• facebook
  • whatsapp
  • telegram

చక్రవాతాలు - సునామీ

  ప్రపంచంలో చక్రవాతాల ప్రభావం 21% ఉండి ఆయాదేశాల్లో అధిక నష్టాన్ని కలిగిస్తుంది. భూ ఉపరితలంపై ఉపగ్రహ సాంకేతిక పరిజ్ఞానం అమల్లోకి వచ్చినప్పటి నుంచి (1970) పరిశీలిస్తే గల్ఫ్ ఆఫ్ మెక్సికో, అమెరికా, చైనా, ఫిలిప్పీన్స్ దేశాలు అత్యధిక చక్రవాతాలకు గురవుతున్నాయి. అత్యధిక ప్రాణ, ఆస్తి నష్టం ఆసియా ఖండంలోని బంగ్లాదేశ్‌లో సంభవించింది. 1970, నవంబరు 12న బంగ్లాదేశ్‌లో సంభవించిన 'బోలా' తుపాన్ వల్ల 5 లక్షల మంది మరణించారు.
* భూ ఉపరితలం 71% నీటితో విస్తరించి 5 మహాసముద్రాలుగా విభజితమైంది. ఈ మహాసముద్రాల పరిధిలో 177 దేశాలు తీరప్రాంతాలతో విస్తరించి ఉండటం వల్ల వాటిపై చక్రవాతాల ప్రభావం అధికంగా ఉంటుంది. చక్రవాతాలను అల్పపీడన ద్రోణి లేదా వాయుగుండం అంటారు. ఇవి 98% సముద్రాలు, 2% భూ ఉపరితలంపై నుంచి ప్రయాణిస్తాయి.


చక్రవాతం


చక్రవాతాన్ని సైక్లోన్ అంటారు. ఈ పదాన్ని మొదటగా హెన్రీ పిడింగ్‌టన్ ఉపయోగించారు. సైక్లోన్ గ్రీకు భాషా పదమైన 'కైక్లోన్' నుంచి వచ్చింది. కైక్లోన్ అంటే తిరుగుతున్న నీరు లేదా చుట్టుకున్న పాము అని అర్థం.


చక్రవాతం/సైక్లోన్ ఏర్పడే విధానం


సముద్రాలపై అధిక ఉష్ణోగ్రతలు ఏర్పడే ప్రాంతంలో నీరు వేడెక్కి, వ్యాకోచించి అల్పపీడనంగా మారుతుంది. ఈ అల్పపీడనం వైపు నలు దిశల నుంచి అధిక పీడన వ్యవస్థలు కేంద్రీకృతం కావడాన్ని చక్రవాతం అంటారు. చక్రవాతాలు జేర్కిన్ సిద్ధాంతంపై ఆధారపడి ఉంటాయి.
జేర్కిన్ సిద్ధాంతం ప్రకారం చక్రవాతాలు 2 రకాలు
అవి: 1) ఉష్ణమండల చక్రవాతాలు
       2) సమశీతోష్ణ చక్రవాతాలు  


ఉష్ణమండల చక్రవాతాలు (Tropical Cyclones): ఇవి 0° - 23  కర్కట, మకరరేఖల మధ్య అధిక ఉష్ణోగ్రతల వల్ల సంభవిస్తాయి. ప్రపంచంలో వీటి ప్రభావం 90% వరకు ఉంటుంది.


సమశీతోష్ణ చక్రవాతాలు (Temperate Cyclones): ఇవి 35° - 66  ఆర్కిటిక్, అంటార్కిటిక్ మధ్య ప్రాంతంలో సంభవిస్తాయి.
* ఈ విధంగా భూమధ్య రేఖ నుంచి ఉష్ణ వాయురాశులు, ధృవాల నుంచి శీతల వాయురాశులు వీస్తాయి. ఈ ఉష్ణ, శీతల వాయురాశులు కలిసే ప్రాంతాన్నే 'వాతాగ్రం' అంటారు. దీని వద్ద గాలి అవ్యవ్యాకోచం చెంది ఉరుములు, మెరుపులు ఏర్పడే ప్రాంతాన్ని 'కేంద్రకుడ్యం' అంటారు. అది తీర ప్రాంతంలో తుపాన్‌గా మారడాన్ని 'లాండ్‌ఫాల్' అంటారు. చక్రవాతం ఏర్పడే ప్రాంతం వద్ద వ్యాసం 30 కి.మీ. - 370 కి.మీ., గాలివేగం గంటకు 31 కి.మీ. - 221 కి.మీ. వరకు ఉంటుంది.

* అమెరికాలో 2017, సెప్టెంబరులో ఇర్మా తుపాన్ 279 కి.మీ./గంట; ఒడిశాలో 1999, అక్టోబరులో 268 కి.మీ./గంట వేగంతో సైక్లోన్ సంభవించింది.


సైక్లోన్ మండలాలు


ప్రపంచంలో ప్రతి ఏడాది సగటున 97 తుపాన్లు సంభవిస్తున్నాయి. వీటి ఉద్ధృతి మే, నవంబరు నెలల మధ్య ఉంటుంది. ఉద్ధృతిని బట్టి ఆయా దేశాల్లో వివిధ పేర్లతో పిలుస్తారు.


టోర్నడో: ఇది ప్రపంచంలోనే అత్యంత భయానకమైంది. 98% టోర్నడోలు అట్లాంటిక్ మహాసముద్రం, అమెరికాలో సంభవిస్తాయి. స్పానిష్ భాషలో టోర్నడో అంటే 'ఉరుముల తుపాన్' అని అర్థం. దీని వేగాన్ని, తీవ్రతను 'ఫుజితా స్కేలు' తో కొలుస్తారు.


తుపాన్


భారతదేశానికి మూడువైపుల సముద్రం ఉండి, 7516 కి.మీ. మేర తీరరేఖ వ్యాపించి ఉంది. దేశ భౌగోళిక వైశాల్యంలో ప్రధాన తీర ప్రాంత భూభాగం 5400 కి.మీ., అండమాన్ నికోబార్ దీవులు 1900 కి.మీ., లక్షదీవులు 132 కి.మీ. మేర తుపాన్ తీవ్రతను కలిగి ఉన్నాయి.
ప్రపంచ ఉష్ణమండల తుపాన్లలో భారత తీరప్రాంతంలో సంభవించే తుపాన్లు 10% కంటే ఎక్కువ ప్రభావాన్ని చూపుతున్నాయి. మన దేశంలో సగటున ఏటా 6 తుపాన్లు సంభవిస్తున్నాయి. వీటి తీవ్రత మే - జూన్; అక్టోబరు - నవంబరు మధ్య ఎక్కువగా ఉంటుంది. బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో తుపాన్ల తీవ్రత 4 : 1 నిష్పత్తిలో ఉంటుంది. ప్రధానంగా బంగాళాఖాతం పరిధిలోని తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ్ బంగలోనూ; పుదుచ్చేరి తూర్పు తీరంలోనూ; పశ్చిమ తీర ప్రాంతం (అరేబియా సముద్రం) పరిధిలోని గుజరాత్‌లోనూ తుపాన్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. తుపాన్ వచ్చినప్పుడు సముద్రంలోని అలలు 6 మీ. ఎత్తుకు లేస్తాయి. వీటిని గుర్తించడానికి టైడ్‌గేజ్ నెట్‌వర్క్ లేదా రాడార్‌లను ఉపయోగిస్తారు.
ఆంధ్రప్రదేశ్‌లోని 9 జిల్లాల్లో 974 కి.మీ. మేర బంగాళాఖాత తీరరేఖ వ్యాపించి ఉంది. ఈ ప్రాంతంలోని 44% భూభాగం తుపాన్ ప్రభావానికి గురవుతుంది. వీటి వల్ల ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాల్లో అక్టోబరు డిసెంబరు మధ్య అధిక నష్టం వాటిల్లుతుంది. తెలంగాణ భూపరివేష్టిత రాష్ట్రం కాబట్టి దీనిపై తుపాన్ ప్రభావం ఉండదు.


ఇటీవల ఏర్పడిన తుపాన్లు


* 2017 సెప్టెంబరులో ఫ్లోరిడా, క్యూబా దేశాల్లో - ఇర్మా హరికేన్,
* 2016 డిసెంబరులో దక్షిణ భారత్, అండమాన్, థాయిలాండ్‌లలో - వార్ధా తుపాన్,
* 2015 ఆగస్టులో భారత్, బంగ్లా, బర్మా దేశాల్లో - కొమెన్ తుపాన్,
* 2014 అక్టోబరులో విశాఖపట్నం, నేపాల్‌లో - హుద్‌హుద్ తుపాన్ సంభవించాయి.


సునామీ


  సముద్ర అంతర్భాగంలో భూకంపాలు ఏర్పడినప్పుడు అలలు తీరప్రాంతాన్ని చేరి తుపానుగా మారడాన్నే 'సునామీ' అంటారు. ఆ సమయంలో అలలు పదుల అడుగుల ఎత్తులో పైకి ఎగసి తీరప్రాంతంలోని భూభాగాన్ని తీవ్ర నష్టానికి గురిచేస్తాయి. ఒక పెద్ద భూకంపం తర్వాత సునామీ ముప్పు అనేక గంటలపాటు ఉంటుంది. ఆ సమయంలో ప్రమాదకరమైన పెద్ద అలలు ఏర్పడతాయి.
* సునామీ అనే పదం జపనీస్ భాష నుంచి వచ్చింది. జపాన్ భాషలో 'సు' (Tsu) అంటే రేవు/సముద్రం, 'నామి' (Nami) అంటే అలలు/తరంగం/కెరటాలు అని అర్థం. సముద్ర ఉపరితల నీరు తరంగాల ద్వారా ఉప్పొంగడాన్నే సునామీగా భావిస్తారు.
* సునామీలను జపాన్‌లో హర్బర్ వేవ్, ఆంగ్లంలో సిస్మిక్ సీ వేవ్, తెలుగులో సముద్ర ఉప్పెన, తమిళంలో అజిహిపెరాలై అని అంటారు.
* సునామీ వచ్చినప్పుడు సముద్ర ఉపరితలంపై రెండు శృంగాల మధ్య దూరం 100 కి.మీ., తరంగాల ఎత్తు 30 మీ., తరంగ ప్రయాణ వేగం 800 కి.మీ./గంట ఉంటుంది. మైదాన ప్రాంతంలో సునామీ గంటకు 50 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుంది. ఇవి ఏ సమయంలోనైనా సంభవించవచ్చు.


కారణాలు:
1. సముద్రంలో భూకంపాలు ఏర్పడటం.
2. అగ్ని పర్వతాలు పేలడం.
3. కొండ చరియలు (భూపాతాలు) విరిగిపడటం.

వీటిలో 80% సునామీలు భూకంపాల వల్ల వస్తాయి. ఈ కారణాల వల్ల పెద్దపెద్ద అలలు ఏర్పడి తీరప్రాంతాలను అతలాకుతలం చేయడాన్ని 'సునామీ' అంటారు.


విస్తరణ:
* 75% సునామీలు పసిఫిక్ మహాసముద్రం, దాని దీవుల్లో సంభవిస్తున్నాయి. అందువల్ల పసిఫిక్‌ను 'అగ్నివలయం' (Ring Fire) అని పిలుస్తారు. ఈ ప్రాంతంలో అధికంగా సుగామీచే, హవాయి దీవులు, జపాన్, ఓషియానీయ దీవులు ఉంటాయి.
* 25% మధ్యదరా, కరేబియన్, పశ్చిమ, తూర్పు పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహాసముద్రంలో సంభవిస్తున్నాయి.
ఉదా: అమెరికాలోని అలస్కా, హవాయి దీవుల్లోని 'హిలో' అనే ప్రాంతంలో ఎత్తయిన అలలతో తీవ్రమైన సునామీలు సంభవిస్తాయి.


భారతదేశంలో సునామీ


మనదేశంలో సునామీ తీవ్రత హిందూ మహాసముద్ర ప్రభావం వల్ల 1% మాత్రమే ఉంటుంది. దేశం మొత్తం తీరప్రాంతంలో 300 కి.మీ. పొడవున దీని ప్రభావం ఉంది.
* తూర్పుతీర బంగాళాఖాతంలో తమిళనాడు నుంచి అండమాన్ - నికోబార్, ఇండోనేషియా దీవుల వరకు; పశ్చిమ తీర అరేబియాలో గుజరాత్, పాక్ మాక్రీన్ దీవుల నుంచి మాల్దీవుల వరకు ఉంటుంది.
ఉదా: 2004, డిసెంబరు 26న రిక్టర్ స్కేలుపై 9.0 తీవ్రతతో వచ్చిన భూకంపం వల్ల హిందూ మహాసముద్రంలో సునామీ ఏర్పడింది. దీని వల్ల 11 దేశాల్లో మొత్తం 2,30,000 ప్రాణనష్టం జరిగింది. భారత్‌లో అండమాన్ దీవులు, తమిళనాడులోని కడలూర్ జిల్లా అత్యధిక నష్టానికి గురయ్యాయి.
* 2011, మార్చి 11న జపాన్‌లో ఫుకుషిమా వద్ద పెద్ద సునామీ వచ్చింది.

నివారణ చర్యలు:
* 1920లో మొదటిసారిగా హవాయి దీవుల్లో సునామీ హెచ్చరిక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
* 1946లో 'పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్‌'ను హవాయి దీవుల్లోని హోనొలులు సమీపాన ఏర్పాటు చేశారు.
* 1999లో హైదరాబాద్ కేంద్రంగా ఎర్త్ మినిష్టర్ ఆధ్వర్యంలో 'ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషియన్ ఇన్ఫర్‌మేషన్ సర్వీస్' (INCOIS) ను ప్రారంభించారు. ఇది పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహాసముద్ర సమాచారాన్ని అందిస్తుంది.
* సునామీలను ముందుగా గుర్తించడానికి ఉపగ్రహ సాంకేతిక విజ్ఞానంతో హెచ్చరికలు జారీ చేయవచ్చు. కేబుళ్ల ద్వారా భూమికి అనుసంధానం చేసిన సునామీ డిటెక్టర్లను సముద్రంలో 50 కి.మీ. అడుగున ఉంచుతారు. ఇవి ఉపరితల అలజడులను గుర్తించి ఉపగ్రహాలకు ప్రసారం చేస్తాయి.
* 2015 డిసెంబరులో తొలి విపత్తు ఎఫ్ఎం (107.8) రేడియోను తమిళనాడులోని కడలూర్‌లో ప్రారంభించారు.

Posted Date : 08-07-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌