• facebook
  • whatsapp
  • telegram

ఢిల్లీ సుల్తానులు - ఖిల్జీ వంశం (క్రీ.శ. 1290 - 1320)

అల్లాఉద్దీన్‌ ఖిల్జీ 

ఇతడు క్రీ.శ. 1296-1316 మధ్య రాజ్య పాలన చేశాడు. ఢిల్లీ సుల్తానుల్లోనే కాక, మధ్యయుగ భారతదేశ చరిత్రలోనే ఇతడ్ని గొప్ప రాజుగా పేర్కొంటారు. 

అల్లాఉద్దీన్‌ గొప్ప యోధుడు, సమర్థ పాలకుడు, తెలివైనవాడిగా పేరొందాడు. ఇతడు ఢిల్లీ చరిత్రలో నూతన అధ్యాయాన్ని ప్రారంభించాడు. 

ఢిల్లీ సార్వభౌమాధికారాన్ని ఉత్తరం నుంచి దక్షిణ భారతదేశానికి విస్తరింపజేశాడు. ఇతడికి అలెగ్జాండర్‌లా ప్రపంచ విజేత కావాలనే కోరిక ఉండేది. 

ఇతడికి ఖాజీ ఉల్‌ముల్క్‌ సేవకుడిగా ఉండేవాడు. దేశీయ, విదేశాంగ విధానాలు ఇతడి పర్యవేక్షణలో రూపొందేవి. 

అల్లాఉద్దీన్‌ ఒక నూతన మతాన్ని స్థాపించి, ఖ్యాతి పొందాలని భావించాడు. ప్రపంచవ్యాప్తంగా తన పేరు శాశ్వతంగా ఉండేందుకు ఏదైనా చేయాలని కాంక్షించాడు. ఖాజీ ఉల్‌ముల్క్‌ అతడికి భారతదేశాన్ని జయించమని సలహా ఇచ్చాడు. 

ఉల్గుఖాన్, నస్రత్‌ఖాన్, అల్తాఫ్‌ఖాన్, జాఫర్‌ఖాన్, మాలిక్‌-ఉల్‌-ముల్క్, మాలిక్‌ ఫకృద్దీన్, మాలిక్‌ అల్‌గారి లాంటి సమర్థులైన సైన్యాధికారులు ఇతడి వద్ద ఉండేవారు. వారి సహాయంతో అల్లాఉద్దీన్‌ అనేక విజయాలు సాధించాడు.

అల్లాఉద్దీన్‌ మతాన్ని రాజకీయాల నుంచి వేరు చేయాలనుకున్నాడు. ప్రజలపై పన్నుల భారాన్ని పెంచాడు. 

రాజు దైవాంశసంభూతుడని; సుల్తాన్‌ న్యాయమూర్తి, భగవంతుడి ప్రతినిధి అని పేర్కొన్నాడు.

*  ఇతడు ఇస్లాం రక్షకుడిగా పేరొందాడు. ఇతడికి యామిన్‌ ఉల్‌ ఖిలాఫత్‌ నాసిర్, అమీర్‌ ఉల్‌ మూమ్నాని, సికిందర్‌-ఇ-సని (రెండో అలెగ్జాండర్‌) అనే బిరుదులు ఉన్నాయి.

అల్లాఉద్దీన్‌ రాజయ్యాక జలాలుద్దీన్‌ ఫిరోజ్‌షా భార్య మాలిక్‌ జహన్‌ని ఖైదు చేసి, అతడి కొడుకులు ఇబ్రహీం, అర్కలీని గుడ్డివాళ్లను చేశాడు.

‘‘ఇతడు తన వ్యతిరేకులను కఠినంగా శిక్షించేవాడు. సర్దారులు, అమీర్‌లను పదవుల నుంచి తొలగించాడు’’ అని జియాఉద్దీన్‌ బరౌనీ అనే చరిత్రకారుడు పేర్కొన్నాడు.


ఉత్తర భారతదేశ దండయాత్రలు

గుజరాత్‌పై దండయాత్ర: క్రీ.శ. 1297లో అల్లాఉద్దీన్‌ తన సైనికాధికారులైన ఉల్గుఖాన్, నస్రత్‌ఖాన్‌లను గుజరాత్‌పైకి దండయాత్రకి పంపాడు. 

గుజరాత్‌ పాలకుడైన వాఘీల కర్ణదేవుడు ఆ యుద్ధంలో ఓడిపోయాడు. ఖిల్జీ సేనలు కర్ణదేవుడి భార్య కమలాదేవితో పాటు అపార సంపదను అల్లాఉద్దీన్‌కి అప్పగించాయి. 

అల్లాఉద్దీన్‌ కమలాదేవిని వివాహం చేసుకున్నాడు. కర్ణదేవుడు, అతడి కుమార్తె దేవలదేవి గుజరాత్‌ నుంచి పారిపోయి దేవగిరిలో ఆశ్రయం పొందారు. 

గుజరాత్‌ ఆక్రమణ తర్వాత ఖిల్జీ సైన్యం సోమనాథ్‌ ఆలయాన్ని దోచుకుంది. 

నస్రత్‌ఖాన్‌ ఈ దండయాత్ర తర్వాత కాంబే మార్కెట్‌లో మాలిక్‌ కపూర్‌ అనే బానిసను కొని, అతడిని అల్లాఉద్దీన్‌కి బహుమతిగా ఇచ్చాడు. మాలిక్‌ కపూర్‌ అనేక యుద్ధాల్లో పాల్గొని అల్లాఉద్దీన్‌ విజయానికి కృషి చేశాడు.

రణతంబోర్‌పై దండయాత్ర: రణతంబోర్‌ పాలకుడు హంవీరదేవుడు. ఇతడు రాజపుత్రుడు. 

క్రీ.శ. 1298లో ఉల్గుఖాన్, నస్రత్‌ఖాన్‌ రణతంబోర్‌పై దండయాత్ర చేశారు.

వీరిని హంవీరదేవుడు తీవ్రంగా ప్రతిఘటించాడు. ఏడాదిపాటు అల్లాఉద్దీన్‌ సేనలు రణతంబోర్‌ కోటను ఛేదించలేకపోయాయి. 

హంవీరదేవుడి సేనాని రణమల్లుడ్ని నస్రత్‌ఖాన్‌ ధనంతో తనవైపు తిప్పుకుని కోట రహస్యాలు తెలుసుకున్నాడు. 

తర్వాత జరిగిన యుద్ధంలో ఖిల్జీ సేనలు విజయం సాధించాయి. ఇందులో నస్రత్‌ఖాన్, హంవీరదేవుడు మరణించారు. 

 ఈ యుద్ధానంతరం రణతంబోర్‌ రాజపుత్ర స్త్రీలు ఖిల్జ్జీ సైన్యాలకు చిక్కకుండా జౌహార్‌కు (అగ్నిలో దూకి ప్రాణాలు పోగొట్టుకోవడం) పాల్పడ్డారు.

చిత్తోడ్‌పై దండయాత్ర: క్రీ.శ. 1303లో అల్లాఉద్దీన్‌ సైన్యం చిత్తోడ్‌పై దాడులు చేసింది. ఆ సమయంలో రాజపుత్ర రాజ్యల్లో చిత్తోడ్‌ బలంగా ఉండేది.

చిత్తోడ్‌ రాజపుత్ర రాజైన రాణారతన్‌సింగ్‌ అధీనంలో ఉండేది. ఇతడు శత్రువుల బారి నుంచి తన కోటను ఏడు నెలలపాటు కాపాడాడు. క్రీ.శ.1303, ఆగస్టులో ఖిల్జీ సైన్యం చిత్తోడ్‌ను ఆక్రమించింది. ఈ యుద్ధంలో రాణారతన్‌సింగ్‌ మరణించాడు. అతడి భార్య రాణి పద్మినితో పాటు అంతఃపుర స్త్రీలు జౌహార్‌ నిర్వహించి, ప్రాణత్యాగం చేశారు.

అల్లాఉద్దీన్‌ చిత్తోడ్‌ను ఆక్రమించాక దాని పేరును ఖిజీరాబాద్‌గా మార్చాడు. దీనికి తన కుమారుడు ఖజీర్‌ఖాన్‌ను గవర్నర్‌గా నియమించాడు. 

రాణి పద్మిని గురించి మాలిక్‌ మహమ్మద్‌ జైసీ తన గ్రంథం పద్మావత్‌లో రాశాడు. ఆమె ఎంతో అందమైన స్త్రీ అని అందులో పేర్కొన్నాడు. ఇది చదివిన ఖిల్జీ ఆమె కోసమే చిత్తోడ్‌పై దండయాత్ర నిర్వహించాడని మాలిక్‌ మహమ్మద్‌ విశ్వసించాడు. అయితే ఇది కల్పితమని అనేకమంది చరిత్రకారులు అభిప్రాయపడ్డారు.


ఇతర దండయాత్రలు: అల్లాఉద్దీన్‌ సైన్యాలు క్రీ.శ.1305లో మాల్వా రాజైన మహాలక్ష్మీదేవుడ్ని (మహలకదేవుడు) ఓడించి, ఉజ్జయిని, ధార్‌ చందేరి ప్రాంతాలను ఆక్రమించాయి. అల్లాఉద్దీన్‌ వీటికి గవర్నర్‌గా ఐన్‌ఉల్‌-ముల్క్‌ను నియమించాడు 

క్రీ.శ. 1308లో పారమార రాజపుత్ర రాజ్యమైన సివాణుపై ఖిల్జీ సేనలు దండెత్తాయి. దాని పాలకుడైన శివదేవుడ్ని ఓడించి, రాజ్యాన్ని ఆక్రమించుకున్నాయి.


సైనిక విజయాలు

 సామ్రాజ్య విస్తరణ కోసం అల్లాఉద్దీన్‌ అనేక యుద్ధాలు చేశాడు. చరిత్రకారులు ఇతడి దండయాత్రలను రెండు భాగాలుగా విభజించారు. అవి: 1. ఉత్తర భారతదేశ దండయాత్రలు 2. దక్షిణ భారతదేశ దండయాత్రలు

జలాలుద్దీన్‌ ఫిరోజ్‌షా ఖిల్జీ 

ఇతడు క్రీ.శ. 1290-96 మధ్య రాజ్యపాలన చేశాడు. వీరి వంశం ఆఫ్గనిస్థాన్‌లోని హోలోమండ్‌ దగ్గర ఉన్న ఖిల్జీ ప్రాంతం అని ఫకృద్దీన్‌ తన రచనల్లో పేర్కొన్నాడు. అందుకే వీరి వంశానికి ఖిల్జీ అనే పేరు వచ్చింది.

 ఫిరోజ్‌షా ఢిల్లీ సుల్తాన్‌ అయ్యే సమయానికి అతడి వయసు 70 ఏళ్లు. అతడు తన పట్టాభిషేకాన్ని కిలోకారి కోటలో జరుపుకున్నాడు.

ఫిరోజ్‌షా ఉదారవాది. ఇతడు రాజ్య విస్తరణపై దృష్టి పెట్టకుండా రాజ్యంలో శాంతిభద్రతలు కాపాడాలనుకున్నాడు. దీని కోసం సమర్థులైన వారిని అధికారులుగా నియమించాడు. వారిలో ప్రముఖులు మాలిక్‌ ఫకృద్దీన్, సిరాజుద్దీన్‌. ఖ్వాజాఖతీర్‌ ఇతడి వద్ద వజీర్‌ (మంత్రి)గా పనిచేశాడు. 

కారా రాష్ట్ర గవర్నర్‌ క్రీ.శ.1290లో ఇతడిపై తిరుగుబాటు చేశాడు. ఫిరోజ్‌షా అతడ్ని అణచివేసి కారాకు తన అల్లుడైన అల్లాఉద్దీన్‌ ఖిల్జీని గవర్నర్‌గా నియమించాడు.

క్రీ.శ. 1292లో ఢిల్లీపై మంగోలులు దాడిచేయగా ఫిరోజ్‌షా వారిని ఓడించాడు. ఆ యుద్ధంలో బందీలుగా చిక్కినవారితో ఇస్లాంను స్వీకరింపజేశాడు. వీరినే నయా ముస్లింలుగా పిలుస్తారు. వీరి నాయకుడు ఉల్లుగ్‌. ఇతడికి తన కుమార్తెనిచ్చి వివాహం జరిపించాడు. 

థగ్గులు అనే దారిదోపిడీ దొంగలను అణచివేశాడు.

ఇతడి పాలనలో ఢిల్లీ సేనలు చారిత్రక విజయాలను సాధించాయని చరిత్రకారుల అభిప్రాయం. వాటిలో బిల్సా, దేవగిరి దాడులు ముఖ్యమైనవి. ఇవి అల్లాఉద్దీన్‌ ఖిల్జీ నేతృత్వంలో జరిగాయి.అల్లాఉద్దీన్‌ ఖిల్జీ క్రీ.శ. 1296లో ఫిరోజ్‌షాను హత్య చేసి, తనను తాను ఢిల్లీకి సుల్తాన్‌గా ప్రకటించుకున్నాడు. 

ఎస్‌.ఆర్‌.శర్మ అనే చరిత్రకారుడు జలాలుద్దీన్‌ ఫిరోజ్‌షాను ‘దయాగుణాల రాజు’గా పేర్కొన్నాడు.


దక్షిణ భారతదేశ  దండయాత్రలు 

ఉత్తర భారతదేశంపై పట్టు సాధించాక ఖిల్జీ దక్షిణ భారతదేశంపై తన దృష్టి కేంద్రీకరించాడు. మొత్తం భారతదేశాన్ని తన అధీనంలోకి తెచ్చుకోవాలని భావించాడు. ఆ సమయంలో దక్షిణ భారతదేశాన్ని యాదవ, హొయసల, కాకతీయ, పాండ్య రాజ వంశాలు పాలిస్తున్నాయి. మాలిక్‌ కపూర్‌ నేతృత్వంలో ఈ రాజ్యాలపై దండయాత్రలు జరిగాయి. సుమారు 4,75,000 సైన్యంతో ఖిల్జీ దక్షిణ భారతదేశంపై దండెత్తాడు.

దేవగిరిపై దండయాత్ర: అల్లాఉద్దీన్‌ సేనలు మాలిక్‌ కపూర్‌ నాయకత్వంలో క్రీ.శ. 1306లో మొదట దేవగిరిపై దండెత్తాయి. 

 దేవగిరి పాలకుడైన రామచంద్ర దేవుడు ఈ యుద్ధంలో ఓడిపోయాడు. అతడు అల్లాఉద్దీన్‌ ఖిల్జీ సార్వభౌమాధికారాన్ని అంగీకరించి సామంతుడిగా మారి, కప్పం కట్టాడు. రామచంద్రదేవుడి కుమారుడు శంకరదేవుడు కప్పం చెల్లించడానికి నిరాకరించాడు. దీంతో మాలిక్‌ కపూర్‌ దేవగిరిపై రెండోసారి దండెత్తి, శంకరదేవుడ్ని వధించాడు. దీంతో దేవగిరి రాజ్యం ఖిల్జీ రాజ్యంలో కలిసిపోయింది. 

గుజరాత్‌ రాజైన వాఘీల కర్ణదేవుడికి రామచంద్రుడు ఆశ్రయమివ్వడం కూడా ఈ యుద్ధానికి ప్రధాన కారణం. కర్ణదేవుడి కుమార్తె దేవలదేవిని అల్లాఉద్దీన్‌ కుమారుడు ఖిజిర్‌ఖాన్‌ వివాహం చేసుకున్నాడు.

కాకతీయ రాజ్యంపై దండయాత్ర: క్రీ.శ. 1310లో కాకతీయ రాజ్యాన్ని రెండో ప్రతాపరుద్రుడు పాలిస్తున్న సమయంలో మాలిక్‌ కపూర్‌ అతడిపై దండెత్తాడు.

ప్రతాపరుద్రుడు పోరాడినప్పటికీ ఓటమి తప్పలేదు. దీంతో అతడు సామంతుడిగా ఉండటానికి అంగీకరించి కప్పం కట్టడానికి సిద్ధపడ్డాడు. మాలిక్‌ కపూర్‌ ఇతనికి సామంతరాజు హోదా ఇచ్చాడు. ఇతడు 300 ఏనుగులు, 700 గుర్రాలు ఖిల్జీకి ఇచ్చాడు. అల్లాఉద్దీన్‌ పాలన ముగిసేవరకు ప్రతాపరుద్రుడు విశ్వాసపాత్రుడిగా పనిచేశాడు. 

ద్వారసముద్రంపై దండయాత్ర: ద్వారసముద్రాన్ని హొయసల రాజ్యం అని కూడా అంటారు. దీన్ని మూడో భల్లాలుడు పాలిస్తున్న సమయంలో మాలిక్‌ కపూర్‌ హొయసల రాజధాని దేవగిరిపై దండెత్తాడు. 

భల్లాలుడు ఈ యుద్ధంలో ఓడిపోయి, మాలిక్‌ కపూర్‌తో సంధి చేసుకున్నాడు. సుల్తాన్‌కు సామంతరాజుగా ఉండటానికి అంగీకరించాడు. 

మధురపై దండయాత్ర: హొయసల రాజ్యాన్ని జయించిన మాలిక్‌ కపూర్‌ క్రీ.శ.1311లో మధురపై దండెత్తాడు. ఆ సమయంలో మధురను పాండ్యులు పాలిస్తున్నారు. అప్పటికే వారి మధ్య వారసత్వ తగాదాలు ఉన్నాయి.

సింహాసనం కోసం ఆశపడుతున్న సుందరపాండ్యుడు, వీరపాండ్యుడు మాలిక్‌ కపూర్‌ను మధురపై దండయాత్రకు ఆహ్వానించారు. 

ఖిల్జీతో జరిగిన ఒప్పందం మేరకు సుందరపాండ్యుడు మధుర పాలకుడయ్యాడు. ఇతడు సుల్తాన్‌కు సామంతుడిగా కప్పం చెల్లించే షరతుకు అంగీకరించాడు. తర్వాత మాలిక్‌ కపూర్‌ శ్రీరంగంలోని శ్రీ రంగనాథస్వామి ఆలయాన్ని, రామేశ్వరం ఆలయాలను దోచుకుని అపార ధనరాశులతో ఢిల్లీ చేరుకున్నాడు. 

మాలిక్‌ కపూర్‌ రామేశ్వరంలో ఒక మసీదును నిర్మించాడు. ఇతడు 2750 పౌండ్ల బంగారం, 312 ఏనుగులు, 20 వేల గుర్రాలతో ఢిల్లీకి చేరుకున్నాడు.

Posted Date : 28-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌