• facebook
  • whatsapp
  • telegram

జీర్ణ వ్యవస్థ  

 జంతువులన్నీ తమ ఆహారం కోసం ఇతరత్రా ఆధారపడతాయి. ఇవి ఆహారాన్ని ఇతర జీవుల నుంచి తీసుకుని వాటిని జీర్ణం చేసుకుంటాయి. అమీబా లాంటి నిమ్నస్థాయి జంతువులు తీసుకునే ఆహారం నేరుగా కణంలోకి చేరుతుంది. అందులోని జీర్ణపు రిక్తిక ద్వారా జీర్ణమై కణంలో కలిసిపోతుంది. ఈ రకమైన జీర్ణక్రియను కణాంతర్గత జీర్ణక్రియ అంటారు. ఉన్నతస్థాయి జీవుల్లో ఎంజైములు కణం బయటకు అంటే ఆహార నాళంలోకి స్రవిస్తాయి. అక్కడ జీర్ణక్రియ కొనసాగుతుంది. దానిని కణబాహ్య జీర్ణక్రియ అంటారు. 

         మన రోజువారీ ఆహారంలో తీసుకునే పదార్థాలు సంక్లిష్టంగా లేదా శరీరం శోషించుకోలేనివి ఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్థలో సరళ పదార్థాలుగా లేదా శరీరం శోషించుకునే పదార్థాలుగా మారతాయి. ఈ ప్రక్రియనే జీర్ణక్రియ అంటారు. జీర్ణవ్యవస్థలో అనేక భాగాలుంటాయి. ఇవి నోటితో ప్రారంభమై పాయువుతో అంతమవుతాయి. మనం తీసుకునే ఆహారపదార్థాల్లో పిండి పదార్థాలు, కొవ్వులు, ప్రొటీన్లు ముఖ్యమైనవి. ఇవి జీర్ణవ్యవస్థలోని జీర్ణక్రియా భాగాలు స్రవించిన ఎంజైముల సహాయంతో చక్కెరలు, కొవ్వు ఆమ్లాలు, అమైనో ఆమ్లాలుగా మారతాయి.

         నోటిలోకి ఆహారం తీసుకోవడాన్ని అంతర్ గ్రహణం అంటారు. ఆహారం నోటిలోని వివిధ భాగాల సహాయంతో భౌతిక, రసాయనిక మార్పులకు గురవుతుంది.  నాలుక ఆహారాన్ని రెండు వైపులా మార్చుకోవడానికి, రుచిని గ్రహించడానికి తోడ్పడుతుంది. నాలుకపై ఉన్న రుచి మొగ్గలు రుచిని గ్రహించడానికి ఉపయోగపడతాయి.
లాలాజలంలో కరిగిన ఆహార పదార్థాలు రుచి మొగ్గల్లోకి వెళ్ళి రుచిని తెలుపుతాయి. లాలాజలంలో కరగని ఆహార పదార్థాల రుచిని మనం గ్రహించలేం. నాలుకపై వివిధ ప్రదేశాల్లో ఉన్న రుచి మొగ్గలు వివిధ రకాల రుచులను ఎక్కువగా గ్రహిస్తాయి. రుచి మొగ్గలు చిన్న పిల్లల్లో ఎక్కువ సంఖ్యలో, వృద్ధుల్లో తక్కువ సంఖ్యలో ఉంటాయి. 

        మానవుడిలో కుంతకాలు, రదనికలు, అగ్రచర్వణకాలు, చర్వణకాలు అనే నాలుగు రకాల దంతాలుంటాయి. దవడ గుంటల్లో అమరి ఉంటాయి. మానవ జీవితంలో దంతాలు రెండుసార్లు ఏర్పడతాయి. మొదటిసారి ఏర్పడే దంతాలను పాల దంతాలు అంటారు. వీటి సంఖ్య 20. ఇవి 6 నెలల నుంచి 24 నెలల మధ్య వస్తాయి. రెండోసారి వచ్చే దంతాలను శాశ్వత దంతాలు అంటారు. వీటి సంఖ్య 32. ఇవి ఆరేళ్ల నుంచి 12ఏళ్ల మధ్య వయసులో వస్తాయి. వీటిలో మూడో చర్వణకాల జత పదిహేడు ఏళ్ల నుంచి ఇరవై అయిదేళ్ల వయసు మధ్యలో వస్తాయి. వీటిని జ్ఞాన దంతాలు అంటారు. ఈ దంతాలను అవశేష అవయవాలుగా పరిగణిస్తారు. మానవ దంతం మూలం, మెడ, క్రౌన్ అనే భాగాలుగా విభజితమై ఉంటుంది. మూలం ఎముక గుంటల్లో సిమెంట్ అనే పదార్థంతో అతికి ఉంటుంది. మెడను కప్పుతూ కణజాలం ఉంటుంది. దంతంలో బయటకు కనిపించే భాగాన్ని క్రౌన్ అంటారు. దంతాలు డెంటయిన్ అనే పదార్థంతో నిర్మితమై ఉంటాయి. వీటిని కప్పుతూ ఎనామిల్ అనే పదార్థం ఉంటుంది. ఇది మన శరీరంలో అత్యంత గట్టి పదార్థం. గేదె, కుందేలు లాంటి శాకాహార జంతువుల్లో రదనికలు లోపించి ఉన్నాయి. ఇక్కడి ఖాళీ ప్రదేశాన్ని డయాస్టెమ్మా అంటారు. జీర్ణక్రియలో దంతాలు ఆహారాన్ని బాగా నమలడానికి అంటే పరిమాణంలో పెద్దవిగా ఉన్నవాటిని చిన్నవిగా చేయడానికి ఉపయోగపడతాయి.

        మానవుడి నోటిలో మూడు జతల లాలాజల గ్రంథులున్నాయి. అవి:
1. పెరోటిడ్ గ్రంథులు
2. అధోజిహ్విక గ్రంథులు
3. అధోజంబికా గ్రంథులు.

          వీటిలో పెరోటిడ్ గ్రంథులు చెవి కింది భాగంలో, అధోజిహ్విక, అధోజంబికా గ్రంథులు నాలుక కింద ఉంటాయి. లాలాజల గ్రంథులు లాలాజలాన్ని స్రవిస్తాయి. ఈ లాలాజలం ఒక నాళం సహాయంతో నోటిలోకి వస్తుంది. లాలాజలంలో 99.5% నీరు, 0.2% లవణాలు, 0.3% కర్బన పదార్థాలైన మ్యూసిన్, టయలిన్ అనే ఎంజైమ్‌లు ఉంటాయి. టయలిన్ పిండి పదార్థాలపై చర్య జరిపే ఎంజైమ్. దీనినే లాలాజల ఎమైలేజ్ అంటారు. రోజూ మన నోరు 1 నుంచి 1.5 లీటర్ల లాలాజలం స్రవిస్తుంది. దీని పి.హెచ్ 6.35 నుంచి 6.85 వరకు ఉంటుంది (ఆమ్లయుతం). నోటిలో ఉన్న ఆహారాన్ని దంతాల సహాయంతో నమలడంతో అది చిన్న చిన్న ముక్కలుగా మారుతుంది. తర్వాత లాలాజలంతో కలిసి జిగురుగా తయారవుతుంది. నోటిలో ఆహారం దంతాల వల్ల భౌతికంగా, టయలిన్ వల్ల పిండిపదార్థాలు రసాయనికంగా మార్పు చెందుతాయి. నోటిలో కేవలం పిండి పదార్థాలు మాత్రమే జీర్ణమవుతాయి. నోటిలో ఏ రకమైన ఆహార పదార్థం శోషితంకాదు. నోటిలో ఆహారం మింగడం వల్ల గ్రసని దాటి ఆహారవాహిక ద్వారా ప్రయాణించి జీర్ణాశయాన్ని చేరుతుంది. ఆహారవాహికలోని కండరాల సహాయంతో ఆహారం పెరిస్టాలిటిక్ చలనాలను చూపుతుంది.

* జంతువులు తీసుకున్న ఆహారాన్ని విచ్ఛిన్నం చేసి శక్తిని విడుదల చేయడానికి నిర్దేశించిన అవయవ వ్యవస్థను జీర్ణ వ్యవస్థ అంటారు.

* మనిషిలో జీర్ణవ్యవస్థ చాలా సంక్లిష్టమైన అవయవ వ్యవస్థ.

* మానవ జీర్ణ వ్యవస్థలో వివిధ రకాల అవయవాలు, జీర్ణ రసాలు, జీర్ణక్రియా ఎన్‌జైమ్‌లు మొదలైనవి ప్రధాన భాగాలు.

* మానవ జీర్ణ వ్యవస్థలో ప్రధానభాగం ఆహారనాళం.

* ఆహారనాళం పొడవైన గొట్టం లాంటి నిర్మాణం. ఇది నోటి నుంచి పాయువు వరకు వ్యాపించి ఉంటుంది.

*  మనం ఆహారాన్ని లోపలికి తీసుకునే విధానాన్ని అంతరగ్రహణం అంటారు.

*  మనిషి తీసుకునే ఆహారాన్ని శరీరం గ్రహించి, ఉపయోగించుకునేందుకు వీలుగా చిన్నచిన్న అణువులుగా మార్చుకుంటుంది. ఈ మొత్తం ప్రక్రియనే జీర్ణక్రియ అంటారు.

* మనం తీసుకున్న ఆహారం నోటిలోని దంతాల ద్వారా చిన్నచిన్న ముక్కలుగా మారి లాలాజలంతో కలుస్తుంది. దీని ఫలితంగా ఆహారం తడిగా, మెత్తగా జారుడు స్వభావాన్ని పొందుతుంది. ఈ ప్రక్రియను ముద్ద చేయడం అంటారు.

* ఇలా మెత్తగా జారుడు స్వభావం కలిగిన ఆహారం ఆహారవాహిక లేదా ఈసోఫేగస్‌ ద్వారా జీర్ణాశయంలోకి వెళ్లేందుకు అనువుగా ఉంటుంది.

* అస్యకుహరంలో లాలాజల గ్రంథులు ఉంటాయి. ఇవి మనిషిలో సుమారుగా మూడు జతలు ఉంటాయి. ఈ గ్రంథులు లాలాజలాన్ని స్రవిస్తాయి.

* రెండు జతల లాలాజల గ్రంథులు దవడల పక్కన, నాలుక కింద అమరి ఉంటాయి. మరో జత అంగిలిలో అమరి ఉంటాయి.

* లాలాజలంలో అమైలేజ్‌ (టయాలిన్‌) అనే ఎన్‌జైమ్‌ ఉంటుంది.

*  అమైలేజ్‌ సంక్షిష్ట కార్బోహైడ్రేట్లను సరళ కార్బోహైడ్రేట్లుగా మారుస్తుంది.

* నాలుక ఆహారాన్ని మిశ్రమం చేసేందుకు సహకరిస్తుంది. అలాగే ఆహారనాళంలోని తర్వాతి భాగంలోకి ఆహారాన్ని నెట్టేందుకు ఉపయోగపడుతుంది. అయితే ఈ పనిలో జంభిక లేదా దవడ కూడా తోడ్పడుతుంది.

* లాలాజలంతో కలిసిన ఆహారం ఆహార వాహిక ద్వారా ప్రయాణిస్తున్నప్పుడు అలలు లేదా తరంగాల మాదిరి చలనాన్ని ప్రదర్శిస్తుంది. దీన్నే పెరిస్టాలిటిక్‌ చలనం అని అంటారు.

* జీర్ణాశయంలో ఆహారం జఠరరసం, హైడ్రోక్లోరిక్‌ ఆమ్లంతో కలసి చిలికినట్లు మారుతుంది. ఈ దశలో ఆహారం అర్ధ ఘనరూపంలో చిక్కగా ఉంటుంది. ఇక్కడ ఆహారంలో పెప్సిన్‌ అనే ఎన్‌జైమ్‌ సాయంతో ప్రొటీన్లు చిన్నచిన్న అణువులుగా విచ్ఛిత్తి చెందుతాయి. ఆహారంలో ఉండే ప్రోటీన్లు,  కార్బోహైడ్రేట్‌లు చిన్నచిన్న ముక్కలుగా విడిపోయి మెత్తటి చిక్కటి రూపంలోకి మారుతుంది. దీన్నే ‘కైమ్‌’ అంటారు.

* జీర్ణాశయం చివర ఉండే వలయాకార సంవరణి కండరాలు వ్యాకోచం చెందడం వల్ల ఆహారం జీర్ణాశయం నుంచి చిన్నపేగులోకి వెళ్తుంది. ఈ కండరాలు కైమ్‌ మొత్తాన్ని ఒకేసారి కాకుండా చిన్న చిన్న మొత్తాలుగా ఆహార పదార్థం జీర్ణాశయం నుంచి చిన్నపేగులోకి వచ్చేలా నియంత్రిస్తాయి.

*  ఆహారనాళంలో అతి పొడవైన భాగం చిన్నపేగు. ఇందులో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు మొదలైన వాటి జీర్ణక్రియ పూర్తవుతుంది.

* ఇలా జీర్ణక్రియ పూర్తికావడంలో కాలేయం, క్లోమ గ్రంథుల నుంచి వెలువడే జీర్ణరసాలు ఉపయోగపడతాయి. ఈ గ్రంథుల స్రవాలు చిన్నపేగులో క్షారస్థితిని నెలకొల్పడానికి సహకరిస్తాయి.

* కాలేయం ద్వారా విడుదలయ్యే పైత్యరసం కొవ్వు పదార్థాలను జీర్ణం చేసి, చిన్నచిన్న రేణువులుగా మార్చేస్తుంది. ఈ ప్రక్రియనే ‘ఎమల్సీకరణం’ అంటారు.

* క్లోమరసంలో ఉండే ట్రిప్సిన్‌ అనే ఎన్‌జైమ్‌ ప్రోటీన్లను జీర్ణం చేయడానికి అలాగే లైపేజ్‌ అనే ఎన్‌జైమ్‌ కొవ్వులను జీర్ణం చేసేందుకు ఉపకరిస్తాయి.

*  చిన్నపేగుల గోడలు ఆంత్రరసాన్ని స్రవిస్తాయి. ఈ స్రావాలు ప్రోటీన్లు, కొవ్వులను మరింత చిన్న చిన్న అణువులుగా శోషించడానికి వీలుగా మార్పు చెందిస్తాయి. కార్బోహైడ్రేట్లు అస్యకుహురంలో కొంతమేరకు మాత్రమే జీర్ణమవుతాయి. జీర్ణాశయంలో మార్పులు చెందకుండా చిన్నపేగుల్లోకి చేరిన తర్వాత అక్కడ క్షారస్థితి కలిగి ఉండటం వల్ల పూర్తిగా జీర్ణమవుతాయి.

* జీర్ణమైన అంత్య పదార్థాలు పేగు నుంచి రక్తంలోకి చిన్నపేగులు గోడల ద్వారా రవాణా కావడాన్ని శోషణ అంటారు. చిన్నపేగు గోడల్లో చిన్నవేళ్ల మాదిరి నిర్మాణాలు ఉంటాయి. వీటినే సూక్ష్మ చూషకాలు అంటారు. ఇవి చిన్న పేగుల ఉపరితలాన్ని వైశాల్యపరంగా పెంచుతాయి. దీనివల్ల శోషణ సామర్థ్యం పెరుగుతుంది. రక్తనాళాలు, లింఫ్‌గ్రంథులు సూక్ష్మ చూషకాలతో కలసి జాలాకారంగా వలలా ఏర్పడతాయి.

* జీర్ణమైన ఆహారం అధికమొత్తంలో రక్తం ద్వారా శరీరంలోని ఇతర భాగాలకు తీసుకెళ్లేందుకు ప్రసరణ సహాయపడుతుంది. జీర్ణం కాని మిగిలిన ఆహార పదార్థం పెద్దపేగుల్లోకి వెళ్తుంది. తర్వాత వ్యర్థ పదార్థాలు పాయువు ద్వారా బయటకు నెట్టబడతాయి. పాయువు ఆహార వాహిక చివరి భాగమవుతుంది.

*  జీర్ణంకాని వ్యర్థపదార్థాలు పాయువు ద్వారా తొలగిపోవడాన్ని మలవిసర్జన అంటారు.


మానవుడి జీర్ణవ్యవస్థను కింది విధంగా సూచించవచ్చు.


మాదిరి ప్రశ్నలు

1. కిందివాటిని జతపరచండి.

గ్రంథి/జీర్ణాశయ భాగం     స్రవించే ప్రదేశం

 i) లాలాజల గ్రంథులు      a) ఆంత్రమూలం

ii) కాలేయం                  b) అస్యకుహరం

iii) క్లోమం                     c) చిన్నపేగు

 1) i-b, ii-a, iii-a           2)  i-b, ii-c, iii-a

 3) i-b, ii-a, iii-a          4)  i-c, ii-a, iii-c

2. కిందివాటిలో ఎన్‌జైమ్‌లు లేని జీర్ణరసం?

1)  క్లోమ రసం    2) పైత్య రసం   3)  ఆంత్ర రసం    4) జఠర రసం

3. పెప్సిన్‌ యొక్క చైతన్యరహిత రూపం?

1)  పెప్సిన్‌ ప్రికర్సర్‌     2) పైప్సిన్‌   3) పెప్పినోజెన్‌     4)  ప్రొపెప్సిన్‌ పెరాక్సైడ్‌


4. కిందివాటిని జతపరచండి.

   ఎన్‌జైమ్‌                 స్రవించే భాగం

 i) టయాలిన్‌                a) చిన్నపేగు

 ii) పెప్సిన్‌                   b) క్లోమం

 iii) ట్రిప్సిన్‌                  c) జీర్ణాశయం

 iv) పెప్టిడేజ్‌                 d) లాలాజల గ్రంథులు

1) i-d, ii-c iii-a, iv-b     2) i-c, ii-d, iii-b, iv-a

3) i-b, ii-a, iii-d, iv-c    4) i-d, ii-c, iii-b, iv-a


5. ‘కైమ్‌’ ఏ స్థితిలో ఉంటుంది?

1)  లవణ స్థితి    2) ఆమ్ల స్థితి    3) క్షార స్థితి    4) సమతౌల్య స్వరూప స్థితి


6. కింది పదార్థాలను జీర్ణక్రియ జరిగిన తరువాత ఏర్పడే ఉత్పన్నాలతో జతపరచండి.

       జాబితా ఎ                   జాబితా బి

 i) కార్బోహైడ్రేట్లు                 a) గ్లూకోజ్‌

ii) ప్రొటీన్లు                         b)కొవ్వు ఆమ్లాలు, గ్లిజరాల్‌

iii) కొవ్వులు                      c) పెప్టోన్లు

iv) సుక్రేజ్‌                         d) మాల్టోజ్‌

1) i-d, ii-c iii-b, iv-a     2) i-c, ii-d, iii-b, iv-a

3) i-d, ii-c, iii-a, iv-b    4) i-d, ii-b, iii-a, iv-c

7. కిందివాటిలో సరైన వాక్యాలేవి?

i) లాలాజలం PH విలువ 6.5 నుంచి 7 వరకు ఉంటుంది.

ii) గ్రసని ద్వారానే ఆహారవాహిక అనేది జీర్ణాశయంలోకి తెరుచుకుంటుంది.

iii) జీర్ణాశయం అనేది కండరయుతమైన సంచి. ఇది ఉదరవితానానికి దిగువన, ఉదరకుహరంలో ఎడమ పక్క ఉంటుంది.

1) i, ii     2)  ii, iii     3)  i, iii      4) i, ii, iii


8. మానవుడిలో సంవరణీ కండరాలు వ్యాకోచించినప్పుడు ఏమవుతుంది?

1) జీర్ణక్రియ వల్ల ఏర్పడ్డ అంత్య ఉత్పన్నకాలు పేగులో శోషణమవుతాయి.

2) కొవ్వులు జీర్ణమవుతాయి.

3) జీర్ణక్రియ అంత్య ఉత్పన్నకాలను చూషకాలు పీల్చుకుంటాయి.

4) మలం పాయువు ద్వారా బయటకు వెళ్తుంది.

9. నాలుకపై ఉండే రుచి మొగ్గల భాగాలను అవి గ్రహించే రుచితో జతపరచండి.

 నాలుకపై ఉండే                                         గ్రహించే రుచి 

రుచిమొగ్గల భాగం             

 i) నాలుక మొదటి ముందర భాగం               a) చేదు

ii) నాలుక ముందరి తరువాతి భాగం             b)పులుపు

iii)నాలుక పక్క భాగం                               c) ఉప్పు

 iv) నాలుక చివరి భాగం                            d) తీపి

1) i-d, ii-c iii-b, iv-a     2) i-c, ii-d, iii-b, iv-a

3) i-d, ii-c, iii-a, iv-b    4) i-d, ii-b, iii-a, iv-c

10. మానవుడిలో చర్వణకాల సంఖ్య?

 1) 8     2) 4      3) 12      4) 2

11. మనిషిలో కొరకడానికి ఉపయోగపడే దంతాలు ఏవి?

1)  చర్వణకాలు     2) అగ్రచర్వణకాలు   3) కుంతకాలు      4) రధనికలు

12. జీర్ణాశయం, ఉదరంలోని భాగాల అధ్యయనాన్ని ఏమంటారు?

1) గ్యాస్ట్రో స్టొమెకాలజీ    2) గ్యాస్ట్రో ఎంటరాలజీ    3) పల్మనాలజీ        4) ఎలిమెంటరీ స్టడీస్‌

13. రెనిన్‌ అనే ఎన్‌జైమ్‌ నిర్వర్తించే విధి?   

1) కొవ్వులను కొవ్వు ఆమ్లాలుగా మారుస్తుంది.

2) అమైనో ఆమ్లాలను ప్రోటీన్లుగా మారుస్తుంది.

3)  పిండి పదార్థాన్ని మాల్టోజ్‌గా మారుస్తుంది.

4) పాలను పెరుగుగా మారుస్తుంది.

14. సోడియం కోలేట్, సోడియం డీఆక్సీకోలేట్‌ అనేవి?

1)  పైత్యరస లవణాలు   2)  పైత్యరస వర్ణకాలు   3)  క్లోమరస లవణాలు   4) క్లోమరస వర్ణకాలు


15. కిందివాటిలో సరైన వాక్యాలేవి? 

1) క్లోమం పసుపు, బూడిద రంగులో ఉండే గ్రంథి

2) క్లోమం నాళ, వినాళ గ్రంథిగా పనిచేస్తుంది.

3) క్లోమరసం క్షారయుతంగా ఉంటుంది.

4) క్లోమరసంలో ఉండే ముఖ్యమైన ఎన్‌జైమ్‌లు ట్రిప్సిన్, కైమోట్రిప్సిన్, ఎమైలేజ్, లైపేజ్‌లు.

1) i, ii, iii           2) ii, iii, iv   3) i, iv మాత్రమే          4) i, ii, iii, iv


16. యూరియా మానవ శరీరంలో ఏభాగంలో తయారవుతుంది? 

 1)  ప్లీహం      2) క్లోమం    3)  ఉండుకం   4) కాలేయం


17. లాలాజలంలో నీరు సుమారు ఎంతశాతం ఉంటుంది?

1)  99.5%    2)  30%  3)  0.3%  4) 0.9%


18. మనిషి దంతాలు వేటితో నిర్మితమై ఉంటాయి?

1) సిమెంట్‌           2) డెంటయిన్‌     3) పెరిటోనియం         4) కాల్షియం కార్బోనేట్‌


19. ఏనుగుల్లో పొడవుగా కనిపించే దంతాలు కింది వేటి రూపాంతరాలు?

1) చర్వణకాలు      2) రధనికలు   3) కుంతకాలు      4) అగ్రచర్వణకాలు


20. కింది ఏ భాగంలో ప్రోటీన్ల జీర్ణక్రియ ప్రారంభమవుతుంది?

1) క్లోమం      2) జీర్ణాశయం    3) కాలేయం      4) చిన్నపేగు


21. మానవుడి జీర్ణనాళంలో అతిపెద్ద భాగం?

1) పెద్దపేగు      2) చిన్నపేగు    3) కాలేయం      4) జీర్ణాశయం


22. మనిషి జీర్ణక్రియ సంపూర్ణమయ్యే భాగం?

1) జీర్ణాశయం      2) క్లోమం     3) చిన్నపేగు      4) పెద్దపేగు


23. మన శరీరంలో అత్యంత గట్టి పదార్థం ఎక్కడ ఉంటుంది? 

1) ఎనామిల్‌     2) కండరం    3)  ఎముక   4)  పుర్రె


24. మానవ జీర్ణవ్యవస్థతో సంబంధం లేని భాగం?

 1)  పురీషనాళం      2)  ఆంత్రమూలం     3)  పిత్తాశయం      4)  నెఫ్రాన్‌


25. సుక్రేజ్‌ ఎన్‌జైమ్‌ ఎక్కడ ఉంటుంది? 

1) ఆంత్ర రసం      2) జఠర రసం      3)  క్లోమ రసం      4) లాలాజలం


సమాధానాలు


1)1   2) 2  3) 3   4) 4   5) 2   6) 1   7) 4   8) 4  9) 1  10) 3   11) 3 12) 2 13) 4    14) 1    15) 4    16) 4  17) 1    18) 2    19) 3    20) 2    21) 2    22) 3   23) 1   24) 4   25)1

Posted Date : 17-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌