• facebook
  • whatsapp
  • telegram

క‌మిటీలు - సిఫార్సులు

  భారత రాజకీయ వ్యవస్థలో రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ ఒక ముఖ్యమైన అంశం. దీని కోసం కేంద్రం వివిధ కమిటీలను నియమించింది. అవి పలు సిఫార్సులు చేశాయి. ఇండియన్‌ పాలిటీ అధ్యయనంలో అభ్యర్థులు ఆ వివరాలను తెలుసుకోవాలి.  
  భారతదేశాన్ని పరిపాలనా సౌలభ్యం కోసం వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించారు. 1956లో మనదేశంలో 14 రాష్ట్రాలు, 6 కేంద్ర పాలిత ప్రాంతాలను ఏర్పాటు చేశారు. తర్వాత జరిగిన వివిధ రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం దేశంలో 28 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాలు కొనసాగుతున్నాయి.


ఎవరు, ఎలా చేస్తారు?

   భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 3 ప్రకారం రాష్ట్రాలను పునర్‌వ్యవస్థీకరించే అధికారం పార్లమెంటుకు ఉంది. రాష్ట్రపతి అనుమతితో రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ బిల్లులను పార్లమెంటు ఉభయసభల్లో ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. రాష్ట్రపతి పునర్‌వ్యవస్థీకరణ జరిగే రాష్ట్ర శాసనసభ అభిప్రాయాన్ని నిర్ణీత గడువు లోగా తెలపాలని కోరవచ్చు. రాష్ట్ర శాసనసభ అభిప్రాయం ఏదైనప్పటికీ రాష్ట్రపతి గౌరవించాల్సిన అవసరం లేదు. కేంద్రప్రభుత్వం సొంత నిర్ణయాన్ని అమలు చేయవచ్చు. పునర్‌వ్యవస్థీకరణ బిల్లులను పార్లమెంటు సాధారణ మెజారిటీతో ఆమోదిస్తే సరిపోతుంది. పార్లమెంటు అంగీకారం అనంతరం రాష్ట్రపతి ఆమోదంతో చట్టంగా మారి కొత్త రాష్ట్రం ఏర్పడుతుంది. రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణకు సంబంధించి వివిధ కమిటీలు సిఫార్సులు చేశాయి. వాటిలో ముఖ్యమైన అంశాలను అభ్యర్థులు పరీక్షల కోణంలో అధ్యయనం చేయాలి.


భాషాప్రయుక్త ప్రావిన్స్‌ల కమిటీ

  భారతదేశంలో ‘భాష’ ప్రాతిపదికన రాష్ట్రాలను ఏర్పాటుచేయాల్సిన అవసరం ఉందా? లేదా? అనే అంశాన్ని అధ్యయనం చేసేందుకు అలహాబాద్‌ హైకోర్టు న్యాయమూర్తి సరోజ్‌కుమార్‌ థార్‌ (ఎస్‌.కె.థార్‌) అధ్యక్షతన పన్నాలాల్‌, జగత్‌నారాయణ్‌లాల్‌ సభ్యులుగా ఒక కమిటీని 1948 జూన్‌లో అప్పటి రాజ్యాంగ పరిషత్‌ అధ్యక్షుడైన డాక్టర్‌ బాబూ రాజేంద్రప్రసాద్‌ నియమించారు. ఈ కమిటీ తన నివేదికను 1948 డిసెంబరులో సమర్పించింది.


సిఫార్సులు:


* భాషా ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటు సమంజసం కాదు.
* రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ పాలనా సౌలభ్యం కోసం మాత్రమే జరగాలి.


జేవీపీ కమిటీ


ఎస్‌.కె.థార్‌ కమిషన్‌ సిఫార్సులు ప్రత్యేకించి ఆంధ్ర ప్రాంతంలో తీవ్ర నిరసనలకు దారితీయడంతో 1948 డిసెంబరులో జైపూర్‌లో జరిగిన కాంగ్రెస్‌ సమావేశంలో రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణపై జేవీపీ కమిటీని ఏర్పాటుచేశారు. ఈ కమిటీలో J- జవహర్‌లాల్‌ నెహ్రూ, V - వల్లభాయ్‌పటేల్‌, P - పట్టాభి సీతారామయ్యలు సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ తన నివేదికను 1949 ఏప్రిల్‌లో సమర్పించింది.


సిఫార్సులు:


* రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణకు పరిపాలన, అభివృద్ధి, జాతీయ సమైక్యత వంటి అంశాలు ప్రాతిపదిక కావాలి.
* భాష ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటును వాయిదా వేయాలి.
* ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటును సానుభూతితో పరిశీలించాలి.


ఫజల్‌ అలీ కమిషన్‌

  కైలాష్‌నాథ్‌ వాంఛూ కమిటీ సిఫార్సుల మేరకు భారతదేశంలో తొలి భాషాప్రయుక్త రాష్ట్రంగా 1953 అక్టోబరు 1న ‘ఆంధ్ర రాష్ట్రం’ అవతరించింది. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుతో ఇతర భాషాప్రయుక్త రాష్ట్రాలకు డిమాండ్లు తలెత్తాయి. దీంతో ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి నెహ్రూ ప్రభుత్వం 1953 డిసెంబరులో ఫజల్‌ అలీ అధ్యక్షతన కె.ఎమ్‌.పణిక్కర్‌, హెచ్‌.ఎన్‌.కుంజ్రూ సభ్యులుగా రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ కమిషన్‌ను నియమించింది. ఈ కమిషన్‌ తన నివేదికను 1955 సెప్టెంబరులో సమర్పించింది.


సిఫార్సులు: 


* పార్టు - ఎ, బి, సి, డి రాష్ట్రాల వర్గీకరణను రద్దుచేయాలి.
* ‘ఒకే భాష - ఒకే రాష్ట్రం’ అనే నినాదం సమంజసం కాదు.

రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ అంటే?
* కొత్త రాష్ట్రాలను ఏర్పాటుచేయడం
* రాష్ట్రాల సరిహద్దులను మార్చడం
* రాష్ట్రాల విస్తీర్ణంలో మార్పులు చేయడం
* రాష్ట్రాల పేర్లు మార్చడం


సుప్రీంకోర్టు తీర్పు

  బాబూలాల్‌ Vs స్టేట్‌ ఆఫ్‌ మహారాష్ట్ర కేసు: ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ - రాష్ట్రపతి పంపిన రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ బిల్లుపై సంబంధిత రాష్ట్ర శాసనసభ తన అభిప్రాయాన్ని తెలిపిన తర్వాత పార్లమెంటులో ప్రవేశపెట్టేముందు కేంద్రప్రభుత్వం ఆ బిల్లులో ఏవైనా సవరణలు చేస్తే మళ్లీ శాసనసభ అభిప్రాయాన్ని కోరాల్సిన అవసరం లేదని పేర్కొంది.

Posted Date : 28-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌