• facebook
  • whatsapp
  • telegram

డిఫెన్స్‌ శాటిలైట్స్‌

  భారతదేశంలో రక్షణ వ్యవస్థ కోసం కొన్ని ఉపగ్రహాలను ప్రత్యేకంగా ప్రయోగించారు. అవి: 

 

GSAT-7: 

*  దీన్ని ఇస్రో 2013లో ప్రయోగించింది. అత్యంత అధునాతన సమాచార వ్యవస్థ కోసం దీన్ని రూపొందించారు. 

*  దీన్ని ‘రుక్మిణి’ అని పిలుస్తారు. 

*  ప్రస్తుతం దీన్ని నావికాదళ అవసరాల కోసం ఉపయోగిస్తున్నారు. 

*  ఈ ఉపగ్రహం అందించే అధునాతన సమాచారం, రియల్‌ టైం డేటాతో సముద్ర ప్రాంతాల్లోని సబ్‌మెరైన్స్, ఎయిర్‌క్రాఫ్ట్స్, యుద్ధ నౌకలను గుర్తించవచ్చు. 

 

GSAT-7A:

*  అధునాతన మిలటరీ కమ్యూనికేషన్‌ వ్యవస్థల కోసం ఇస్రో దీన్ని 2018లో ప్రయోగించింది. 

*  ఈ ఉపగ్రహం మిలటరీ, ఎయిర్‌ఫోర్స్‌ అవసరాలను అత్యంత సమర్థవంతంగా నిర్వహిస్తోంది. 

* ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ వ్యవస్థను ఈ శాటిటైట్‌కు ఇంటర్‌ లింక్‌ చేశారు. సమాచారాన్ని గ్రౌండ్‌ బేస్డ్‌ రాడార్‌లకు పంపడానికి, ఎయిర్‌క్రాఫ్ట్‌ల నిఘా వ్యవస్థను పెంపొందించడానికి, ఎయిర్‌ బోర్న్‌ ఎర్లీ వార్నింగ్‌ వ్యవస్థ ద్వారా అత్యంత వేగంగా ఆకాశంలో ఎగిరే ఎయిర్‌క్రాఫ్ట్‌లను గుర్తించటానికి ఈ ఉపగ్రహం ఎంతగానో ఉపయోగపడుతోంది. 

*  2022, మార్చి 22న జరిగిన డిఫెన్స్‌ అక్విజిషన్‌ కౌన్సిల్‌ (DAC) సమావేశంలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ GSAT-7B ఉపగ్రహ ప్రయోగాన్ని త్వరలో నిర్వహించనున్నట్లు తెలిపారు. సరిహద్దు ప్రాంతాల్లో నిఘా వ్యవస్థకు ఇది ఎంతగానో తోడ్పడుతుంది. వీటిలో ఉన్న మల్టీ బ్యాండ్‌ మిలటరీ గ్రేడ్‌ వ్యవస్థ భారత సైన్యానికి ఉపయోగపడుతుంది. 

*  ఈ ఉపగ్రహాలు image intensifier, ఎయిర్‌ డిఫెన్స్‌ ఫైర్‌ కంట్రోల్‌ రాడార్‌లను కలిగి ఉండి, అత్యంత తేలికైన (4 x 4) వాహకనౌకలుగా పనిచేస్తాయి. 

*  GSAT-7C ఉపగ్రహాలు భవిష్యత్తులో ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌కు రియల్‌ టైం కమ్యూనికేషన్‌ను అత్యంత సెక్యూర్‌ మోడ్‌లో అందించనున్నాయి. ఈ ఉపగ్రహాలు Software defined radio communication వ్యవస్థ ఆధారంగా పనిచేస్తాయి. 

*  ఇవే కాకుండా 2020లో ప్రయోగించిన EMISAT, కౌటిల్య ఉపగ్రహాలు ELINT (ఎలక్ట్రానిక్‌ ఇంటెలిజెన్స్‌) ప్యాకేజీలో ఉన్నాయి. భారత భూభాగం అంతా ఈ ఉపగ్రహం ఎల్రక్టానిక్‌ నిఘాలో ఉంటుంది. 

 

SSLV సాంకేతికత (Small Satellite Launch Vehicle tehnology):

*  ప్రస్తుత ప్రపంచ అంతరిక్ష మార్కెట్‌ విపణిలో ప్రపంచ దేశాలు తమ అవసరాల కోసం నానో, మైక్రో, చిన్న ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రయోగిస్తున్నాయి. 

* ఇవే కాకుండా ప్రైవేట్‌ కార్పొరేషన్లు, విశ్వవిద్యాలయాలు, అంతరిక్ష పరిశోధన కేంద్రాలు, ప్రైవేట్‌ భాగస్వామ్యంలో ఉన్న కొన్ని ఏజెన్సీలు వాహకనౌకలను రూపొందిస్తున్నాయి.

* దీనికి అనుగుణంగా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ - ఇస్రో SSLVలను తయారు చేయాలని భావించింది. 

* ఈ చిన్న వాహక నౌకలకు 500 కేజీల బరువును తీసుకెళ్లే సామర్థ్యం ఉంది. ఇవి ఉపగ్రహాలను భూమి దిగువ కక్ష్య (LEO)లో 500 కిలోమీటర్ల వరకు చేరవేస్తాయి. ఇవి మినీ రాకెట్లను అత్యంత సమర్థవంతంగా Sun-synchronoud orbiy మూడు దశల్లో ప్రవేశపెడతాయి. 

* ఇంతకు ముందు అత్యంత సమర్థవంతంగా పనిచేసే చిన్న ఉపగ్రహాలను పెద్ద పెద్ద ఉపగ్రహాలతో పాటు మాత్రమే పంపించే సౌలభ్యం ఉండేది. SSLV సాంకేతికతను చిన్న ఉపగ్రహాల ప్రయోగాల కోసమే రూపొందించారు. 

* ఈ వాహక నౌకల రూపకల్పనలో భారత ప్రభుత్వం ప్రైవేట్‌ సంస్థల భాగస్వామ్యాన్ని కూడా ప్రోత్సహిస్తోంది. 

ఉదా: SSLV-D1, SSLV-D2

 

Dhawan-1:

* భారతదేశ అంతరిక్ష విజ్ఞానశాస్త్ర చరిత్రలో మొదటిసారి హైదరాబాద్‌కు చెందిన స్కై రూట్‌ ఏరోస్పేస్‌ అనే ప్రైవేట్‌ స్టార్టప్‌ సంస్థ అత్యంత శీతల ఉష్ణోగ్రతల వద్ద పనిచేసే క్రయోజెనిక్‌ ఇంజిన్‌ Dhawan-1ను విజయవంతంగా పరీక్షించింది. 

* ఈ క్రయోజెనిక్‌ ఇంజిన్‌ లిక్విడ్‌ నైట్రోజన్‌ గ్యాస్‌ (LNG), లిక్విడ్‌ ఆక్సిజన్‌ (LOX)లను ఇంధనంగా ఉపయోగించుకుని పనిచేస్తుంది. 

* చిన్న ఉపగ్రహాల తయారీ వ్యవస్థల కోసం ఈ క్రయోజెనిక్‌ ఇంజిన్‌ను తయారు చేశారు. ఈ ఇంజిన్‌తో రాబోయే రెండేళ్లలో విక్రమ్‌ 1, విక్రమ్‌ 2 లాంచ్‌ వెహికల్స్‌ను తయారు చేయాలని భావిస్తున్నారు.

* విక్రమ్‌ 1 వాహకనౌక సాలిడ్‌ ప్రొపల్షన్‌ ఇంజిన్‌ సాయంతో; విక్రమ్‌ 2 క్రయోజెనిక్‌ ఇంజిన్‌తో పని చేస్తుంది. 


ఇండియన్‌ స్పేస్‌ అసోసియేషన్‌  (ISPA)

* ఆత్మనిర్భర్‌ భారత్‌ పథకంలో భాగంగా 2021, అక్టోబరు 11న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీన్ని ప్రారంభించారు. ప్రపంచ అంతరిక్ష రంగంలో భారత్‌ను గ్లోబల్‌ లీడర్‌గా చేయాలనే ఉద్దేశంతో ఖిళ్పీతిను ఏర్పాటు చేశారు.

* ఇది ఉపగ్రహ కంపెనీలు, అంతరిక్ష ఆధారిత పరిశ్రమలకు ముఖ్య కేంద్రంగా ఉంటుంది. 

 

ఫ్రీ స్పేస్‌ క్వాంటం కమ్యూనికేషన్‌ వ్యవస్థ 

* 2022, మార్చి 23న ఇస్రో మూడు వందల మీటర్ల పరిధిలో మొదటిసారిగా ఫ్రీ స్పేస్‌ క్వాంటం కమ్యూనికేషన్‌ను విజయవంతంగా ప్రయోగించింది. 

* క్వాంటం కమ్యూనికేషన్‌ను ఉపయోగించి అహ్మదాబాద్‌లోని స్పేస్‌ అప్లికేషన్‌ సెంటర్‌లో సమాచారాన్ని two line of sight buildings in the Ahmedabad campus మధ్య ప్రసరింపజేసింది.

 

అంతరిక్ష విజ్ఞానశాస్త్రం 

 

కక్ష్యలు 

* ఉపగ్రహ ప్రయోగాల్లో ఆయా శాటిలైట్లను కక్ష్యా మార్గంలో ప్రవేశపెడతారు. సాధారణంగా సమాచార ఉపగ్రహాలు ఎక్కువ ఎత్తులో, దీర్ఘ కక్ష్యలో, వివిధ గ్రౌండ్‌ స్టేషన్లను దాటి ప్రయాణిస్తాయి.

* ఈ కక్ష్యలు సాధారణంగా దీర్ఘవృత్తాకారం (elliptical)లో ఉంటాయి. అంతరిక్ష నౌకలు భూమికి దగ్గరగా ఉండే కక్ష్యలో ప్రయాణిస్తే దాన్ని పెరిజీ (perigee) అని, భూమికి దూరంగా ఉండే కక్ష్యా మార్గంలో ప్రయాణిస్తే దాన్ని ఎపోజీ (apogee) అని పిలుస్తారు.

 

రకాలు

భూకక్ష్య మార్గాలు మూడు రకాలు. అవి: 

 

1. దిగువ కక్ష్య మార్గం (Low Earth Orbit):

* ఈ కక్ష్య భూమి నుంచి సుమారు రెండు వేల కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది. 

* దీని పరిధి భూ ఉపరితలం నుంచి 160  2000 కి.మీ. వరకు విస్తరించి ఉంటుంది. 

* అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఈ కక్ష్యా మార్గంలోనే ఉంది. 


2. మధ్యస్థ కక్ష్య మార్గం (Medium Earth Orbit): 

* ఈ కక్ష్యా మార్గంలో ఉపగ్రహాలు భూ ఉపరితలం నుంచి 2000  36,000 కి.మీ. మధ్యలో ఉంటాయి. 

* ఈ మార్గంలో ముఖ్యంగా నావిగేషన్, సమాచార ఉపగ్రహాలు ప్రయాణిస్తాయి. 

 

3. Geosynchronous Earth Orbit (GEO):

* ఈ కక్ష్యా మార్గంలో ఉపగ్రహాలు 36,000 కి.మీ. పైన ప్రయాణిస్తాయి. 

* ఉపగ్రహాల పరిభ్రమణ కాలం 23 గం. 56 ని. 4.09 సె. 

* ఈ మార్గంలో ఉపగ్రహాలు స్థానబద్ధంగా కనిపిస్తాయి. దీనికి కారణం ఇవి భూ పరిభ్రమణ దిశలో ప్రయాణించడమే. 

* Geosynchronousకక్ష్యలో ముఖ్యంగా వాతావరణ ఆధారిత సమాచారాన్ని సేకరిస్తారు. ఈ మార్గంలో ప్రయాణించే ఉపగ్రహాలు ప్రకృతి విపత్తుల ముందస్తు హెచ్చరికలను ఆయా కేంద్రాలకు సంకేతాల ద్వారా పంపిస్తాయి. 

* ఈ కక్ష్యలోని ఉపగ్రహాలు భూఉపరితలానికి అత్యంత దూరంగా లేదా అత్యంత ఎత్తులో ప్రయాణిస్తాయి. 

 

నావిగేషన్‌ ఉపగ్రహాలు 

  సామర్థ్యం ఆధారంగా నావిగేషన్‌ ఉపగ్రహాలు కొన్ని ప్రాంతాలకు లేదా ప్రపంచవ్యాప్తంగా రియల్‌టైం పొజిషనింగ్, కచ్చిత సమయ నిర్ధారణను అందిస్తాయి. నావిగేషన్‌ వ్యవస్థ శాస్త్ర-సాంకేతిక, రవాణా, పౌర సేవలు, వ్యవసాయం, రక్షణ రంగాలకు అవసరమైన ముఖ్య సమాచారాన్ని అందిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా నావిగేషన్‌ వ్యవస్థ కలిగిన నాలుగో దేశం భారత్‌. 

 

వివిధ దేశాలకు చెందిన నావిగేషన్‌ వ్యవస్థల్షు

ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు నావిగేషన్‌ వ్యవస్థను కలిగి ఉన్నాయి. అవి:

 

గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టం (GPS):

* ఇది అమెరికా సంయుక్త రాష్ట్రాలకు చెందిన నావిగేషన్‌ వ్యవస్థ. ప్రపంచవ్యాప్తంగా దీన్నే ఎక్కువగా వాడుతున్నారు. 

* దీన్ని 1978లో ప్రారంభించారు. ఈ వ్యవస్థను 32 ఉపగ్రహాల సమూహం నిర్వహిస్తోంది. 

 

GLONAS

* ఇది రష్యాకు చెందిన నావిగేషన్‌ వ్యవస్థ. దీన్ని 24 ఉపగ్రహాల సమూహం క్రియాశీలం చేస్తుంది.

 

GALELEO

* ఇది యూరప్‌కి చెందిన నావిగేషన్‌ వ్యవస్థ. 2016 నుంచి పనిచేయడం ప్రారంభించింది. 

* దీన్ని 30 ఉపగ్రహాల సమూహం నిర్వహిస్తోంది. 

 

BeiDou

* ఇది చైనాకు చెందిన నావిగేషన్‌ వ్యవస్థ. ప్రస్తుతం ఆసియా-పసిఫిక్‌ దేశాలకు సమర్థవంతమైన సేవలను అందిస్తోంది. 

*  ఇది 35 ఉపగ్రహాల సమూహంతో పనిచేస్తోంది.

*  2020 నుంచి దీని సేవలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయి. 

 

ఇండియన్‌ రీజినల్‌ నావిగేషన్‌ శాటిలైట్‌ సిస్టం (IRNSS)

* ఈ నావిగేషన్‌ వ్యవస్థలో ప్రస్తుతం ఏడు ఉపగ్రహాలు క్రియాశీలంగా ఉన్నాయి. 

* దీన్ని NAVIC అని పిలుస్తారు. ఈ పేరును భారత ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. 

* భారత ఉపఖండానికి పదిహేను వందల కిలోమీటర్ల పరిధిలో ఈ నావిగేషన్‌ వ్యవస్థ అత్యంత సమర్థవంతంగా పనిచేస్తోంది.

 

మాదిరి ప్రశ్నలు

 

1. భూ వాతావరణాన్ని బాహ్య అంతరిక్షం నుంచి వేరు చేస్తున్న రేఖ ఏది?

1) డ్యూరాండ్‌ రేఖ    2) కర్మన్‌ రేఖ 

3) 1, 2      4) ఏదీకాదు 

 

2. సముద్ర సగటు నీటి మట్టానికి 62 మైళ్లు లేదా వంద కిలోమీటర్ల ఎత్తులో ఉండే ఊహాజనిత సరిహద్దు రేఖను ఏమంటారు?

1) అంతరిక్ష హద్దు  2) కర్మన్‌ రేఖ 

3) 1, 2      4) ఏదీకాదు

 

3. అంతర్జాతీయ అంతరిక్ష వారం గురించి కిందివాటిలో సరైనవి ఏవి? 

ఎ) ఇది ఏటా అక్టోబరు 4న మొదలవుతుంది.

బి) మానవనిర్మిత ఉపగ్రహానికి గుర్తుగా దీన్ని జరుపుతున్నారు. 

సి) అంతర్జాతీయంగా శాస్త్ర సాంకేతిక రంగాలు మానవాళికి మెరుగైన సౌకర్యాలు ఏ విధంగా కల్పిస్తున్నాయో తెలియజేసేందుకు దీన్ని నిర్వహిస్తున్నారు.

డి) దీన్ని ముఖ్యంగా అంతరిక్ష విజ్ఞానశాస్త్రం, దాని అనుబంధ రంగాల అభివృద్ధికి నిర్వహిస్తున్నారు.

1) ఎ, బి     2) బి, సి, డి 

3) సి, డి     4) పైవన్నీ

 

4. 2020లో ఆర్కిటిక్‌ ఖండ పరిశీలన కోసం పంపిన ఆర్కిటికా-లీ ఉపగ్రహం ఏ దేశానికి చెందింది?

1) చైనా     2) రష్యా 

3) భారత్‌     4) అమెరికా

 

5. ఉపగ్రహం అంతరిక్షంలో ఉన్న గ్రహాల  చుట్టూ తిరుగుతున్నట్లుగా భావించే ఊహాజనిత రేఖను ఏమంటారు? 

1) లాంచ్‌ పాడ్‌     2) కర్మన్‌ రేఖ 

3) కక్ష్య      4) భూమండలం

 

సమాధానాలు

1 - 2      2 - 3      3 - 4      4 - 2      5 - 3

Posted Date : 11-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌