• facebook
  • whatsapp
  • telegram

కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) 

   భారత రాజ్యాంగంలోని 5వ భాగంలో 148 నుంచి 151 వరకు ఉన్న ఆర్టికల్స్ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) గురించి తెలియజేస్తున్నాయి. కాగ్ పదవిని మనం బ్రిటన్ నుంచి గ్రహించాం.
ఆర్టికల్ 148: సాధారణంగా ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ సర్వీస్ (ఐఏఏఎస్)లో 10 సంవత్సరాలకు పైబడిన అనుభవం ఉన్న, ప్రభుత్వ కార్యకలాపాల్లో నిష్ణాతుడైన వ్యక్తిని కాగ్‌గా నియమిస్తారు.
ఆర్టికల్ 148(1): కాగ్‌ను స్వయంగా సంతకం చేసిన అధికార ముద్ర గల అధిపత్రం ద్వారా రాష్ట్రపతి నియమిస్తారు.
* సుప్రీంకోర్టు న్యాయమూర్తులను తొలగించే పద్ధతిలోనే కాగ్‌ను తొలగించాలి.
ఆర్టికల్ 148(2): కాగ్‌గా నియమితులైన వ్యక్తి రాష్ట్రపతి లేదా ఆయన నియమించిన అధికారి ఎదుట 3వ షెడ్యూల్‌లో పేర్కొన్న విధంగా పదవీ ప్రమాణ స్వీకారం చేస్తారు.
* 'భావ రాగ ద్వేషాలకు అతీతంగా బాధ్యతలు నిర్వహిస్తామన్న వాక్యాలతో పాటు రాజ్యాంగాన్ని, చట్టాలను నిలబెడతానని' కాగ్ ప్రమాణం చేస్తారు.
* రాజ్యాంగాన్ని నిలబెట్టే కీలక బాధ్యతను రాజ్యాంగంలో సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు; కాగ్‌పై మాత్రమే రాజ్యాంగ నిర్మాతలు ఉంచారు.
* రాజ్యాంగబద్ధ సంస్థల అధికారుల్లో ఈ విధంగా ప్రమాణం చేసే అధికారి కాగ్ మాత్రమే.


ఆర్టికల్ 148(3): కాగ్ సర్వీసు నిబంధనలను, జీతభత్యాలను పార్లమెంటు నిర్ణయిస్తుంది. 2వ షెడ్యూల్‌లో పేర్కొన్న విధంగా జీతం చెల్లిస్తారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి పొందే జీతాన్నే కాగ్ పొందుతారు.
* ప్రస్తుతం కాగ్ జీతం రూ.90,000. పదవీ కాలం 6 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు.
ఆర్టికల్ 148(4): కాగ్‌గా పని చేసిన వ్యక్తి పదవీ విరమణ అనంతరం కేంద్ర ప్రభుత్వంలో లేదా రాష్ట్ర ప్రభుత్వంలో మరే ఇతర పదవిని చేపట్టకూడదు.
ఆర్టికల్ 148(5): రాష్ట్రపతి కాగ్‌ను సంప్రదించిన అనంతరం ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ డిపార్ట్‌మెంట్ లోని ఉద్యోగుల నియామక నిబంధనలను, కాగ్ పాలనాపరమైన నియమాలను రూపొందిస్తారు.
ఆర్టికల్ 148(6): కాగ్‌కు సంబంధించిన నిర్వహణ ఖర్చులు, జీతభత్యాలు, పెన్షన్ లాంటివన్నీ భారత సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు.
ఆర్టికల్ 149: పార్లమెంటు నిర్ణయించిన అధికార విధులను కాగ్ నిర్వహిస్తారు. దీనికి సంబంధించిన చట్టాన్ని భారత పార్లమెంటు 1971లో రూపొందించింది.
* రాజ్యాంగాన్ని రూపొందించే సమయంలో ఆడిటర్ జనరల్ పదవిని మాత్రమే పేర్కొన్నారు. టి.టి.కృష్ణమాచారి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అనుసరించి కంప్ట్రోలర్ అనే పదాన్ని చేర్చారు.
* 1858 నాటి విక్టోరియా మహారాణి ప్రకటన ద్వారా మొదటిసారిగా మన దేశంలో అకౌంటెంట్ జనరల్ పేరుతో ఈ అధికారిక స్థానాన్ని ఏర్పాటు చేశారు.
* 1919 నాటి మాంటేగ్ - చెమ్స్‌ఫర్డ్ సంస్కరణల చట్టం ద్వారా కాగ్‌కు చట్టబద్ధతను కల్పించారు.
* 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా కాగ్ పదవి సంపూర్ణతను సంతరించుకుంది.


కాగ్ అధికారాలు - విధులు
* కేంద్ర, రాష్ట్రాలు సంఘటిత నిధుల నుంచి చేసిన ఖర్చులను తనిఖీ చేయడం.
* కంటింజెన్సీ ఫండ్ నుంచి చేసిన ఖర్చులను తనిఖీ చేయడం.
* ప్రభుత్వ శాఖలకు సంబంధించిన వ్యాపారం, ఉత్పత్తి, లాభ, నష్టాల లెక్కలను తనిఖీ చేయడం.
* కేంద్రం లేదా రాష్ట్రాల నుంచి ఎక్కువ మొత్తంలో ఆర్థిక సహాయం పొందుతున్న సంస్థల ఆదాయ, వ్యయాలను ఆడిట్ చేయడం.
* తాను ఆడిట్ చేసిన ప్రతి అంశానికి సంబంధించిన లావాదేవీలను నివేదిక రూపంలో సిద్ధం చేయడం.
* కాగ్ భారత అకౌంట్స్ అండ్ ఆడిట్ శాఖ తరఫున విధులను నిర్వర్తిస్తారు.
* 1981 నాటి అకౌంటెంట్ జనరల్ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ, కాగ్‌ను రాజ్యాంగ అత్యున్నత అధికారిగా పేర్కొంది.
* 1949 మే 30న డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ రాజ్యాంగ పరిషత్‌లో ప్రసంగిస్తూ కాగ్ గురించి ఈ విధంగా వ్యాఖ్యానించారు.
    'పార్లమెంటు ఆమోదించే వ్యయాలు పరిధి దాటుతున్నాయా, మార్పుచేర్పులేమైనా చోటుచేసుకుంటున్నాయా అనే విషయాన్ని పరిశీలించే కాగ్ భారత రాజ్యాంగంలోనే అత్యంత ముఖ్యమైన అధికారి. ఆ అధికారి నిర్వహించే విధులు న్యాయాధికారి విధుల కంటే ముఖ్యమైనవి'.
ఆర్టికల్ 150: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జమా ఖర్చులు కాగ్ సలహాపై రాష్ట్రపతి నిర్ణయించిన నమూనాలో ఉండాలి.
ఆర్టికల్ 151: ఆడిట్ రిపోర్టుల గురించి తెలియజేస్తుంది.
ఆర్టికల్ 151(1): కేంద్ర ప్రభుత్వ జమా ఖర్చులకు సంబంధించిన కాగ్ నివేదికలను రాష్ట్రపతికి అందజేయాలి. రాష్ట్రపతి వాటిని పార్లమెంటులో ప్రవేశపెడతారు లేదా పార్లమెంటులో ప్రవేశపెట్టే ఏర్పాట్లు చేస్తారు.
ఆర్టికల్ 151(2): రాష్ట్ర ప్రభుత్వ జమా ఖర్చులకు సంబంధించిన కాగ్ నివేదికలను గవర్నర్‌కు అందజేయాలి. వాటిని గవర్నర్ శాసనసభలో ప్రవేశపెట్టే ఏర్పాటు చేయాలి.
* రాజ్యాంగం అమల్లోకి వచ్చిన ప్రారంభంలో కంప్ట్రోలర్ అకౌంటెంట్ అండ్ ఆడిటర్ జనరల్ (CAAG)గా ఉండగా 1976లో అకౌంట్స్ విభాగాన్ని వేరుచేయడంతో CAG (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) గా కొనసాగుతోంది.


ఇతర ముఖ్యాంశాలు
  CAG భారత ప్రజల విత్తానికి ప్రధాన కాపలాదారుగా వ్యవహరిస్తారు.
* ప్రభుత్వాల ఖర్చులను నియంత్రించే అధికారం కాగ్‌కు లేనందున ఈ పదవి వాస్తవానికి ఆడిటర్ జనరల్‌గా మాత్రమే వ్యవహరిస్తోంది అని పాల్ ఆపిల్ బీ పేర్కొన్నారు.
* కాగ్ పొదుపునకు సంబంధించిన సలహాలను మాత్రమే సూచించగలదు. ప్రభుత్వ ఖర్చుల్లోని అవకతవకలను ఎత్తి చూపుతుంది.
* కాగ్ నివేదికను కొందరు శవ పంచనామా (Post-mortem Report)గా పేర్కొంటారు.
* మన దేశంలోని 1400 కార్పొరేషన్ల ఖాతాలను కాగ్ తనిఖీ చేస్తుంది.
* ఇటీవల కాగ్‌గా పదవీ విరమణ చేసిన వినోద్‌రాయ్ భారతదేశంలోని స్థానిక స్వపరిపాలనా సంస్థలను కూడా కాగ్ పరిధిలోకి తీసుకురావాలని సూచించారు.
* కాగ్‌గా పనిచేసిన వినోద్‌రాయ్ యూఎన్‌వో ఎక్స్‌టర్నల్ ఆడిటర్స్ ప్యానల్‌కు ఛైర్మన్‌గా వ్యవహరించారు.
* కాగ్ ను బహుళ సభ్య సంఘంగా మార్చాలని షుంగ్లూ కమిటీ సిఫార్సు చేసింది.
* కాగ్ సమర్పించిన నివేదికలను ప్రజాపద్దుల సంఘం, ప్రభుత్వరంగ సంస్థల కమిటీలు సమీక్షిస్తాయి.
* పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి కాగ్‌ను తత్వవేత్తగా, స్నేహితుడిగా, మార్గదర్శకుడిగా వ్యవహరిస్తారు.
* ఏ అంశంపైన అయినా కాగ్ ఆడిట్ మూడు దశల్లో జరుగుతుంది. ముగ్గురు సభ్యులున్న బృందం ఈ ఆడిట్‌లో పాల్గొంటుంది.


 కాగ్ వెలికితీసిన కుంభకోణాలు
* భోఫోర్స్ శతఘ్నుల కుంభకోణం
* 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం (రూ.1.76 లక్షల కోట్లు)
* ఆంధ్రప్రదేశ్‌లో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంలో అవకతవకలు
* అగస్టా వెస్ట్‌లాండ్ హెలికాప్టర్ల కొనుగోలులో జరిగిన అక్రమాలు
* కామన్‌వెల్త్ క్రీడల్లో అక్రమాలు
* ముంబయిలో ఆదర్శ్ కుంభకోణం
* బొగ్గు గనుల కేటాయింపుల్లో అవకతవకలు
* యాంత్రిక్స్ - దేవాస్ ఒప్పందంపై జరిగిన అక్రమాలు
* ఓఎన్‌జీసీ ఎలాంటి బిడ్డింగ్ లేకుండా రిలయన్స్ నుంచి డ్రిల్లింగ్ రిగ్‌ను అద్దెకు తీసుకోవడం
* అన్ని రకాల ప్రణాళికల వ్యయాన్ని కాగ్ పరిధిలోకి తీసుకురావాలని రంగరాజన్ కమిటీ సిఫార్సు చేసింది.


కాగ్ పదవిపై వ్యాఖ్యానాలు
* భారత రాజ్యాంగం సృష్టించిన అధికారుల్లో కాగ్‌ను ప్రధానమైన, శక్తిమంతమైన అధికారిగా పేర్కొనవచ్చు.- డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్
* కాగ్ ప్రభుత్వానికి బాధ్యురాలు కాదు. తన నివేదికల్లో ప్రభుత్వాన్ని విమర్శించే స్వేచ్ఛ కాగ్‌కు ఉంది. - జవహర్‌లాల్ నెహ్రూ
* కాగ్‌కు తన ఆఫీసు సిబ్బందిపై ఎలాంటి పరిపాలనాపరమైన నియంత్రణ ఉండదు. అందుకే కాగ్‌ను "very much alone wolf"గా పేర్కొనవచ్చు.   - సర్ ఫ్రాండ్ ట్రైబ్


అటార్నీ జనరల్
* భారత రాజ్యాంగంలోని 5వ భాగంలో ఆర్టికల్ 76 అటార్నీ జనరల్ గురించి తెలియజేస్తుంది.
* భారత ప్రభుత్వానికి ప్రధాన న్యాయాధికారిగా అటార్నీ జనరల్ వ్యవహరిస్తారు.
* సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించడానికి అర్హతలున్న వారిని అటార్నీ జనర‌ల్‌గా రాష్ట్రపతి నియమిస్తారు. రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకు పదవిలో కొనసాగుతారు.
* అటార్నీ జనరల్ వేతనాలను రాష్ట్రపతి నిర్ణయిస్తారు. సాధారణంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తికి లభించే వేతనం అటార్నీ జనరల్ పొందుతారు. ఈ వేతనాన్ని కేంద్ర సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు.
* సాధారణంగా అటార్నీ జనరల్ పదవీ కాలం 6 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు. కానీ ప్రధాని నేతృత్వంలోని కేబినెట్ సలహాను అనుసరించి రాష్ట్రపతి ఎప్పుడైనా అటార్నీ జనరల్‌ను తొలగించగలరు.


అటార్నీ జనరల్ అధికారాలు - విధులు
* పార్లమెంటు సమావేశాలు, చర్చల్లో పాల్గొనే అధికారం ఉంది. కానీ ఓటు వేసే అధికారం లేదు.
* దేశంలోని ఏ న్యాయస్థానంలోనైనా ప్రభుత్వం తరఫున వాదించే అధికారం ఉంది.
* భారత రాష్ట్రపతి ఆర్టికల్ 143 ప్రకారం అటార్నీ జనరల్ ద్వారా సుప్రీంకోర్టు న్యాయ సలహాను పొందగలరు.
* కేంద్ర ప్రభుత్వానికి ప్రధాన న్యాయ సలహాదారు, న్యాయవాది.
* అటార్నీ జనరల్‌కు సహాయ సహకారాలు అందించడానికి ప్రభుత్వం ఒక సొలిసిటర్ జనరల్‌ను, ఇద్దరు అదనపు సొలిసిటర్ జనరల్స్‌ను నియమిస్తుంది.
* ప్రస్తుత అటార్నీ జనరల్ కె.కె. వేణుగోపాల్‌.
* ప్రస్తుత సొలిసిటర్ జనరల్ తుషార్‌ మెహతా.


అడ్వకేట్ జనరల్
* భారత రాజ్యాంగంలోని 6వ భాగంలో ఆర్టికల్ 165 'అడ్వకేట్ జనరల్' గురించి తెలియజేస్తుంది.
* రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన న్యాయాధికారిగా అడ్వకేట్ జనరల్ వ్యవహరిస్తారు.
* హైకోర్టు న్యాయమూర్తిగా నియమించడానికి అర్హతలున్న వారిని 'అడ్వకేట్ జనరల్‌'గా గవర్నర్ నియమిస్తారు.
* ముఖ్యమంత్రి నాయకత్వంలోని రాష్ట్ర మంత్రిమండలి సిఫార్సు మేరకు గవర్నర్ 'అడ్వకేట్ జనరల్‌'ను తొలగిస్తారు. అంటే గవర్నర్ విశ్వాసం ఉన్నంత మేరకే 'అడ్వకేట్ జనరల్' పదవిలో కొనసాగుతారు.
* హైకోర్టు న్యాయమూర్తి పొందే వేతనాన్ని పొందుతారు. దీన్ని గవర్నర్ నిర్ణయిస్తారు.


బల్వంత్‌సింగ్ చౌఫల్ వర్సెస్ ఉత్తరాఖండ్ కేసు
* ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ 62 సంవత్సరాల వయసు నిండిన వారిని కూడా 'అడ్వకేట్ జనరల్‌'గా నియమించవచ్చని పేర్కొంది.
అడ్వకేట్ జనరల్ అధికారాలు - విధులు
* రాష్ట్ర శాసనసభ సమావేశాలు, చర్చల్లో పాల్గొనవచ్చు. కానీ ఓటు వేసే అధికారం లేదు.
* రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్రంలోని ఏ న్యాయస్థానంలోనైనా హజరై తన వాదనను వినిపించవచ్చు.
* రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన న్యాయసలహాదారు, న్యాయవాది.
* అడ్వకేట్ జనరల్‌కు సహాయ సహకారాలు అందించడానికి అదనపు అడ్వకేట్ జనరల్‌ను నియమిస్తారు.

Posted Date : 31-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌