావేశాలు జరుగుతున్నాయి. తెలంగాణ శాసన మండలి కార్యదర్శికి ఈ భవంతులను అప్పగించారు.
ఎమ్మెల్యే క్వార్టర్స్‌: ఆంధ్రప్రదేశ్‌కి కేటాయించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్లనూ తెలంగాణ ఎస్టేట్‌ ఆఫీసర్‌కి అప్పగించారు.
డైరెక్టరేట్‌, కమిషనరేట్లు: రెండు రాష్ట్రాల మధ్య సంబంధిత అధికారుల మధ్య అప్పగింతల కార్యక్రమం జరిగింది. ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ విభాగానికి డీజీపీ భవంతిని, ఇతర ప్రభుత్వ సేవలు అందిస్తున్న విభాగాలకు హెర్మిటేజ్‌ భవనాన్ని కేటాయించారు. ఈ రెండు భవంతుల నుంచి ఆంధ్రప్రదేశ్‌ తమ కార్యకలాపాలు నిర్వహించుకోవాలి.
ఉమ్మడి రాజధాని: హైదరాబాదులోని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఆస్తులను తెలంగాణ ప్రభుత్వానికి కేటాయించినప్పటికీ ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం 2014 ద్వారా సంక్రమించిన అధికారాలను బట్టి జూన్‌ 1, 2024 వరకు హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా కొనసాగుతుంది.

Posted Date : 29-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌