• facebook
  • whatsapp
  • telegram

ఆంధ్రా ప్రాంతానికి ఐరోపా వారి రాక

ఆశ్రయం పొంది.. అధికారం చెరపట్టి!

వ్యాపారం కోసం భారతదేశంలోకి ప్రవేశించిన పాశ్చాత్యులు, ఇక్కడి పాలకుల అనైక్యతను ఆసరాగా చేసుకుని వారి గొడవల్లోకి చొరబడ్డారు. ఆశ్రయమిచ్చిన వారిపైనే ఆధిపత్యం చెలాయించి, క్రమంగా అధికారాన్ని కైవసం చేసుకున్నారు. ఆ విధంగా ఆంధ్రా ప్రాంతంలో తొలుత ఫ్రెంచివారు అధికారంలోకి వచ్చారు. తర్వాత ఆంగ్లేయులు అడుగుపెట్టారు. వారు మొదట ఫ్రెంచివారిని ఓడించి, తర్వాత స్థానిక పాలకులను ఒక్కొక్కరిని జయించి మొత్తం ఆంధ్ర ప్రాంతంలో బ్రిటిష్‌ వలస పాలన ఏర్పాటు చేశారు. ఈ పరిణామ క్రమాన్ని, ఇందుకు దోహద పడిన పరిస్థితులను పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. ఉత్తరాంధ్ర, కోస్తా తీరం, రాయలసీమ ప్రాంతాలను ఆక్రమించడానికి ఆంగ్లేయులు చేసిన చారిత్రక యుద్ధాలు, కుదుర్చుకున్న ఒప్పందాలపై అవగాహన పెంచుకోవాలి.

కాన్‌స్టాంటినోపుల్‌ ప్రాంతాన్ని 1453లో రెండో మహ్మద్‌ ఆక్రమించడంతో ఐరోపావారు వాణిజ్యం కోసం భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుక్కున్నారు. దీంతో పోర్చుగల్, ఇంగ్లండ్, డెన్మార్క్, డచ్, ఫ్రాన్స్‌ దేశాలు వ్యాపారం కోసం మన దేశంలో వివిధ రకాల కంపెనీలు స్థాపించాయి. అవన్నీ స్థా నిక రాజుల నుంచి అనుమతి పొంది తూర్పు తీరంలో, ఆంధ్రా ప్రాంతంలో వ్యాపారం నిర్వహించాయి. క్రమంగా ఐరోపావారు స్థానిక రాజులపై అధికారం చెలాయించే స్థితికి వచ్చారు.


బుస్సీ ఆధిపత్యం: సలాబత్‌ జంగ్‌ హైదరాబాద్‌ నవాబు కావడానికి ఫ్రెంచ్‌ సైనికాధికారి బుస్సీ సహాయపడ్డాడు. ఇందుకు ప్రతిఫలంగా బుస్సీకి ‘ఉత్తర సర్కారులు’ అనే ప్రాంతాలు (గంజాం నుంచి గుంటూరు వరకు) దక్కాయి. ఈ విధంగా కోస్తాంధ్ర తీరం మొత్తం ఫ్రాన్స్‌ ఆధీనంలోకి వెళ్లింది. అయితే ఉత్తర సర్కారుల ఆక్రమణలో ఫ్రెంచివారికి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. నిజాం ఫౌజీదార్‌ జాఫర్‌ అలీఖాన్‌ను విజయనగర పాలకుడు విజయరామరాజు వ్యతిరేకించాడు. ఫ్రెంచ్‌ సేనాని బుస్సీ, విజయరామరాజుకు శ్రీకాకుళం, రాజమండ్రి సర్కారులపై శిస్తు వసూలు అధికారం ఇస్తామని చెప్పి అతడిని తమ వైపు తిప్పుకొని ‘తుమ్మలపల్లి యుద్ధం’లో జాఫర్‌ అలీఖాన్‌ని ఓడించాడు. హైదరాబాద్‌ రాజ్యంలో ఫ్రెంచి వారి ప్రాబల్యం నిజాం దర్బారులో కొందరు ప్రముఖులకు నచ్చలేదు. వారు నిజాంను ఒప్పించి బుస్సీని అధికారం నుంచి తొలగించే విధంగా 1756లో ఉత్తర్వులు జారీ చేశారు. బుస్సీ ఈ ఉత్తర్వులను లెక్కచేయకుండా హైదరాబాద్‌లోని చార్‌మహల్‌లోనే ఉండి నవాబుతో యుద్ధం ప్రకటించాడు. చివరకు నవాబు, బుస్సీతో సంధి చేసుకుని అతడి అధికారాలను పునరుద్ధరించాడు.


బొబ్బిలి యుద్ధం (1757, జనవరి 24):  ఈ యుద్ధానికి ప్రధాన ఆధారం అశుపాద కృష్ణమూర్తి రాసిన ‘బొబ్బిలి యుద్ధం’ అనే నాటకం. బుస్సీని సలాబత్‌ జంగ్‌ ఉద్యోగం నుంచి తొలగించాడని తెలియగానే విజయరామరాజు మినహా రాజమండ్రి, శ్రీకాకుళం జమీందారులు ఫ్రెంచివారికి పన్ను చెల్లించడం మానేశారు. ఈ సమయంలో బుస్సీ ఉత్తర సర్కారు జిల్లాల్లో పర్యటించాడు. ఆ సమయంలో విజయరామరాజు

అతడికి ప్రధాన సలహాదారు అయ్యాడు. బొబ్బిలి పాలకులు కూడా ఫ్రెంచివారికి శిస్తు చెల్లించలేదు. బొబ్బిలి రాజ్యానికి, విజయనగర రాజ్యానికి దీర్ఘకాలిక శత్రుత్వం ఉంది. ఈ అవకాశాన్ని వినియోగించుకుని బొబ్బిలిపై కక్ష సాధించాలని విజయనగర రాజు ప్రయత్నించాడు. ఫ్రెంచివారికి విజయనగరం, పెద్దాపురం సైన్యాలు తోడ్పడ్డాయి. 1757, జనవరి 24న జరిగిన బొబ్బిలి యుద్ధంలో జమీందారు రంగారావు మరణించాడు. రంగారావు బంధువు తాండ్ర పాపారాయుడు విజయనగర సైన్యంలోకి వెళ్లి విజయరామరాజును సంహరించాడు. ఈ యుద్ధంతో ఫ్రెంచివారి అధికారం గంజాం నుంచి గుంటూరు వరకు విస్తరించింది. ఆంధ్ర దేశంలో అధికారంలోకి వచ్చిన తొలి ఐరోపావాసులు ఫ్రెంచివారు. దీనికి ప్రధాన కారకుడు ‘బుస్సీ’.


మూడో కర్ణాటక యుద్ధ సమయంలో ఫ్రెంచివారి పరిస్థితి విషమించింది. ఫ్రెంచ్‌ గవర్నర్‌ కౌంట్‌-డి-లాలి తక్షణమే బుస్సీని హైదరాబాద్‌ నుంచి రమ్మని ఆదేశించాడు. అతడు హైదరాబాద్‌లో లేకపోతే పరిస్థితి విషమిస్తుందని తెలిసి కూడా బుస్సీపై కౌంట్‌-డి-లాలి ఒత్తిడి తెచ్చాడు. బుస్సీ దక్కన్‌ ప్రాంతం వదిలిన వెంటనే ఆనంద గజపతిరాజు శ్రీకాకుళాన్ని ఆక్రమించి, బెంగాల్‌లోని రాబర్ట్ క్లైవ్‌ (ఆంగ్లేయ సేనాని)తో మంతనాలు జరిపాడు. 1758, నవంబరు 21న ఆనంద గజపతిరాజు, ఆంగ్లేయులకు మధ్య సంధి జరిగింది. ఈ సంధి తర్వాత కల్నల్‌ పోర్ట్‌ నాయకత్వంలో బ్రిటిష్‌ సేనలు విజయనగరం, రాజమండ్రిలపైకి వెళ్లి 1758, డిసెంబరు 7న ఫ్రెంచి సేనలను ఓడించాయి. ఈ యుద్ధం తూర్పు గోదావరి జిల్లా ‘చందుర్తి’ వద్ద జరిగింది. భారతదేశ చరిత్ర గతిని మార్చిన యుద్ధాల్లో ఇదొకటి. ఈ యుద్ధంతో 1759లో కల్నల్‌ పోర్ట్‌ మచిలీపట్నంలోని ఫ్రెంచివారి కోటను ఆక్రమించాడు. ఉత్తర సర్కారుల్లో ఫ్రెంచివారి ప్రాబల్యం పూర్తిగా తగ్గింది. ఈ పతనాన్ని గమనించిన హైదరాబాద్‌ నిజాం సలాబత్‌ జంగ్‌ ఆంగ్లేయులతో సంధి చేసుకున్నాడు. ఆ సంధి అనంతరం మచిలీపట్నం, నిజాం పట్టణం, కొండపల్లి ప్రాంతాలను బ్రిటిషర్లు ఆక్రమించారు.


ఆంధ్రాలో ఆంగ్లేయుల పాలన: ఆంగ్లేయులను ఆంధ్ర దేశంలోకి ఆనంద గజపతిరాజు ఆహ్వానించాడు. చందుర్తి యుద్ధంలో విజయం తర్వాత ఆంగ్లేయులు మచిలీపట్నం ఓడరేవు ఆక్రమణ కోసం వ్యూహం పన్నారు. 1759, ఏప్రిల్‌ 8న ఫ్రెంచ్‌ - ఆంగ్లేయుల మధ్య జరిగిన యుద్ధంలో మచిలీపట్నం పూర్తిగా ఆంగ్లేయుల వశమైంది.ఆంధ్ర ప్రాంతంలో ఆంగ్లేయుల అధికారానికి బలమైన పునాది పడింది. ఆంగ్లేయులకు సహాయపడిన ఆనంద గజపతిరాజు తిరిగి విజయనగరం వెళుతూ మార్గమధ్యంలో కొండూరు వద్ద పెద్దాపురం జమీందారు జగపతిని వధించి సామర్లకోట, పెద్దాపురం, పిఠాపురం కోటలను స్వాధీనం చేసుకున్నాడు. 1760లో మశూచి సోకి మరణించాడు. ఆనంద గజపతిరాజు మరణం తర్వాత ఆంగ్లేయులకు ఉత్తర సర్కారులో తిరుగు లేకుండా పోయింది.


గుంటూరు సర్కారు కైవసం: గుంటూరు సర్కారు కూడా కోస్తా సర్కారులోనిదే. అయితే దీన్ని నిజాం తమ్ముడు, ఆదోని నవాబు బసాలత్‌ జంగ్‌ పరిపాలించేవాడు. నిజాం నవాబు దీనిని బసాలత్‌ జంగ్‌కి జీవితాంతం అనుభవించే హక్కుతో ఇచ్చాడు. బసాలత్‌ జంగ్‌ మరణం తర్వాత గుంటూరు ఆంగ్లేయులకు దక్కే విధంగా ఒప్పందం జరిగింది. బసాలత్‌ జంగ్‌ చనిపోయాక నిజాం అలీఖాన్‌ దానిని ఆక్రమించి 1788లో ఆంగ్లేయుల స్వాధీనం చేశాడు.


నెల్లూరు- చిత్తూరు ఆక్రమణ: నెల్లూరు - చిత్తూరు మండలాలు చాలావరకు కర్ణాటక నవాబుల ఆధీనంలో ఉండేవి. రెండో కర్ణాటక యుద్ధం తర్వాత ఇవి మహమ్మద్‌ అలీ పరమయ్యాయి. ఇతడు బ్రిటిషర్ల సహాయంతో రాజయ్యాడు. 1763లో మూడో కర్ణాటక యుద్ధం నాటికి మహమ్మద్‌ అలీ అధికారం కర్ణాటకలో స్థిరపడలేదు. 


1796లో మహమ్మద్‌ అలీ మరణించడంతో అతడి కుమారుడు ఊందత్‌ - ఉల్‌- ఉమ్రా నవాబు అయ్యాడు. ఉమ్రా 1801లో మరణించాడు. అతడి మరణం తర్వాత అజీం ఉద్దౌలతో సంప్రదింపులు జరిపిన బ్రిటిష్‌ గవర్నర్‌ వెల్లస్లీ కర్ణాటక అంతటా బ్రిటిష్‌ అధికారాన్ని విస్తరించాడు. ఫలితంగా నెల్లూరు, చిత్తూరు మండలాలు కూడా 1802లో బ్రిటిష్‌ ఆధీనంలోకి వెళ్లాయి.


దత్త మండలాల ఆక్రమణ: కడప, కర్నూలు, అనంతపురం, కర్ణాటకలోని బళ్లారి జిల్లాలను కలిపి ‘దత్త మండలాలు’ అంటారు. ఆ పేరు పెట్టినవారు గాడిచర్ల హరిసర్వోత్తమరావు. వీటినే సీడెడ్‌ జిల్లాలు అని కూడా వ్యవహరిస్తారు. ఈ ప్రాంతాలు ఒకప్పుడు విజయనగర సామ్రాజ్యంలో భాగంగా ఉండేవి.ఆ సామ్రాజ్యం పతనాంతరం గోల్కొండ రాజ్యంలో భాగమయ్యాయి. గోల్కొండ పతనం తర్వాత మొగల్‌ సామ్రాజ్యంలో కలిసి హైదరాబాద్‌ సుభా కిందకు వచ్చాయి. చివరకు హైదరాబాద్‌ నిజాం రాజ్యంలో చేరాయి. ఈ ప్రాంతాలు తరచూ మహారాష్ట్రుల దాడికి గురయ్యేవి. కడప, కర్నూలు, ఆదోని నవాబులు, వారి కింద ఉన్న పాలెగాళ్లు హైదరాబాద్‌ నిజాం అధికారాన్ని ధిక్కరిస్తూ స్వతంత్రంగా వ్యవహరించేవారు. పాలెగాళ్లను అదుపులో పెట్టడానికి నిజాం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.


రాయలసీమపై అధికారం పొందడానికి మహారాష్ట్రులు, నిజాం నవాబులు ప్రయత్నిస్తున్న సమయంలో మైసూర్‌ సుల్తాన్‌ హైదరాలీ ఈ ప్రాంతంపై దాడి చేసి రాయదుర్గం, బళ్లారి, గుర్రంకొండ, సిద్ధవటం దుర్గాలను ఆక్రమించాడు. 1782లో టిప్పు సుల్తాన్‌ ఆదోని కోటను ఆక్రమించాడు. ఆంగ్లేయుల సామ్రాజ్య విస్తరణను అరికట్టి వారిని దేశం నుంచి తరిమేయాలన్న దృఢసంకల్పంతో వారిని ప్రతిఘటించాడు. ఆంగ్లేయులకు మొదట హైదరాలీతో తర్వాత టిప్పు సుల్తాన్‌తో నాలుగు మైసూర్‌ యుద్ధాలు జరిగాయి.


1798లో బ్రిటిష్‌ గవర్నర్‌ జనరల్‌ వెల్లస్లీ ‘సైన్య సహకార విధానాన్ని’ ప్రవేశపెట్టాడు. ఈ ఒప్పందంలో చేరిన సంస్థానాల సరిహద్దులను బ్రిటిషర్లు రక్షిస్తారు. దీనికి బదులుగా సంస్థానాలవారు ఆంగ్లేయులకు కొంత సొమ్ము చెల్లించాలి. నిజాం అలీఖాన్‌ ఆంగ్లేయులకు డబ్బు చెల్లించడానికి బదులుగా కొన్ని ప్రాంతాలను ఇచ్చాడు. వాటినే దత్త మండలాలు అంటారు. ఈ దత్త మండలాలకు మొదటి కలెక్టర్‌ సర్‌ థామస్‌ మన్రో. రాయలసీమలో పాలెగాళ్లను మన్రో అణచివేశాడు. ఈ ప్రాంతంలో ‘రైత్వారీ విధానం’ అనే నూతన పన్ను   విధానాన్ని ప్రవేశపెట్టాడు.



రచయిత: గద్దె నరసింహారావు 

Posted Date : 18-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌