• facebook
  • whatsapp
  • telegram

కరవు - వరదలు

ప్రస్తుత ప్రపంచంలో జనాభా విస్ఫోటనం, వన నిర్మూలన, మానవ జీవ వ్యర్థాలు, అధిక పరిశ్రమల వ్యర్థాల వల్ల కార్బన్ల సంఖ్య అధికమై పర్యావరణం క్షీణించి అనేక ఖండాలు, దేశాల్లో భూతాపం పెరిగి కరవులు, వరదలు సంభవిస్తున్నాయి. ప్రత్యేకంగా పశ్చిమ పసిఫిక్‌లో ఎల్‌నినో, లానినో పరిస్థితుల వల్ల ప్రపంచవ్యాప్తంగా అధిక కరవు కాటకాలు, వరదలు సంభవిస్తున్నాయి. ఈ పరిస్థితుల దృష్ట్యా వివిధ పబ్లిక్ సర్వీస్ కమిషన్లు నిర్వహించే పోటీ పరీక్షల్లో విపత్తు నిర్వహణ - పర్యావరణ అంశాలపై ప్రశ్నలు ఎక్కువగా అడుగుతున్నారు.


కరవు ఎలా వస్తుంది?


  కరవు అనేది వర్షపాత లోపం వల్ల ఏర్పడే ప్రకృతి వైపరీత్యం. ఒక ప్రాంతంలో కురవాల్సినంతగా వర్షం కురవకపోతే ఆ ప్రాంతం పొడిగా మారుతుంది. దాన్నే కరవు అంటారు. కరవును క్షామం, అనావృష్టి అని కూడా అంటారు. కొన్ని ప్రాంతాల్లో అవి ఉన్న భౌగోళిక స్థితుల వల్ల తక్కువ వర్షపాతం పడటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నప్పుడు వాటిని 'కరవు పీడిత ప్రాంతాలు' అంటారు.

ఉదా: తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో ప్రతి అయిదు సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు కరవు ఏర్పడే అవకాశం ఉంది.

* ఒక ప్రాంతంలో అధిక లేదా అల్ప వర్షపాతాన్ని (70 - 100 సంవత్సరాల) సగటు సాధారణ వర్షపాతంతో పోల్చి కింది విధంగా చెబుతారు.


a) అధిక: + సగటు వర్షపాతం కంటే 20% ఎక్కువ.


b) సాధారణ: + సగటు వర్షపాతం కంటే 19% ఎక్కువ నుంచి 19% తక్కువ.


c) అల్ప: - సగటు వర్షపాతం కంటే 20% నుంచి 59% తక్కువ.


d) అత్యల్ప: - సగటు వర్షపాతం కంటే 60% తక్కువ.

¤* జాతీయ వ్యవసాయ కమిషన్ (National Commission for Agriculture) కరవును మూడు రకాలుగా పేర్కొంది.


a) వాతావరణ కరవు: ఈ రకమైన కరవు సాధారణ అవపాతంలో (వర్షం) 10% కంటే ఎక్కువ అవపాతం లోపించడం.


b) వ్యవసాయ కరవు: మృత్తికల్లో తేమ లోపించడం, నేలలు సరిగా లేకపోవడం.


c) జల సంబంధ కరవు: భూగర్భ జలాలు ఇంకిపోవడం, మృత్తికలు అంతర్ భౌమ జలాలను గ్రహించకపోవడం.

* 2016 డిసెంబరు జాతీయ కరవు నిర్వహణ కరదీపిక (Manual of Drought Management) లో కరవును నాలుగు రకాలుగా పేర్కొన్నారు.

a) 750 mm కంటే తక్కువ వర్షం - దీర్ఘకాలిక కరవు - 33%

b) 750 mm - 1125 mm మధ్య వర్షం - కరవు పీడిత ప్రాంతం - 35%

c) 1126 mm - 2000 mm అధిక వర్షం - సాధారణ కరవు - 24%

d) 2000 mm కంటే అధిక వర్షం - కరవులేని ప్రాంతం - 8% గా దేశభౌగోళిక వైశాల్యంలో కలిగి ఉంది.

* భారత వాతావరణ శాఖ (IMD) న్యూదిల్లీ కరవును 5 రకాలుగా వర్గీకరించింది. భారతదేశభౌగోళిక వైశాల్యంలో 68% కరవులు సంభవిస్తున్నాయి.


కరవు ప్రభావం:

కరవు సంభవించిన ప్రాంతాల్లో దాని ప్రభావం క్రమేణ తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది.

¤* భూగర్భ జల నీటి మట్టం పడిపోవడం, తాగు నీటి కొరత.

¤* పంటల విస్తీర్ణం తగ్గడం, వ్యవసాయ రంగంలో ఉపాధి తగ్గిపోవడం.

¤* ఆహార ధాన్యాల, పశుగ్రాస కొరత; పశువులు చనిపోవడం.

¤* పోషకాహార లోపం ప్రత్యేకించి చిన్న పిల్లల్లో అతిసారం, కలరా లాంటి రోగాలు; ఆహార కొరత వల్ల కంటి చూపు దెబ్బతినడం, పని కోసం ప్రజలు వలస వెళ్లడం.


కరవు నివారణ, దాన్ని ఎదుర్కోవడం:

* కరవు ఒక్కసారిగా సంభవించే ప్రమాదం కాదు. అది నిదానంగా వస్తుంది. దీన్నే Creeping Disaster అంటారు.

¤* మన దేశంలో ఇప్పటివరకు 25 ప్రధాన కరవులు సంభవించాయి.

¤* బెంగాల్ కరవు వల్ల 1770లో మొత్తం జనాభాలో 33% ( 1/3వ వంతు) మంది మరణించారు.

¤* 1943 - 44లో మన దేశంలో 3 - 4 మిలియన్ల మంది ప్రజలు కరవు బారిన పడ్డారు.

¤* మన దేశంలో తరచూ రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కరవులు ఏర్పడతాయి.

¤* కరవును నివారించడానికి ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, స్థానిక అధికారులు నీటి సంరక్షణ విధానాలపై అవగాహన కల్పించడానికి కృషి చేస్తున్నారు.

* వర్షపు నీటిని ఇంకుడు గుంతల్లోకి మళ్లించడం ద్వారా భూగర్భ జలాలను పెంచవచ్చు.

* కరవు ప్రభావాన్ని తగ్గించడానికి ప్రభుత్వం సమగ్ర వాటర్‌షెడ్ యాజమాన్య పథకాలను (IWMP) అమలు చేస్తుంది.


వరదలు (Floods)

ఒక ప్రాంతంలో కొంతకాలం పొడిగా ఉండి అకస్మాత్తుగా అధిక వర్షాలతో ఆ ప్రాంతం పొంగి పొర్లడాన్ని వరదలు అంటారు. అంటే కురవాల్సిన వర్షం కంటే అధిక వర్షం రావడాన్ని 'వరద బీభత్సం' లేదా 'అతివృష్టి' అంటారు.

సాధారణంగా వాతావరణ శాఖ (IMD) ప్రకారం భూ ఉపరితలంపై 12 అంగుళాల వర్షం కురిసినప్పుడు వరదగా ప్రకటిస్తారు.


ప్రధానంగా వరదలు అనేవి

a) అధిక వర్షం కురిసే మైదాన ప్రాంతాల్లో

b) పర్వత వాలు ప్రదేశాల్లో

c) నదీ వక్రత, తీర ప్రాంతాల్లో

d) పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంది.

* ప్రకృతి విపత్తుల్లో వరదలు అత్యంత ప్రమాదకరమైనవి. ఇవి ఆయా దేశాలను అకస్మాత్తుగా ముంచేస్తాయి. ఇవి ఆరు అంగుళాల వరదలో మనిషిని ప్రమాదంలోకి నెట్టి వేస్తాయి.

* ప్రపంచంలో ఎక్కువగా వరదలు ఆసియా తూర్పు దేశాల్లో (80%) సంభవిస్తున్నాయి.

* వరదల నుంచి కాపాడటానికి ఆయా ప్రాంత ప్రజలను హెచ్చరించేందుకు 'నైలో మీటర్' సాధనాన్ని ఉపయోగిస్తారు.

* గ్రామీణ ప్రాంతంలోని మైదాన వరదల కంటే పట్టణ ప్రాంతంలోని వరదలు వైశాల్యంలో 6 రెట్లు, ఎత్తులో 8 రెట్లు ఎక్కువగా వస్తాయి. కారణం పట్టణ ప్రాంతాల్లో డ్రైనేజీ సరిగా లేకపోవడం, ఇరుకు రోడ్లు, భూమి నీటిని పీల్చుకోకపోవడం.


భారతదేశం - వరదలు

మన దేశంలో వరదలు ప్రధానంగా అతిపెద్ద నదులైన గంగా - సింధూ - బ్రహ్మపుత్ర నదీ వ్యవస్థల్లో వస్తున్నాయి. వాటిలో ఆకస్మిక వరదలు ఎక్కువగా బ్రహ్మపుత్ర నది వల్ల సంభవిస్తున్నాయి.

A) ఉత్తర భారతదేశంలో 60% వరదలు గంగా - బ్రహ్మపుత్ర నదీ వ్యవస్థల వల్ల సంభవిస్తున్నాయి.

గంగా నది  దాని ఉపనది ప్రాంతాలైన ఉత్తర్‌ ప్రదేశ్, బిహార్, బెంగాల్‌లో అత్యధిక భౌగోళిక వైశాల్యం వరద ప్రమాదంలో ఉంది. అలాగే గంగా - బ్రహ్మపుత్ర నదుల వల్ల తరచుగా అసోం, బెంగాల్, ఉత్తర్‌ ప్రదేశ్, బిహార్‌లో వరదలు వస్తున్నాయి.

ఉదా: 2013 జూన్ 17 నాటి ఉత్తరాఖండ్ వరదల వల్ల సుమారు 5 వేల మంది మరణించారు.

2016 సెప్టెంబరు 3 - 6 తేదీల్లో జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో జీలం నది వరద వల్ల 300 మంది మరణించారు.

B) ద్వీపకల్ప భారత్‌లో 40% వరదలు స్థానిక నదుల వల్ల వస్తున్నాయి. దక్షిణ భారత్‌లో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలో ఎక్కువగా వరదలు వస్తాయి.

ఉదా: 2009లో తుంగభద్ర నది వల్ల కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లో తీవ్రమైన వరదలు వచ్చాయి.

మన దేశంలో సగటున ప్రతి సంవత్సరం 7.5 మిలియన్ హెక్టార్లలో వరదలు వస్తున్నట్లు జాతీయ వరద కమిషన్ పేర్కొంది. దేశ  భౌగోళిక వైశాల్యంలో 40 మిలియన్ హెక్టార్ల భూభాగంలో వరద ప్రమాదం ఉన్నట్లు గుర్తించింది. జాతీయ విపత్తు వరద అంచనా ప్రకారం భౌగోళిక ప్రాంతంలో 12% వరదలు వస్తున్నట్లు పేర్కొంది. 2016 UNISDR ప్రకారం ప్రతి సంవత్సరం 5% వరదలను ప్రత్యక్షంగా అనుభవిస్తున్నట్లు, విపత్తులకు ఖర్చు చేసే వ్యయంలో కేవలం వరదలకే 33% వెచ్చిస్తున్నట్లు అంచనా వేసింది.


వరదలు - నివారణ చర్యలు

¤* 1937లో బ్రిటిష్‌వారు వరదలను నివారించడానికి ఒక సివిల్ సర్వెంట్ ద్వారా 'ఫ్లడ్ రిలీఫ్ కమిషన్‌'ను ఏర్పాటు చేసి నివారణ చర్యలు చేపట్టేవారు.

* 1954లో 'జాతీయ వరద నియంత్రణ మండలి'ని (National Flood Control Board - NFCB) ఏర్పాటు చేశారు.

* 1980లో జాతీయ వరద కమిషన్‌ను ఏర్పాటు చేశారు.

* 2010లో జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీని NDMA మార్గదర్శకాల ప్రకారం పట్టణ వరద విపత్తు నివారణ (UFDM)ను రూపొందించారు.

* వరదలు వస్తున్నట్లు సెంట్రల్ వాటర్ కమిషన్ (CWC) హెచ్చరిస్తుంది.

* ప్రతి సంవత్సరం వరదల వల్ల 8.1 మిలియన్ హెక్టార్ల వ్యవసాయ భూమి, 3.6 మిలియన్ హెక్టార్ల పంటలు నష్టపోతున్నాయి.

* వరదలను నివారించడానికి 2007-12 మధ్య 11వ ప్రణాళికలో రూ.8 వేల కోట్లను కేటాయించారు.


వరదలు వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

a) మరిగించిన నీటిని తాగాలి.

b) డయేరియా ప్రబలినప్పుడు టీ - డికాషన్లు, గంజి, లేతకొబ్బరి నీరు తీసుకోవాలి.

c) వ్యాధులు వ్యాప్తి చెందకుండా చుట్టుపక్కల బ్లీచింగ్ పౌడర్ చల్లాలి.

d) నీటిని శుద్ధి చేయడానికి హాలోజన్ (Halogen) బిళ్లలు ఉపయోగించాలి. 

Posted Date : 08-07-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌