• facebook
  • whatsapp
  • telegram

ఆవరణ వ్యవస్థ - పర్యావరణ క్షీణత

  భూఉపరితలంపై క్రీ.పూ.10 వేల సంవత్సరాల కిందట వ్యవసాయం ప్రారంభమైనప్పుడు కేవలం 40 లక్షల జనాభా ఉండేది. క్రమానుగతంలో 1750 నాటికి 50 కోట్లు, 1900 నాటికి 100 కోట్లు, 1950 నాటికి 250 కోట్లు ఉంటే ప్రస్తుతం 700 కోట్లకు పెరిగింది. ఇది 2100 సంవత్సరం నాటికి 1000 కోట్లకు చేరుతుందని ఐక్యరాజ్య సమితి అంచనా. ఈ విధంగా జనాభా విస్ఫోటనం వల్ల మానవ అవసరాలు పెరగడంతో అనేక పరిశ్రమలను స్థాపించారు. వీటి నుంచి వెలువడే ఉద్గారాల వల్ల ప్రపంచ వ్యాప్తంగా రోజురోజుకు పర్యావరణ కాలుష్యం పెరుగుతోంది.


భూగోళంపై శిలావరణం, జలావరణం, వాతావరణం, జీవావరణం అనే నాలుగు ఆవరణాలు ఉన్నాయి. ఈ ఆవరణాల మధ్య భూఉపరితలంపై అత్యధికంగా జలావరణంలో జీవావరణం ఆవరించి ఉంది. ఇది జంతు, వృక్ష, ప్రాణులను కలిగి ఉంటుంది.


* జీవుల ఆధారంగా జీవావరణాన్ని 3 వర్గాలుగా విభజించవచ్చు. అవి:

1) ఉత్పత్తిదారులు (Producers)

2) వినియోగదారులు (Consumers)

3) విచ్ఛిన్నకారులు (Decomposers)


ఉత్పత్తిదారులు: కిరణజన్య సంయోగక్రియ (సూర్యరశ్మి, నీరు) ద్వారా తమంతట తామే ఆహారాన్ని తయారు చేసుకొని స్వయం పోషకంగా జీవించే వాటిని ఉత్పత్తిదారులు అంటారు.


ఉదా: మొక్కలు, గడ్డి, లెగ్యుమినేసి జాతులు


వినియోగదారులు: ఉత్పత్తిదారులు తయారుచేసిన వాటిపై ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఆధారపడి జీవించే వాటిని వినియోగదారులు అంటారు. ఇవి నాలుగు రకాలు.


1) శాఖాహారులు (Herbivores): ఇవి ఉత్పత్తిదారులపై ఆధారపడి ఉంటాయి.
ఉదా: మిడత, చిమ్మెట, ఉడుత, కుందేలు, జిరాఫీ, పశువులు.


2) మాంసాహారులు (Carnivores): ఇవి శాఖాహారులపై ఆధారపడి జీవిస్తాయి.
ఉదా: తేలు, పాము, చిరుత, పులి, సింహం.


3) సర్వభక్షకులు (Omnivores): ఇవి శాఖాహార, మాంసాహారులపై ఆధారపడి జీవిస్తాయి.
ఉదా: ఎలుక, పిల్లి, కుక్క, డేగ, మానవుడు (అతి ప్రధాన సర్వభక్షకుడు).


4) పూతికాహారులు (Detritivores): ఇవి మలిన జీవులపై ఆధారపడి జీవిస్తాయి.
ఉదా: చెదపురుగులు, చీమలు.


విచ్ఛిన్నకారులు: ఇవి విగత జీవులు (మరణించిన), వ్యర్థాలపై ఆధారపడి జీవిస్తాయి.
ఉదా: బ్యాక్టీరియా, శిలీంద్రాలు.


ఆవరణ వ్యవస్థ

ఆవరణ శాస్త్రాన్ని ఆంగ్లంలో ఇకాలజీ (Ecology) అంటారు. ఇది గ్రీకు భాషలోని ఓయికస్ (ఇల్లు), లోగోస్ (అధ్యయనం) అనే రెండు పదాల నుంచి వచ్చింది. అంటే మన ఇంటి చుట్టూ ఉన్న పరిసరాలను అధ్యయనం చేయడం అని అర్థం. ఇకాలజీ అనే పదాన్ని మొదట 1866లో జర్మనీకి చెందిన హెర్నెస్ట్ హెకెల్ అనే జీవ శాస్త్రవేత్త ఉపయోగించాడు. ఆ తర్వాత బ్రిటన్‌కు చెందిన ట్రాన్స్‌లే ఆవరణ వ్యవస్థను వెలుగులోకి తెచ్చాడు. భౌతిక పరిసరాల్లోని జీవుల మధ్య సంబంధాన్ని తెలియజేసేదే ఆవరణ వ్యవస్థ అని పేర్కొన్నాడు.


పర్యావరణం

పరిసరాల నుంచి పర్యావరణం అనే పదం వచ్చింది. పర్యావరణం 'ఎన్విరాన్' (Environ) అనే ఫ్రెంచ్ భాషా పదం నుంచి వచ్చింది. దీనికి అర్థం మనచుట్టూ ఉన్న ప్రాంతం. మానవుడి జీవనం, మొక్కలు, జంతు, వృక్ష; జీవ, నిర్జీవ అంశాలను అధ్యయనం చేసేదే పర్యావరణం.

* పర్యావరణంలో రెండు అణుఘటకాలు ఉంటాయి.

     1) నిర్జీవ అణుఘటకాలు (Abiotic Compounds)

     2) జీవ అణుఘటకాలు (Biotic Compounds)


నిర్జీవ అణుఘటకాలు: ఇవి ప్రకృతి నుంచి ఉద్భవించిన సహజ వనరులు.
ఉదా: గాలి, నీరు, నేల, ఆకాశం, అగ్ని.


జీవ అణుఘటకాలు: ఇవి సహజ వనరులపై ఆధారపడతాయి.
ఉదా: వీటిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ, శిఖరాగ్ర వినియోగదారులు ఉంటాయి.


జీవావరణ పిరమిడ్

చార్లెస్ హెల్టన్ ఆహార గొలుసు ఆధారంగా జీవావరణ పిరమిడ్‌ను తయారుచేశాడు. దీనిలో కింది నుంచి పైస్థాయికి ఉత్పత్తి ప్రవాహం తగ్గుతుంది. అలాగే పై నుంచి కింది స్థాయికి సంపద సంఖ్య తగ్గుతుంది.

                                            

 

పర్యావరణ కాలుష్యాలు

మానవుడి దైనందిన జీవన కార్యకలాపాల ద్వారా ఘన, ద్రవ, వాయు వ్యర్థాలు జీవావరణ సమతౌల్యం దెబ్బతినే స్థాయిలో విడుదలవడాన్ని పర్యావరణ క్షీణత లేదా కాలుష్యం అంటారు. రసాయనాలు, ఖనిజాలు, పేపర్, చక్కెర లాంటి భారీ మౌలిక పరిశ్రమల నుంచి విడుదలయ్యే కాలుష్యాలు అనేక సమస్యలకు కారణమవుతున్నాయి.


వాయు కాలుష్యం

భూగోళాన్ని ఆవరించి ఉన్న గాలిపొరను వాతావరణం అంటారు. ఇది భూగోళం చుట్టూ 6 కి.మీ. ఎత్తులో అత్యధికంగా వ్యాపించి భూభ్రమణ, గురుత్వాకర్షణ వల్ల సంకోచం, వ్యాకోచం చెందుతుంది. సహజ వాతావరణంలో అనేక వాయువులు ఉన్నప్పటికీ ప్రధానంగా 17 వాయువుల మిశ్రమం ఉంటుంది. వీటిలో.......

       నత్రజని - 78.084%

       ఆక్సిజన్ - 20.947%

       కార్బన్ డై ఆక్సైడ్ - 0.0314%

       మీథేన్ - 0.002%

       హైడ్రోజన్ - 0.00005%

ఆర్గాన్, నియాన్, క్రిప్టాన్, గ్జినాన్ అనే వాయువులు నామమాత్రంగా ఉంటాయి. నత్రజని జడవాయువు కొన్ని బ్యాక్టీరియాలకు తప్ప జీవకోటి అవసరాలకు పనికి రాదు. ఆమ్లజని (ఆక్సిజన్) జీవకోటికి అత్యంత అవసరమైన వాయువు. బొగ్గుపులుసు వాయువు (CO2) కిరణజన్య సంయోగ క్రియ ద్వారా వృక్ష జాతుల్లో పిండి పదార్థాల తయారీకి ఉపయోగపడుతుంది. పరిశ్రమలు, ఖనిజాలు, బొగ్గు, చమురు లాంటివి వాడటం వల్ల కార్బన్లు, నైట్రోజన్, సల్ఫర్, ఫ్లోరైడ్, కార్బన్ డై ఆక్సైడ్, సల్ఫర్ డై ఆక్సైడ్ వాయువులు గాలిలో అధిక పరిమాణంలో కేంద్రీకృతమై పర్యావరణానికి హాని కలిగించడాన్నే వాయు కాలుష్యం అంటారు.

ప్రధానంగా గ్రీన్‌హౌస్ వాయువుల్లో కార్బన్ డై ఆక్సైడ్ పరిమాణం; మాంసం, జీవవ్యర్థాల నుంచి వెలువడే మీథేన్ పెరగడం; భూఉపరితల ఉష్ణోగ్రత అధికమై మంచుకొండలు, కొండచరియలు, సముద్ర మట్టం పెరగడం, వరదలు, తుపాన్లు లాంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల ప్రాణ నష్టం సంభవిస్తుంది. దీన్నే భూతాపం (గ్లోబల్ వార్మింగ్) అంటారు. అలాగే వాతావరణంలో సల్ఫర్ డై ఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ మిశ్రమాల వల్ల ఆమ్ల వర్షాలు కురుస్తున్నాయి. సల్ఫర్ డై ఆక్సైడ్ పెరిగి వివిధ పత్రాలు, లైబ్రరీ పుస్తకాలు పసుపు రంగులోకి మారుతున్నాయి.

భూఉపరితలానికి 30 - 35 కి.మీ. ఎత్తులో ఉన్న స్ట్రాటో పొర అతినీలలోహిత కిరణాల నుంచి జీవరాశిని రక్షిస్తుంది. దీన్నే ఓజోన్ పొర (O3) అంటారు. రిఫ్రిజిరేటర్లు, ఏసీ, మిక్సీలు, క్లీనింగ్ సాల్వెంట్లు, క్లోరోఫ్లోరో కార్బన్‌ల (CFCs) వల్ల ఓజోన్ పొర పలచబడి దానికి రంధ్రాలు ఏర్పడుతున్నాయి. ఈ కారణంగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాలకు తీవ్రనష్టం జరుగుతుంది. వాయు కాలుష్యం వల్ల చర్మ, శ్వాసకోశ, మెదడు, గుండె, కంటి వ్యాధులు సంక్రమిస్తున్నాయి.


నేల కాలుష్యం
 

వివిధ వ్యర్థ పదార్థాల మిశ్రమం వల్ల భూమి యొక్క జీవ - భౌతిక - రసాయన ధర్మాల్లో మార్పులు ఏర్పడి, భూమి ఉత్పత్తి సామర్థ్యం తగ్గి నేల కాలుష్యం ఏర్పడుతుంది. భూ నాణ్యత కోల్పోవడాన్ని భూమి క్షీణత/కాలుష్యం అంటారు.

భూమికోత, ఎడారీకరణ, లవణీకరణ, ఆమ్లీకరణ, అధిక పరిమాణంలో రసాయనాలు భూమిలోకి చొచ్చుకుపోయి భూసారం కోల్పోవడం వల్ల భూమి నాణ్యత క్షీణిస్తుంది. భూఉపరితలంపై ఉన్న సారవంతమైన పొర కొట్టుకుపోవడాన్ని భూమికోత అంటారు. విచక్షణా రహితంగా అడవులను నరికి పంటపొలాలుగా మార్చడం వల్ల ఇది ఏర్పడుతుంది.


ఎడారీకరణ
ఎడారి భూములు నిస్సారంగా, ఇసుకతో ఉండి కఠినమైన వాతావరణాన్ని కలిగి ఉంటాయి. పశువులు మేయడం, వృక్షాలను వంటచెరుకుగా ఉపయోగించడం, అడవులను నరకడం, క్షారీకరణ, లవణీకరణ వల్ల భూములు ఎడారులుగా మారుతున్నాయి.


లవణీకరణ
భూమిలో లవణాలు కేంద్రీకృతమవడం సహజంగా లేదా మానవ చర్యల వల్ల జరుగుతుంది. సముద్ర తరంగాలు, వాయుగుండాలు, వరదల వల్ల నేల లవణీకరణం చెందుతుంది. దీనితో పాటు రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు వాడటం; కృత్రిమ నీటి సదుపాయాలైన కాలువలు, గొట్టపుబావుల ద్వారా సేద్యం చేయడం వల్ల లవణీకరణ ఏర్పడుతుంది.


ఆమ్లీకరణ
వాతావరణంలో సల్ఫర్ డై ఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ పెరగడంతో ఆమ్లవర్షాలు కురిసి భూఉపరితలంపై ఆమ్లీకరణ జరుగుతుంది. రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు భూమిలోకి చొచ్చుకుపోవడం, భూ నాణ్యతను కాపాడే బ్యాక్టీరియా, వానపాములు లాంటి సూక్ష్మజీవులు అంతరించడం వల్ల భూ కాలుష్యం ఏర్పడుతుంది.

Posted Date : 08-07-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌