• facebook
  • whatsapp
  • telegram

d-బ్లాక్‌ లేదా పరివర్తన మూలకాలు

ఎలక్ట్రాన్‌ విన్యాసం

* పరివర్తన మూలకాల సాధారణ ఎలక్ట్రాన్‌ విన్యాసం:(n − 1)d1 − 10 ns1 − 2

* వీటిలో బాహ్యస్థాయిలోని ns ఆర్బిటాల్‌ నిండిన తర్వాత అంతర స్థాయిలోని (n − 1) d - ఉపస్థాయి

 ఎలక్ట్రాన్లతో నిండుతుంది.

*  క్రోమియం (Cr) ఎలక్ట్రాన్‌ విన్యాసం3d44s2కు బదులుగా 3d54s1గా ఉంటుంది. అదేవిధంగా కాపర్‌(Cu) విన్యాసం3d94s2కు బదులుగా3d104s1గా ఉంటుంది. దీనికి కారణం 3d,4s- ఆర్బిటాళ్ల మధ్య శక్తి భేదం చాలా తక్కువగా ఉండటం వల్ల ఎలక్ట్రాన్‌ 3d- ఆర్బిటాల్‌లోకి ప్రవేశిస్తుంది. అంతేకాకుండా సగం నిండిన లేదా పూర్తిగా నిండిన ఆర్బిటాల్‌ వల్ల పరమాణువులకు స్థిరత్వం ఏర్పడుతుంది. 

4d-శ్రేణిలో మాలిబ్డినం(Mo), వెండి (Ag) మూలకాలు అసాధారణ విన్యాసాన్ని ప్రదర్శిస్తాయి.

* d - బ్లాక్‌ మూలకాల్లో చివరి గ్రూప్‌ మూలకాలైన జింక్‌ (Zn), కాడ్మియం(Cd), పాదరసం(Hg) మూలకస్థితిలో లేదా ఇతర ఆక్సీకరణ స్థితిలో గానీ d- ఆర్బిటాల్‌ పూర్తిగా నిండి ఉంటుంది. అందువల్ల వీటిని పరివర్తన మూలకాలుగా పరిగణించరు.


అయస్కాంత ధర్మాలు

*  పదార్థాలను అయస్కాంత క్షేత్ర ప్రభావానికి గురిచేసినప్పుడు, డయా అయస్కాంత పదార్థాలు అనువర్తిత అయస్కాంత క్షేత్రం కారణంగా వికర్షితమవుతాయి.

*  పారాయస్కాంత పదార్థాలు అనువర్తిత అయస్కాంత క్షేత్రం వల్ల ఆకర్షితమవుతాయి. 

*  ఫెర్రో అయస్కాంత పదార్థాలు అనువర్తిత అయస్కాంత క్షేత్రం కారణంగా చాలా బలంగా ఆకర్షితమవుతాయి.

*  ఒంటరి ఎలక్ట్రాన్లు కలిగిన పరమాణువులు, అణువులు లేదా అయాన్ల పదార్థాలు పారాయస్కాంత ధర్మాన్ని, ఎలక్ట్రాన్లు జతలుగా ఉన్న పదార్థాలు డయా అయస్కాంత ధర్మాన్ని కలిగి ఉంటాయి.

*  పరివర్తన మూలకాలు, వాటి అయాన్లు సాధారణంగా ఒంటరి ఎలక్ట్రాన్లను కలిగి ఉండి పారాయస్కాంత ధర్మాన్ని ప్రదర్శిస్తాయి. ఒంటరి ఎలక్ట్రాన్ల సంఖ్య పెరిగేకొద్దీ పారాయస్కాంత ధర్మం ఎక్కువ అవుతుంది.

*  Sc+3, Ti+4, Zn+2, Cu+ లాంటి లోహ అయాన్లలో ఎలక్ట్రాన్లు జతలుగా ఉంటాయి. ఇవి డయా అయస్కాంత ధర్మాన్ని ప్రదర్శిస్తాయి. 

* ప్రతి ఒంటరి ఎలక్ట్రాన్‌కు అయస్కాంత భ్రామకం ఉంటుంది. 

* ఎలక్ట్రాన్ల ఆర్బిటాల్‌ చలనం, ఆత్మ భ్రమణం వల్ల ఏర్పడే అయస్కాంత క్షేత్రబలాన్ని అయస్కాంత భ్రామకం తెలియజేస్తుంది.


రంగుల అయాన్లు ఏర్పడటం

* సాధారణంగా పరివర్తన లోహాలు ఏర్పరిచే సమ్మేళనాలు ఘనస్థితిలో లేదా ద్రావణ స్థితిలో రంగును కలిగి ఉంటాయి.

* పరివర్తన లోహ సమ్మేళనం రంగు కింది అంశాలపై ఆధారపడి ఉంటుంది. 

i) పరివర్తన లోహ అయాన్‌లోని ఒంటరి d- ఎలక్ట్రాన్ల సంఖ్య

ii) లోహ అయాన్‌ చుట్టూ ఉన్న లైగాండ్‌ల అమరిక, స్వభావం


పరివర్తన మూలక సమ్మేళనం రంగు, మూలక ఆక్సీకరణ స్థితిపై కూడా ఆధారపడుతుంది. ఒకే మూలకం భిన్న ఆక్సీకరణ స్థితుల్లో భిన్న రంగులను ప్రదర్శిస్తుంది.

ఉదా: 

మాంగనీస్‌ సల్ఫేట్‌: పింక్‌ రంగు (మాంగనీస్‌ ఆక్సీకరణ స్థితి:+2)

పొటాషియం పర్మాంగనేట్‌: ఊదా రంగు (మాంగనీస్‌ ఆక్సీకరణ స్థితి:+7)

లోహ పరమాణువు లేదా అయాన్‌ చుట్టూ ఉన్న లైగాండ్‌ (ఒంటరి ఎలక్ట్రాన్‌ జంట కలిగిన అణువులు లేదా అయాన్లు) స్వభావంపై, వాటి సంఖ్యపై పరివర్తన లోహ సమ్మేళనం రంగు ఆధారపడి ఉంటుంది.

                     

* d -  ఆర్బిటాళ్లు అసంపూర్ణంగా నిండి ఉన్న పరివర్తన మూలక అయాన్లలో మాత్రమే d - d పరివర్తనం’ జరిపి, వాటికి రంగును కలగజేస్తాయి.

* d - ఆర్బిటాళ్లు సంపూర్ణంగా నిండి ఉన్న లేదా పూర్తిగా ఖాళీగా ఉన్న పరివర్తన మూలక అయాన్లలో d - d పరివర్తనం’ జరపదు. కాబట్టి ఇలాంటి వాటికి రంగు ఉండదు. 

ఉదా:Zn+2: రంగు ఉండదు. (d - ఉపస్థాయి ఎలక్ట్రాన్లతో పూర్తిగా నిండి ఉంటుంది)

Sc+3 , Ti4+: రంగు ఉండదు. 

(d - ఉపస్థాయిలో ఎలక్ట్రాన్లు లేకపోవడం వల్ల)


ఆక్సీకరణ స్థితులు

* పరివర్తన మూలకాలు బహుళ ఆక్సీకరణ స్థితులను ప్రదర్శిస్తాయి.

కారణం: పరివర్తన మూలకాలు ns ఎలక్ట్రాన్లతో పాటు (n - 1)d ఎలక్ట్రాన్లను పలు సంఖ్యలో కోల్పోవడంతో విభిన్న ఆక్సీకరణ స్థితులను ప్రదర్శిస్తాయి.d - బ్లాక్‌ మూలకాల్లో d- ఆర్బిటాళ్లు అసంపూర్తిగా నిండటంతో బహుళ ఆక్సీకరణ స్థితులు ప్రదర్శించటానికి కారణం.

3d -  శ్రేణిలో మాంగనీస్‌(Mn) +2 నుంచి +7 వరకు అన్ని ఆక్సీకరణ స్థితులను ప్రదర్శిస్తుంది. 

* ఒక పరివర్తన మూలకం ప్రదర్శించే ఆక్సీకరణ స్థితుల్లో, ఇతర ఆక్సీకరణ స్థితుల్లో తేఢా ఒకటి మాత్రమే ఉంటుంది.

ఉదా: మాంగనీస్‌ ⇒ Mn+2 , Mn+3 , Mn+4 , Mn+5 , Mn+6, Mn+7

* శ్రేణి చివరి మూలకాలు +2 ఆక్సీకరణ స్థితిని మాత్రమే ప్రదర్శిస్తాయి.

ఉదా: జింక్‌ ⇒ Zn+2

* సాధారణంగా d 0 , d5 లేదా d10 ఎలక్ట్రాన్‌ విన్యాసం గల ఆక్సీకరణ స్థితులు స్థిరత్వాన్ని కలిగి ఉంటాయి. 

ఉదా: Fe+2 ఆక్సీకరణ స్థితిలో(d6) కంటే Fe+3 ఆక్సీకరణ స్థితిలో (d5) స్థిరంగా ఉంటుంది. 

Fe+2= ఫెర్రస్‌     Cu+ = క్యూప్రస్‌ 

Fe+3= ఫెర్రిక్‌     Cu+2 = క్యూప్రిక్‌

* ఒక మూలకం ఏర్పరిచే బహుళ ఆక్సీకరణ స్థితుల్లో అల్ప ఆక్సీకరణ స్థితులను ‘అస్‌’ ఆక్సీకరణ స్థితులని, అధిక ఆక్సీకరణ స్థితులను ‘యిక్‌’ ఆక్సీకరణ స్థితులని అంటారు.

3d శ్రేణి మూలకాల్లో అల్ప ఆక్సీకరణ స్థితులు,4d, 5d శ్రేణి మూలకాల్లో అధిక ఆక్సీకరణ స్థితులు అధిక స్థిరత్వాన్ని కలిగి ఉంటాయి.

4d,5d శ్రేణి మూలకాల్లో రుథీనియం (Ru), ఆస్మియం (Os) లు గరిష్ఠ ఆక్సీకరణ స్థితి +8 గల RuO4 , OsO4 లను ఏర్పరుస్తుంది.

భౌతిక ధర్మాలు

* సాధారణంగా అన్ని పరివర్తన మూలకాలు అధిక తాంతవత, అధిక అఘాతవర్థనీయత, అధిక ఉష్ణ, విద్యుత్‌ వాహకత, లోహద్యుతి లాంటి విలక్షణ లోహ ధర్మాలను ప్రదర్శిస్తాయి.

* పరివర్తన లోహాలకు (Zn, Cd, Hg మినహా) చాలా గట్టిదనం ఉండి, అధిక ద్రవీభవన, బాష్పీభవన స్థానాలు ఉంటాయి.


మాదిరి ప్రశ్నలు


1. d-  బ్లాక్, f- బ్లాక్‌ మూలకాలను వరుసగా ఏమని పిలుస్తారు?

1) పరివర్తన, అంతర పరివర్తన మూలకాలు      2) అంతర పరివర్తన, పరివర్తన మూలకాలు

3) పరివర్తన, ప్రాతినిధ్య మూలకాలు     4) ప్రాతినిధ్య, అంతర పరివర్తన మూలకాలు

జ: 1


2. కింది ఏ పరివర్తన మూలకాలు అసాధారణ ఎలక్ట్రాన్‌ విన్యాసాన్ని ప్రదర్శిస్తాయి?

1) క్రోమియం   2)కాపర్‌       3) వెండి      4) పైవన్నీ

జ: 4


3. కింది వాటిలో వెండి ఎలక్ట్రాన్‌ విన్యాసం ఏది? 

1)  [Ar]4s23d9    2) [Ar]4s13d10     3) [Kr]5s24d9     4)[kr]5s14d10 

జ: 4


4. కింది వాటిలో అయస్కాంత భ్రామకం ప్రమాణాలు?

1) మోల్‌/లీటర్‌    2) బోర్‌ మాగ్నటాన్‌     3) వోల్ట్‌       4)  నానోమీటర్‌ 

జ: 2


5. కింది వాటిలో పరివర్తన మూలకాలు కానివి?

1)  Fe, Co, Ni     2) Zn, Cd, Hg       3) Cu, Ag, Au       4) Sc, Ti, V

జ: 2


6. కింది వాటిలో సరైంది?

i) పారాయస్కాంతత్వం ఒంటరి ఎలక్ట్రాన్లు ఉండటం వల్ల ఏర్పడుతుంది.

ii) ఒంటరి ఎలక్ట్రాన్ల సంఖ్య పెరిగేకొద్దీ, అయస్కాంత భ్రామకం పెరుగుతుంది.

1)  i మాత్రమే     2)  ii మాత్రమే    3) i, ii     4) ఏదీకాదు

జ:3


7. కింది వాటిలో డయా అయస్కాంతత్వం ప్రదర్శించే లోహ అయాన్‌ ఏది?

1) Sc+3    2) Zn+2    3) 1, 2   4) Fe+2

జ: 3

Posted Date : 14-04-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌