• facebook
  • whatsapp
  • telegram

వాతావరణ మార్పు

ప్రపంచవ్యాప్తంగా వాతావరణ స్పృహ మొదటిసారి 1967లో కలిగినట్లు పర్యావరణవేత్తల అభిప్రాయం. మానవ అభివృద్ధికి శరవేగంగా చేస్తోన్న ప్రయత్నాలు పర్యావరణ విఘాతానికి కారణమవుతున్నాయని అప్పుడు గుర్తించారు. ఈ మార్పుల కారణంగా ఆర్కిటిక్‌ ప్రాంతంలో ఓజోన్‌ పొర విచ్ఛిన్నానికి గురై, సూర్యుడి వేడి పెరిగినట్లు కనుక్కున్నారు.


స్టాక్‌హోం సదస్సు

* అంతర్జాతీయంగా పర్యావరణ పరిరక్షణ కోసం చర్యలు చేపట్టాలని వివిధ దేశాలు తీర్మానించాయి. దీనికి అనుగుణంగా 1972లో మొదటిసారి స్టాక్‌హోం నగరంలో పర్యావరణ సదస్సు నిర్వహించారు.

* జూన్‌ 5  12 మధ్య ఇది జరిగింది. ఇది పర్యావరణ పరిరక్షణ కోసం ఏర్పాటైన మొట్టమొదటి సదస్సు. 

* ప్రపంచవ్యాప్తంగా ఏటా జూన్‌ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.

* కాలుష్యం, అడవుల తరుగుదల, ఎడారీకరణ మొదలైనవన్నీ వాతావరణ మార్పుల వల్లే సంభవిస్తున్నాయని ఈ సదస్సులో గుర్తించారు. దీన్ని అరికట్టేందుకు 26 మౌలిక సూత్రాలతో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అప్పటికి పర్యావరణానికి అత్యంత హాని చేస్తున్న సమస్యలుగా వాతావరణ మార్పు, జీవవైవిధ్య తగ్గుదల, కాలుష్యాన్ని గుర్తించి వాటిని నివారించాలనే ఉద్దేశంతో దీన్ని రూపొందించారు. 

*ఆధునిక పర్యావరణ అంతర్జాతీయ భాగస్వామ్యానికి నాందిగా స్టాక్‌ హోం సదస్సును పేర్కొంటారు. 

*పర్యావరణ పరిరక్షణకు, బలమైన అంతర్జాతీయ సంస్థల ఏర్పాటుకు స్టాక్‌ హోం తీర్మానం దోహదపడింది. ఈ సదస్సు తర్వాతే వివిధ దేశాలు ప్రత్యేకంగా పర్యావరణ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశాయి. 

* అంతర్జాతీయంగా పర్యావరణ సమస్యలను తెలపడంతో ఈ సదస్సు విజయవంతమైంది. 

*యూఎన్‌ఈపీ ఉప విభాగాలు: ఇంటర్నేషనల్‌ ప్యానెల్‌ ఆన్‌ క్లైమేట్‌ ఛేంజ్‌ (ఐపీసీసీ), ఇంటర్‌ గవర్నమెంట్‌ సైన్స్‌ పాలసీ ఆన్‌ బయోడైవర్సిటీ ఎకోసిస్టం సర్వీసెస్‌ (ఐపీబీఈఎస్‌).

* ప్రపంచవ్యాప్తంగా చేపట్టాల్సిన పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు, జీవవైవిధ్యంతో కూడిన ఆరోగ్యవంతమైన ఆవరణ వ్యవస్థ రూపకల్పన కోసం చేపట్టాల్సిన విధివిధానాలను స్టాక్‌హోం సదస్సులో రూపొందించారు. ఇది తర్వాతి అంతర్జాతీయ పర్యావరణ సదస్సులకు మార్గ నిర్దేశం చేసింది. 


క్యోటో ప్రొటోకాల్‌


* అంతర్జాతీయ స్థాయిలో కర్బన ఉద్గారాల నియంత్రణ కోసం 1997లో మొదటిసారి దీన్ని నిర్వహించారు. 

*ఈ సదస్సులో గ్రీన్‌ హౌస్‌ వాయువులను నిర్వచించారు. ఇందులో మొత్తం ఆరు రకాలు ఉన్నాయి. అవి: కార్బన్‌ డైఆక్సైడ్, మీథేన్, నైట్రస్‌ ఆక్సైడ్, హైడ్రోఫ్లోరో కార్బన్లు, పెర్‌ఫ్లోరో కార్బన్లు, సల్ఫర్‌ హెక్సాఫ్లోరైడ్‌. వీటి నియంత్రణకు వివిధ మార్గదర్శకాలు జారీ చేశారు.

* అంతర్జాతీయంగా కార్బన్‌ ఉద్గారాల నియంత్రణ, నిర్దేశించిన నియమాలకు ప్రపంచ దేశాలు ఆమోదం తెలిపాయి. 

* మొత్తం రెండు దశల్లో కర్బన ఉద్గారాలను నియంత్రించేలా కార్యాచరణ రూపొందించారు. మొదటి దశలో అయిదు శాతం కర్బన ఉద్గారాలను తగ్గించాలని నిర్దేశించారు. ఇది 2005 నుంచి 2012 వరకు అమల్లో ఉంటుంది. రెండో దశలో 18 శాతం ఉద్గారాల నియంత్రణ లక్ష్యంగా పేర్కొన్నారు. ఇది 2013 నుంచి 2020 వరకు అమలైంది. 

* 2100 నాటికి పారిశ్రామిక యుగానికి ముందు నాటి ఉష్ణోగ్రతలు సాధించడం లేదా ప్రస్తుతం పెరిగిన ఉష్ణోగ్రతలను 1.5 డిగ్రీలకు తగ్గించి పర్యావరణాన్ని పరిరక్షించేలా ప్రణాళికలు రచించింది.


పారిస్‌ సదస్సు 

దీన్ని కాప్‌ 21 సదస్సుగా పిలుస్తారు. ఇది 2015లో జరిగింది. దీని విధివిధానాలు 2030 వరకు అమల్లో ఉంటాయి.

ముఖ్యాంశాలు: 21వ శతాబ్ది చివరి నాటికి భూ ఉష్ణోగ్రతలను పూర్వ పారిశ్రామిక యుగం నాటి ఉష్ణోగ్రతలతో సరిపోల్చాలి. అంటే ప్రస్తుత ఉష్ణోగ్రతలను 1.5 లేదా 2 డిగ్రీలకు తగ్గించాలి.

* 2020-20 ఫార్ములా: ప్రతి సభ్య దేశం 2030 నాటికి 20 శాతం కార్బన్‌ ఉద్గారాలను నియంత్రించాలి; రెన్యువబుల్‌ ఎనర్జీ వినియోగాన్ని 20%, ఇంధన సామర్థ్యాన్ని 20% పెంచాలి. 

* 2050 -2100 మధ్య కాలంలో సభ్య దేశాలన్నీ నికర సున్నా ఉద్గారాల లక్ష్యాన్ని (నెట్‌ జీరో ఎమిషన్స్‌) చేరాలి.

* మూడు బిలియన్‌ డాలర్లతో గ్రీన్‌ క్లైమేట్‌ ఫండ్‌ ఏర్పాటు చేయాలి. 

*  2030 నాటికి పునరుత్పత్తి స్థాపిత ఇంధన వనరుల సామర్థ్యం 40 శాతానికి పెంచాలి. 

*  శిలాజ ఇంధనాల వినియోగంపై జరిమానా విధించాలి. 2.5 టన్నుల కార్బన్‌ సింక్‌లను ఏర్పాటు చేయాలి.


ముఖ్యమైన పర్యావరణ పరిరక్షణ సదస్సులు - వాటి పరిణామ క్రమం

స్టాక్‌హోం సదస్సు - 1972

మాంట్రియల్‌ ప్రొటోకాల్‌ - 1987

ధరిత్రి సదస్సు - 1992

క్యోటో ప్రొటోకాల్‌ - 1997

పారిస్‌ సదస్సు లేదా కాప్‌ 21 సదస్సు- 2015

కాప్‌ 26 గ్లాస్‌గౌ సదస్సు - 2021

కాప్‌ 27 (ఈజిప్ట్‌లో జరిగిన పర్యావరణ సదస్సు)  2022

కాప్‌ 28 (దుబాయిలో 2023, నవంబరు 30 నుంచి డిసెంబరు 12 వరకు జరిగే పర్యావరణ సదస్సు)  2023

* పర్యావరణ పరిరక్షణ, విధివిధానాల రూపకల్పన కోసం ఐక్యరాజ్యసమితి పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాన్ని (యునైటెడ్‌ నేషన్స్‌ ఎన్విరాన్మెంటల్‌ ప్రోగ్రాం - యూఎన్‌ఈపీ) ఏర్పాటు చేసింది.  ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణకు జరుగుతున్న కార్యక్రమాలను పరిశీలించి, వాటి ఫలితాలను గణాంకాల రూపంలో సేకరించటం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం.

రియో సదస్సు లేదా ధరిత్రి సదస్సు

* 1987లో ఏర్పాటైన బ్రెట్‌ లాండ్‌ కమిషన్‌ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించాలంటే పర్యావరణ పరిరక్షణ ముఖ్యం అని పేర్కొంది. దీనికోసం కమిషన్‌ వివిధ అంశాలను ప్రతిపాదించింది. వీటిపై రియో సదస్సులో చర్చించారు.

* ఈ సదస్సులో ముఖ్యంగా మూడు రకాల తీర్మానాలను రూపొందించారు.

అవి:  

1. పర్యావరణ, అభివృద్ధి  డిక్లరేషన్‌ (రియో డిక్లరేషన్‌ ఆన్‌ ఎన్విరాన్మెంట్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌): పర్యావరణ పరిరక్షణ కోసం వివిధ రకాల పర్యావరణ కార్యక్రమాలను రూపొందించారు. 

2. ఎజెండా 21: 21వ శతాబ్దానికి  పర్యావరణాన్ని పరిరక్షించి, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించాలని  పేర్కొన్నారు.   

3. ఫారెస్ట్‌ ప్రిన్సిపల్స్‌: అడవుల పరిరక్షణ కోసం అమలు చేయాల్సిన విధానాలను సూత్రాల (ప్రిన్సిపల్స్‌) రూపంలో తీసుకొచ్చారు. 


* రియో సదస్సులోని చర్చలు, పర్యావరణ పరిరక్షణలో భాగంగా మూడు కన్వెన్షన్లను చేశారు.

1. యునైటెడ్‌ నేషన్స్‌ ఫ్రేమ్‌వర్క్‌ కన్వెన్షన్‌ ఆన్‌ క్లైమేట్‌ ఛేంజ్‌ (యూఎన్‌ఎఫ్‌సీసీసీ): యూఎన్‌ఎఫ్‌సీసీసీ ఏర్పాటును రియో సదస్సు సాధించిన విజయంగా పేర్కొంటారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న వాతావరణ మార్పులను అంచనా వేయడం, వీటి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రజల్లో చైతన్యం కల్పించడం దీని లక్ష్యం. వనరుల బాధ్యతాయుత వినియోగం, సుస్థిరాభివృద్ధి ద్వారా పర్యావరణాన్ని పునరుద్ధరించటం ఈ కన్వెన్షన్‌ ముఖ్య ఉద్దేశం. 

2. యునైటెడ్‌ నేషన్స్‌ కన్వెన్షన్‌ టు కంబాట్‌ డిసెర్టిఫికేషన్‌ (యూఎన్‌సీసీడీ): వాతావరణ మార్పుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో వర్షాభావం కలుగుతోంది. దీని ఫలితంగా అవి ఎడారులుగా మారుతున్నాయి. అత్యల్ప వర్షపాతం నమోదైన ప్రాంతాలు ఎడారులుగా మారకుండా ఉండటానికి తీసుకోవాల్సిన చర్యలను యూఎన్‌సీసీడీ నిర్దేశిస్తుంది. 

3. కన్వెన్షన్‌ ఆన్‌ బయోలాజికల్‌ డైవర్సిటీ (సీబీడీ): ప్రపంచవ్యాప్తంగా జీవవైవిధ్య పరిరక్షణకు చేపట్టాల్సిన చర్యలు, వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించే ఫ్రేమ్‌వర్క్‌ ఏర్పాటును ఇందులో చర్చించారు.

ఓజోన్‌ పొర పరిరక్షణ కార్యక్రమాలు

వియన్నా కన్వెన్షన్‌ ఫర్‌ ద ప్రొటెక్షన్‌ ఆఫ్‌ ది ఓజోన్‌ లేయర్‌: అంటార్కిటికా ప్రాంతంలో ఓజోన్‌ పొర క్షీణించినట్లు పర్యావరణ శాస్త్రవేత్తలు గుర్తించారు. దీని పరిరక్షణ కోసం ప్రపంచ దేశాలన్నీ ఆస్ట్రియాలోని వియన్నాలో సదస్సు నిర్వహించాయి. ఐక్యరాజ్య సమితిలోని సభ్యదేశాలన్నీ ఈ సదస్సులో పాల్గొన్నాయి. ఓజోన్‌ పొర పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై ఇందులో చర్చించారు. దీనికి అనుగుణంగా ఒక తీర్మానాన్ని రూపొందించాయి. 1985, మార్చి 22న దీనిపై దేశాలన్నీ సంతకాలు చేశాయి. ఇది 1988, సెప్టెంబరు 22 నుంచి అమల్లోకి వచ్చింది. 

మాంట్రియల్‌  ప్రొటోకాల్‌: 1987లో ఓజోన్‌ పొర పరిరక్షణ కోసం ఈ సదస్సును ఏర్పాటు చేశారు. ఇందులో రూపొందించిన మార్గదర్శకాలు 1989 నుంచి అమల్లోకి వచ్చాయి. 

* ఓజోన్‌ పొరను క్షీణింపజేసే పదార్థాలుగా (ఓజోన్‌ డిప్లీటింగ్‌ సబ్‌స్టాన్సెస్‌) క్లోరో ఫ్లోరో కార్బన్లు (సీఎఫ్‌సీ), హైడ్రోఫ్లోరో కార్బన్లు (హెచ్‌ఎఫ్‌సీ), కార్బన్‌టెట్రాక్లోరైడ్, మిథైల్‌ క్లోరోఫాం, హైడ్రోబ్రోమో ఫ్లోరోకార్బన్లు, హాలోజన్లను గుర్తించారు. పర్యావరణంలో కలిసిపోయిన ఈ వాయువులను దశలవారీగా తగ్గించాలని ఇందులో నిర్దేశించించారు. 

*2050 నాటికి ఓజోన్‌ పొరను పూర్వ స్థాయికి తేవాలని ఇందులో పేర్కొన్నారు.కిగాలి ఒప్పందం: మాంట్రియల్‌ ప్రొటోకాల్‌కు కొనసాగింపుగా 2016లో ఈ ఒప్పందం జరిగింది. 

* గ్లోబల్‌ వార్మింగ్‌ దృష్ట్యా పెరుగుతున్న ఉష్ణోగ్రతను 2100 నాటికి 0.5 డిగ్రీలకు తగ్గిస్తే ఓజోన్‌ పొర పునరుద్ధించడం సాధ్యమవుతుందని ఈ సదస్సులో అంచనా వేశారు. 

*ఈ ఒప్పందం ముఖ్యంగా హైడ్రోఫ్లోరో కార్బన్ల తగ్గింపు మొదలైన అంశాలపై కేంద్రీకృతం అయ్యింది.  పై మూడు ఒప్పందాల కారణంగా ఓజోన్‌ పొర తిరిగి పూర్వ స్థితికి నెమ్మదిగా చేరుకుంటుందని, ఐక్యరాజ్యసమితి ఇటీవల ఇచ్చిన నివేదికలో పేర్కొంది.

* ఓజోన్‌ పొర క్షీణత కారణంగా సూర్యుడి అతినీలలోహిత కిరణాలు నేరుగా భూమిని చేరతాయి. ఇది చర్మ క్యాన్సర్లు, కాటరాక్ట్‌ (కంటి శుక్లం) సమస్యలకు కారణం అవుతుంది.

* ఓజోన్‌ పొరను పూర్వ స్థితికి తీసుకొచ్చేందుకు అంతర్జాతీయంగా స్ట్రాటోస్పియరిక్‌ ఏరోసాల్‌ ఇంజక్షన్‌

(SAI) అనే ప్రక్రియను అవలంబిస్తున్నారు. స్ట్రాటో పొరలో ఉన్న ఓజోన్‌ను పునరుద్ధరించడం దీని ముఖ్య ఉద్దేశం.
 

Posted Date : 13-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌