• facebook
  • whatsapp
  • telegram

భారత రాజ్యాంగం - అధికరణలు

* భారత రాజ్యాంగంలోని మొదటి భాగం... అధికరణలు ఒకటి నుంచి నాలుగు వరకు, భారతదేశంలోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, వాటి భూభాగాల పరిధిని గురించి పేర్కొంటాయి. ఈ నాలుగు అధికరణల్లోని అంశాలు, రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ, పరిణామక్రమం గురించి తెలుసుకుందాం.

ఒకటో అధికరణ: నామధేయం, భారత భూభాగం
* ఇండియా అంటే భారత్. భారతదేశం రాష్ట్రాల సమాఖ్య. భారతదేశం సమాఖ్య స్వభావాన్ని ప్రదర్శిస్తున్నప్పటికీ రాజ్యాంగంలో ఎక్కడా సమాఖ్య అనే పదాన్ని ఉపయోగించలేదు.

* డా. బి.ఆర్. అంబేడ్కర్ ప్రకారం 'భారత రాజ్యాంగం సమాఖ్య నిర్మాణాన్ని కలిగి ఉన్నప్పటికీ భారతదేశాన్ని యూనియన్‌గా వర్ణిస్తారు.ఎందుకంటే ఇది అమెరికాలా రాష్ట్రాల మధ్య ఒప్పందం ద్వారా ఏర్పడలేదు. కాబట్టి భారతదేశాన్ని విభాజిత రాష్ట్రాలున్న అవిభాజ్యమైన యూనియన్‌గా పేర్కొనవచ్చు. భారత యూనియన్ నుంచి విడిపోయే అధికారం ఏ రాష్ట్రానికీ లేదు.

* ఈ అధికరణం ప్రకారం భారత భూభాగాన్ని కింది విధంగా వర్గీకరించవచ్చు.
* రాష్ట్రాలు, వాటి భూభాగాలు
* కేంద్ర పాలిత ప్రాంతాలు
* భారత ప్రభుత్వం ఆర్జించబోయే ఇతర భూభాగాలు.
* అయితే ఈ యూనియన్‌ను రాష్ట్రాలుగా విభజన అనేది కేవలం పరిపాలనా సౌలభ్యం కోసం మాత్రమే అని అర్థమవుతుంది.


రెండో అధికరణ: కొత్త రాష్ట్రాల ఏర్పాటు - విలీనం

* ఈ అధికరణ ప్రకారం ఏదైనా ఒక కొత్త రాష్ట్రం లేదా దేశాన్ని భారతదేశంలో విలీనం చేసుకునే అధికారం భారత పార్లమెంటుకు ఉంది.అంటే భారత భూభాగంలో అంతర్భాగంకాని ప్రాంతాలను విలీనం, ఏర్పాటు గురించి ఈ అధికరణ పేర్కొంటుంది.
* ఈ అధికరణ ప్రకారమే 1954 లో పాండిచ్చేరి, 1961 లో గోవా, 1975 లో సిక్కిం భారతదేశంలో విలీనం అయ్యాయి
మూడో అధికరణ: రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ ద్వారాకొత్త రాష్ట్రాల ఏర్పాటు, సరిహద్దులు, పేర్ల మార్పు
* ఈ అధికరణం భారతదేశంలో అంతర్గతంగా మార్పులు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ ఈ కింది విధంగా ఉంటుంది.

a) నూతన రాష్ట్రాల ఏర్పాటు.
* ఏ రాష్ట్రం నుంచి అయినా విడిపోయి కొత్త రాష్ట్రంగా అవతరించడం. ఉదా: తెలంగాణ రాష్ట్రం.
* రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో కొన్ని భాగాలు కలిపి నూతన రాష్ట్రంగా ఏర్పాటు చేయడం.

b) రాష్ట్రాల పేర్లు మార్చడం.

c) రాష్ట్రాల సరిహద్దులు మార్చడం.

d) రాష్ట్రాల విస్తీర్ణాన్ని మార్చడం.
* పై విధంగా పునర్‌వ్యవస్థీకరణ జరపడానికి కేంద్ర ప్రభుత్వం పునర్‌వ్యవస్థీకరణ బిల్లును ప్రవేశ పెట్టేముందు కింది నిబంధనలను అనుసరించాలి.
* రాష్ట్రపతి పూర్వ సిఫార్సు తర్వాత మాత్రమే ఈ బిల్లును ప్రవేశపెట్టాలి.
* రాష్ట్రపతి ఆ విధంగా సిఫార్సు చేయడానికి ముందుగా దీన్ని సంబంధిత రాష్ట్ర శాసనసభ అభిప్రాయం కోసం నిర్ణీత గడువుతో పంపించాలి.ఆ రాష్ట్ర అభిప్రాయాన్ని గౌరవించాల్సిన అవసరం లేదు.
* తర్వాత ఆ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి సాధారణ మెజారిటీతో (హజరై పాల్గొన్న వారితో) చట్టాన్ని రూపొందించవచ్చు. భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనప్పుడు సంయుక్త సమావేశానికి అవకాశం లేదు. అంటే సిద్ధాంతపరంగా చెప్పాలంటే భారత సమాఖ్యలోని రాష్ట్రాల సమగ్రతకు రాజ్యాంగ రక్షణలేదు.


నాలుగో అధికరణ: షెడ్యూల్ సవరణ, 368 ద్వారా రాజ్యాంగ సవరణ


* 2, 3 అధికరణల ప్రకారం చేసిన చట్టాలు అధికరణ 368 కింద చేసే రాజ్యాంగ సవరణ పరిధిలోకి రావని పేర్కొంది. అలాగే 2, 3 అధికరణలకు సవరణ చేస్తే ఒకటి, నాలుగో షెడ్యూళ్లకు సవరణ చేయాలని చెబుతోంది.
* అయితే భారత భూభాగాన్ని ఇతర దేశాలకు బదిలీ చేసే అధికారం అధికరణ-3లో భాగమా? భాగమైతే సాధారణ చట్టం ద్వారా బదిలీ చేయవచ్చా? అనేవి ముఖ్యం. ఈ సందేహం బెరుబరి ప్రాంతాన్ని భారతదేశం బదిలీ చేసే సందర్భంలో వచ్చింది. ఈ సమయంలో సుప్రీంకోర్టు భారత భూభాగాన్ని ఇతర దేశాలకు బదిలీ చేసే అధికారం అధికరణ-3 కిందకు రాదనీ, అది అధికరణ 368 ద్వారా మాత్రమే జరగాలనీ నిర్దేశించింది. అంటే ఇలాంటి విషయాలు రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే జరగాలి.
భారతదేశంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిణామక్రమం:
* స్వదేశీ సంస్థానాల విలీనం
* బాషాప్రయుక్త రాష్ట్రాలు - రాష్ట్రాల పునర్‌వ్యవస్థకరణ


స్వదేశీ సంస్థానాల విలీనం:


* భారత స్వాతంత్య్ర చట్టం - 1947 ప్రకారం స్వదేశీ సంస్థానాలకు పాకిస్థాన్ లేదా భారతదేశంలో కలవడానికి కానీ, స్వతంత్రంగా ఉండటానికి కానీ వీలుకల్పించారు. వివిధ పద్ధతుల ద్వారా భారత భూగోళ పరిధిలో ఉన్న 552 స్వదేశీ సంస్థానాలు భారతదేశంలో విలీనం అయ్యాయి.


భాషాప్రయుక్త రాష్ట్రాలు - రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ:


* భారతదేశంలో స్వదేశీ సంస్థానాల విలీనం అనేది తాత్కాలిక పరిణామం. అనేక ప్రాంతాల్లో, ప్రత్యేకంగా దక్షిణాది రాష్ట్రాల్లో భాషాప్రయుక్త రాష్ట్రాలు కావాలని డిమాండ్లు మొదలయ్యాయి.
* భాషాప్రయుక్త రాష్ట్రాల డిమాండ్ అనేది స్వాతంత్య్రోద్యమ కాలం నుంచే ఉంది. మాంటేగ్ - ఛెమ్స్‌ఫర్డ్ (1919) సంస్కరణల కాలంలోనే భాషా ప్రాతిపదిక రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. భారత జాతీయ కాంగ్రెస్ 1945 అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ఈ మేరకు హామీ ఇచ్చింది.
* వీటికి అనుగుణంగా భాషా ప్రాతిపదికన రాష్ట్రాలను ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉందా? లేదా? అనే అంశాలను పరిశీలించడానికి 1948 లో రాజ్యాంగ పరిషత్ ఎస్.కె. థార్ అధ్యక్షతన ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీ భాషా ప్రాతిపదిక రాష్ట్రాల ఏర్పాటును తిరస్కరించి, పాలనా సౌలభ్యం మొదలైన అంశాల ప్రాతిపదికపై మాత్రమే రాష్ట్రాల ఏర్పాటు జరగాలని సూచించింది.
* ఈ నివేదిక పట్ల తీవ్ర నిరసనలు వెల్లువెత్తడంతో, భారత జాతీయ కాంగ్రెస్ రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణను పరిశీలించడానికి నెహ్రూ, పటేల్, పట్టాభి సీతారామయ్యలతో మరో కమిటీని నియమించింది. ఈ కమిటీ పరోక్షంగా భాషా ప్రాతిపదిక రాష్ట్రాల ఏర్పాటును తిరస్కరిస్తూనే ప్రత్యేకాంధ్ర రాష్ట్ర ఏర్పాటును ప్రత్యేక దృష్టితో చూడాలని పేర్కొంది.
* దీనికి అనుగుణంగా అనేక సంఘటనల తర్వాత మద్రాసు రాష్ట్రం నుంచి తెలుగు భాష మాట్లాడే ప్రాంతంతో, కైలాస్‌నాథ్ వాంఛూ సూచనల ఆధారంగా 1953, అక్టోబరు 1న ''ఆంధ్ర రాష్ట్రం" ఏర్పాటైంది.


రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ కమిషన్ - 1953


* భాషాప్రాతిపదికతో ఆంధ్రరాష్ట్రం ఏర్పాటు కావడంతో దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా భాషాప్రయుక్త రాష్ట్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్లు అధికమయ్యాయి. దీంతో భారత ప్రభుత్వం రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణకు తగిన సూచనల కోసం ఫజల్ అలీ నాయకత్వంలో కమిషన్‌ను నియమించింది.
* ఈ కమిషన్ తన నివేదికలో 'ఒకే భాష - ఒకే రాష్ట్రం' నినాదాన్ని వ్యతిరేకించింది. భాషా ప్రాతిపదిక రాష్ట్రాలకు సూత్రప్రాయంగా ఒప్పుకున్నప్పటికీ, రాష్ట్రాలను పునర్‌వ్యవస్థీకరించేటప్పుడు కొన్ని అంశాలను దృష్టిలో ఉంచుకోవాలని సూచించింది.
* భారతదేశ సమగ్రత, భద్రతకు భంగం వాటిల్లకూడదు.
* సంస్కృతి, చరిత్రతోపాటు భాషను ఒక అంశంగా మాత్రమే పరిగణించాలి.
* ఆర్థిక, పాలనాంశాలను పరిగణనలోకి తీసుకోవాలి.
* దేశ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకోవాలి.
* అంతేకాకుండా అంతవరకు ఉన్న నాలుగు రకాల రాష్ట్రాలు (Part - A, B, C, D) లను రద్దుచేసి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించాలని సూచించింది. దీనికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం 7 వ రాజ్యాంగ సవరణ ద్వారా 7 వ భాగాన్ని రాజ్యాంగం నుంచి తొలగిస్తూ 14 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాలను ఏర్పాటు చేసింది.
* అయితే భాషాప్రయుక్త రాష్ట్రాల డిమాండుతో కాకుండా పాలనా వికేంద్రీకరణ, అభివృద్ధిలో వెనుకబాటు, సంస్కృతి పరిరక్షణ మొదలైన నూతన ధోరణులతో రాష్ట్రాల డిమాండ్లు ప్రస్తుతం కొనసాగుతూనే ఉన్నాయి. 2014 లో నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంతో భారతదేశం 29 రాష్ట్రాల యూనియన్ అయింది.
భారతదేశంలో అనేక ప్రాంతాల్లో ప్రత్యేక రాష్టాల డిమాండ్లు వస్తున్నాయి. వాటిలో ముఖ్యమైనవి....

Posted Date : 29-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌