• facebook
  • whatsapp
  • telegram

భారత రాజ్యాంగం - ముఖ్య లక్షణాలు

భారత రాజ్యాంగ పరిషత్తు సభ్యులు ప్రపంచంలోని అనేక రాజ్యాంగాలను లోతుగా అధ్యయనం చేసి మన రాజ్యాంగాన్ని రూపొందించారు. ఈ కసరత్తు పూర్తవడానికి 2 సంవత్సరాల, 11 నెలల, 18 రోజులు పట్టింది. దేశంలోని రాజ్యాంగ వ్యవస్థలు సక్రమంగా పనిచేయడానికి, పొరుగుదేశాల్లో మాదిరిగా మనదేశంలో అంతర్గత తిరుగుబాట్లు, రాజ్యాంగ వ్యవస్థల పతనం జరగకపోవడానికి ప్రధాన కారణం... రాజ్యాంగంలోని విశిష్ట లక్షణాలే!

  భారత రాజ్యాంగ కీలక లక్షణం... దేశాన్ని 'సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా ప్రకటించడం. ఇందులోని ప్రతి పదానికి విస్తృతమైన అర్ధం ఉంది.


సార్వభౌమత్వం: ప్రతి స్వతంత్ర రాజ్యానికి ఉండాల్సిన ముఖ్యలక్షణం సార్వభౌమత్వం. ఎలాంటి విదేశీ లేదా స్వదేశీ శక్తుల నియంత్రణలో ప్రభుత్వం లేకపోవడమే సార్వభౌమత్వం. భారత్ తన విధానాలను తాను రూపొందించుకుంటుంది.


సామ్యవాద: రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఈ పదం లేదు. 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సామ్యవాద, లౌకిక పదాలను చేర్చారు. సామ్యవాదం అనే పదం ముఖ్యంగా ఆర్థిక విధానాల రూపకల్పనలో ప్రభుత్వ దృక్పథాన్ని తెలియజేస్తుంది. ఆర్థిక వ్యవస్థలో ప్రముఖ పాత్ర పోషించడం ద్వారా సమాజంలోని అసమానతలను తొలగించడానికి ప్రభుత్వం కృషిచేస్తుందని రాజ్యాంగం ప్రకటించింది.


సామ్యవాద: రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఈ పదం లేదు. 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సామ్యవాద, లౌకిక పదాలను చేర్చారు. సామ్యవాదం అనే పదం ముఖ్యంగా ఆర్థిక విధానాల రూపకల్పనలో ప్రభుత్వ దృక్పథాన్ని తెలియజేస్తుంది. ఆర్థిక వ్యవస్థలో ప్రముఖ పాత్ర పోషించడం ద్వారా సమాజంలోని  అసమానతలను తొలగించడానికి ప్రభుత్వం కృషిచేస్తుందని రాజ్యాంగం ప్రకటించింది.


లౌకిక: భారతదేశంలో ఎలాంటి అధికారిక మతం లేదు. రాజ్యం ఏ మతాన్నీ అనుసరించదు. దేశంలోని ప్రతి వ్యక్తీ తనకు నచ్చిన మతాన్ని నమ్మవచ్చు, ఆచరించవచ్చు. రాజ్యం ఏ వ్యక్తీ లేదా సంస్థ పట్ల మతప్రాతిపదికన వివక్ష చూపదు.
 ప్రజాస్వామ్య, గణతంత్ర: రాజ్యాంగ ప్రవేశిక ప్రకారం భారత రాజ్యాంగాన్ని ప్రజలు రూపొందించుకున్నారు. అంటే ప్రభుత్వ ఏర్పాటుకు మూలకారణం ప్రజలే. ఈ ప్రజాస్వామ్య స్ఫూర్తిని వయోజన ఓటు హక్కు, ఎన్నికలు, ప్రాథమిక హక్కులు, బాధ్యతాయుత ప్రభుత్వ ఏర్పాటు రూపంలో రాజ్యాంగంలో పొందుపరచారు.
 భారత రాజ్యాంగం ప్రకారం రాజ్యాధినేత (అధ్యక్షుడు) బ్రిటిష్ రాజు మాదిరిగా వంశపారంపర్యంగా కాకుండా, పరోక్షంగా ప్రజల చేత ఎన్నికవుతారు. ఇది గణతంత్ర రాజ్యానికి ఉండే ప్రధాన లక్షణం.


ఇతర ముఖ్య లక్షణాలు


సుదీర్ఘ లిఖిత రాజ్యాంగం: భారత రాజ్యాంగం ప్రపంచ దేశాల లిఖిత రాజ్యాంగాల్లోకెల్లా అతి పెద్దది. రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు 395 ఆర్టికల్స్, 8 షెడ్యూల్స్, 22 భాగాలుగా ఉండేది. దీన్ని దృష్టిలో ఉంచుకుని హెచ్.వి. కామత్ భారత రాజ్యాంగాన్ని ఐరావతంతో పోల్చారు.

 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఏర్పాటు దగ్గర్నుంచి, ప్రాథమిక హక్కులు, విధులు, ఆదేశిక సూత్రాలు, ప్రభుత్వ పాలన, కార్యనిర్వాహక వర్గం, న్యాయవ్యవస్థ, తదితర అంశాలను రాజ్యాంగంలో విపులంగా చర్చించారు.
 దృఢ, అదృఢ లక్షణాల సమ్మేళనం: భారత రాజ్యాంగాన్ని సవరించే పద్ధతిని బట్టి దృఢ, అదృఢ లక్షణాల సమ్మేళనంగా విశ్లేషకులు వర్ణించారు. కొన్ని అంశాల్లో సాధారణ మెజారిటీ ద్వారా పార్లమెంటు రాజ్యాంగాన్ని సవరించవచ్చు. ఇది దృఢ రాజ్యాంగ లక్షణం.
 మరికొన్ని అంశాలను సవరించడానికి పార్లమెంటులో మూడొంతుల మెజారిటీ, సగానికిపైగా రాష్ట్రాల ఆమోదం అవసరం. ఇది అదృఢ రాజ్యాంగ లక్షణం. రాజ్యాంగంలోని 368వ నిబంధన రాజ్యాంగ సవరణ విధానాన్ని విశదీకరిస్తుంది. మన రాజ్యాంగ నిర్మాతలు ఈ విధానాన్ని దక్షిణాఫ్రికా రాజ్యాంగం నుంచి స్వీకరించారు.
 కొత్త రాష్ట్రాల ఏర్పాటు, రాష్ట్రాల పేర్లు, సరిహద్దులు మార్చడం, విధాన పరిషత్‌ను రద్దు చేయడం, ఏర్పాటు చేయడం, పౌరసత్వానికి సంబంధించిన అంశాలు మొదలైనవాటిని సాధారణ మెజారిటీ ద్వారా సవరించవచ్చు.
 ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాల సవరణ, నూతన రాజ్యాంగబద్ధ సంస్థల ఏర్పాటుకు రెండింట మూడొంతుల మెజారిటీ అవసరం.
 రాష్ట్రపతి ఎన్నిక, అధికారాలు, తదితర కీలక అంశాల్లో సవరణలు చేయాలంటే పార్లమెంటులో రెండింట మూడొంతుల మెజారిటీతోపాటు దేశంలోని సగానికిపైగా రాష్ట్రాల శాసనసభల్లో కూడా మూడొంతుల మెజారిటీ అవసరం.


ఏకకేంద్ర లక్షణాలు ఉన్న సమాఖ్య: మనదేశంలో బ్రిటన్‌లో మాదిరిగా పూర్తి ఏకకేంద్ర లక్షణాలుగానీ, అమెరికాలో మాదిరిగా పూర్తి సమాఖ్య వ్యవస్థ లక్షణాలుగానీ లేవు. అనేక అంశాల్లో సమాఖ్య లక్షణాలు ఉన్నప్పటికీ, దేశ సమగ్రతను దృష్టిలో ఉంచుకుని రాజ్యాంగ నిర్మాతలు ఏకకేంద్ర వ్యవస్థ వైపు మొగ్గుచూపారు. అందుకే రాజ్యాంగంలో సమాఖ్య అనే పదాన్ని ఎక్కడా ఉపయోగించలేదు. భారతదేశాన్ని రాష్ట్రాల సముదాయంగానే పేర్కొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాతలు ఈ లక్షణాన్ని కెనడా రాజ్యాంగం నుంచి గ్రహించారు.


ఏకకేంద్ర లక్షణాలు: ఒకే రాజ్యాంగం, ఒకే పౌరసత్వం, ఒకే ఎన్నికల సంఘం, అఖిల భారత సర్వీసులు కేంద్రం అధీనంలో ఉండటం, ఏకీకృత న్యాయవ్యవస్థ మొదలైనవి.


సమాఖ్య లక్షణాలు: లిఖిత రాజ్యాంగం, దృఢ రాజ్యాంగం, కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల విభజన, స్వతంత్ర న్యాయ వ్యవస్థ, ద్వంద్వ సభా విధానం మొదలైనవి.


పార్లమెంటరీ ప్రభుత్వ విధానం: బ్రిటన్ మాదిరిగా భారతదేశం పార్లమెంటరీ ప్రభుత్వ విధానాన్ని అనుసరిస్తుంది. కేంద్రంలో, రాష్ట్రాల్లో పార్లమెంటరీ పద్ధతిలో ప్రభుత్వాలను ఏర్పాటుచేస్తారు. దీని ప్రకారం ప్రభుత్వంలో నామమాత్ర, వాస్తవ కార్యనిర్వాహకులు ఉంటారు.
 కేంద్రంలో రాష్ట్రపతి, రాష్ట్రాల్లో గవర్నర్‌లు నామమాత్ర అధిపతులుగా, ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రులు వాస్తవ అధిపతులుగా వ్యవహరిస్తారు.

ఏకీకృత న్యాయవ్యవస్థ: రాజ్యాంగం దేశంలో ఏకీకృత న్యాయవ్యవస్థను ఏర్పాటు చేసింది. రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించడం, అమలు చేయడం, దిగువ కోర్టులపై నియంత్రణ సుప్రీంకోర్టుకు మాత్రమే ఉంటుంది.
 రాజ్యాంగంలోని 50వ నిబంధన న్యాయశాఖను కార్యనిర్వాహక శాఖ నుంచి వేరుచేస్తుంది. తద్వారా న్యాయవ్యవస్థకు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించారు.
  భారత రాజ్యాంగంలోని మరో విశిష్ట లక్షణం న్యాయ సమీక్ష. శాసనశాఖ రూపొందించిన చట్టాలు రాజ్యాంగ వ్యతిరేకంగా ఉంటే వాటిని కొట్టివేసే అధికారం న్యాయవ్యవస్థకు కట్టబెట్టారు. దీన్ని న్యాయ సమీక్ష అంటారు. ఈ విధానాన్ని భారత రాజ్యాంగ నిర్మాతలు అమెరికా రాజ్యాంగం నుంచి స్వీకరించారు.

సార్వజనీన వయోజన ఓటుహక్కు:భారత రాజ్యాంగంలోని 326వ నిబంధన సార్వజనీన ఓటు హక్కును కల్పిస్తుంది. నిర్ణీత వయసు వచ్చిన తర్వాత కులం, మతం, లింగ, ప్రాంత, వర్గ వివక్షత లేకుండా అందరికీ ఓటు హక్కు లభిస్తుంది.
 రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు నిర్ణీత వయసు 21 సంవత్సరాలుగా ఉండేది. 1989లో 61వ రాజ్యాంగ సవరణ ద్వారా ఓటు హక్కు కనీస వయసును 21 నుంచి 18 సంవత్సరాలకు తగ్గించారు.

ప్రాథమిక హక్కులు: రాజ్యాంగంలోని 3వ భాగంలో 12 నుంచి 35 నిబంధన వరకు ప్రాథమిక హక్కులను వివరించారు. ప్రస్తుతం సమానత్వ హక్కు, స్వాతంత్య్రపు హక్కు, పీడనాన్ని నిరోధించే హక్కు, మత స్వాతంత్య్రపు హక్కు, విద్య - సాంస్కృతిక హక్కు, రాజ్యాంగ పరిహార హక్కులు రాజ్యాంగంలో ఉన్నాయి.
 రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు నిర్ణీత వయసు 21 సంవత్సరాలుగా ఉండేది. 1989లో 61వ రాజ్యాంగ సవరణ ద్వారా ఓటు హక్కు కనీస వయసును 21 నుంచి 18 సంవత్సరాలకు తగ్గించారు.

ప్రాథమిక హక్కులు: రాజ్యాంగంలోని 3వ భాగంలో 12 నుంచి 35 నిబంధన వరకు ప్రాథమిక హక్కులను వివరించారు. ప్రస్తుతం సమానత్వ హక్కు, స్వాతంత్య్రపు హక్కు, పీడనాన్ని నిరోధించే హక్కు, మత స్వాతంత్య్రపు హక్కు, విద్య - సాంస్కృతిక హక్కు, రాజ్యాంగ పరిహార హక్కులు రాజ్యాంగంలో ఉన్నాయి.

  ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించి రాజ్యాంగబద్ధ హక్కుగా మార్చారు. 32వ నిబంధనలో పొందుపరచిన రాజ్యాంగ పరిహారపు హక్కు అత్యంత కీలకమైంది. పౌరులు తమ హక్కులకు భంగం వాటిల్లినప్పుడు దీన్ని ఉపయోగించి న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు.

ఆదేశిక సూత్రాలు: భారత రాజ్యాంగంలో 4వ భాగం ఆదేశిక సూత్రాలను వివరిస్తుంది. వీటిని మన రాజ్యాంగ వేత్తలు ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి స్వీకరించారు. వీటిని అమలు చేయడం ద్వారా శ్రేయో రాజ్యం లేదా సంక్షేమ రాజ్యం స్థాపించాలనేది రాజ్యాంగవేత్తల అభిలాష.
  విధానాల రూపకల్పనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశిక సూత్రాలు మార్గదర్శకంగా పనిచేస్తాయి. కానీ వీటికి న్యాయస్థానాల రక్షణ లేదు.ప్రాథమిక విధులు: రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ప్రాథమిక విధులు లేవు. స్వరణ్‌సింగ్ కమిటీ సిఫారసులతో 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 10 ప్రాథమిక విధులను రాజ్యాంగంలో చేర్చారు.
 రాజ్యాంగంలోని 4ఎ భాగంలో 51ఎ నిబంధన కింద వీటిని పొందుపరచారు.
 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 6-14 ఏళ్ల మధ్య పిల్లలందరికీ ప్రాథమిక విద్యను అందించడాన్ని 11వ ప్రాథమిక విధిగా చేర్చారు. అందువల్ల ప్రస్తుతం 11 ప్రాథమిక విధులు భారత రాజ్యాంగంలో ఉన్నాయి.


అత్యవసర పరిస్థితులు


దేశంలో అవాంఛిత సంఘటనలు జరిగినప్పుడు, రాజ్యాంగ సంక్షోభం ఏర్పడినప్పుడు అత్యవసర పరిస్థితిని విధించవచ్చు. మూడు రకాల అత్యవసర పరిస్థితులను రాజ్యాంగంలో పొందుపరచారు...


352వ నిబంధన: దేశం మీద యుద్ధం లేదా విదేశీ దురాక్రమణలు సంభవించినప్పుడు, దేశంలో లేదా దేశంలోని కొన్ని ప్రాంతాల్లో అంతర్గత తిరుగుబాట్లు వచ్చినప్పుడు ఈ నిబంధనను ఉపయోగించి అత్యవసర పరిస్థితి విధించవచ్చు. దీన్ని జాతీయ అత్యయిక పరిస్థితి అంటారు.


356వ నిబంధన: ఏదైనా ఒక రాష్ట్రం లేదా కొన్ని రాష్ట్రాల్లో రాజ్యాంగ వ్యవస్థ విఫలమైనప్పుడు అక్కడ అత్యవసర పరిస్థితిని ప్రకటించవచ్చు. దీన్ని రాజ్యాంగబద్ధ అత్యయిక పరిస్థితి అంటారు.


360వ నిబంధన: దేశ ఆర్థిక స్థిరత్వానికి ముప్పు వాటిల్లినప్పుడు ఈ నిబంధన ద్వారా అత్యవసర పరిస్థితి విధిస్తారు. దీన్ని ఆర్థిక అత్యయిక పరిస్థితి అంటారు.

Posted Date : 29-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌