• facebook
  • whatsapp
  • telegram

ప్రసరణ వ్యవస్థ

* జీవులన్నింటిలో శరీర పెరుగుదల, నిర్వహణల కోసం వాయువులు, పోషకాల రవాణా ప్రక్రియ ఒక ఆవశ్యక జీవక్రియ.

* ఏకకణ జీవుల్లో పదార్థాల రవాణా ఎక్కువ దూరం జరగాల్సిన అవసరం లేదు. అమీబా, హైడ్రా లాంటి నిమ్నస్థాయి ప్రాణుల్లో వ్యాపనం, ద్రవాభిసరణ ప్రక్రియల ద్వారా పదార్థాల రవాణా జరుగుతుంది.

* బహుకణ జీవుల్లో పదార్థాల రవాణాకోసం ప్రత్యేక అవయవ వ్యవస్థ ఉంది. దీన్నే ప్రసరణ వ్యవస్థ అంటారు. 

* మానవుల్లో ప్రసరణ వ్యవస్థను రెండు విధాలుగా అధ్యయనం చేయవచ్చు.

అవి 

1) రక్తప్రసరణ వ్యవస్థ 

 2) లింఫాటిక్‌ వ్యవస్థ లేదా శోషరస వ్యవస్థ


రక్తప్రసరణ వ్యవస్థ:

* రక్తప్రసరణ వ్యవస్థలో ప్రధానాంశాలు రక్తం, రక్తనాళాలు, హృదయం. మానవ రక్తప్రసరణ వ్యవస్థ ఒక సంవృత ప్రసరణ వ్యవస్థ.

* మానవ హృదయం బేరిపండు ఆకృతిలో త్రికోణాకారంగా ఉంటుంది. సాధారణంగా పై భాగం వెడల్పుగా, కిందివైపు సన్నగా ఉంటుంది.

* హృదయాన్ని ఆవరించి రెండు పొరలు ఉంటాయి. వీటిని పెరికార్డియల్‌ త్వచాలు లేదా హృదయావరణ త్వచాలు అంటారు. ఈ రెండు పొరల మధ్య భాగం హృదయావరణ ద్రవంతో నిండి ఉంటుంది. ఇది గుండెను అఘాతాల నుంచి రక్షిస్తుంది.

* మానవుడి గుండెలో నాలుగు భాగాలు ఉంటాయి. పైరెండు భాగాల (గదుల్శు ను కర్ణికలు లేదా ఆరికల్స్‌ అంటారు. కింది రెండు గదులను జఠరికలు లేదా వెంట్రికల్స్‌ అంటారు.

* కర్ణికల గోడలు పలుచగా ఉంటే, జఠరికల గోడలు మందంగా ఉంటాయి. ఎడమవైపు ఉన్న రెండు గదుల్లో ఒకటి పూర్వాంతం వైపు, రెండోది పరాంతం వైపు అమరి ఉన్నట్లు కనిపిస్తాయి.

* రక్తనాళాలు ప్రధానంగా మూడు విధాలుగా ఉంటాయి. అవి ధమనులు, సిరలు, రక్త కేశనాళికలు.


ధమనులు

* హృదయం నుంచి బయలుదేరి శరీర భాగాలన్నింటికీ రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలను ధమనులు లేదా ఆర్టరీస్‌ అంటారు.

* ధమనుల గోడలు దృఢంగా నిర్మితమై ఉంటాయి.

* అతి పెద్ద ధమనిని బృహద్ధమని లేదా మహాధమని లేదా ఓర్టా అని పిలుస్తారు.

* రక్త ప్రసరణ వ్యవస్థలో చిన్నధమనిగా పుపుసధమనిని చెప్పవచ్చు. దీన్నే పల్మనరీ ఆర్టరీ అంటారు.

* పుపుసధమని రక్తాన్ని హృదయం నుంచి ఊపిరితిత్తులకు తీసుకుపోతుంది.


సిరలు:

* శరీర భాగాలనుంచి హృదయానికి రక్తాన్ని రవాణా చేసే రక్తనాళాలను సిరలు లేదా వీన్స్‌ అంటారు.

* సిరలు తక్కువ దృఢత్వం కలిగిన రక్తనాళాలు.

* గుండెకు పై భాగంలో కుడివైపు ఉండే పెద్ద సిరను ఊర్ధ్వ బృహత్సిర (సుపీరియర్‌ వెన కావ్శ అని అంటారు.

* గుండెకు కుడివైపు దిగువ భాగంలో కనిపించే సిరను అధో బృహత్సిర (ఇన్‌ఫీరియర్‌ వెన కావ్శ అంటారు. ఇది శరీరం దిగువ భాగాల నుంచి రక్తాన్ని సేకరించి హృదయానికి చేరుస్తుంది.

* హృదయంలో ఎడమవైపు ఉన్న కర్ణిక, జఠరికలు కుడివైపు వాటికంటే చిన్నవిగా ఉంటాయి. కండర నిర్మితమైన విభాజకాలు రెండు కర్ణికలు, రెండు జఠరికలను వేరు చేస్తాయి.

* కుడి కర్ణికలోకి పూర్వ, పర మహాసిరలు తెరుచుకోవడానికి రంధ్రాలుంటాయి.

* ఎడమ కర్ణికలోకి ఊపిరితిత్తుల నుంచి రక్తాన్ని తీసుకువచ్చే పుపుస సిరలు తెరుచుకుంటాయి.

* బృహద్ధమని ఎడమ జఠరిక పైభాగం నుంచి బయలుదేరుతుంది. ఈ ధమనీ చాపం శరీర భాగాలకు ఆమ్లజని సహిత రక్తాన్ని సరఫరా చేస్తుంది.

* కుడి జఠరిక పైభాగం నుంచి బయలుదేరే పుపుసధమని ఆమ్లజని రహిత రక్తాన్ని ఊపిరితిత్తులకు సరఫరా చేస్తుంది.

* గుండె గోడలను అంటిపెట్టుకొని ఉన్న రక్తనాళాలను కరోనరీ రక్తనాళాలు అంటారు. కరోనరీ ధమనులు గుండె కండరాలకు రక్తాన్ని సరఫరా చేస్తాయి. కరోనరీ సిరలు గుండె కండరాల నుంచి రక్తాన్ని సేకరిస్తాయి.

* రక్త ప్రవాహం గురించి విలియం హార్వే అధ్యయనం చేశారు.

* గుండెలోని రక్తం ధమనుల్లోకి వెళ్తే, సిరల నుంచి రక్తం గుండెకు చేరుతుంది. అంటే రక్తానికి రెండు ప్రవాహాలున్నాయి. దీన్నే ద్వివలయ రక్తప్రసరణ అంటారు.

* మార్సెల్లో మాల్ఫీజీ కంటికి కనిపించని రక్తనాళాలను సూక్ష్మదర్శిని సహాయంతో  పరిశీలించాడు. ఇవి ధనములు, సిరలు మధ్య ఉండే అతి సన్నని, చిన్నవైన రక్తనాళాలు. వీటినే సూక్ష్మకేశ నాళికలు (కేపిల్లరీస్శ్‌  అంటారు.


రక్తకేశ నాళికలు:

* రక్తకేశ నాళికలు ఏకకణ మందంతో నిర్మితమైన, సూక్ష్మ నాళాలు. ఇవి తమ ద్వారా పదార్థాలు వ్యాపనం చెందడానికి వీలుగా ఉంటాయి. ధమనులు, సిరలను కలుపుతూ రక్తకేశ నాళికా జాలాన్ని ఏర్పర్చడానికి సహకరిస్తాయి.

* మానవుడి గుండె పిండాభివృద్ధి సమయంలో (21వ రోజు నుంచ్శి స్పందించడం ప్రారంభిస్తుంది.

* కర్ణికలు, జఠరికలు ఒకసారి సంకోచించి తర్వాత యధాస్థితికి వస్తే దాన్ని ఒక హృదయ స్పందన వలయం లేదా కార్డియాక్‌ వలయం లేదా హార్ధిక వలయం అని అంటారు.

* కర్ణికల సంకోచం వల్ల రక్తం కర్ణిక, జఠరికల మధ్య ఉన్న కవాటాలను తోసుకుని జఠరికలోకి ప్రవేశిస్తుంది. రక్తంతో నిండగానే జఠరికలు సంకోచిస్తాయి. ఆ సమయంలో సడలిక మొదలై కర్ణికలు యధాస్థితికి చేరుకుంటాయి. జఠరికలు సంకోచించడం వల్ల కవాటాలు తెరచుకుని రక్తం దైహిక చాపం, పుపుస ధమనుల్లోకి ప్రవహిస్తుంది. అప్పుడే కర్ణికలు, జఠరికల మధ్య ఉన్న కవాటాలు రక్తం కలిగించిన పీడనానికి మూసుకుంటాయి. దీని వల్ల ‘లబ్‌’ అనే శబ్దం వినిపిస్తుంది. జఠరికలు యధాస్థితికి చేరుకునే సమయంలో అందులోని పీడనం తగ్గి రక్తనాళాల్లోని రక్తం వెనక్కు రావడానికి ప్రయత్నిస్తుంది. దీంతో రక్తనాళాల్లోని కవాటాలు మూసుకుంటాయి. అప్పుడు ‘డబ్‌’ అనే శబ్దం చిన్నగా వినిపిస్తుంది. ఈ మొత్తం ప్రక్రియనే హార్ధిక వలయం అంటారు.

* గుండె కండరాలు చాలా చురుగ్గా పాల్గొనే సంకోచ క్రియను ‘సిస్టోల్‌’ అని, విశ్రాంతి తీసుకునే యధాపూర్వక స్థితిని ‘డయాస్టోల్‌’ అని అంటారు. ఇవి ఒకదాని తర్వాత మరొకటి సంభవిస్తూ మనిషి మరణం వరకూ కొనసాగుతూ ఉంటాయి. ఈ మొత్తం ప్రక్రియకు సుమారు 0.8 సెకన్ల సమయం పడుతుంది. ఇందులో కర్ణికల సంకోచ సమయం 0.11 - 0.14 సెకన్లు కాగా, జఠరికల సంకోచ సమయం 0.27 -  0.35 సెకన్లు.

* రక్త నాళాల్లో ప్రవహించే రక్తం పదార్థాల రవాణా బాధ్యతను నిర్వహిస్తుంది. అనెలిడా, ఇఖైనోడర్మేటా, ఆక్టోపస్‌ లాంటి సెఫలోపొడాకు చెందిన మొలస్కా జీవులు; ఇంకా అన్ని పై స్థాయి కార్డేటా జీవుల్లోనూ ఈ ప్రసరణ వ్యవస్థే కనిపిస్తుంది. ఇలాంటి రక్త ప్రసరణ వ్యవస్థను సంవృత రక్త ప్రసరణ వ్యవస్థ అంటారు.

* రక్త నాళాలు లేని ప్రసరణ వ్యవస్థను వివృత రక్తప్రసరణ వ్యవస్థ అంటారు. ఆర్థ్రోపొడాతో పాటు, అనేక మొలస్కా జీవులు, కింది స్థాయి కార్డేటా ప్రాణుల్లో వివృతరక్త ప్రసరణ వ్యవస్థ ఉంటుంది.

* ఆరోగ్యవంతుల శరీరంలో సిస్టోలిక్‌ పీడనం 120 మి.మీ. పాదరస పీడనం, డయాస్టోలిక్‌ పీడనం 80 మి.మీ. పాదరస పీడనంగా ఉంటుంది. దీన్ని 120/80 గా సూచిస్తారు.

* వైద్యులు స్పిగ్మోమానోమీటర్‌ పరికరంతో మానవుడి రక్తపీడనాన్ని కొలుస్తారు. అన్ని శరీర భాగాల్లో రక్తపీడనం ఒకేవిధంగా ఉండదు. మనిషి భుజభాగంలో ఉండే ధమనీపీడనాన్ని ప్రామాణికంగా తీసుకుంటారు. మనం చేసే పనిని బట్టి రక్తపీడనం మారుతూ ఉంటుంది. విశ్రాంతి, నడవడం, పరిగెత్తడం వంటి వివిధ పరిస్థితుల్లో ఇది వేర్వేరుగా ఉంటుంది.

* మనిషి విశ్రాంతి తీసుకునే సమయంలో రక్తపీడనం సాధారణ స్థాయి కంటే ఎక్కువ ఉంటే అతడికి రక్తపోటు (హైపర్‌ టెన్షన్శ్‌ ఉన్నట్లు. అదే విధంగా తక్కువ రక్తపోటు ఉంటే దాన్ని హైపోటెన్షన్‌ అంటారు.

* జంతురాజ్యంలో మొట్టమొదటగా ప్రసరణ మాధ్యమంగా రక్తం పనిచేయడాన్ని అనెలిడాలో గమనించవచ్చు.

* రక్త కేశనాళికల ద్వారా కణజాలాల్లోకి చేరిన రక్తంలోని ద్రవభాగాన్ని కణజాల ద్రవం అంటారు. దీన్ని ప్రధాన రక్త ప్రసరణ వ్యవస్థలోకి చేర్చడానికి మరొక సమాంతర వ్యవస్థ ఉంది. దీన్నే శోషరస వ్యవస్థ అంటారు. శోషణం లేదా లింఫ్‌ అనేది రక్తాన్ని, కణాలను జోడించే ప్రధానమైన పదార్థం.

* రక్తం నుంచి పోషకాలను గ్రహించి కణాలకు అందించడం, కణాల నుంచి వ్యర్థ పదార్థాలను సేకరించి రక్తంలోకి చేర్చడం శోషరసం ప్రధాన విధులు.


మాదిరి ప్రశ్నలు

1. వేరికోస్‌ వెయిన్‌ అంటే ఏమిటి? 

    1) గుండె ఒక్కసారిగా ఉబ్బిపోయి రక్తనాళాలు పగిలిపోయే వ్యాధి

    2) ధమనుల్లోకి కొలెస్ట్రాల్‌ చేరి రక్త ప్రసరణకు ఆటంకం కలిగించడం

    3) కవాటాలు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల ఉపరితల సిరలు ఉబ్బి, మెలితిరిగి నొప్పి కలిగించడం

    4) మహాధమని, బృహత్సిరతో కలిసిపోవడం వల్ల కలిగే హృద్రోగ స్థితి


2. సాధారణంగా ఆరోగ్యవంతమైన హృదయం రక్తాన్ని పంప్‌ చేసినప్పుడు కలిగే పీడనం విలువ...


    1) 120 mm Hg    2) 80mm  Hg


    3) 140mm Hg    4) 90mm Hg


3. నిదిబి (ఎలక్ట్రో కార్డియోగ్రఫ్శీ అంటే ఏమిటి?   

    1) గుండె చప్పుడు వింటూ రేఖాచిత్రాన్ని గీయడం

    2) హృదయ వలయానికి సంబంధించిన విద్యుత్‌ మార్పులను రికార్డు చేయడం

    3) హృదయ స్పందనకు, నాడీ ప్రచోదనానికి ఉన్న వినిమయాన్ని నమోదు చేయడం

    4) గుండెలో రక్తప్రసరణ చప్పుడులను గుర్తించడం


4.  కండరమయ హృదయాల్లో సంకోచం ఎక్కడ ప్రారంభం అవుతుంది?  

    1) ఆరిక్యులో వెంట్రిక్యులార్‌ నోడ్‌ లేదా తిజు నోడ్‌

    2) బండిల్‌ ఆఫ్‌ హిజ్‌

    3) యూస్టేసియన్‌ కవాటాలు

    4) సైనో ఏట్రియల్‌ నోడ్‌ లేదా ళీతి నోడ్‌


5.  కిందివాటిలో దేనివల్ల ఊపిరితిత్తుల్లో  రక్తచలన దోషం కలుగుతుంది?

    1) హైపర్‌ టెన్షన్‌  

    2) కరోనరీ ఆర్టరీ డిసీజ్‌

    3) ఏంజినా  

    4్శ గుండె విఫలం కావడం


6. కింది వాటిలో ఏ సిర మినహా మిగిలినవన్నీ ఆక్సిజన్‌ రహిత రక్తాన్ని రవాణా చేస్తాయి?

    1) పుపుస సిర     

    2) కాలేయ సిర

    3) హెపాటిక్‌ పోర్టల్‌ సిర 

    4) రీనల్‌వెయిన్‌


7.  కుడి కర్ణిక, కుడి జఠరికకు మధ్య ఉండే కవాటం?

    1) ద్విపత్ర కవాటం   2) త్రిపత్ర కవాటం    3) మిట్రల్‌ కవాటం    4) అర్ధచంద్రాకార కవాటం


8. మానవ హృదయంలో ‘యాక్షన్‌ పొటెన్షియల్‌’ మార్గం.

    1) SA  నోడ్‌ - AV నోడ్‌ - AV బండిల్‌

    2) AV నోడ్‌ - SA నోడ్‌ - బండిల్‌ ఆఫ్‌ హిజ్‌ - AV బండిల్‌

    3) SA నోడ్‌ - AV నోడ్‌ - AV బండిల్‌ - బండిల్‌ ఆఫ్‌ హిజ్‌

    4) SA నోడ్‌ - AV నోడ్‌ - పర్కింజీ తంతువులు


9. హృదయానికి రక్తప్రసరణ చేసే రక్తనాళ వ్యవస్థ....

    1) కరోనరీ వ్యవస్థ   2) దేహీయ వ్యవస్థ    3) పుపుస వ్యవస్థ 4) తంతుయుత వ్యవస్థ


10. మానవ హృదయం...

    1) నాడీజనిత హృదయం

    2) కండరజనిత హృదయం

    3) ద్విజనిత హృదయం

    4) రైనో రూపక హృదయం


11. హృదయ స్పందనకు కారణమైన నాడీకేంద్రం (న్యూరోసెంటర్శ్‌ ఎక్కడ ఉంటుంది?

    1) పాన్‌వెరోలీ    2) మధ్య మెదడు    3) సెరిబ్రమ్‌   4) మెడుల్లా అబ్లాంగేటా


జవాబులు

1-3, 2-1, 3-2, 4-4, 5-4, 6-1, 7-2, 8-3, 9-1, 10-2, 11-4


 

Posted Date : 27-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌