• facebook
  • whatsapp
  • telegram

రాజ్యాంగ సవరణా విధానం - కేంద్రీకరణ వర్సెస్ వికేంద్రీకరణ

    ఒకదేశ రాజ్యాంగం ఆ దేశ సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక, చారిత్రక పరిస్థితులకు అనుగుణంగా రూపొందుతుంది. దేశంలో వస్తున్న విభిన్న కాల పరిస్థితులకు అనుగుణంగా సాంఘిక, ఆర్థిక, రాజకీయ సవాళ్లను పరిష్కరించే విధంగా రాజ్యాంగాన్ని కూడా సవరించాల్సిన అవసరం ఉంది. భారత రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగ సవరణా విధానాన్ని దక్షిణాఫ్రికా నుంచి గ్రహించారు.
భారత రాజ్యాంగంలో ఆర్టికల్ - 368 ప్రకారం రాజ్యాంగాన్ని సవరించే 3 రకాల పద్ధతులను 22వ భాగంలో పొందుపరిచారు.
* రాజ్యాంగాన్ని సవరించడానికి అనుసరించే పద్ధతుల ఆధారంగా దాన్ని దృఢ, అదృఢ రాజ్యాంగాలుగా పేర్కొనవచ్చు.

1. దృఢ రాజ్యాంగం:
* ప్రత్యేక మెజార్టీ ద్వారా అంటే 2/3 లేదా 3/4వ వంతు మెజారిటీతో సవరించేది. ఈ విధానంలో రాజ్యాంగ సవరణ కఠినంగా ఉంటుంది.
ఉదా: అమెరికా రాజ్యాంగం

2. అదృఢ రాజ్యాంగం:
* సాధారణ మెజార్టీ ద్వారా సవరించేది. దీనిలో హాజరైన మొత్తం సభ్యుల సంఖ్యలో సగం కంటే ఎక్కువ మంది మద్ధతుతో రాజ్యాంగాన్ని సవరించవచ్చు.
ఉదా: బ్రిటన్

భారత రాజ్యాంగం దృఢ, అదృఢ లక్షణాల సమ్మేళనం
* 1967 నాటి గోలక్‌నాథ్ కేసులో ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంటుకు లేదని సుప్రీంకోర్టు పేర్కొంది.
* 1971లో ఇందిరాగాంధీ ప్రభుత్వం 24వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ - 13, ఆర్టికల్ - 368లను సవరించడంతోపాటు రాజ్యాంగంలోని ఏ భాగాన్నైనా సవరించే అధికారం పొందింది.
* 1973 నాటి కేశవానంద భారతి కేసులో రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంట్‌కు ఉందని, కానీ రాజ్యాంగ మౌలిక స్వరూపం ఉల్లంఘించకుండా మాత్రమే రాజ్యాంగాన్ని సవరించాలని సుప్రీంకోర్టు పేర్కొంది.
* ఇందిరాగాంధీ ప్రభుత్వం 1976లో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆర్టికల్ - 368కి చేర్చిన క్లాజులు 4, 5లు రాజ్యాంగ విరుద్ధమని, అవి చెల్లవని 1980లో మినర్వామిల్స్ కేసులో సుప్రీంకోర్టు పేర్కొంది.

ఆర్టికల్ 368లోని సబ్ క్లాజులు
* ఆర్టికల్ - 368(1) - పార్లమెంటుకు రాజ్యాంగాన్ని సవరించే అధికారం ఉంది.
* ఆర్టికల్ - 368(2) - పార్లమెంటు ప్రత్యేక మెజార్టీతో సవరించే అంశాలు.
* ఆర్టికల్ - 368(3) - ఆర్టికల్ 13లో పేర్కొన్న చట్టం నిర్వచన పరిధిలోని అంశాలు రాజ్యాంగ సవరణ నిర్వచనంలోకి రావు.
* ఆర్టికల్ - 368(4) - పార్లమెంట్ చేసిన రాజ్యాంగ సవరణను ఏ న్యాయస్థానంలో కూడా ప్రశ్నించడానికి వీల్లేదు.
* ఆర్టికల్ - 368(5) - రాజ్యాంగ సవరణ అధికారాల్లో మార్పులు, చేర్పులు రద్దుచేసే అంశంలో పార్లమెంటుకు ఏ విధమైన ఆంక్షలు వర్తించవు.

భారత రాజ్యాంగాన్ని సవరించే 3 పద్ధతులు

I. సాధారణ మెజార్టీ పద్ధతి:
* రాజ్యాంగంలోని కింద పేర్కొన్న 18 అంశాలను సవరించాలంటే పార్లమెంటుకు హాజరై ఓటువేసిన వారిలో సాధారణ మెజార్టీ ద్వారా సవరించవచ్చు.
అవి: 1) ఆర్టికల్ - 2 - కొత్తరాష్ట్రాల విలీనం లేదా ఏర్పాటు
2) ఆర్టికల్ - 3 - రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ
3) ఆర్టికల్ - 169 - రాష్ట్రాల్లో విధానపరిషత్‌ల ఏర్పాటు లేదా రద్దు
4) 2వ షెడ్యూల్ - రాజ్యాంగ ఉన్నతపదవులు, వారి జీతభత్యాలు
5) ఆర్టికల్ - 100(3) - పార్లమెంటులో కోరం నిర్ణయించడం
6) ఆర్టికల్ - 105 - సభాహక్కులు
7) ఆర్టికల్ - 106 - పార్లమెంటు సభ్యుల జీతభత్యాలు
8) ఆర్టికల్ - 118(12) - పార్లమెంటులో ఉభయసభల నిర్వహణకు రూపొందించిన నియమాలు
9) ఆర్టికల్ - 120(2) - పార్లమెంటులో ఇంగ్లిష్ వాడకం
10) ఆర్టికల్ - 124(1) - సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నియామకం
11) ఆర్టికల్ - 348 - అధికార భాషా విషయం
12) ఆర్టికల్ - 11 - పౌరసత్వం విధి విధానాలు
13) ఆర్టికల్ - 327 - పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలకు ఎన్నికలు నిర్వహించడం
14) ఆర్టికల్ - 81 - నియోజక వర్గాల పునర్వ్యవస్థీకరణ (డీలిమిటేషన్)
15) ఆర్టికల్ - 240 - కేంద్రపాలిత ప్రాంతాల విషయం
16) 5వ షెడ్యూల్ - ఎస్సీ, ఎస్టీల పరిపాలనాంశాలు
17) 6వ షెడ్యూల్ - అసోం, మేఘాలయ, మిజోరం, త్రిపుర రాష్ట్రాల్లో ఎస్టీల పాలన
18) ఆర్టికల్ - 135 - సుప్రీంకోర్టు అధికార పరిధిని విస్తృతపరచడం

II. ఏకపక్ష ప్రత్యేక మెజార్టీ పద్ధతి
* రాజ్యాంగంలోని మరికొన్ని ఆర్టికల్స్‌ను సవరించాలంటే (సాధారణ మెజార్టీ పద్ధతి, ద్విపక్ష ప్రత్యేక మెజార్టీ పద్ధతిలో సవరించేవి తప్ప) పార్లమెంటు 2/3వ వంతు ప్రత్యేక మెజార్టీ ద్వారా సవరించగలదు. రాజ్యాంగంలోని అత్యధిక భాగాలను ఈ పద్ధతి ద్వారానే సవరిస్తారు.
ఉదా: రాజ్యాంగంలోని 3వ భాగంలో ఆర్టికల్ - 12 - 35 వరకు ఉన్న ప్రాథమిక హక్కులు.

* రాజ్యాంగంలోని 4వ భాగంలో ఆర్టికల్ - 36 - 51 వరకు ఉన్న ఆదేశిక సూత్రాలు.
* రాజ్యాంగంలోని 4(A) భాగంలో ఆర్టికల్ - 51(A)లోని ప్రాథమిక విధులు.
* మొదటి, మూడో పద్ధతుల్లో పేర్కొనని ఇతర అంశాలు.

III. ద్విపక్ష మెజార్టీ పద్ధతి
* రాజ్యాంగంలోని సమాఖ్య లక్షణాలను సవరించాలంటే పార్లమెంటు 2/3వ వంతు మెజార్టీతోపాటు, భారతదేశంలో సగాని కంటే ఎక్కువ రాష్ట్రాల్లో (15 రాష్ట్రాలు) ప్రతి శాసనసభ సాధారణ మెజార్టీతో ఆమోదించాలి.
అవి: 1) ఆర్టికల్ - 54 - రాష్ట్రపతి ఎన్నిక
     2) ఆర్టికల్ - 55 - రాష్ట్రపతి ఎన్నిక విధానం
     3) ఆర్టికల్ - 73 - కేంద్ర కార్యనిర్వాహక శాఖ అధికార పరిధిని విస్తృత పరచడం
     4) ఆర్టికల్ - 162 - రాష్ట్ర కార్యనిర్వాహక శాఖ అధికార పరిధిని విస్తృత పరచడం
     5) 5వ భాగంలోని ఆర్టికల్ - 124 - 147 - వరకు ఉన్న సుప్రీంకోర్టుకు సంబంధించిన అంశాలు.
     6) 6వ భాగంలోని ఆర్టికల్ - 214 - 232 - వరకు ఉన్న హైకోర్టుకు సంబంధించిన అంశాలు.
     7) 7వ షెడ్యూల్‌లోని కేంద్ర, రాష్ట్రాల మధ్య ఉన్న అధికారాల విభజన.
     8) 4వ షెడ్యూల్‌లోని రాజ్యసభలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేటాయించిన సీట్ల వివరాలు.
     9) ఆర్టికల్ - 368కు సంబంధించిన రాజ్యాంగ సవరణా విధానం.
     10) ఆర్టికల్ - 246 - కేంద్ర, రాష్ట్రాల మధ్య ఉండే శాసనపరమైన అధికారాల విభజన.
     11) ఆర్టికల్స్ - 80, 81 - రాష్ట్రాలకు పార్లమెంటులో ప్రాతినిధ్యం.

రాజ్యాంగ సవరణ - నియమాలు

* ఆర్టికల్ - 368 ప్రకారం రాజ్యాంగ సవరణ బిల్లులను పార్లమెంటు ఉభయసభల్లో ఏ సభలోనైనా ప్రతిపాదించవచ్చు. రాష్ట్ర శాసన సభలకు రాజ్యాంగ సవరణను ప్రతిపాదించే అధికారం లేదు.
* రాష్ట్రపతి పూర్వానుమతి అవసరం లేదు.
* రాజ్యాంగ సవరణ బిల్లును మంత్రి/ సాధారణ సభ్యుడు ప్రతిపాదించవచ్చు.
* సమాఖ్య అంశాలకు సంబంధించిన ప్రకరణలు సవరించడానికి సగానికి పైగా రాష్ట్ర శాసనసభలు ఆమోదం తెలపాల్సి ఉంటుంది.
* రాజ్యాంగ సవరణ బిల్లును ఉభయసభలు, నిర్ణీత మెజార్టీ ప్రకారం వేర్వేరుగా ఆమోదించాలి.
* రాజ్యాంగ సవరణ బిల్లును ఒకసభ ఆమోదించి మరొకసభ తిరస్కరిస్తే, వాటిమధ్య ప్రతిష్టంభనను తొలగించడానికి ఉభయ సభల సంయుక్త సమావేశానికి అవకాశం లేదు.
* రాజ్యాంగ సవరణ బిల్లును రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదించాలి.
* 1971 నాటి 24వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగ సవరణ బిల్లుకు రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదం తెలపాలని నిర్ధేశించారు.
* రాజ్యాంగ సవరణ ప్రక్రియ అనేది స్వయం నిర్ధేశిత పద్ధతి.

రాజ్యాంగ సవరణ పద్ధతిపై ఉన్న విమర్శలు

* రాజ్యాంగాన్ని సవరించే అధికారాన్ని పార్లమెంటుకే పరిమితం చేయడం.
* రాజ్యాంగ సవరణ కోసం ప్రత్యేక రాజ్యాంగ పరిషత్తు లేకపోవడం.
* రాజ్యాంగంలోని కొన్ని అంశాలను సాధారణ చట్టాన్ని సవరించే పద్ధతిలోనే సవరించవచ్చు. దీనివల్ల రాజ్యాంగ పవిత్రత దెబ్బతింటుంది.
* రాజ్యాంగంలోని అనేక అంశాలను పార్లమెంటు ప్రత్యేక మెజార్టీ ద్వారా సవరించవచ్చు. రాష్ట్రాల భాగస్వామ్యం పరిమితంగా ఉంటుంది.
* అమెరికాలో మాదిరి మనదేశంలో కూడా రాష్ట్రాలకు రాజ్యాంగ సవరణలను ప్రతిపాదించే అధికారం లేకపోవడం వికేంద్రీకరణ స్ఫూర్తికి విరుద్ధం.
* రాజ్యాంగ సవరణలో ఉభయ సభల మధ్య ప్రతిష్టంభన ఏర్పడితే, పరిష్కారానికి సంయుక్త సమావేశం ఏర్పాటు చేసే వీల్లేదు.

రాజ్యాంగ సవరణ విధానంపై వ్యాఖ్యానాలు
''భారత రాజ్యాంగం కఠిన, శాశ్వతమైన పద్ధతి ఏర్పాటు చేయాలనుకున్నా, శాశ్వతత్వం అనేది రాజ్యాంగానికి ఉండదు. కొంత సరళత అవసరం, రాజ్యాంగం దృఢమైనదైతే దేశాభివృద్ధి మందగిస్తుంది" - జవహర్‌లాల్ నెహ్రూ
''భారత రాజ్యాంగ సవరణ పద్ధతి బయటకు సంక్లిష్టంగా కనిపించినా అది కేవలం విశిష్టతకు నిదర్శనం" - గాన్‌విల్ ఆస్టిన్
''రాజ్యాంగ సవరణ విధానం ఒక మూస విధానాన్ని ఎంచుకోలేదు. ఇదే అంతిమం, సవరణకు అతీతం అనే నియమాన్ని ఏర్పాటు చేయదలుచుకోలేదు. ఒక సరళ విధానాన్ని పొందుపరచడం జరిగింది." - డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్
''భారత రాజ్యాంగ సవరణ పద్ధతి దృఢ, అదృఢ లక్షణాల మధ్య మంచి సమతౌల్యాన్ని సాధించింది. సవరణ పద్ధతిలో వైవిధ్యం ఉంది. ఇది చాలా అరుదైంది, వివేకమైంది." - కె.సి. వేర్
''సవరించడానికి వీల్లేని నిబంధనలను రాజ్యాంగంలో పొందుపరచడం ద్వారా విప్లవాలు వచ్చే ప్రమాదం ఉంది." - విల్లీస్
''సవరించడానికి వీలుకాని రాజ్యాంగం అత్యంత హేయమైంది లేదా అత్యంత క్రూరమైన ప్రజాపీడన." - మల్‌ఫోర్డ్


 

సుప్రీంకోర్టు - వ్యాఖ్యానాలు
* 1951లో చేసిన మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా 9వ షెడ్యూల్‌లో చేర్చిన ప్రకరణ 31(A), 31(B)లను సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ కేసులో సుప్రీంకోర్టు 368వ ప్రకరణ కింద జరిగే రాజ్యాంగ సవరణకు, సాధారణంగా పార్లమెంటు చేసే ఇతర శాసనాలకు తేడా ఉందని, రెండూ ఒకటి కాదని, రాజ్యాంగ సవరణ అనేది ఆర్టికల్ - 13 కిందకు రాదని, రాజ్యాంగ సవరణలన్నీ చెల్లుబాటు అవుతాయని తీర్పు ఇచ్చింది. ఈ కేసులోనే సుప్రీంకోర్టు మొదటిసారిగా న్యాయ సమీక్షాధికారాన్ని వినియోగించింది.
* 1965 నాటి సజ్జన్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ సవరణను ఆర్టికల్ - 13కు వ్యతిరేకం కాదని పేర్కొంది.
* 1967లో గోలక్‌నాథ్ కేసులో ఆర్టికల్ - 368 ద్వారా జరిగే రాజ్యాంగ సవరణలు కూడా ఆర్టికల్ - 13కు వ్యతిరేకంగా ఉంటే చెల్లవని, పార్లమెంటుకు ప్రాథమిక హక్కులను సవరించే అధికారం లేదని సుప్రీంకోర్టు పేర్కొంది.
* గోలక్‌నాథ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అధిగమించేందుకు పార్లమెంటు 1971లో 24వ రాజ్యాంగ సవరణ చేసి, ఆర్టికల్స్ - 13, 368లను సవరించింది.
* 1973లో కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు కీలకమైన తీర్పునిస్తూ, ప్రాథమిక హక్కులతో సహా రాజ్యాంగంలోని ఏ భాగాన్నైనా పార్లమెంటు సవరించవచ్చునని తెలుపుతూ, రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మాత్రం ఉల్లంఘించరాదని పేర్కొంది.

భారత రాజ్యాంగ సవరణలు

1వ రాజ్యాంగ సవరణ చట్టం: 1951
* దీని ద్వారా భూసంస్కరణలు, ఇతర చట్టాలను రక్షించి, కొనసాగించుకునేందుకు 9వ షెడ్యూల్‌ను చేర్చారు. ఈ షెడ్యూల్‌లో చేర్చిన అంశాలు న్యాయసమీక్ష పరిధిలోకి రావు.
* వాక్ స్వాతంత్య్ర, భావప్రకటనా స్వేచ్ఛపైన ప్రజా సౌకర్యం, విదేశాలతో సత్ సంబంధాల ఆధారంగా నియంత్రణలను ప్రవేశపెట్టింది.
* ఈ సవరణ చట్టం ద్వారా ఆర్టికల్స్ - 31(A), 31(B)లను చేర్చారు.

2వ రాజ్యాంగ సవరణ చట్టం: 1952
* దీని ద్వారా ఆర్టికల్ - 81ని సవరించి, పార్లమెంట్‌లో రాష్ట్రాలకు కేటాయించిన స్థానాలపై మార్పులు చేశారు.
* లోక్‌సభ ప్రాతినిధ్య పరిధిలో మార్పుచేసి, ఒక లోక్‌సభ సభ్యుడు 7,50,000 మందికి పైగా ప్రాతినిధ్యం వహించేలా సవరించడమైంది.

3వ రాజ్యాంగ సవరణ చట్టం: 1955
* దీని ద్వారా 7వ షెడ్యూల్‌కు సవరణ చేశారు. ప్రజాప్రయోజనాల కోసం ఆహార పదార్థాలు, పశువుల దాణా, ముడిపత్తి, ఇనుము ఉత్పత్తి, సరఫరా లాంటి వాటిని ఉమ్మడి జాబితాలోకి మార్చారు.

4వ రాజ్యాంగ సవరణ చట్టం: 1955
* దీని ద్వారా ఆర్టికల్స్ - 31, 31A, 305 లకు సవరణ చేశారు. 9వ షెడ్యూల్‌ను కూడా సవరించారు.
* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేట్ వ్యక్తుల నుంచి ఆస్తులను స్వాధీనం చేసుకున్నప్పుడు చెల్లించే నష్టపరిహారం విషయంలో కోర్టులు జోక్యం చేసుకోరాదు. ఏ వ్యాపారాన్నైనా జాతీయం చేసే అధికారం రాష్ట్రాలకు కల్పించడమైంది.

5వ రాజ్యాంగ సవరణ చట్టం: 1955
* దీని ద్వారా ఆర్టికల్ - 3ను సవరించారు. రాష్ట్రపతి రాష్ట్రాల భౌగోళిక సరిహద్దులను, రాష్ట్రాల పేర్లను మార్పుచేసే బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి ముందు రాష్ట్రాల అభిప్రాయం కోసం పంపిస్తారు.
* దీనికి నిర్ణీత గడువులోగా రాష్ట్రాల శాసనసభలు తమ అభిప్రాయాన్ని తెలియజేయాలి.

6వ రాజ్యాంగ సవరణ చట్టం: 1956
» దీని ద్వారా ఆర్టికల్స్ - 269, 286లను సవరించారు. అంతర్ రాష్ట్రాల మధ్య జరిగే వాణిజ్యాలపై పన్నులను విధించే అధికారం పార్లమెంటుకు ఉంటుంది.


7వ రాజ్యాంగ సవరణ చట్టం: 1956
» దీని ద్వారా రాజ్యాంగానికి నూతనంగా చేర్చిన ఆర్టికల్స్ - 258(A), 290(A), 350(A), 350(B), 372(A), 378(A).
» దీని ద్వారా సవరించిన ఆర్టికల్స్ - 1, 49, 80, 81, 82, 131, 153, 158, 168, 170, 171, 216, 217, 220, 222, 224, 230, 231, 232, 371.
» ఈ సవరణ చట్టం ద్వారా రాష్ట్రాల పునర్విభజనను జరిపి, 14 రాష్ట్రాలు, 6 కేంద్ర పాలిత ప్రాంతాలను ఏర్పాటు చేశారు.
» హైకోర్టుల న్యాయవిచారణ పరిధిని కేంద్ర పాలిత ప్రాంతాలకు విస్తరించారు.
» హైకోర్టులో తాత్కాలిక, అదనపు న్యాయమూర్తుల నియామకానికి అవకాశం కల్పించారు.
» రెండు లేదా మూడు రాష్ట్రాలకు కలిపి, ఒక ఉమ్మడి హైకోర్టు ఏర్పాటుకు అవకాశం కల్పించారు.
» ఒకే వ్యక్తిని ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాల గవర్నరుగా నియమించవచ్చు.
» ఆంధ్రప్రదేశ్, పంజాబ్, బొంబాయి రాష్ట్రాలకు సంబంధించి కొన్ని ప్రత్యేక అంశాలను చేర్చారు.

 

8వ రాజ్యాంగ సవరణ చట్టం: 1960
» దీని ద్వారా ఆర్టికల్ - 334ను సవరించారు. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఆంగ్లో ఇండియన్‌లకు చెందిన వారికి లోక్‌సభ, శాసనసభల్లో కేటాయించిన స్థానాలను పది సంవత్సరాలు అంటే 1970 వరకు పొడిగించారు.


9వ రాజ్యాంగ సవరణ చట్టం: 1960
» దీని ద్వారా మొదటి షెడ్యూల్‌కు సవరణ చేశారు. పశ్చిమ బెంగాల్‌లోని బెరుబారి ప్రాంతాన్ని పాకిస్థాన్‌కు అప్పగించారు.


10వ రాజ్యాంగ సవరణ చట్టం: 1961
» దీని ద్వారా మొదటి షెడ్యూల్, ఆర్టికల్ - 240ను సవరించారు. దాద్రానగర్ హవేలీని కేంద్రపాలిత ప్రాంతంగా భారత సమాఖ్యలో విలీనం చేశారు.


11వ రాజ్యాంగ సవరణ చట్టం: 1961
» దీని ద్వారా ఆర్టికల్స్ - 66(1), 71(3) లను సవరించారు.
» రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతుల ఎలక్టోరల్ కళాశాలల్లో ఖాళీలు ఉన్నాయనే కారణంతో వారి ఎన్నికను న్యాయస్థానంలో సవాల్ చేయరాదు.
» ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశం జరపాలన్న విధానాన్ని తొలగించి, రెండు సభలు విడివిడిగా ఎన్నికల్లో పాల్గొనడానికి అవకాశం కల్పించారు.


12వ రాజ్యాంగ సవరణ చట్టం: 1961
» దీని ద్వారా మొదటి షెడ్యూల్, ఆర్టికల్ - 240ని సవరించారు.
» గోవా, డయ్యూ, డామన్‌లను భారతదేశంలో విలీనం చేశారు.


13వ రాజ్యాంగ సవరణ చట్టం: 1962
» దీని ద్వారా ఆర్టికల్ - 371(A) ను చేర్చారు. నాగాలాండ్‌కు రాష్ట్రహోదాను కల్పించడమే కాకుండా కొన్ని ప్రత్యేక నిబంధనలను రూపొందించారు.


14వ రాజ్యాంగ సవరణ చట్టం: 1962
» దీని ద్వారా ఆర్టికల్స్ - 239 (A), 241; 1, 4 షెడ్యూల్స్‌ను సవరించారు.
» పుదుచ్చేరిని భారత సమాఖ్యలో విలీనం చేశారు. హిమాచల్‌ప్రదేశ్, మణిపూర్, త్రిపుర, గోవా, పుదుచ్చేరిలకు శాసనసభలు ఏర్పాటు చేశారు.


15వ రాజ్యాంగ సవరణ చట్టం: 1963
» దీని ద్వారా ఆర్టికల్స్ - 124, 128, 217, 222, 224, 226, 297, 311, 316 లను సవరించారు. ఆర్టికల్ - 224(A) ను కొత్తగా చేర్చారు.
» హైకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయసును 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచారు.
» హైకోర్టులో పదవీ విరమణ చేసిన న్యాయమూర్తులను నియమించే అవకాశం కల్పించారు.
» హైకోర్టుకు ఉండే రిట్లు జారీ చేసే అధికార పరిధిని విస్తృతపరిచారు.


16వ రాజ్యాంగ సవరణ చట్టం: 1963
» దీని ద్వారా ఆర్టికల్స్ - 19, 84, 173లతోపాటు 3వ షెడ్యూల్‌ను సవరించారు.
» భారతదేశ సార్వభౌమాధికారం, సమగ్రతల కోసం భావప్రకటన, వాక్ స్వాతంత్య్రపు హక్కు, శాంతియుతంగా సమావేశమయ్యే హక్కు, సంఘాలుగా ఏర్పడే హక్కులను నియంత్రణ చేసే అధికారం పార్లమెంటుకు ఉంటుంది.
» చట్టసభలకు పోటీచేసే అభ్యర్థులు, చట్టసభల ఏర్పాటు, మంత్రులు, న్యాయమూర్తులు, కాగ్ (CAG) తాము భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడుతామని చేసే ప్రమాణాన్ని సవరించారు.


17వ రాజ్యాంగ సవరణ చట్టం: 1964
» దీని ద్వారా ఆర్టికల్ - 31(A), 9వ షెడ్యూల్‌ను సవరించారు. 9వ షెడ్యూల్‌లో మరో 44 చట్టాలను చేర్చారు.
» వ్యక్తుల సొంత వ్యవసాయ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నప్పుడు, ఆ భూమి మార్కెట్ విలువను పరిహారంగా సంబంధిత వ్యక్తికి ఇవ్వాలి.


18వ రాజ్యాంగ సవరణ చట్టం: 1966
» కొత్త రాష్ట్రం ఏర్పాటుకు సంబంధించి పార్లమెంటు అధికారాలను స్పష్టం చేశారు.
» ఆర్టికల్ 3ను సవరించి రాష్ట్రం అనే మాటను పునర్ నిర్వచించారు. పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్‌లను పునర్ వ్యవస్థీకరించారు.


19వ రాజ్యాంగ సవరణ చట్టం: 1966
» దీని ద్వారా ఆర్టికల్ - 324ను సవరించారు. ఎన్నికల ట్రిబ్యునళ్లను రద్దుచేసి, ఎన్నికల ఫిర్యాదులను పరిష్కరించే అధికారాన్ని హైకోర్టులకు అప్పగించారు.


20వ రాజ్యాంగ సవరణ చట్టం: 1966
» దీని ద్వారా ఆర్టికల్ - 233(A) ను కొత్తగా చేర్చారు.
» ఉత్తర్‌ప్రదేశ్‌లోని కొంతమంది జిల్లా జడ్జీల నియామకం చెల్లదన్న సుప్రీంకోర్టు తీర్పును ఈ సవరణ ద్వారా చెల్లుబాటు అయ్యేలా చేశారు.


21వ రాజ్యాంగ సవరణ చట్టం: 1967
» దీని ద్వారా 8వ షెడ్యూల్‌ను సవరించారు. సింధి భాషను 15వ భాషగా చేర్చారు.


22వ రాజ్యాంగ సవరణ చట్టం: 1969
» దీని ద్వారా ఆర్టికల్స్ - 244(A), 371(B), 275 (1)(A) లను చేర్చారు.
» అస్సాం నుంచి స్వయంప్రతిపత్తి ఉన్న రాష్ట్రంగా మేఘాలయ ఏర్పడింది.
» అస్సాం రాష్ట్రానికి కొన్ని ప్రత్యేక ప్రాధాన్యాలను కల్పించారు.


23వ రాజ్యాంగ సవరణ చట్టం: 1969
» దీని ద్వారా ఆర్టికల్స్ - 330, 332, 333, 334లను సవరించారు.
» పార్లమెంటు, రాష్ట్ర శాసనసభల్లో షెడ్యూల్డ్ కులాలు, తెగలు; ఆంగ్లో ఇండియన్స్‌కు కల్పిస్తున్న రిజర్వేషన్లు మరో 10 సంవత్సరాలు అంటే 1980 వరకు పొడిగించారు.


24వ రాజ్యాంగ సవరణ చట్టం: 1971
» దీని ద్వారా ఆర్టికల్స్ - 13, 368లను సవరించారు.
» రాజ్యాంగంలోని ఏ భాగాన్నైనా సవరించే అధికారం పార్లమెంటుకు ఉంది.
» రాజ్యాంగ సవరణ బిల్లును రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదించాలని నిర్ధేశించారు.


25వ రాజ్యాంగ సవరణ చట్టం: 1971
» దీని ద్వారా ఆర్టికల్ 31ను సవరించారు. ఆర్టికల్ - 31(C)ను కొత్తగా చేర్చారు.
» ప్రయివేట్ వ్యక్తుల ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నప్పుడు వారికి చెల్లించే నష్టపరిహారం అనే పదం స్థానంలో కొంత మొత్తం అనే పదాన్ని చేర్చారు.
» ఆదేశిక సూత్రాల్లోని ఆర్టికల్ - 39 (B), (C) లను అమలుపరస్తూ చేసే చట్టాలను ఆర్టికల్స్ - 14, 19, 31 లకు వ్యతిరేకమని న్యాయస్థానాలు ప్రశ్నింపరాదు.


26వ రాజ్యాంగ సవరణ చట్టం: 1971
» దీని ద్వారా ఆర్టికల్ - 366 సవరించారు. ఆర్టికల్ - 363(A)ను నూతనంగా చేర్చారు.
» మాజీ స్వదేశీ సంస్థానాధీశులకు ఉన్న రాజభరణాలను (privy purses) రద్దుచేశారు.


27వ రాజ్యాంగ సవరణ చట్టం: 1972
» దీని ద్వారా ఆర్టికల్స్ - 239(A), 240 లను సవరించారు.
» ఈశాన్య రాష్ట్రాలను పునర్‌వ్యవస్థీకరించారు.
» ఆర్టికల్ - 371 ప్రకారం మణిపూర్‌కు మంత్రిమండలిని ఏర్పాటు చేశారు.
» కేంద్రపాలిత ప్రాంతాల పాలనాధికారులకు ఆర్డినెన్స్‌లు జారీచేసే అధికారం కల్పించారు.


28వ రాజ్యాంగ సవరణ చట్టం: 1972
» దీని ద్వారా ఆర్టికల్ - 312(A) ను నూతనంగా చేర్చారు.
» మాజీ ఇండియన్ సివిల్ సర్వీస్ ఉద్యోగులకు ఉండే ప్రత్యేక హక్కులు, హోదాలను రద్దు చేశారు. వారి సర్వీసు నిబంధనలను రూపొందించే అధికారం పార్లమెంటుకు కల్పించారు.


29వ రాజ్యాంగ సవరణ చట్టం: 1972
» దీని ద్వారా కేరళకు సంబంధించి, రెండు భూసంస్కరణల చట్టాలను 9వ షెడ్యూల్‌లో చేర్చారు.


30వ రాజ్యాంగ సవరణ చట్టం: 1972
» సివిల్ కేసులకు సంబంధించి, సుప్రీంకోర్టుకు అప్పీలుకు వెళ్లడానికి ఉన్న పరిమితి రూ.20,000 తొలగించారు. ఆర్టికల్ - 133ను సవరించారు.


31వ రాజ్యాంగ సవరణ చట్టం: 1972
» దీనిద్వారా ఆర్టికల్స్ - 81, 330, 332 లను సవరించారు.
» లోక్‌సభ సీట్ల సంఖ్యను 525 నుంచి 545 కు పెంచారు.
» కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఎన్నికయ్యే వారి సంఖ్యను 25 నుంచి 20కి తగ్గించారు.


32వ రాజ్యాంగ సవరణ చట్టం: 1973
» దీనిద్వారా ఆర్టికల్ - 371(A) ను సవరించి, ఆర్టికల్స్ - 371 (D), 371 (E) లను కొత్తగా చేర్చారు.
» దీనిద్వారా ఆంధ్రప్రదేశ్‌లోని తెలంగాణ ప్రాంతం వారికి విద్య, ఉద్యోగాల్లో 6 సూత్రాలు ఉన్న ముల్కీ నిబంధనల పథకం ద్వారా ప్రత్యేక రిజర్వేషన్లు నిర్దేశించారు.
» హైదరాబాద్‌లో విద్యాభివృద్ధికి సెంట్రల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు.


33వ రాజ్యాంగ సవరణ చట్టం: 1974
» దీని ద్వారా ఆర్టికల్స్ - 101, 190 లను సవరించారు.
» పార్లమెంటు సభ్యులు లేదా శాసనసభల సభ్యులు ఇష్టపూర్వకంగా, స్వచ్ఛంగా రాజీనామా చేస్తున్నారని సంతృప్తి చెందినప్పుడు మాత్రమే స్పీకరు లేదా ఛైర్మన్ సదరు రాజీనామాలను ఆమోదించాలి.


34వ రాజ్యాంగ సవరణ చట్టం: 1974
» వివిధ రాష్ట్రాలకు చెందిన 20 భూసంస్కరణలు, భూమి కౌలు చట్టాలను 9వ షెడ్యూల్‌లో చేర్చారు.


35వ రాజ్యాంగ సవరణ చట్టం : 1975
» దీనిద్వారా ఆర్టికల్స్ 80, 81 లను సవరించారు. ఆర్టికల్ - 2(A) ను, 10వ షెడ్యూల్‌ను కొత్తగా చేర్చారు. సిక్కిం కు సహరాష్ట్ర హోదా కల్పిస్తూ 10వ షెడ్యూల్‌లో పొందుపరిచారు.


36వ రాజ్యాంగ సవరణ చట్టం: 1975
» ఆర్టికల్ - 371(F)ను కొత్తగా చేర్చారు. ఆర్టికల్ - 2(A)ను తొలగించారు.
» 10వ షెడ్యూల్‌ను తొలగించి, సిక్కింను భారత్‌లో పూర్తిస్థాయిలో 22వ రాష్ట్రంగా ఏర్పాటు చేశారు.


37వ రాజ్యాంగ సవరణ చట్టం: 1975
» దీనిద్వారా ఆర్టికల్స్ - 239(A), 240 లను కొత్తగా చేర్చారు.
» కేంద్రపాలిత ప్రాంతంగా ఉండే అరుణాచల్‌ప్రదేశ్‌లో శాసనసభను, మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేశారు.


38వ రాజ్యాంగ సవరణ చట్టం: 1975
» దీని ద్వారా ఆర్టికల్స్ - 123, 213, 239(B), 352, 356, 359, 360 లను సవరించారు.
» రాష్ట్రపతి విధించిన అత్యవసర పరిస్థితిని కోర్టుల అధికార పరిధి నుంచి మినహాయించారు.
» రాష్ట్రపతి, గవర్నరు, లెఫ్టినెంట్ గవర్నర్లు జారీ చేసిన ఆర్డినెన్స్‌లను కోర్టుల అధికార పరిధి నుంచి మినహాయించారు.
» భిన్న ప్రాతిపదికన వివిధ రకాల జాతీయ అత్యవసర పరిస్థితులను ఏకకాలంలో ప్రకటించే అధికారం రాష్ట్రపతికి కల్పించారు.


39వ రాజ్యాంగ సవరణ చట్టం: 1975
» దీని ద్వారా ఆర్టికల్స్ - 71, 329 లతోపాటు 9వ షెడ్యూల్‌ను సవరించారు.
» రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, లోక్‌సభ స్పీకర్ ఎన్నికకు సంబంధించిన అంశాలు న్యాయసమీక్ష పరిధి కిందకు రావు.


40వ రాజ్యాంగ సవరణ చట్టం: 1976
» దీని ద్వారా ఆర్టికల్స్ - 31(B), 297లతోపాటు; 9వ షెడ్యూల్‌ను కూడా సవరించారు.
» భారతదేశ అధికార పరిధి విస్తరించినంత వరకు ఉన్న ప్రాదేశిక జలాలు, ఖండాంతర భాగం, ప్రత్యేక ఆర్థిక మండలాలు, నావికా భూభాగం పరిధులను ఎప్పటికప్పుడు నిర్ణయించే అధికారం పార్లమెంటుకు ఉంది.
» కేంద్ర, రాష్ట్రాలకు సంబంధించిన, 64 భూ సంస్కరణల చట్టాలను 9వ షెడ్యూల్‌లో పొందుపరిచారు.


41వ రాజ్యాంగ సవరణ చట్టం: 1976
» దీని ద్వారా ఆర్టికల్ 316ను సవరించారు.
» రాష్ట్రపబ్లిక్ సర్వీస్ కమిషన్, ఉమ్మడి పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ల ఛైర్మన్, సభ్యుల పదవీ విరమణ వయసును 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచారు.


42వ రాజ్యాంగ సవరణ చట్టం: 1976
» దీని ద్వారా 19(1), 31(C), 39, 55, 74, 77, 81, 82, 83, 100, 102, 103, 105, 118, 145, 150, 166, 170, 172, 189, 191, 192, 194, 208, 217, 225, 226, 227, 228, 311, 312, 330, 352, 353, 356, 357, 358, 359, 366, 368, 371(F) ఆర్టికల్స్‌ను సవరించారు.
» దీని ద్వారా కొత్తగా చేర్చిన ఆర్టికల్స్ - 31(D), 32(A), 39(A), 43(A), 48(A), 51(A), 131(A), 139(A), 144(A), 226(A), 228(A), 257(A), 323(A), 323(B).
» రాజ్యాంగానికి IV(A), XIV అనే కొత్త భాగాలను చేర్చారు.
» స్వరణ్‌సింగ్ కమిటీ సిఫార్సులను అనుసరించి, చేసిన 42వ రాజ్యాంగ సవరణను మినీ రాజ్యాంగంగా పేర్కొంటారు.


దీనిలోని ముఖ్యాంశాలు
» ప్రవేశికను సవరించి, సామ్యవాద, లౌకిక, సమగ్రత అనే పదాలను చేర్చారు.
» రష్యా నుంచి గ్రహించిన 10 ప్రాథమిక విధులను IV(A) భాగంలో చేర్చారు.
» పరిపాలనా ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేశారు.
» ఆర్టికల్ - 74(1) ప్రకారం కేబినెట్ సలహాను రాష్ట్రపతి తప్పనిసరిగా పాటించాలని పేర్కొన్నారు.
» 2001 వరకు లోక్‌సభ, అసెంబ్లీ సీట్లలో మార్పులేకుండా నిర్దేశించారు.
» రాజ్యాంగ సవరణలను ఏ న్యాయ స్థానంలోనూ సవాల్ చేయరాదు.
» సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయ సమీక్షాధికారాన్ని పరిమితం చేశారు.
» లోక్‌సభ, రాష్ట్రశాసన సభల పదవీ కాలాన్ని 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాలకు పొడిగించారు.
» ఆదేశిక సూత్రాల అమలుకు చేసిన చట్టాలు, ప్రాథమిక హక్కులను ఉల్లఘింస్తున్నాయనే కారణంతో, కోర్టులు ఆ చట్టాలను రద్దు చేసే వీల్లేదు.
» ఏ రాష్ట్రంలోనైనా రాష్ట్రపతి పాలనను ఒకేసారి పొడిగించే కాలపరిమితిని 6 నెలల నుంచి సంవత్సరానికి పెంచారు.
» పార్లమెంటులో, రాష్ట్ర శాసనసభల్లో కోరం అవసరాన్ని తొలగించారు.
» అఖిల భారత న్యాయసర్వీస్ ఏర్పాటుకు వీలు కల్పించారు.
» కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర సాయుధ దళాలను ఏ రాష్ట్రానికైనా పంపించే అధికారంతోపాటుగా, రాష్ట్రాల శాంతి భద్రతలు పర్యవేక్షించడం, దళాల పర్యవేక్షణ అధికారం ఉంటుంది.
» రాష్ట్ర జాబితాలోని అడవుల పరిరక్షణ, విద్య, తూనికలు, కొలతలు, జనాభా నియంత్రణ, న్యాయపరిపాలన అనే అంశాలను ఉమ్మడి జాబితాలోకి మార్చారు.
» ఆర్టికల్ - 352 ద్వారా విధించే అత్యవసర పరిస్థితిని ఏ ప్రాంతానికైనా విధించేలా మార్పులు చేశారు.
» ఆర్టికల్ - 39(A) ఉచిత న్యాయసహాయం, ఆర్టికల్ - 48(A) పర్యావరణ వన్యప్రాణుల సంరక్షణ, ఆర్టికల్ - 43లో కుటీర పరిశ్రమల యాజమాన్యంలో శ్రామికులకు భాగస్వామ్యం కల్పించడం అనే ఆదేశిక సూత్రాలను చేర్చారు.


43వ రాజ్యాంగ సవరణ చట్టం: 1977
» దీని ద్వారా ఆర్టికల్స్ - 145, 226, 228, 366 లను సవరించారు.
» సుప్రీంకోర్టు, హైకోర్టులకు ఉండే న్యాయ సమీక్షాధికారం, రిట్‌లను జారీ చేసే అధికారాలను పునరుద్ధరించారు.


44వ రాజ్యాంగ సవరణ చట్టం: 1978
» 42వ రాజ్యాంగ సవరణలోని వక్రీకరణలను సరిదిద్దడానికి, మొరార్జీ దేశాయ్ నాయకత్వంలోని జనతా ప్రభుత్వం 44వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని చేసింది.
» దీని ద్వారా ఆర్టికల్స్ - 19, 20, 21, 22, 30, 31(A), 31(C), 38, 71, 74, 77, 83, 103, 105, 123, 132, 133, 134, 139(A), 150, 166, 172, 192, 194, 213, 217, 225, 226, 227, 239(A), 329, 360, 371(F)లతోపాటు 9వ షెడ్యూల్‌ను కూడా సవరించారు.
» ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించారు.
» లోక్‌సభ, శాసనసభల పదవీ కాలాన్ని 6 నుంచి 5 సంవత్సరాలకు తగ్గించారు.
» పార్లమెంట్, శాసనసభల కోరంను యధాతథస్థితికి తీసుకువచ్చారు.
» రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతుల ఎన్నికల వివాదాలను సుప్రీంకోర్టు నిర్ణయిస్తుంది.
» కేంద్రమంత్రి మండలి లిఖిత పూర్వక సలహాలేనిదే జాతీయ అత్యవసర పరిస్థితిని విధించరాదు.
» పత్రికా స్వేచ్ఛను పునరుద్ధరించారు.
» రాష్ట్రపతికి కేంద్రమంత్రి మండలి ఇచ్చిన సిఫార్సును రాష్ట్రపతి పునఃపరిశీలనకు పంపవచ్చు.
» ఆర్టికల్ - 352లోని ఆంతరంగిక అల్లకల్లోలాలు అనే పదాన్ని తొలగించి సాయుధ దళాల తిరుగుబాటు అనే పదాన్ని చేర్చారు.
» జాతీయ అత్యవసర పరిస్థితి సమయంలో కూడా ప్రాథమిక హక్కుల్లోని ఆర్టికల్స్ - 20, 21లను రద్దు చేయరాదు.
» పార్లమెంటు, శాసనసభల సభ్యుల ఎన్నికల వివాదాలను హైకోర్టు విచారిస్తుంది


45వ రాజ్యాంగ సవరణ చట్టం: 1980
» పార్లమెంటు, శాసనసభల్లో ఎస్సీ, ఎస్టీ, ఆంగ్లో - ఇండియన్లకు కల్పిస్తున్న రిజర్వేషన్లను మరో 10 సంవత్పరాల వరకు అంటే 1990 వరకు పొడిగించారు.


46వ రాజ్యాంగ సవరణ చట్టం: 1982
» దీని ద్వారా ఆర్టికల్స్ - 269, 286, 366 లతోపాటు 7వ షెడ్యూల్‌ను సవరించారు.
» అంతర్‌రాష్ట్రాల మధ్య విధించే వాణిజ్య పన్నులు రాష్ట్రాలకు బదలాయించారు.


47వ రాజ్యాంగ సవరణ చట్టం: 1984
» వివిధ రాష్ట్రాలకు చెందిన 14 భూసంస్కరణల చట్టాలను 9వ షెడ్యూల్‌లో చేర్చారు.


48వ రాజ్యాంగ సవరణ చట్టం: 1984
» ఆర్టికల్ - 356ను సవరించి, పంజాబ్‌లో రాష్ట్రపతి పాలనను పొడిగించారు.


49వ రాజ్యాంగ సవరణ చట్టం: 1984
» ఆర్టికల్ - 244ను సవరించి త్రిపుర రాష్ట్ర శాసనసభకు త్రిపురలోని గిరిజన ప్రాంతాల పరిపాలనపై చట్టాలు చేసే అధికారం కల్పించారు.


50వ రాజ్యాంగ సవరణ చట్టం: 1984
» ఆర్టికల్ - 33ను సవరించి సాయుధ బలగాలకు ఉండే ప్రాథమిక హక్కులపై పరిమితులు విధించే అధికారం పార్లమెంట్‌కు ఉంటుంది.


51వ రాజ్యాంగ సవరణ చట్టం: 1984
» ఆర్టికల్‌ల్స్ - 330, 332 లను సవరించారు.
» మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మిజోరం ప్రాంతాల్లోని ఎస్టీ వర్గాలకు లోక్‌సభలో సీట్లు రిజర్వు చేశారు.


52వ రాజ్యాంగ సవరణ చట్టం: 1985
» దీని ద్వారా ఆర్టికల్స్ - 101, 102, 190 లను సవరించారు. 10వ షెడ్యూల్‌ను కొత్తగా రాజ్యాంగంలో చేర్చారు.
» పార్టీ ఫిరాయింపులను నిషేధిస్తూ, రాజీవ్‌గాంధీ ప్రభుత్వం చట్టం చేసింది.


53వ రాజ్యాంగ సవరణ చట్టం: 1986
» దీని ద్వారా ఆర్టికల్ - 371(G) ను కొత్తగా ఏర్పాటు చేశారు.
» కేంద్రపాలిత ప్రాంతమైన మిజోరంను 23వ రాష్ట్రంగా చేర్చారు.


54వ రాజ్యాంగ సవరణ చట్టం: 1986
» దీని ద్వారా ఆర్టికల్స్ - 125, 221 లతోపాటు 2వ షెడ్యూల్‌ను సవరించారు.
» సుప్రీంకోర్టు, హైకోర్టుల ప్రధాన, ఇతర న్యాయమూర్తుల వేతనాలను పెంచారు.


55వ రాజ్యాంగ సవరణ చట్టం: 1986
» దీని ద్వారా ఆర్టికల్ - 371(H) ను కొత్తగా చేర్చారు.
» అరుణాచల్ ప్రదేశ్‌ని 24వ రాష్ట్రంగా ఏర్పాటు చేశారు.


56వ రాజ్యాంగ సవరణ చట్టం: 1987
» గోవాను 25వ రాష్ట్రంగా, డామన్, డయ్యూలను కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేశారు.


57వ రాజ్యాంగ సవరణ చట్టం: 1987
» దీని ద్వారా ఆర్టికల్ - 332ను సవరించి మిజోరం, నాగాలాండ్, మేఘాలయా, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లోని షెడ్యూల్డ్ తెగలకు లోక్‌సభ, శాసనసభల్లో ప్రత్యేక ఏర్పాట్లను చేశారు.


58వ రాజ్యాంగ సవరణ చట్టం: 1987
» దీని ద్వారా ఆర్టికల్ - 394(A) ను నూతనంగా చేర్చి, రాజ్యాంగాన్ని హిందీ భాషలోకి అధికారికంగా తర్జుమా చేయడానికి చట్టం చేశారు.


59వ రాజ్యాంగ సవరణ చట్టం: 1988
» దీని ద్వారా ఆర్టికల్ - 356ను సవరించి, ఆర్టికల్ - 359(A)ను నూతనంగా చేర్చారు.
» పంజాబ్‌లో రాష్ట్రపతి పాలనను 3 సంవత్సరాలకు పెంచారు.


60వ రాజ్యాంగ సవరణ చట్టం: 1988
» దీని ద్వారా ఆర్టికల్ - 276ను సవరించారు. స్థానిక సంస్థలు విధించే వృత్తి పన్నును రూ.250 నుంచి రూ.2,500 కు పెంచారు.


61వ రాజ్యాంగ సవరణ చట్టం: 1988
» దీని ద్వారా ఆర్టికల్ - 326ను సవరించి, వయోజన హక్కు కనీస వయసును 21 నుంచి 18 సంవత్సరాలకు తగ్గించారు.


62వ రాజ్యాంగ సవరణ చట్టం: 1989
» పార్లమెంటు, రాష్ట్ర శాసనసభల్లో ఎస్సీ, ఎస్టీ, ఆంగ్లో ఇండియన్‌లకు కేటాయించిన రిజర్వేషన్లను మరో 10 సంవత్సరాలు అంటే 2000 సంవత్సరం వరకు పొడిగించారు.


63వ రాజ్యాంగ సవరణ చట్టం: 1989
» దీని ద్వారా ఆర్టికల్ - 356ను సవరించారు. ఆర్టికల్ - 359(A)ను తొలగించారు.
» పంజాబ్‌కు సంబంధించి, 59వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చిన అంశాలను తొలగించారు. అంటే ఇతర రాష్ట్రాలకు విస్తరించే అత్యవసర పరిస్థితికి సంబంధించిన నిబంధనలే పంజాబ్‌కు కూడా వర్తిస్తాయి.


64వ రాజ్యాంగ సవరణ చట్టం: 1990
» దీని ద్వారా ఆర్టికల్ - 356ను సవరించి, పంజాబ్‌లో రాష్ట్రపతి పాలనను మరో 6 నెలల పాటు పొడిగించారు.


65వ రాజ్యాంగ సవరణ చట్టం: 1990
» దీని ద్వారా ఆర్టికల్ - 338ని సవరించి జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు రాజ్యాంగ భద్రతను కల్పించారు.


66వ రాజ్యాంగ సవరణ చట్టం: 1990
» దీని ద్వారా 9వ షెడ్యూల్‌ను సవరించి భూసంస్కరణలకు సంబంధించి 55 చట్టాలను 9వ షెడ్యూల్‌లో చేర్చారు.


67వ రాజ్యాంగ సవరణ చట్టం: 1990
» దీని ద్వారా ఆర్టికల్ - 356ను సవరించి, పంజాబ్‌లో రాష్ట్రపతి పాలనను మరో 6 నెలలు (4 ఏళ్లు) పొడిగించారు.


68వ రాజ్యాంగ సవరణ చట్టం: 1991
» దీని ద్వారా ఆర్టికల్ - 356ను సవరించి పంజాబ్‌లో రాష్ట్రపతి పాలనను గరిష్ఠంగా 5 సంవత్సరాలను పొడిగించారు.


69వ రాజ్యాంగ సవరణ చట్టం: 1991
» దీని ద్వారా ఆర్టికల్స్ - 239(AA), 239(AB)లను కొత్తగా చేర్చారు.
» దిల్లీ కేంద్రపాలిత ప్రాంతాన్ని నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ దిల్లీగా పరిగణిస్తారు.
» దిల్లీకి 70 మంది శాసనసభ్యులతో కూడిన శాసనసభను ఏర్పాటు చేశారు.


70వ రాజ్యాంగ సవరణ చట్టం: 1992
» దీని ద్వారా ఆర్టికల్స్ - 54, 239(AA)లను సవరించారు.
» రాష్ట్రపతి ఎన్నికల్లో దిల్లీ, పుదుచ్చేరి శాసన సభ్యులకు భాగస్వామ్యం కల్పించారు.


71వ రాజ్యాంగ సవరణ చట్టం: 1992
» దీని ద్వారా 8వ షెడ్యూల్‌ను సవరించి కొంకణి, మణిపురి, నేపాలి భాషలను రాజ్యాంగం గుర్తించిన భాషల్లో చేర్చారు.


72వ రాజ్యాంగ సవరణ చట్టం: 1992
» దీని ద్వారా ఆర్టికల్ - 332ను సవరించి, త్రిపుర రాష్ట్ర శాసనసభలో షెడ్యూల్డ్ తెగల వారికి రిజర్వేషన్లు కల్పించారు.


73వ రాజ్యాంగ సవరణ చట్టం: 1992
» దీని ద్వారా రాజ్యాంగానికి 9వ భాగం, 11వ షెడ్యూల్‌ను చేర్చారు.
» ఆర్టికల్స్ - 243, 243(A) నుంచి 243(O) వరకు ఉన్న 16 ఆర్టికల్స్‌లో పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించి రాజ్యాంగ భద్రతను నిర్ధేశించారు.


74వ రాజ్యాంగ సవరణ చట్టం: 1992
» దీని ద్వారా రాజ్యాంగానికి 9(A) భాగం, 12వ షెడ్యూల్‌ను చేర్చారు.
» ఆర్టికల్ - 243(P) నుంచి 243(G) వరకు ఉన్న 18 రకాల ఆర్టికల్స్‌లో పట్టణ, నగర పాలక వ్యవస్థకు సంబంధించి, రాజ్యాంగ భద్రతను నిర్ధేశించారు.


75వ రాజ్యాంగ సవరణ చట్టం: 1994
» దీని ద్వారా ఆర్టికల్ - 323(B) ను సవరించారు.
» గృహహక్కుదారులు, అద్దెకున్న వారికి సంబంధించిన వివాదాల పరిష్కారానికి అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్‌ను ఏర్పాటు చేశారు.

 

76వ రాజ్యాంగ సవరణ చట్టం: 1994
» దీని ద్వారా 9వ షెడ్యూల్‌ను సవరించారు. న్యాయసమీక్షాధికారం పరిధి నుంచి తప్పించుకోవడానికి తమిళనాడు ప్రభుత్వం రాష్ట్ర విద్యా, ఉద్యోగాల్లో కల్పిస్తున్న 69% రిజర్వేషన్ల అంశాన్ని 9వ షెడ్యూల్‌లో పొందుపరిచారు.


77వ రాజ్యాంగ సవరణ చట్టం: 1995
» దీని ద్వారా ఆర్టికల్ - 16(4A) ను రాజ్యాంగానికి చేర్చారు. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు ఉద్యోగ పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించారు.


78వ రాజ్యాంగ సవరణ చట్టం: 1995
» దీని ద్వారా 9వ షెడ్యూల్‌ను సవరించి, వివిధ రాష్ట్రాలకు సంబంధించిన 27 భూసంస్కరణల చట్టాలను 9వ షెడ్యూల్‌లో చేర్చారు. దీంతో ఈ షెడ్యూల్‌లోని భూసంస్కరణల చట్టాల సంఖ్య 282కు చేరింది.


79వ రాజ్యాంగ సవరణ చట్టం: 1999
» దీని ద్వారా పార్లమెంటు, శాసనసభల్లో ఎస్సీ, ఎస్టీ, ఆంగ్లో ఇండియన్‌లకు కల్పిస్తున్న రిజర్వేషన్లను మరో 10 సంవత్సరాలు అంటే 2010 వరకు పొడిగించారు.


80వ రాజ్యాంగ సవరణ చట్టం: 2000
» దీని ద్వారా ఆర్టికల్స్ - 268, 269, 270 లను సవరించారు.
» 10వ ఆర్థికసంఘం సిఫారసుల ఆధారంగా కేంద్ర, రాష్ట్రాల మధ్య పన్నుల రాబడిలో 29 శాతాన్ని రాష్ట్రాలకు ఇవ్వాలని నిర్దేశించారు.


81వ రాజ్యాంగ సవరణ చట్టం: 2000
» ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లకు సంబంధించిన ఖాళీలు ఆ సంవత్సరంలో భర్తీ కాకపోతే, వాటిని ప్రత్యేక ఖాళీలుగా పరిగణిస్తూ, ఆ వర్గాలతో మాత్రమే భర్తీ చేయాలని ఆర్టికల్ - 16 (4B)లో నిర్దేశించారు.


82వ రాజ్యాంగ సవరణ చట్టం: 2000
» దీని ద్వారా ఆర్టికల్ - 335ను సంవరించి, విద్యా, ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి అర్హత మార్కులను, ఇతర అర్హతలను కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు తగ్గించవచ్చు.


83వ రాజ్యాంగ సవరణ చట్టం: 2000
» దీని ద్వారా ఆర్టికల్ - 243(M)ను సవరించి, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో పూర్తిగా ఎస్టీలు మాత్రమే నివసిస్తున్న కారణంగా అక్కడ ఎస్సీ వర్గాల వారు లేకపోవడంతో, పంచాయతీరాజ్ వ్యవస్థలో ఎస్సీల రిజర్వేషన్లను రద్దు చేశారు.


84వ రాజ్యాంగ సవరణ చట్టం: 2001
» దీని ద్వారా ఆర్టికల్స్ - 55, 81, 82, 170, 330, 332 లను సవరించారు.
» లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభల సభ్యుల సంఖ్యను 2026 వరకు మార్చరాదని నిర్దేశించారు.


85వ రాజ్యాంగ సవరణ చట్టం: 2002
» దీని ద్వారా ఆర్టికల్ - 16(A) ను సవరించి, ఎస్సీ, ఎస్టీలకు ప్రమోషన్లలో రిజర్వేషన్లకు సంబంధించిన మార్పులు చేశారు.


86వ రాజ్యాంగ సవరణ చట్టం: 2002
» దీని ద్వారా ఆర్టికల్ - 45ను సవరించారు. కొత్తగా ఆర్టికల్స్ - 21(A), 51 A(K) లను చేర్చారు.
» 6 నుంచి 14 సంవత్సరాల లోపు ఉండే బాలలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలి.
» ఆదేశిక సూత్రాల్లోని ఆర్టికల్ - 45లో 6 సంవత్సరాల లోపు ఉండే బాలలకు పూర్వ ప్రాథమిక విద్యను కల్పించడం.
» ప్రాథమిక విధుల్లో 11వ ప్రాథమిక విధిగా 6 - 14 సంవత్సరాలలోపు బాలబాలికలకు ప్రాథమిక విద్యను అందించడం వారి తల్లిదండ్రులు లేదా సంరక్షకుల బాధ్యత.


87వ రాజ్యాంగ సవరణ చట్టం: 2003
» దీని ద్వారా ఆర్టికల్స్ - 81, 82, 170 లను సవరించారు.
» ప్రాదేశిక నియోజక వర్గాల పునర్విభజన కోసం 1991 సంవత్సర జనాభా లెక్కలకు బదులుగా, 2001 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకోవాలని నిర్దేశించారు.


88వ రాజ్యాంగ సవరణ చట్టం: 2003
» దీని ద్వారా ఆర్టికల్ - 270ను సవరించారు.
» ఆర్టికల్ - 268(A) ను కొత్తగా చేర్చారు.
» సర్వీస్ టాక్స్‌ను ప్రవేశపెట్టారు. ఈ టాక్స్‌ను కేంద్రం విధిస్తుంది. కేంద్ర, రాష్ట్రాలు వసూలు చేసి తీసుకుంటాయి.


89వ రాజ్యాంగ సవరణ చట్టం: 2003
» దీని ద్వారా ఆర్టికల్ - 338ను సవరించారు. ఆర్టికల్ - 338(A) ను కొత్తగా చేర్చారు. జాతీయ ఎస్టీ కమిషన్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.


90వ రాజ్యాంగ సవరణ చట్టం: 2003
» దీని ద్వారా ఆర్టికల్ - 332ను సవరించారు. అసోం రాష్ట్ర శాసనసభలో బోడోల్సాండ్ ప్రాంతానికి ప్రత్యేక ప్రాతినిధ్యం కల్పించారు.


91వ రాజ్యాంగ సవరణ చట్టం: 2003
» దీని ద్వారా ఆర్టికల్స్ - 75, 164 లను సవరించారు. ఆర్టికల్ - 361(B) కొత్తగా చేర్చారు.
» కేంద్ర మంత్రిమండలి సభ్యుల సంఖ్య లోక్‌సభ మొత్తం సభ్యుల సంఖ్యలో 15% మించరాదు.
» రాష్ట్రమంత్రిమండలి సభ్యుల సంఖ్య, రాష్ట్ర విధానసభ మొత్తం సభ్యుల సంఖ్యలో 15% మించరాదు. కానీ కనీస సభ్యుల సంఖ్య 12కు తగ్గరాదు.
» పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన సభ్యులు 2 సంవత్సరాలు ఎలాంటి పదవులు చేపట్టరాదు.


92వ రాజ్యాంగ సవరణ చట్టం: 2003
» 8వ షెడ్యూల్‌ను సవరించి, బోడో, డోగ్రి, మైథిలి, సంతాలి అనే 4 భాషలను చేర్చడంతో ప్రస్తుతం రాజ్యాంగం గుర్తించిన భాషల సంఖ్య 24కు చేరింది.


93వ రాజ్యాంగ సవరణ చట్టం: 2005
» దీని ద్వారా ఆర్టికల్ - 15ను సవరించారు. సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులకు విద్యా సంస్థల్లో ప్రవేశానికి ప్రత్యేక వెసులుబాటు కల్పించారు.


94వ రాజ్యాంగ సవరణ చట్టం: 2006
» దీని ద్వారా ఆర్టికల్ - 164(1) ను సవరించారు. బీహార్ మంత్రిమండలిలో షెడ్యూల్డ్ తెగల సంక్షేమానికి తప్పనిసరిగా ఒక మంత్రి ఉండాలనే నిబంధనను తొలగించారు.
» ఝార్ఖండ్, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల మంత్రిమండలిలో ఎస్టీ వెల్ఫేర్ మినిస్టర్ తప్పనిసరిగా ఉండాలని నిర్దేశించారు.


95వ రాజ్యాంగ సవరణ చట్టం: 2009
» పార్లమెంటు, రాష్ట్ర శాసనసభల్లో ఎస్సీ, ఎస్టీ, ఆంగ్లో ఇండియన్‌లకు కల్పిస్తున్న రిజర్వేషన్లను మరో 10 సంవత్సరాలు అంటే 2020 వరకు పొడిగించాలని నిర్దేశించారు.


96వ రాజ్యాంగ సవరణ చట్టం: 2011
» దీని ద్వారా 8వ షెడ్యూల్‌ను సవరించి ఒరియా భాషను ఒడియాగా మార్చారు.


97వ రాజ్యాంగ సవరణ చట్టం: 2011
» దీని ద్వారా రాజ్యాంగానికి IX(B) అనే కొత్త భాగాన్ని చేర్చి, ఆర్టికల్స్ - 243(ZH) నుంచి 243(ZT) వరకు ఉన్న ఆర్టికల్స్‌ను కొత్తగా రాజ్యాంగానికి చేర్చి సహకార సంఘాలకు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించారు.


98వ రాజ్యాంగ సవరణ చట్టం: 2012
» దీని ద్వారా ఆర్టికల్ - 371 (J) ను కొత్తగా చేర్చారు.
» కర్ణాటక రాష్ట్రంలోని హైదరాబాద్ - కర్ణాటక ప్రాంతానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించారు.


99వ రాజ్యాంగ సవరణ చట్టం: 2014
» దీనిద్వారా ఆర్టికల్స్ - 127, 128, 217, 222, 224(A) లను సవరించారు.
» ఆర్టికల్స్ - 124(A), 124(B), 124(C) లను కొత్తగా చేర్చారు.
» జాతీయ న్యాయ నియామకాల కమిషన్ ఏర్పాటైంది. దీన్ని 16 రాష్ట్రాల శాసన సభలు ఆమోదించడంతో ఇది అమల్లోకి వచ్చింది.


100వ రాజ్యాంగ సవరణ చట్టం: 2015
» దీని ద్వారా ఆర్టికల్ - 2 సవరించి భారత్-బంగ్లాదేశ్‌లు పరస్పర భూభాగ మార్పిడులను చేసుకున్నాయి.


రాజ్యాంగ సవరణ - బిల్లులు

101వ రాజ్యాంగ సవరణ బిల్లు: 2004
» ప్రజాపంపిణీ ద్వారా పంపిణీ చేసే పంచదార లాంటి నిత్యావసర వస్తువులను కోర్టుల పరిధి నుంచి తొలగించడానికి ఉద్దేశించిన బిల్లు.


102వ రాజ్యాంగ సవరణ బిల్లు: 2004
» కేంద్రపాలిత ప్రాంతమైన దిల్లీకి సంబంధించి, పార్లమెంటుకు చట్టాలు చేసే అధికారం.


103 రాజ్యాంగ సవరణ బిల్లు: 2004
» జాతీయ మైనార్టీ కమిషన్‌కు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించేందుకు ఉద్దేశించింది. కానీ, ఈ బిల్లు మురిగిపోయింది.


104వ రాజ్యాంగ సవరణ బిల్లు: 2005
» ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ప్రైవేటు, అన్ఎయిడేడ్ విద్యాసంస్థల్లో రిజర్వేషన్లు కల్పించడానికి ఉద్దేశించింది.


105వ రాజ్యాంగ సవరణ బిల్లు: 2006
» ఈ బిల్లులోని అంశాలు 94వ రాజ్యాంగ సవరణలోకి మార్చారు.


106వ రాజ్యాంగ సవరణ బిల్లు: 2006
» దీన్ని 2006లో ప్రతిపాదించగా, 14వ లోక్‌సభ రద్దు కావడంతో మురిగిపోయింది. 2009లో మళ్లీ దీన్ని 111వ రాజ్యాంగ సవరణ బిల్లుగా ప్రవేశపెట్టారు. ఇది 97వ రాజ్యాంగ సవరణ చట్టం (2011) రూపంలో అమల్లోకి వచ్చింది.


107వ రాజ్యాంగ సవరణ బిల్లు: 2007
» డార్జిలింగ్ గూర్ఖాహిల్ కౌన్సిల్ ఏర్పాటుకు ఉద్దేశించింది. కానీ ఈ బిల్లు మురిగిపోయింది.


108వ రాజ్యాంగ సవరణ బిల్లు: 2010
» లోక్‌సభ, రాష్ట్రాల విధానసభల్లో మహిళలకు 1/3వ వంతు స్థానాలు రిజర్వ్ చేసేందుకు ఉద్దేశించిన ఈ బిల్లును రాజ్యసభ ఆమోదించినప్పటికీ, లోక్‌సభ తిరస్కరించడంతో మురిగిపోయింది.


109వ రాజ్యాంగ సవరణ బిల్లు: 2009
» ఎస్సీ, ఎస్టీలకు, ఆంగ్లో ఇండియన్‌లకు లోక్‌సభ, రాష్ట్రాల విధానసభల్లో కల్పిస్తున్న రిజర్వేషన్లు మరో 10 సంవత్సరాలు పొడిగించడం. ఇది 95వ రాజ్యాంగ సవరణ చట్టం - 2009గా అమల్లోకి వచ్చింది.


110వ రాజ్యాంగ సవరణ బిల్లు: 2009
» స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 50% సీట్లు రిజర్వు చేయడం. 15వ లోక్‌సభ రద్దుకావడంతో ఇది మురిగిపోయింది.


111వ రాజ్యాంగ సవరణ బిల్లు: 2009
» సహకార సంఘాల ఏర్పాటుకు ఉద్దేశించింది. ఇది 97వ సవరణ చట్టంగా అమల్లోకి వచ్చింది.


112వ రాజ్యాంగ సవరణ బిల్లు: 2009
» మున్సిపల్ ఎన్నికల్లో స్త్రీలకు 50% రిజర్వేషన్లను కల్పించేందుకు ఉద్దేశించింది.


113వ రాజ్యాంగ సవరణ బిల్లు: 2010
» ఒరియా భాషను ఒడియాగా మార్చడానికి ఉద్దేశించింది. ఇది 96వ రాజ్యాంగ సవరణ చట్టంగా అమల్లోకి వచ్చింది.


114వ రాజ్యాంగ సవరణ బిల్లు: 2010
» హైకోర్టు న్యాయమూర్తులకు పదవీ విరమణ వయసును 62 నుంచి 65 సంవత్సరాలకు పెంచడానికి ఉద్దేశించింది. ఇది మురిగిపోయింది.


115వ రాజ్యాంగ సవరణ బిల్లు: 2011
» వస్తుసేవల పన్నును విధించేందుకు కేంద్రానికి, రాష్ట్రాలకు ఉమ్మడి పన్ను అధికారాన్ని కల్పించేందుకు ఉద్దేశించింది. ఇదీ మురిగిపోయింది.


116వ రాజ్యాంగ సవరణ బిల్లు: 2012
» లోక్‌పాల్ వ్యవస్థకు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించేందుకు ఉద్దేశించారు.


117వ రాజ్యాంగ సవరణ బిల్లు: 2012
» ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వ ఉద్యోగాల ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించింది.


118వ రాజ్యాంగ సవరణ బిల్లు: 2012
» కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలకు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించేందుకు ఉద్దేశించింది.


119వ రాజ్యాంగ సవరణ బిల్లు: 2013
» భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య భూభాగాల పరస్పర మార్పిడికి ఉద్దేశించింది.


120వ రాజ్యాంగ సవరణ బిల్లు: 2013
» ఉన్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల నియామకాలకు ఉద్దేశించిన జాతీయ న్యాయ నియామకాల కమిషన్ (JAC) ఏర్పాటుకు సంబంధించింది.


121వ రాజ్యాంగ సవరణ బిల్లు: 2014
» జాతీయ న్యాయ నియమకాల కమిషన్ బిల్లు. ఇది 99వ రాజ్యాంగ సవరణ చట్టంగా అమల్లోకి వచ్చింది.


122వ రాజ్యాంగ సవరణ బిల్లు: 2014
» వస్తుసేవల పన్ను (GST) కు సంబంధించింది. ఇటీవల పార్లమెంటు ఉభయసభల ఆమోదం పొంది చట్టంగా మారింది.

Posted Date : 31-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌