• facebook
  • whatsapp
  • telegram

కొండచరియలు విరిగిపడటం

        భారతదేశంలో సహజంగా సంభవించే ప్రకృతి వైపరీత్యాల్లో కొండచరియలు విరిగిపడటం (Land slide) ఒకటి. కొండప్రాంతం నుంచి రాళ్లు, మట్టిపెళ్లలు లాంటివి కిందకు పడటాన్ని ఈ రకమైన వైపరీత్యంగా పేర్కొంటారు. మనదేశంలో హిమాలయ ప్రాంతం, పశ్చిమ కనుమలు (westren ghats), నీలగిరి కొండల ప్రాంతాల్లో ఇది ఎక్కువగా సంభవిస్తోంది. సిక్కిం, ఘర్వాల్ (Garwal) ప్రాంతాల్లో సరాసరి ఒక చదరపు కిలోమీటర్‌కు 2 సార్లు కొండచరియలు విరిగిపడుతుంటాయి.
భారతదేశంలో ఈ వైపరీత్యం సంభవించే అవకాశం 22 రాష్ట్రాల్లో ఉంది. మనదేశంలోని 15 శాతం భూమిని కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్న ప్రాంతంగా గుర్తించారు. కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం, ఘర్వాల్, కౌమాన్ (Kumaon) ప్రాంతాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. ఇది ఎక్కువగా వర్షాకాలంలో సంభవిస్తుంది.


నష్టాలు 


  కొండచరియలు విరిగిపడటం వల్ల పర్యావరణానికి, ప్రజలకు తాత్కాలిక, దీర్ఘకాలిక నష్టాలుంటాయి.
ప్రాణ, ఆస్తి నష్టాలు; రోడ్లు దెబ్బతినడం లాంటివి తాత్కాలిక నష్టాలుగా పేర్కొనవచ్చు. ఈ వైపరీత్యం సంభవించిన ప్రాంత బాహ్య స్వరూపం మారిపోవడం; పంటపొలాలు, వ్యవసాయ భూమి నాశనం కావడం, నేల క్రమక్షయానికి గురవడం, ప్రజలకు పునరావాస సమస్యలు తలెత్తడం లాంటివి దీర్ఘకాలిక నష్టాలుగా పేర్కొనవచ్చు. హిమాలయ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటం వల్ల రహదారులు, ఆనకట్టలు, టన్నెల్స్, కమ్యూనికేషన్ టవర్స్ లాంటివి తరచుగా దెబ్బతింటున్నాయి. దీని వల్ల మనదేశంలో ఏటా వందలాది మంది ప్రాణాలు కోల్పోవడమే కాకుండా, సుమారు రూ. 100 కోట్ల నుంచి రూ. 150 కోట్ల నష్టం వాటిల్లుతోందని అంచనా. కొన్నిసార్లు కొండచరియలు విరిగిపడటం వల్ల నదీప్రవాహానికి అడ్డంకులు ఏర్పడతాయి. 1970లో పాతాళగంగానదిని కొండచరియలు విరిగి అడ్డగించడం వల్ల అలకనందా ప్రమాదం జరిగింది. 2005లో ఇదేవిధంగా పరెచ్చు (Parechhu) నదికి అడ్డంకి ఏర్పడటం వల్ల హిమాచల్‌ప్రదేశ్‌లో వరదలు వచ్చాయి. 
         ఇతర రాష్ట్రాలతో పోలిస్తే, ఆంధ్రప్రదేశ్‌లో దీనికి సంబంధించిన నష్టాలు తక్కువగానే ఉన్నాయి. ఆగస్టు 2006లో అరకులోయలో కొండచరియలు విరిగిపడి 18 మంది మరణించారు. విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో కొండప్రాంతాల్లో నివసించే వారి సంఖ్య పెరుగుతూ ఉండటం వల్ల భవిష్యత్తులో ప్రమాదం జరిగే అవకాశాలున్నాయి.


కారణాలు 


  భారతదేశంలో కొండచరియలు విరిగిపడటానికి కారణాలు 2 అవి:
1) సహజ కారణాలు,
2) మానవ కారణాలు.
కొండ ప్రాంతాల్లో అధికంగా వర్షాలు పడటం, కొండవాలుగా ఉండటం, కొండచరియలు వదులుగా అమరి ఉండటం, భూకంపాలు రావడం లాంటివి సహజ కారణాలు. అడవుల నిర్మూలన వల్ల నేల క్రమక్షయానికి గురవడం, సరైన ఇంజినీరింగ్ ప్రమాణాలు లోపించిన కట్టడాలు, కొండ కింది ప్రాంతాల్లో జనావాసాల ఏర్పాటు, గనులు, క్వారీల తవ్వకం; నేలను ఉపయోగించే విధానాలు లాంటివి మానవ కారణాలుగా చెప్పవచ్చు.


వైపరీత్యాన్ని గుర్తించే విధానం 


  నేల, కొండ ప్రాంతాల్లో సంభవించే మార్పుల ఆధారంగా ఈ వైపరీత్యాలను కొద్ది గంటలు లేదా నిమిషాల ముందుగానే గుర్తించవచ్చు. కొండచరియలు విరిగిపడటానికి ముందుగా ఇంట్లోని తలుపులు, కిటికీలు వాటంతట అవే బిగుసుకుపోవడం, గోడలు, ఇతర నిర్మాణాల్లో పగుళ్లు రావడం, ఇంటిగోడలు కదలడం, నేలలో పగుళ్లు ఏర్పడటం, ఫెన్సింగ్, ప్రహారి గోడలు, స్తంభాలు, వృక్షాలు పక్కకు జరగడం, కొండ ప్రాంతాల నుంచి మట్టి, రాళ్లు కొద్దికొద్దిగా రాలుతూ ఉండటం లాంటి మార్పులను గమనించవచ్చు.


నివారణా చర్యలు 


*   ఏటవాలు, కొండ ప్రాంతాలు, సాధారణ ప్రదేశాల్లో చెట్లు నాటడం.
*   ఈ వైపరీత్యం సంభవించే ప్రాంతాలను సమగ్రంగా పరిశీలించిన తర్వాతే నిర్మాణాలు చేపట్టడం
*    రోడ్లు, కాల్వల లాంటివి నిర్మించేటప్పుడు నీటి సహజ ప్రవాహ మార్గానికి అడ్డంకులు ఏర్పడకుండా చూడటం.
*   ప్రమాద తీవ్రత అధికంగా ఉండే ప్రాంతాల్లో నివాసాలు ఏర్పరచుకోకుండా చూడటం.
*    ప్రమాద తీవ్రతను తగ్గించడానికి కొండ ప్రాంతాల్లో గోడలను నిర్మించడం.
*    కట్టడాల్లో సరైన ఇంజినీరింగ్ ప్రమాణాలను పాటించడం.
*   తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి మ్యాపులను తయారు చేయడం.
*   పటిష్టమైన హెచ్చరిక వ్యవస్థలను అభివృద్ధి చేయడం.


భారతదేశం చేపడుతోన్న చర్యలు 


  కొండచరియలు విరిగిపడే విపత్తును ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం, వివిధ సంస్థలు అనేక నిర్వహణా చర్యలను చేపడుతున్నాయి. భారతదేశంలో 'జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జి.ఎస్.ఐ.) దీనిపై మొదటిసారిగా పరిశోధన నిర్వహించింది. ఈ విపత్తు నిర్వహణకు నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ఎన్‌డీఎమ్ఏ) మార్గదర్శకాలను రూపొందిస్తోంది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీఆర్‌వో(బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్)తో కలసి మంచు విరిగిపడే ప్రమాద నియంత్రణా చర్యలను చేపడుతున్నాయి. వివిధ సంస్థలు కొండచరియలు విరిగిపడే ప్రాంతాల పటాలను రూపొందిస్తున్నాయి. ఈ వైపరీత్యాన్ని ఎదుర్కోవడానికి ప్రత్యేకమైన శిక్షణ, పరికరాలున్న నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డీఆర్ఎఫ్)ను ఏర్పాటు చేశారు. ఈ సంస్థ వైపరీత్యం సంభవించిన తర్వాత ప్రజలను గుర్తించి, రక్షణ చర్యల్లో పాల్గొంటుంది.
రాష్ట్ర ప్రభుత్వాలు స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ఎస్‌డీఎమ్ఏ)తో కలసి అవగాహనా కార్యక్రమాలను చేపట్టడం, పుస్తకాలు ప్రచురణ, కరపత్రాల పంపిణీ, స్థానిక భాషలో వీడియో చిత్రాలను చూపించడం, పారిశ్రామిక ప్రాంతాలు, కార్యాలయాల్లో మాక్‌డ్రిల్స్ నిర్వహించడం లాంటి కార్యక్రమాలు చేస్తోంది. 'నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఈ విపత్తును ఎదుర్కొనే చర్యలను చేపడుతోంది. అంతేకాకుండా ప్రజలను చైతన్యవంతం చేస్తూ, రాష్ట్రాలకు తగిన సహాయాన్ని అందిస్తోంది.


పరిశోధన, నిర్వహణ చేపడుతున్న సంస్థలు


*   జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ)
*   సెంట్రల్ రోడ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీఆర్ఆర్ఐ)
*   సెంట్రల్ బిల్డింగ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీబీఆర్ఐ)
*   ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ - రూర్కి (ఐఐటీ - ఆర్)
*   వాడియో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీ (డబ్ల్యూఐహెచ్‌జీ)
*   డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్ (డీవోఎస్)
*   నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్‌సీ)
*   డిఫెన్స్ టెర్రేయిన్ రిసెర్చ్ ల్యాబొరేటరీ (డీటీఆర్ఎల్)
*   బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఎస్ఐ)
*   భారత రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన స్నో అండ్ అవలాంచ్ స్టడీ ఎస్టాబ్లిష్‌మెంట్ (ఎస్ఏఎస్ఈ) సంస్థ మంచుచరియలు విరిగిపడటంపై పరిశోధన చేస్తోంది.
*   బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ (బీఆర్‌వో) భారతదేశంలోని కొండ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం, నిర్వహణలను చేపడుతోంది.
*   డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ వైపరీత్యం గురించి పరిశోధన, అభివృద్ధి కోసం నిధులను కేటాయిస్తోంది.
*   సెంట్రల్ సైంటిఫిక్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఆర్గనైజేషన్ (సీఎస్ఐవో) కొండచరియలు విరిగి పడటాన్ని గుర్తించడానికి 2006లో హరిద్వార్‌లోని మానసదేవి ప్రాంతంలో ఇన్‌స్ట్రుమెంటేషన్ నెట్‌వర్క్‌ను నెలకొల్పింది.
*   బిల్డింగ్ మెటీరియల్స్ అండ్ టెక్నాలజీ ప్రమోషన్ కౌన్సిల్ (ఎంబీటీపీసీ), అన్నా యూనివర్సిటీ సంయుక్తంగా 2004లో కొండచరియలు విరిగిపడే వైపరీత్యానికి సంబంధించిన అట్లాస్‌ను ప్రచురించాయి.
*   నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఆర్ఎన్ఎస్‌సీ) కొండచరియలు విరిగిపడే వైపరీత్యం ఉన్న ప్రాంతాల పటాలను (Land slide Hazard Zonation Maps) తయారు చేస్తోంది.

Posted Date : 08-07-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌