• facebook
  • whatsapp
  • telegram

 పట్టణ ప్రభుత్వాలకు రాజ్యాంగ హోదా

పట్టణ పాలనకు పట్టాభిషేకం!

   పట్టణాలు, నగరాల్లో పౌరులకు మెరుగైన సేవలు అందించడంలో పట్టణ స్థానిక స్వపరిపాలనా సంస్థలు కీలక భూమిక పోషిస్తాయి. అందుకే అవి రాష్ట్ర ప్రభుత్వ చట్టాలకు అనుగుణంగా పనిచేస్తూనే పాలనా వ్యవహారాల్లో ఆర్థికంగా, రాజకీయంగా స్వతంత్రంగా వ్యవహరించగలగాలి. అధికార వికేంద్రీకరణకు ప్రతిరూపాలుగా నిలిచేందుకు అవసరమైన సంస్థాగత నిర్మాణం వాటికి ఉండాలి. ఈ లక్ష్యాలు 74వ రాజ్యాంగ సవరణ చట్టంతో నెరవేరాయి. ఆ చట్టం పట్టణ స్థానిక స్వపరిపాలనా వ్యవస్థకు రాజ్యాంగ గుర్తింపును ఇచ్చింది. పట్టణ ప్రభుత్వాలు విజయవంతంగా పనిచేసేందుకు దోహదపడింది. ఈ మౌలికాంశాలపై పోటీ పరీక్షార్థులకు సమగ్రమైన అవగాహన ఉండాలి. 

  ప్రధానమంత్రిగా పి.వి.నరసింహారావు ఉన్నప్పుడు ప్రభుత్వం 74వ రాజ్యాంగ సవరణ చట్టం (1992) ద్వారా పట్టణ స్థానిక స్వపరిపాలనా సంస్థలకు రాజ్యాంగ హోదా కల్పించింది. ఇది 1993, జూన్‌ 1 నుంచి అమల్లోకి వచ్చింది. దాని ద్వారా రాజ్యాంగానికి ఖిశ్బ్రీత్శి అనే కొత్త భాగాన్ని చేర్చారు. ఇందులో ఆర్టికల్‌ 243్బశ్శి నుంచి  243్బ్ట్రబ్శి వరకు మొత్తం 18 రకాల ఆర్టికల్స్‌లో పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థల పరిపాలనా విధానాన్ని వివరించారు.

ఆర్టికల్‌ 243(P): పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థలకు సంబంధించిన నిర్వచనాలు.

మున్సిపల్‌ ఏరియా: గవర్నర్‌ నోటిఫై చేసిన ఒక మున్సిపాలిటీలోని ప్రాదేశిక ప్రాంతం అని అర్థం.

మున్సిపాలిటీ: ఆర్టికల్‌ 243్బశ్శీ ప్రకారం ఏర్పాటైన పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ.

వార్డు కమిటీ: ఆర్టికల్‌ 243్బళ్శీ ప్రకారం ఏర్పాటైన కమిటీ అని అర్థం.

మెట్రోపాలిటన్‌ ప్రాంతం: పది లక్షలు లేదా అంతకంటే ఎక్కువ జనాభా ఉన్న నగరం.


జిల్లా: ఒక రాష్ట్రంలోని జిల్లా.


జనాభా: చివరిసారిగా జనాభా లెక్కల సేకరణ జరిగి నోటిఫై అయిన సందర్భంలో నిర్ధారించిన జనాభా. (ప్రస్తుతం 2011 జనాభా గణాంకాలను ఆధారంగా పరిగణిస్తున్నారు.)


ఆర్టికల్‌ 243(Q): పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థల వ్యవస్థాపన: దేశంలో మూడు రకాల పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థల ఏర్పాటును నిర్దేశించారు.


1) నగర పంచాయతీ: గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతంగా పరివర్తన చెందుతూ, వేగంగా అభివృద్ధి చెందే ప్రాంతాన్ని నగర పంచాయతీగా గుర్తిస్తారు. దీని జనాభా 20,000-40,000.


2) మున్సిపాలిటీ: 40 వేల నుంచి 3 లక్షల వరకు జనాభా ఉన్న పట్టణాలను మున్సిపాలిటీ/మున్సిపల్‌ కౌన్సిల్‌గా ఏర్పాటు చేస్తారు.


3) మున్సిపల్‌ కార్పొరేషన్‌: 3 లక్షలు కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాలను మున్సిపల్‌ కార్పొరేషన్లుగా ఏర్పాటు చేస్తారు. 10 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాన్ని మెట్రోపాలిటన్‌ మహానగరంగా పేర్కొంటారు.

ఆర్టికల్‌ 243(R): మున్సిపల్‌ వ్యవస్థల సభ్యులు, అధ్యక్షుల ఎన్నిక విధానం: నగర పంచాయతీలోని వార్డు సభ్యులు, మున్సిపల్‌ కౌన్సిల్‌లోని కౌన్సిలర్లు, మున్సిపల్‌ కార్పొరేషన్, మెట్రోపాలిటన్‌ మహానగరాల్లోని కార్పొరేటర్లు ఓటర్ల ద్వారా ప్రత్యక్షంగా రహస్య ఓటింగ్‌ పద్ధతిలో ఎన్నికవుతారు.

* మున్సిపల్‌ కౌన్సిల్‌ ఛైర్మన్, వైస్‌ ఛైర్మన్, మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్, డిప్యూటీ మేయర్, మెట్రోపాలిటన్‌ మహానగర మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక పరోక్షంగా జరుగుతుంది.

* నగర పంచాయతీ అధ్యక్షుడి ఎన్నిక ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా నిర్వహించవచ్చు. ఏ విధంగా నిర్వహించాలనేది రాష్ట్ర శాసనసభ రూపొందించే చట్టం నిర్ణయిస్తుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నగర పంచాయతీ అధ్యక్ష ఎన్నిక పరోక్ష పద్ధతిలో జరుగుతుంది.

* లోక్‌సభ సభ్యులు, శాసనసభ్యులు తాము ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాల పరిధిలోని పట్టణ, నగరపాలక సంస్థల్లో ఎక్స్‌ అఫీషియో సభ్యులుగా కొనసాగుతారు.

* రాజ్యసభ సభ్యులు, శాసనమండలి సభ్యులు వారు ఏ పట్టణ/నగరపాలక సంస్థలో ఓటరుగా నమోదై ఉంటారో ఆ సంస్థల్లో పదవిరీత్యా ఎక్స్‌ అఫీషియో సభ్యులుగా కొనసాగుతారు.

* ఎక్స్‌ అఫీషియో సభ్యులకు పట్టణ, నగరపాలక సంస్థల్లో తీర్మానాలపై జరిగే ఓటింగ్‌లో ఓటు హక్కు కల్పించే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేయవచ్చు.

* ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2009లో జారీ చేసిన ఆదేశాల ప్రకారం ఎక్స్‌ అఫీషియో సభ్యులకు పట్టణ, నగరపాలక సంస్థల్లో ఓటు హక్కు కల్పించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ విధానం కొనసాగుతోంది.

ఆర్టికల్‌ 243(S): వార్డు కమిటీల ఏర్పాటు:  పట్టణ, నగరపాలక సంస్థలను పరిపాలనా సౌలభ్యం కోసం వార్డులు/డివిజన్లుగా విభజిస్తారు. 3 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న మున్సిపల్‌ సంస్థల్లో వార్డు/డివిజన్‌ కమిటీలను ఏర్పాటు చేసుకునే వీలుంటుంది. రెండు లేదా అంతకంటే ఎక్కువ వార్డులు/డివిజన్లు కలిసి వార్డు కమిటీ లేదా డివిజన్‌ కమిటీగా ఏర్పాటైనప్పుడు వాటిలోని సభ్యులు తమలో నుంచి ఒకరిని వార్డు/డివిజన్‌ కమిటీకి అధ్యక్షుడిగా ఎన్నుకుంటారు. ఈ వార్డు/డివిజన్‌ కమిటీలు కార్పొరేటర్లకు పరిపాలనకు సంబంధించిన అంశాలపై సూచనలు ఇస్తాయి. గుజరాత్‌లో ఏర్పాటుచేసిన బహుళ సభ్య వార్డు కమిటీలను సుప్రీంకోర్టు సమర్థించింది.

ఆర్టికల్‌ 243(T): రిజర్వేషన్లు:  పట్టణ, నగరపాలక సంస్థలకు జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి, వారి జనాభా ఆధారంగా రిజర్వేషన్లు కల్పించాలి. వీరికి నిర్దేశించిన రిజర్వేషన్లలో 1/3వ వంతు స్థానాలను ఈ వర్గాల మహిళలకు కేటాయించాలి. మొత్తం రిజర్వేషన్లలో మహిళలకు 1/3వ వంతు ఇవ్వాలి. వెనుకబడిన వర్గాలకు (ఓబీసీ) రిజర్వేషన్లు కల్పించే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వాల విచక్షణకే వదిలిపెట్టారు. మైనార్టీ వర్గాల వారికి సముచిత ప్రాతినిధ్యం లేకపోతే మున్సిపల్‌ కౌన్సిల్‌లో ఇద్దరిని, మున్సిపల్‌ కార్పొరేషన్‌లో ముగ్గురిని కో-ఆప్టెడ్‌ సభ్యులుగా నామినేట్‌ చేయవచ్చు.

ఆర్టికల్‌ 243(U): పదవీకాలం: పట్టణ, నగరపాలక సంస్థల పదవీకాలం 5 సంవత్సరాలు. పదవీకాలం ముగియక ముందే వీటిని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయవచ్చు. ఈ విధంగా రద్దయిన వాటికి తప్పనిసరిగా 6 నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాలి. అన్ని స్థాయుల్లోనూ సభ్యులు, అధ్యక్షుల పదవీ కాలం 5 సంవత్సరాలు.

ఆర్టికల్‌ 243(V): అర్హతలు, అనర్హతలు: 21 సంవత్సరాలు నిండి ఉండాలి. సంబంధిత స్థానిక సంస్థల ఓటర్ల జాబితాలో పేరు నమోదై ఉండాలి. 1995, మే 30 తర్వాత వివాహమైన దంపతులకు ఇద్దరు కంటే ఎక్కువ సంతానం ఉండకూడదు. దివాళాతీసి ఉండకూడదు.


ఆర్టికల్‌ 243(W): అధికారాలు - విధులు:  74వ రాజ్యాంగ సవరణ చట్టం (1992) ద్వారా పట్టణ, నగర పాలక సంస్థలకు బదిలీ చేయాల్సిన 18 రకాల అధికారాలు, విధులను రాజ్యాంగంలోని 12వ షెడ్యూల్‌లో పొందుపరిచారు. 

ఆర్టికల్‌ 243(X): ఆర్థిక వనరులు, పన్నులు:  రాష్ట్ర శాసనసభ నిర్ణయించిన మేరకు పట్టణ, నగరపాలక సంస్థలు పన్నులు విధించి, వసూలు చేసుకోవచ్చు. మున్సిపల్‌ సంస్థలు తమ మొత్తం ఆదాయంలో 2/3వ వంతు స్థానిక పన్నుల ద్వారానే సమకూర్చుకుంటాయి. స్థానిక స్వపరిపాలన సంస్థల పన్నుల ఆదాయంలో 1/4వ వంతు ఆక్ట్రాయ్‌ పన్ను ద్వారానే సమకూర్చుకుంటాయి.

పన్నులు: ఇంటి పన్ను, తాగునీటి పన్ను, వినోదపు పన్ను, మార్కెట్లు, సంతలపై పన్ను, ఖాళీ స్థలాలపై పన్ను, ప్రకటనలపై పన్ను, విరాళాలు, జరిమానాలు, సెల్‌ఫోన్‌ టవర్లపై లభించే ఆదాయం, ఆస్తుల బదిలీపై పన్ను, భవన నిర్మాణ అనుమతులపై పన్ను.


ఆర్టికల్‌ 243(Y): రాష్ట్ర ఆర్థిక సంఘం: ఆర్టికల్‌ 243్బఖ్శి లో పేర్కొన్న రాష్ట్ర ఆర్థిక సంఘం ఆర్టికల్‌ 243్బ్త్శ్ర కు కూడా వర్తిస్తుంది. రాష్ట్ర ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు రాష్ట్ర ప్రభుత్వం పట్టణ, స్థానిక సంస్థలకు ఆర్థిక వనరులను మంజూరు చేస్తుంది. అదనపు ఆర్థిక వనరుల సమీకరణపై రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇస్తుంది. గవర్నర్‌ ద్వారా కేంద్ర ఆర్థిక సంఘానికి ప్రతిపాదనలు పంపుతుంది. రాష్ట్ర ఆర్థిక సంఘం తన నివేదికను గవర్నర్‌కు సమర్పించగా, గవర్నర్‌ సంబంధిత నివేదికను శాసనసభకు సమర్పిస్తారు.

ఆర్టికల్‌ 243(Z): అకౌంటింగ్‌ అండ్‌ ఆడిటింగ్‌:  పట్టణ, నగరపాలక సంస్థల ఖాతాల నిర్వహణ, ఆడిటింగ్‌కు సంబంధించిన నియమ నిబంధనలను రాష్ట్ర శాసనసభ ఒక శాసనం ద్వారా రూపొందిస్తుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అన్ని స్థానిక సంస్థల ఆడిట్‌లను రాష్ట్ర ఆడిట్‌ సంచాలకుడు నిర్వహిస్తారు.

 ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మూడు రకాల ఆడిట్‌ను నిర్వహిస్తున్నారు. అవి 1) లోకల్‌ ఫండ్‌ ఆడిట్‌ 2) డిపార్ట్‌మెంటల్‌ ఆడిట్‌ 3) జనరల్‌ ఫండ్‌ ఆడిట్‌

ఆర్టికల్‌ 243(ZA): రాష్ట్ర ఎన్నికల సంఘం: ఆర్టికల్‌ 243్బర్శీ ద్వారా ఏర్పాటైన రాష్ట్ర ఎన్నికల సంఘం ఆర్టికల్‌ 243్బ్ట్రత్శి కు కూడా వర్తిస్తుంది. ఇది పట్టణ, నగరపాలక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తుంది. మున్సిపల్‌ వ్యవస్థలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఓటర్ల జాబితా రూపకల్పన, ఎన్నికల నిర్వహణ, పర్యవేక్షణ, నియంత్రణకు సంబంధించిన అధికారాలన్నీ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఉంటాయి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను గవర్నర్‌ నియమిస్తారు. తొలగించే అధికారం మాత్రం రాష్ట్రపతికే ఉంటుంది.

ఆర్టికల్‌ 243(ZB): కేంద్రపాలిత ప్రాంతాలకు వర్తింపు: 


  74వ రాజ్యాంగ సవరణ చట్టం, 1992లోని అంశాలు కేంద్రపాలిత ప్రాంతాలకు వర్తింపజేయాలా, లేదా అనేది రాష్ట్రపతి గెజిట్‌ నోటిఫికేషన్‌ ద్వారా నిర్ణయిస్తారు. కేంద్రపాలిత ప్రాంతాల్లోని పట్టణ స్థానిక పాలనపై కేంద్ర హోంశాఖ నియంత్రణ కలిగి ఉంటుంది. శాసనసభలు ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలైన దిల్లీ, పుదుచ్చేరి ప్రత్యేక చట్టాలను రూపొందించుకోవచ్చు. అయితే ఈ చట్టాలు కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఉండాలి.

ఆర్టికల్‌ 243(ZC): మినహాయించిన ప్రాంతాలు: 74వ రాజ్యాంగ సవరణ చట్టం నుంచి కొన్ని ప్రాంతాలను మినహాయించారు. అవి * ఆర్టికల్‌ 244(1) లో పేర్కొన్న షెడ్యూల్డ్‌ ప్రాంతాలు * ఆర్టికల్‌ 244(2) లో పేర్కొన్న ఆదివాసీ ప్రాంతాలు * నాగాలాండ్, మిజోరాం, మేఘాలయ రాష్ట్రాల్లో ఉన్న ట్రైబల్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ ప్రాంతాలు. మణిపుర్‌లోని కొండప్రాంతాలు, పశ్చిమ బెంగాల్‌లో డార్జిలింగ్‌ ప్రాంతంలోని గూర్ఖాహిల్‌ కౌన్సిల్‌ ప్రాంతం.

ఆర్టికల్‌ 243(ZD): జిల్లా ప్రణాళికా బోర్డు: జిల్లాలోని గ్రామీణ, పట్టణ, నగర ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలను జిల్లా ప్రణాళికా బోర్డు రూపొందిస్తుంది. ఈ బోర్డుకు సంబంధించిన నియమ నిబంధనలను రాష్ట్ర శాసనసభ రూపొందిస్తుంది.

* జిల్లా ప్రణాళికా బోర్డులోని మొత్తం సభ్యుల్లో 4/5వ వంతు మందికి తక్కువ కాకుండా సంబంధిత జిల్లాలోని పంచాయతీలు, మున్సిపాలిటీలకు ఎన్నికైన సభ్యులు ఎన్నుకుంటారు. ఇలా ఎన్నికయ్యే సభ్యుల్లో మున్సిపాలిటీలు, పంచాయతీలకు చెందినవారు ఎంతమంది ఉండాలనేది ఆ జిల్లాలోని గ్రామీణ, పట్టణ ప్రాంత జనాభా నిష్పత్తిపై ఆధారపడి ఉంటుంది.

* ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో జిల్లా ప్రణాళికా బోర్డుకు ఎక్స్‌ అఫీషియో ఛైర్మన్‌గా జిల్లా పరిషత్‌ ఛైర్మన్, మెంబర్‌ సెక్రటరీగా కలెక్టర్‌ వ్యవహరిస్తున్నారు.

* జిల్లా ప్రణాళికా బోర్డులో మొత్తం సభ్యుల సంఖ్య 30. వీరిలో 24 మంది సభ్యులు ఎన్నికవుతారు. నలుగురు నామినేట్‌ అవుతారు. మిగిలినవారు కలెక్టర్, జడ్పీ ఛైర్మన్‌.

* జిల్లా ప్రణాళికా బోర్డు రూపొందించిన అభివృద్ధి ప్రణాళికను బోర్డు ఛైర్మన్‌ రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తారు.


ఆర్టికల్‌ 243(ZE): మెట్రోపాలిటన్‌ ప్రణాళికా సంఘం: మెట్రోపాలిటన్‌ మహానగరాల సమగ్ర అభివృద్ధికి మెట్రోపాలిటన్‌ ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటుచేయాలి. దీనిలో మొత్తం సభ్యుల సంఖ్య 24. వీరిలో 18 మంది ఎన్నిక ద్వారా, 4 మంది నామినేషన్‌ విధానం ద్వారా వస్తారు. ఛైర్మన్‌గా మెట్రోపాలిటన్‌ మహానగర మేయర్, మెంబర్‌ సెక్రటరీగా మున్సిపల్‌ కమిషనర్‌ వ్యవహరిస్తారు. మెట్రోపాలిటన్‌ ప్రణాళికా సంఘం తన నివేదికను రాష్ట్ర గవర్నర్‌కు సమర్పిస్తుంది. మరో నివేదికను కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు పంపుతుంది. 1964లో మన దేశంలో మొదటి పట్టణాభివృద్ధి సంస్థను దిల్లీలో ఏర్పాటుచేశారు.

ఆర్టికల్‌ 243 (ZF): పూర్వ శాసనాల కొనసాగింపు: 74వ రాజ్యాంగ సవరణ చట్టం (1992) 1993, జూన్‌ 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఇది అమల్లోకి వచ్చిన తేదీ నుంచి ఏడాది పాటు అంటే 1994, మే 31 వరకు వివిధ రాష్ట్రాల్లో అప్పటికే అమల్లో ఉన్న పూర్వశాసనాలు కొనసాగుతాయి.

* 74వ రాజ్యాంగ సవరణ చట్టం, 1992లోని మౌలికాంశాలకు భంగం కలగకుండా రాష్ట్ర ప్రభుత్వాలు సొంతంగా చట్టాలు రూపొందించి, అమలు చేసుకోవచ్చు.

ఆర్టికల్‌ 243(ZG): ప్రత్యేక న్యాయ ట్రైబ్యునళ్ల ఏర్పాటు: పట్టణ, నగరపాలక సంస్థలకు జరిగే ఎన్నికల సంబంధిత వివాదాల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక న్యాయ ట్రైబ్యునళ్లను ఏర్పాటు చేయాలి. దిగువ న్యాయస్థానాలు రాష్ట్ర జాబితాలో ఉండటంతో ప్రత్యేక న్యాయ ట్రైబ్యునళ్లను ఏర్పాటుచేసే అధికారం కూడా రాష్ట్ర ప్రభుత్వాలకే ఉంది.

* ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పట్టణ, నగరపాలక సంస్థలో జరిగే ఎన్నికల వివాదాల పరిష్కార బాధ్యతలను జిల్లా సెషన్స్‌ కోర్టులకు అప్పగించారు.

* జిల్లా సెషన్స్‌ కోర్టులు ఎన్నికల వివాదాలను విచారించే సందర్భంలో సాధారణ న్యాయస్థానాలుగా కాకుండా ప్రత్యేక న్యాయ ట్రైబ్యునళ్ల హోదాలో విచారిస్తాయి.

రచయిత: బంగారు సత్యనారాయణ

Posted Date : 15-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌