• facebook
  • whatsapp
  • telegram

ఆంధ్రలో సాంస్కృతిక పునరుజ్జీవనం

ఆంగ్ల సంస్కృతీ ప్రభావంతో 19వ శతాబ్దంలో ఆంధ్రదేశంలో కూడా సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమం/సాంఘిక మతసంస్కరణ ఉద్యమం ప్రారంభమైంది. దీనికి ఆంగ్ల విద్యా విధానం, క్రైస్తవ మిషనరీలు, పత్రికలు, సంఘ సంస్కర్తల కృషి... లాంటి అనేక కారణాలు దోహదం చేశాయి. 1835లో విలియం బెంటింగ్ భారతదేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టాడు. 1857 నాటికి మద్రాస్, కలకత్తా, బొంబాయి విశ్వవిద్యాలయాలను ఆంగ్లేయులు స్థాపించారు. పాశ్చాత్య భావనలైన హేతువాదం, మానవతావాదం, శాస్త్రీయ దృక్పథం లాంటివి అవలోకనం చేసుకున్న భారతీయులు, ఆంధ్రులు సాంఘిక దురాచారాలు, మూఢ నమ్మకాలపై పోరు ప్రారంభించారు. 1805లో లండన్ మిషనరీ సొసైటీ జమ్మలమడుగు (కడప) కేంద్రంగా, 1835లో అమెరికా బాప్టిస్ట్ సంఘం రాయలసీమ కేంద్రంగా, 1841లో చర్చి మిషన్ సొసైటీ కృష్ణా, గోదావరి ప్రాంతాలు కేంద్రంగా విద్యావ్యాప్తికి, మత ప్రచారానికి కృషిచేయడం ప్రారంభించాయి. గోస్పెల్ మిషన్ కడప, కర్నూలు జిల్లాల్లో కృషి చేసింది. రాజా రామమోహన్‌రాయ్, స్వామి దయానంద సరస్వతి లాంటి భారతీయులు ప్రారంభించిన సాంఘిక, మత సంస్కరణ ఉద్యమం ఆంధ్రులను అమితంగా ప్రభావితం చేసింది. బ్రహ్మసమాజ కార్యకలాపాలకు... రాజమండ్రి; సిద్ధాంతాలకు-బాపట్ల, ఆలోచనలకు-మచిలీపట్నం కేంద్రాలయ్యాయి. సత్య సంవర్థిని (కందుకూరి), హిందూ రిఫార్మర్ (మన్నవ బుచ్చయ్యపంతులు), జనానా (రాయసం వెంకట శివుడు) లాంటి పత్రికలు సంస్కరణోద్యమానికి ఎంతో ప్రచారం గావించాయి. ఆంధ్ర ప్రకాశిక, సుజన మనో ఉల్లాసిని, అమృత బోధిని లాంటి పత్రికలు కూడా తోడ్పాడ్డాయి. తొలి తెలుగు పత్రిక సత్యదూతను మద్రాస్ నుంచి బళ్లారి క్రైస్తవ సంఘం 1835లో వెలువరించింది. వృత్తాంతిని (1540), వర్ధమాన తరంగిణి (1842), హితవాది (1862), తత్త్వబోధిని (1864) లాంటి పత్రికలు కూడా మత ప్రచార దృక్పథంతోనే స్థాపించారు.

    1872లో ఉమా రంగనాయకులు నాయుడు సంపాదకత్వంలో మచిలీపట్నం నుంచి పురుషార్థ ప్రదాయని అనే పత్రిక వెలువడింది. 1874లో కందుకూరి వీరేశలింగం పంతులు వివేకవర్థిని పత్రికను స్థాపించారు. కొక్కొండ వెంకటరత్నం తన ఆంధ్రభాషా సంజీవని పత్రిక ద్వారా కందుకూరి భావాలను విమర్శించేవారు. దానికి అనుబంధంగా హస్యవర్థిని పత్రికను ప్రారంభించారు. కందుకూరి వీరేశలింగం కూడా హాస్య సంజీవని పత్రిక (1876)ను ప్రారంభించారు. మహిళా విద్యాభివృద్ధికోసం వీరేశలింగం సతిహిత బోధిని పత్రికను స్థాపించగా, మల్లాది వెంకటరత్నం (1893), రాయసం వెంకట శివుడు (1894) కలిసి తెలుగు జనానా పత్రికను ప్రారంభించారు. 1904లో వీరేశలింగం తెలుగు జనానా పత్రికకు సంపాదకుడిగా ఉండి విదేశీ నారీమణుల చరిత్రము అనే వ్యాసాన్ని ప్రచురించారు. అముద్రిత గ్రంథ చింతామణి అనే మాసపత్రికను నెల్లూరు నుంచి కె. రామకృష్ణయ్య వెలువరించారు. 1891లో న్యాపతి సుబ్బారావు ఆధ్వర్యంలో రాజమండ్రి నుంచి చింతామణి పత్రిక వెలువడింది. చిలకమర్తి రామచంద్ర విజయం, హేమలత, అహల్యాబాయి నవలలు చింతామణి పత్రికలో ప్రచురితమయ్యాయి. 1902లో మచిలీపట్నం నుంచి కొండా వెంకటప్పయ్య కృష్ణా పత్రికను స్థాపించగా, అది 1905 నుంచి ముట్నూరి కృష్ణారావు సంపాదకత్వంలో కొనసాగింది. దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు 1909లో బొంబాయి కేంద్రంగా ఆంధ్రపత్రిక (వారపత్రిక)ను ప్రారంభించగా, అది 1914 నుంచి మద్రాస్ కేంద్రంగా దినపత్రికగా మారింది. 1925లో మాడపాటి హనుమంతరావు ప్రారంభించిన గోల్కొండ పత్రిక సురవరం ప్రతాపరెడ్డి సంపాదకత్వంలో కొనసాగింది.

తొలి సంస్కర్తలు
 
 ఆంధ్రదేశ సంస్కరణ ఉద్యమాన్ని వీరేశలింగం ముందు యుగం, వీరేశలింగం యుగంగా వర్గీకరిస్తారు. భారత సాంస్కృతిక పునర్వికాస పితామహుడిగా రాజారామమోహన్‌రాయ్ పేరొందగా, ఆంధ్రదేశ సాంస్కృతిక పునర్వికాస పితామహుడిగా కందుకూరి కీర్తి గడించారు. మద్రాస్ కోర్టులో దుబాసీగా పనిచేసిన ఏనుగుల వీరాస్వామి సాంఘిక దురాచారాలు, వాటి కారణాలు వివరించాడు. కాశీయాత్రలు అనే గ్రంథాన్ని రచించాడు. మద్రాస్‌లోని హిందూ లిటరరీ సొసైటీలో సభ్యుడిగా ఉండేవాడు. వెన్నెలకంటి సుబ్బారావు బడి పుస్తకాల్లో మార్పులు చేయడం ద్వారా దేశీయ విద్యా లోపాలను సరిదిద్దాలని, ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టాలని సూచించాడు. రాజమండ్రికి చెందిన సామినేని ముద్దు నరసింహ నాయుడు హిత సూచని (1862) గ్రంథం రాసి సాంఘిక సంస్కరణల ఆవశ్యకతను వివరించాడు. కోమలేశ్వర శ్రీనివాస పిళ్లై స్త్రీ విద్యావ్యాప్తికి 70 వేల రూపాయలు విరాళంగా ఇచ్చాడు. నెల్లూరు ప్రాంతంలో కె. అనంతరామశాస్త్రి హరిజనోద్ధరణకు కృషి చేశాడు. విశాఖపట్నానికి చెందిన పరవస్తు వెంకట రంగాచార్యులు వితంతు వివేకం గ్రంథాన్ని రాసి స్త్రీ పునర్వివాహాలు శాస్త్రసమ్మతమేనని వాదించాడు. గాజుల లక్ష్మీనరసు సెట్టి మద్రాస్ నేటివ్ అసోసియేషన్ సంస్థను 1852, జనవరి 26న స్థాపించడమే కాకుండా, తన క్రిసెంట్ పత్రిక ద్వారా సాంఘిక, రాజకీయ చైతన్యానికి కృషిచేశాడు. వేదాంతాచారి అనే విద్యాశాఖ ఉద్యోగి బాల్య వివాహాలను నిషేధిస్తూ, హిందూ వివాహ విధానంలోని లోపాలను సవరిస్తూ శాసనాలు చేయాలని ప్రభుత్వానికి విన్నవించాడు. తల్లాప్రగడ సుబ్బారావు ఆంధ్ర ప్రాంతంలో దివ్య జ్ఞాన సమాజ సిద్ధాంతాలు ప్రచారం చేయడమే కాకుండా కల్నల్ ఆల్కాట్‌ను ఆంధ్రకు ఆహ్వానించి ఉద్యమాన్ని విస్తరింపజేశాడు. గాజుల లక్ష్మీనరసుసెట్టి వెట్టిచాకిరీ నిర్మూలనకు కృషిచేశారు. ఆత్మూరి లక్ష్మీనరసింహం స్త్రీల పునర్వివాహ సమాజంలో సభ్యుడిగా చేరి పోరాడాడు.

కందుకూరి వీరేశలింగం (ఆంధ్ర వైతాళికుడు)
 ఆంధ్ర పునర్వికాస పితామహుడు, దక్షిణ భారత విద్యాసాగరుడు, గద్య తిక్కనగా పేరొందిన కందుకూరి వీరేశలింగం పంతులు 1848, ఏప్రిల్ 16న రాజమహేంద్రవరంలో పున్నమ్మ, సుబ్బారాయుడు దంపతులకు జన్మించారు. దూసి సోమయాజులు వద్ద సంస్కృత భాషను అధ్యయనం చేశారు. 12వ ఏట ఏడేళ్ల రాజ్యలక్ష్మి (బాపమ్మ)తో వివాహం జరిగింది. 1872లో కోరంగి (తూ.గో. జిల్లా) ఆంగ్ల పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేరారు. మూఢనమ్మకాలు, సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడారు. బ్రహ్మ సమాజంలో చేరి రాజమండ్రి కేంద్రంగా సంఘ సంస్కరణకు పూనుకున్నారు. 1874లో ధవళేశ్వరంలో తొలి బాలికా పాఠశాలను స్థాపించారు. మద్రాస్‌లో సమర్థ రంగయ్యశెట్టి నుంచి గద్య తిక్కన బిరుదును పొందారు (1873). తొలి బాలికా పాఠశాలకు తొలి ప్రధానోపాధ్యాయుడిగా మల్లాది అచ్చన్న శాస్త్రిని నియమించారు. 1874లో వివేకవర్థిని మాసపత్రికను, దాని అనుబంధంగా 1876లో హాస్య సంజీవని పత్రికను ప్రారంభించారు. 1878లో రాజమండ్రిలో సంఘ సంస్కరణ సమాజం/ ప్రార్థనా సమాజాన్ని స్థాపించారు. స్త్రీ పునర్వివాహం న్యాయసమ్మతమే అని పేర్కొంటూ 1879, ఆగస్టు 3న రాజమండ్రిలో తొలి బహిరంగ ఉపన్యాసం చేశారు. 1880లో స్త్రీ పునర్వివాహ సమాజాన్ని ప్రారంభించారు. 1881, డిసెంబరు 11న రాజమండ్రిలో తొలి వితంతు వివాహాన్ని జరిపించారు. వరుడు గోకులపాటు శ్రీరాములు కాగా వధువు గౌరమ్మ. పెండ్లి మంత్రాలు చదివింది పానపక్కం ఆనందాచార్యులు. ఆర్థిక సహాయం అందించింది పైడా రామకృష్ణయ్య. 1881, డిసెంబరు 15న రెండో వితంతు పునర్వివాహం జరిపించారు. వరుడు రాచర్ల రామచంద్రరావు, వధువు రత్నమ్మ.

1882 అక్టోబరులో మూడో వితంతు వివాహాన్ని జరిపించారు. 1883లో సతిహితబోధిని పత్రికను ప్రారంభించారు. 1891, జులై 29న రాజమండ్రి నుంచి సత్యసంవర్థిని పత్రికను ప్రారంభించారు. 1905లో సత్యవాదిని పత్రిక ప్రారంభించారు. 1874లో నరసాపురం కేంద్రంగా ఘజియత్ అలీఖాన్ స్థాపించిన విద్వన్న మనోహరిణి పత్రిక 1875లో వివేకవర్థినిలో విలీనమైంది. చింతామణి పత్రికకు కూడా కందుకూరి సంపాదకుడిగా వ్యవహరించారు. 1897లో మద్రాసులో వితంతు శరణాలయాన్ని స్థాపించారు. ఆంగ్లేయులు 1893లో రావు బహదూర్ బిరుదు ప్రదానం చేశారు. 1898లో మహదేవ గోవింద్ రెనడే మద్రాసులో జరిగిన సంఘ సంస్కరణ సమావేశంలో కందుకూరిని దక్షిణ భారత విద్యాసాగరుడు అనే బిరుదుతో సత్కరించారు. (భారత దేశంలో తొలి వితంతు వివాహం జరిపించింది - ఈశ్వర చంద్ర విద్యాసాగరుడు). 1905లో రాజమండ్రిలో వితంతు శరణాలయాన్ని స్థాపించారు.
(నోట్: తొలి వితంతు శరణాలయాన్ని మద్రాస్ (1897)లో, రెండోది రాజమండ్రి (1905)లో స్థాపించారు). 1906, డిసెంబరు 16న హితకారిణి సమాజాన్ని రాజమండ్రిలో స్థాపించి తన మొత్తం ఆస్తిని ఆ సంస్థకు చెందేలా వీలునామా రాశారు. కందుకూరి 1919, మే 27న మద్రాసు (వేదవిలాస్)లో మరణించారు.

 

సాహిత్య సేవ
తెలుగు సాహిత్యంలో కందుకూరి అనేక నూతన ప్రక్రియలను ప్రారంభించారు. తెలుగులో తొలి సాంఘిక నవల రాజశేఖర చరిత్ర (వివేక చంద్రిక) రచించారు. దీన్ని అలీవర్ గోల్డ్ స్మిత్ రచన వికార్ ఆఫ్ వేక్‌ఫీల్డ్ ఆధారంగా రాశారు. జోనాథన్ స్విఫ్ట్ రచించిన గలీవర్ ట్రావెల్స్ ఆధారంగా సత్యరాజ పూర్వదేశ యాత్రలు గ్రంథాన్ని రచించారు. ఆంధ్ర కవుల చరిత్రం గ్రంథ రచన ద్వారా సాహిత్య చరిత్రకు శ్రీకారం చుట్టారు. కాళిదాసు, షేక్స్‌స్ఫియర్ నాటకాలను అనువదించారు.

తిర్య గ్విద్వాన్ మహాసభ, మూషికాసుర విజయం, వ్యవహార ధర్మబోధిని (ప్లీడర్ నాటకం), పెద్దయ్యగారి పెళ్లి లాంటి ప్రహసనాలు, నాటకాలు రచించారు. విక్టోరియా మహారాణి చరిత్ర (1897), నారద సరస్వతి సంవాదము, సత్యవతీ చరిత్రము, చమత్కార రత్నావళి బ్రహ్మవివాహం (కన్యాశుల్కం విమర్శ నాటకం) లాంటి రచనలు కూడా చేశారు. ది కమాండ్ ఆఫ్ కెరీర్స్‌కు అనువాదమే చమత్కార రత్నావళి. ఆంగ్లకవి షెరిటాన్ రచన డ్యుయన్నా ఆధారంగా రాగమంజిరి నాటకాన్ని రచించారు. షెరిటాన్ మరొక రచన ది రైవల్స్ అనువాదంగా కళ్యాణ కల్పవల్లి రచించారు. కందుకూరి అభినవాంధ్రకు ఆదిబ్రహ్మ అని ఆరుద్ర (భాగవతుల సదాశివ శంకరశాస్త్రి) పేర్కొనగా, చిలకమర్తి ''తన దేహం గేహం, కాలం, విద్య, ధనం ప్రజలకు అర్పించిన ఘనుడు కందుకూరి" అని పేర్కొన్నారు.
 

రఘుపతి వెంకటరత్నం నాయుడు (1862 - 1939)
1862లో మచిలీపట్నంలో జన్మించారు. మద్రాస్ క్రిస్టియన్ కళాశాలలో అభ్యసించారు. మన్నవ బుచ్చయ్య పంతులు ప్రేరణతో 1885లో బ్రహ్మసమాజంలో చేరారు. ఆంధ్రలో బ్రహ్మసమాజాన్ని బాగా ప్రచారం చేశారు. 1891లో సాంఘిక శుద్ధి సంఘం (సోషల్ ప్యూరిటి అసోసియేషన్ - SPA) స్థాపించారు. నోబుల్ కళాశాల (మచిలీపట్నం), మహబూబ్ కళాశాల (సికింద్రాబాద్), పిఠాపురం రాజా కళాశాలల్లో (కాకినాడ) అధ్యాపకుడిగా, ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. కాకినాడలో ఆంధ్రబ్రహ్మోపాసనా మందిరాన్ని స్థాపించారు. దేవదాసి వ్యవస్థ రద్దు కోసం కృషి చేశారు. (మతం ఆమోదించిన పాప పంకిలం). సోషల్ రిఫార్మర్, ఫెలోవర్కర్, బ్రహ్మ ప్రకాశిక, పీపుల్స్ ఫ్రండ్ లాంటి పత్రికలు నడిపారు. కాకినాడలో అనాథ, హరిజన బాలికల కోసం శరణాలయం, వసతి గృహం నిర్మించారు. బ్రహ్మర్షి, అభినవ సోక్రటీస్... లాంటి బిరుదులు పొందారు. విద్యారంగంలోని కృషికి ఆంగ్ల ప్రభుత్వం నైట్‌హుడ్ బిరుదుతో సత్కరించింది. పేద విద్యార్థుల కోసం తన గురువు మిల్లర్ పేరిట ఆంధ్ర బ్రహ్మధర్మ ప్రచారక నిధి అనే ఒక నిధిని ఏర్పాటు చేశారు.

గురజాడ అప్పారావు
   
1861, నవంబరు 30న విశాఖ జిల్లా, రాయవరంలో జన్మించారు. విజయనగరరాజు ఆనందగజపతి, రీనా మహారాణీ వద్ద దివాన్ (కార్యదర్శి)గా పనిచేశారు. దేవుడి కంటే మనిషి, మతం కంటే సమాజం ప్రధానం అని భావించేవారు. సంఘ సంస్కరణకు, దేశభక్తికి తన సాహిత్యం ద్వారా సేవలు అందించారు. 1896లో కన్యాశుల్కం నాటకాన్ని రచించి విజయనగర రాజుకు అంకితం చేశారు. 1910లో ముత్యాల సరాలు రచించారు. ఈ గ్రంథంలోనే అనేక దేశభక్తి గీతాలు ఉన్నాయి. దేశమంటే మట్టికాదోయ్, దేశమును ప్రేమించుమన్న, మంచి అన్నది మాల అయితే నేను మాలనే అగుదున్ లాంటి గీతాలు రచించారు. పుత్తడిబొమ్మ పూర్ణమ్మ, కన్యక, దిద్దుబాటు (తొలి తెలుగు కథానిక) లాంటి రచనలు చేశారు. 1913లో మద్రాస్ విశ్వవిద్యాలయ సెనేట్ మెంబరుగా నియమితులయ్యారు. నవయుగ వైతాళికుడు బిరుదు పొందారు. అమితమైన మితవాది, మితమైన తీవ్రవాదిగా పేరొందారు.
"ఆదికాలంలో తిక్కన, మధ్యకాలంలో వేమన, ఆధునిక కాలంలో గురజాడ తెలుగులో మహాకవులు" - శ్రీశ్రీ
"గురజాడ రచనలన్నీ నష్టమైపోయినా ఒక్క దేశభక్తి గీతం మిగిలినా చాలును అతడు ప్రపంచ కవుల్లో ఒక మహాకవిగా రుజువు కావడానికి" - శ్రీశ్రీ
"గురజాడ 1915లోనే చనిపోయినా 1915 తర్వాతే జీవించడం ప్రారంభించారు" - దేవులపల్లి కృష్ణశాస్త్రి
"వీరేశలింగం మహాపురుషుడు, గిడుగు మహాపండితుడు కాగా గురజాడ మహాకవి" - నార్ల వెంకటేశ్వరరావు
"కొత్త తరానికి గురువెవరంటే గురజాడ అని నేనంటాను" - దాశరథి
"తెలుగు ప్రజల స్మృతి పథంలో అప్పారావు సదా జీవిస్తాడు" - గిడుగు సీతాపతి

కొమర్రాజు వెంకట లక్ష్మణరావు (1877 - 1923)
 1877లో కృష్ణాజిల్లా, పెనుగంచిప్రోలులో జన్మించారు. నాగపూర్‌లో విద్యాభ్యాసం చేశారు. కేసరి, మరాఠా పత్రికల్లో వ్యాసాలు రాశారు. 1898లో కందుకూరి జనానా పత్రికలో కూడా వ్యాసాలు రాశారు. మునగాల ఎస్టేట్‌లో దివాన్‌గా పనిచేశారు. మునగాల రాజా నాయని వెంకట రంగారావు లక్ష్మణరావు కృషికి తోడ్పాటు అందించారు. 1901లో రావిచెట్టి రంగారావు గృహంలో శ్రీకృష్ణదేవరాయ ఆంధ్రభాషానిలయం (హైదరాబాద్)ను స్థాపించారు. 1904లో హనుమకొండలో రాజరాజనరేంద్ర ఆంధ్రభాషా నిలయం, సికింద్రాబాద్ (1905)లో ఆంధ్ర సంవర్థనీ గ్రంథాలయాలు నిర్మించారు. 1906లో విజ్ఞాన చంద్రికామండలిని స్థాపించారు. దీనికి నాయని వెంకట రంగారావు, గాడిచెర్ల హరిసర్వోత్తమరావు, అయ్యదేవర కాళేశ్వరరావు సహకరించారు. ఈ మండలి ప్రచురించిన కొన్ని గ్రంథాలు - జీవశాస్త్రం, కలరా, మలేరియా (ఆచంట లక్ష్మీపతి); రసాయన శాస్త్రం (విశ్వనాథ శర్మ), ఆంధ్రుల చరిత్ర (చిలుకూరి వీరభద్రరావు), అర్థశాస్త్రం (కట్టమంచి రామలింగారెడ్డి), రాణిసంయుక్త (పేలాల సుబ్బారావు). భారతదేశ భాషల్లోకెల్లా తొలి ప్రాంతీయ భాషా (తెలుగు) విజ్ఞాన సర్వసాన్ని ప్రచురించారు. (ఇది 3 సంపూటాలు, రెండువేల పేజీల్లో ఉంది). 1916లో కొవ్వూరులో ఆంధ్ర సారస్వత పరిషత్ స్థాపకుల్లో కొమర్రాజు లక్ష్మణరావు ఒకరు. ఆంధ్ర చరిత్ర పరిశోధక పితామహుడిగా పేరొందారు. 1923, జులై 12న కందుకూరి వీరేశలింగం పంతులు మరణించిన అదే గది (మద్రాసు)లో కొమర్రాజు మరణించారు.
"లక్ష్మణరావు ఒక వ్యక్తి కాదు ఒక సంస్థ". -కురగంటి సీతారామయ్య

"వారు మరికొన్నేళ్లు జీవించిఉంటే తెనుగు నేటి కంటే ఎంతో పరిపుష్టమై, పటిష్టమై ఉండేది" - విద్వాన్ విశ్వం

గిడుగు వెంకట రామమూర్తి (1862 - 1940)
గిడుగు 1862లో గంజాం జిల్లాలో జన్మించారు. పర్లాకిమిడిలో ఉపాధ్యాయుడిగా చేరారు. సవర భాష అభివృద్ధికి కృషి చేశారు. వ్యవహారిక భాషోద్యమ పితామహుడిగా పేరొందారు. తెలుగు అనే పత్రికను 1920లో ప్రారంభించారు. జయంతి రామయ్య లాంటివారువారు గిడుగుపై ధ్వజమెత్తారు. గురజాడ, పిట్సుదొర లాంటివారు గిడుగును సమర్థించారు. 1925లో తణుకులో జరిగిన ఆంధ్ర సాహిత్య పరిషత్తు సభలో వ్యవహారిక భాషను సమర్థిస్తూ ఉపన్యసించి సభ ఆమోదాన్ని పొందారు. సవర భాష అభివృద్ధి కోసం చేసిన కృషికి మద్రాస్ ప్రభుత్వం రావూసాహెబ్ బిరుదును ఇచ్చింది. పండిత బిషక్కుల భాషా భేషజం వ్యాసాన్ని తెలుగు పత్రికలో ప్రచురించారు. 1913లో మొమరాండమ్ ఆఫ్ మోడరన్ తెలుగు పేరుతో ఒక విన్నపాన్ని మద్రాసు ప్రభుత్వానికి గిడుగు సమర్పించారు.

 

దేశిరాజు పెదబాపయ్య:
26 ఏళ్ల వయసులో మరణించిన సంఘ సంస్కర్త. కందుకూరి వీరేశలింగం పంతులు శిష్యుడు. ఆడంబరాలకు వ్యతిరేకంగా ఉద్యమం నిర్వహించారు. బాపట్ల నివాసి. Voice of Truth పత్రిక, యువకుల ప్రార్థనా సభ (YMPU) ను స్థాపించారు.

జయంతి రామయ్య పంతులు:
తూర్పుగోదావరి జిల్లా ముక్తేశ్వరంలో జన్మించారు. పండితుడు, శాసన పరిశోధకుడు. పిఠాపురం రాజా కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేశారు. 1911లో ఆంధ్ర సాహిత్య పరిషత్‌లు ప్రారంభించారు. అయిదువేల తాళపత్ర గ్రంథాలు సేకరించి అధ్యయనం చేశారు. ఆంధ్ర వాఙ్మయ వికాస వైఖరి, డిఫెన్స్ ఆఫ్ లిటరరీ తెలుగు, ద్రవిడయన్ లెక్సికోగ్రఫీ లాంటి గ్రంథాలు రచించారు. సూర్యరాయాంధ్ర భాషా నిఘంటువును రూపొందించారు. శాసన పద్యమంజరి అనే పరిశోధనా సంపుటాలు రచించారు. (రెవెన్యూ అధికారిగా కూడా పనిచేశారు).

 

చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులు:
ఆంధ్రా మిల్టన్‌గా పేరొందారు. రాత్రి పాఠశాలలు, హరిజన పాఠశాలలు ఏర్పాటు చేశారు. అంధకవిగా పేరొందారు. బిపిన్ చంద్రపాల్ ఉపన్యాసాలను తెలుగులో అనువదించారు. రాజా రామ మోహన్‌ రాయ్ పాఠశాల స్థాపించారు. దేశమాత పత్రికను ప్రారంభించారు.

 

ఉన్నవ లక్ష్మీనారాయణ:
మాలపల్లి నవల రచించారు. దీన్ని బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించింది. 1902లో

 

బసవరాజు అప్పారావు:
హరిజనుల పట్ల జరుగుతున్న అత్యాచారాలను వ్యతిరేకిస్తూ గేయాలు రచించారు.

ఆంధ్రదేశ స్వాతంత్రోద్యమం
భారతదేశంలోని జాతీయతా భావాలు ఆంధ్రదేశంలో కూడా బాగా వ్యాపించాయి. 1852లో మద్రాస్ నేటివ్ అసోషియేషన్‌ను గాజుల లక్ష్మీనరసుసెట్టి ప్రారంభించారు. 1844లో క్రిసెంట్ అనే పత్రికను ప్రారంభించారు. ఫలితంగా లక్ష్మీ నరసు మద్రాస్ రామ మోహన్‌రాయ్‌గా పేరొందారు. 1884లో పి. రంగయ్య నాయుడు అధ్యక్షుడిగా, పి. ఆనందాచార్యులు కార్యదర్శిగా మద్రాస్ మహాజన సభ ఏర్పడింది. 1884-85లో కాకినాడ లిటరరీ సొసైటీ ఐసీఎస్ (ఇండియన్ సివిల్ సర్వీసెస్) పరీక్షల వయోపరిమితిని పెంచమని, శిస్తు భారం తగ్గించమని బ్రిటిష్ పార్లమెంటుకు వినతి పత్రం సమర్పించింది. 1885లో పార్థసారథి నాయుడు ఆంధ్ర ప్రకాశిక అనే ప్రథమ రాజకీయ వారపత్రికను స్థాపించారు. కంపెనీ కాలంలోనే దేశంలోని రైతుల పరిస్థితి మెరుగ్గా ఉండేదని 1875లో లోకరంజని పత్రిక రాసింది. 'శ్వేత జాతీయులను విచారించి శిక్షించడానికి తెల్లవారే అర్హులైనప్పుడు భారతీయులను భారతీయులే శిక్షించడం న్యాయం కదా' అని వివేకవర్ధిని (1884) పత్రిక ఇల్బర్ట్ బిల్లు గురించి రాసింది. 1885 భారత జాతీయ కాంగ్రెస్ తొలి సమావేశానికి పి. రంగయ్య నాయుడు, పి. ఆనందాచార్యులు, గుత్తి కేశవ పిళ్లై, వెంకట సుబ్బారాయుడు, న్యాపతి సుబ్బారావు పంతులు లాంటివారు హాజరయ్యారు. 1886 కలకత్తా సమావేశానికి ఆంధ్ర దేశం నుంచి 21 మంది పాల్గొన్నారు. 1891 నాగపూర్ సమావేశానికి అధ్యక్షత వహించిన తొలి తెలుగు వ్యక్తి పి. ఆనందాచార్యులు. 1891లో ఏర్పడిన కృష్ణా జిల్లా కాంగ్రెస్ సంఘం తొలి జిల్లా సంఘం. దీని తొలి సమావేశాలు రామస్వామి గుత్తా అధ్యక్షతన (గుంటూరు (1892), మచిలీపట్నం (1893), ఏలూరు (1894)ల్లో జరిగాయి. గౌతమి, శశిరేఖ లాంటి పత్రికలు ప్రభుత్వ లోపాలను, దుబారాను దుయ్యబట్టేవి. 1902లో దేశభక్త కొండా వెంకటప్పయ్య కృష్ణా పత్రికను ప్రారంభించగా ముట్నూరు కృష్ణారావు సంపాదకత్వం వహించారు. న్యాపతి సుబ్బారావు ఐఎన్‌సీ కార్యదర్శిగా పనిచేశారు. పి. ఆనందాచార్యులు వైజయంతి పత్రికను నడిపారు.

వందేమాతర ఉద్యమం
1905, జులై 7న లార్డ్ కర్జన్ బెంగాల్‌ను విభజన చేయగా అది 1905, అక్టోబరు 16న అమల్లోకి వచ్చింది. ఫలితంగా వందేమాతర ఉద్యమం/ స్వదేశీ ఉద్యమం ప్రారంభమైంది. 1905 బెనారస్ కాంగ్రెస్ సమావేశం విభజన వ్యతిరేక తీర్మానం చేసింది. 1905 సెప్టెంబరులో మద్రాస్ బీచ్ సమావేశం జి. సుబ్రహ్మణ్య అయ్యర్ (స్వదేశీ మిత్రన్ పత్రిక) అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి గాడిచెర్ల, అయ్యదేవర, కొమర్రాజు, గొల్లపూడి... తదితర ఆంధ్రులు హాజరయ్యారు. సుబ్రహ్మణ్య భారతి దేశభక్తి గీతాలు పాడారు. జాతీయ నిధి ఏర్పాటుకు తీర్మానించారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో స్వదేశీ ప్రచారానికి న్యాపతి సుబ్బారావు, వెంకటరమణారావు అంగీకరించారు. భారతీయ పారిశ్రామిక మహాసభ కార్యదర్శి సి.వై. చింతామణి వారికి సహకరించారు. నూజివీడులో జరిగిన కృష్ణాజిల్లా మహాసభ స్వదేశీ తీర్మానాన్ని బలపరిచింది. 1906 కలకత్తా కాంగ్రెస్ సమావేశం (నౌరోజీ అధ్యక్షతన)లో పి. ఆనందాచార్యులు స్వదేశీ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. బెజవాడలో మునగాల రాజా బట్టల మిల్లు నెలకొల్పారు. కడపలో జంగం హరియప్ప, భద్రాచలంలో వెంకటేశ్వర్లు స్వదేశీ వస్త్రాలయాలను స్థాపించారు. నెల్లూరులో మహంకాళి శ్రీనివాస శాస్త్రి స్వదేశీ సమాజాన్ని స్థాపించగా, వెన్నెలకంటి నరసయ్య రాత్రి పాఠశాల నిర్వహించారు.
    బారిసాల్ సమావేశంలో స్వరాజ్య సంపాదనకు స్వదేశీ ఉద్యమం ప్రధాన సాధనమని ప్రకటించిన ఎస్.ఎన్. బెనర్జీని ప్రభుత్వం నిర్బంధించింది. వింజమూరి భావనాచారి (గుంటూరు) పారిశ్రామిక శిక్షణకు యువకులను జపాన్ పంపడానికి నిధిని సమకూర్చాడు. మల్లాది వెంకట సుబ్బారావు (కాకినాడ), ఎస్. రామారావు (బళ్లారి), మామిడి దేవేంద్రుడు (రాజమండ్రి) శిక్షణ పొందడానికి వెళ్లారు.

ఒసాకా వెళ్లిన గోటేటి జానకి రామయ్య అట్టపెట్టెల తయారీ శిక్షణకోసం వెళ్లాడు. అతడి ఖర్చును భాస్కర రామయ్య (రాజమండ్రి) భరించారు. న్యాపతి సుబ్బారావు రాజమండ్రిలో జాతీయ ఉన్నత పాఠశాలను ప్రారంభించాడు. కరణం గున్నేశ్వర్రావు 1000 రూపాయలు, పేర్రాజు 40 వేల రూపాయలు విరాళంగా ఇచ్చారు. 1907, ఫిబ్రవరి 11న రాజమండ్రిలో బాలభారతి సమితిని గంటి లక్ష్మన్న, టంగుటూరి శ్రీరాములు, కంచుమర్తి రామచంద్రరావు స్థాపించారు.
 

బిపిన్ చంద్రపాల్ ఆంధ్ర పర్యటన
వందేమాతర ఉద్యమాన్ని ఆంధ్రలో ప్రచారం చేయడానికి బిపిన్ చంద్రపాల్ వచ్చారు. ఈ పర్యటన ఏర్పాటు చేసింది ముట్నూరు కృష్ణారావు. 1907 ఏప్రిల్‌లో పాల్ విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో ప్రసంగించారు. మితవాదుల (బి.ఎన్. శర్మ) ప్రాబల్యం వల్ల సభలు విజయవంతం కాలేదు. విశాఖపట్నంలో పాల్‌కు ఆతిథ్యం ఇచ్చినవారు వి. జగన్నాథం, వి. పూర్ణమ్మ, భూపతిరాజు వెంకటపతిరాజు. కాకినాడలో పాల్ సభకు అధ్యక్షత వహించింది కృత్తివెంటి పేర్రాజు. ఈయన విరాళంతో రామచంద్రాపురంలో జాతీయ పాఠశాలను ఏర్పాటు చేశారు. రాజమండ్రిలో ఏప్రిల్ 19 నుంచి 24 మధ్య పాల్ సభలు జరిగాయి. రాజమండ్రిలో పాల్‌కు ఆతిథ్యం ఇచ్చింది మాదెల్ల సారయ్య. సభలకు అధ్యక్షత వహించింది కంచుమర్తి రామచంద్రరావు, టంగుటూరి ప్రకాశం పంతులు. కౌతా శ్రీరామమూర్తి వందేమాతరం గీతాన్ని ఆలపించారు. పాల్ ఉపన్యాసాలను చిలకమర్తి లక్ష్మీనరసింహం తెలుగులోకి అనువదించారు. భరత ఖండంబు చక్కని పాడియావు అనే గీతాన్ని చిలకమర్తి పాడారు. రాజమండ్రిలో గోదావరీ స్వదేశీ స్టోర్స్‌ను ప్రారంభించారు. గాడిచెర్ల హరిసర్వోత్తమరావు పాల్‌కు సన్మానపత్రం సమర్పించారు. విజయవాడలో పాల్‌కు ఆతిథ్యం ఇచ్చింది మునగాల రాజా.

1907, ఏప్రిల్ 26న మచిలీపట్నంలో ఆతిథ్యం ఇచ్చింది రామదాసు నాయుడు. అక్కడే స్వరాజ్యసమితి ఏర్పడింది. పాల్ బందరులో జాతీయ కళాశాలను ప్రారంభించారు. దీనికి మొదటి ప్రిన్సిపల్ కోపల్లె హనుమంతరావు. పాల్ సభలకు అధ్యక్షులు కృష్ణమాచారి, పురాణం వెంకట సుబ్బయ్య. మీర్జాపురం జమీందారుపై రైతులు వేసిన కేసులో ఫీజు తీసుకోకుండా మద్రాస్ కోర్టులో వాదించిన వ్యక్తి వేమవరపు రామదాసు పంతులు. పాల్ చివరి పర్యటన 1907, మే 1న మద్రాస్‌లో జరిగింది. సభకు అధ్యక్షులు టంగుటూరి ప్రకాశం. వందేమాతర ఉద్యమ ప్రభావంతో జపాన్ చరిత్ర గ్రంథాన్ని ఆదిపూడి సోమనాథరావు రచించగా, శ్రీబ్రహ్మం జపానీయం అనే గ్రంథాన్ని రచించారు. మునగాల రాజా తన కుమారులకు టోగో, నోగీ అనే జపాన్ సైన్యాధ్యక్షుల పేర్లు పెట్టారు. హిందూదేశ దారిద్య్రం అనే గ్రంథాన్ని అత్తిలి సూర్యనారాయణ రచించారు. మట్నూరి సుబ్బారాయుడు, మంగినపూడి వెంకట శర్మ మాతృ శతకం రచించారు.
 

రాజమండ్రి కళాశాల సంఘటన (1907, ఏప్రిల్ 24)
ప్రిన్సిపల్ మార్క్‌హంటర్ విద్యార్థులను వందేమాతరం నినాదాలు చేయరాదని, బ్యాడ్జీలు ధరించరాదని, బాలభారతి సమితిలో చేరరాదని హెచ్చరించాడు. ఎం. రామచంద్రరావు, గాడిచెర్ల పై చర్యలు తీసుకున్నాడు. 138 మంది విద్యార్థులను పరీక్షలకు అనుమతించలేదు. విద్యార్థుల తరపున న్యాపతి సుబ్బారావు, బి.ఎన్. శర్మ జోక్యం చేసుకున్నా ఫలితం లేకపోయింది. ఈ సంఘటన విద్యార్థులు రాజకీయాల్లో చేరడానికి నాంది పలికిందని ఆచార్య సరోజని రేగాని అభిప్రాయపడ్డారు. గాడిచెర్ల విజయవాడ నుంచి స్వరాజ్ పత్రికను నడిపారు. విద్యార్థులారా అధైర్యపడకండి భారత స్వాతంత్య్రానికి భగవంతుడి దయవల్ల మీరు నాయకులు కాగలరు అని కృష్ణా పత్రిక రాసింది. 'ప్రభుత్వ ఉద్యోగాలు లేకపోతే మనం జీవించలేమని ప్రభుత్వం భావిస్తుంది. అది తప్పని నిరూపించాలి' అని దేశాభిమాని పత్రిక రాసింది.

కాకినాడ కొట్లాట కేసు
1907, మే 31న జిల్లా వైద్యాధికారి కెప్టెన్ కెంఫ్‌ను చూసి విద్యార్థులు వందేమాతరం అనే నినాదం చేశారు. కెంఫ్ కోపంతో కొంపెల్ల కృష్ణారావు అనే బాలుడిని కొట్టాడు. ఉద్యమకారులు కెంఫ్ ఉన్న క్లబ్‌పై దాడి చేశారు. జిల్లా కలెక్టర్ కుమ్మింగ్, సబ్‌కలెక్టర్ కర్షాప్ గొడవను నివారించడానికి ప్రయత్నించి 50 మందిని అరెస్ట్ చేశారు. జూన్ 5న కె. పేర్రాజు అధ్యక్షతన నిరసన సభ జరిగింది. రఘుపతి వెంకటరత్నం నాయుడు కెంఫ్ దుడుకు చర్య వల్లే అల్లర్లు జరిగాయని అతడిపై అభిశంసన తీర్మానాన్ని ప్రతిపాదించారు. నిందితుల తరపున న్యాపతి సుబ్బారావు వాదించారు. అపిరాల లక్ష్మీనరసింహారావు, చిన పేరయ్య, పెద పేరయ్యలకు శిక్ష పడింది. (2 సంవత్సరాలు, 500 రూపాయల జరిమానా).

 

గాడిచెర్ల హరి సర్వోత్తమరావు, బోడి నారాయణ అరెస్టు
1908లో తిరునల్వేలి జిల్లా మెజిస్ట్రేట్‌ను విప్లవవాదులు కాల్చి చంపారు. ఈ కేసులో చిదంబరం పిళ్లైను అరెస్ట్ చేసి యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. గాడిచెర్ల, బోడి నారాయణరావు స్వరాజ్య పత్రికలో ప్రభుత్వాన్ని విమర్శించినందుకు రాజద్రోహ నేరంపై 1908, జులై 18న అరెస్టు చేశారు. వందేమాతర ఉద్యమ కాలంలో ఆంధ్రలో అరెస్ట్ అయిన తొలి నాయకులు వీరే (వందేమాతర ఉద్యమకాలంలో తొలి రాజకీయ ఖైదీ - గాడిచెర్ల).

 

కోటప్ప కొండ సంఘటన (1909, ఫిబ్రవరి 18)
గుంటూరు జిల్లా, నరసరావుపేట తాలూకా, కోటప్పకొండ మహాశివరాత్రి ఉత్సవాలకు చేబ్రోలుకు చెందిన చిన్నప్పరెడ్డి వెళ్లగా అతడి ఎద్దుకు గాయమైంది. పోలీసులతో ఘర్షణ జరిగింది. పోలీస్ స్టేషన్‌కు నిప్పుపెట్టారు. సి.ఐ. సుబ్బారావుకు దేహశుద్ధి చేశారు. ఈ కేసులో 45 మందిని అరెస్టు చేసి 21 మందిపై కేసులు పెట్టారు. చిన్నపరెడ్డికి ఉరిశిక్ష విధించారు. (సబ్ కలెక్టర్ కెర్షాప్) తహశీల్దార్ - బ్రహ్మనందనాయుడు, సబ్ మెజిస్ట్రేట్ సుబ్బారావు నాయుడు ఉద్యోగాలు కోల్పోయారు.

తెనాలి బాంబు కేసు (1909, ఏప్రిల్ 6)
తెనాలి సమీపంలోని కంచర్లపాలెం వద్ద నాటుబాంబు పేలి చెన్నడు అనే వ్యక్తి మరణించాడు. ఈ కేసులో చుక్కపల్లి రామయ్య, లక్కరాజు బసవయ్య, కాటంరాజు వెంకట్రాయుడులను అరెస్ట్ చేశారు. నిందితుల తరపున టంగుటూరి ప్రకాశం వాదించారు. చుక్కపల్లి రామయ్యకు 10 ఏళ్లు; బసవయ్య, వెంకట్రాయుడులకు 2 ఏళ్లు ద్వీపాంతరవాస శిక్షలు విధించారు. బసవయ్య, వెంకట్రాయుడు వందేమాతరం ఉద్యమ సమయంలో స్వరాజ్య సంపాదన అనే కరపత్రాలను ముద్రించారు.

 

ఉద్యమ నిర్మాణ కార్యక్రమాలు
ముట్నూరి, పురాణం వెంకటపయ్య చేనేత పరిశ్రమాభివృద్ధికి కృషి చేశారు. రాజమండ్రిలో గంటి లక్ష్మన్న, న్యాపతి సుబ్బారావు, భీమశంకరరావు నాయకత్వంలో స్వదేశీ పారిశ్రామిక సంస్థ ఏర్పాటైంది. కడప, భద్రాచలం, రామచంద్రాపురాల్లో చల్లపల్లి రాజా ఆర్థిక సహాయంతో స్వదేశీ వస్తు విక్రయశాలలు ఏర్పడ్డాయి. నెల్లూరులో శ్రీనివాసశాస్త్రి 1908లో స్వదేశీ స్టోర్స్‌ను ప్రారంభించారు. రాజమండ్రిలో వందేమాతరం రాత్రి పాఠశాల, జాతీయోన్నత పాఠశాల స్థాపించారు. దర్శి చెంచయ్య గదర్ పార్టీలో చేరి విప్లవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 1911లో ఢిల్లీ దర్బారులో బెంగాల్ విభజన రద్దును ప్రకటించడంతో వందేమాతర ఉద్యమం నిలిచిపోయింది.

ఆంధ్రలో దౌర్జన్య చర్యలు
సర్కార్ (చక్రవర్తి) అనే బెంగాల్ విప్లవకారుడు ఆంధ్రా వచ్చి అయ్యదేవర కాళేశ్వరరావు అతిథిగా ఉన్నట్లు అయ్యదేవర తన జీవిత చరిత్రలో రాశాడు. కలకత్తాలో వైద్య విద్య కోసం వెళ్లిన దంటు సుబ్బావధాని, అతడి మిత్రులు రహస్యంగా ఆయుధాలు తెచ్చినట్లు కృష్ణా పత్రిక (1904)లో రాశారు. కృష్ణా జిల్లా వంతలపాలెంలో పంది మీద బాంబు ప్రయోగం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. గూడూరు రైల్వేస్టేషన్‌లో పేలుడు సామగ్రి ఉన్న పెట్టెను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కంఠెవరం/తెనాలి బాంబు సంఘటన కూడా జరిగింది. (మద్రాస్ - కలకత్తా రైలు మార్గం పేల్చివేత కుట్రగా ప్రచారమైంది).

 

హోంరూల్ ఉద్యమం (1916 - 1917)
తిలక్, అనిబిసెంట్‌ల నాయకత్వంలో హోంరూల్ ఉద్యమం ప్రారంభమైంది. తిలక్ 1914 జూన్‌లో జైలు నుంచి విడుదలయ్యాడు. తిలక్ 1916, ఏప్రిల్ 28న పూనాలో, అనిబిసెంట్ 1916, సెప్టెంబరులో మద్రాస్‌లోని గోఖలే హాలులో హోంరూల్ లీగ్‌ను స్థాపించారు. హోంరూల్ భావనను ఐర్లాండ్ నుంచి గ్రహించారు. ఆంధ్రలో గాడిచెర్ల హరిసర్వోత్తమరావు ఉద్యమ నాయకుడు. 52 హోంరూల్‌లీగ్ శాఖలు ఆంధ్రలో ఏర్పడ్డాయి. 3 పైసల కరపత్రాలు ప్రచురించారు. స్వరాజ్య ఉద్దేశం, స్వతంత్ర వర్థన పత్రం, స్వరాజ్యం కోరడానికి కారణాలు లాంటి కరపత్రాలు ప్రచురించారు. సరోజినీనాయుడు రచన ఎవేక్ మదర్‌ను నూతన హైందవ మాతృగీతం పేరుతో తెలుగులోకి అనువదించారు. దేశమాత, హితకారిణి (ఏలూరు), ఆంధ్రపత్రిక, కృష్ణాపత్రికలతో పాటు అనిబిసెంట్ కామన్‌వీల్, న్యూఇండియా పత్రికలు ఉద్యమాన్ని ప్రచారం చేశాయి.

అనిబిసెంట్ ఆంధ్ర పర్యటన
 
 1916లో అనిబిసెంట్ ఆంధ్ర పర్యటనలో కాకినాడ, రాజమండ్రి, గుంటూరు, చిత్తూరు సభల్లో ప్రసంగించారు. స్వాతంత్య్రంలేని జాతి జీవచ్ఛవం లాంటిదని పేర్కొన్నారు. 1916 మేలో చిత్తూరు జిల్లా మదనపల్లెలో జాతీయ కళాశాల స్థాపించారు. దాని మొదటి ప్రిన్సిపాల్‌గా హెచ్.జె. కజిన్స్ నియమితులయ్యారు. ఆర్డర్ ఆఫ్ ది సన్స్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బాయ్స్ స్కౌట్, యంగ్‌మెన్స్ ఇండియన్ అసోసియేషన్ సంస్థలను అనిబిసెంట్ స్థాపించారు. ఈ ఉద్యమకాలంలో ప్రజలు ఆమెను గ్రాండ్ ఓల్డ్ లేడీ ఆఫ్ ఇండియా, ఇండియన్ టామ్ టాయ్ అని పిలిచారు. సుబ్రహ్మణ్య అయ్యర్ అమెరికా అధ్యక్షుడికి లేఖ రాయడమే కాకుండా తన సర్ బిరుదును వదులుకున్నాడు. 1917, జూన్ 16న ప్రభుత్వం అనిబిసెంట్, అరండేల్, వాడియాలను ఉదకమండలంలో (ఊటీ)లో అరెస్ట్ చేసింది. దానికి నిరసనగా మద్రాస్‌లో బి.ఎన్.శర్మ అధ్యక్షతన సభ జరిగింది. 1917, ఆగస్టు 20న మాంటేగ్ ప్రకటనతో ఉద్యమాన్ని నిలిపివేశారు. ఈ ఉద్యమకాలంలోనే బ్రిటిష్‌వారి ప్రోత్సాహంతో జస్టిస్ పార్టీ ఏర్పడింది. హోంరూల్ ఉద్యమాన్ని సమర్థిస్తూ బెజవాడలో త్రిపురనేని రామస్వామి అధ్యక్షతన బ్రాహ్మణేతర సభ జరిగింది. 1917 కలకత్తా కాంగ్రెస్ సమావేశంలో తిలక్ సమర్థన వల్ల ప్రత్యేక ఆంధ్ర కాంగ్రెస్ సర్కిల్ ఏర్పాటుకు అంగీకారం కుదిరింది. 1918 ఆంధ్ర కాంగ్రెస్ సర్కిల్ సమావేశంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సభలను లండన్‌లో జరపాలనీ, ప్యారిస్ శాంతి సమావేశాలకు తిలక్‌ను పంపాలనీ తీర్మానించారు. కాని ఢిల్లీ కాంగ్రెస్ సమావేశంలో తిలక్, గాంధీ, హసన్ ఇమామ్‌లను ప్యారిస్ సమావేశానికి పంపాలని తీర్మానం జరిగింది.

గాంధీ యుగం 

సహాయ నిరాకరణ ఉద్యమం
  మాంటేగ్ - చెమ్స్‌ఫర్డ్ సంస్కరణలు, రౌలత్ చట్టం, జలియన్ వాలాబాగ్ దురంతం, ఖిలాపత్ ఉద్యమం లాంటి కారణాల వల్ల గాంధీజీ 1920లో సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఆయన ఈ ఉద్యమకాలంలో 3 సార్లు ఆంధ్రదేశంలో పర్యటించారు. 1919లో రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా సత్యాగ్రహాన్ని ప్రచారం చేయడానికి సికింద్రాబాద్, విజయవాడ (రామ్మోహన్‌రాయ్ గ్రంథాలయం)లో ప్రసంగించారు. అయ్యదేవర కాళేశ్వరరావు గాంధీజీ ఉపన్యాసాన్ని తెలుగులోకి అనువదించారు. గాంధీజీకి అతిథ్యం కూడా ఇచ్చారు. మద్రాస్‌లో టంగుటూరి అధ్యక్షతన జరిగిన సభలో గాంధీజీ ప్రసంగించారు. 1920, సెప్టెంబరు 4-9 మధ్య కలకత్తాలో జరిగిన ప్రత్యేక కాంగ్రెస్ సమావేశంలో సహాయ నిరాకరణ ఉద్యమ తీర్మానం ప్రవేశపెట్టారు. కాని కొండా వెంకటప్పయ్య తీర్మానాన్ని వ్యతిరేకించారు. 1920 నాగపూర్ సమావేశంలో శాంతియుత సహాయ నిరాకరణ ఉద్యమ నిర్వహణ తీర్మానాన్ని ఆమోదించారు.
    1921, మార్చి 31న విజయవాడలో జరిగిన కాంగ్రెస్ ప్రత్యేక సమావేశానికి గాంధీజీ హాజరయ్యారు. ఈ సమావేశం తర్వాత ఆయన ఏలూరు, మచిలీపట్నం, చీరాల, నెల్లూరుల్లో పర్యటించారు. 1921, అక్టోబరులో మూడోసారి వచ్చి కర్నూలు, కడప, తిరుపతి, తాడిపత్రిల్లో ప్రసంగించారు.

విజయవాడ కాంగ్రెస్ ప్రత్యేక సమావేశం (1921 మార్చి 31, ఏప్రిల్ 1, 2)
మహాత్మాగాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, మోతీలాల్ నెహ్రూ, సీఆర్ దాస్, పటేల్, అలీ సోదరులు, జిన్నా లాంటి జాతీయ నాయకులు వచ్చారు. తెలంగాణ నుంచి మాడపాటి హనుమంతరావు పరిశీలకుడిగా వచ్చారు. పింగళి వెంకయ్య (భట్ల పెనుమర్రు, కృష్ణా జిల్లా) వీరంకి వెంకటశాస్త్రి సహాయంతో తెలుపు, ఎరుపు, ఆకుపచ్చ రంగులతో త్రివర్ణ పతాకాన్ని రూపొందించారు. సమావేశంలో దీనికి కాషాయరంగును, చరఖాను చేర్చారు. రామదండు వాలంటీర్ దళం సేవలు అందించింది. మాగంటి అన్నపూర్ణమ్మ, దువ్వూరి సుబ్బమ్మ, పొనకా కనకమ్మ, ఉన్నవ లక్ష్మీబాయమ్మ, యామినీ పూర్ణ తిలకం పాల్గొన్నారు. యామినీ పూర్ణతిలకం అనే నాట్యకారిణి తన యావదాస్తిని తిలక్ స్వరాజ్య నిధికి విరాళంగా ఇచ్చారు. మాగంటి అన్నపూర్ణ దేవి తన నగలన్నింటినీ విరాళంగా ఇచ్చారు. (ఈమె పశ్చిమ గోదావరి జిల్లా పోతనూరి వాసి. 1927లో క్షయవ్యాధితో మరణించారు.) కూచిపూడి నృత్యకారుడు అయ్యప్ప భాగవతార్ ఉద్యమాన్ని ప్రచారం చేశారు. ఉన్నవ లక్ష్మీనారాయణ మాలపల్లి (1921) నవల రాశారు. 1922లో ఉన్నవ దంపతులు గుంటూరులో శారదా నికేతన్‌ను స్థాపించారు.
   మాడభాషి నరసింహాచారి అసహాయోద్యమ విజయం గ్రంథాన్ని చెరుకువాడ నరసింహం స్వరాజ్య దర్పణం, పీసుపాటి నరసింహశాస్త్రి చీరాల పేరాల వనవాసం గ్రంథాలను రాశారు. తిలక్ నాటక సమాజం (గుంటూరు) కోసం 1921లో రామరాజు పుండరీకాక్షుడు స్వరాజ్య సోపానం, పాంచాల పరాభవం, స్వరాజ్య రథం లాంటి నాటకాలు రాశారు.

గరిమెళ్ల సత్యనారాయణ మాకొద్దీ తెల్లదొరతనం, దండాలమ్మా దండాలు- భరతమాతకు దండాలు అనే ప్రసిద్ధ గీతాలను రచించారు. అయ్యదేవర కాళేశ్వరరావు శాసనమండలికి, గులాం మొహియుద్దీన్ మెజిస్ట్రేట్ పదవికి రాజీనామా సమర్పించారు. ఆంధ్రదేశంలో మొదటి సహాయ నిరాకరణవాదిగా అయ్యదేవరను పేర్కొంటారు. కొండా వెంకటప్పయ్య శాసనసభ పదవికి రాజీనామా చేశారు. ఉన్నవ లక్ష్మీనారాయణ, పోలిసెట్టి హనుమంతయ్య గుప్త న్యాయవాద వృత్తిని వదులుకున్నారు. వి. రామదాసు పంతులు మద్రాస్ యూనివర్సిటీ సిండికేట్ సభ్యత్వానికి రాజీనామా చేశారు. కళావెంకటరావు, బొమ్మకంటి శేషారెడ్డి విద్యాలయాలను బహిష్కరించారు. టంగుటూరి ప్రకాశం, గొల్లపూడి సీతారామశాస్త్రి, శిష్టా పురుషోత్తమ్ లాంటి వారు కూడా న్యాయవాద వృత్తిని వదులుకున్నారు. గుంటూరు బార్ అసోసియేషన్ మూడునెలలపాటు న్యాయస్థానాన్ని బహిష్కరించింది. నర్సాపూర్ తాలూకా మెట్టపాలెంలో తొలి పంచాయతీ న్యాయస్థానం ఏర్పాటు చేశారు. గుంటూరు (15%), నెల్లూరు (17%), రాజమండ్రిలో ఎన్నికలు బహిష్కరించారు. కొడాలి సుబ్బారావు, కల్లూరి సుబ్బారావు లాంటి ఉపాధ్యాయులు 47 మంది రాజీనామా చేశారు. 44 జాతీయ పాఠశాలలు ఏర్పాటు చేశారు. తెనాలి, విజయనగరం లాంటి చోట్ల విద్యార్థులు సమ్మె చేశారు.
కల్లు మానండోయ్ బాబు - కళ్లు తెరవండోయ్ అంటూ మద్యపాన వ్యతిరేక ఉద్యమం జరిగింది. వెన్నెలకంటి రాఘవయ్య, బొమ్ము శేషారెడ్డి, పానకాల కనకమ్మ, తిక్కవరపు రామిరెడ్డి, ఓరుగంటి వెంకట సుబ్బయ్య వంటివారు మద్యపాన వ్యతిరేక ఉద్యమం చేయడం వల్ల కడప జిల్లా అబ్కారీ ఆదాయం రూ.4 లక్షల నుంచి రూ.2 లక్షలకు, కర్నూలు జిల్లా ఆదాయం రూ.2 లక్షల నుంచి రూ.90 వేలకు పడిపోయింది. 1921, నవంబరు 17 వేల్స్ రాకుమారుడు పర్యటనకు వ్యతిరేకంగా నిరసన సభలు జరిగాయి.

చీరాల - పేరాల ఉద్యమం
చీరాల, పేరాల, వీరరాఘవపేట, జాండ్రపేటలను కలిపి ఆంగ్లేయులు మున్సిపాలిటీగా ప్రకటించారు. 1919లో ప్రథమ పురపాలక సంఘం (చీరాల యూనియన్) ఏర్పడింది. 1921 ఫిబ్రవరిలో నాటి మద్రాస్ ముఖ్యమంత్రి (పురపాలకశాఖ మంత్రి) రాజారామ రాయణింగార్ (జస్టిస్ పార్టీ) చీరాల సందర్శించారు. నాలుగు వేల పన్నుభారం 40 వేలకు పెరగడంతో ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వంలో చీరాల-పేరాల ఉద్యమం ప్రారంభమైంది. దుగ్గిరాల ఇంగ్లండ్ ఎడింబరో యూనివర్సిటీలో విద్యాభ్యాసం పూర్తిచేశారు. రాజమండ్రి ఉపాధ్యాయ శిక్షణా కళాశాలలో, మచిలీపట్నం జాతీయ కళాశాలలో పనిచేశారు. 1920లో చీరాల వద్ద ఆంధ్ర విద్యాపీఠ గోష్ఠిని నెలకొల్పారు. 1921, ఏప్రిల్ 6న గాంధీజీ చీరాలను సందర్శించి శాంతియుత పన్నుల నిరాకరణ ఉద్యమం చేయమని సలహా ఇచ్చారు. ఏప్రిల్ 25న గ్రామాలు ఖాళీ చేసి రామ్‌నగర్ ఏర్పాటు చేసుకున్నారు. రామదండు వాలంటీర్ దళం సహాయ కార్యక్రమాలు చేసింది. 200 మంది ప్రతినిధులతో పంచాయతీ ఏర్పాటు చేశారు. అయినా ప్రభుత్వం ఇంటికి రూ.1,025 పన్నుగా విధించింది. 1921 సెప్టెంబరులో దుగ్గిరాలను బరంపురంలో నిర్భందించడంతో ఉద్యమం బలహీనపడింది. పిసుపాటి నారాయణశాస్త్రి చీరాల - పేరాల వనవాసం అనే గ్రంథాన్ని రాశారు. ''హిమాచల్ నుంచి కన్యాకుమారి వరకు ఈ ఉద్యమం ప్రజల హృదయాలను ఆశ్చర్యపూరితం చేసింది" అని కొండా వెంకటప్పయ్య పేర్కొన్నారు.

పల్నాడు పుల్లరి సత్యాగ్రహం (1921, సెప్టెంబరు 23)
ఆంగ్ల ప్రభుత్వం అటవీ ఉత్పత్తులు వినియోగించుకోవడానికి పుల్లరి పన్నుతోపాటు అనేక పన్నులు విధించింది. గుంటూరు జిల్లా పల్నాడు తాలుకాలోని మాచర్ల, వెందుర్తి, జట్టిపాలెం, శ్రీగిరిపాడు, రెంటచింతల ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 12 అణాల పన్నును 3 అణాలకు తగ్గించమని విన్నవించారు. కాని ప్రభుత్వం స్పందించకపోవడంతో మించాలపాడు గ్రామానికి చెందిన కన్నెగంటి హనుమంతు నాయకత్వంలో ఉద్యమం చేశారు. 1921 జులైలో కాంగ్రెస్ ఉన్నవ లక్ష్మీనారాయణ, వేదాంత నరసింహచారిలను మాచర్ల పంపింది. ఉన్నవ లక్ష్మీబాయమ్మ, యామినీ పూర్ణతిలకం కూడా ఉద్యమంలో పాల్గొన్నారు. వెల్దుర్తి, నడింపాలెంలో ప్రజలు దాడి చేశారు. 1921, సెప్టెంబరు 23న మించాలపాడు వద్ద ఆంగ్లేయులు కన్నెగంటి హనుమంతును కాల్చి చంపారు. విజయవాడ వద్ద ఉన్న కొండూరులో సుబ్బరాయశాస్త్రి నాయకత్వంలో, కడప జిల్లా రాయచోటిలో కూడా పుల్లరి సత్యాగ్రహాలు జరిగాయి.
పెదనందిపాడు పన్నుల సహాయ నిరాకరణ ఉద్యమం
ఈ ఉద్యమం ఆంధ్ర శివాజీగా పేరొందిన పర్వతనేని వీరయ్య చౌదరి నాయకత్వంలో జరిగింది. ఈయన శాంతిసేన వాలంటీర్ దళాన్ని ఏర్పాటు చేశారు. ఇంగ్లండ్ పార్లమెంట్‌లో కూడా ఈ ఉద్యమం చర్చకు వచ్చింది. ప్రభుత్వం రూథర్‌పర్డ్‌ను ప్రత్యేక కమిషనర్‌గా నియమించింది. అప్పటి గ్రామ ఉద్యోగుల సంఘం నాయకుడు మాచిరాజు సత్యనారాయణరాజు కూడా ఉద్యమానికి నాయకత్వం వహించారు. ఆంగ్ల సామ్రాజ్య పునాదులనే కదిలించిన ఉద్యమం అని వెల్లింగ్‌టన్ వ్యాఖ్యానించాడు.

ప్రభుత్వం పరిష్కారం కోసం రెవెన్యూ సంఘ సభ్యుడైన హేరిస్‌ను పంపింది. కమ్మకులానికి చెందిన డిప్యూటీ కలెక్టర్‌ను, ముస్లిం కులానికి చెందిన సబ్ఇన్‌స్పెక్టర్‌ను పంపి కుల, మత పరంగా ఉద్యమాన్ని అణచడానికి ప్రభుత్వం కృషిచేసింది. ఉద్యమాన్ని నిలిపివేయాల్సిందిగా కొండా వెంకటప్పయ్యకు గాంధీజీ లేఖ రాశారు. గాంధీజీ నిర్బంధంతో ఉద్యమం నిలిచిపోయింది.
 

రంపా విప్లవం - అల్లూరి సీతారామరాజు
1897, జులై 4న సీతారామరాజు విశాఖ జిల్లా, పాండ్రంకి గ్రామంలో మాతామహుల ఇంట జన్మించాడు. సొంత గ్రామం మోగల్లు (పశ్చిమగోదావరి జిల్లా). తండ్రి వెంకటరామరాజు, తల్లి సూర్యనారాయణమ్మ. తుని, నర్సీపట్నం, విశాఖపట్నంలో ప్రాథమిక విద్యాభ్యాసం జరిగింది. 1921లో చిట్టగాంగ్ వెళ్లి బెంగాల్ విప్లవకారులతో చర్చలు జరిపి కె.డి.పేట సమీపంలోని తాండవనది ఒడ్డున నీలకంఠేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీరామ విజయనగరం అనే ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆంగ్లేయుల ముత్తదారీ పద్ధతి, అటవీ నిబంధనలతోపాటు చింతపల్లి తహశీల్దార్ సెబస్టియన్ అతడి కాంట్రాక్టర్ సంతానం పిళ్లై దౌర్జన్యాలకు వ్యతిరేకంగా అల్లూరి సాయుధ పోరాటాన్ని ప్రారంభించాడు. గాంగంటందొర, గాంమల్లుదొర (భట్టపానుకుల గ్రామ మున్సబ్‌లు) ఎండుపడాలు, వీరయ్యదొర, అగ్గిరాజు పేరిచర్ల / వేగేసిన సూర్యనారాయణ / సత్యనారాయణరాజు ముఖ్య అనుచరులు.

సీతారామరాజు చింతపల్లి పోలీస్‌స్టేషన్‌పై 1922 ఆగస్టు 22న తొలిదాడి చేశాడు. 23న కె.డి.పేట, 24న రాజఒమ్మంగి; అక్టోబరు 16న అడ్డతీగల, 19న రంపచోడవరం, చివరి దాడి 1923, ఏప్రిల్ 18న అన్నవరం పోలీస్‌స్టేషన్‌పై జరిగింది. సీతారామరాజు రంపా ఉద్యమాన్ని అణిచివేయడానికి ప్రభుత్వం స్కాట్‌కోవార్డ్, హేటర్‌లను పంపింది. బళ్లారి పోలీస్ దళం మొదట వంజేరిఘాట్ వద్ద తర్వాత దామనపల్లి వద్ద ఓడిపోయింది. కోవార్డ్, హేటర్‌లు మరణించారు తర్వాత మలబారు పోలీస్ దళం వచ్చింది. తురుమామిడి, లక్కవరపుకోటలపై దాడిచేసి అనంతరం అడ్డతీగల, రంపచోడవరంలపై దాడి చేశారు. నవంబరు 17న రంపోల్, చీపర్తిపాలెంలో లూటీ జరిగింది. 1923, ఏప్రిల్‌లో అన్నవరంపై చేసిన దాడికి ఆయనకు శంఖవరంలో ఘనస్వాగతం లభించింది. ఆంగ్లప్రభుత్వం అన్నవరం, శంఖవరం గ్రామాలపై 4000 జరిమానా విధించింది. 1923, మే 31న రాజు అనుచరులు కొయ్యూరు వద్ద సబ్ ఇన్‌స్పెక్టర్, డిప్యూటీ తహశీల్దార్లను కొట్టి వదిలేశారు. జూన్ 15న అగ్గిరాజు నాయకత్వంలోని ఒక దళం కొండకంబేరు, మల్కనగిరి స్టేషన్లపై దాడి చేశారు. మల్లుదొరను కీరన్స్ అనే అధికారి చంపాడు. గుడ్డపల్లిలో సీతారామరాజును గ్రామ మున్సబ్ తప్పించాడు. 1924 జనవరిలో రూథర్‌ఫర్డ్ నాయకత్వంలో అస్సాం రైఫిల్స్ వచ్చింది. మే 6న మాడేరునది వద్ద అగ్గిరాజు పట్టుబడ్డాడు. మే 7న సీతారామరాజును జమేదార్ కంచుమీనన్ బంధించి కొయ్యూరులో ఉన్న మేజర్ గూడాల్‌కు అప్పగించాడు. సీతారామరాజును కాల్చి చంపారు. సీతారామరాజు సమాధి కృష్ణదేవిపేటలో ఉంది. గాంధీజీ యంగ్ ఇండియా పత్రికలో అల్లూరి దేశభక్తిని ప్రశంసిస్తూ నేను సాయుధ విప్లవాన్ని ఆమోదించలేను, అభినందించలేను. కానీ ధైర్యవంతుడు, త్యాగపురుషుడు, నిరాడంబరుడు అయిన ఈ యువకుడికి జోహర్లు అర్పించకుండా ఉండలేను అని రాశారు.

స్వరాజ్ పార్టీ
1923లో మోతీలాల్ నెహ్రూ, చిత్తరంజన్ దాస్‌ కాంగ్రెస్ ఖిలాఫత్ స్వరాజ్య పార్టీని స్థాపించారు. స్వరాజ్య పార్టీకి వి.వి. రామదాసు అధ్యక్షుడిగా, ఉన్నవ లక్ష్మీనారాయణ కార్యదర్శిగా పనిచేశారు. సి.ఆర్. దాస్ ఆంధ్ర దేశంలో పర్యటించి ప్రచారం చేశారు. 1924లో గంజాం జిల్లా సభలో బులుసు సాంబమూర్తి, డాక్టర్ సుబ్రహ్మణ్యంలు సంపూర్ణ స్వరాజ్య తీర్మానం చేశారు. 1926 ఎన్నికల్లో టంగుటూరి నాయకత్వంలో కాంగ్రెస్ విజయం సాధించినప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. కాబట్టి జస్టిస్ పార్టీ సుబ్బరాయన్ ముఖ్యమంత్రిగా స్వతంత్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

 

సామ్యవాద ఉద్యమాలు
ఇదే కాలంలో ఆంధ్రాలో వామపక్ష పార్టీలు అవతరించాయి. ఆచార్య ఎన్.జి. రంగా 1923లో నిడుబ్రోలులో జిల్లా వ్యవసాయ కూలీల సమావేశం జరిపారు. 1929లో మాగంటి బాపినీడు రాష్ట్ర వ్యవసాయదారుల సంఘం స్థాపించారు. ఆంధ్రా స్వరాజ్ పార్టీని 1934లో గాడిచెర్ల విజయవాడలో ప్రారంభించారు. 1934 జూన్ 22న విజయవాడలో నాయకులనేని గోగినేని రంగా ఆంధ్ర సోషలిస్ట్ పార్టీని స్థాపించారు. మద్దూరి అన్నపూర్ణయ్య దీనికి కార్యదర్శి. పుచ్చలపల్లి, క్రొవ్విడి రంగసాయి, చండ్ర రాజేశ్వరరావు, అల్లూరి సత్యనారాయణరాజు ముఖ్య సభ్యులు. కాని పుచ్చలపల్లి సుందరయ్య 1934-35లో కాకినాడలో రహస్యంగా సీపీఐ కమ్యూనిస్ట్ పార్టీ శాఖను స్థాపించారు. విశాలాంధ్రలో ప్రజారాజ్యం పుస్తకాన్ని రచించారు. దక్షిణ భారత కమ్యూనిస్ట్ పితామహుడిగా పేరొందారు.

అఖిల భారత సోషలిస్ట్ పార్టీని ఢిల్లీలో జయప్రకాష్ నారాయణ్, రామమనోహర్ లోహియా 1934లో ప్రారంభించగా, ఆంధ్రాలో దాని శాఖ (కార్మిక రక్షణ సంఘం) గుంటూరులో తెన్నేటి విశ్వనాథం అధ్యక్షతన ఏర్పడింది. 1923లో నాగపూర్‌లో జమ్నాలాల్ బజాజ్ నాయకత్వంలో జెండా సత్యాగ్రహం జరిగింది. ఇందులో ఆచార్య వినోబాభావే పాల్గొన్నారు. సుభాష్ చంద్రబోస్, బులుసు సాంబమూర్తిల సహకారంతో నెహ్రూ 1928లో ఆల్ ఇండియా ఇండిపెండెన్స్ లీగ్‌ను స్థాపించారు. ఆంధ్రశాఖ అధ్యక్షులు బులుసు. లీగ్ ఆశయాలను మద్దూరి అన్నపూర్ణయ్య తన కాంగ్రెస్ వారపత్రిక ద్వారా ప్రచారం చేశారు. సైమన్ కమిషన్ వ్యతిరేక ఉద్యమంలో ప్రధానపాత్ర పోషించారు.
 

ఆంధ్రాలో సైమన్ కమిషన్
సైమన్ కమిషన్ ఆంధ్రాలో గుంటూరు, ఒంగోలు ప్రాంతాల్లో పర్యటించడానికి నిర్ణయం జరిగింది. 1928 ఫిబ్రవరి 26న మద్రాస్‌లో టంగుటూరి ప్రకాశం పంతులు నాయకత్వంలో నిరసన ఉద్యమం జరిగింది. పార్థసారథి అనే యువకుడు కాల్పుల్లో మరణించాడు. టంగుటూరికి ఆంధ్రకేసరి బిరుదు ఈ ఉద్యమ కాలంలోనే వచ్చింది. విజయవాడ మున్సిపల్ ఛైర్మన్ అయ్యదేవర కాళేశ్వరరావు సైమన్ గో బ్యాక్ అని రాసిన చీటీని సైమన్‌కు అందించాడు. 1928 ఫిబ్రవరి 3న మద్రాస్‌లో కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు అధ్యక్షతన నిరసన సభ జరిగింది. బహిష్కరణ ఉద్యమాన్ని ప్రచారం చేస్తున్న బులుసు సాంబమూర్తిని అరెస్ట్ చేశారు. ఆంధ్ర రాష్ట్ర సంపూర్ణ స్వరాజ్యలీగ్ అధ్యక్షులు బులుసు సాంబమూర్తి. కార్యదర్శి తెన్నేటి విశ్వనాథం. 1929లో గాంధీజీ ఆంధ్రదేశంలో పర్యటించారు.

ఆంధ్రాలో ఉప్పు సత్యాగ్రహం
 1929 లాహోర్ కాంగ్రెస్ సమావేశం నెహ్రూ అధ్యక్షతన సంపూర్ణ స్వరాజ్య తీర్మానం చేసింది. దీని ప్రకారం 1930, జనవరి 26ను తొలి స్వాతంత్య్ర దినోత్సవంగా నిర్ణయించారు. కొండా వెంకటప్పయ్య గాంధీజీని కలిసి ఉద్యమ నిర్వహణ కార్యక్రమాలు తెలుసుకున్నారు. టంగుటూరి, జోగయ్య మద్రాస్ శాసనసభ నుంచి, రామదాసు పంతులు, వి.రామారావు కేంద్ర శాసనసభ నుంచి, గాడిచెర్ల, కడప కోటిరెడ్డి, స్వామి వెంకటాచలంశెట్టి, వెంకటపతి రాజు, కామేశ్వరరావు శాసనమండలికి రాజీనామా చేశారు. 1930, జనవరిలో గాంధీజీ యంగ్ ఇండియా పత్రికలో 11 అంశాల కార్యక్రమం ప్రకటించారు. అహ్మదాబాద్‌లో ఫిబ్రవరిలో సమావేశమై గాంధీజీ నాయకత్వంలో శాసనోల్లంఘన ఉద్యమం చేయాలని తీర్మానించారు. గాంధీజీ 1930, మార్చి 12న సబర్మతి ఆశ్రమం నుంచి 78 మంది అనుచరులతో ప్రారంభమైన సత్యాగ్రహ యాత్రలో 375 కి.మీ. ప్రయాణించి ఏప్రిల్ 6న దండి గ్రామం చేరారు. దీనికి 24 రోజులు పట్టింది. దండి యాత్రలో పాల్గొన్న ఏకైక ఆంధ్రుడు ఎర్నేని సుబ్రమణ్యం/ సాధు సుబ్రమణ్యం. ఆంధ్రులు గాంధీజీని జంబూసర్‌లో కలిశారు. ఆంధ్రలో ఉద్యమ నిర్వహణకు కొండా వెంకటప్పయ్యను డిక్టేటర్‌గా నియమించారు. నెల్లూరు-పల్లిపాడు (మైపాడు), గుంటూరు, కృష్ణా-మచిలీపట్నం, పశ్చిమ గోదావరి-ఏలూరు కళాశాల, తూర్పుగోదావరి-సీతానగరం, విశాఖ-విజయనగరం శిబిరాలు ఏర్పాటు చేశారు. సత్యాగ్రహం అన్ని కేంద్రాల్లో ఒకేసారి జరగాలని భోగరాజు పట్టాభి సీతారామయ్య సూచించారు. మైపాడు (నెల్లూరు), మచిలీపట్నం, మట్టపాలెం (పశ్చిమ గోదావరి), చొల్లంగి (తూర్పుగోదావరి), విశాఖ బీచ్, గుంటూరులోని కొండా వెంకటప్పయ్య గృహం సత్యాగ్రహ కేంద్రాలుగా మారాయి.

1930, ఏప్రిల్ 6న చొల్లంగిలో సీతానగరం ఆశ్రమవాసులు దువ్వూరి సుబ్బమ్మ, బులుసు సాంబమూర్తి, తెన్నేటి సత్యన్నారాయణ, సూర్యప్రకాశరావులు సత్యాగ్రహం చేశారు. ఏప్రిల్ 9న కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఉన్నవ లక్ష్మీబాయమ్మ, రుక్మిణీ లక్ష్మీపతి సత్యాగ్రహం చేశారు. ఏప్రిల్ 11న పశ్చిమ గోదావరి జిల్లాలో దండు నారాయణ రాజు, నరహరిశర్మ; నెల్లూరులో బొమ్ము శేషారెడ్డి, ఓరుగంటి వెంకట సుబ్బయ్య, బెజవాడ గోపాలరెడ్డి ఉద్యమం చేశారు. ఓరుగంటి వెంకటసుబ్బయ్య భార్య మహాలక్ష్మమ్మ, కుటుంబ సభ్యులంతా సత్యాగ్రహం చేసి అరెస్ట్ అయ్యారు. రాయలసీమలో కల్లూరి సుబ్బారావు, మద్రాసులో కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు, దుర్గాబాయి దేశ్‌ముఖ్, గద్దె రంగయ్యనాయుడు సత్యాగ్రహం చేశారు. త్రిపురనేని రామస్వామి చౌదరి వీరగంథం తెచ్చినారము, వీరులెవ్వరో తెల్పుడీ, బసవరాజు అప్పారావు కొళ్ళాయి కట్టితేనేమి, మా గాంధీ కోమటై పుట్టితినేమి, గరికపాటి మల్లావధాని ఉప్పోయమ్మ ఉప్పు, గరిమెళ్ల సత్యనారాయణ ఉప్పు పన్ను, పప్పు పన్ను, ఊరికెళితే పన్ను, కొప్పు కాస్త దేవుడికి మొక్కుకుంటే పన్ను అనే గీతాలను రచించారు.
1930, జనవరి 26న కోఠిలో మర్రి చెన్నారెడ్డి, మచిలీపట్నంలో తోట నరసయ్య జాతీయ జెండాను ఎగురవేశారు. చల్లపల్లి, వీరభద్రాపురాల్లో గ్రామాధికారులు రాజీనామాలు చేశారు. పెద్దాపురంలో ఉప్పు సత్యాగ్రహ ఉద్యమాన్ని దువ్వూరి సుబ్బమ్మ నిర్వహించారు. వనభోజనాలపై లాఠీచార్జీని మద్రాస్ శాసనమండలిలో స్వామి వెంకటాచలంశెట్టి ఖండించారు. పోలీసులు కొమరవోలు, ఈడుపుగల్లు, కొవ్వూరు, పెనుమర్రు ఆశ్రమాలను ధ్వంసం చేశారు. ఉప్పు సత్యాగ్రహ సమయంలో జైలుశిక్ష అనుభవించిన తొలి ఆంధ్రా మహిళగా ఆచంట లక్ష్మీ రుక్మిణీపతి (రుక్మిణీ లక్ష్మీపతి) పేరొందారు. గొల్లపూడి సీతారామశాస్త్రి నాయకత్వంలో మద్యపాన వ్యతిరేక ఉద్యమం పెద్ద ఎత్తున జరిగింది. (గుంటూరు జిల్లా కలెక్టర్ నివేదిక).

గంజాంలోని నౌపడ, విశాఖపట్నం బాలచెరువు వద్ద ఉప్పు కొఠారులపై దాడి జరిగింది. తిరువూరు (కృష్ణా జిల్లా)లో ఖద్దరు ధోవతి ధరించిన న్యాయవాదిని పోలీసులు వివస్త్రుడిని చేశారు. 1931, మార్చి 31న వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఉత్సవంలో పోలీసులతో ఘర్షణ జరిగింది. 1931, మార్చి 5న గాంధీ ఇర్విన్ ఒప్పందం జరిగింది. గాంధీజీ రెండో రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యారు. ఆ సమావేశం విఫలం కావడంతో 1931, డిసెంబరు 28న దేశానికి తిరిగి వచ్చారు. తర్వాత మళ్లీ ఉద్యమాన్ని కొనసాగించారు. 1931లోనే కాకినాడ బాంబుకేసు జరిగింది. బ్రహ్మాజోస్యుల సుబ్రహ్మణ్యంను కొట్టిన సీఐ ముస్తఫా అలీఖాన్‌ను చంపడానికి ఉజ్జీవన్ సమ్మేళన్ భారత్ సంస్థ (చారీ & సన్స్)కు చెందిన ప్రతివాద భయంకరాచారి పడవలో బాంబులను తెస్తుండగా అవి పేలి కొంతమంది చనిపోయారు. భయంకరాచారిని ఖాజీపేట వద్ద అరెస్ట్ చేసి అండమాన్ జైలుకు పంపించారు. 1932, జనవరి 6న దుగ్గిరాల కమలాంబ, దాసరి కృష్ణ వేణమ్మ, దాసరి లక్ష్మీబాయమ్మలను అరెస్ట్ చేశారు. జనవరి 8న దండు నారాయణరాజు, 9న మాల్సూరి చుక్కమ్మ (ఏలూరు)ను నిర్బంధించారు. ఉద్యమకారులు వీరభారతి, బార్డోలి సత్యాగ్రహ విజయం, దరిద్ర నారాయణీయం, భారత స్వరాజ్య యుద్ధం, నవయుగం - గాంధీ విజయం, పూర్ణ స్వతంత్రం మొదలైన కరపత్రాలు పంచారు. 1932, మార్చిలో వెంట్రాప్రగడ గ్రామం (కృష్ణా జిల్లా)పై 4 వేల రూపాయల జరిమానా విధించారు. కాకినాడలో ఆండాళ్లమ్మ ఆస్తిని జప్తు చేశారు. కొడాలి ఆంజనేయులుపై విధించిన జరిమానా వసూలుకు అతడి సోదరుడిని, ఇంటి సామాన్లు, గేదెలను స్వాధీనం చేసుకున్నారు. దుర్గాబాయ్‌ దేశ్‌ముఖ్‌ను నెల్లూరు జైలు నుంచి మధుర జైలుకు పంపించారు. బళ్లారి జైలులో రాజకీయ ఖైదీలు 1932, ఫిబ్రవరి 29న నిరాహారదీక్ష చేశారు. స్వరాజ్య పత్రికల కరపత్రం ప్రచురించిన కలగా సత్యన్నారాయణకు ఏడాది శిక్ష పడింది.

కరపత్రాలు పంచుతున్న ఖాసా సుబ్బారావు, ఒ.పి. రామస్వామిని పోలీసులు కొట్టగా రుక్ష్మిణీ లక్ష్మిపతి వారిని తనకారులో తీసుకెళ్లి రక్షించింది. వేదాంతం కమలాదేవి అధ్యక్షతన గుంటూరు అగ్రహారంలో సభ జరిగింది. గుంటూరు జిల్లా మహాసభ తెనాలిలో తల్లాప్రగడ విశ్వసుందరమ్మ, నరసాపూర్ తాలూకా మహాసభ రుద్రరాజు బంగారయ్య, విశాఖజిల్లా మహాసభ టేకుమళ్ల బుచ్చిరామమ్మ, నెల్లూరు సభ చవనం తిరుమలమ్మ అధ్యక్షతన జరిగాయి.
1932లో బెర్ట్రాండ్ రస్సెల్ అధ్యక్షతన ఇండియన్ డెలిగేషన్ లీగ్ భారత్‌కు వచ్చింది. ఇందులో హెరాల్డ్‌లాస్కీ, విల్కిన్ సన్, కృష్ణమీనన్‌ సభ్యులు. 1932లో దళితులకు రామ్‌సే మెక్‌డొనాల్డ్ కమ్యూనల్ అవార్డు ప్రకటించారు. గాంధీజీ సెప్టెంబరు 20న ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించారు. 1933, మార్చి 8న గాంధీజీ హరిజనోద్ధరణ లక్ష్యంగా ఆత్మశుద్ధి నిరాహారదీక్షను ప్రారంభించారు. జులై 31న గాంధీజీ పిలుపునందుకుని దుగ్గిరాల బలరామకృష్ణయ్య, అయ్యదేవర కాళేశ్వరరావు, వావిలాల గోపాలకృష్ణయ్య వ్యక్తిగత శాసనోల్లంఘనను ప్రారంభించి అరెస్ట్ అయ్యారు. 1934, మే 30న ఉప్పు సత్యాగ్రహాన్ని నిలిపివేశారు.
1934 - 42 మధ్య ఆంధ్రలో అనేక సంఘటనలు జరిగాయి. ఆంధ్ర స్వరాజ్యపార్టీ గాడిచెర్ల, కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ ఎన్.జి. రంగా, ఆంధ్ర సోషలిస్ట్ పార్టీ తెన్నేటిల అధ్యక్షతన ఏర్పడ్డాయి. 1937 ఎన్నికలు అనంతరం జులై 14న మద్రాస్‌లో సి. రాజగోపాలచారి ముఖ్యమంత్రిగా ప్రథమ కాంగ్రెస్ మంత్రివర్గం ఏర్పడింది. ప్రకాశం (రెవెన్యూమంత్రి), వి.వి.గిరి, బెజవాడ గోపాలరెడ్డి మంత్రులుగా; బులుసు సాంబమూర్తి శాసనసభ అధ్యక్షులుగా పదవులు చేపట్టారు.

1939 రెండో ప్రపంచ యుద్ధం, కాంగ్రెస్ మంత్రి వర్గాల రాజీనామాలు, గాంధీజీ వ్యక్తి సత్యాగ్రహాలకు పిలుపునివ్వడం, ఆచార్య వినోబాభావే తొలి వ్యక్తి సత్యాగ్రహం చేయడం (1940) జరిగాయి. 1941, ఏప్రిల్ వరకు అనేక మంది సత్యాగ్రహాలు చేసి అరెస్ట్ అయ్యారు. రాజాజీ మంత్రివర్గం 1939, అక్టోబరు 29న రాజీనామా చేసింది. టంగుటూరి ప్రకాశంపంతులు, భోగరాజు పట్టాభి సీతారామయ్య, తెన్నేటి విశ్వనాథం, బెజవాడ గోపాల్‌రెడ్డి, వి.వి.గిరి, కల్లూరి సుబ్బారావు, అయ్యదేవర కాళేశ్వరరావు, రుక్ష్మిణీ లక్ష్మీపతి, కడప కోటిరెడ్డి, మాగంటి బాపినీడు, రంగా దంపతులు, కంభంపాటి సత్యన్నారాయణ, మొసలికంటి తిరుమలరావు, తరిమెల నాగిరెడ్డి, కల్లూరి చంద్రమౌళి, అనంతశయన అయ్యంగార్ లాంటి నాయకులు వ్యక్తి సత్యాగ్రహాలు చేసి అరెస్ట్ అయ్యారు.
 

ఆంధ్ర సర్క్యులర్ / కర్నూలు సర్క్యులర్ 
1942, జులై 29న ఆంధ్రరాష్ట్ర కాంగ్రెస్ మచిలీపట్నంలో సమావేశమై క్విట్ ఇండియా ఉద్యమ నిర్వహణకు ఒక రహస్య సర్క్యులర్‌ను రూపొందించింది. దీన్ని రూపొందించింది ఆంధ్ర కాంగ్రెస్ కార్యదర్శి కళా వెంకట్రావ్, అధ్యక్షుడు భోగరాజు పట్టాభిసీతారామయ్య. కర్నూలు కాంగ్రెస్ కార్యాలయంలో దొరకడం వల్ల దీన్ని కర్నూలు సర్క్యులర్ అన్నారు.

 

ఆంధ్రలో క్విట్ ఇండియా ఉద్యమం
1942 మార్చిలో క్రిప్స్ రాయబారం విఫలం కావడంతో గాంధీజీ డూ ఆర్ డై నినాదంతో క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించారు. 1942, ఆగస్టు 8న బొంబాయిలోని గవాలియా మైదానంలో క్విట్ ఇండియా తీర్మానం చేశారు. గాంధీజీని బంధించి పూనాలోని ఆగాఖాన్ భవన్‌లో ఉంచారు. 1942, ఏప్రిల్ 6న కాకినాడ, విశాఖపట్నం నగరాలపై జపాన్ బాంబులు వేసింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం వాల్తేరు నుంచి గుంటూరుకు మారింది.

ఆంగ్లేయులు శాంతియుతంగా భారతదేశం వదిలి వెళ్లే సమయం ఆసన్నమైందని గాంధీజీ హరిజన్ పత్రికలో రాశారు. వార్ధాలో జరిగిన సారథ్య సంఘ సమావేశంలోనే తిరుగుబాటు తప్పదని గాంధీజీ హెచ్చరించారు. ఉద్యమకాలంలో దండు నారాయణ రాజు జైల్లోనే చనిపోయారు. కర్నూలు వాసి నివర్తి వెంకట సుబ్బయ్య ప్రచ్ఛన్న జీవితాన్ని గడిపాడు. పరదేశీయులు తొలగండి, ఈ భారతదేశం మాదేశం, వినండి, వినండీ విశ్వ ప్రజలు వీరభారతీ సందేశం అనే గీతాన్ని వానమామలై వరదాచార్యులు రచించారు.
 ఆంధ్రదేశమంతా హింసాత్మక ఉద్యమ సంఘటనలు జరిగాయి. ఆగస్టు 11న తెనాలిలో బహిరంగ సభ జరిగింది. 12న రైల్వేస్టేషన్‌ను తగులబెట్టారు. పోలీసు కాల్పుల్లో 6 మంది చనిపోయారు. వారి సమాధులు తెనాలి మారిస్‌పేటలో ఉన్నాయి. చీరాల సబ్ మెజిస్ట్రేట్ ఆఫీసును మూసివేశారు. ఆగస్టు 13న పాలకొల్లు రైల్వేస్టేషన్, చీరాల పోలీస్ స్టేషన్, ఆకివీడు పీఎస్, ఆర్ఎస్‌లను ధ్వంసం చేశారు. గుంటూరులో విద్యార్థులపై హిందూ కళాశాల వద్ద కాల్పులు జరుపగా ఇద్దరు విద్యార్థులు మరణించారు. ఆగస్టు 17న భీమవరంలో మెజిస్ట్రేట్ కోర్టును మూయించి డిప్యూటీ కలెక్టర్‌కు కాంగ్రెస్ పతాకాన్ని ఇచ్చి వీధుల్లో నడిపించారు. నాటి ఉద్యమ ఉద్ధృతిని గురించి పేర్కొంటూ కరుణశ్రీ లేచిపోయినవి పోలీసుల టోపీలు వందలు వేలు రాబందులట్లు, కాలిపోయినవి సర్కారు కచేరీలు ఖరదుషాణాదుల కాష్టమట్లు అని రాశారు. గుంటూరు జిల్లాలో మూడున్నర లక్షల రూపాయలు, గోదావరి జిల్లాలో రెండున్నర లక్షల రూపాయల జరిమానాలు వసూలు చేశారు. మచిలీపట్నంలో వీరరాఘవయ్య, రాజమండ్రిలో వి.బి. నాగేశ్వరరావు, మదనపల్లిలో నరసింహారెడ్డి ఉద్యమాన్ని ప్రచారం చేశారు. 1942, ఆగస్టు 17న కనపర్తి, పెంటకోట, సూళ్లూరుపేట ఉప్పు కొఠారులపై దాడి జరిగింది.

 ప్రభుత్వం నెల్లూరు, చిత్తూరు, తూర్పు గోదావరి జిల్లా బోర్డులను; విజయవాడ, పాలకొల్లు పురపాలక సంఘాలను రద్దు చేసింది. ఎం.ఎన్. రాయ్ రాడికల్ డెమోక్రటిక్ పార్టీని స్థాపించాడు. ఆంధ్రా రాడికల్ డెమోక్రటిక్ పార్టీ ప్రథమ సభ తెనాలిలో ఎం.ఎన్. రాయ్ అధ్యక్షతన జరిగింది. ఈ పార్టీ ఆంధ్రాలో రాజకీయ పాఠశాలలు, రాడికల్, రాడికల్ స్టూడెంట్ అనే వార పత్రికలను నడిపింది. 1942, సెప్టెంబరు 20న జగ్గయ్యపేటలో చింతామణి నాటకం తిలకిస్తున్న కృష్ణా జిల్లా మెజిస్ట్రేట్‌పై బాంబుదాడి జరిగింది. విజయవాడ, ఒంగోలు, బందరు ప్రాంతాల్లో బాంబులు, ఆయుధాలు, ఉత్తరాలు స్వాధీనం చేసుకున్నారు. 1944లో గాంధీజీ జైలు నుంచి విడుదలయ్యారు. క్విట్ ఇండియా ఉద్యమం నిలిచిపోయింది. 1945 వేవెల్ ప్రణాళిక రూపకల్పన, అట్లీ 1945, 46 ఎన్నికలు భారత్‌లో నిర్వహించడానికి నిర్ణయం. ఫలితంగా 1945 కేంద్ర శాసనసభ ఎన్నికల్లో ఆచార్య రంగా, అనంతశయనం అయ్యంగార్, ఎం. గంగరాజులు కేంద్ర శాసనసభకు ఎన్నికయ్యారు. రాష్ట్రశాసనసభ ఎన్నికలు 1946లో 215 స్థానాలకు కాంగ్రెస్ 165 స్థానాలు గెలుచుకుని టంగుటూరి ప్రకాశం ముఖ్యమంత్రిగా మంత్రివర్గం ఏర్పడింది. వి.వి. గిరి, వేముల కూర్మయ్య, కడప కోటిరెడ్డి ఆంధ్ర నుంచి మంత్రులుగా నియమితులయ్యారు. పాకిస్థాన్ ఏర్పాటును అలీబేగ్ నాయకత్వంలోని ఆంధ్ర ముస్లిం లీగ్ హర్షించింది. కమ్యూనిస్ట్‌లు పాకిస్థాన్ ఏర్పాటును సమర్థించడాన్ని రంగా విమర్శించారు. దేశ విభజనను కాంగ్రెస్ ఆమోదించడం దురదృష్టకరమని టంగుటూరి విమర్శించారు. పాకిస్థాన్ ఏర్పాటు అహింసా ఉద్యమం దౌర్జన్య శక్తులకు తలవంచడమే అని జి.వి. సుబ్బారావు వ్యాఖ్యానించారు.

ఆంధ్రాలో జమీందారీ వ్యతిరేక రైతు ఉద్యమాలు
కమ్యూనిస్ట్ నాయకుల ప్రభావంతో ఆంధ్రలో అనేక రైతు ఉద్యమాలు జరిగాయి. 1928లో విజయవాడలో ఆంధ్రరాష్ట్ర రైతు సంఘం, 1937లో ఆంధ్రరాష్ట్ర వ్యవసాయ కూలీ సంఘం ఏర్పడ్డాయి. ఎన్జీ రంగా నిడుబ్రోలు (గుంటూరు జిల్లా) కేంద్రంగా 1931లో రైతు రక్షణ సంఘాన్ని నెలకొల్పాడు. దీనికి గొట్టిపాటి బ్రహ్మయ్య సాయపడ్డాడు. నిడుబ్రోలులోనే రామినీడు రైతు విద్యాలయం ప్రారంభించారు. (రంగా కుటుంబం, భార్య - భారతీదేవి రంగా). నెల్లూరులో వెంకటగిరి జమీందారుకు వ్యతిరేకంగా వెన్నెలకంటి రాఘవయ్య నాయకత్వంలో ఉద్యమాలు జరిగాయి. 1937 వ్యవసాయ కూలీల సమావేశానికి ఎం.ఎన్. రాయ్ అధ్యక్షత వహించారు. నెల్లూరి వెంకటరామానాయుడు 1930లో జమీన్ రైతు పత్రికను ప్రారంభించాడు. మాకొద్దీ జమీందారుల పొందు అనే ప్రఖ్యాత గీతాన్ని రాసి పాడింది రామానాయుడే. కృష్ణా జిల్లా, నందిగామ తాలూకాలోని మునగాల సంస్థానంలో మునగాల రాజా వెంకట రంగారావు దత్తపుత్రుడు కోదండరామయ్య దురాగతాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వహించి 1931, జూన్ 11ను మునగాల దినంగా పాటించారు. ఆంధ్రదేశంలోని అతిపెద్ద సంస్థానం వెంకటగిరి (నెల్లూరు). ఈ సంస్థానంలో కోరు శిస్తు విధానానికి వ్యతిరేకంగా వెంకట రామానాయుడు ఉద్యమాలు నడిపాడు. దారీ, డొంకలు లేని ఊరిలోన అనే పాట ఉన్న రైతుబిడ్డ సినిమా ప్రదర్శితమవుతున్న హాలును 1940, ఫిబ్రవరి 5న జమీందారు తగులబెట్టించాడు. కాళీపట్నం సంస్థానం (పశ్చిమ గోదావరి జిల్లా)లో భోగరాజు పట్టాభిసీతారామయ్య నాయకత్వంలో ఉద్యమం జరిగింది. పట్టాభి తన జన్మభూమి పత్రికలో ఉద్యమాన్ని ప్రచారం చేశాడు. గాంధీజీ హరిజన్ పత్రికలో ఈ ఉద్యమం గురించి ప్రస్తావించారు. రాజగోపాలాచారి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మద్రాస్ శాసనసభలో ఈ ఉద్యమం గురించి చర్చించారు.

కృష్ణా జిల్లాలోని చల్లపల్లి జమీందారుకు వ్యతిరేకంగా గొర్రెపాటి వెంకట సుబ్బయ్య ఉద్యమాన్ని నడిపాడు. బొబ్బిలి జమీందారుకు వ్యతిరేకంగా గరిమెళ్ల కృష్ణమూర్తి ఉద్యమం నడిపాడు. అతడి పత్రిక పేరు ప్రజావాణి. 1938 జులై 13న ఎన్జీ రంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నుంచి మద్రాస్ వరకు (45 రోజులు) 1500 మైళ్లు (525 గ్రామాలు) జమీందారీ వ్యతిరేక రైతు పాదయాత్ర నిర్వహించాడు. పలాస, మందస సంస్థానాల్లో రైతు ఉద్యమం నడిపిన మహిళ పూసునూరు గున్నమ్మను 1940, ఏప్రిల్ 1న కాల్చి చంపారు. ఫలితంగా ఒ.పి. రామస్వామి రెడ్డియార్ ముఖ్యమంత్రి కాలంలో జమీందారీ విధానపు రద్దు బిల్లును 1948 అక్టోబరు 27న మద్రాస్ శాసనసభలో ప్రవేశపెట్టగా అది 1949, సెప్టెంబరు 7న చట్టంగా రూపొందింది.
మద్దుకూరి చంద్రశేఖరరావు, దర్శి చెంచయ్య, చండ్ర రాజేశ్వరరావు ఆంధ్రదేశంలో కమ్యూనిస్ట్ భావాలను వెదజల్లారు. వీరు బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో చదివేటప్పుడు ఫ్రెడరిక్ ఏంజిల్స్ - యాంటి దురాగ్, షేర్‌వుడ్ రష్యా టుడే గ్రంథాలు చదివి ప్రభావితమయ్యారు. మద్రాస్‌లో ఆంధ్రుడైన అమీర్ హైదర్‌ఖాన్ యంగ్ వర్కర్స్ లీగ్‌ను స్థాపించాడు. ఎన్జీ రంగా నిడుబ్రోలు, కొత్తపట్నం, తుళ్లూరు, మంతెనవారిపాలెం, కంకిపాడుల్లో రాజకీయ పాఠశాలలు ఏర్పాటు చేశారు. శ్రీశ్రీ - మహాప్రస్థానం, క్రొవ్విడి లింగరాజు - అమ్మ (మదర్ 1934), గద్దె లింగయ్య - విప్లవ వీరులు, విద్వాన్ విశ్వం - పాపం నా హృదయం, పెన్నేటి పాటలు; నార్ల వెంకటేశ్వరరావు - నేటి రష్యా, ముల్క్‌రాజ్ ఆనంద్ - కూలీ, అన్‌టచబుల్ గ్రంథాలు కమ్యూనిజం భావజాలాన్ని వెదజల్లాయి.

పత్రికలు
ఆంధ్రదేశంలో తొలి కమ్యూనిస్టు పత్రిక ఎన్జీ రంగా - చిత్రగుప్త పత్రిక. మద్దుకూరి చంద్రశేఖరరావు - నవశక్తి, తాపి ధర్మారావు - జనవాణి, ఎన్జీ రంగా - ప్రజాబంధు, మద్దూరి అన్నపూర్ణయ్య - కాంగ్రెస్, కొంపెల్లి జనార్ధనరావు - ఉదయిని. ప్రజామిత్ర పత్రికలో త్రిపురనేని గోపీచంద్ మార్క్సిజం గురించి వ్యాసాలు రాశారు. జి.వి. కృష్ణారావు కీలుబొమ్మలు నవల రాశారు.

 

సమ్మెలు
1938 చీరాల ఇండియన్ లీఫ్ టొబాకో డెవలప్‌మెంట్ సమ్మె, 1939 ఫిబ్రవరిలో చిట్టివలస జనపనార మిల్లు కార్మికుల సమ్మె, 1939 ఏప్రిల్‌లో కాకినాడ పీచు కార్మికుల సమ్మెకు సి.వి.కె.రావు నాయకత్వం వహించారు. కాశీపట్నం (పశ్చిమ గోదావరి జిల్లా), మునగాల (కృష్ణాజిల్లా), రైతు ఉద్యమాలు జరిగాయి.

 

ఆంధ్రోద్యమం 
1910లో విజ్ఞాన చంద్రికా మండలి ప్రచురించిన చిలుకూరి వీరభద్రరావు ఆంధ్రుల చరిత్రలోని తొలి పలుకులు తెలుగువారి గత వైభవాన్ని వివరించాయి. మద్రాస్ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు, అవమానాలకు వ్యతిరేకంగా తెలుగువారు తమ భాషా, సంస్కృతులను రక్షించుకోవడానికి ఆంధ్రోద్యమాన్ని ప్రారంభించారు. జాతీయోద్యమానికి శాఖ అయిన ఉప జాతీయోద్యమం ఈ ఆంధ్రోద్యమం అని భోగరాజు పట్టాభి సీతారామయ్య పేర్కొన్నారు. మద్రాస్ రాష్ట్రంలో ఆంధ్ర ప్రాంతం 58% విస్తీర్ణంలో ఉంది. జనాభాలో 40 శాతం మంది తెలుగువారే. భాషా పరంగా దేశంలోనే తెలుగువారు మూడో స్థానంలో ఉన్నారు.

కానీ 1910 నాటికి మద్రాస్ రాష్ట్రంలో తెలుగు వారి స్థానం చాలా తక్కువగా ఉంది. సబ్ కలెక్టర్లు 1/3, డిప్యూటీ కలెక్టర్లు 21/39, జిల్లా జడ్జీలు 0/19, డిస్ట్రిక్ మున్సిఫ్‌లు 30/93, జిల్లా రిజిస్ట్రార్‌లు 2/17 మందిగా ఉన్నారు. 1915 నాటికి రాష్ట్రంలోని 31 కళాశాలల్లో 8 మాత్రమే ఆంధ్ర ప్రాంతంలో ఉన్నాయి. మొత్తం 583 సెకండరీ పాఠశాలల్లో 163 మాత్రమే ఉన్నాయి. పారిశ్రామిక పాఠశాలలు 3800 ఉండగా అందులో 400 మాత్రమే ఆంధ్రలో ఉన్నాయి.
మాదాల వీరభద్రరావు ఆంధ్రోద్యమాన్ని భావనాదశ, ప్రచార దశగా విభజించారు. 1903-04 మధ్య గుంటూరులో జొన్న విత్తుల గురునాథం ఆధ్వర్యంలో యంగ్‌మెన్ లిటరరీ అసోసియేషన్ స్థాపితమైంది. దీనికి కురుపాం రాజా కార్యదర్శిగా పనిచేశారు. హిందూ పత్రికలో వ్యాసాలు రాస్తూ ఆంధ్రోద్యమ భావనకు అంకురార్పణ చేశారు. గొల్లపూడి సీతారామశాస్త్రి, ఉన్నవ లక్ష్మీనారాయణ, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య YLA (యంగ్‌మెన్స్ లిటరరీ అసోసియేషన్)లో ముఖ్య సభ్యులు. 1911లో ఉన్నవ, జొన్నవిత్తుల తెలుగు ప్రజలు నివసిస్తున్న మొత్తం ప్రాంతాన్ని ఒకే చిత్రపటంగా తయారుచేశారు. ''తెలుగువారిని ఏకంచేసి వారికి ప్రత్యేక రాష్ట్రం, గవర్నర్, శాసనమండలిని ఏర్పాటుచేయడం ఆంగ్ల పాలకుల ధర్మమం" అని ఆంధ్రకేసరి పత్రిక రాసింది. 1911 ఢిల్లీ దర్బారులోనే భాషా ప్రయుక్త రాష్ట్రాల భావనకు బీజం పడింది.
 'ప్రత్యేక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే తప్ప తెలుగు ప్రజల సంస్కృతికి రక్షణ లేదు' అని దేశాభిమాని పత్రిక రాసింది. 1912 మేలో నిడదవోలులో 21వ కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాల సంయుక్త సమావేశాలు వేమవరపు రామదాసు పంతులు అధ్యక్షతన జరిగాయి. ప్రత్యేకాంధ్ర రాష్ట్ర ఏర్పాటు తీర్మానాన్ని సూర్యనారాయణ ప్రతిపాదించగా, వాయిదా వేయాలని సాంబశివరావు కోరారు.

తీర్మానం నెగ్గకపోయినా గుంటూరు ప్రతినిధులు నిరుత్సాహపడకుండా కొండా వెంకటప్పయ్య కార్యదర్శిగా స్థాయీ సంఘాన్ని నియమించారు. ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర ఆవశ్యకతను వివరిస్తూ కొండా, జొన్నవిత్తుల ఒక పుస్తకాన్ని ప్రచురించారు. దేశంలో ఇప్పటికీ సమైక్యం కష్టమైంది, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం వల్ల మరో అడ్డంకి ఏర్పడుతుందని హిందూ పత్రిక రాసింది. న్యాపతి సుబ్బారావు కూడా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర కోరికను తిరస్కరించారు.
 

1913 ప్రథమాంధ్ర మహాసభ - బాపట్ల
 గుంటూరు జిల్లా బాపట్లలో బి.ఎన్. శర్మ అధ్యక్షతన 1913, మే 20న ప్రథమాంధ్ర మహాసభ ప్రారంభమైంది. ప్రత్యేకాంధ్ర తీర్మానాన్ని వి. రామదాసు పంతులు ప్రతిపాదించగా న్యాపతి సుబ్బారావు, మోచర్ల రామచంద్రరావు, గంటి వెంకట రామయ్యలు వ్యతిరేకించారు. కృష్ణారావు సవరణ తీర్మానాన్ని ప్రతిపాదించారు. బాపట్ల సమావేశం ఆంధ్రోద్యమానికి నాంది పలికింది. రెండో ఆంధ్ర మహాసభ సమావేశాలు విజయవాడలో న్యాపతి సుబ్బారావు అధ్యక్షతన 1914 ఏప్రిల్‌లో జరిగాయి. మందా సూర్యనారాయణ ప్రత్యేకాంధ్ర రాష్ట్ర తీర్మానాన్ని ప్రతిపాదించగా, రామదాసు పంతులు బలపరిచారు. నెల్లూరు, కడప ప్రతినిధులు వ్యతిరేకించినప్పటికీ తీర్మానం నెగ్గింది. మూడో సభలు 1915 మేలో పానగల్ రాజా అధ్యక్షతన విశాఖపట్నంలో జరిగాయి. ఈ సమావేశంలో పదకొండు తెలుగు జిల్లాలను ప్రత్యేక రాష్ట్రంగా రూపొదించడం న్యాయం, ఆవశ్యకం అని, సెకండరీ పాఠశాలల్లో తెలుగు బోధనా భాషగా ఉండాలి అని తీర్మానించారు. నాలుగో సభలు 1916 మేలో కాకినాడలో దక్షిణ భారత గోఖలే మోచర్ల రామచంద్రరావు అధ్యక్షతన జరిగాయి. ఆహ్వాన సంఘం అధ్యక్షులు కృష్ణారావు. యుద్ధానంతరం సాధ్యమైనంత త్వరలో రాష్ట్రం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరాలని తీర్మానం చేశారు. నెల్లూరు అనంతపురం ప్రతినిధులు దీనికి వ్యతిరేకించారు.

 1917 జూన్‌లో అయిదో ఆంధ్ర మహాసభ సమావేశాలు కొండా వెంకటప్పయ్య అధ్యక్షతన నెల్లూరులో జరిగాయి. ఇదే సంవత్సరం ఏప్రిల్‌లో బి.ఎన్. శర్మ అధ్యక్షతన ఆంధ్ర రాజకీయ సమితి (1917) ఏర్పడింది. ఈ సమావేశంలో సర్కారు ఆంధ్ర, రాయలసీమ జిల్లాల మధ్య అభిప్రాయ భేదాలు బహిర్గతమయ్యాయి. గుత్తి కేశవ పిళ్లై, ఏకాంబర్ అయ్యర్ (నంద్యాల) మద్రాస్ రాష్ట్ర అనుకూలురు. కానీ గాడిచెర్ల హరిసర్వోత్తమరావు లాంటి నాయకులు ఆంధ్రోద్యమానికి అనుకూలురు. ఓటింగ్ జిల్లాలవారీగా జరగాలని, జిల్లాకు ఒక ఓటు ఇవ్వాలని గాడిచెర్ల ప్రతిపాదించారు. బి.ఎన్. శర్మ మధ్యవర్తిత్వంతో ప్రత్యేకాంధ్ర తీర్మానం నెగ్గింది. 1917 విజయవాడ ప్రత్యేకాంధ్ర మహాసభ సమావేశం నిర్ణయం ప్రకారం 1917, డిసెంబరు 17న న్యాపతి సుబ్బారావు నాయకత్వంలోని ప్రతినిధి బృందం మాంటేగ్‌ను కలిసి ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకతను వివరించారు.
1918 ఫిబ్రవరిలో బి.ఎన్. శర్మ కేంద్ర శాసనసభలో భాషాప్రయుక్త రాష్ట్రాలను ఏర్పాటు చేయాలని చేసిన ప్రతిపాదన వీగిపోయింది. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు సమయం ఆసన్నంకాలేదని సురేంద్రనాథ్ బెనర్జీ అభిప్రాయపడ్డారు. తీర్మానం ఒక్క ఆంధ్ర రాష్ట్రానికే అయితే సమర్ధించి ఉండేవాడినని తేజ్ బహదూర్ సఫ్రూ అన్నారు. విశాఖపట్నం జిల్లా సమావేశానికి అధ్యక్షత వహించిన జయపూర్ మహారాజు విక్రమదేవ వర్మ తాను పుట్టుకతో ఆంధ్రుడిని కాకపోయినా ఆంధ్రోద్యమం పట్ల అపారమైన సానుభూతి ఉందని ప్రకటించాడు. 1918 కడప జిల్లా సమావేశానికి అధ్యక్షత వహించిన నెమలి పట్టాభి రామారావు కూడా ఆంధ్రోద్యమాన్ని బలపరిచారు. 1891లో పి. ఆనందాచార్యులు కాంగ్రెస్‌కు అధ్యక్షత వహించారు. న్యాపతి సుబ్బారావు ఐఎన్‌సీ కార్యదర్శిగా విచ్చేశారు. 1914 మద్రాస్ ఐఎన్‌సీ సమావేశానికి 256 మంది ఆంధ్ర ప్రతినిధులు పాల్గొన్నారు. కానీ ఆంధ్రులకు సరైన ప్రాతినిధ్యం ఇవ్వలేదు.

ప్రత్యేక ఆంధ్ర కాంగ్రెస్ సర్కిల్ ఏర్పాటు (1918, జనవరి 22)
 1916 లక్నో కాంగ్రెస్ సమావేశంలో ఐఎన్‌సీ కమిటీ ఆంధ్ర కాంగ్రెస్ సర్కిల్ ఏర్పాటు విషయాన్ని పరిశీలించింది. పట్టాభి, కొండాల కృషి, తిలక్ జోక్యంతో 1918, జనవరి 2న న్యాపతి సుబ్బారావు అధ్యక్షుడిగా, కొండా కార్యదర్శిగా ప్రత్యేకాంధ్ర కాంగ్రెస్ సర్కిల్ ఏర్పడింది. మాంటేగ్, ఛెమ్స్ ఫర్డ్ సంస్కరణలు 1918 జులైలో ప్రకటితమయ్యాయి. అందులో ప్రత్యేకాంధ్ర ప్రస్తావన లేకపోవడంతో 1918, ఆగస్టు 17న గుంటూరులో కాశీనాథుని నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ప్రత్యేకాంధ్ర మహాసభ సమావేశంలో ఆంధ్రులు నిరసన తెలియజేశారు. పట్టాభి అఖిల భారత భాషా ప్రయుక్త రాష్ట్రాల సమావేశాన్ని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను ఐఎన్‌సీ అంగీకరించలేదు. ఆంధ్ర సంఘం తరుపున మాచర్ల రామచంద్రరావు వినతి పత్రాన్ని లండన్‌లో బ్రిటిష్ ప్రభుత్వానికి సమర్పించారు. వెంకటపతిరాజు మద్రాస్ శాసనమండలిలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమం వల్ల ఆంధ్రోద్యమం మరుగున పడింది. 1920 నాగ్‌పూర్ కాంగ్రెస్ సమావేశం భాషా ప్రయుక్త కాంగ్రెస్ విభాగాల ఏర్పాటుకు ఆమోదించారు.
1922లో రామయ్యపంతులు కేంద్ర శాసన మండలిలో ప్రత్యేకాంధ్ర రాష్ట్ర ఏర్పాటును గురించి ప్రవేశపెట్టిన తీర్మానం తిరస్కరణకు గురైంది. 1916 నవంబరులో దక్షిణ భారత ప్రజల సంఘాన్ని (South India Peoples Association - SIPA) పిట్టి త్యాగరాయచెట్టి స్థాపించారు. 1917 ఫిబ్రవరి 20న జస్టిస్ అనే పత్రికను ప్రారంభించారు. తెలుగు, తమిళం, ఆంగ్ల భాషల్లో పత్రిక నడిపారు. SIPA జస్టిస్ పార్టీగా మారింది. ఈ పార్టీ రాజ్యాంగ సంస్కరణల కోసం ఒక ప్రతినిధి బృందాన్ని లండన్‌కు పంపింది. కె.వి. రెడ్డినాయుడు (ఏలూరు), కోకా అప్పారావు నాయుడు (బర్హంపూర్), పానగల్ రాజా ప్రతినిధి బృందం సభ్యులుగా వెళ్లి జాయింట్ సెలక్ట్ కమిటీ ముందు సాక్ష్యమిచ్చారు.

 జస్టిస్ పార్టీ ఆంగ్ల పాలనను సమర్థించింది. 1925లో డాక్టర్ రామారావు మద్రాస్ శాసనసభలో ప్రత్యేక కన్నడ రాష్ట్ర ఏర్పాటు తీర్మానం ప్రవేశపెట్టారు. 1926లో శంకర్‌నాయర్ ప్రత్యేక తమిళ రాష్ట్ర ఏర్పాటు తీర్మానం ప్రవేశపెట్టారు. రామదాసు పంతులు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కాని అన్ని తీర్మానాలు వీగిపోయాయి.
 

ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏర్పాటు (1926, ఏప్రిల్ 26 - విజయవాడ)
1913 బాపట్ల ప్రథమాంధ్ర మహాసభలో ప్రత్యేక ఆంధ్ర విశ్వవిద్యాలయం గురించి చర్చ జరిగింది. 1917 ఫిబ్రవరిలో వెంకటపతిరాజు మద్రాస్ శాసనసభలో తెలుగు ప్రాంతానికి ప్రత్యేక విశ్వవిద్యాలయం కావాలని తీర్మానం ప్రవేశపెట్టాడు. విశాఖపట్నం సభ్యుడు సూర్యనారాయణ శాసనమండలిలో తీర్మానం ప్రతిపాదించారు. కానీ విద్యామంత్రి ఎ.వి. పాత్రో 1921 మద్రాస్ విశ్వవిద్యాలయం పునర్‌వ్యవస్థీకరణ బిల్లు ప్రవేశపెట్టారు. నాలుగు సంవత్సరాల తర్వాత 1925లో శాసన మండలిలో బిల్లు ప్రవేశపెట్టి సెలెక్ట్ కమిటికి నివేదించారు. బళ్లారి జిల్లాను మినహాయించాలని సత్యమూర్తి కోరారు.
    ఆంధ్ర బదులు తెలుగు విశ్వవిద్యాలయం అని వ్యవహరించాలని కె.వి. రెడ్డినాయుడు సవరణ ప్రతిపాదించారు. చివరికి 1926, ఏప్రిల్ 26న విజయవాడలో కట్టమంచి రామలింగారెడ్డి ప్రథమ వైస్ ఛాన్సెలర్‌గా ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. భాషాపరంగా పేరు పెట్టిన తొలి భారతీయ విశ్వవిద్యాలయం ఇదే. కాని విద్యాలయ కేంద్రం విషయంలో వివాదం ఏర్పడింది. పాలనా విభాగాలు విజయవాడలో, బోధనా శాఖలు రాజమండ్రిలో ప్రారంభించాలని నిర్ణయమైంది. ముఖ్యమంత్రి సుబ్బరాయన్ విద్యాలయ కేంద్రంగా రాజమండ్రి తగిన ప్రదేశమని ప్రతిపాదించి మళ్లీ వివాదాన్ని లేవనెత్తారు. బొల్లి మునుస్వామినాయుడు (చిత్తూరు) రాయలసీమ ప్రాంతాన్ని ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధి నుంచి తొలగించమని తీర్మానం ప్రతిపాదించారు.

1931లో పట్టాభి, అయ్యదేవర గాంధీజీని కలిసి ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు గురించి ప్రస్తావించారు. స్వాతంత్య్రానంతరం ఏర్పడుతుందని గాంధీజీ చెప్పారు. వి.వి.గిరి, మోచర్ల రామచంద్రరావు, బొబ్బిలి రాజా, ఎ.వి. పాత్రోలు సెక్రటరీ ఆఫ్ స్టేట్ లార్డ్ లూథరన్‌ను కలసి నూతన ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయమని కోరారు. 1932లో బొబ్బిలిరాజా మద్రాస్ ముఖ్యమంత్రి అవగా గాడిచెర్ల శానసమండలిలో తక్షణమే ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు జరగాలని తీర్మానం ప్రతిపాదించారు. 1934లో ఆంధ్ర కాంగ్రెస్ స్వరాజ్య పార్టీ ఏర్పడింది. జి.వి. సుబ్బారావు ఈ పార్టీ కార్యదర్శి. 1934 విశాఖపట్నం ఆంధ్ర మహాసభ సమావేశంలో అయ్యదేవర ఆంధ్ర రాష్ట్ర స్థాపన జీవన్మరణ సమస్యగా పరిగణించాలని కోరారు. ఆంధ్ర నిధి ఏర్పాటుకు తీర్మానించారు. 1935 మార్చిలో కెప్టెన్ షా బ్రిటిష్ పార్లమెంటులో ప్రత్యేకాంధ్ర రాష్ట్రం కోసం వాదించారు.
 

వివాదాలు, అభిప్రాయ భేదాలు
1913 ఏప్రిల్‌లో రాయలసీమ జిల్లాల వారు కర్నూలు జిల్లా మహానంది వద్ద గుత్తి కేశవ పిళ్లై అధ్యక్షతన సమావేశమై ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు సాధ్యం కాదని ప్రకటించారు. కేశవపిళ్లై ఆంధ్రోద్యమాన్ని బ్రాహ్మణ ఉద్యమంగా చిత్రించాడు. 1917 నెల్లూరు 5వ ఆంధ్ర మహాసభలో కూడా వివాదం తలెత్తింది. 1924 విజయవాడలో జరిగిన ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఎన్నికల్లో గాడిచెర్లను అధ్యక్షుడిగా ప్రతిపాదించగా సర్కారు జిల్లాలవారు అంగీకరించలేదు. 1931, అక్టోబరులో ఆంధ్ర మహాసభ ప్రత్యేక సమావేశం కడప కోటిరెడ్డి అధ్యక్షతన జరిగింది (మద్రాస్). రాయలసీమకు ప్రత్యేక ప్రాతినిధ్యం ఇవ్వాలని కల్లూరి సుబ్బారావు, ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం ఏర్పరచాలని సుబ్రహ్మణ్యం ప్రతిపాదించారు.

రాయలసీమ మహాసభలు
ప్రథమ సమావేశం 1934, జనవరి 28న మద్రాస్‌లో నెమలి పట్టాభిరామారావు అధ్యక్షతన జరిగింది. ఈ సభలను ప్రారంభించింది సత్యమూర్తి. వీరు ఈ సమావేశంలో తిరుపతిలో ప్రత్యేక విశ్వవిద్యాలయం స్థాపించాలని కోరారు. రెండో సభ 1935లో కడపలో జరిగింది. 1937 ఎన్నికల్లో రాజగోపాలాచారి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. పట్టాభి ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులయ్యారు. రాజ్యాంగం అమలుకు ముందే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడాలని శాసనసభ స్పీకర్ బులుసు సాంబమూర్తి ప్రకటించారు. రాజగోపాలాచారి మంత్రివర్గంలో టంగుటూరి, బెజవాడ, వి.వి.గిరి ముగ్గురు ఆంధ్రులకు మంత్రి పదవులు ఇచ్చారు. కానీ రాయలసీమకు ప్రాతినిధ్యం ఇవ్వలేదు. రాజాజీ, రాజన్ లాంటివారు ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా ప్రకటనలు కూడా చేశారు. ''మనకు తమిళ మంత్రులు ప్రత్యేక రాష్ట్రం ఇచ్చేకంటే ముందే ఆంగ్లేయులు దేశానికి స్వాతంత్య్రం ఇవ్వగలరు" అని పట్టాభి వ్యాఖ్యానించడం నిజమైంది.

 

శ్రీబాగ్ ఒప్పందం 1937, నవంబరు 16
1937లో ఆంధ్ర మహాసభ రజతోత్సవాలు విజయవాడలో జరిగాయి. 300 మంది ప్రతినిధులు హాజరయ్యారు. కడప కోటిరెడ్డి అధ్యక్షులు. హల హర్వి సీతారామిరెడ్డి సభలను ప్రారంభించారు. ఇద్దరూ రాయలసీమ వారే. వారి ఉపన్యాసాల్లో రాయలసీమ ప్రజలకున్న అనుమానాలను తొలగించాల్సిన బాధ్యత సర్కారు నాయకులపై ఉందని పేర్కొన్నారు. 1937 దీపావళి పండగను ఆంధ్ర రాష్ట్ర దినోత్సవంగా జరుపుకున్నారు. 1937, నవంబరు 16న సర్కారు, రాయలసీమ నాయకులు మద్రాస్‌లోని కాశీనాథుని నాగేశ్వరరావు నివాస గృహం శ్రీబాగ్‌లో ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు.

విశ్వవిద్యాలయం, నీటిపారుదల, శాసనసభలో స్థానాలు లాంటి విషయాలపై అంగీకారానికి వచ్చారు. వాల్తేరు, అనంతపురాల్లో రెండు విద్యాకేంద్రాలు అభివృద్ధి చేయాలి. 10 సంవత్సరాల పాటు నీటిపారుదలలో రాయలసీమకు ప్రాధాన్యం ఇవ్వాలి. రాజధాని, హైకోర్టులలో ఏది కావాలో నిర్ణయించుకునే హక్కు రాయలసీమ వారికే ఇవ్వాలి. ఒప్పందం అనంతరం ఆంధ్ర ప్రతినిధులు వెంటనే ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు తీర్మానం ప్రతిపాదించమని రాజాజీని కోరారు. 1938లో ఆంగ్ల ప్రభుత్వం ప్రస్తుతానికి ఎలాంటి నూతన రాష్ట్రాలు ఏర్పాటు చేయడానికి వీలుకాదని పేర్కొంది. దానికి నిరసనగా బులుసు సాంబమూర్తి తన స్పీకర్ పదవికి రాజీనామా చేయడానికి పూనుకొనగా అధిష్టానం అంగీకరించలేదు. 1941లో ఆంధ్ర మహాసభలు విశాఖపట్నంలో శ్రీ విజయ అధ్యక్షతన జరిగాయి. ఈ సభలు రాయలసీమ కరవుకు లక్ష రూపాయల నిధి వసూలుచేసి సహాయ కార్యక్రమాలు చేశాయి. 1943లో సభ బళ్లారిలో జరిగింది. 1946 వరకు శ్రీ విజయ అధ్యక్షులుగా ఉన్నారు. 1947 నవంబరులో నెహ్రూ ''భాషా ప్రయుక్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి అంగీకరిస్తున్నాం" అని పేర్కొన్నారు.
 

ఆంధ్ర రాష్ట్ర అవతరణ
 రాజ్యాంగ ముసాయిదా ప్రతిలో (1948 ఫిబ్రవరి) ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని చేర్చలేదు. రాజ్యాంగ పరిషత్‌కు చెందిన 10 మంది తమిళ సభ్యులు ప్రత్యేక తమిళ రాష్ట్రం కావాలని నినాదం లేవనెత్తారు.

ఎస్.కె. థార్ కమిషన్ (1948, జూన్ 17, డిసెంబరు 10 నివేదిక)
 అలహాబాద్ హైకోర్ట్ మాజీ న్యాయమూర్తి ఎస్.కె.థార్ అధ్యక్షుడిగా, పన్నాలాల్, జగత్ నారాయణ లాల్ సభ్యులు. కమిషన్ 1948 సెప్టెంబరులో మద్రాస్ వచ్చింది. ఆంధ్రులు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరగా నీలం సంజీవరెడ్డి భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును వాయిదా వేయాల్సిందిగా లేదా శ్రీబాగ్ ఒప్పందాన్ని రాజ్యాంగంలో చేర్చాలని కోరారు. 1946 ఎన్నికల్లో టంగుటూరి ప్రకాశం పంతులు ముఖ్యమంత్రి అయ్యారు. కాని రాయలసీమకు ఒకే మంత్రి పదవి ఇచ్చారు. 1947 నంద్యాల రాయలసీమ మహాసభలో సంజీవరెడ్డి రాయలసీమకు తగిన రక్షణలు ఇస్తేనే ఆంధ్ర రాష్ట్రంలో కలుస్తామని చెప్పారు. 1948 ఆంధ్ర కాంగ్రెస్ ఎన్నికల్లో పట్టాభివర్గం సంజీవరెడ్డిని, ప్రకాశం వర్గం రంగాను బలపరిచింది. సంజీవరెడ్డి ఓడిపోయారు. కాంగ్రెస్‌లో ముఠా తగాదాలు ఆంధ్రోద్యమాన్ని దెబ్బతీశాయి. ఇలాంటి విషయాలన్నీ గమనించిన థార్ కమిషన్ 1948, డిసెంబరు 10న నివేదికను సమర్పించి భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు దేశ సమైక్యతకు భంగం కలిగిస్తుందని, కొంతకాలం తర్వాత పాలనా సౌలభ్యం ప్రాతిపదికగా మాత్రమే రాష్ట్రాల పునర్విభజన చేయాలని సూచించింది.

 

జె.వి.పి. రిపోర్ట్
 థార్ కమిషన్ నివేదికకు నిరసనగా ప్రదర్శనలు జరిగాయి. 1948 జయపూర్ కాంగ్రెస్ సమావేశం నిర్ణయం ప్రకారం భాషాప్రయుక్త రాష్ట్రాల గురించి పునర్ విచారణ చేయడానికి జె.వి.పి. కమిటీని ఏర్పరిచారు. జవహర్‌లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, పట్టాభి సీతారామయ్య సభ్యులుగా ఉన్న కమిటీ 1949, ఏప్రిల్ 4న నివేదిక ఇచ్చింది.

భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును కొంతకాలం వాయిదా వేయాలని, మద్రాస్‌ను వదులుకుంటే ఆంధ్రరాష్ట్ర నిర్మాణం చేయవచ్చని నివేదికలో పేర్కొన్నారు. ఆంధ్రరాష్ట్ర ఏర్పాటుకు పొరుగు రాష్ట్రాల సమ్మతి అవసరమని టి.టి. కృష్ణమాచారి అడ్డంకి కల్పించే యత్నం చేశారు. తిరిగి ప్రాంతీయ విభేదాలు తలెత్తాయి. మద్రాస్‌పై హక్కు వదులుకోవడానికి ప్రకాశం అంగీకరించలేదు.
 

పార్టిషన్ కమిటీ (విభజన సంఘం)
1949లో మద్రాస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కుమార్‌స్వామి రాజా అధ్యక్షుడిగా ఆస్తుల విభజన సంఘాన్ని నియమించింది. ప్రకాశం పంతులు, బెజవాడ గోపాలరెడ్డి, కళా వెంకట్రావు, ఎం. భక్తవత్సలం, టి.టి. కృష్ణమాచారి, మాధవన్ మీనన్ సభ్యులు. మద్రాస్ నగర విషయంలో సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయి. నూతన రాజధాని ఏర్పడే వరకు మద్రాస్‌లోనే రాజధాని, హైకోర్టు ఉండాలని ప్రకాశం పంతులు కోరగా, మిగతావారు ఆంధ్రప్రాంతంలో ఉండాలని వాదించారు. ఆస్తుల పంపకంలో కూడా మెజారిటీ సభ్యుల వాదనను నిరాకరించిన ప్రకాశం, లిఖితపూర్వకంగా తన అసమ్మతిని తెలపడంతో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రరాష్ట్ర స్థాపనను వాయిదా వేసింది.

 

స్వామి సీతారాం నిరాహార దీక్ష
 1951 ఆంధ్రరాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష ఎన్నికల్లో పట్టాభి సీతారామయ్య, నీలం సంజీవరెడ్డిని; ప్రకాశం పంతులు రంగాను నిలబెట్టగా రంగా ఓడిపోయాడు. ఫలితంగా ప్రకాశం పంతులు, ఎన్జీ రంగా కిసాన్ మజ్దూర్ పార్టీని స్థాపించారు. ఈ సమయంలో గొల్లపూడి సీతారామశాస్త్రి 1951, ఆగస్టు 15న నిరాహారదీక్ష ప్రారంభించి, వినోబాభావే సలహా ప్రకారం సెప్టెంబరు 20న 35 రోజుల తర్వాత దీక్ష విరమించారు.

 అసంతృప్తితో ఉన్న ఆంధ్రులు 1952 ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఘోరంగా ఓడించారు. ప్రకాశం నాయకత్వంలో కిసాన్ మజ్దూర్ పార్టీ, కమ్యూనిస్ట్‌లు యునైటెడ్ డెమోక్రాటిక్ ఫ్రంట్ (UDF)గా ఏర్పడ్డారు. కాని గవర్నర్ కాంగ్రెస్ నాయకుడు రాజగోపాలాచారిని మంత్రివర్గం ఏర్పాటు చేయమని కోరాడు. రాజాజీ ఆంధ్రులకు అన్యాయం చేస్తూ కృష్ణా - పెన్నార్ ప్రాజెక్టు నిర్మించి కృష్ణానదీ జలాలను మద్రాస్‌కు తరలించడానికి నిశ్చయించారు. దాంతో ఆంధ్రాలో అసంతృప్తి జ్వాలలు ప్రజ్వరిల్లాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఖోస్లా కమిటీని నియమించింది. కమిటీ కృష్ణా పెన్నార్ స్థానంలో నాగార్జునసాగర్ (నందికొండ) ప్రాజెక్టు నిర్మించమని నివేదిక ఇచ్చింది.
 

పొట్టి శ్రీరాములు (1952, అక్టోబరు 19 - డిసెంబరు 15)
 1901లో నెల్లూరు జిల్లాలో జన్మించారు. బొంబాయిలో శానిటరీ డిప్లొమో అనంతరం రైల్వే ఉద్యోగిగా చేరారు. 1928లో భార్య, కుమారుడు, తల్లి మరణించడంతో వైరాగ్యం చెంది కట్టుబట్టలతో సబర్మతి ఆశ్రమంలో చేరారు. 'శ్రీరాములు లాంటి సేవాతత్పరులు పదిమందితో ఒక్కరోజులో స్వరాజ్యం సాధించవచ్చు' అని గాంధీజీ స్వయంగా పేర్కొన్నారు. కొమరవోలు, అంగలూరు ఆశ్రమాల్లో నిర్మాణాత్మక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. హరిజనుల దేవాలయ ప్రవేశం, అంటరానితనం నిర్మూలనకు నిరాహార దీక్షలు చేశారు. 1950లో ఆంధ్రాలో ఖద్దరు ప్రచారం ప్రారంభించి గాంధీ స్మారక నిధికి సంచాలకుడిగా నియమితులయ్యారు. 1952, అక్టోబరు 19న మద్రాస్‌లోని బులుసు సాంబమూర్తి ఇంట్లో ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించి 1952, డిసెంబరు 15 అర్ధరాత్రి స్వర్గస్తులయ్యారు (ఈ నిరాహార దీక్ష 58 రోజులపాటు కొనసాగింది). దాంతో అల్లర్లు జరిగాయి. పోలీసుల కాల్పుల్లో 7 మంది పౌరులు మరణించారు. నెలరోజుల్లో ఆంధ్రరాష్ట్ర ఏర్పాటు జరుగుతుందని నెహ్రూ 1952, డిసెంబరు 19న లోక్‌సభలో ప్రకటించడంతో ప్రజలు శాంతించారు.

వాంఛూ కమిషన్ (1952)
కేంద్ర ప్రభుత్వం 1952లో రాజస్థాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కైలాసనాథ్ వాంఛూ అధ్యక్షతన ఒక కమిటీని నియమించగా, కమిటీ 1953, మార్చి 23న నివేదిక ఇచ్చింది. ఆంధ్ర, రాయలసీమతోపాటు బళ్లారిలోని ఆలూరు, ఆదోని, రాయదుర్గ తాలూకాలతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటును కమిటీ సూచించింది. రాయలసీమ ప్రజలు శ్రీబాగ్ ఒప్పందాన్ని అనుసరించి రాజధానిని రాయలసీమలో ఏర్పాటు చేయాలని కోరారు. కమ్యూనిస్ట్‌లు విజయవాడను రాజధానిగా ఉంచాలని పట్టుబట్టారు. నీలం సంజీవరెడ్డి ప్రకాశం, ఎన్జీ రంగాల సహాయం కోరారు. నాటికి కిసాన్ మజ్దూర్ పార్టీ ప్రకాశం నాయకత్వంలో ప్రజా సోషలిస్ట్ పార్టీగా, ఎన్జీ రంగా నాయకత్వంలో కృషికార్ లోక్‌పార్టీగా విడిపోయింది. కమ్యూనిస్ట్‌లకు భయపడిన వీరు కాంగ్రెస్‌తో చేతులు కలిపారు. వీరంతా కర్నూలు రాజధానిగా అంగీకరించారు. కాని శాసనసభలో కృషికార్ లోక్‌పార్టీ తన అభిప్రాయాన్ని మార్చుకుని తిరుపతిని రాజధానిగా కావాలని కోరింది. కాని 1953 అక్టోబరు 1న కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైంది. 1954 జులై 4న హైకోర్టును గుంటూరులో ఏర్పరచాలని ఆంధ్ర శాససనసభ తీర్మానించింది. ప్రకాశం ముఖ్యమంత్రిగా, నీలం సంజీవరెడ్డి ఉపముఖ్యమంత్రిగా, చందూలాల్ మాధవ్ త్రివేది గవర్నర్‌గా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఆంధ్ర రాష్ట్ర తొలి స్పీకర్ ఎన్.వెంకటరమణయ్య.

ఆంధ్రప్రదేశ్ అవతరణ - (విశాలాంధ్ర ఉద్యమం)
1956, నవంబరు 1న ఆంధ్రరాష్ట్రం, తెలంగాణ ప్రాంతాలు కలిసి ఆంధ్రప్రదేశ్‌గా అవతరించాయి. దీన్నే విశాలాంధ్ర ఉద్యమం అని కూడా అంటారు. హైదరాబాద్ రాజ్యంలోని తెలుగువారంతా తమ వెనుకబాటుతనానికి వ్యతిరేకంగా ఉద్యమించి ఆంధ్ర జనసంఘం, నిజాం ఆంధ్ర మహాసభ లాంటి వాటి సహకారంతో సాంఘిక, రాజకీయ, సాంస్కృతిక చైతన్యాన్ని పొందారు. 1948లో పోలీస్ చర్య అనంతరం ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల మధ్య సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. తెలుగు మాట్లాడే ప్రజలందరూ కలిసుండడానికి అవకాశం ఉందని 1937లోనే మామిడిపూడి వెంకటరంగయ్య ఊహించారు. 1940లో కడప కోటిరెడ్డి, 1942లో శ్రీ విజయ విశాలాంధ్ర ఏర్పాటు ఉచితమని అభిప్రాయపడ్డారు. కమ్యూనిస్ట్‌లు 1946 నుంచే విశాలాంధ్ర ధ్యేయాన్ని ప్రచారం చేశారు. పుచ్చలపల్లి సుందరయ్య తనపార్టీ దినపత్రికకు విశాలాంధ్ర అనే పుస్తకం రాశారు. 1949లో అయ్యదేవర కాళేశ్వరరావు నాయకత్వంలో విశాలాంధ్ర మహాసభను స్థాపించారు. దీని మొదటి సమావేశం వరంగల్ (1950)లో, రెండో సమావేశం హైదరాబాద్ (1954)లో జరిగాయి. స్వామి రామానందతీర్థ విశాలాంధ్రను బలపరిచారు. దేవులపల్లి రామానుజరావు, పాగా పుల్లారెడ్డి, కోదాటి రాజలింగం, హయగ్రీవాచారి లాంటి నాయకులు; ఆంధ్రజనత, తెలుగుదేశం, కాకతీయ లాంటి పత్రికలు విశాలాంధ్ర ఉద్యమాన్ని ప్రచారం చేశాయి.

రాష్ట్రాల పునఃనిర్మాణ సంఘం (ఎస్సార్సీ) (1953, డిసెంబరు 22)
 1953, డిసెంబరు 22న SRC (ఎస్సార్సీ)ని నియమిస్తున్నట్లు నెహ్రూ లోక్‌సభలో ప్రకటించారు. సయ్యద్ ఫజల్అలీ అధ్యక్షుడిగా, హెచ్.ఎన్. కుంజ్రూ, కె.ఎం. ఫణిక్కర్ సభ్యులుగా నియమితులయ్యారు. 1953లో విశాలాంధ్ర ఉద్యమాన్ని ఆంధ్రుల సామ్రాజ్యవాదంగా నెహ్రూ విమర్శించారు. మహదేవ్‌సింగ్ లాంటి హైదరాబాద్ ప్రజా సోషలిస్ట్ పార్టీ నాయకులు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని బలపరిచారు. కమిటీ 1955, సెప్టెంబరులో నివేదికను సమర్పించింది. కింది సిఫార్సులు చేసింది.
* హైదరాబాద్ రాష్ట్ర విభజనను అందరూ కోరుకుంటున్నారు. కాబట్టి కన్నడ ప్రాంతాలను మైసూర్‌లో మరాఠ్వాడా ప్రాంతాలను బొంబాయిలో విలీనం చేయాలి.
* విశాలాంధ్ర వల్ల నీటివనరులు, ఖనిజ సంపద, విద్యుచ్ఛక్తి, ముడిపదార్థాలు లభ్యమవుతున్నాయి.
* ఆనకట్టల నిర్మాణానికి, ఆహార ధాన్యాల ఉత్పత్తికి అవకాశం. పాలనాపరమైన వ్యయం తగ్గుతుంది.
* హైదరాబాద్ వల్ల ఆంధ్రుల శాశ్వత రాజధాని సమస్య తీరుతుంది.
* తెలంగాణవారి వాదనలు తోసిపుచ్చడానికి వీల్లేదు. 1961లో ఏర్పడబోయే తెలంగాణ శాసనసభలో 2/3 వంతు సభ్యులు విశాలాంధ్రను సమర్థిస్తే సమైక్య విశాలాంధ్ర ఏర్పాటు చేయవచ్చు. కాని అప్పటి వరకు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉండాలి.

* ఎస్సార్సీ నివేదికపై వ్యాఖ్యానిస్తూ ''కమిషన్ వాదనంతా విశాలాంధ్రకు అనుకూలంగా, డిక్రీ మాత్రం ప్రత్యేక తెలంగాణకు అనుకూలంగా ఉన్నాయి" అని తెన్నేటి విశ్వనాథం పేర్కొన్నారు. నివేదిక పట్ల ప్రత్యేక తెలంగాణవాదులు హర్షం వెలిబుచ్చగా, కమ్యూనిస్టులు రాజీనామాలు చేస్తామన్నారు. తెలంగాణ 10 జిల్లా కాంగ్రెస్ సంఘాల్లో 7 సంఘాలు విశాలాంధ్ర ఏర్పాటును సమర్థించాయి. హైదరాబాద్ శాసనసభలో 103 మంది విశాలాంధ్రను కోరగా, 29 మంది తెలంగాణను కోరారు. 15 మంది తటస్థంగా ఉన్నారు (174 మంది సభ్యుల్లో 147 మంది మాత్రమే తమ అభిప్రాయాలను తెలిపారు). బూర్గుల రామకృష్ణారావు ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ అధిష్టాన వర్గాన్ని విశాలాంధ్రకు ఒప్పించాడు. కాని కొండా వెంకట రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి ప్రత్యేక తెలంగాణ వాదాన్ని వదలలేదు. ఫలితంగా ఆంధ్ర, తెలంగాణ నాయకుల మధ్య 1956, ఫిబ్రవరి 20న ఢిల్లీలో పెద్దమనుషుల ఒప్పందం జరిగింది.
 

పెద్ద మనుషుల ఒప్పందం (1956 ఫిబ్రవరి 20 - ఢిల్లీ)
ఆంధ్రా తరఫున ముఖ్యమంత్రి బెజవాడ గోపాలరెడ్డి, మంత్రులు నీలం సంజీవరెడ్డి, గౌతు లచ్చన్న, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అల్లూరి సత్యనారాయణరాజులు పాల్గొనగా, తెలంగాణ నుంచి బూర్గుల రామకృష్ణారావు (ముఖ్యమంత్రి), కొండా వెంకట రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి (మంత్రులు), జె.వి. నర్సింగరావు (హైదరాబాద్ పీసీసీ అధ్యక్షులు) పాల్గొన్నారు. ఢిల్లీలోని హైదరాబాద్ అతిథి గృహంలో ఒప్పందం కుదిరింది. 14 అంశాలపై ఒప్పందం జరిగింది.

1. కేంద్ర, సాధారణ పాలనా వ్యయాన్ని జనాభా నిష్పత్తిలో ఆంధ్రా, తెలంగాణ (58 : 42) భరించాలి. తెలంగాణ ప్రాంత మిగులు నిధులు తెలంగాణకే వినియోగించాలి.
2. తెలంగాణలో మద్యపాన నిషేధాన్ని తెలంగాణ ప్రాంతపు శాసనసభ్యులే నిర్ణయించాలి.
3. తెలంగాణ విద్యాలయాల్లో మొత్తం సీట్లు తెలంగాణ వారికే లేదా రాష్ట్రం మొత్తంలో వ వంతు సీట్లివ్వాలి.
4. ఉద్యోగాలు తగ్గించాల్సి వస్తే జనాభా నిష్పత్తిలోనే తగ్గించాలి.
5. భవిష్యత్తు ఉద్యోగ నియమకాలు ఉభయ ప్రాంత జనాభా ప్రాతిపదికనే జరగాలి.
6. తెలంగాణలో ఉర్దూ భాష స్థానం అయిదేళ్లు కొనసాగాలి. తెలుగు వచ్చి ఉండాలనే నిబంధన తొలగించి రెండేళ్ల వ్యవధిలో నిర్ణీతమైన తెలుగు పరీక్షలో ఉత్తీర్ణులు కావాలని ఆదేశించాలి.
7. ప్రాంతీయ/స్థానిక/ ముల్కీ హోదాకు 12 సంవత్సరాల స్థిరనివాసం ఉండాలి.
8. తెలంగాణ ప్రాంత వ్యవసాయ భూముల అమ్మకం ప్రాంతీయ మండలి పర్యవేక్షణలో జరగాలి.
9. తెలంగాణ ప్రాంత సర్వోతోముఖాభివృద్ధికి ఒక ప్రాంతీయ సంఘం ఉండాలి.
 ప్రాంతీయ సంఘంలో 20 మంది సభ్యులుండాలి. ప్రాంతీయ సంఘానికి చట్టబద్ధమైన అధికారాలు ఇవ్వాలి. ప్రణాళికారచన, నీటిపారుదల, పారిశ్రామికాభివృద్ధి, ఉద్యోగాల విషయంలో నిర్ణయాధికారాలు ప్రాంతీయ సంఘానికి ఉంటాయి. రాష్ట్ర, సంఘ నిర్ణయాలకు వైరుధ్యం ఏర్పడితే కేంద్రం అంతిమ నిర్ణయం తీసుకోవాలి. మంత్రిమండలిలో ఆంధ్రా, తెలంగాణ 3 : 2 నిష్పత్తిలో ఉండాలి. తెలంగాణలో ఒక ముస్లిం మంత్రి ఉండాలి. ఆంధ్రవారు ముఖ్యమంత్రి అయితే ఉప ముఖ్యమంత్రి పదవిని తెలంగాణ వారికి ఇవ్వాలి. హోం, ఆర్థిక, రెవెన్యూ, ప్లానింగ్ అండ్ డెవలప్‌మెంట్, వాణిజ్య పరిశ్రమ శాఖల్లో రెండు తెలంగాణకు ఇవ్వాలి.

* 1962 వరకు హైదరాబాద్ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రత్యేకంగా (తెలంగాణ) ఉండాలి. ఫలితంగా 1956, నవంబర్ 1న నీలం సంజీవరెడ్డి తొలి ముఖ్యమంత్రిగా, సి.ఎం. త్రివేది గవర్నర్‌గా ఆంధ్రప్రదేశ్ అవతరించింది.
 

1969 జై తెలంగాణ ఉద్యమం
 పెద్దమనుషుల ఒప్పందం హామీలను సరిగా అమలు చేయకపోవడం, ఉద్యోగాలు, పరిశ్రమల్లో తెలంగాణ వారికి ప్రాధాన్యం ఇవ్వకపోవడం లాంటి చర్యలతో జై తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. 1968, జులై 10న తెలంగాణ హామీల దినంగా పాటించారు. అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి. కె.వి. రంగారెడ్డి నాయకత్వంలో విద్యార్థులు ఉద్యమం చేశారు. కొండా లక్ష్మణ్ బాపూజీ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. మర్రి చెన్నారెడ్డి, కె.వి. రంగారెడ్డిల నాయకత్వంలో తెలంగాణ ప్రజా సమితి (టీపీఎస్) ఏర్పడింది. 1971లో  కాసు బ్రహ్మానందరెడ్డిని తొలగించి పి.వి. నరసింహారావును ముఖ్యమంత్రిగా ప్రకటించారు. 1969 జనవరిలో కాసు అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేశారు. 1969, జనవరి 22న విద్యార్థులపై కాల్పులు జరిగాయి. 1969, ఫిబ్రవరి 28 నాటికి ఆంధ్ర ప్రాంత ఉద్యోగులందరినీ పంపివేస్తానని హామీ ఇచ్చారు. నాటి ప్రధాని ఇందిరా గాంధీ అష్టసూత్ర పథకాన్ని ప్రతిపాదించారు. 1969, మే 1ని తెలంగాణ కోర్కెలదినంగా టీపీఎస్ ప్రకటించింది. 1971 సెప్టెంబరు 25న పి.వి. నరసింహారావును ముఖ్యమంత్రిగా నియమించారు.

జై ఆంధ్రా ఉద్యమం 1972
ముల్కీ నిబంధనలపై సుప్రీంకోర్టు తీర్పు జై ఆంధ్రా ఉద్యమానికి కారణమైంది. ముల్కీ నిబంధనలు తొలిసారిగా 1919లో హైదరాబాద్ నిజాం రూపొందించారు. దీని ప్రకారం 15 సంవత్సరాలు తెలంగాణలో స్థిర నివాసం ఉన్న వ్యక్తిని స్థానికుడు/ ముల్కీగా పరిగణిస్తారు. దీనిపై ఆంధ్రావారు హైకోర్టుకు వెళ్లగా ముల్కీ నిబంధనలు రాజ్యాంగ విరుద్ధమని
4 : 1 మెజారిటీతో 1972, ఫిబ్రవరి 14న తీర్పు ఇచ్చింది. దీనిపై నాటి ముఖ్యమంత్రి పి.వి. నరసింహారావు సుప్రీం కోర్టుకు వెళ్లగా 1972, అక్టోబరు 3న సుప్రీంకోర్టు ముల్కీ నిబంధనలు చెల్లుతాయని తీర్పునిచ్చింది. దాంతో 1972లో జై ఆంధ్రా ఉద్యమం ప్రారంభమైంది. ముల్కీ నిబంధనలు హైదరాబాద్, సికింద్రాబాద్‌ల్లో 1979 వరకు, మిగిలిన తెలంగాణ ప్రాంతాల్లో 1985 వరకు చెల్లుతాయని తీర్పునిచ్చింది. 1972, డిసెంబరు 31న తిరుపతిలో సమావేశమైన ఆంధ్ర నాయకులు నాటి స్పీకర్ బి.వి. సుబ్బారెడ్డి నాయకత్వంలో జై ఆంధ్రా ఉద్యమం ప్రారంభించారు. ప్రభుత్వోద్యోగులు 108 రోజులు సమ్మె చేశారు. 1973 జులై 11న హైకోర్టు మరొక తీర్పునిస్తూ ముల్కీ నిబంధనలు ఉద్యోగంలో చేరే సమయంలో వర్తిస్తాయి తప్ప ప్రమోషన్, సీనియారిటీలకు చెల్లవని ప్రకటించింది. 1973లో పి.వి. నరసింహారావు రాజీనామా చేయగా రాష్ట్రపతి పాలన విధించారు. మర్రి చెన్నారెడ్డి ప్రత్యేక తెలంగాణ వాదన గట్టిగా వినిపించారు. చివరకు కేంద్ర ప్రభుత్వం ఆరు సూత్రాల పథకాన్ని అమలు చేసింది.
1) ముల్కీ నిబంధనలు, తెలంగాణ ప్రాంతీయ సంఘం రద్దు అవుతాయి.
2) నాన్ గెజిటెడ్; సివిల్ సర్జన్ ఉద్యోగాలు స్థానికులకు మాత్రమే ఇవ్వాలి.
3) ప్రభుత్వోద్యోగుల సమస్య పరిశీలనకు ఒక ఉన్నతాధికార సంఘం (ట్రిబ్యునల్) ఏర్పడుతుంది.
4) వెనుకబడిన ప్రాంతాలకు ప్రాతినిధ్యం ఇస్తూ రాష్ట్రాభివృద్ధి సంస్థ ఏర్పడుతుంది.
5) హైదరాబాద్‌లో కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటవుతుంది. విద్యా వసతులు పెరుగుతాయి.
6) పై విషయాలను పొందుపరుస్తూ రాజ్యాంగ సవరణ చట్టం చేయడం జరుగుతుంది.
  1973లో ఆరు సూత్రాల ప్రణాళికను 33వ రాజ్యాంగ సవరణగా పార్లమెంటు ఆమోదించింది. జలగం వెంగళరావు నాయకత్వంలో తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. 1985లో కేంద్ర ప్రభుత్వం 610 జీవోను రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు జారీ చేసింది. దీని ప్రకారం 5, 6 జోన్‌లలో 1976, అక్టోబరు 18 తర్వాత నియమితులైన స్థానికేతరులను 1986, మార్చి 31కి పంపివేయాలి. జూరాల, శ్రీశైలం, శ్రీరాంసాగర్ ప్రాజెక్టుల పరిధిలోని నాన్-గెజిటెడ్ ఉద్యోగులను వారి జోన్‌లకు పంపివేయాలి. 1986, మార్చి 31 నాటికి తెలంగాణ అభ్యర్థుల నియామకాలు, ప్రమోషన్‌లలో న్యాయం జరిగేలా చూడాలి. 610 జీవోపై గిర్‌గ్లానీ కమిషన్ వేశారు. హైదరాబాద్ ఫ్రీ జోన్ అనే కొత్త విభేదం తలెత్తింది.

Posted Date : 31-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌