• facebook
  • whatsapp
  • telegram

భారతదేశ నదీ వ్యవస్థ -2

నదీ పరీవాహక ప్రాంతం (River Catchment Area): ఒక నదికి నీటిని అందించే మొత్తం భౌగోళిక ప్రాంతాన్ని నదీ పరీవాహక ప్రాంతం అంటారు.


నదీ వ్యవస్థ (River System): ఒక నది, దానిలో కలిసే ఉపనదులు, వాగులు, వంకలు, ఏరులు మొదలైన వాటిని నదీ వ్యవస్థ అంటారు.


నదీ ప్రవాహ దశలు


నదీ ప్రవాహాల్లో మూడు దశలు ఉంటాయి. అవి యవ్వన, ప్రౌఢ, వృద్ధాప్య దశలు. 


యవ్వన దశ 


నది తను పుట్టిన ప్రాంతం నుంచి మైదానంలో చేరే వరకు ఉన్న దశను యవ్వన దశ అంటారు.

* ఈ దశలో నదీ ప్రవాహ వేగం అధికంగా ఉంటుంది. దీంతో ఎక్కువగా ఆకస్మిక వరదలు సంభవిస్తాయి. 

* నదులు యవ్వన దశలో జలపాతాలు, జు ఆకారపు లోయలు, అగాధదరిని ఏర్పరుస్తాయి.


జలపాతం - రకాలు: ఇవి రెండు రకాలు. అవి: 

1. క్యాటరాక్ట్‌ జలపాతం 

2. క్యాస్కేడ్‌ జలపాతం


క్యాటరాక్ట్‌ జలపాతం: అత్యంత ఎత్తయిన ప్రాంతం నుంచి నిటారుగా కిందకి పడే నీటి ప్రవాహం.

* ప్రపంచంలో అతి ఎత్తయిన జలపాతం ఏంజెల్‌ జలపాతం. ఇది వెనిజులాలోని చురుణ్‌ నదిపై ఉంది. దీని ఎత్తు 979 మీటర్లు.

* భారతదేశంలో అత్యంత ఎత్తయిన జలపాతం కర్ణాటకలోని కుంచికల్‌. దీని ఎత్తు 455 మీటర్లు. ఇది వరాహి నదిపై ఉంది.


క్యాస్కేడ్‌ జలపాతం: ఎత్తయిన ప్రాంతం నుంచి నది నీరు నిటారుగా జాలువారకుండా మెట్లలా లేదా సోపానాలుగా కిందకి పడటాన్ని క్యాస్కేడ్‌ జలపాతం అంటారు. 

ఉదా: కుంచికల్‌ జలపాతం.


V - ఆకారపు లోయలు: వాలు ఎక్కువగా ఉన్న పర్వత ప్రాంతాల్లో నదీ ప్రవాహం వేగంగా ఉండి, కొండను లేదా పర్వతాన్ని నిలువుగా కోతకు గురిచేస్తుంది. దీని ఫలితంగా లోతైన లోయ ఏర్పడుతుంది. దీని కింది భాగం సన్నగా, పైభాగం ఎక్కువ వెడల్పుగా ఉంటుంది.

* V ఆకారపు లోయలు నిట్టనిలువు గోడలుగా మారితే వాటిని ‘గార్జ్‌’ అంటారు. 

ఉదా: గోదావరి నదిపై పాపికొండల వద్ద ఉన్న ‘బైసన్‌ గార్జ్‌’.

* గార్జ్‌లు పైన, కింద ఒకే వెడల్పుతో ఉంటాయి.


అగాధదరి/ కాన్యన్‌: గార్జ్‌లు ఏర్పడ్డాక నది నీటికోత పెరిగితే, లోతైన అగాధదరులు ఏర్పడతాయి.

* అగాధదరి కింది భాగం కంటే పై భాగం ఎక్కువ వెడల్పుగా ఉంటుంది.

ప్రపంచంలో అతిపెద్ద అగాధదరి అమెరికాలోని గ్రాండ్‌ కాన్యన్‌. ఇది కొలరాడో నదీ ప్రవాహం వల్ల ఏర్పడింది. దీని పొడవు 466 కి.మీ., లోతు 1.6 కి.మీ., వెడల్పు 188 మీటర్ల నుంచి 29 కి.మీ. వరకు ఉంటుంది.

* భారతదేశంలో అతిపెద్ద కాన్యన్‌ పెన్నానది వల్ల ఏర్పడిన గండికోట కాన్యన్‌.

* వీటితోపాటు పాట్‌ హోల్స్, రాక్‌ బెంచెస్‌ కూడా నదుల యవ్వన దశలో ఏర్పడతాయి.


వృద్ధాప్య దశ 


నదీ ప్రవాహం తీర ప్రాంతాన్ని చేరినప్పటి నుంచి సముద్రంలో కలిసే వరకు ఉన్న దశను వృద్ధాప్య దశ అంటారు.

* ఈ దశలో నది ప్రవాహం చాలా తక్కువగా ఉండి, అనేక వంకరలు తిరిగి ప్రవహిస్తుంది.

* ఈ దశలో నది ఆక్స్‌ బౌ సరస్సు (ఎద్దు అడుగు ఆకారపు సరస్సు)లను ఏర్పరుస్తుంది.

* సముద్ర తీర ప్రాంతంలో నదులు డెల్టాలను ఏర్పరుస్తాయి.


డెల్టా (Delta)

డెల్టా అనేది గ్రీకు భాషా పదం. దీని అర్థం ‘సారవంతమైన భూమి’. సాధారణంగా డెల్టాలు త్రిభుజాకారంలో ్బద్శీ ఏర్పడతాయి.


రకాలు


పక్షిపాద డెల్టా: మిసిసిపి నది పక్షిపాదం ఆకారంలో డెల్టాను ఏర్పరుస్తుంది.


ధనస్సు ఆకారపు డెల్టా: గోదావరి నది ఈ రకమైన డెల్టాను ఏర్పరుస్తుంది.

* నది సముద్రంలో కలిసే ప్రాంతం ‘U’ ఆకారంలో ఉంటుంది. అక్కడ డెల్టా ఏర్పడితే దాన్ని ధనస్సు ఆకారపు డెల్టా అంటారు.


ఎస్సురైన్‌ డెల్టా: నది తనతోపాటు తెచ్చిన సారవంతమైన మట్టిని పొడవైన, సన్నటి డెల్టాగా నిక్షేపించే నిర్మాణాలు. ఈ రకమైన డెల్టాలను నర్మదా, తాపి, మహీ నదులు ఏర్పరుస్తాయి.


డిజిటల్‌ డెల్టా: కంప్యూటర్‌ కీబోర్డులోని ‘కీ’ల రూపంలో చిన్నగా ఏర్పడిన అనేక డెల్టాల సమూహాన్ని ‘డిజిటల్‌ డెల్టా’ అంటారు.

* గంగానది డెల్టాలను డిజిటల్‌ డెల్టా అంటారు.


లోబెట్‌ డెల్టా: సముద్రంలో మునిగినట్టుగా కనిపించే డెల్టా. కృష్ణా, పెన్నా నదులు ఈ రకమైన డెల్టాలను ఏర్పరుస్తాయి.

* ప్రపంచంలో అతిపెద్ద డెల్టా సుందర్‌ బన్‌ డెల్టా. గంగా, బ్రహ్మపుత్ర నదులు బంగాళాఖాతంలో కలిసే చోట ఇది ఏర్పడింది. ఈ డెల్టా బంగ్లాదేశ్, భారతదేశంలో విస్తరించి ఉంది.

* ప్రపంచంలో రెండో పెద్ద డెల్టా థాయ్‌లాండ్‌లోని మెకంజి డెల్టా.


నదీ ప్రవాహక వ్యవస్థ (Drainage System)


నది పుట్టుక నుంచి అభివృద్ధి క్రమానుగతాన్ని నదీ ప్రవాహకం అంటారు.

* ఇది ప్రాథమిక భూస్వరూపం, భూమి భౌతిక నిర్మాణంపై ఆధారపడి ఉంటుంది.


రకాలు


అనువర్తి ప్రవాహాలు (Consequent stream): పురాతన భూస్వరూపాలపై వర్షపు నీరు వల్ల ఏర్పడిన నదులు.


ఉత్తరవర్తి ప్రవాహాలు: ఒక ప్రధాన అనువర్తి ప్రవాహానికి లంబ దిశలో ఉండి, భూభాగాల అభినతివాలుల్లో ప్రారంభమవుతుంది. వీటిని ప్రధాన ఉపనదులు అని కూడా అంటారు.


ప్రత్యనువర్తి ప్రవాహాలు: అనువర్తి నదులకు వ్యతిరేక దిశలో ప్రవహించే నదులు. ఇవి ప్రధాన ఉపనదులకు ఉపనదులుగా ఉంటాయి.


పూర్వవర్తి ప్రవాహాలు: నదులు ప్రవహించే భూభాగాల కంటే ముందు నుంచి ప్రవహిస్తున్న నదులు. సాధారణంగా ఈ నదులు ముడత పర్వతాలు ఆవిర్భవించే ప్రాంతాలలో ఉంటాయి.


ప్రౌఢ దశ


నీరు నదీ మైదానాల్లోకి ప్రవేశించినప్పటి నుంచి తీర ప్రాంతాలకు చేరే వరకు మధ్య ఉన్న ప్రవాహాన్ని నది ప్రౌఢదశ అంటారు.

* ప్రౌఢ దశలో నది వేగం తక్కువగా ఉండి, వెడల్పు ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలోనే వరద మైదానాలను ఏర్పరుస్తుంది.

* ఈ దశలో నదులు మెట్ల లాంటి స్వరూపాలను, వీవెనలను ఏర్పాటు చేస్తాయి.

* ఈ దశలో నది విసనకర్ర ఆకారంలో ఒండలి వీవెనలను ఏర్పరుస్తుంది.

*నదికి అనేక ఉపనదులు చేరి, నీటి పరిమాణం పెరుగుతుంది.


నదీ ప్రవాహంలో జరిగే చర్యలు


ట్రాక్షన్‌: నదిలో నీటితోపాటు చిన్న చిన్న గులక రాళ్లు కొట్టుకుపోయే ప్రక్రియ.


సస్పెన్షన్‌: నదిలో నీటి ప్రవాహంతో పాటు ఇసుక, మట్టి కొట్టుకుపోయే ప్రక్రియ.


సాల్టేషన్‌: నది నీటి ప్రవాహ వేగానికి నీటితోపాటు పెద్ద పెద్ద బండరాళ్లు కొట్టుకుపోయే ప్రక్రియ.


ద్రావణీకరణం: నది నీరు ప్రవహించే సమయంలో భూమి పైపొర కింద ఉండే సున్నం, సోడియం, అనేక రసాయనాలు, లవణాలు నది నీటిలో కలిసి ప్రవహించడం.


నదుల వర్గీకరణ

భారతదేశంలో నదులను నదీ పరీవాహక ప్రాంతం, జన్మస్థలం ఆధారంగా విభజించారు.

* నదీ పరీవాహక ప్రాంతం ఆధారంగా భారతదేశంలో నదులను మూడు రకాలుగా వర్గీకరించారు. అవి:

 1. ప్రధాన/ పెద్ద నదులు (Major Rivers)

 2. మధ్య తరహా నదులు (Medium Rivers)

 3. చిన్న తరహా నదులు (Small Rivers)


ప్రధాన నదులు:

పరీవాహక ప్రాంతం 20,000 చ.కి.మీ లేదా అంతకంటే ఎక్కువున్న నదులను ప్రధాన నదులు అంటారు.

* మనదేశంలోని ప్రధాన నదుల సంఖ్య 14. అవి: గంగా, సింధు, బ్రహ్మపుత్ర, సుబర్ణరేఖ, బ్రాహ్మణి, మహానది, గోదావరి, కృష్ణా, పెన్నా, కావేరీ, నర్మదా, తపతి, మహీ, సబర్మతి. వీటి ద్వారా సుమారు 80-85% నీరు ప్రవహిస్తుంది.

* ఆంధ్రప్రదేశ్‌లో ప్రవహించే ప్రధాన నదులు: గోదావరి, కృష్ణా, పెన్నా.

*  తెలంగాణలో ప్రవహించే ప్రధాన నదులు: గోదావరి, కృష్ణా.

* కర్ణాటకలో ప్రవహించే ప్రధాన నదులు: కృష్ణా, పెన్నా, కావేరీ.


మధ్య తరహా నదులు: 

నదీ పరీవాహక ప్రాంతం 2,000 నుంచి 20,000 చ.కి.మీ. మధ్య ఉన్న వాటిని మధ్య తరహా నదులు అంటారు.

* భారతదేశంలో మధ్యతరహా నదులు సుమారు 44. వీటి ద్వారా ప్రవహించే నీరు 7% మాత్రమే.

ఉదా: పెరియార్, కలింది మొదలైనవి.


చిన్నతరహా నదులు: నదీ పరీవాహక ప్రాంతం 2,000 చ.కి.మీ. కంటే తక్కుగా ఉన్న నదులు. దేశంలో వీటి సంఖ్య సుమారు 187. వీటి ద్వారా ప్రవహించే నీరు 8% మాత్రమే.


* జన్మస్థలం ఆధారంగా.. 

పుట్టుక ఆధారంగా భారతదేశ నదులను హిమాలయ నదులు, ద్వీపకల్ప నదులుగా విభజించారు.


హిమాలయ నదులు: వీటినే జీవనదులు అంటారు. ఇవి హిమాలయ పర్వతాల్లో జన్మించాయి. 

ఉదా: సింధూ, గంగా, బ్రహ్మపుత్ర.

* హిమాలయ నదులు పెద్ద పెద్ద గార్జ్‌లను ఏర్పరుస్తాయి. ఇవి అకస్మాత్తుగా తమ దిశలను మార్చుకుని, ‘V’ ఆకారపు లోయలను ఏర్పరుస్తాయి.

* వీటి అధిక వేగం కారణంగా అకస్మాత్తుగా వరదలు సంభవిస్తాయి.

* 2021, ఫిబ్రవరిలో ఉత్తరాఖండ్‌లోని ధౌళిగంగా నదికి సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా తపోవన్‌ అనే జల విద్యుత్‌ ప్రాజెక్టు పూర్తిగా కొట్టుకుపోయింది.

* ఈ నదులు ఎక్కువ పొడవుతో అధిక నీటి పరిమాణాన్ని కలిగి ఉంటాయి.


* హిమాలయాలు ఏర్పడక ముందు నుంచే ఆ ప్రాంతాలలో ప్రవహిస్తున్న నదులను ‘పూర్వవర్తి నదులు’ అంటారు. 

  ఉదా: సింధూ, సట్లేజ్, బ్రహ్మపుత్ర, కోసి, గండక్, అలక్‌నంద.

* హిమాలయాలు ఏర్పడ్డాక ఆ ప్రాంతంలో పుట్టి ప్రవహించే నదులను ‘అంతర్‌ వర్తిత నదులు’ అంటారు. 

 ఉదా: గంగా, రావి, బియాస్‌ మొదలైనవి.

* భారతదేశంలోని హిమాలయ నదులన్నీ మనదేశంతో పాటు పొరుగు దేశాల్లో ప్రవహించి, బంగాళాఖాతం లేదా అరేబియా మహాసముద్రంలో కలుస్తాయి.


ద్వీపకల్ప నదులు: దక్షిణ భారతదేశంలోని పర్వత ప్రాంతాల్లో జన్మించే నదులను ద్వీపకల్ప నదులు అంటారు.

* ఇవి వర్షాధారమైనవి. తక్కువ వేగాన్ని కలిగి ఉంటాయి. నదీ తీవ్రతలు ఉండవు.

* కఠినమైన అగ్ని శిలలపై ప్రవహిస్తాయి, కాబట్టి భూమిలో తక్కువగా ఇంకుతాయి.

ఉదా: గోదావరి, కృష్ణా, పెన్నా, కావేరి, మహానది, నర్మద, తపతి మొదలైనవి.

* భారతదేశంలోని నదుల ద్వారా ప్రహించే నీటిలో 90% నీరు బంగాళాఖాతంలో, 10% నీరు అరేబియా మహాసముద్రంలో కలుస్తుంది.

* మన దేశంలోని నదుల్లో 77% నదులు తూర్పుగా ప్రవహించి బంగాళాఖాతంలో కలిస్తే, 23% నదులు పడమరగా ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తాయి.

Posted Date : 30-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌