• facebook
  • whatsapp
  • telegram

మధ్యయుగం - సాహసవీరులు!

ఛందేల రాజుల కాలంలో నిర్మించిన ఖజురహో దేవాలయాలు హర్షుడి అనంతరం మన దేశంలో అనేక పరిణామాలు సంభవించాయి. రకరకాల రాజవంశాలు ఆవిర్భవించి స్థానిక సంస్కృతీ సంప్రదాయాలను పరిరక్షించాయి. కానీ వీరందరిలో అనైక్యత కారణంగా ఏర్పడిన పరిస్థితులు అరబ్బుల దాడులకు, యూరోపియన్ల విస్తరణకు దారితీశాయి. భారత దేశంపై గజనీ, ఘోరీ మహమ్మద్‌ల దండయాత్రలు తీవ్రమైన ప్రభావాన్ని చూపాయి. నాటి రాజకీయ, ఆర్థిక, సామాజిక స్థితిగతులను మార్చివేశాయి. ఆ దాడులు సోలంకీలు, చౌహానుల కాలాల్లో జరిగాయి. అప్పటి పరిస్థితులు, ఆ యుద్ధాలకు కారణాలను మధ్యయుగంలో మన దేశాన్ని పాలించిన రాజపుత్రుల్లో ప్రతీహారులు, పరమారులు, ఛందేలుల అనంతరం మరికొన్ని వంశాల వారు ఉన్నారు. ఆ రాజుల కాలంలో ఎన్నో ముఖ్యమైన పరిణామాలు సంభవించాయి. మధ్యయగ అధ్యయనంలో భాగంగా పోటీపరీక్షల అభ్యర్థులు ఈ వివరాలను తెలుసుకోవాలి.


మధ్యయుగ భారతదేశ చరిత్ర - రాజపుత్ర యుగం

  భారతదేశ చరిత్రలో క్రీ.శ.8 నుంచి 18వ శతాబ్దం మధ్య కాలాన్ని మధ్యయుగం అంటారు. ఇది రాజపుత్రులతో ప్రారంభమై ఐరోపావారి రాక వరకు కొనసాగుతుంది. భూస్వామ్య వ్యవస్థ/ ఫ్యూడలిజం నాటి ప్రధాన లక్షణంగా చరిత్రకారులు అభివర్ణించారు. ఈ యుగం అధ్యయనంలో భాగంగా ఉత్తర భారతదేశంలో రాజపుత్ర యుగం, మహమ్మదీయ దండయాత్రలు, ఢిల్లీ సుల్తానులు, మొగల్‌ సామ్రాజ్యం; దక్షిణ భారతదేశంలో పల్లవులు, చోళులు, చాళుక్యులు, కాకతీయులు, యాదవులు, హొయసాలులు, పాండ్యులు, విజయనగర, బహమనీ సామ్రాజ్యాల గురించి తెలుసుకోవాలి.

రాజపుత్రులు

  హర్షుడి మరణానంతరం ఉత్తర భారతదేశాన్ని రాజపుత్రులు పరిపాలించారు. వారిలో ప్రతీహారులు, పరమారులు, ఛందేలులు, చౌహానులు, సేన, పాల, గహద్వాలు లాంటి సుమారు 36 రాజ వంశాల వారు ఉన్నారు. వీరు ఉత్తర భారతదేశంలో అనేక దేవాలయాలు, కోటలను నిర్మించి వాస్తు, కళారంగాల అభివృద్ధికి కృషి చేశారు. సంస్కృత భాషను అధికార భాషగా చేసుకుని పాలించారు. అనేకమంది కవి పండితులను పోషించి భాష, సాహిత్యాల వికాసానికి తోడ్పడ్డారు. దేశభక్తి, ధైర్య సాహసాలు కలిగిన రాజపుత్రులు అనైక్యత కారణంగా మహమ్మదీయుల చేతిలో ఓడి, రాజ్యాలను కోల్పోయారు.

ఎవరు వీరు?

  రాజపుత్రుల జన్మస్థల మూలాల గురించి పరిశోధనలు చేసిన అనేక మంది చరిత్రకారులు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశారు. రాజపుత్ర రాజులు శాసనాల్లో వారిని సూర్యవంశ, చంద్రవంశ క్షత్రియులుగా ప్రకటించుకున్నారు. కానీ పృథ్వీరాజ్‌ చౌహాన్‌ ఆస్థాన కవి చాంద్‌బార్థై తన రచన ‘పృథ్వీరాజ్‌ రాసో’లో రాజపుత్రులను అగ్నికుల క్షత్రియులుగా పేర్కొన్నాడు. కల్నల్‌ టాడ్‌ అనే చరిత్రకారుడు రాజపుత్రులపై పరిశోధన చేసి రచించిన ‘రాజస్థాన్‌ కథావళి’ (ఏనల్స్‌ ఆఫ్‌ రాజస్థాన్‌)లో వారిని విదేశీ జాతుల సంతతిగా చెప్పాడు. రాజపుత్రుల కాలంలో క్రీ.శ.712లో జరిగిన అరబ్బుల సింధు దండయాత్రను ప్రామాణికంగా తీసుకున్న చరిత్రకారులు క్రీ.శ.8వ శతాబ్దం నుంచే మధ్యయుగం ప్రారంభమైందని వ్యాఖ్యానించారు.

ప్రతీహారులు

  రాజపుత్రుల్లో తొలి వంశంగా ప్రసిద్ధి పొందిన ప్రతీహారులు నేటి ఉత్తర్‌ ప్రదేశ్‌లోని కనోజ్‌ పరిసర ప్రాంతాలను పాలించారు. ప్రతీహారులు అంటే ద్వారపాలకులు అని అర్థం. వీరి చరిత్రకు ప్రధాన ఆధారమైన రాజౌర్‌ (రాజోర్‌) శాసనం ప్రకారం ఈ వంశ మూలపురుషుడు హరిశ్చంద్రుడు. వీరు నేటి మాళ్వా, కనోజ్‌ ప్రాంతాలను పాలించేవారు. ప్రతీహారుల్లో మొదటి నాగభట్టు, మొదటి వత్సరాజు, రెండో నాగభట్టు, మొదటి భోజుడు (మిహిర భోజుడు) ప్రసిద్ధి చెందారు. గ్వాలియర్‌ శాసనం మొదటి నాగభట్టు విజయాలను వివరిస్తుంది. ఇతడి కాలంలోనే కనోజ్‌పై ఆధిపత్యం కోసం పాల, ప్రతీహార, రాష్ట్రకూట వంశాల మధ్య త్రిముఖ పోరాటం ప్రారంభమైంది.

  మొదటి వత్సరాజు కాలంలో ప్రతీహారులకు పాల వంశీయులతో ఘర్షణలు మొదలయ్యాయి. ఇతడు నాటి రాష్ట్రకూట రాజు ధ్రువుడి చేతిలో ఓడిపోయి మాళ్వాను కోల్పోయాడు. మొదటి వత్సరాజు ఆస్థానంలోని ఉద్యోధనుడు అనే కవి ‘కువలయమాల’ గ్రంథాన్ని రచించాడు. ప్రతీహారుల్లో మొదటి మిహిర భోజుడు గొప్పవాడిగా ఖ్యాతి పొందాడు. మిహిర, ఆదివరాహ లాంటి బిరుదులతో పాలించిన ఇతడు చౌహాన్‌ రాకుమారి కళావతిని వివాహం చేసుకున్నాడు. ఇతడి పాలనా కాలంలోనే సులేమాన్‌ అనే అరబ్బు యాత్రికుడు భారతదేశాన్ని సందర్శించాడు. ఈ వంశానికి చెందిన మహేంద్రపాలుడు తన ఆస్థానంలో రాజశేఖరుడు అనే కవిని పోషించాడు. కర్పూర మంజరి, కావ్య మీమాంస లాంటి ప్రముఖ గ్రంథాలను రాజశేఖరుడు రచించాడు. మహీపాలుడి కాలంలో అరబ్బు యాత్రికుడు అల్‌మసూది వీరి రాజ్యాన్ని సందర్శించాడు. గజనీ మహమ్మద్‌ చేతిలో ఓడిపోయిన రాజ్యపాలుడి అనంతరం విజయపాలుడు, త్రిలోచన పాలుడు రాజ్యాన్ని పరిపాలించారు. ఈ వంశంలో చివరి పాలకుడు యశపాలుడు.

పరమారులు

  ప్రతీహారులకు సామంతులుగా పరమారులు నేటి మాళ్వా ప్రాంతాన్ని పాలించేవారు. ధార్‌ (ధారా నగరం), ఉజ్జయిని నగరాలను రాజధానులుగా చేసుకుని రాజ్యం చేశారు. పరమార వంశ స్థాపకుడు ఉపేంద్రుడు. రాజ్యస్థాపకుడైన వాక్పతిరాజు (ముంజరాజు) నాటి కల్యాణి చాళుక్య రాజు రెండో తైలపుడిని ఓడించాడు. ముంజసాగరం అనే చెరువును తవ్వించాడు. ఇతడి ఆస్థానంలో పద్మగుప్తుడు, ధనుంజయుడు, ధనిక, హలాయుధ కవి పండితులు ఉండేవారు. ధనుంజయుడు దశరూప గ్రంథాన్ని రచించాడు. పరమారుల్లో గొప్పరాజు భోజుడు (పరమార భోజుడు). ఇతడికి కవిరాజు అనే బిరుదు ఉంది. ఈయన తన ఆస్థానంలో ధనపాల, శోభన, శాంతిసేన, ప్రభా చంద్రసూరి, విజ్ఞానేశ్వరుడు లాంటి కవులను పోషించాడు.

  పరమార భోజుడు భోజపురి నగరాన్ని, భోజశాల అనే సంస్కృత కళాశాలను నిర్మించాడు. ఇతడు ఆయుర్వేద సర్వస్వం, సమరాంగణ సూత్రధార (వాస్తు శాస్త్రం) లాంటి 12 గ్రంథాలను రచించాడు. శ్రీకృష్ణ దేవరాయలను పరమార భోజుడితో పోల్చి ఆంధ్రభోజుడిగా కీర్తించారు. ధార్‌ నగరంలోని సరస్వతీ ఆలయం భోజుడి కాలంలో నిర్మించిన గొప్ప దేవాలయం. పరమారుల్లో చివరి పాలకుడైన మహ్లాక దేవుడిని అల్లావుద్దీన్‌ ఖిల్జీ ఓడించాడు. దీంతో పరమార రాజ్యం పతనమైంది.

ఛందేలులు

  ప్రతీహారులకు సామంతులుగా ఛందేలులు నేటి మధ్యప్రదేశ్‌లోని ఖజురహోను రాజధానిగా చేసుకుని పరిపాలించారు. బుందేల్‌ఖండ్‌ ప్రాంతంపై ఆధిపత్యం పొందారు. ఛందేల వంశ మూలపురుషుడిగా జయశక్తిని పేర్కొంటారు. యశోవర్మ అనే రాజు స్వతంత్ర ఛందేల రాజ్యస్థాపన చేశాడు. ఈయన కుమారుడు ధంగ ఛందేల వంశ రాజుల్లో గొప్ప పాలకుడిగా పేరొందాడు. మధ్యప్రదేశ్‌లోని ఖజురహో దేవాలయాలను ధంగ నిర్మించాడు. మొదట యశోవర్మ ఖజురహోలో చతుర్భుజ విష్ణు ఆలయాన్ని నిర్మించాడు. తర్వాతి కాలంలో ఇక్కడ ధంగ మహారాజు విశ్వనాథ, జిననాథ, దిననాథ ఆలయాలను నిర్మించాడు. ధంగ అనంతరం రాజ్యానికి వచ్చిన విద్యాధరుడు గజనీ మహమ్మద్‌ దండయాత్రలను ఎదుర్కొన్నాడు. ఈ వంశ చివరి పాలకుడు రెండో విక్రమవర్మను ఓడించిన అల్లావుద్దీన్‌ ఖిల్జీ రాజ్యాన్ని ఆక్రమించాడు.

సోలంకీలు

  ప్రస్తుత గుజరాత్‌లోని అనిహిల్‌వాడ్‌ను రాజధానిగా చేసుకుని సోలంకీలు రాజ్యపాలన చేశారు. వీరినే ‘లాట చాళుక్యులు’ అని పిలుస్తారు. ఈ వంశ, రాజ్య స్థాపకుడు మూలరాజు. మొదటి చాళుక్య భీముడు (సోలంకీ భీముడు) గజనీ మహమ్మద్‌ దండయాత్రలను ఎదుర్కొన్నాడు. క్రీ.శ.1026లో సోలంకీ భీముడిని ఓడించి కథియవాడ్‌లోని సోమనాథ దేవాలయాన్ని గజనీ ధ్వంసం చేశాడు. ఇప్పటి రాజస్థాన్‌లోని మౌంట్‌అబూ పర్వత శిఖరంపై ఉన్న దిల్వారా జైన దేవాలయాలను సోలంకీ భీముడు నిర్మించాడు. సోలంకీ రాజు కర్ణుడు నేటి అహ్మదాబాద్‌ నగరాన్ని నిర్మించాడు. ఈ వంశ రాజుల్లో గొప్పవాడిగా పేరుపొందిన జయసింహ సిద్ధరాజు అనేక మంది కవి పండితులను పోషించాడు. ప్రముఖ జైన పండితుడు హేమచంద్రుడు ఇతడి ఆస్థానంలోనివాడే. హేమచంద్రుడి ప్రముఖ రచన పరిశిష్ఠపర్వం. జయసింహ సిద్ధరాజు సిద్ధపురంలోని రుద్ర మహకాల్‌ ఆలయాన్ని నిర్మించాడు. అనంతరం పాలనకు వచ్చిన కుమారపాలుడు, హేమచంద్రుడి ప్రభావంతో జైనమత పోషకుడిగా మారాడు. కానీ కుమారపాలుడి కుమారుడు అజయపాలుడు జైన దేవాలయాలను కూల్చి, జైన పండితులను హింసించాడు. ఘోరీ మహమ్మద్‌ దండయాత్రల కాలంలో రెండో మూలరాజు బాలుడిగా ఉండటంతో అతడి తల్లి నాయకీదేవి సైన్యాలను నడిపి మౌంట్‌అబూ యుద్ధంలో (క్రీ.శ. 1178) తురుష్కులను ఓడించింది. ఆ తర్వాత పాలనకు వచ్చిన రెండో భీముడు సోమనాథ దేవాలయానికి మరమ్మతులు చేయించాడు. ఇతడు ఘోరీ, కుతుబుద్దీన్‌ ఐబక్‌ దాడులను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇల్‌టుట్‌మిష్‌ కాలంలో సోలంకీ రాజ్యం పతనమైంది. బరోడా వద్ద ఉన్న సూర్యదేవాలయం, మౌంట్‌అబూలోని విమల దేవాలయాలను వీరి కాలంలోనే నిర్మించారు.

చౌహానులు

  నేటి తూర్పు రాజస్థాన్‌లోని అజ్మీర్‌ను రాజధానిగా చేసుకుని పాలించిన ప్రముఖ రాజపుత్ర వంశం చౌహానులు. వీరినే చహమానులు అని వ్యవహరిస్తారు. మొదట ప్రతీహారులకు సామంతులుగా ఉండేవారు. చౌహాన్‌ వంశ స్థాపకుడు సింహరాజు ‘మహారాజాధిరాజు’ బిరుదుతో పాలన చేశాడు. అజ్మీర్‌ ప్రాంతంలోని శాకంభరి (నేటి సాంభర్‌ సరస్సు ప్రాంతం) ని రాజధానిగా చేసుకుని పాలించాడు. 12వ శతాబ్దంలో రెండో అజయరాజు తన రాజధానిని శాకంభరి నుంచి అజ్మీర్‌కు (అజయమేర్‌) మార్చాడు. చౌహానులు రాజ్య విస్తరణలో భాగంగా నాటి గుజరాత్‌ సోలంకీలు/చాళక్యులతో, మాళ్వా - పరమారులతో, తురుష్క పాలకులైన గజనీ, ఘోరీలతో పోరాడారు. మహారాజు బిరుదుతో పాలించిన వాక్పతిరాజు పుష్కర్‌ వద్ద శివాలయాన్ని కట్టించాడు. చౌహానుల్లో ఒకరైన నాలుగో విగ్రహరాజు విశాలదేవుడు ‘హరకేళి’ అనే ప్రసిద్ధ రచన చేశాడు. ఈ గ్రంథంలోని (నాటకం) కొన్ని అంశాలను అర్హిదిన్‌కా జోంప్రా మసీదు గోడలపై చిత్రించారు. విశాలదేవుడి ఆస్థానంలోని సోమదేవుడు అనే కవి లలిత విగ్రహరాజు అనే నాటకాన్ని రచించాడు. విగ్రహరాజు ‘కవి బాంధవ’ అనే బిరుదును పొందాడు. ఇతడు అజ్మీర్‌లో సంస్కృత విద్యాలయాన్ని స్థాపించాడు. విశాల్‌పూర్‌ పట్టణాన్ని నిర్మించాడు. చౌహానుల్లో గొప్పరాజు మూడో పృథ్వీరాజ్‌. క్రీ.శ.1179-1192. ఈయనను ముస్లిం రచనల్లో రాయపితౌరా అని ప్రస్తావించారు.

ఘోరీ మహమ్మద్‌తో ఇతడు రెండు తరైన్‌ యుద్ధాలు చేశాడు. 1191 నాటి మొదటి తరైన్‌ యుద్ధంలో ఘోరీని ఓడించాడు. కానీ 1192 నాటి రెండో తరైన్‌ యుద్ధంలో ఘోరీ చేతిలో మరణించాడు. పృథ్వీరాజ్‌ ఆస్థాన కవి చాంద్‌బార్ధై ‘పృథ్వీరాజ్‌ రాసో’ అనే ప్రముఖ గ్రంథాన్ని హిందీలో రాశాడు.

గహద్వాలులు

  కనోజ్‌ను రాజధానిగా చేసుకుని ప్రతీహారులకు సామంతులుగా పాలించినవారు గహద్వాలులు. వీరి రాజ్య స్థాపకుడు చంద్రదేవుడు. ఈ వంశంలో గొప్పవాడు జయచంద్రుడు. గోవింద చంద్రుడి కాలంలో 14 మంది రాజులను ఓడించి రాజ్యాన్ని విస్తరించారు. ఈయన ఆస్థాన కవి లక్ష్మీధరుడు కృత్యకల్పతరు/కల్పద్రుమ అనే న్యాయశాస్త్ర గ్రంథాన్ని రచించాడు. గోవింద చంద్రుడి భార్య కుమార దేవి బౌద్ధమతాన్ని అవలంబించి సారనాథ్‌లో ఒక విహారాన్ని నిర్మించింది. జయచంద్రుడి కాలంలో అతడి కుమార్తె రాణి సంయుక్తను మూడో పృథ్వీరాజ్‌ చౌహాన్‌ తీసుకుపోవడంతో ఘోరీ మహమ్మద్‌ను ఇతడు భారతదేశ దండయాత్రకు ఆహ్వానించాడు. జయచంద్రుడి ఆస్థాన కవి శ్రీహర్షుడు ‘నౌషధ చరిత్ర’ అనే గొప్ప గ్రంథాన్ని రాశాడు. గహద్వాలుల్లో చివరి రాజు హరిశ్చంద్రుడు.

సేన రాజులు: బెంగాల్‌ ప్రాంతాన్ని పాలించిన సేన వంశ స్థాపకుడు సామంత సేనుడు. ధనసాగర, అద్భుతసాగర లాంటి గ్రంథాలను ఈ వంశానికి చెందిన భల్లాలసేనుడు రాశాడు. లక్ష్మణసేనుడి ఆస్థాన కవి జయదేవుడు గీతగోవిందం అనే ప్రసిద్ధ రచన చేశాడు.


తూర్పుగాంగులు: ప్రస్తుత ఒడిశా ప్రాంతాన్ని ఈ రాజులు పాలించారు. ఈ వంశాన్ని అనంతవర్మన్‌ బోడగాంగుడు స్థాపించాడు. భువనేశ్వర్‌ లింగరాజు ఆలయం, పూరి జగన్నాథ ఆలయాలను వీరి కాలంలోనే నిర్మించారు.


కశ్మీర్‌ పాలకులు: కశ్మీర్‌ను కర్కోట, ఉత్పల, లోహార వంశీయులు పరిపాలించారు. కర్కోట వంశరాజు అనంతవర్మన్‌ తన ఆస్థానంలో రత్నాకరుడు, ఆనంద వర్ధనుడు అనే కవులను పోషించాడు. ఉత్పల వంశ రాజు క్షేమగుప్తుడి భార్య దిడ్డ 50 ఏళ్లు కశ్మీర్‌ను పాలించింది. లోహర వంశ రాజు శ్రీహర్షుడి ఆస్థానంలో ‘కల్హణుడు’ రాజతరంగిణి గ్రంథాన్ని రాశాడు.

Posted Date : 24-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌