• facebook
  • whatsapp
  • telegram

1991లో భారతదేశ ఆర్థిక వ్యవస్థ

భారత్‌ నేడు ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి రేటు ఉన్న దేశంగా గుర్తింపు పొందింది. దీనికి కారణం మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తన పాలనాకాలంలో ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలే. 1991 జులైలో పీవీ అప్పటి ఆర్థికమంత్రి మన్మోహన్‌ సింగ్‌తో కలిసి దేశ ఆర్థికాభివృద్ధికి వ్యూహాలు రచించారు. వీటినే రావు - మన్మోహన్‌ అభివృద్ధి నమూనాగా పిలుస్తారు. భారతదేశం తన అభివృద్ధి ప్రస్థానంలో అనేక ఎత్తుపల్లాలు, సామాజిక, రాజకీయ, ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కొంది. 
      1991లో భారత్‌లో తీవ్ర ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. ఈ సమయంలోనే ఆర్థిక సంస్కరణల ప్రాధాన్యాన్ని గుర్తించి, వాటిని ప్రవేశపెట్టారు. దీంతో దేశ ఆర్థిక వ్యవస్థలో పెను మార్పులు చోటుచేసుకున్నాయి. మన ఆర్థిక వ్యవస్థను విపత్కర పరిస్థ్థితుల నుంచి బయటపడేయడానికి ఈ సంస్కరణలను అత్యవసర శస్త్రచికిత్సలాగా ఉపయోగించారా? లేక అంతర్జాతీయ ద్రవ్యనిధి లాంటి సంస్థల ఒత్తిడి, ఆదేశాల ఫలితమా? లాంటి ప్రశ్నలకు సమాధానాలు లభించాలంటే 1991 ముందు భారత్‌తోపాటు ప్రపంచ స్థితిగతులు, పరిణామాలను పరిశీలించాలి.


1991 నాటి ఆర్థిక సంక్షోభం 
స్వాతంత్య్రానంతరం మన దేశం అనేక ఆర్థిక సమస్యలను ఎదుర్కొన్నా వాటిని ఆర్థిక సంక్షోభంగా ఎప్పుడూ పరిగణించలేదు. 199091లో మాత్రం పరిస్థితులు చేయిదాటి దేశ ఆర్థిక నిర్వహణ సంక్షోభంలో పడింది. ఇది ప్రపంచ వేదికలపై చర్చలకు దారితీసింది. మన ఆర్థిక భద్రత ప్రశ్నార్థకమైంది.


నిర్వచనం: దేశ అవసరాలు, దిగుమతులకు లేదా పాత అప్పులు చెల్లించేందుకు ప్రభుత్వం వద్ద తగినన్ని సొంత నిధులు లేకపోవడం వల్ల వచ్చే సమస్యనే ఆర్థిక సంక్షోభం అంటారు. 1991 నాటి ఆర్థిక సంక్షోభం ప్రధానంగా రెండు రకాల లోటుల సంచిత (Cumulative) ఫలితంగా తలెత్తింది.
1) దేశీయ విత్త లోటు (Fiscal deficit) 
2) విదేశీ వ్యాపార లోటు (Current account deficit)


విదేశీ వ్యాపార లోటు   విత్త లోటు  ఆర్థిక సంక్షోభం


విత్త లోటు 
కేంద్ర ప్రభుత్వ సంవత్సర ఆదాయం కంటే వ్యయాలు ఎక్కువైనప్పుడు, ఆ లోటును దేశీయ రుణాలతో భర్తీచేయడాన్ని విత్తలోటు అంటారు. దీనివల్ల ప్రభుత్వంపై అప్పులు, వడ్డీల భారం పెరిగి క్రమంగా రుణ చెల్లింపు సామర్థ్యాన్ని కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుంది. రుణ ఊబిలో కూరుకుపోవచ్చు.


విదేశీ వ్యాపార లోటు
ఒక దేశం ఇతర దేశాలకు వస్తుసేవల ఎగుమతుల ద్వారా ఆదాయం పొందుతుంది. దిగుమతుల ద్వారా వ్యయాలు చేస్తుంది. దీన్నే విదేశీ చెల్లింపుల శేషం అంటారు. ఎగుమతుల కంటే  దిగుమతులు ఎక్కువగా ఉన్నప్పుడు ఆదాయాలకంటే వ్యయాలు ఎక్కువవుతాయి. అప్పుడు దిగుమతులకు చెల్లించడానికి తగినంత విదేశీ కరెన్సీ లేక అప్పులు చేయాల్సి వస్తుంది. దీన్నే విదేశీ వర్తక లోటు అంటారు. ఈ రెండు లోటుల్లో ఏ ఒక్కటి ఉన్నా దాన్ని చాలావరకు అధిగమించవచ్చు. ఇవి అనేక అంతర్గత, బహిర్గత అంశాలపై ఆధారపడి ఉంటాయి. ఒకదాన్ని మరొకటి ప్రభావితం చేస్తాయి. 1991లో ఈ రెండూ ఒకేసారి అధికస్థాయిలో మన దేశంలో సంభవించాయి. వాటి ప్రభావం అన్ని రంగాలపై పడి,  ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారింది. దీంతో సంస్కరణలు తప్పనిసరి అయ్యాయి.  


స్వదేశీ పరిస్థితులు
1980 దశాబ్దంలో దేశ స్థూల ఆర్థిక నిర్వహణ గాడి తప్పింది. విత్తలోటు, విదేశీ వర్తకలోటు, అధిక ద్రవ్యోల్బణం లాంటి సమస్యలు ఎక్కువయ్యాయి. 198182 లో దేశ జీడీపీలో విత్తలోటు 5.1 శాతం ఉంది. 1991 నాటికి అది 7.8 శాతానికి పెరిగింది. 198589 మధ్య ఇది సగటున 10 శాతంగా ఉంది. దీనివల్ల స్వదేశీ అప్పులు దేశ ఆదాయంలో సుమారు 49.7 శాతానికి చేరాయి. ఇది భరించరాని భారంగా పరిణమించింది. కేంద్ర ప్రభుత్వ రాబడిలో 39 శాతం నిధులు వడ్డీ చెల్లింపులకే ఖర్చు చేయాల్సి వచ్చింది. ఇది ఇలాగే కొనసాగితే దేశం అపుల ఊబిలోకి జారుకునే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరించారు. 
* 80వ దశాబ్దంలో దేశంలో ప్రభుత్వ వ్యయాలు గతంలో కంటే పెరిగాయి. ఇది మంచి పరిణామమే. అయితే ఆ పెరుగుదలకు కావాల్సిన నిధులు సొంత రాబడి లేదా పొదుపుల నుంచి సమకూరాలి. కానీ అలా జరగలేదు. అప్పు చేసి, ఖర్చు పెట్టారు.
* భారత్‌లో రెవెన్యూ ఖాతాలో అభివృద్ధియేతర వ్యయాలు విపరీతంగా పెరిగాయి. దీంతో విత్తలోటు అధికమైంది. దేశంలో ఓటుబ్యాంకు రాజకీయాలు ప్రారంభమై సంక్షేమ పథకాలు, ఉచిత సబ్సిడీలకు కేటాయింపులు పెరిగాయి. పన్ను మినహాయింపులు ఎక్కువై వసూళ్లు తగినంతగా జరగలేదు.
* అనేక ప్రభుత్వ కంపెనీలు నిర్వహణ సామర్థ్యం కొరవడి, నష్టాల్లో కూరుకుపోయాయి. ఆ భారం అంతా బడ్జెట్లపై పడింది. ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, వడ్డీ చెల్లింపులు, రక్షణ వ్యయాలు ఏటేటా పెరుగుతూ వచ్చాయి.
* పెరుగుతున్న బడ్జెట్‌ లోటును పూడ్చటానికి ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి, ఇతర వాణిజ్య సంస్థల నుంచి రుణాలు తీసుకున్నారు. దేశీయంగా ప్రభుత్వ రుణాలు పెరగడంతో ఆమేరకు ప్రైవేటు రంగానికి నిధుల కొరత ఏర్పడింది. కొత్త కరెన్సీ ముద్రణ చేయడం వల్ల దేశంలో ద్రవ్య సప్లై, వస్తువుల డిమాండ్‌ పెరిగి, క్రమంగా ద్యవ్యోల్బణానికి దారితీసింది. వినియోగదారుల సూచిక ప్రకారం 1991లో ద్రవ్యోల్బణం 11.2 శాతానికి పెరిగింది. దీంతో ప్రజలకు జీవనభారం అధికమైంది.
* 80 దశాబ్దం మధ్య నుంచి దేశంలో ఇంతకాలం సాగిన నిర్బంధ  ప్రణాళిక వ్యవస్థపై  విమర్శలు ప్రారంభమయ్యాయి. విదేశీ పెట్టుబడులు, వ్యాపారాలను సరళీకరిస్తూ రాజీవ్‌గాంధీ స్వల్ప మార్పులు తెచ్చారు. తర్వాత వచ్చిన ప్రధానులు వి.పి.సింగ్, చంద్రశేఖర్‌ వాటిని కొనసాగించారు.
* రాజీవ్‌గాంధీ మంత్రివర్గంలో ఆర్థిక శాఖ నిర్వహించిన వి.పి.సింగ్‌ సరళీకృత పారిశ్రామిక విధానాలను ప్రవేశపెట్టారు. తాను ప్రధాని అయ్యాక వాటిని ఇంకా పెంచారు. ఈయన హయాంలో పారిశ్రామిక మంత్రిగా ఉన్న అజిత్‌ సింగ్‌ (మాజీ ప్రధాని చరణ్‌సింగ్‌ కుమారుడు)ఈ విధానాలను ప్రోత్సహించారు. 1990 నాటికి ఆర్థిక సంస్కరణల వాదిగా గుర్తింపు పొందడానికి, పెట్టుబడుల ఆకర్షణకు వి.పి.సింగ్‌ ప్రయత్నించారు.
* క్రమంగా 1990 నాటికి గత ప్రభుత్వాలు చేపట్టిన విధానాలతో విభేదిస్తూ, తర్వాత వచ్చిన ప్రధానులందరూ సరళీకృత ప్రైవేటు పెట్టుబడిదారీ విధానాన్ని ప్రోత్సహించారు. అప్పటికే అధికారులు, నాయకుల్లో ఈ మార్పులు, సంస్కరణలపై ఏకాభిప్రాయం కుదిరినట్లుగా భావించవచ్చు. దీన్నే నూతన పారిశ్రామిక విధానం-1990 అని పిలిచారు.
* ప్రధానిగా స్వల్పకాలం పనిచేసిన చంద్రశేఖర్‌ (నవంబరు 1990 - జూన్‌ 1991) దేశ చరిత్రలో మొదటిసారి పారిశ్రామిక శాఖను తనవద్దే ఉంచుకున్నారు. ఆ రంగంలోని సంస్కరణలను స్వయంగా పర్యవేక్షించేందుకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సంప్రదాయాన్ని తర్వాతి ప్రధాని పీవీ నరసింహారావు కొనసాగించారు.
* రాజీవ్‌గాంధీ నుంచి పీవీ నరసింహారావు వరకు ఒకే ఆర్థిక నిపుణుల బృందం నూతన ఆర్థిక విధానాలకు రూపకల్పన చేసింది.  వీరిలో కొంతమందికి పశ్చిమ దేశాలతో అకడమిక్‌ సంబంధాలు ఉన్నాయి. కొందరు మంత్రులు రాజీవ్‌గాంధీ నుంచి పీవీ వరకు  కేబినెట్‌లో పనిచేశారు. ఈ పరిణామాలు సరళీకరణ ఆర్థిక విధానాల పట్ల ఒక ఉమ్మడి ఏకాభిప్రాయం, కార్యాచరణ ఏర్పడటానికి దోహదం చేశాయి.
* పీవీ నరసింహారావు మంత్రివర్గంలో ఆర్థికశాఖ మంత్రిగా పనిచేసిన మన్మోహన్‌ సింగ్‌ ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టారు.  అంతకుముందు మాజీ ప్రధాని చంద్రశేఖర్‌ వద్ద సీనియర్‌ ఆర్థిక సలహాదారుగా పనిచేసిన అనుభవంతో భారతదేశ ఆర్థిక పరిస్థితులపై మన్మోహన్‌సింగ్‌కు స్పష్టమైన అవగాహన ఏర్పడింది.
* రాజీవ్‌గాంధీ తర్వాత దేశంలో అన్నీ సంకీర్ణ ప్రభుత్వాలే అధికారంలోకి వచ్చాయి.  దీంతో రాజకీయ అనైక్యత, మండల్‌-మందిర్‌ సమస్య మొదలైన కారణాల వల్ల బలమైన ఆర్థిక సంస్కరణలు అమలు చేయడంలో విఫలమయ్యాయి. కానీ పీవీ నరసింహారావు వాటన్నింటినీ అధిగమించి సంస్కరణలను అమలు చేశారు.


విదేశీ పరిస్థితులు
విదేశాల్లో చోటుచేసుకున్న కొన్ని సంఘటనలు కూడా భారతదేశం ఆర్థిక సంస్కరణల వైపు మొగ్గు చూపడానికి ప్రేరేపించాయి.
* నాటి సోవియట్‌ రష్యా అంతర్గత కారణాలతో విచ్ఛిన్నం కావడంతో, ఆర్థికంగా బలహీనపడింది. దీంతో మనదేశానికి అంతవరకు చేస్తున్న ఆర్థిక, రక్షణ సహాయాలు తగ్గాయి. ప్రత్యామ్నాయ దేశాల సహాయం కోసం అన్వేషణ ప్రారంభించాల్సి వచ్చింది. 
* ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్ట్, సామ్యవాద విధానాలపై విశ్వాసం సన్నగిల్లింది. బలమైన కమ్యూనిస్ట్‌ దేశమైన చైనా 1978 నుంచే ఆర్థిక సంస్కరణలు మొదలుపెట్టి, మార్కెట్‌ ఆధారిత విదేశీ పెట్టుబడులను ఆకర్షించింది.
* అప్పటి ఇంగ్లండ్‌ ప్రధాని మార్గరెట్‌ థాచర్‌ ప్రయివేటీకరణను, రష్యా అధ్యక్షుడు గోర్బచేవ్‌ సోషల్‌ డెమోక్రసీ విధానాలను అవలంబించారు. ఇవి వ్యక్తి స్వేచ్ఛను, ప్రైవేటు రంగాన్ని బలపరిచాయి. అమెరికా పెట్టుబడిదారీ విధానాలతో అభివృద్ధిలో అగ్రగామిగా నిలిచింది. ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి లాంటి అంతర్జాతీయ సంస్థల్లో మెజారిటీ వాటాను సాధించి ప్రాబల్యం పెంచుకుంది.
* మరోవైపు సింగపూర్, తైవాన్, దక్షిణ కొరియా, హాంకాంగ్‌ దేశాలు అప్పటికే సరళీకృత ఆర్థిక విధానాలు అమలుచేసి పారిశ్రామికంగా అభివృద్ధి సాధించి భారత్‌ సహా అభివృద్ధిచెందుతున్న దేశాల దృష్టిని ఆకర్షించాయి.
* 1970వ దశాబ్దం చివర్లో లాటిన్‌ అమెరికా దేశాలు రుణ చెల్లింపుల ఎగవేత సమస్యలు ఎదుర్కొని, చెడ్డపేరు తెచ్చుకున్నాయి. దీంతో విదేశీ రుణదాతలు అప్పులు ఇవ్వడానికి ప్రత్యామ్నాయ దేశం కోసం వెతకసాగారు. ఈ అవకాశాన్ని మన ప్రభుత్వాలు, కంపెనీలు ఉపయోగించుకుని, విదేశీ రుణాలను పొందాయి. ముఖ్యంగా జపాన్‌ నుంచి ఎక్కువ మొత్తంలో అప్పు సమకూరింది.
* దేశంలో 1976 నుంచే మాధ్యమిక మూలధన వస్తు దిగుమతులను సులభతరం చేశారు. కానీ మన ఎగుమతులు పెరగలేదు. అలాగే రాజకీయ కారణాల వల్ల విదేశీ సహాయాలు కూడా తగ్గుతూ వచ్చాయి. అయినా, విదేశీ రుణాలతో మన విత్త లోటును భర్తీ చేయడానికి ప్రయత్నాలు కొనసాగాయి. ఫలితంగా వడ్డీల భారం పెరిగింది. 
* 1990 నాటికి వడ్డీలకు చెల్లించే వ్యయం మన దేశ రక్షణ లేదా సబ్సిడీల వ్యయం కంటే ఎక్కువగా ఉంది.
* దేశ అభివృద్ధి కోసం 1980లోనే అంతర్జాతీయ ద్రవ్యనిధి (International Monetary Fund) నుంచి నిధుల రూపంలో సహాయం పొందాం. అప్పటి నుంచి మనం వారి ఆదేశాలు, సలహాలను ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పాటిస్తూ వస్తున్నాం.
* దేశంలో విదేశీ చెల్లింపుల సమస్య 80 దశాబ్దంలో పెరిగింది. దిగుమతులను సులభతరం చేయడం, ఎగుమతులు ఆశించినంతగా పెరగకపోవడం వల్ల విదేశీ వ్యాపారంలో ఆదాయం కంటే వ్యయాలు పెరిగి వ్యాపారలోటు ఏర్పడింది. 
* సంకీర్ణ ప్రభుత్వాల పాలనలో ఏర్పడిన అనిశ్చితి వల్ల ఎన్‌ఆర్‌ఐలకు దేశీయ మార్కెట్లపై విశ్వాసం సన్నగిల్లి తమ డిపాజిట్లను వెనక్కి తీసుకున్నారు. ఫలితంగా విదేశీమారక నిల్వలు తగ్గిపోతూ వచ్చాయి. ఈ లోటును భర్తీ చేయడానికి విదేశీ రుణాలు పెంచుకోవాల్సి వచ్చింది.
* 1991 నాటికి కరెంటు ఖాతాలో లోటు దేశీయ ఆదాయంలో 3.69 శాతానికి పెరిగింది. దీనివల్ల విదేశీ అప్పులు మన రాబడిలో 26 శాతానికి చేరాయి. ఇది నాటి భారతదేశ ఆర్థిక స్థితి ప్రకారం మోయలేని భారం. దీనిలో దాదాపు సగం అప్పులు ప్రభుత్వ రంగానివే.
* ముఖ్యంగా దేశంలో పెట్టుబడులు - పొదుపుల మధ్య సమతౌల్యం పాటించడంలో చోటుచేసుకున్న వైఫల్యం కారణంగా, ఆ లోటును భర్తీ చేయడానికి ఎక్కువ వడ్డీకి అప్పులు చేయాల్సివచ్చింది. విదేశాల నుంచి దిగుమతులకు సమానంగా ఎగుమతులు పెరగకపోవడం విదేశీ చెల్లింపుల సమస్యకు బీజం వేసింది.
* మన కరెన్సీ విలువ అధికంగా ఉండటం, విలువ తగ్గించడానికి పాలకులు సమ్మతించకపోవడం వల్ల విదేశీ వ్యాపారంలో మన ఎగుమతులు, రాబడులు పెరగలేదు.
* మరోవైపు 1990 నాటి గల్ఫ్‌ సంక్షోభం వల్ల ఆయిల్‌ ధరలు విపరీతంగా పెరిగాయి. భారతదేశం డాలర్ల రూపంలో అధికంగా చెల్లించాల్సి వచ్చింది. దీంతో దిగుమతుల భారం పెరిగింది.
* ఇది ఇలాగే కొనసాగితే ఇకముందు చెల్లింపులకు విదేశీమారక నిల్వలు పూర్తిగా కరిగిపోతాయని నిపుణులు హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా భారతదేశ పరపతి రేటు పడిపోతుంది. అదే జరిగితే విదేశీ రుణాలు లభించవు. అధిక వడ్డీలు చెల్లించాల్సి వస్తుంది. ఈ పరిస్థితినే విదేశీ చెల్లింపుల సంక్షోభం అంటారు.
* ఈ స్థితి నుంచి బయటపడటానికి నాటి చంద్రశేఖర్‌ ప్రభుత్వం 1991 మేలో 20 టన్నుల బంగారాన్ని జ్యూరిచ్‌ (స్విట్జర్లాండ్‌) నగరంలో విక్రయించడం ద్వారా, 240 మిలియన్‌ డాలర్ల నిధులు సమకూర్చుకుంది. 
* 1991 జూన్‌ నాటికి విదేశీమారక నిల్వలు ఒక బిలియన్‌ డాలర్‌ లోపునకు పడిపోయాయి. 1991 జులైలో మరో 47 టన్నుల బంగారాన్ని బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌ దగ్గర కుదువపెట్టి, చెల్లింపులు జరిపారు.
* అయితే, ఈ సంక్షోభం అప్పటికప్పుడు పుట్టుకొచ్చింది కాదు. దశాబ్దాల స్వదేశీ, విదేశీ అంశాలు, రాజకీయ,  పాలనాపరమైన కారణాలు ఈ పరిస్థితికి దారితీశాయి. 
* లాంటి విపత్కరమైన ఆర్థిక సంక్షోభ సమయంలో కేంద్రంలో 1991 జులైలో పి.వి. నరసింహారావు నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఆయన ప్రధానిగా ఉన్న సమయంలోనే స్వదేశీ, విదేశీ పరిస్థితుల ప్రభావంతో ఆర్థిక సంస్కరణలకు అంకురార్పణ చేశారు. కొద్దికాలంలోనే ఆర్థిక సంక్షోభ ప్రమాదం నుంచి దేశాన్ని రక్షించడమే కాక భావి భారత ఆర్థిక ప్రగతికి కావలసిన సరికొత్త పునాదులు వేశారు. 

Posted Date : 09-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రపంచీకరణ

* వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలను ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానం చేయడాన్నే ప్రపంచీకరణ అనవచ్చు.
* ప్రపంచదేశాల మధ్య వస్తువులు, సేవలు, మూలధనం, సాంకేతిక పరిజ్ఞానం, శ్రమ, మానవ మూలధనం లాంటివి ఎలాంటి అడ్డంకులు, అవరోధాలు లేకుండా స్వేచ్ఛగా ప్రవహిస్తూ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సమైక్యంగా సంఘటితం కావడమే ప్రపంచీకరణ అని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) పేర్కొంది.
* ప్రపంచీకరణలో నాలుగు ప్రధాన అంశాలను గమనించవచ్చు.
    i) వివిధ దేశాల మధ్య వస్తుసేవల స్వేచ్ఛా ప్రవాహానికి ఉన్న అవరోధాలను తగ్గించడం.
    ii) దేశాల మధ్య మూలధన స్వేచ్ఛా ప్రవాహానికి తగిన వాతావరణాన్ని సృష్టించడం.
    iii) సాంకేతిక పరిజ్ఞానాన్ని సరిహద్దులు దాటి, ప్రపంచమంతా విస్తరించేలా చేయడం.
    iv) దేశాల మధ్య శ్రామికుల గమనశీలతకు తగిన వాతావరణాన్ని సృష్టించడం.

* నేడు అంతర్జాలం విస్తరించిన నేపథ్యంలో ప్రపంచమే ఒక విశ్వ గ్రామంగా మారిపోయింది.
* అంతర్జాతీయ ద్రవ్యనిధి, ప్రపంచ బ్యాంకు (ఐబీఆర్‌డీ) ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) లాంటి వాటిని ప్రపంచీకరణకు ప్రతినిధులుగా చెప్పవచ్చు.
* అంతర్జాతీయీకరణ, ప్రపంచీకరణ వల్ల కలిగే నిరపేక్ష, తులనాత్మక వ్యయాలు, లాభాలు ఏవిధంగా ఉద్భవిస్తాయో ఆడమ్ స్మిత్, డేవిడ్ రికార్డో లాంటి సంప్రదాయ ఆర్థికవేత్తల అంతర్జాతీయ వ్యాపార సూత్రాలు తెలియజేస్తాయి.
* 1980 వ దశకంలో ఆవిర్భవించిన విధానాలు, స్వేచ్ఛా వాణిజ్య విధానాలను ప్రాచుర్యంలోకి తెచ్చాయి.
* అంతర్జాతీయీకరణ, సరళీకరణల ఫలితమే ప్రపంచీకరణ అని చెప్పవచ్చు.
* ప్రపంచీకరణ వల్ల గ్లోబల్ మార్కెట్‌ల ఆవిర్భావం, బహుళ జాతి సంస్థల (ఎంఎన్‌సీలు) ద్వారా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) పెరగడం లాంటి ప్రధాన అనుకూల అంశాలు ఏర్పడతాయి.
* రవాణ, కమ్యూనికేషన్ రంగాల శీఘ్రతర వృద్ధి వల్ల సాంకేతిక పరిజ్ఞానం బహుముఖంగా విస్తరిస్తుంది.
* ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ), యూరోపియన్ యూనియన్ (ఈయూ), ఎన్ఏఎఫ్‌టీఏ లాంటి కూటముల ద్వారా ఏర్పడ్డ ప్రాంతీయ వర్తక మండళ్లు ప్రపంచీకరణకు తోడ్పడుతున్నాయి.
* అభివృద్ధి చెందుతున్న దేశాల్లో, వాటి మార్కెట్లలో బహుళజాతి సంస్థల పేరుతో అభివృద్ధి చెందిన దేశాల్లోని అధికోత్పత్తి, అధిక స్థాపిత శక్తి ప్రవేశించడం వల్ల ప్రపంచీకరణ పెరుగుతోంది.
* అంతర్జాతీయ వ్యాపారంలో వస్తుసేవల ఎగుమతి, దిగుమతులపై ఆంక్షల తొలగింపు, విదేశీ మారక ద్రవ్యంపై నియంత్రణలను తొలగించడం లాంటివి ప్రపంచీకరణకు అవకాశాన్ని ఏర్పరుస్తున్నాయి.
* వివిధ దేశాల విదేశీ వ్యాపార చెల్లింపు శేషంలో మార్పులు జరిగి, విదేశీ మారకద్రవ్య నిల్వలు పెరగడం ప్రపంచీకరణ ఫలితమే.
* వ్యాపార స్వేచ్ఛ, ప్రభుత్వ ప్రోత్సాహం, అవస్థాపనా సౌకర్యాల అభివృద్ది, పోటీతత్వం లాంటివి ప్రపంచీకరణకు మరింతగా తోడ్పడతాయి.

భారతదేశంలో ప్రపంచీకరణ

* 1980 వ దశకం ప్రారంభంలో భారతదేశ విదేశీ మూలధనానికి కల్పించిన అనేక రాయితీలు ప్రపంచీకరణకు నాంది పలికాయి.
* గతంలో బహుళజాతి సంస్థల ప్రవేశానికి అవరోధంగా ఉన్న పలు రంగాల్లో అనుమతులిచ్చారు.
* విదేశీ మారక నిరోధక చట్టం (ఎఫ్ఈఆర్ఏ) నిబంధనలను సడలించి, దాని స్థానంలో విదేశీ మారక నిర్వహణ చట్టాన్ని (FEMA) అమల్లోకి తెచ్చారు.
* దిగుమతులను సరళీకరించారు.
* అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్), ప్రపంచ బ్యాంకు (ఐబీఆర్‌డీ) లతో కుదిరిన ఒప్పంద నిబంధనల ప్రకారం 1991 లో ప్రారంభించిన ఆర్థిక సంస్కరణలు ప్రపంచీకరణకు బాటలు వేశాయి.
* ఆరో, ఏడో పంచవర్ష ప్రణాళికల కాలంలో ప్రభుత్వ విదేశీ వ్యాపార చెల్లింపుల శేషం లోటుతో, తీవ్ర సంక్షోభం ఏర్పడినప్పుడు ప్రభుత్వం ఐఎంఎఫ్, ఐబీఆర్‌డీల నుంచి 7 బిలియన్ డాలర్ల రుణం కోసం సంప్రదించింది.
* అపుడు ఐఎంఎఫ్, ఐబీఆర్‌డీ భారత ప్రభుత్వాన్ని ఎల్‌పీజీ విధానాన్ని అమలు పరచాల్సిందిగా నిర్దేశించాయి. ఫలితంగా ప్రపంచీకరణ ఊపందుకుంది.
* భారతదేశంలోని అపార మానవ వనరులు, ముఖ్యంగా 400 మిలియన్లకుపైగా ఉన్న యువతకు ప్రపంచీకరణ ఫలాలు అందుకునే అవకాశం ఏర్పడింది.
* ప్రపంచీకరణతో ప్రజలు, సంస్థలు, పెట్టుబడిదారుల ఆదాయాలు పెరిగి, స్వదేశీ మార్కెట్లు విస్తరించడంతోపాటు, మన సంస్థలు కూడా వివిధ దేశాల్లో పెట్టుబడులు పెట్టి, లాభాలను ఆర్జించే అవకాశం ఏర్పడింది. టాటా గ్రూపు సంస్థలు, ఎయిర్‌టెల్ లాంటివి ఆసియా, ఆఫ్రికా ఖండాల్లో పెడుతున్న పెట్టుబడులను ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు.
* ప్రవాస భారతీయుల సేవలు, నైపుణ్యం, పెట్టుబడులు, అనుభవాలను కూడా ఉపయోగించుకోవచ్చు.
    ఉదా: లక్ష్మి నివాస్ మిట్టల్ లాంటి వారు భారత్‌లో ఉక్కు కర్మాగారాల నిర్మాణానికి ఆసక్తి చూపడం.

* ఐఎంఎఫ్, ఐబీఆర్‌డీ స్థిరీకరణ, సంస్థాగత సర్దుబాట్లలో భాగంగా కోశ లోటును తగ్గించి, ద్రవ్య సప్లయ్‌ని తగ్గించడం, ఉత్పత్తి, పెట్టుబడి, ధరలపై నియంత్రణను తగ్గించి, స్వేచ్ఛా మార్కెట్ విధానాలను అనుసరించడం, విదేశీ మార్కెట్ల నుంచి వివిధ రకాల వస్తువుల, సేవల ప్రవేశానికి ఉన్న అడ్డంకులను తొలగించడం ప్రపంచీకరణలో భాగంగా చేసినవే.
    ఉదా: భారత్‌లో శామ్‌సంగ్, ఎల్‌జీ లాంటి కంపెనీల ప్రవేశం.

* దలిప్ స్వామి చెప్పిన విధంగా 1990-91 లో భారత్‌లో ఉన్న పరిస్థితులు ప్రపంచీకరణకు పురిగొల్పాయి.
* ప్రపంచీకరణలో భాగంగా రూపాయి మారకపు విలువను తగ్గించడం (అమెరికన్ డాలర్‌తో), కరెంట్, మూలధన ఖాతాల్లో రూపాయి మారకం లాంటివి ప్రపంచీకరణలో భాగమే.
* నేడు అనేక రంగాలు 100% వరకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను స్వాగతిస్తున్నాయి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ప్రధానంగా కిందివాటిలోకి మాత్రం అనుమతించడం లేదు.
      i) రిటైల్ వ్యాపారం (సింగిల్ బ్రాండ్ ప్రొడక్ట్ రిటైలింగ్ మినహా)
      ii) అణుశక్తి
      iii) లాటరీ వ్యాపారం
      iv) జూదం, బెట్టింగులు
      v) చిట్‌ఫండ్ సంస్థలు
      vi) నిధి కంపెనీలు

* ప్రపంచీకరణ ప్రభావం వల్ల 1991 నాటికి సంక్షోభంలో ఉన్న విదేశీ మారక ద్రవ్య నిల్వలు 2015-16 నాటికి 350 బిలియన్ డాలర్లకు పెరిగాయి.
* ప్రపంచీకరణ వల్ల బహుళజాతి సంస్థలు భారీగా అవతరించి, భారతీయ సంస్థలను చిన్నవిగా చేసి, అసమాన పోటీని పెంచాయి.
* అంతర్జాతీయ వ్యాపారంలో భారతదేశ వాటాను పెంచడానికి విదేశీ వ్యాపార విధానం (ఎఫ్‌టీపీ) 2015-20 ను ప్రకటించారు.
* ప్రపంచ జీడీపీలో భారతదేశ వాటా 2008-13 మధ్య 6.1% నుంచి 2014-15 కి 7 శాతానికి పెరిగింది.
* 2015-16 లో 7.6% జీడీపీ వృద్ధి రేటుతో భారత్ చైనాను కూడా అధిగమించింది.
* ఆసియా, ఇతర దేశాలతో ద్వైపాక్షిక, వ్యాపార ఒప్పందాల ద్వారా భారత్ అనేక కూటములను ఏర్పాటు చేసుకుని అంతర్జాతీయ వ్యాపారాన్ని పెంచుకుంటోంది.
     ఉదా: SAFTA, SAPTA, BIMSTEC, BRICS లాంటివి.

Posted Date : 31-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భారతదేశ ఆర్థికాభివృద్ధి

ఒక దేశ ఆర్థికాభివృద్ధి అనేది సంక్లిష్ట పునర్నిర్మాణ ప్రక్రియ. ఇది దీర్ఘకాలంలో ఆర్థికంగా, సామాజికంగా, సాంకేతికంగా, సంస్థాగతంగా సంభవించే మార్పులను తెలియజేస్తుంది. ప్రత్యేక వాతావరణ పరిస్థితులు, విభిన్న సామాజిక సాంస్కృతిక విలువలు కలిగి, అభివృద్ధి చెందుతున్న భారత్‌ లాంటి దేశాల్లో ఆర్థికాభివృద్ధి.. అనేక సవాళ్లు, ఒడుదొడుకులతో నిత్యం అనిశ్చితిగా ఉంటుంది. అందుకే అభివృద్ధిని ఏ మేరకు సాధించామో తెలుసుకోవడానికి ఒక కొలమానం అవసరం. దానికి శాస్త్రీయమైన హేతుబద్ధత ఉండి లెక్కించడానికి వీలుగా ఉండాలి.    


అభివృద్ధి కొలమానాలు 

అభివృద్ధితో పాటు దాని సమగ్ర కొలమానాలపై కూడా ఆర్థికవేత్తలు చర్చించారు. భారతదేశ ఆర్థిక పరిస్థితిపై పశ్చిమ దేశాలైన ఇంగ్లండ్, అమెరికా అభిప్రాయాల ప్రభావం ఎక్కువగా ఉంది. ఆర్థికాభివృద్ధిని కొలవడానికి ఉపయోగించే ముఖ్యమైన కొలమానాలు..


స్థూల జాతీయోత్పత్తి 

  సంవత్సర కాలంలో ఒక దేశ ప్రజల ద్వారా ఉత్పత్తయిన అంతిమ వస్తుసేవల మార్కెట్‌ విలువల మొత్తమే స్థూల జాతీయోత్పత్తి. ఇది ఆర్థిక విలువలను తెలియజేస్తుంది. దీనిలో నాలుగు అంశాలు ఉంటాయి. అవి:

    1. ప్రజల వినియోగ వ్యయం (C) 
    2. సంస్థల పెట్టుబడి వ్యయం (I)
    3. ప్రభుత్వ వ్యయం (G)   
    4. విదేశాల నుంచి వచ్చే ఆదాయం (Net foreign income )

  ( GNP= C+I+G+Net foreign income )


  ప్రపంచంలో మొదటిసారిగా జాతీయాదాయాన్ని సైమన్‌ కుజ్నెట్‌ అనే అమెరికా ఆర్థికవేత్త శాస్త్రీయంగా అంచనా వేశారు. ఈయన స్థూల ఉత్పత్తిలో పెరుగుదల వల్ల ఆర్థిక నిర్మాణం, జీవనంలో మార్పులు సంభవిస్తాయని తెలిపాడు. ‘ఇది భవిష్యత్‌ పురోగతికి అవసరం. కానీ జాతీయాదాయ లెక్కల నుంచి ప్రజా సంక్షేమాన్ని గ్రహించలేం’ అని స్పష్టం చేశారు.

వాస్తవ జాతీయాదాయ అంచనాలు ధరల్లో మార్పులను తెలియజేయవు. ఆదాయ అసమానతలు, జనాభాలో వచ్చే మార్పులు, వాతావరణ కాలుష్యం వల్ల కలిగే నష్టాల గురించి పేర్కొనదు. భారత్‌ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అసంఘటిత రంగం, నిరక్షరాస్యత, బ్లాక్‌ మార్కెటింగ్‌ ఎక్కువ. కాబట్టి ఏ రంగానికి సంబంధించైనా కచ్చితమైన లెక్కలు లభించవు. 

* జాతీయాదాయ పరంగా భారతదేశం 2.7 ట్రిలియన్‌ డాలర్ల మొత్తంతో ప్రపంచంలో ఆరో స్థానాన్ని పొందింది. సామాజిక, సాంకేతిక, మానవ మూలధనం లాంటి అంశాల్లో ఇప్పటికీ వెనుకబడి ఉంది. కాబట్టి ఇది సమగ్రమైన అభివృద్ధి కొలమానం అని చెప్పలేం.


వాస్తవ తలసరి ఆదాయం 

   ఒక దేశంలో జాతీయాదాయ పెరుగుదలపై జనాభా ప్రభావాన్ని పరిశీలిస్తూ అభివృద్ధిని గణించడానికి వాస్తవ తలసరి ఆదాయం ఉపకరిస్తుంది. మొత్తం జాతీయాదాయాన్ని జనసంఖ్యకు పంచినప్పుడు సగటున వచ్చే మొత్తాన్ని తలసరి ఆదాయం అంటారు. 
                   
   తలసరి ఆదాయం=  మొత్తం జాతీయాదాయం /   మొత్తం జనాభా

  సాధారణంగా తలసరి ఆదాయం పెరిగితే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవుతాయి. తలసరి ఆదాయం పెరగకుండా జాతీయాదాయం మాత్రమే పెరగడం వల్ల ప్రయోజనం ఉండదు. ఇది ఆర్థికాభివృద్ధిలో ప్రజల పాత్ర, వారి ఆదాయ స్థాయుల్లో మార్పులను తెలుపుతుంది. ప్రపంచ బ్యాంకు, ఐక్యరాజ్య సమితి లాంటి సంస్థలు కూడా తలసరి ఆదాయం ఆధారంగా దేశాలను అభివృద్ధిచెందిన, చెందుతున్న దేశాలుగా వర్గీకరించి అధ్యయనం చేస్తున్నాయి. తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్న దేశాలన్నీ అభివృద్ధి చెందిన దేశాలే. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) నివేదిక ప్రకారం 2018 నాటికి ప్రపంచంలోని అయిదు అత్యధిక ధనవంత దేశాలు వరుసగా లక్సెంబర్గ్, మకావు, స్విట్జర్లాండ్, నార్వే, ఐస్‌లాండ్‌. ఈ దేశాలు 75000 డాలర్లకు పైగా తలసరి ఆదాయాన్ని కలిగి ఉన్నాయి. జాతీయాదాయ పరంగా అగ్ర దేశమైన అమెరికా 65000 డాలర్లతో ఎనిమిదో స్థానంలో ఉంది. అయితే తలసరి ఆదాయం కూడా సరైన కొలమానం కాదని కొంతమంది ఆర్థికవేత్తలు విమర్శిస్తున్నారు.


విమర్శలు

ఇది అసమగ్రమైన జాతీయాదాయ లెక్కలపై ఆధారపడి ఉందని, జనసంఖ్య పెరిగి తలసరి ఆదాయంలో మార్పు లేకపోయినా లేదా తగ్గినా అభివృద్ధి జరగలేదని చెప్పలేం. 
* ఇది ప్రజల సగటు ఆదాయం మాత్రమే. అందరి ఆదాయం కాదు. ఆదాయ అసమానతలు, పంపిణీ గురించి తెలపదు. 
* అనేక దశాబ్దాలుగా చేసిన ప్రయత్నాల వల్ల భారతదేశం జాతీయాదాయపరంగా ఆరో పెద్ద దేశంగా ఉన్నప్పటికీ తలసరి ఆదాయంలో 119వ స్థానంలో ఉంది. దీని ఆధారంగా మనదేశం అభివృద్ధిని సాధించలేదని చెప్పలేం. తలసరి ఆదాయంలో అగ్రస్థానంలో ఉన్న దేశాలతో పోల్చలేం. ఎందుకంటే అవి పరిమాణం, జనాభా పరంగా చిన్న దేశాలు. పరిశ్రమలు, వ్యాపారాలు, పర్యాటకం, బ్యాంకింగ్‌ లాంటి సేవల రంగాల నుంచి ఎక్కువ ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయి. అయితే మనదేశం ఇప్పటికీ 60% మేర రుతుపవనాలపై ఆధారపడుతున్న వ్యవసాయాధారిత దేశం.
* 1951తో పోల్చినప్పుడు మనదేశ తలసరి ఆదాయం పెరిగింది కానీ ఆదాయ అసమానతలు తీవ్రతరం అయ్యాయని ప్రభుత్వ నివేెదికలు హెచ్చరిస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని పెరిగిన తలసరి ఆదాయం తెలపదు.


ఆర్థిక సంక్షేమం: జాతీయాదాయం, తలసరి ఆదాయాలు అభివృద్ధిని కొలవడంలో సంతృప్తికరంగా లేకపోవడంతో కొలిన్‌ క్లార్క్, కిండెల్‌ బర్గర్, డి. బ్రైట్‌ సింగ్‌ లాంటి ఆర్థికవేత్తలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించారు.
ప్రజల మధ్య ఆదాయ పంపిణీలో సమానత్వం, కొనుగోలు శక్తి పెరిగేలా ధరల స్థిర త్వాన్ని సాధించినప్పుడు ఆర్థిక సంక్షేమం ఉంటుందని వీరు అభిప్రాయపడ్డారు. అధిక ఆర్థిక సంక్షేమాన్ని అధిక అభివృద్ధికి చిహ్నంగా భావించారు. అయితే ఆర్థిక సంక్షేమం అనేది మానసికమైంది. దాన్ని కొలవలేం. ఇద్దరు వ్యక్తుల మధ్య సంక్షేమ భావన ఒకేవిధంగా ఉండదు. జాతీయాదాయ మార్పుల స్వభావాన్ని, ఉత్పత్తి సామాజిక వ్యయాన్ని అంచనా వేయడం చాలా కష్టం. ఆర్థిక సంక్షేమం అభివృద్ధికి కొలమానంగా ఆచరణలో సాధ్యం కాదని విమర్శలను ఎదుర్కొంది.


భౌతిక జీవన ప్రమాణ సూచిక 

మోరీస్‌ డి మోరీస్‌ అనే శాస్త్రవేత్త ప్రజల ప్రాథమిక అవసరాల దృష్ట్యా ఈ కొలమానాన్ని రూపొందించారు. శిశు మరణాల రేటు, ఆయుఃప్రమాణం, అక్షరాస్యత లాంటి మూడు అంశాల సమాన భారాల సగటు ఆధారంగా ఈ సూచికను లెక్కిస్తారు.

విమర్శలు

ఇది ప్రాథమిక అవసరాలను మాత్రమే లెక్కించే పరిమిత కొలమానం.
* దీనిలో చేర్చే అంశాల సంఖ్య పట్ల ఆర్థికవేత్తల మధ్య ఏకాభిప్రాయం లేదు.
* ఈ సూచిక ఆర్థికాభివృద్ధిని విస్మరించింది. ఇది లేకుండా జీవన ప్రమాణాలు మెరుగుపడవు. 
* భద్రత, న్యాయం, మానవ హక్కుల లాంటి సామాజిక, మానసిక అంశాల గురించి ఈ సూచిక పేర్కొనలేదు.


మానవాభివృద్ధే అంతిమ లక్ష్యం 

1990లో యూఎన్‌డీపీ వెలువరించిన మొదటి మానవాభివృద్ధి నివేదిక అభివృద్ధి ఆర్థికశాస్త్రం విధానాలు, కొలమానాల్లో విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చింది. దీంతో పాలకులు, పరిశోధకులు,  ప్రజల అభివృద్ధి ధోరణి మారిపోయింది. అప్పటివరకు అభివృద్ధి అంటే ఆర్థికాభివృద్ధి అని ప్రజల వస్తుసేవల పెరుగుదలను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారు. కానీ ఉన్నత మానవ శ్రేయస్సు వైపు పురోగమించడమే మానవాభివృద్ధి అని, అదే నిజమైన అభివృద్ధి అని ఐక్యరాజ్యసమితి నివేదికలో నిర్వచించారు. అర్థశాస్త్ర చారిత్రక మేధోమథనం నుంచి అభివృద్ధి కొలమానాలకు ప్రత్యామ్నాయాల అన్వేషణ ఎప్పటి నుంచో జరుగుతోంది. 


క్రీ.పూ.350లోనే అరిస్టాటిల్ "Well being as something genrated by our actions and not our belongings" అని అభిప్రాయపడ్డారు.
* 18వ శతాబ్దంలో జెర్మి బెంథామ్‌ ప్రయోజనవాదం వ్యక్తుల ప్రయోజనాల కలయికే సామాజిక ప్రయోజనంగా గుర్తించి The greatest happiness for the greatest number ను సూచించింది.
* 19వ శతాబ్దంలో మార్షల్‌ లాంటి నూతన సంప్రదాయ ఆర్థికవేత్తలు ‘నెరవేర్చుకునే కోరికలు’ అనే భావనను ప్రవేశపెట్టారు. ‘‘అపరిమితమైన కోరికలను నెరవేర్చే పరిమిత వనరులను అదనంగా సమకూర్చుకునే కొద్దీ వాటి నుంచి పొందే అదనపు ప్రయోజనం (Marginal Utility) క్షీణిస్తుంది’’ అని నిరూపించారు. కాబట్టి మిగులు వనరులు ధనికుల నుంచి పేదలకు చేరితే సాంఘిక ప్రయోజనం పెరుగుతుందని తీర్మానించారు. వీరు ఎక్కువగా వ్యక్తిగత ప్రయోజనం పైనే దృష్టి సారించారు.
20వ శతాబ్దంలో జాన్‌ రాల్స్‌ అనే తత్వవేత్త ‘ఎ థియరీ ఆఫ్‌ జస్టిస్‌’ (1971) అనే పుస్తకం ద్వారా ప్రజల మధ్య సమానత్వం, న్యాయం గురించి చర్చించడంతో అభివృద్ధిలో మానవత్వ కోణాన్ని జోడించినట్లయింది. ఇతడి సిద్ధాంతం ఆధారంగా అమర్త్యసేన్, మార్థానస్‌బామ్‌ మానవ శ్రేయస్సుకు మానవ సామర్థ్యాలు అవసరమని నిర్ధారించారు. మానవాభివృద్ధి అనేది మనిషి ఏమి కలిగి ఉన్నాడు అనేదానిపై కాకుండా ఏమి చేయగలడు అనే విషయంపై ఆధారపడి ఉంటుందని, సామర్థ్యాలు మాత్రమే మనిషి సంపాదన, దాని వినియోగాన్ని నిర్ణయించి అతడి సాధికారతకు దారి తీస్తాయని వివరించారు. ఆదాయాభివృద్ధి కాదు మానవాభివృద్ధే అంతిమ లక్ష్యమని చెప్పారు.

  జాతి, మతం, ప్రాంతంతో సంబంధం లేకుండా సర్వకాల సార్వజనీన విలువల ఆలంబనగా మహబూబ్‌-ఉల్‌-హక్‌ అనే పాకిస్థాన్‌ ఆర్థికవేత్త చొరవతో పాల్‌ స్ట్రీటెన్, ఫ్రాన్సిస్‌ స్టీవార్ట్, సుధీర్‌ ఆనంద్, మేఘనాథ్‌ దేశాయ్‌ లాంటి శాస్త్రవేత్తలు, మానవాభివృద్ధి సూచికను ప్రతిపాదించారు. అమర్త్యసేన్‌ సిద్ధాంతం దీనికి ఆధారం. 1990 నుంచి ఇది అమల్లోకి వచ్చింది.
  మానవుల సామర్థ్యాన్ని పెంచే విద్య, ఆరోగ్యం, తలసరి ఆదాయాలను పరిగణనలోకి తీసుకొని మానవాభివృద్ధి సూచికను రూపొందించారు. అప్పటి నుంచి పరిపాలన అనేది ఆదాయ పెంపు కోసం కాకుండా ప్రజల శ్రేయస్సుకు కేంద్రీకృతంగా మారింది. ప్రపంచం దీన్ని జాతీయ, తలసరి ఆదాయాలకు ప్రత్యామ్నాయంగా గుర్తించింది.

భారత ఆర్థిక వ్యవస్థ: కొవిడ్‌ అనంతర పరిణామాలు
కొవిడ్‌19 వ్యాప్తి నేపథ్యంలో 2020, మార్చి 22 నుంచి భారత్‌లో లాక్‌డౌన్‌ విధించడంతో దేశ ఆర్థికవ్యవస్థ అస్తవ్యస్తమైంది. అన్ని రంగాల్లో వృద్ధిరేటు పూర్తిగా మందగించింది. జాతీయ గణాంక సంస్థ (ఎన్‌ఎస్‌ఓ) 2020, ఆగస్టు 31న ప్రకటించిన నివేదిక ప్రకారం 202021 ఆర్థిÄక సంవత్సరం తొలి త్రైమాసికం (ఏప్రిల్‌ - జూన్‌)లో మనదేశ స్థూలదేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 23.9 శాతం తగ్గింది. రెండో త్రైమాసికంలో ఈ రేటు 12 శాతం తగ్గుతుందని ఆర్థిక నిపుణుల అంచనా.  2020, నవంబరు 27న ఎన్‌ఎస్‌ఓ రెండో త్రైమాసిక (జులై - సెప్టెంబరు) జీడీపీ గణాంకాలను విడుదల చేసింది. ఇందులో జీడీపీ వృద్ధి రేటు 7.5 శాతం తగ్గింది. సిమెంట్, ఉక్కు, వ్యవసాయం, తయారీరంగాలు కీలకపాత్ర పోషించాయి. 202122 ఆర్థికసంవత్సరం ప్రారంభం నాటికి భారత ఆర్థిక వ్యవస్థ ఆశించిన స్థాయిలో వృద్ధి చెందుతుందనేది ఆర్థికవేత్తల అంచనా.


V - ఆకారపు జీడీపీ వృద్ధిరేటు  
* భారత ఆర్థిక వ్యవహారాల విభాగం నెలవారీ ఆర్థిక సమీక్ష - నవంబరు 2020 ప్రకారం మన దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం V ఆకారపు వృద్ధిరేటును చూపుతోంది (అంటే పడిపోయి మళ్లీ పైకి ఎగబాకింది). పారిశ్రామిక కార్యకలాపాలు మామూలు స్థాయికి రావడం, వ్యవసాయం, విద్యుత్‌ లాంటి ప్రజావినియోగ రంగాల్లో సానుకూల ఎదుగుదల భారత స్థూలదేశీయోత్పత్తి (జీడీపీ) తిరిగి పుంజుకోవడానికి తోడ్పడ్డాయి. 
* కొవిడ్‌19 కారణంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు కేంద్రం ఆత్మనిర్భర్‌ భారత్‌ (స్వయం సమృద్ధ భారత్‌) పథకాన్ని ప్రకటించింది. దీని ద్వారా మూడు దశల్లో 29.87 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని అందించింది. ఇదే భారత ఆర్థిక వ్యవస్థకు తోడ్పాటునిచ్చిందని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌) అభిప్రాయపడింది. ఈ ప్యాకేజీ విలువ భారతదేశ జీడీపీలో 15 శాతం. జాతి సంపద పెరిగినప్పుడు దేశ పౌరుల తలసరి ఆదాయం కూడా పెరుగుతుంది. 


G -20 అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక వ్యవస్థలు

దేశంపేరు తొలి త్రైమాసికం (Q1)(శాతంలో) రెండో త్రైమాసికం (Q2)(శాతంలో)
కెనడా 12.5 5.2
ఫ్రాన్స్ 18.9 3.9
జర్మనీ 11.2 4
ఇటలీ 18 5
జపాన్‌ 10.3 5.9
స్పెయిన్ 21.5 8.7
బ్రిటన్ 21.5 9.6
యూఎస్‌ఏ 9 2.9

G - 20 అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వ్యవస్థలు

 బ్రెజిల్‌ 11.4 -
చైనా 3.2 4.9
ఇండియా 23.9 7.5
ఇండోనేసియా 5.4 3.6
మెక్సికో 18.7 8.6
రష్యా 5.6 -
దక్షిణాఫ్రికా 17.2 -
టర్కీ 8.5 5.4

ఆధారం: కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ - 2020


* ప్రభుత్వం అందించిన ప్రోత్సాహంతో అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు భారత్‌కు సానూకూలమైన రేటింగ్స్‌ ఇచ్చాయి. మూడీస్‌ సంస్థ 2021 అంచనాలను 8.1 శాతం నుంచి 8.6 శాతానికి పెంచింది. గోల్డ్‌మాన్‌శాక్స్, బార్‌క్లేస్‌ కూడా తమ అంచనాలను మార్చుకున్నాయి. భారతదేశ ఆర్థిక వ్యవస్ధ అంచనాలను మించి వేగంగా కోలుకుంటోందని ఆక్స్‌ఫర్డ్‌ ఆర్థిక నివేదిక పేర్కొంది. 2020 అక్టోబరులో ఐఎంఎఫ్‌ వరల్డ్‌ ఎకనమిక్‌ అవుట్‌లుక్‌ ్ఞతి ల్ని-్ణ ్చ-్ట దీi÷÷i‘్యః్మ తి(‘’-్మ్ఠ పేరుతో ఒక నివేదికను విడుదలచేసింది. దీని ప్రకారం భారత ఆర్థికాభివృద్ధి రేటు 2021లో 8.8 శాతం ఉంటుందని, ఇది ప్రపంచంలోనే అత్యధికమని ఐఎంఎఫ్‌ తెలిపింది.


ప్రపంచ ఆర్థిక వ్యవస్థ స్థితిగతులు
* కొవిడ్‌19 కారణంగా 202021 ఆర్థిÄక సంవత్సరంలో G-20 దేశాల స్థూలదేశీయోత్పత్తి వృద్ధిరేట్లు కింది విధంగా ఉన్నాయి. 
*  కొవిడ్‌19 నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ వల్ల ప్రపంచ జీడీపీ వృద్ధిరేటు 2020లో 4.4 శాతం తగ్గింది. 2021లో 5.2 శాతం వృద్ధిరేటు నమోదవుతుందని ఐఎంఎఫ్‌ వరల్డ్‌ ఎకనమిక్‌ అవుట్‌లుక్‌ 2020 అక్టోబరులో పేర్కొంది. 2020లో మనదేశ వృద్ధిరేటు 10.3 శాతం తగ్గగా, 2021లో 8.8 వృద్ధి రేటు నమోదవుతుందని ఐఎంఎఫ్‌ ప్రకటించింది. అంటే చైనా వృద్ధిరేటు 8.2% కంటే ఇది ఎక్కువ.
* ప్రపంచ మిశ్రమ కొనుగోలు నిర్వహణ సూచీ (Global Composite Purchasing Managers Index) నవంబరులో 52.5 ఉండగా, అక్టోబరులో 53.3గా నమోదైంది.


ప్రాంతాలు/ దేశాల వృద్ధి రేట్లు - అంచనాలు

 ప్రాంతాలు/ దేశాలు 2019 2020 2021
ప్రపంచం 2.8 4.4 5.2
అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలు 1.7 -5.8 3.9
యూఎస్‌ఏ 2.2 -4.3 3.1
యూరో ఏరియా 1.3 -8.3 5.2
జపాన్ 0.7 -5.3 2.3
అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ ఉన్న దేశాలు 3.7 -3.3 6.0
చైనా 6.1 1.9 8.2
భారత్‌ 4.2 -10.3 8.8

ఆధారం: ఐఎంఎఫ్‌ వరల్డ్‌ ఎకనమిక్‌ అవుట్‌లుక్‌ అక్టోబరు 2020

కొవిడ్‌ 19 ప్రభావం - భారత్‌లో వివిధ రంగాల వృద్ధి ధోరణులు

వ్యవసాయరంగం
* భారత ఆర్థిక సర్వే  2019 20 నివేదిక ప్రకారం నేటికీ మనదేశంలో ప్రాథమికంగా 70 శాతం గ్రామీణ కుటుంబాలు వ్యవసాయంపై ఆధారపడి జీవనాన్ని కొనసాగిస్తున్నాయి. 82 శాతం సన్నకారు రైతులు (ఒకటి నుంచి రెండు హెక్టార్ల మధ్య భూమి ఉన్నవారు), ఉపాంత రైతులు (ఒక హెక్టారులోపు భూమి ఉన్న రైతులు) ఉన్నారు. ఒక హెక్టారు అంటే 2.5 ఎకరాలు. 201920 జీవీఏలో వ్యవసాయ రంగం వాటా 16.5 శాతం. వ్యవసాయ వాణిజ్యంలో మన దేశ మొత్తం వ్యవసాయ ఎగుమతులు 2.15 శాతం. వ్యవసాయరంగంలో ఉపాధి వాటా 49 శాతం ఉండగా, స్థూల అదనపు విలువలో ఈ రంగం వాటా 15 శాతంగా నమోదైంది. 
* 1991 నూతన ఆర్థిక సంస్కరణల తర్వాత 201819లో 2.7 లక్షల కోట్ల వ్యవసాయ రంగ ఎగుమతులు, 1.37 లక్షల కోట్ల దిగుమతులతో భారత్‌ నికర వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతిదారుగా నిలిచింది. వ్యవసాయ ఉత్పత్తులను ప్రధానంగా యూఎస్‌ఏ, సౌదీ అరేబియా, ఇరాన్, నేపాల్, బంగ్లాదేశ్‌లకు ఎగుమతి చేస్తోంది. మనదేశ వ్యవసాయం దాదాపు రుతుపవనాలపై ఆధారపడి ఉంది. రుతుపవనాలు ఆలస్యమైనా లేదా విఫలమైనా ఆ ఏడాది వ్యవసాయం విఫలమవుతుంది. అందుకే ఒకప్పుడు భారతదేశ వ్యవసాయాన్ని ‘‘రుతుపవనాలతో ఆడే జూదంగా’’ వర్ణించారు. 
* దేశంలో ప్రధాన రిజర్వాయర్‌లలో ఉన్న ప్రత్యక్ష నీటి నిల్వలను 202021లో 90 శాతం సాగుకు ఉపయోగిస్తున్నారని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎకనమిక్‌ అఫైర్స్‌ నెలవారీ ఆర్థిక సమీక్ష నవంబరు, 2020 నివేదిక పేర్కొంది. ఇది 201920 కంటే  (97 శాతం) తక్కువ, పదేళ్ల క్రితం కంటే (76 శాతం) ఎక్కువ.  
* 202021 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (ఏప్రిల్‌ - జూన్‌), రెండో త్రైమాసికం (జులై - సెప్టెంబరు)లో 201112 స్థిర ధరల వద్ద స్థూల అదనపు విలువ (జీవీఏ)లో భారత వ్యవసాయరంగం వృద్ధి రేటు 3.4 శాతంగా నమోదైంది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించినప్పటికీ వ్యవసాయరంగంలో ధనాత్మక వృద్ధిరేటు నమోదైంది. 202021 ఆర్థిక సంవత్సరంలో ఖరీఫ్‌ కాలంలో ఆహారధాన్యాల ఉత్పత్తి లక్ష్యం 301 మిలియన్‌ టన్నులు కాగా 201920తో పోలిస్తే అది 1.5 శాతం పెరిగి రికార్డు స్థాయిలో ఉత్పత్తి జరిగింది. 201920 పంటకాలంలో (జులై-జూన్‌) మనదేశంలో ఆహారధాన్యాల ఉత్పత్తి లక్ష్యం 291.1 మిలియన్‌ టన్నులు. 202021లో ఈ అంచనాను 296.65 మిలియన్‌ టన్నులకు పెంచారు. అంటే ఇది 201920 కంటే 4 శాతం అధికం. 2020 నవంబరు 27 నాటికి భారత్‌లో మొత్తం రబీ విస్తీర్ణం 348.24 లక్షల హెక్టార్లు. 201920తో పోలిస్తే ఇది 4.02 శాతం ఎక్కువ. 202021 రబీలో పప్పుధాన్యాల ఉత్పత్తి 43.3 శాతం పెరిగింది. 202021 ఆర్థిక సంవత్సరంలో ఖరీఫ్, రబీకాలంలో వివిధ రకాల పంటలకు కనీస మద్దతు ధరను 2.1 శాతం నుంచి 12.7 శాతం పరిధి కంటే అధికంగా పెంచారు. 202021లో దేశవ్యాప్తంగా ఖరీఫ్‌లో బియ్యం సేకరణ లక్ష్యం 495.37 లక్షల టన్నులు. ఈ ఆర్థిక సంవత్సరంలో 2020, నవంబరు 27 నాటికి ఖరీఫ్‌లో 208.81 లక్షల టన్నుల బియ్యాన్ని సేకరించారు. 


పారిశ్రామిక రంగం
    ఎన్‌ఎస్‌ఓ 2020, ఆగస్టు 31న ప్రకటించిన నివేదిక ప్రకారం 202021 తొలి త్రైమాసికంలో (ఏప్రిల్‌ - జూన్‌) స్థూల అదనపు విలువలో (జీవీఏ) పారిశ్రామిక రంగం వృద్ధిరేటు 38.1 శాతం పతనమైంది. రెండో త్రైమాసికంలో (జులై-సెప్టెంబరు) కాస్త పుంజుకుని 2.1 శాతానికి తగ్గింది. ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో తయారీరంగం కీలకమైంది. మనదేశ స్థూలదేశీయోత్పత్తిలో (జీడీపీ) తయారీ రంగం వాటా 15 శాతం. 201920 భారత ఆర్థిక సర్వే నివేదిక ప్రకారం మన దేశ స్థూల అదనపు విలువ (జీవీఏ)లో తయారీ రంగం వాటా 16.4 శాతం. దేశ కార్మిక శక్తిలో తయారీ రంగం వాటా 12 శాతం. సుమారు 250 పరిశ్రమల మీద ఇది ప్రభావం చూపిస్తుంది. న్యూ ఇండియా సమాచార్‌ నవంబరు  2020 నివేదిక ప్రకారం భారతదేశాన్ని ప్రపంచ తయారీరంగ హబ్‌ ్బబీగీత్శీ గా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం 10 రంగాలకు రూ.1.5 లక్షల కోట్లను ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహకంగా ప్రకటించింది. 
* 202021 తొలి త్రైమాసికం (ఏప్రిల్‌-జూన్‌)లో మనదేశ జీడీపీలో తయారీ రంగం 39.3 శాతం పతనమైంది. ఎన్‌ఎస్‌ఓ నవంబరు 27, 2020న ప్రకటించిన నివేదిక ప్రకారం రెండో త్రైమాసికం (జులై-సెప్టెంబరు)లో తయారీరంగం నెమ్మదిగా పుంజుకుని ధనాత్మక దిశలో 0.6 శాతం వృద్ధి సాధించింది. 202021లో తొలి త్రైమాసికంలో విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా రంగాలు 7 శాతం పతనమయ్యాయి. రెండో త్రైమాసికంలో ధనాత్మక దిశలో 4.4 శాతం సాధించాయి. తొలి త్రైమాసికంలో నిర్మాణరంగం 50.3 శాతం పతనమైంది. తొలి త్రైమాసికంతో పోలిస్తే రెండో త్రైమాసికంలో ఈ రంగం వృద్ధి చెంది (రుణాత్మకంగా) 8.6 శాతం వద్ద నిలిచింది.  
* 202021 లో ‘కాంటాక్ట్‌- సెన్సిటివ్‌ సర్వీసెస్‌ రంగం తొలి త్రైమాసికం (ఏప్రిల్‌-జూన్‌)లో 20.6 శాతం పతనమై, రెండో త్రైమాసికంలో పుంజుకుని 11.4 శాతం తగ్గింది. అయితే 202021 తొలి త్రైమాసికంలో సేవారంగంలో ఉపరంగాలైన వాణిజ్యం, హోటళ్లు, రవాణా, కమ్యూనికేషన్‌ రంగాలు 47 శాతం పతనమయ్యాయి. రెండో త్రైమాసికం (జులై - సెప్టెంబరు) నాటికి నెమ్మదిగా పుంజుకుని 15.6 శాతం తగ్గాయి.
* విత్తం, రియల్‌ ఎస్టేట్‌ సేవా రంగం, ప్రభుత్వ పరిపాలన సేవలు నెమ్మదిగా పతనమయ్యాయి. 2020 21లో తొలి త్రైమాసికం (ఏప్రిల్‌ - జూన్‌)లో విత్తం, రియల్‌ ఎస్టేట్, ఇతర సేవలు 5.3 శాతం పతనమైతే, రెండో త్రైమాసికంలో (జులై - సెప్టెంబరు) 8.1 శాతం పతనమయ్యాయి. 202021 తొలి త్రైమాసికంలో ప్రభుత్వ పరిపాలన, రక్షణ రంగం, ఇతర సేవలు 10.3 శాతం పతనం కాగా, రెండో త్రైమాసికంలో 12.2 శాతం తగ్గాయి.
* కేంద్ర ఆర్థిక వ్యవహారాలశాఖ, ఆర్థిక సమీక్ష నవంబరు 2020 నివేదిక ప్రకారం డిమాండ్‌ను పరిశీలిస్తే మొత్తం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 90 శాతం కంటే ఎక్కువ వినియోగం, పెట్టుబడి నమోదయ్యాయి. 202021 తొలి త్రైమాసికంలో స్థిరపెట్టుబడి వృద్ధి 47.1 శాతం పతనమవగా, రెండో త్రైమాసికంలో 7.3 శాతం పతనమైంది.  
* ప్రయివేట్‌ అంతిమ వినియోగ వ్యయం అంటే ప్రజలు వివిధ రకాల వస్తు, సేవల కోసం చేసే కొనుగోలు లేదా ఖర్చు. 202021లో తొలి త్రైమాసికంలో ఈ వ్యయం 26.7 శాతం తగ్గింది. రెండో త్రైమాసికంలో 11.3 శాతం తగ్గింది. అంటే ప్రయివేట్‌ అంతిమ వినియోగ వ్యయం కొంత మెరుగుపడింది.
*  ప్రభుత్వ అంతిమ వినియోగ వ్యయం అంటే ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం చేసే ఖర్చు. ఇది తొలి త్రైమాసికంలో 16.4 శాతం తగ్గగా, రెండో త్రైమాసికంలో 22.2 శాతం తగ్గింది.
*  202021 తొలి త్రైమాసికంలో సప్లయ్‌ రంగం స్థూల అదనపు విలువ (జీవీఏ) వృద్ధి 22.8 శాతం తగ్గగా, రెండో త్రైమాసికంలో 7 శాతం తగ్గింది. అంటే తయారీ రంగం, విద్యుత్, వ్యవసాయ రంగాలు లాభాల బాటలో వృద్ధి చెందాయి.
* 202021 లో తొలి ఆరునెలల్లో మన దేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) 40 బిలియన్‌ డాలర్లకు చేరాయి. ఇది 10 శాతం అధికం. నవంబరు 2020 నాటికి విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడుల ప్రవాహం (ఎఫ్‌పీఐ) 8.5 బి.డాలర్లుగా నమోదయ్యాయి. 2020 నవంబరు 20 నాటికి విదేశీ మారకద్రవ్య నిల్వలు 575 బి.డాలర్లుగా ఉన్నాయి.

Posted Date : 15-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భారతదేశ ఆర్థిక వ్యవస్థ  

సమాఖ్య వ్యవస్థ (ఫెడరల్‌ వ్యవస్థ)

 భారతదేశ ఆర్థికాభివృద్ధికి కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు కృషి చేస్తాయి.

​​​​​​​ భారత రాజ్యాంగం ప్రకారం ఆయా ప్రభుత్వాలు, సంస్థలు ప్రణాళికాబద్ధంగా వాటి స్థాయుల్లో ఆదాయాన్ని వృద్ధి చేస్తూ, ప్రజల జీవన ప్రమాణ స్థాయిని, ప్రజా సంక్షేమాన్ని పెంపొందిస్తాయి.

 ​​​​​​​నిర్దేశిత సూత్రాల ప్రకారం ఈ మూడు స్థాయుల్లో ప్రభుత్వాలు పన్నులు విధించి ఆదాయాన్ని సమకూర్చుకుంటాయి. దీంతో అవి ప్రజా అవసరాలు తీరుస్తూ, ఆర్థికాభివృద్ధికి పాటుపడతాయి.

మిశ్రమ ఆర్థిక వ్యవస్థ

​​​​​​​ భారత ఆర్థిక వ్యవస్థను మిశ్రమ ఆర్థిక వ్యవస్థగా పేర్కొంటారు. 1948లో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన మొదటి పారిశ్రామిక విధాన తీర్మానం వల్ల మనదేశంలో తొలిసారిగా మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు పునాది పడింది.

​​​​​​​భారత ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వరంగ సంస్థలతో పాటు ప్రైవేట్‌ సంస్థలు కూడా అనేక రకాల వస్తువులను ఉత్పత్తి చేస్తూ, స్థూల జాతీయోత్పత్తి, జాతీయ ఆదాయాలు పెంచడానికి ఆరోగ్యకరమైన పోటీతో పనిచేస్తాయి.

​​​​​​​ప్రజలకు అవసరమైన వస్తువులను ప్రభుత్వ సంస్థలు ఉత్పత్తి చేస్తాయి. ప్రభుత్వరంగ పెట్టుబడులు తగినంతగా లేనప్పుడు, ఆర్థికాభివృద్ధికి అవసరమైన మొత్తాన్ని ప్రైవేట్‌రంగం సమకూరుస్తుంది.

​​​​​​​ప్రభుత్వరంగ సంస్థలు సేవాభావంతో పని చేస్తే, ప్రవేట్‌రంగ సంస్థలు లాభాపేక్షతో ఉంటాయి.

​​​​​​​ప్రైవేట్‌రంగ సంస్థలు ప్రభుత్వ నిబంధనలకు, నియంత్రణకు లోబడి పని చేస్తాయి.

​​​​​​​మన ఆర్థిక వ్యవస్థలో 1991 సరళీకృత విధానం అమలయ్యాక ప్రైవేట్‌రంగ ప్రాధాన్యం పెరిగింది.

వ్యవసాయ ప్రాధాన్య ఆర్థిక వ్యవస్థ 

​​​​​​​ ప్రాచీన కాలం నుంచే భారత ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం ప్రధాన రంగంగా ఉంది. కాలక్రమేణా దీనిపై ఆధారపడి జీవించే వారి సంఖ్య తగ్గుతూ వస్తోంది. అయినప్పటికీ ప్రస్తుతం 54.6% ప్రజలు వ్యవసాయం చేస్తున్నారు. 

​​​​​​​ఈ రంగంపై ఆధారపడే వ్యవసాయ కూలీల శాతం క్రమంగా పెరిగింది. ఇందుకు భిన్నంగా వ్యవసాయదారుల శాతం తగ్గింది. నీటిపారుదల సౌకర్యాలు ఉన్న భూమి శాతం పెరిగింది.

​​​​​​​హరిత విప్లవం వల్ల వ్యవసాయ ఉత్పత్తి, ఉత్పాదకతలు పెరిగాయి.

​​​​​​​రసాయనిక ఎరువుల వాడకం, అధిక దిగుబడినిచ్చే వంగడాల వినియోగం వల్ల గోధుమతో పాటు ఇతర ఆహార ధాన్యాల ఉత్పత్తి ఆరు రెట్లు పెరిగింది.

​​​​​​​పంటల సాంద్రత శాతం కూడా పెరిగింది.

​​​​​​​1999-2000లో జాతీయ వ్యవసాయ బీమా పథకాన్ని ప్రవేశపెట్టారు.

​​​​​​​2000లో జాతీయ వ్యవసాయ విధానాన్ని ప్రకటించారు.

​​​​​​​2004లో డాక్టర్‌ ఎం.ఎస్‌.స్వామినాథన్‌ ఆధ్వర్యంలో రైతుల జాతీయ కమిషన్‌ను ఏర్పాటు చేశారు.

​​​​​​​1995-96లో గ్రామీణ అవస్థాపన అభివృద్ధి నిధిని ఏర్పాటు చేశారు.

​​​​​​​1998లో కిసాన్‌ క్రెడిట్‌ కార్డ్స్‌ పథకాన్ని తెచ్చారు.

​​​​​​​వ్యవసాయానికి అనుబంధ వృత్తులైన పాడిపరిశ్రమ, గొర్రెలు-కోళ్లు-చేపల పెంపకం కార్యక్రమాలను విస్తృతం చేసి, వీటి ఆదాయం పెరిగేలా చేశారు.

ప్రజా పంపిణీ వ్యవస్థ - ఆహారభద్రత (Public Distribution System - Food Security)

​​

​​​​​​​దేశీయంగా ఆహార ధాన్యాల వినియోగం ఎక్కువగా ఉంది. 

​​​​​​​​​​​​​​రైతుల ఆదాయం పెంచి, పేదలకు తక్కువ ధరకు ఆహార ధాన్యాలను సరఫరా చేయడానికి ప్రభుత్వం ‘ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS)ను ఏర్పాటు చేసింది.

​​​​​​​​​​​​​​1985లో గిరిజన ప్రాంతాలకు కూడా దీన్ని విస్తరింపజేశారు.

​​​​​​​​​​​​​​1992లో Revamped Public Distribution System (RPDS)ను తీసుకొచ్చారు.

​​​​​​​​​​​​​​అర్హులైన పేదలందరికీ ఆహార ధాన్యాలు అందించాలనే లక్ష్యంతో 1997లో ప్రభుత్వం లక్ష్యిత ప్రజా పంపిణీ వ్యవస్థ (Targeted Public Distribution System) ను తీసుకొచ్చింది. దీని ద్వారా 320 మిలియన్‌ జనాభాకు నిత్యావసర వస్తువులను సబ్సిడీ ధరలకు పంపిణీ చేశారు.

​​​​​​​​​​​​​​నిరుపేదలు, పేదల జీవన ప్రమాణ స్థాయిని పెంచడానికి, ఆహార భద్రత సాధించడానికి పీడీఎస్‌ వ్యవస్థ ఉపయోగపడుతోంది.

సముచిత స్థాయిలో పారిశ్రామికీకరణ

​​​​​​​ మనదేశంలో రెండో పంచవర్ష ప్రణాళిక కాలం నుంచి పారిశ్రామిక రంగానికి ప్రాధాన్యం కల్పించారు.

​​​​​​​​​​​​​​ 1951-65 మధ్యకాలంలో పారిశ్రామికాభివృద్ధికి పటిష్ఠమైన పునాదులు ఏర్పడటంతో వార్షిక పారిశ్రామికాభివృద్ధి రేటు 8 శాతంగా నమోదైంది.

​​​​​​​​​​​​​​ 1991, జులై 24న నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రవేశపెట్టారు.

​​​​​​​​​​​​​​ 12వ పంచవర్ష ప్రణాళిక (2012-17) లో జాతీయ తయారీ విధానాన్ని ప్రకటించి, వృద్ధి రేటు పెంచే చర్యలు చేపట్టారు.

మూలధన కల్పన విస్తరణ

​​​​​​​ఆర్థిక వ్యవస్థలోని అన్ని రంగాల అభివృద్ధికి మూలధన కల్పన పెంచడం ముఖ్యం.

​​​​​​​అల్పాదాయ వర్గాల ప్రజలు చిన్నమొత్తాలు పొదుపు చేసేలా ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం స్థూల దేశీయోత్పత్తిలో అనేక చర్యలు చేపట్టింది.

వేగంగా వృద్ధి చెందుతున్న సేవా రంగం

​​​​​​​ గత కొన్ని దశాబ్దాలుగా రవాణా, బ్యాంకింగ్, బీమా, ఇ-సేవలు, సమాచార సేవలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఈ రంగాల్లో ఉపాధి కల్పన కూడా అధికంగా ఉంది.

​​​​​​​ 2020-21లో జాతీయాదాయ కూర్పులో సేవారంగం వాటా 54% ఉండగా, ఇది క్రమంగా పెరుగుతోంది.

​​​​​​​​​​​​​​ ‘‘ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగంపై ఆధారపడే వారి శాతం తగ్గుతూ, సేవా రంగంపై ఆధారపడే వారి శాతం పెరగడమే ఆర్థిక వృద్ధికి సూచిక’’ అని అమెరికా ఆర్థికవేత్త ‘సైమన్‌ కుజ్నెట్స్‌’ పేర్కొన్నారు.

పెరుగుతున్న ఎగుమతులు - రాబడి 

​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​ భారతదేశం నుంచి ఇతర దేశాలకు ఎగుమతి చేసే వస్తువుల పరిమాణం పెరగడంతో, విదేశీ మారక ద్రవ్యం కూడా అధికమైంది. 

​​​​​​​​​​​​​​ మొత్తం ఎగుమతుల విలువలో యంత్ర, ఇంజినీరింగ్‌ వస్తువుల విలువ గణనీయంగా పెరిగింది.

​​​​​​​​​​​​​​ వ్యవసాయ ఉత్పత్తులైన సుగంధ ద్రవ్యాలు, వంటనూనెలు, కూరగాయలు, పొగాకు లాంటి వస్తువుల ఎగుమతులు కూడా బాగా పెరిగాయి.

మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ

ప్రపంచ బ్యాంకు 2021, జులై 1న 2020లో ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిగిన దేశాల జాబితాను ప్రకటించిది. వాటిలో మొదటి పది స్థానాల్లో ఉన్నవి:


​​​​​​​

Posted Date : 07-02-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

మానవాభివృద్ధి సూచీ

ప్రపంచంలో అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలు ప్రగతికి కొలమానంగా 1990 నుంచి మానవాభివృద్ధి సూచీని ఉపయోగిస్తున్నాయి. కాలానుగుణంగా సూచిక అంశాలు, లెక్కింపు విధానంలో మార్పులు చెందుతూ ఇది నిత్య జీవన కొలమానంగా కొనసాగుతోంది. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ యూఎన్‌డీపీ 1990 నుంచి ఏటా మానవాభివృద్ధి నివేదికలో ఈ సూచికను తెలుపుతుంది. మానవ శ్రేయస్సును పెంచే అవకాశాలను విస్తృతం చేసే ప్రక్రియనే మానవాభివృద్ధి అంటారు. నిత్య జీవితంలో మనిషి తన ఎదుగుదల కోసం అనేక అంశాలను సేకరిస్తాడు. మానవాభివృద్ధికి తోడ్పడే అనేక అంశాల్లో ఆదాయం ఒకటి అని తీర్మానించారు. ఆర్థికాభివృద్ధి అంతిమంగా మానవాభివృద్ధికి తోడ్పడాలని దేశాల లక్ష్యాల్లో మార్పులు తీసుకొచ్చారు. 


మానవాభివృద్ధి సూచిక - రూపకల్పన 

పాకిస్థాన్‌కు చెందినఆర్థికవేత్త మహబూబ్‌-ఉల్‌-హక్‌ సూచన మేరకు మానవాభివృద్ధికి ప్రధానమైన మూడు అంశాలను  పరిగణనలోకి తీసుకొని 1990లో మొదటిసారి 130 దేశాల గణాంకాల సహాయంతో ర్యాంకులను ప్రకటించారు. ఇది 2018 నాటికి 189 దేశాలకు విస్తరించింది. ప్రస్తుతం నార్వే ప్రథమ స్థానంలో ఉండగా భారత్‌ 130వ స్థానంలో ఉంది.

1) సుదీర్ఘ ఆరోగ్య జీవనకాల సూచీ ( Life expectancy index)
2) విద్యా సూచిక (Education index) (వయోజన అక్షరాస్యత 2/3 + స్థూల నమోదు నిష్పత్తి 1/3)
3) GDP Per capita (ppp US $) తో కొలిచే జీవన ప్రమాణ సూచిక ( Standard of living index). 


 ప్రతి అంశంలోని కనీస, గరిష్ఠ విలువల ఆధారంగా సూచిక విలువను నిర్ణయిస్తారు.

   

ఈ విలువలను కింది సూత్రంలో ఉపయోగించి సూచిక విలువను లెక్క కడతారు. 

ప్రతి అంశం విలువను 0 నుంచి 1 మధ్య తెలుపుతారు.

మానవాభివృద్ధి సూచిక =


మానవాభివృద్ధి సూచిక పైమూడు అంశాల సూచికల విలువల సాధారణ సగటు. ఈ సూచిక అనేక విమర్శలను ఎదుర్కొంది.


విమర్శలు

మానవాభివృద్ధి అనేది విశాలమైన భావన. కేవలం మూడు అంశాలను పరిగణనలోకి తీసుకోవడం సంకుచిత కొలమానం అవుతుంది. వీటి గణాంకాలు వెనుకబడిన దేశాల్లో విశ్వసనీయంగా ఉండవు.
*  విద్యా, ఆరోగ్యం, ఆదాయం మూడింటికీ సమ ప్రాధాన్యం ఇవ్వడం వల్ల ఏ రెండింటిలో మార్పులకైనా ఒకే విలువను పరిగణిస్తున్నారు. దీంతో విజ్ఞానం పెరగకపోయినా ఆదాయం పెరుగుదలతో అభివృద్ధి చెందినట్లు ఈ సూచీ తెలుపుతుంది. 
* తలసరి ఆదాయాలు పెరిగినా అవి కొంత మంది ధనవంతులవే కావచ్చు. ఆదాయ అసమానతలను తెలియజేయలేదు. 
* విజ్ఞానం, ఆరోగ్యం నాణ్యత గురించి పేర్కొనలేదు. ఇవి తలసరి ఆదాయంతో పటిష్ఠ సంబంధాన్ని కలిగి ఉన్నాయి. వీటినే పరిగణనలోకి తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉండదు. బహుళ విభిన్న అంశాలు ఉంటే మంచిదని కొంత మంది అభిప్రాయం.
* సమగ్ర మానవాభివృద్ధికి అవసరమైన శాంతి, స్వేచ్ఛ, పారదర్శకమైన పాలన, పర్యావరణ పరిరక్షణ గురించి చర్చించలేదు. దేశ ప్రగతిలో సాంకేతిక పరిజ్ఞానం పాత్రను మానవాభివృద్ధి సూచీ విస్మరించింది. ఈ విమర్శలను తగ్గించుకోవడానికి మానవాభివృద్ధి సూచిక నిర్మాతలు ఎప్పటికప్పుడు లెక్కించే అంశాలు, విధానాల్లో మార్పులు తీసుకొస్తున్నారు.


లింగ అభివృద్ధి సూచిక (GDI - 1995)

మానవాభివృద్ధి సూచికను స్త్రీలకు ప్రత్యేకంగా వర్తింపజేసి అందులోని మూడు అంశాల్లో సాధారణ అభివృద్ధితో పాటు స్త్రీ - పురుషుల మధ్య పంపిణీలో అసమానతలను గుర్తిస్తున్నారు. హెచ్‌డీఐ, జీడీఐ మధ్య తేడా స్త్రీల వెనుకబాటుతనాన్ని తెలియజేస్తుంది.  


లింగ సాధికారిక సూచిక (1995)

    ఈ సూచిక ద్వారా మూడు అంశాల ఆధారంగా స్త్రీల సాధికారతను కొలవవచ్చు. 

    1) జాతీయ పార్లమెంట్‌లో మహిళలు పొందిన సీట్లు 
    2) ఆర్థిక నిర్ణయ స్థానాల్లో మహిళల శాతం
    3) ఆదాయంలో స్త్రీల వాటా


*  వీటిపై కూడా అనేక విమర్శలు వచ్చాయి. సాంకేతిక అంశాలు ఎక్కువగా ఉండటం వల్ల దీన్ని అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. సరైన గణాంకాలు అందుబాటులో లేవు. వివిధ దేశాలతో పోల్చుకోవడం సముచితంగా లేదు.
*  అభివృద్ధి చెందిన సమాజాలకు మాత్రమే వర్తిస్తాయి. స్థానిక, గ్రామీణ స్థాయి, అసంఘటిత రంగంలోని స్త్రీల ప్రాధాన్యత,  పాత్రను గుర్తించడం లేదు.


మానవ పేదరిక సూచిక(1997)

1997లో విడుదల చేసిన మానవాభివృద్ధి నివేదికలో సరికొత్త కొలమానంగా మానవ పేదరిక సూచికను ప్రవేశపెట్టారు. మానవ జీవన ప్రమాణాన్ని తెలపడంలో మానవాభివృద్ధి సూచికకు సహాయకారిగా ఉంటూ జీవనకాలం, విద్య, జీవన ప్రమాణాల్లో వెనుకబాటుతనాన్ని తెలియజేస్తుంది. అభివృద్ధి చెందుతున్న, చెందిన దేశాలకు వేర్వేరుగా లెక్కించి సామాజిక బహిర్గతను బయటపెడుతుంది.  


సూచికలో మార్పులు

రెండు దశాబ్దాల తర్వాత లోపాలను సవరించుకొని 2010 నుంచి కొన్ని మార్పులతో మానవాభివృద్ధి సూచికను గణిస్తున్నారు.
1) సుదీర్ఘమైన ఆరోగ్య జీవన కాలం లెక్కింపులో మార్పు చేయలేదు. 
2) విజ్ఞాన సూచిక కోసం రెండు కొత్త అంశాలను ఎంచుకున్నారు.

i)  25 ఏళ్లు, ఆపైన వయసు గలవారు చదువుకున్న సగటు సంవత్సరాలు Years off schooling index- EYSI).

    
    గరిష్ఠంగా ఒక వ్యక్తి 15 సంవత్సరాలు నియత విద్యను పొందుతాడని అంచనా.


ii)  పాఠశాలలో 18 ఏళ్ల లోపు పిల్లలు కొనసాగే అంచనా సంవత్సరాలు Expected Years od schooling index -EYSI)

     
     
                                    
3) ఒక దేశానికి విదేశాల్లో ఉన్న తమ పౌరుల ద్వారా వచ్చే ఆదాయాన్ని కలుపుతూ GDP Per capita బదులు GNP Per capita ఉపయోగించారు. వాటి కనీస, గరిష్ఠ విలువల్లో మార్పులు తీసుకొచ్చారు.

    ఈ మూడింటి సాధారణ సగటు బదులు గుణాత్మక సగటును వాడుతున్నారు.


  

అసమానతల సర్దుబాటుతో హెచ్‌డీఐ

 యూఎన్‌డీపీ 2010లో ఈ సూచికను ప్రవేశపెట్టింది. మానవాభివృద్ధి సూచిక దాగి ఉన్న మానవాభివృద్ధిని తెలియజేస్తుంది. అసమానతల సర్దుబాటుతో మానవాభివృద్ధి సూచిక అసమానతలు లేకుండా వాస్తవంగా సాధించిన అభివృద్ధిని తెలుపుతుంది. ఆరోగ్యం, విజ్ఞానం, ఆదాయాల్లో అసమానతల వల్ల మానవాభివృద్ధికి వాటిల్లిన నష్టాన్ని గుర్తిస్తుంది.


లింగ అసమానతల సూచిక 

లింగ అభివృద్ధి సూచిక, లింగ సాధికారిక సూచిక(1995)లోని లోపాలను సవరించి 2010లో వాటి స్థానంలో లింగ అసమానతల సూచికను ప్రవేశపెట్టారు. దీన్ని మూడు ప్రధాన అంశాల విలువల ఆధారంగా లెక్కిస్తారు.


1) పునరుత్పాదక ఆరోగ్యం ( Reproductive health):  దీనిలో మాతా మరణాల నిష్పత్తి ( Maternal Mortality Ration), వయోజనుల సంతానోత్పత్తి రేటు ( Adolescent Fertility Rate - AFR) అనే రెండు అంశాలు ఉంటాయి. 
2) సాధికారత (Empowerment): దీనిలో పార్లమెంట్‌ సీట్లలో వాటా, ఉన్నత విద్యలో అవకాశాలకు సంబంధించిన అంశాలు ఉంటాయి.
3) కార్మిక మార్కెట్‌లో భాగస్వామ్యం ( Labour market participation)

ఈ మూడు అంశాల్లో వెనుకబాటుతనం వల్ల మానవాభివృద్ధికి జరిగిన నష్టాన్ని తెలుసుకోవచ్చు.


బహుళ అంశాల పేదరిక సూచిక 

2010లో మానవ పేదరిక సూచిక స్థానంలో బహుళ అంశాల పేదరిక సూచికను ప్రవేశపెట్టారు.పేదరికాన్ని కేవలం ఆదాయం ఆధారంగా కాకుండా ఒక వ్యక్తి ఆరోగ్యం, విద్య, జీవన ప్రమాణాలకు చెందిన పది అంశాల ఆధారంగా లెక్కిస్తారు. అయితే అన్ని అంశాలకు చెందిన గణాంకాలు లభ్యం కాకపోవడంతో 100 దేశాల్లో మాత్రమే బహుళ అంశాల పేదరిక సూచిక (Multidimensional Poverty Index)ను లెక్కిస్తున్నారు. అనేక మార్పులు జరుగుతున్నప్పటికీ కొన్ని అధ్యయనాలు మానవాభివృద్ధి సూచికను విమర్శిస్తూనే ఉన్నాయి. 

Posted Date : 31-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

సుస్థిరాభివృద్ధి

మాదిరి ప్రశ్నలు

1. అభివృద్ధి రకాల్లో అతి ప్రాచీనమైంది? 

1) ఆర్థికవృద్ధి     2) ఆర్థికాభివృద్ధి       3)  ఆర్థిక సంక్షేమం        4) మానవాభివృద్ధి


2. ఆర్థికాభివృద్ధి అంటే? 

1) స్వల్పకాలంలో ఉత్పత్తిలో మార్పు
2) దీర్ఘకాలంలో ఉత్పత్తిలో మార్పు
3) స్వల్పకాలంలో ఉత్పత్తితోపాటు సామాజిక మార్పు
4) దీర్ఘకాలంలో ఉత్పత్తిలో మార్పుతో పాటు సామాజిక మార్పు


3. ట్రికిల్‌ డౌన్‌ సిద్ధాంతం దేనికి సంబంధించింది? 
1) ధరల తగ్గింపు        2) ఆర్థిక మాంద్యం మదింపు
3) పేదలకు అభివృద్ధి ఫలాలు చేరడం    4) అన్నీ


4. ప్రపంచీకరణలో భాగంగా అమలు చేసిన అభివృద్ధి? 

1) ఆర్థిక సంక్షేమం    2) మానవాభివృద్ధి     3) సుస్థిరాభివృద్ధి    4) ఆర్థిక వృద్ధి 


5. సుస్థిరాభివృద్ధి లక్ష్యం?
1) ప్రాంతాల మధ్య సమానాభివృద్ధి    2) ప్రజల మధ్య సమానాభివృద్ధి
3) దేశాల మధ్య సమానాభివృద్ధి    4) తరాల మధ్య సమానాభివృద్ధి

సమాధానాలు: 1-1;    2-4; 3-3;    4-2;    5-4.

Posted Date : 31-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

సుస్థిరాభివృద్ధి

    అభివృద్ధి అనేది అతి ప్రాచీనమైన మానవ వ్యక్తిగత, సామూహిక కార్యక్రమం. దీనిలో భాగంగా గుహలు విడిచి గృహాలను నిర్మించారు. ఇది కుమ్మరి చక్రంతో మొదలైన మొదటి ఉత్పత్తి. ద్రవ్యం సంపద, సంతోషానికి మారుపేరుగా మారి పర్యావరణాన్ని బాధిస్తున్న విధ్వంసక ప్రక్రియ. ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీ 74వ సమావేశాల్లో భాగంగా 2019 సెప్టెంబరు 24, 25న న్యూయార్క్‌లో జరిగిన వాతావరణ కార్యాచరణ సదస్సులో 16 ఏళ్ల స్వీడన్‌ పర్యావరణ ఉద్యమకారిణి గ్రేటా థెన్‌బర్గ్‌  ‘మా తరాన్ని ముంచేస్తారా’ అని పాలకులను ప్రశ్నించింది. నేటి తరం ఇలా ఎందుకు స్పందిస్తుందో అర్థం కావాలంటే మనిషి అభివృద్ధి భావనా ప్రస్థానాన్ని అవగాహన చేసుకోవాలి. ఆర్థిక, సామాజిక శాస్త్రవేత్తలు మొదట తక్కువ కాలంలో అభివృద్ధి చెందిన దేశాల్లో వాస్తవిక ఆదాయంలోని పెరుగుదలనే ఆర్థిక వృద్ధిగా పరిగణించారు. సాంకేతికతను అందిపుచ్చుకొని సంపదను వస్తువుల రూపంలో సేకరించి, మార్కెటింగ్‌ చేసుకోవడాన్నే ముఖ్యంగా భావించారు. ఈ క్రమంలో పర్యావరణ జాగ్రత్తలను విస్మరించారు. రెండో ప్రపంచ యుద్ధానంతరం రాజకీయంగా స్వతంత్ర దేశంగా అవతరించిన భారత్‌ లాంటి దేశాలను పరిశీలిస్తే వెనుకబడిన దేశాలకు ఆర్థికవృద్ధితోపాటు ఆర్థికాభివృద్ధి కూడా అవసరమని తేల్చారు. దీర్ఘకాలంలో వాస్తవిక ఆదాయంతో పాటు సామాజిక, సంస్థాగత, సాంకేతిక మార్పులను తెలిపే విశాల ప్రక్రియను ఆర్థికాభివృద్ధి అని గుర్తించారు.


    ఆర్థికాభివృద్ధి అనేది ఆర్థికవృద్ధిలా సంపద సృష్టికి ప్రాధాన్యం ఇస్తుంది. అంటే జాతీయాదాయ పెంపుదలే ముఖ్యం. ఇది తక్కువ కాలంలో అధిక వృద్ధిరేటు కోసం ప్రయత్నిస్తుంది. ఉత్పత్తి ఉపాధికి దారితీసి మరెన్నో పరోక్ష ప్రయోజనాలను కల్పిస్తుంది. దీని వల్ల అభివృద్ధి జరుగుతుందనేది సైద్ధాంతిక విశ్వాసం. దీన్నే ట్రికిల్‌ డౌన్‌ థియరీ అంటారు. ఈ సిద్ధాంతం ఆధారంగానే అభివృద్ధి చెందుతున్న దేశాలు అనేక ఆదాయ అభివృద్ధి పనులను చేపట్టాయి. మన దేశంలో 1951-1970 మధ్య కాలంలో సామాజిక అభివృద్ధి, గ్రామాల్లో భూసంస్కరణలు, వ్యవసాయ విస్తరణ, భారీ ప్రాజెక్టులు, పరిశ్రమల నిర్మాణం, హరిత విప్లవాలతో ఆర్థికాభివృద్ధి కోసం అనేక ప్రయత్నాలు జరిగాయి.


ఆర్థిక సంక్షేమం 

    ఆర్థికాభివృద్ధి ఫలాలు కొన్ని సామాజిక వర్గాలు, ప్రాంతాలకే పరిమితమయ్యాయని ఆర్థిక, సామాజిక శాస్త్రవేత్తల పరిశీలనలో తేలింది. పేద ప్రజల స్థితిలో ఎలాంటి మార్పు లేదు. దీన్ని అధిగమించడానికి ఆర్థిక సంక్షేమం ఏర్పడింది. అంటే పేద, బలహీన వర్గాలకు అభివృద్ధి ఫలాలను అందించడానికి ప్రత్యేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. మన దేశంలో 1971 - 1990 కాలంలో అనేక పేదరిక, నిరుద్యోగ నిర్మూలన, గ్రామీణ - పట్టణ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. ఇవి దారిద్య్రరేఖ కింద జీవించేవారి ప్రాథమిక అవసరాలను కొంతమేర తీర్చాయి. కానీ ఆశించిన ఫలితాలు కనిపించలేదు. ఈ పథకాలు ప్రజాస్వామ్య దేశాల్లో క్రమంగా ఓట్ల కోసం పేదలను ఆకర్షించే నినాదాలుగా మారాయి. వీటిలో జరిగే అవినీతి వల్ల ఖజానాపై భారం పెరిగింది.

ఆర్థిక సంక్షేమం = ఆర్థికాభివృద్ధి + ప్రత్యక్ష సంక్షేమ పథకాలు


మానవాభివృద్ధి 
    1991 నుంచి ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ చాలా దేశాల్లో అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఆర్థిక శాస్త్రవేత్తలు పునరాలోచనలో పడ్డారు. మానవుడి కేంద్రీకృతమైన అభివృద్ధి జరగాలని భావించారు. ముఖ్యంగా పేదలు స్వయంగా ఎదిగే వాతావరణాన్ని ప్రభుత్వాలు కల్పించాలి. సంక్షేమ పథకాల పేరుతో వారిని ప్రభుత్వ పథకాల లబ్ధిదారుగా మాత్రమే కాకుండా వారికి స్వేచ్ఛను ఇచ్చి సామర్థ్యాల మేరకు అభివృద్ధిలో చురుకైన భాగస్వాములను చేయాలి. ఇది వారి ఆర్థిక, సామాజిక సాధికారతకు దోహదపడుతుంది. ఇదే నిజమైన మానవాభివృద్ధి. ఆదాయంతోపాటు ప్రజలకు విద్య, ఆరోగ్యాన్ని అందించాలి. ప్రపంచ దేశాలు శ్రామికులను మానవ వనరులుగా గుర్తించి పలు చర్యలు చేపట్టాయి.

మానవాభివృద్ధి = ఆర్థికాభివృద్ధి  +  విద్య + ఆరోగ్యం

    మానవాభివృద్ధి, ఆర్థికాభివృద్ధిలో అభివృద్ధికి ప్రధాన అంశమైన పర్యావరణం గురించి చర్చించలేదు. ప్రకృతి మనిషి కంటే ప్రాచీనమైంది. సృష్టిలోని జీవ, నిర్జీవ పదార్థాలను ఉపయోగించుకుని మానవ నాగరికత రూపుదాల్చింది. ప్రస్తుతం మనుషుల సంఖ్య పెరిగింది. దాంతోపాటు పర్యావరణంలో అనేక మార్పులు వచ్చాయి. అభివృద్ధి పేరుతో సహజ వనరులను అతిగా ఉపయోగించడం వల్ల నేటి తరానికి సహజ సంపద తగ్గిపోయింది. ముఖ్యంగా 18వ శతాబ్దంలో పారిశ్రామిక విప్లవం తర్వాత వనరుల దుర్వినియోగం వేగంగా జరిగి కాలుష్యం అధికమైంది. ఇది రేపటి తరాల భవిష్యత్తును ప్రభావితం చేస్తుందని ప్రపంచ మేధావులు, పర్యావణ వేత్తలు భావించారు. 1970 దశాబ్దంలో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోని సమావేశాల్లో ఈ ఆలోచన ప్రారంభమైంది. 1980లో మొదటిసారిగా ప్రకృతి పరిరక్షణ అంతర్జాతీయ యూనియన్‌ సుస్థిర అభివృద్ధి అనే పదాన్ని ప్రయోగించింది. 1987లో పర్యావరణం, అభివృద్ధిపై ఐక్యరాజ్య సమితి ప్రపంచ కమిషన్‌ విడుదల చేసిన ‘అవర్‌ కామన్‌ ఫ్యూచర్‌’లో ఈ పదానికి శాస్త్రీయ నిర్వచనం ఇచ్చింది. దీన్నే సాధారణంగా బ్రంట్‌లాండ్‌ రిపోర్ట్‌ అని పిలుస్తారు. ‘భవిష్యత్తు తరాల అవసరాలు తీర్చుకునే సామర్థ్యాలను దెబ్బతీయకుండా ప్రస్తుత తరాలు తమ అవసరాలను తీర్చుకునే అభివృద్ధే సుస్థిరాభివృద్ధి’.


*  ప్రజలందరి అవసరాలు ముఖ్యంగా పేదలకు ప్రాధాన్యత. 
*  పర్యావరణంపై సాంకేతికత విధించే పరిమితులు
*  ప్రస్తుత, భవిష్యత్తు తరాల మధ్య సమన్యాయం 
*  అభివృద్ధిని ముందు తరాలకు కొనసాగించడం. అందుకే దీన్ని కొనసాగించగల అభివృద్ధి అని కూడా అంటారు.


    ఈ నివేదిక తర్వాత ప్రపంచవ్యాప్తంగా సుస్థిరాభివృద్ధిపై చర్చలు, అవగాహన సదస్సులు ప్రారంభమయ్యాయి. 1992లో బ్రెజిల్‌లోని రియో-డి-జెనీరోలో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో జరిగిన ధరిత్రీ సదస్సులో అజెండా - 21 పేరుతో 21వ శతాబ్దంలో సుస్థిరాభివృద్ధి సాధనకు సాధ్యాసాధ్యాలు, పరిమితులను చర్చించారు. తర్వాత 20 ఏళ్లకు రియో నగరంలోనే రియో + 20 పేరుతో 2012లో సుస్థిరాబివృద్ధిపై ఐక్యరాజ్య సమితి సదస్సు జరిగింది. ఈ సదస్సులో గత అనుభవాలను సమీక్షించారు. ముఖ్యంగా వాతావరణ మార్పులు - ప్రభావంపై అవగాహన ఏర్పడింది. దీని ఆధారంగానే పారిస్‌ ఒప్పందం (2016) అమల్లోకి వచ్చింది.


భారత్‌ పనితీరు 

    ఐక్యరాజ్య సమితి సుస్థిరాభివృద్ధి సూచిక - 2019 ప్రకారం సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో డెన్మార్క్‌ ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంది. అమెరికా 35, చైనా 39, భారత్‌ 115వ స్థానంలో ఉన్నాయి. నీతి ఆయోగ్‌ విడుదల చేసిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సూచిక - బేస్‌ లైన్‌ రిపోర్ట్, 2018 తొలి నివేదిక ప్రకారం 100 పాయింట్లకు మన దేశం 58 పాయింట్లు సాధించింది. ఈ లక్ష్యాల సాధనలో హిమాచల్‌ ప్రదేశ్, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ వరుసగా మొదటి నాలుగు స్థానాల్లో ఉన్నాయి.
లక్ష్యాలు

    ఐక్యరాజ్య సమితి 2015 సెప్టెంబరులో న్యూయార్క్‌లో జరిగిన పర్యావరణ సదస్సులో 2015 - 30 మధ్యకాలంలో అన్ని దేశాలు సాధించాల్సిన 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను ఆమోదించింది. 

    1) పేదరిక నిర్మూలన  
    2) ఆకలి చావులను పూర్తిగా తగ్గించడం 
    3) మంచి ఆరోగ్యం  
    4) నాణ్యమైన విద్య  
    5) లింగ సమానత్వం 
    6) పరిశుభ్రమైన నీరు, పరిసరాలు 
    7) పునరుజ్జీవన ఇంధన వాడకం 
    8) ఉపాధి, ఆర్థికవృద్ధి  
    9) పరిశ్రమలు, నూతన ఆవిష్కరణలు, అవస్థాపనా సౌకర్యాల కల్పన
    10) అసమానతల తగ్గింపు  
    11) సుస్థిర నగరాలు, సమాజాలు
    12) బాధ్యతాయుతమైన వినియోగం, ఉత్పత్తి 
    13) వాతావరణ మార్పులపై చర్యలు 
    14) నీటిలోని ప్రాణుల సంరక్షణ 
    15) నేలపై జీవుల రక్షణ 
    16) శాంతి, న్యాయం 
    17) ఉమ్మడి లక్ష్యాల కోసం భాగస్వామ్యం. 

    సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను స్థూలంగా 17గా విభజించినప్పటికీ అవి ఒకదానితో మరొకటి అవినాభావ సంబంధాన్ని కలిగి ఉన్నాయి. కాబట్టి అభివృద్ధి సామాజిక, ఆర్థిక, పర్యావరణపరంగా సుస్థిరంగా ఉండాలి. మొదటిసారి ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీ 74వ సమావేశాల్లో భాగంగా 2019 సెప్టెంబరు 24, 25న న్యూయార్క్‌లో వాతావరణ కార్యాచరణ సదస్సును నిర్వహించింది. ఈ సదస్సుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో పాటు పలువురు నేతలు, పర్యావణ శాస్త్రవేత్తలు హాజరయ్యారు. ఇప్పటివరకు సుస్థిరాభివృద్ధి కోసం చేపట్టిన చర్యలను సమీక్షించారు. సుస్థిరాభివృద్ధి అంటే అసలైన అర్థం నాలుగు కాలాల పాటు కాదు నాలుగు తరాల పాటు అందరినీ సంతోషపెట్టేది. 

P - People;  P - Planet;  P - Prosperity;  P - Partnership;  P - Peace  అనే 5 P'sను సాధించడానికి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఉపయోగపడతాయి. 2000-2015 మధ్య ఎనిమిది సహస్రాబ్ది లక్ష్యాలు ఉన్నాయి.
ఒక చేపను ఒకరికి ఇస్తే ఒక రోజు మాత్రమే ఆకలి తీరుతుంది. అదే అతడికి చేపలు పట్టడం నేర్పిస్తే జీవితాంతం ఆకలి తీర్చుకుంటాడు. -  ప్రముఖ తత్వవేత్త - కన్ఫ్యూసియస్‌

 

సుస్థిరాభివృద్ధి - ప్రపంచ దేశాల కృషి
* ‘మానవ పర్యావరణం’ అనే అంశంపై ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం (UNEP) 1972 జూన్‌ 5న స్టాక్‌ హోంలో ఓ సమావేశాన్ని నిర్వహించింది. ప్రపంచవ్యాప్తంగా ఏటా ఆ తేదీని ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అప్పటి నుంచే పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం పెరిగింది. 
* 1980లో ప్రపంచ సంరక్షణ వ్యూహం అనే పరిశోధనా పత్రంలో మొదటిసారి ‘కొనసాగించాల్సిన అభివృద్ధి’ అనే పదాన్ని వాడారు.
* 1987లో సుస్థిరాభివృద్ధి సాధన కోసం ఐక్యరాజ్యసమితి అప్పటి నార్వే ప్రధాని హార్లెం బ్రంట్‌లాండ్‌ నేతృత్వంలో World Commission on Environment and Development ను ఏర్పాటు చేసింది.
* సుస్థిరతపై అంతర్జాతీయంగా సహకారాన్ని పెంపొందించడానికి 1992లో ప్రపంచ దేశాధినేతలు బ్రెజిల్‌లోని రియోలో సమావేశమయ్యారు. దీన్నే UN Conference on Environment and Development, ధరిత్రీ సదస్సు, రియో సమ్మిట్‌గా పిలుస్తారు.
* రియో సదస్సు జరిగి 2012కి 20 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ప్రపంచ దేశాధినేతలు రియోలో సమావేశమై సుస్థిరాభివృద్ధి లక్ష్యాల గురించి చర్చించారు. ఇందులో చర్చకు వచ్చిన అంశాలకు 2015లో ఐక్యరాజ్యసమితి సర్వ సభ్య సమావేశంలో ఆమోదం తెలిపారు. వీటినే అజెండా 2030 అని పిలుస్తారు. ఇందులో మొత్తం 17 లక్ష్యాలు, 169 ఉపలక్ష్యాలు ఉన్నాయి. 2016 జనవరి నుంచి ప్రారంభించి 2030 డిసెంబరు నాటికి వీటిని సాధించాలని తీర్మానించారు.


లక్ష్యాలు  
1. పేదరికాన్ని నిర్మూలించడం: 2030 నాటికి పేదరికాన్ని సగానికి తగ్గించాలి. దీనికోసం సాంఘిక భద్రతా పథకాలు అమలుచేయాలి. ఆర్థిక వనరులపై అందరికీ సమాన హక్కులు ఉండేలా చూడాలి.


2. ఆకలిని నిర్మూలించడం: సురక్షితమైన పౌష్ఠికాహారాన్ని అందరికీ తగినంతగా అందుబాటులో ఉంచి, 2030 నాటికి ఆకలిని నిర్మూలించాలి.
* అయిదేళ్లలోపు పిల్లల్లో వయసుకు తగిన ఎత్తు (Stunting), ఎత్తుకు తగిన బరువు (Wasting) లేకపోవడం లాంటి అంశాల్లో అంతర్జాతీయ అంగీకార లక్ష్యాలను చేరుకోవాలి. 2025 నాటికి ఎత్తు తక్కువతో బాధ పడుతున్న పిల్లల సంఖ్యను 40 శాతానికి తగ్గించాలని, శారీరక బరువు సరిగాలేని వారి సంఖ్యను 5 శాతంలోపునకు తీసుకురావాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.
* 2030 నాటికి వ్యవసాయ ఉత్పాదకతను, చిన్న-కౌలు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలి.
* 2001 నవంబరులో ఖతార్‌లోని దోహాలో ప్రపంచ వాణిజ్య సంస్థ ్బజూగివ్శీ ఓ సమావేశాన్ని నిర్వహించింది. దీన్నే దోహా రౌండ్‌గా పేర్కొంటారు. ఇందులో వ్యవసాయ ఎగుమతుల సబ్సిడీలను తొలగించాలని; ప్రపంచ వ్యవసాయ మార్కెట్‌లో ఉన్న వాణిజ్యపరమైన షరతులు, ఆటంకాలను ఎత్తివేయాలని తీర్మానించారు.

 

3. అందరికీ మంచి ఆరోగ్యాన్ని అందించాలి
* 2030 నాటికి  ప్రతి లక్ష జననాలకు మాతృత్వ మరణాల రేటును 70కి తగ్గించాలి.
* 2030 నాటికి  ప్రతి 1000 సజీవ జననాలకు Neonatal Mortality Rate (0 - 28 రోజులు)ను 12కి తగ్గించాలి.
* అయిదేళ్లలోపు వయసున్న పిల్లల మరణ రేటును ్బగీ5లీళ్శి ప్రతీ 1000 సజీవ జననాలకు 25కి తగ్గించాలి.
* 2030 కల్లా ఎయిడ్స్, టీబీ, మలేరియా లాంటి వ్యాధులను పూర్తిగా నిర్మూలించాలి. 
* 2030 నాటికి అంటువ్యాధులు కాని రోగాలను 1/3వ వంతు తగ్గించాలి. ప్రపంచవ్యాప్తంగా ఈ జబ్బుల్లో గుండె సంబంధ వ్యాధులు ప్రథమస్థానంలో ఉండగా, క్యాన్సర్‌ రెండో స్థానంలో ఉంది.
* ఆల్కహాల్, డ్రగ్స్‌ వినియోగం, రోడ్డు ప్రమాదాలు, పర్యావరణ కాలుష్యం, పొగాకు మొదలైన వాటి వల్ల సంభవించే మరణాలను 2030 నాటికి   పెద్ద మొత్తంలో తగ్గించాలి.
* ప్రజారోగ్యానికి సంబంధించి దోహా డిక్లరేషన్‌లోని TRIPS (Trade Related Aspects Of Intellectual Property Agreements)  ఒప్పందం ప్రకారం అభివృద్ధి చెందుతున్న దేశాలకు తక్కువ ధరలకే నాణ్యమైన-సురక్షితమైన మందులు, టీకాలను అందించాలి.


4. నాణ్యమైన విద్య
* 2030 నాటికి బాలబాలికలందరికీ నాణ్యమైన పూర్వ ప్రాథమిక, ప్రాథమిక, సెకండరీ విద్యను ఉచితంగా అందించాలి. ప్రమాణాలతో కూడిన సాంకేతిక, వృత్తి, టెరిటరీ విద్యలను అందుబాటు ధరల్లో ఉంచాలి. టెరిటరీ విద్య సెకండరీ విద్య పూర్తయ్యాక 3వ స్థాయిలో ఉంటుంది. ఇది సాధారణంగా కళాశాల విద్య.
* లింగ సంబంధ వ్యత్యాసాలను అన్ని స్థాయుల్లో నిర్మూలించాలి. 2030 నాటికి అర్హత కలిగిన ఉపాధ్యాయుల సంఖ్యను గణనీయంగా పెంచాలి.


5. లింగసమానత్వం, మహిళా సాధికారిత సాధించడం:
మహిళల పట్ల ఉన్న అన్ని రకాల వివక్షను రూపుమాపాలి. ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థల్లో వీరిపై జరిగే హింసను అరికట్టాలి. మహిళల అక్రమ రవాణా, లైంగిక దాడులు మొదలైన వాటిని నిర్మూలించాలి. బాల్య వివాహాలు, బలవంతపు పెళ్లిళ్లను నిరోధించాలి.
* ఆర్థిక, రాజకీయ, ప్రజా జీవితంలోని అన్ని స్థాయుల్లో మహిళా భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలి. నిర్ణయాలు తీసుకునే చోట పురుషులతో సమానంగా వారికీ అవకాశాలు కల్పించాలి.
* ఆర్థిక వనరులు, భూయాజమాన్యం, సహజ వనరులు మొదలైన వాటిపై మహిళలకు సమాన హక్కులు కల్పించేలా సంస్కరణలు తేవాలి.

 

6. పరిశుభ్రమైన నీరు, పారిశుద్ధ్యం: 2030 నాటికి ప్రజలందరికీ సురక్షితమైన తాగునీటిని అందుబాటు ధరకే పంపిణీచేయాలి. బహిరంగ మలమూత్ర విసర్జనను అరికట్టాలి.
 

7. అందుబాటు ధరల్లో శుద్ధ ఇంధనాలు అందించడం: 2030 నాటికి నమ్మకమైన శక్తి సేవలను అందరికీ అందుబాటు ధరల్లో అందించాలి. ప్రపంచ శక్తి వనరుల్లో పునర్వినియోగ శక్తి వనరుల వాటాను గణనీయంగా పెంచాలి.

8. ఆర్థికవృద్ధి, నాణ్యమైన ఉపాధిని సాధించడం: అల్పాభివృద్ధి దేశాల్లో కనీసం 7% జీడీపీ వృద్ధిని సుస్థిరంగా సాధించాలి.
* 2030 నాటికి ఉపాధి, విద్య లేదా శిక్షణలో లేని యువత వాటాను గణనీయంగా తగ్గించాలి. 
* 2025 నాటికి నిర్బంధ శ్రామికత్వం, బాలకార్మిక వ్యవస్థ, బానిసత్వం, మానవ అక్రమ రవాణాను పూర్తిగా నిర్మూలించాలి.
* 2030 నాటికి అందరికీ ఉత్పాదక ఉపాధిని అందించాలి. సమాన విలువ ఉన్న పనికి సమాన వేతనాన్ని అందించాలి.
* కార్మికుల హక్కులను రక్షించాలి. పనివాళ్లకు ముఖ్యంగా వలస కార్మికులకు సురక్షితమైన పని వాతావరణాన్ని కల్పించాలి.
* యువత ఉపాధి కోసం 2020 నాటికి  ప్రపంచ వ్యూహాన్ని అభివృద్ధిచేసి అమల్లోకి తేవాలి.


9. పరిశ్రమలు, మౌలిక వసతులు, ఆవిష్కరణలు: మానవ సంక్షేమం, ఆర్థికాభివృద్ధి పెంపొందించేందుకు నాణ్యమైన, నమ్మకమైన, సుస్థిర మౌలికవసతులను అభివృద్ధి చేయాలి.
* 2030 నాటికి  ఆదాయం, ఉపాధిలో పరిశ్రమల వాటాను గణనీయంగా పెంచాలి. దీనికోసం సుస్థిర, సమ్మిళిత పారిశ్రామికీకరణను ప్రోత్సహించాలి. అల్పాభివృద్ధి దేశాల్లో పరిశ్రమల వాటాను రెట్టింపు చేయాలి.
* అభివృద్ధి చెందుతున్న దేశాల్లో చిన్నతరహా పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందించాలి.
* శాస్త్రీయ పరిశోధనలు ప్రోత్సహించాలి. 2030 నాటికి ప్రతి మిలియన్‌ జనాభాలో పరిశోధన రంగంలో పనిచేస్తున్నవారి సంఖ్యను గణనీయంగా పెంచాలి.

 

10. దేశం లోపల, వివిధ దేశాల మధ్య ఉన్న ఆర్థిక అసమానతలను తగ్గించాలి: 2030 నాటికి జనాభాలో అట్టడుగున ఉన్న 40% మంది ప్రజల ఆదాయ వృద్ధి రేటు జాతీయ సగటు కంటే ఎక్కువ ఉండేలా చర్యలు చేపట్టాలి.
* వయసు, లింగ, అంగవైకల్యం, జాతి, పుట్టుక, మతం మొదలైనవాటితో సంబంధం లేకుండా అందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ సాధికారత కల్పించాలి.
* అసమానతలను ప్రోత్సహించే విధానాలు, చట్టాలను పూర్తిగా తొలగించాలి.
* అంతర్జాతీయ విత్త, ఆర్థిక వ్యవస్థల్లో అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రాతినిధ్యం పెంచాలి.
* అల్పాభివృద్ధి దేశాలకు అభివృద్ధి సాయం, విత్త వనరుల ప్రవాహాన్ని ప్రోత్సహించాలి. ఇందులో భాగంగానే ఎఫ్‌డీఐలను రాబట్టాలి.

 

11. నగరాలను నివాసయోగ్యంగా, సురక్షితంగా, సమ్మిళితంగా తయారుచేయడం: 2030 నాటికి అందరికీ సురక్షితమైన ఇళ్లను తక్కువ ధరలకు అందించాలి.
* ప్రజారవాణాను పెంచాలి.
* విపత్తుల వల్ల సంభవించే ప్రాణ, ఆస్తి నష్టాన్ని గణనీయంగా తగ్గించాలి.
* 2015, మార్చి 8న జపాన్‌లోని సెంధాయ్‌లో ఐక్యరాజ్యసమితి మూడో డిజాస్టర్‌ రిస్క్‌ రిడక్షన్‌ సమావేశం జరిగింది. దీనికి ‘సెంథాయ్‌ ఫ్రేమ్‌ వర్క్‌ ఫర్‌ డిజాస్టర్‌ రిస్క్‌ రిడక్షన్‌ 2015-30’ అని పేరుపెట్టారు. ఇందులో కొన్ని నిబంధనలను పేర్కొన్నారు. వీటిప్రకారం విపత్తులను తట్టుకునేలా సమగ్ర విధానాలను అమలుచేసే నగరాల సంఖ్యను పెంచాని తీర్మానించారు.
* పట్టణాల్లో వాయుకాలుష్యం, ఘనవ్యర్థాల నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి.

 

12. సుస్థిర వినియోగం, ఉత్పత్తి విధానాల రూపకల్పన: ఉత్పత్తి, సరఫరా స్థాయిలో ఆహార వృథాను అరికట్టాలి. వినియోగదారు స్థాయిలో తలసరి ఆహార వృథాను సగానికి తగ్గించాలి.
* 2030 నాటికి  నివారణ, RRR (Reduce, Reuse and Recycle) ద్వారా వ్యర్థాల సృష్టిని తగ్గించాలి.
* అభివృద్ధి చెందుతున్న దేశాలకు వినియోగం, ఉత్పత్తిలో సుస్థిర పద్ధతులను అవలంబించేందుకు తగిన సాంకేతిక సామర్థ్యాన్ని పెంపొందించుకునేలా మద్దతు ఇవ్వాలి.
* వృథా వినియోగాన్ని ప్రోత్సహిస్తున్న ఇంధన సబ్సిడీలను హేతుబద్ధీకరించాలి.

 

13. పర్యావరణ మార్పు, దాని ప్రభావంపై సత్వర చర్యలు: సహజ విపత్తులు, శీతోష్ణస్థితి సంబంధ విపత్తులను తట్టుకోగలిగే సామర్థ్యాన్ని అందరిలో బలోపేతం చేయాలి.
* దేశ ప్రణాళిక, విధానాలు, వ్యూహాల్లో శీతోష్ణస్థితి మార్పులను సమీకృతం చేయాలి.
* వీటికి సంబంధించిన (ముందస్తు హెచ్చరిక, మార్పులు తగ్గించగలగడం, వాటిని తట్టుకోగలగడం) విద్య, చైతన్య కార్యక్రమాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలి.
* శీతోష్ణస్థితి మార్పుల ప్రభావాలను తట్టుకునేలా UNFCCC (United Nations Framework Convention on Climate Change) కింద అభివృద్ధి చెందిన దేశాలు సంవత్సరానికి 100 బిలియన్‌ డాలర్లను అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇచ్చేందుకు అంగీకరించాయి. వీటిని సాధ్యమైనంత త్వరగా అమలుచేయాలి.

 

14. సముద్రాలు, జలవనరుల సంరక్షణ: అన్నిరకాల సముద్ర కాలుష్యాలను తగ్గించాలి. ముఖ్యంగా భూసంబంధ కార్యకలాపాల ద్వారా జరిగే కాలుష్యాన్ని నివారించాలి.
* సముద్రాల ఆమ్లీకరణను తగ్గించాలి. దాని ప్రభావాలను దీటుగా ఎదుర్కోవాలి.
* అధికంగా చేపలు పట్టడానికి కారణమైన మత్స్యరంగ సబ్సిడీలను పూర్తిగా నిషేధించాలి.

 

15. అడవులు, ఇతర ఆవరణ వ్యవస్థలను పరిరక్షించడం, భూక్షీణతను, జీవవైవిధ్య నష్టాన్ని అరికట్టడం
అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారం అడవులు, పర్వతాలు, చిత్తడి నేలలను సంరక్షించాలి.
* అన్నిరకాల అడవుల్లో సుస్థిర యాజమాన్య పద్ధతులను అవలంబించాలి. అడవులు నరకడాన్ని అరికట్టాలి. క్షీణతకు గురైన అడవులను పునరుద్ధరించాలి. అన్ని ప్రాంతాల్లో మొక్కలు నాటే కార్యక్రమాలు చేపట్టాలి.
* కరవులు, వరదల వల్ల క్షీణతకు గురయ్యే మృత్తికను పునరుద్ధరించాలి.
* పర్వత ఆవరణ వ్యవస్థను సంరక్షిస్తూ జీవవైవిధ్యాన్ని కాపాడాలి. వీటి ఉత్పత్తులు సుస్థిరాభివృద్ధికి దోహదపడతాయి. రక్షిత జీవజాతుల అక్రమరవాణా, వేటను అడ్డుకోవాలి.

 

16. అందరికీ శాంతి, న్యాయాన్ని అందించాలి, దీనికోసం బలమైన వ్యవస్థలను ఏర్పాటుచేయాలి
అన్నిరకాల హింసలను, వాటివల్ల జరిగే మరణాలను గణనీయంగా తగ్గించాలి.
* జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అందరికీ సమాన న్యాయాన్ని అందించాలి.
* అవినీతి, లంచగొండితనాన్ని అరికట్టాలి.
* గ్లోబల్‌ గవర్నెన్స్‌కు సంబంధించిన సంస్థల్లో అభివృద్ధి చెందుతున్న దేశాల భాగస్వామ్యాన్ని బలోపేతం చేయాలి.
* 2030 నాటికి అందరికీ చట్టబద్ధమైన గుర్తింపు లభించాలి. 
* తీవ్రవాదం, నేరాలు, హింసలు మొదలైనవాటిని అడ్డుకునే జాతీయస్థాయి సంస్థలను బలోపేతం చేయాలి.

 

17. సార్వత్రిక భాగస్వామ్యాన్ని పెంపొందించడం: దేశీయ వనరుల సేకరణను బలోపేతం చేయాలి. అభివృద్ధి చెందిన దేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాలకు పర్యావరణ అనుకూల సాంకేతికతను తక్కువ ధరలకే అందించాలి.

Posted Date : 09-06-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

మానవాభివృద్ధిలో భారతదేశం

    ప్రపంచ దేశాల ఉమ్మడి లక్ష్యం మానవాభివృద్ధి. యూఎన్‌డీపీ 1990 నుంచి మానవాభివృద్ధి నివేదికను రూపొందిస్తుంది. ప్రపంచీకరణలో భాగంగా పేదల సాధికారత, సుస్థిర అభివృద్ధికి అనేక ప్రయత్నాలు జరిగాయి. భారతదేశం కూడా చురుకైన పాత్ర పోషిస్తోంది. పాకిస్థాన్‌ శాస్త్రవేత్త మహబూబ్‌ ఉల్‌హక్‌ సమగ్రమైన అభివృద్ధికి కొలమానంగా మానవాభివృద్ధిని సూచించారు. మన దేశ ఆర్థికవేత్త, నోబెల్‌ బహుమతి గ్రహీత అమర్త్యసేన్‌ మానవాభివృద్ధి సూచికను సమర్థించి అభివృద్ధి పరిచారు.
    మొదటి మానవాభివృద్ధి నివేదికలో  తొలిమాటగా హక్‌ ‘ప్రజలే ఒక దేశానికి నిజమైన సంపద’ అని పేర్కొన్నారు. ప్రజలు సుదీర్ఘకాలం పాటు ఆరోగ్యంగా జీవించడానికి కావాల్సిన పరిస్థితులను కల్పించడమే పాలన ప్రథమ ధ్యేయం కావాలని పిలుపునిచ్చారు. మానవాభివృద్ధి మనుషుల సుసంపన్న మనుగడను కోరుకుంటుంది. ఇది ప్రజల ఎదుగుదలకు అవకాశాలు కల్పించి వాటి ఎంపికలో తగిన స్వేచ్ఛను అందిస్తుంది. మానవాభివృద్ధి సూచిక అమల్లోకి వచ్చినప్పటి నుంచి ప్రపంచ పాలకుల ఆలోచన, ప్రాధాన్యాల అమలుతీరులో మార్పు మొదలైంది. ప్రపంచ దేశాలను పరిశీలించి వాటికి ర్యాంకులు ప్రకటించడం వల్ల దేశాల మధ్య పోటీ ఏర్పడింది.   


*   ప్రస్తుతం యూఎన్‌డీపీ మూడు అంశాల ఆధారంగా ప్రపంచ మానవాభివృద్ధి సూచికను లెక్కిస్తుంది.  

    1) సుదీర్ఘ ఆరోగ్య జీవనకాల సూచిక 

  2) విజ్ఞాన సూచిక (చదువుకునే అంచనా సంవత్సరాలు ్ఘ చదువులో పిల్లలు కొనసాగే సగటు సంవత్సరాలు) 

    3) GNP Per capita (ppp US $)  


ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం   

1990 నుంచి ఇప్పటి వరకు యూఎన్‌డీపీ ఏటా మానవాభివృద్ధి నివేదికను రూపొందిస్తుంది. ఈ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని న్యూయార్క్‌లో 1965, నవంబరు 22న ఏర్పాటు చేశారు. ఇది ఐక్యరాజ్య సమితిలోని సభ్య దేశాలందించే స్వచ్ఛంద విరాళాలతో పనిచేస్తుంది. దాదాపు 180 దేశాల ప్రభుత్వాలతో కలిసి స్థానిక అభివృద్ధి సమస్యల గురించి అవగాహన కల్పిస్తుంది. ప్రభుత్వాల సామర్థ్యాలను పెంచి పరిష్కార మార్గాలను సూచిస్తుంది. ప్రపంచ మానవాభివృద్ధి నివేదికతో పాటు స్థానిక, ప్రాంతీయ, జాతీయ నివేదికలను తయారుచేసి అందజేస్తుంది. 


మన దేశ ప్రయత్నాలు 

యూఎన్‌డీపీ భారతదేశంలో మానవాభివృద్ధికి సంబంధించిన ప్రతి అంశంలో ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తుంది. ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లో 42 ప్రాజెక్టులు అమలు చేస్తూ సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో భాగస్వామిగా ఉంది. వీటిలో శక్తి, పర్యావరణం (25); పేదరిక నిర్మూలన (9), ప్రజాస్వామ్య పాలన (7), ప్రకృతి వైపరీత్యాలకు (1) సంబంధించిన ప్రాజెక్టులు అమల్లో ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల్లో అయిదు నవ్యాంధ్ర ప్రదేశ్‌లో ఉన్నాయి. ప్రభుత్వాలు 1947 నుంచి వివిధ పథకాలు, కార్యక్రమాల ద్వారా ప్రజల ఆదాయవృద్ధి, జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ప్రయత్నిస్తున్నాయి. 


భారతదేశ ప్రగతి

ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం 189 దేశాలను పరిశీలించి ఆయా దేశాల ప్రగతి ఆధారంగా ర్యాంకులను ప్రకటిస్తుంది. 2018 నివేదిక ప్రకారం నార్వే మొదటి స్థానం, నైజర్‌ 189వ స్థానంలో ఉన్నాయి. భారత్‌ 2017లో 131వ స్థానంలో ఉండగా 2018లో 130వ స్థానాన్ని పొందింది. 1990 నాటి మొదటి నివేదిక ప్రకారం భారత్‌ 114వ స్థానంలో ఉంది. యూఎన్‌డీపీ మానవాభివృద్ధి సూచిక విలువను 0-1 మధ్య లెక్కించి ప్రపంచ దేశాలను నాలుగు రకాలుగా వర్గీకరిస్తుంది.  


1) అత్యధిక మానవాభివృద్ధి దేశాలు: 0.80  1 

నార్వే, స్విట్జర్లాండ్, సింగపూర్, అమెరికా, జపాన్, సౌదీ అరేబియా  

2) అధిక మానవాభివృద్ధి దేశాలు: 0.7  0.8   

చైనా, బ్రెజిల్, ఇరాన్, మెక్సికో, థాయ్‌లాండ్, శ్రీలంక

3) మధ్య స్థాయి మానవాభివృద్ధి దేశాలు: 0.55  0.7 

బంగ్లాదేశ్, ఇండియా, భూటాన్, మయన్మార్, నేపాల్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా

4)  తక్కువ మానవాభివృద్ధి దేశాలు: 0.55 కంటే తక్కువ  

 అఫ్గానిస్థాన్, బురుండి, నైజీరియా, టాంజానియా, ఉగాండా  

  1990లో భారతదేశ మానవాభివృద్ధి సూచిక విలువ 0.427 నుంచి 2000 సంవత్సరం నాటికి 0.493 కు పెరిగింది. అంటే తక్కువ మానవాభివృద్ధి దేశంగా దాదాపు దశాబ్ద కాలం కొనసాగింది. ఈ విలువ 2012లో 0.600 కు, 2018లో 0.640 కు వృద్ధి చెంది మధ్య స్థాయి మానవాభివృద్ధి దేశాల జాబితాలో చేరింది. చైనా, శ్రీలంక మినహా ఇతర పొరుగు దేశాలు ర్యాంకుల్లో తేడా ఉన్నప్పటికీ మధ్య స్థాయి జాబితాలోనే ఉన్నాయి. 1990 నుంచి మన దేశ సూచిక విలువ దాదాపు 50% పెరగడాన్ని పేదరికంపై విజయంగా పేర్కొనవచ్చు. 1990  2017 మధ్య మన దేశ తలసరి ఆదాయంలో అత్యధికంగా 266.6% వృద్ధి నమోదైంది. 1990 కంటే ప్రస్తుత సగటు జీవనకాలం 11 సంవత్సరాలు, సగటు పాఠశాలలో గడిపే కాలం 4.7 సంవత్సరాలు పెరిగింది.  
      మానవాభివృద్ధి సూచిక ప్రకారం అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే మన దేశం అన్నింట్లో వెనుకబడి ఉంది. ఆర్థిక అసమానతలు అధికమవడం వల్ల 26.8% మానవాభివృద్ధిని కోల్పోయాం. శ్రామిక మార్కెట్‌లో మహిళల భాగస్వామ్యం కేవలం 27.2% ఉండగా పురుషులది 78.8%. అంటే లింగ సమానత్వంలో మన దేశం ఇంకా వెనుకబడి ఉంది. విద్య, ఆరోగ్య సేవల్లో నాణ్యత లోపించింది. మానవాభివృద్ధిలో రాష్ట్రాల మధ్య అసమానతలు ఉన్నాయి. కేరళ అగ్రస్థానంలో, బిహార్‌ చివరి స్థానంలో ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ 27వ స్థానంలో ఉండి మధ్య స్థాయి మానవాభివృద్ధి రాష్ట్రంగా కొనసాగుతుంది. 

Posted Date : 31-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

మానవాభివృద్ధిలో భారతదేశం

మాదిరి ప్రశ్నలు

1. ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం (యూఎన్‌డీపీ) ప్రకారం మానవాభివృద్ధి సూచీలో భారతదేశం ఏ స్థానంలో ఉంది?

 1) 130        2) 131         3) 136         4) 140


2.  మానవాభివృద్ధి సూచీలో భారతదేశంలోని ఏ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది?

 1) బిహార్‌        2) కేరళ       3) తమిళనాడు        4) ఆంధ్రప్రదేశ్‌


3. మానవాభివృద్ధి సూచీలో ఆంధ్రప్రదేశ్‌ ఏ స్థానంలో ఉంది?

1) 27         2) 28          3) 29           4) 30


4. యూఎన్‌డీపీ ప్రపంచ మానవాభివృద్ధి సూచికను ఏ అంశాల ఆధారంగా లెక్కిస్తుంది?

ఎ) సుదీర్ఘ ఆరోగ్య జీవనకాల సూచిక 
బి) విజ్ఞాన సూచిక (చదువుకునే అంచనా సంవత్సరాలు ్ఘ చదువులో పిల్లలు కొనసాగే సగటు సంవత్సరాలు)
సి) GNP per capita 

 1) ఎ, బి         2) బి, సి        3) సి, ఎ         4) అన్నీ 


5. యూఎన్‌డీపీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? (దీన్ని 1965 నవంబరు 22న స్థాపించారు)

 1) న్యూయార్క్‌        2) పారిస్‌        3) జెనీవా         4) దిహేగ్‌

సమాధానాలు: 1-1;   2-2;   3-1;   4-4;   5-1. 

Posted Date : 31-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ఆర్థిక వ్యవస్థ, ప్రణాళికలు

మాదిరి ప్రశ్నలు

1. 2018 నాటికి ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థికవ్యవస్థల్లో భారతదేశ స్థానం?

1) 3          2) 2            3) 4            4) 6                                            


2. అభివృద్ధి చెందుతున్న దేశం అంటే?

1) వెనుకబడిన దేశం    2) అభివృద్ధి చెందిన దేశం

3) వర్ధమాన దేశం        4) అభివృద్ధి తిరోగమన దేశం       


3. ప్రపంచ దేశాలను వర్గీకరించడానికి ప్రపంచ బ్యాంక్‌ ఉపయోగించిన ప్రమాణం? 

1) GNP per capita          2) GDP per capita

3) NNP per capita           4) GVA per capita         


4. కిందివాటిలో అభివృద్ధి చెందుతున్న దేశాల లక్షణాల్లో సరికానిది? 

ఎ) తక్కువ తలసరి ఆదాయం      బి) తక్కువ పారిశ్రామికాభివృద్ధి

సి) తక్కువ పొదుపు          డి) తక్కువ ఎగుమతులు

1) ఎ, బి      2) ఎ, సి      3) సి, డి      4) అన్నీ               


5. రంగరాజన్‌ కమిటీ ప్రకారం 2011-12 నాటికి భారత్‌లో ఎంత శాతం మంది పేదరిక గీత కింద జీవిస్తున్నారు?

1) 29.5%    2) 27.5%     3) 30.5%    4) 39.5%


6. మన దేశంలో..... 

1) జనసంఖ్య, మానవ వనరులు ఎక్కువ 
2) జనసంఖ్య, మానవ వనరులు తక్కువ 
3) జనసంఖ్య ఎక్కువ, మానవ వనరులు తక్కువ
4) జనసంఖ్య తక్కువ, మానవ వనరులు ఎక్కువ                     


7. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో విదేశీ వ్యాపార లోటుకు కారణం? 

1) ఎగుమతులు లేకపోవడం            
2) ఎగుమతులు చేయకపోవడం
3) ఎగుమతుల్లో నాణ్యత లోపించడం      
4) ఎగుమతులు తక్కువగా ఉండటం


సమాధానాలు: 1-4;   2-3;   3-1;   4-4;    5-1;    6-3;   7-4.

Posted Date : 31-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భారత ఆర్థికవ్యవస్థ లక్షణాలు

భారతదేశం స్వాతంత్య్రం సాధించి ఏడు దశాబ్దాలు దాటింది. ఐఎంఎఫ్‌ నివేదిక - 2018 ప్రకారం నామినల్‌ జీడీపీలో ఆరో పెద్ద దేశంగా అవతరించింది. విదేశీ మూలధనంలోనూ ముందంజలో ఉంది. ఇంత అభివృద్ధి సాధించినా ఇప్పటికీ అభివృద్ధి చెందుతున్న దేశంగానే గుర్తిస్తున్నారు. 


దేశాల వర్గీకరణ

  రెండో ప్రపంచ యుద్ధానంతరం బ్రిటిష్‌ ప్రభుత్వం నుంచి స్వాతంత్య్రం పొందిన భారత్‌ లాంటి అనేక దేశాలు అభివృద్ధి కోసం ప్రణాళికలు ప్రారంభించిన నేపథ్యంలో పరిపాలకులు, ఆర్థిక శాస్త్రవేత్తలు ‘అభివృద్ధి’ అనే పదాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు. ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి లాంటి సంస్థలు దేశాల ప్రగతికి సహాయం చేయడానికి వివిధ దేశాలను పోల్చుకునే అవసరం ఏర్పడింది. ఫలితంగా మొదట.. ప్రపంచ దేశాలను అభివృద్ధి చెందిన, వెనుకబడిన దేశాలుగా వర్గీకరించి అధ్యయనం చేశారు. ఆ తర్వాత అభివృద్ధి కొనసాగిస్తున్న మూడో రకం దేశాలను అభివృద్ధి చెందుతున్న లేదా వర్ధమాన దేశాలుగా పేర్కొన్నారు. ఈ విభజన కోసం అనేక రకాల సూచికలను ఉపయోగించారు. 

ఆర్థికవ్యవస్థ నిర్మాణంలో మార్పులు

  ఏ దేశ ఆర్థిక ప్రగతి అయినా మూడు రంగాల (ప్రాథమిక, ద్వితీయ, తృతీయ)పై ఆధారపడి ఉంటుందని మొదటిసారి అలెన్‌ ఫిషర్, కొలిన్‌ క్లార్క్, జీన్‌ ఫోర్‌స్టై అనే ఆర్థికవేత్తలు ప్రతిపాదించారు. ఇదే విధానం ఇప్పటికీ అన్ని దేశాలలో అమల్లో ఉంది. వీరి ప్రతిపాదన ప్రకారం అభివృద్ధి చెందిన దేశాల్లో ఆదాయం, ఉపాధిలో ద్వితీయ, తృతీయ రంగాలు అధిక వాటాను కలిగి ఉంటాయి. దీనికి భిన్నంగా ప్రాథమిక లేదా వ్యవసాయ రంగం వెనుకబడిన దేశాల్లో ప్రధానపాత్ర పోషిస్తుంది. ఈ సూచిక ఆధారంగా 1951 నాటికి మనదేశ జనాభాలో సుమారు 80% ప్రజలు గ్రామాల్లో నివసిస్తూ వ్యవసాయంపై ఆధారపడి జీవించేవారు. ఈ రంగం నుంచే సగానికిపైగా ఆదాయం లభించేది కాబట్టి మన దేశాన్ని వెనుకబడిన దేశంగా పిలుస్తున్నారు. 

  2018 నాటికి దేశ ఆర్థిక వ్యవస్థలో వచ్చిన మార్పును పరిశీలిస్తే వ్యవసాయ రంగం శ్రామికుల్లో సగం మందికి ఉపాధి కల్పిస్తుంటే మన జాతీయాదాయంలో మాత్రం దాని వాటా గణనీయంగా తగ్గి 14.39%కి చేరింది. సేవల రంగం అతిపెద్ద రంగంగా మారి 54.15% ఆదాయాన్ని అందిస్తుంది. ఉపాధి, ఆదాయంలో వ్యవసాయేతర రంగాల వాటా పెరిగితే ఆ దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా చెప్పవచ్చు. కానీ మనదేశం ఇప్పటికీ అభివృద్ధి చెందుతున్న దేశమే.  


తలసరి ఆదాయం

  ఐక్యరాజ్య సమితి నిపుణుల ప్రకారం అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, పశ్చిమ యూరప్‌ దేశాల వాస్తవ తలసరి ఆదాయం కంటే తక్కువ ఆదాయం కలిగినవన్నీ వెనుకబడిన దేశాలే. ప్రపంచ బ్యాంక్‌ కూడా తలసరి ఆదాయం ప్రామాణికంగా 1978 నుంచి దేశాల వర్గీకరణను ప్రారంభించింది. ఆయా దేశాల ప్రజల సగటు ఆదాయమైన తలసరి ఆదాయం లెక్కింపులో శాస్త్రీయత, సారుప్యత లోపించి అనేక విమర్శలు రావడంతో ప్రపంచ బ్యాంక్‌ వెనుకబడిన, అభివృద్ధి చెందిన దేశాలు అనే పదాలను పక్కన పెట్టి దేశాలను నాలుగు రకాలుగా వర్గీకరించింది. 

1) అల్పాదాయ దేశాలు: స్థూల జాతీయ తలసరి ఆదాయం 995 డాలర్ల కంటే తక్కువ కలిగిన దేశాలు.

2) దిగువ మధ్య ఆదాయ దేశాలు: స్థూల జాతీయ తలసరి ఆదాయం 996 నుంచి 3895 డాలర్ల మధ్య.

3) ఎగువ మధ్య ఆదాయ దేశాలు: స్థూల జాతీయ తలసరి ఆదాయం 3896 నుంచి 12055 డాలర్ల మధ్య.

4) అధిక ఆదాయ దేశాలు: స్థూల జాతీయ తలసరి ఆదాయం 12056 డాలర్ల కంటే ఎక్కువుగా ఉన్న దేశాలు. 


 ప్రపంచ బ్యాంక్‌ నివేదికల ప్రకారం 2001 తర్వాత వివిధ దేశాల అభివృద్ధి తీరుతెన్నుల్లో మార్పులు రావడం వల్ల క్రమంగా అల్పాదాయ దేశాల సంఖ్య తగ్గి అభివృద్ధి చెందుతున్న, అధిక ఆదాయ దేశాల సంఖ్య పెరుగుతుంది. ప్రస్తుతం పది మందిలో ఒకరు మాత్రమే అల్పాదాయ దేశాల్లో జీవిస్తున్నారు. సుమారు 73 శాతం మంది ప్రజలు వర్ధమాన/మధ్య ఆదాయ దేశాల్లో ఉన్నారు.  2017 నాటికి ప్రపంచ బ్యాంక్‌ అంచనా ప్రకారం భారత స్థూల జాతీయ తలసరి ఆదాయం 1,927 డాలర్లుగా ఉండటంతో మన దేశాన్ని దిగువ మధ్య ఆదాయ దేశంగా చెప్పవచ్చు.


అభివృద్ధి సామర్థ్యం

జాకోబ్‌ వీనర్‌ లాంటి ఆర్థికవేత్తలు అభివృద్ధి సామర్థ్యం, అవకాశాల ఆధారంగా ఒక దేశ వెనుకబాటుతనాన్ని అంచనావేయడం సులభమని చెప్పారు. వీరి అభిప్రాయం ప్రకారం 1951లో ప్రణాళిక సంఘం ‘తక్కువ ఉపయోగించిన/అసలు ఉపయోగించని మానవ వనరులు, వినియోగించని సహజ వనరులను కలిగి ఉన్న దేశాన్ని వెనుకబడిన దేశం’గా నిర్వచించింది. అయితే ఇటీవల అనేక నూతన సూచికలు అందుబాటులోకి రావడంతో వివిధ దేశాల అభివృద్ధిలోని దశ దిశలను, నాణ్యతను వాటి ద్వారా అధ్యయనం చేస్తున్నారు. ముఖ్యంగా మానవాభివృద్ధి సూచిక, లింగ సాధికారత సూచిక, బహుళ పేదరిక సూచిక, యూఎన్‌వో 17 అంశాల సుస్థిరాభివృద్ధి సూచికలను ఉపయోగిస్తున్నారు. గత 70 ఏళ్ల ప్రగతిలో భారత్, చైనా లాంటి దేశాలు అల్పాదాయ దేశాల నుంచి అభివృద్ధి చెందుతున్న దేశాలుగా పరిణామం చెందాయి.


భారతదేశ ఆర్థికాభివృద్ధి లక్షణాలు

మన దేశంలోని సుమారు 46 కోట్ల మంది శ్రామికుల్లో సగం వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో పనిచేస్తూ తక్కువ ఆదాయంతో జీవిస్తున్నారు. మనం ఈ రంగాల్లో ఉత్పాదకతలో వెనుకబడి ఉన్నాం.

1951-1981 మధ్య 30 ఏళ్లపాటు జీడీపీ వృద్ధి రేటు 3.5% మాత్రమే ఉంది. 1981-2001 మధ్య 5.5%, 2001-2018 మధ్య సరాసరి 6.7% మాత్రమే సాధించగలిగాం. 

*  జనాభా పెరగడం వల్ల తలసరి ఆదాయం తక్కువగా ఉంది. పట్టణీకరణ, ఆధునికీకరణలో సేవలరంగం పాత్ర పెరుగుతుంది. 

దేశంలో అక్షరాస్యత 2011 నాటికి 74%కి పెరిగినప్పటికీ విద్యలో నాణ్యత లోపించింది. ఉన్నత విద్యలో స్థూల నమోదు నిష్పత్తి అమెరికా లాంటి దేశాల్లో 80% పైగా ఉండగా మన దేశంలో 25% మాత్రమే ఉంది. 

ప్రపంచంలో అత్యధిక యువ జనాభా మన దేశంలో ఉన్నప్పటికీ నిరుద్యోగిత రేటు అధికంగా ఉంది. కేవలం 3% విద్యార్థులు మాత్రమే వృత్తి నైపుణ్య శిక్షణ పొందుతున్నారు. జపాన్, దక్షిణ కొరియా, చైనా దేశాల్లో ఇది 50%పైగా ఉంది.

విస్తారమైన అడవులు, ఖనిజాలు, నదులు, సముద్ర తీరప్రాంతం ఉన్నా వాటిని సద్వినియోగం చేసుకోవడంలో వెనుకబడి ఉన్నాం. ఇప్పటికీ మన దేశంలో 60% సాగు రుతుపవనాలపైనే ఆధారపడి ఉంది.

భారత్‌ లాంటి దేశాల్లో మూలధన కల్పన తక్కువగా ఉండటం వల్ల అల్ప వృద్ధి రేటు, సహజవనరుల వినియోగం తక్కువగా ఉంటుంది. 1950-51లో దేశ జీడీపీలో పొదుపు 8.9% ఉండగా ఇటీవల 30%కి చేరింది. అయితే ఆ సమయంలో మూలధన నిష్పత్తి ఎక్కువగా ఉంది. మన దేశంలో 2012-13 నుంచి 2016-17 మధ్య 6.3 - 4.0 శాతానికి తగ్గింది. దేశంలో సాంకేతిక పరిజ్ఞానం, మానవ వనరుల నాణ్యత పెరిగేకొద్దీ మూలధన నిష్పత్తి తగ్గుతుంది. అమెరికా, జపాన్‌ దేశాల్లో ఈ నిష్పత్తి ఇంకా తక్కువగా ఉండటం వల్ల తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఉత్పత్తి సాధిస్తున్నారు. 

రంగరాజన్‌ కమిటీ ప్రకారం 2011-12 నాటికి భారత్‌లో 29.5% మంది పేదరిక గీత కింద ఉన్నారు అంటే పది మందిలో ముగ్గురు పేదవారే. 

గ్రామాల్లో ప్రచ్చన్న నిరుద్యోగం ఉండగా పట్టణాల్లో చదువుకున్న యువతలో నిరుద్యోగ సమస్య రోజు రోజుకూ పెరుగుతుంది. అంతర్జాతీయ కార్మిక సంస్థ నివేదిక ప్రకారం 2014-2019 కాలానికి భారతదేశంలో నిరుద్యోగిత రేటు 3.6%గా ఉంది. గతంలో కంటే నిరుద్యోగిత రేటు పెరగడం గమనార్హం.   

అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ద్వంద్వ ఆర్థిక లక్షణాలు ఎక్కువ. పరస్పర విరుద్ధమైన అభివృద్ధి, సాంకేతిక పరిజ్ఞానం, డిమాండు స్థాయులు దేశంలో కనిపిస్తాయి. 

ఉదా: భారీయంత్రాలు వాడే పరిశ్రమలు - మానవ శ్రమతో కూడిన కుటీర పరిశ్రమలు.
*   అభివృద్ధి చెందుతున్న దేశాల్లో విదేశీ వ్యాపార లోటు సహజంగా ఉంటుంది. ఈ దేశాల్లో అవసరాలు ఎక్కువ. మన దేశం ప్రధానంగా ఆయిల్, ఎలక్ట్రానిక్‌ యుద్ధ పరికరాలు, బంగారం దిగుమతి చేసుకుంటుంది. ఎగుమతులు పెరుగుతున్నప్పటికీ మనం వ్యవసాయ, వస్త్ర, ముడి ఖనిజాల ఉత్పత్తులపైనే ఆధారపడుతున్నాం. దిగుమతుల కంటే ఎగుమతుల విలువ తక్కువగా ఉండటం వల్ల విదేశీ వ్యాపారఖాతాలో లోటు ఉంటుంది. మానవాభివృద్ధి, సుస్థిరాభివృద్ధిలో మన దేశం మధ్య స్థాయి పనితీరును కనబరుస్తుంది.

Posted Date : 31-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రపంచీకరణ

మాదిరి ప్ర‌శ్న‌లు

1. భారతదేశంలో 1991 నూతన ఆర్థిక సంస్కరణల్లో భాగంగా ఎల్‌పీజీ అనే అభివృద్ధి నమూనాను ప్రారంభించిన నాటి ఆర్థిక మంత్రి ఎవరు?
జ‌: డాక్టర్ మన్మోహన్ సింగ్

 

2. 1990-91 నాటికి విదేశీ వ్యాపార చెల్లింపుల శేషం (BOP) కరెంట్‌ఖాతా లోటు ఎంతకు చేరింది?
జ‌: 9.7 బిలియన్ డాలర్లు

 

3. 1990-91 నాటికి దేశ ద్రవ్యోల్బణ శాతం ఎంత నమోదైంది?
జ‌: 10.3%

 

4. 1990-91 నాటికి కోశపరమైన లోటు శాతం ఎంత?
జ‌: 7.8%

 

5. స్వేచ్ఛా వ్యాపార భావనను ఎవరు ప్రవేశపెట్టారు?
జ‌: ఆడమ్ స్మిత్

 

6. కిందివాటిలో సరళీకరణలో భాగంగా 1991 నూతన పారిశ్రామిక విధాన తీర్మానంలో ప్రభుత్వ రంగానికి రిజర్వు చేసిన పరిశ్రమలు ఏవి?
 1) రక్షణ సామాగ్రి       2) అణు విద్యుదుత్పత్తి       3) రైల్వే రవాణ       4) పైవన్నీ
జ‌: 4(పైవన్నీ)

7. సరళీకరణ విధానంలో తప్పనిసరి లైసెన్స్ పొందాల్సిన పరిశ్రమలను 18 నుంచి ఎంతకు కుదించారు?
జ‌: 5

 

8. కిందివాటిలో 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించని రంగం ఏది?
  1) బ్యాంకులు       2) బీమా       3) పింఛను       4) పైవన్నీ
జ‌: 4(పైవన్నీ)

 

9. ఏకస్వామ్య నిర్బంధ వర్తక ఆచరణల చట్టాన్ని (ఎంఆర్‌టీపీ) ఏ సంవత్సరంలో చేశారు?
జ‌: 1969

 

10. 1969 లో ప్రైవేటీకరణ అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించింది ఎవరు?
జ‌: ప్రొఫెసర్. పీటర్ డ్రకర్

 

11. బ్రిటన్‌లో మొదటిసారి ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు నాంది పలికిన నాటి ప్రధాని ఎవరు?
జ‌: మార్గరెట్ థాచర్

 

12. 'పెట్టుబడుల ఉపసంహరణ' కిందివాటిలో దేనిలో భాగం?
 1) సరళీకరణ       2) ప్రైవేటీకరణ       3) ప్రపంచీకరణ       4) పైవేవీ కావు
జ‌: 2(ప్రైవేటీకరణ)

 

13. 2016-17 కేంద్ర బడ్జెట్‌లో పెట్టుబడుల ఉపసంహరణ (ప్రభుత్వ రంగ సంస్థల్లో) లక్ష్యాన్ని ఎంతగా నిర్దేశించారు?
జ‌: రూ.56,500 కోట్లు

 

14. జాతీయ పెట్టుబడి నిధిని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
జ‌: 3 నవంబరు 2005

 

15. ప్రపంచ వర్తక సంస్థ (డబ్ల్యూటీఓ) ఎప్పుడు ఏర్పడింది?
జ‌: 1995

 

16. కిందివాటిలో బహుళజాతి సంస్థ ఏది?
  1) శామ్‌సంగ్       2) వీడియోకాన్       3) గోద్రెజ్       4) డాబర్
జ‌: 1(శామ్‌సంగ్)

 

17. 2015-16 బడ్జెట్‌లో ప్రకటించిన విదేశీమారక ద్రవ్య నిల్వలు ఎంత (బిలియన్ డాలర్లలో)?
జ‌: 350 బిలియన్ డాలర్లు

 

18. యూరో కరెన్సీ కూటమి నుంచి ఇటీవల వైదొలిగిన దేశం ఏది?
జ‌: బ్రిటన్

 

19. విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (FEMA) ఏ సంవత్సరం అమల్లోకి వచ్చింది?
జ‌: 2000

 

20. కిందివాటిలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించని రంగం ఏది?
 1) అణుశక్తి       2) లాటరీ వ్యాపారం       3) చిట్‌ఫండ్ సంస్థలు       4) పైవన్నీ
జ‌: 4(పైవన్నీ)

Posted Date : 31-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

స్వతంత్ర భారతదేశంలో అభివృద్ధి ప్రణాళికలు - ప్రణాళికా కాలంలో భారతదేశ ఆర్థికాభివృద్ధి, ప్రణాళికల్లో కేటాయింపులు

ప్రణాళికలు - పరిణామ క్రమం
లభ్యమవుతున్న వనరులను ఎంత సామర్థ్యంతో వీలైతే అంత సామర్థ్యంతో ఉపయోగించుకుని స్పష్టమైన లక్ష్యాలను సాధించాలని ఉద్దేశ పూర్వకంగా, జాగ్రత్తగా ఆలోచించిన తర్వాత ప్రభుత్వం తీసుకునే చొరవే ప్రణాళిక అని ప్రణాళికా సంఘం నిర్వచించింది.
* ఆడంస్మిత్ లాంటి సంప్రదాయవాదులు ఆర్థిక వ్యవస్థను అదృశ్య హస్తం నడిపిస్తుందని అంటారు. అదృశ్య హస్తం అంటే డిమాండు, సప్లయి లాంటి మార్కెటు శక్తులు. వీటినే ధరల యంత్రాంగం అని కూడా అంటారు.
జె.బి. సే ప్రకారం సప్లయి తనకు తాను డిమాండ్‌ను సృష్టించుకుంటుంది. అంటే ఉత్పత్తి జరుగుతున్న క్రమంలో ఉత్పత్తి కారకాలకు ప్రతిఫలాలను చెల్లించడం జరుగుతుంది. ఉత్పత్తి కారకాలు తాము పొందిన ప్రతిఫలంతో ఉత్పత్తి అయిన వస్తువులను డిమాండు చేస్తాయి. ఆ విధంగా సప్లయి, డిమాండులు సమానం అవుతాయి. కాబట్టి ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థలో జోక్యం చేసుకోవాల్సిన అవసరంలేదు. అని సంప్రదాయ ఆర్థిక వేత్తలు పేర్కొన్నారు.
* 1929 - 33 మధ్యకాలంలో ప్రపంచ వ్యాప్తంగా సంభవించిన ఆర్థిక మాంద్యం కాలంలో సంప్రదాయవాదుల సిద్ధాంతం పని చేయలేదు.
* ఆర్థికమాంద్యం నుంచి ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి ప్రభుత్వ జోక్యం తప్పనిసరి అనేది జె.ఎం. కీన్స్ అభిప్రాయం.
* 1929 - 33 మధ్యకాలంలో ఆర్థిక మాంద్యం ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో ఏర్పడింది. ఫలితంగా మాంద్యం ప్రభావం అన్ని దేశాలపై పడింది. అయితే ఈ ఆర్థిక మాంద్యం ప్రణాళికలను అమలు చేస్తూ ప్రణాళికా బద్ధమైన ప్రగతిని సాధిస్తూ ముందుకు దూసుకెళుతున్న రష్యా (సోవియట్ యూనియన్)ను ప్రభావితం చేయలేదు. కొన్ని వందల సంవత్సరాల్లో అమెరికా సాధించిన వృద్ధిని రష్యా కేవలం కొన్నేళ్లలోనే సాధించింది. ఫలితంగా ప్రణాళికా భావన ప్రపంచ దేశాలను, ఆర్థిక వేత్తలను ప్రభావితం చేసింది. భారత్ కూడా రష్యాను స్ఫూర్తిగా తీసుకుని ప్రణాళికలను ప్రారంభించింది.

 

స్వాతంత్య్రానికి ముందు
 

* స్వాతంత్య్రానికి ముందు మనదేశానికి ఒక ప్రణాళిక అవసరమని చెప్పిన నాయకుడు సుభాష్ చంద్రబోస్.
* 1934లో మోక్షగుండం విశ్వేశ్వరయ్య ప్లాన్‌డ్ ఎకానమీ ఫర్ ఇండియా (Planned Economy for India) అనే గ్రంథాన్ని రాశారు. ఈ గ్రంథంలో భారతదేశానికి 10 సంవత్సరాల కాలాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు రూపొందించారు.
* భారత జాతీయ కాంగ్రెస్ (INC) 1938లో జాతీయ ప్రణాళికా కమిటీని జవహర్‌లాల్ నెహ్రూ అధ్యక్షతన వేసింది.
1943లో బాంబేకి చెందిన 8 మంది పారిశ్రామికవేత్తలు A Plan of economic development for India అనే పేరుతో 15 సంవత్సరాల కాలానికి ఒక ప్రణాళికను రూపొందించారు. దీన్ని బాంబే ప్లాన్ అంటారు. వీరు ఇనుము, ఉక్కు, సిమెంట్, రసాయనాలు లాంటి భారీ పరిశ్రమల అభివృద్ధిని కాంక్షించారు.
* 1944లో ఎం.ఎన్. రాయ్ ప్రజాప్రణాళికలను (People's plan) రూపొందించారు. ఈయన వ్యవసాయ రంగానికి, వినియోగ వస్తువులకు ప్రాధాన్యం ఇచ్చారు.
* బాంబే ప్రణాళికను పారిశ్రామికవేత్తలు రూపొందించడం వల్ల అది పెట్టుబడిదారీ స్వభావాన్ని కలిగి ఉండగా, ప్రజాప్రణాళిక సామ్యవాద భావాలను కలిగి ఉంది.
బాంబే ప్లాన్ భారీ పరిశ్రమలకు ప్రాధాన్యం ఇవ్వగా, పీపుల్స్ ప్లాన్ చిన్న పరిశ్రమలకు, వ్యవసాయానికి ప్రాధాన్యం ఇచ్చింది.
* 1944లో శ్రీమన్నారాయణ అగర్వాల్ గాంధీ ప్రణాళికను రూపొందించి, వికేంద్రీకృత ప్రణాళికను సూచించారు. గాంధీ ప్రణాళికను క్రోడికరించి ఆర్థిక ప్రణాళికను రూపొందించారు. కుటీర పరిశ్రమలు, చిన్న పరిశ్రమలకు ప్రాధాన్యం ఇచ్చారు.
* శ్రీమన్నారాయణ అగర్వాల్ గాంధీ ప్రణాళికను రూ.3,500 కోట్ల వ్యయ అంచనాలతో రూపొందించారు.
* 1946లో ఏర్పడిన మధ్యంతర ప్రభుత్వం ప్రణాళికల అభివృద్ధి సమస్యలను పరిష్కరించడానికి High level advisory planning board ను ఏర్పాటు చేసింది. ఇది భారతదేశంలో స్థిరప్రాతిపదికన ఒక ప్రణాళికా సంఘం ఉండాలని సలహా ఇచ్చింది.

 

స్వాతంత్య్రానంతరం
* రెండో ప్రపంచ యుద్ధానంతరం స్వాతంత్య్రం పొందిన వెనుకబడిన దేశాలు రష్యా దేశాన్ని మార్గదర్శకంగా తీసుకుని ఆర్థిక ప్రణాళికలను అమలు చేశాయి. ఆర్థిక వ్యవస్థలోని కార్యకలాపాలను అమలు చేయడం, నిర్ణీత కాలవ్యవధిలో, నిర్దేశించిన లక్ష్యాలను సాధించడానికి ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను నియంత్రించడాన్ని ఆర్థిక ప్రణాళికా విధానం అంటారు.
* కొరతగా ఉండి ప్రత్యామ్నాయ ఉపయోగిత ఉన్న సహజ వనరులను సమర్థంగా వినియోగించి నిర్ణీత కాలంలో గరిష్ఠ వృద్ధిరేటు సాధించడానికి ఆర్థిక ప్రణాళికలు తోడ్పడతాయి.
* 1950లో జయప్రకాశ్ నారాయణ్ సర్వోదయ ప్రణాళికను రూపొందించారు.
* భారతదేశానికి ఒక ప్రణాళికా సంఘం అవసరమని అప్పటి ఆర్థికశాఖ మంత్రి షణ్ముగం శెట్టి పేర్కొంటూ ప్రణాళికా సంఘం స్వరూప, స్వభావాలను వివరించారు. దీనికి అనుగుణంగా 1950, మార్చి 15న కేంద్రమంత్రి మండలి తీర్మానం మేరకు ప్రణాళికా సంఘం ఏర్పడింది.

 

ప్రణాళికా సంఘం
 

కేంద్రమంత్రి మండలి తీర్మానం మేరకు 1950, మార్చి 15న ఇది ఏర్పడింది.
* ఇది రాజ్యాంగేతర సంస్థ, చట్టబద్ధం కాని సంస్థ.
* ఇది కేవలం కేంద్ర మంత్రిమండలి తీర్మానం మేరకు ఏర్పడిన సలహాసంఘం మాత్రమే.
* ఈ ప్రణాళికా సంఘానికి అధ్యక్షుడిగా లేదా ఎక్స్ అఫీషియో ఛైర్మన్‌గా దేశ ప్రధానమంత్రి వ్యవహరిస్తారు.
* ఈ ప్రణాళికా సంఘానికి క్రియాశీలకంగా పనిచేసే వాస్తవ కార్య నిర్వాహకుడు ఒకరు ఉంటారు. అతడే ఉపాధ్యక్షుడు అయితే అతడి పదవీకాలం, నియామకం, తొలగింపు లాంటి అన్ని అంశాలు ప్రభుత్వం విచక్షణ మేరకు జరుగుతాయి.
* ఆదేశిక సూత్రాల్లోని 39వ అధికరణ ప్రకారం స్త్రీ, పురుషులు సమాన జీవన ప్రమాణాలను పొందాలని, దేశంలోని సహజ వనరులు సమానంగా పంపిణీ కావాలనీ, ఆర్థికశక్తి కొద్దిమంది వద్దే కేంద్రీకృతం కాకుండా చూడాలనీ తెలుపుతుంది.
భారత రాజ్యాంగంలోని 39వ అధికరణను అనుసరించి ప్రణాళికా సంఘం ఏర్పాటైంది.
* ఆర్థిక ప్రణాళికలు ఉమ్మడి జాబితాకు సంబంధించినవి. అందువల్ల ప్రణాళికలకు సంబంధించి కేంద్రం, రాష్ట్రం రెండూ కూడా ప్రణాళికలను రూపొందించుకుంటాయి.

 

ప్రణాళిక సంఘం మొదటి అధ్యకుడు: జవహర్‌లాల్ నెహ్రూ.
ప్రణాళికా సంఘం మొదటి ఉపాధ్యక్షుడు: గుల్జారీలాల్ నందా.
ప్రణాళికా సంఘం చివరి అధ్యక్షుడు: నరేంద్రమోదీ.
ప్రణాళికా సంఘం చివరి ఉపాధ్యక్షుడు: మాంటెక్ సింగ్ అహ్లూవాలియా.

 

జాతీయ అభివృద్ధి మండలి (National Development Council - NDC)
* ఇది 1952, ఆగస్టు 6న ఏర్పడింది.
* ఇది రాజ్యాంగేతర సంస్థ, చట్టబద్ధం కాని సంస్థ.
* ఇది కూడా ప్రణాళికా సంఘం మాదిరి కేంద్రమంత్రి మండలి తీర్మానం మేరకు ఏర్పడింది.
* ప్రణాళికా సంఘంలో రాష్ట్రాలకు ప్రాతినిధ్యం లేదు. అందువల్ల ప్రణాళికల అమలులో రాష్ట్రాలకు కూడా ప్రాతినిధ్యం ఉండాలనే ఉద్దేశంతో ఈ జాతీయ అభివృద్ధి మండలిని ఏర్పాటు చేశారు.
* ఇది రాష్ట్రాలకు, ప్రణాళికా సంఘానికి మధ్య సహకారాన్ని పెంపొందిస్తుంది. ప్రణాళికల నిర్మాణంలో రాష్ట్రాలకు ప్రాధాన్యం ఇస్తుంది.
* మనదేశంలో ప్రణాళికలను తయారు చేసేది ప్రణాళిక సంఘం. వాటిని ఆమోదించేది జాతీయ అభివృద్ధి మండలి. ఇది ఆమోదించిన తర్వాతే ప్రణాళికలు అమల్లోకి వస్తాయి.
* జాతీయ అభివృద్ధి మండలికి ప్రధానమంత్రి ఎక్స్ అఫీషియో ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు.
* ప్రణాళికా సంఘం కార్యదర్శి జాతీయ అభివృద్ధి మండలి (NDC)కి కార్యదర్శిగా వ్యవహరిస్తారు.
* NDC సభ్యుల్లో ప్రతి ఒక్కరూ ఎక్స్ అఫీషియో సభ్యులే. NDCలో పనిచేయడానికి పూర్తికాల సభ్యులు ఒక్కరూ కూడా లేరు.
* 1967లో పరిపాలనా సంఘం చేసిన సూచనల మేరకు జాతీయ అభివృద్ధి మండలి సభ్యత్వాన్ని విస్తరించారు. దీనిలోని సభ్యులు
    1) రాష్ట్ర ముఖ్యమంత్రులు.
    2) కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్‌లు.
    3) ప్రణాళికా సంఘం సభ్యులు.
    4) కేంద్ర కేబినెట్ మంత్రులు.
* ప్రణాళిక సంఘం రూపొంచిందించిన ప్రణాళికలను చివరగా జాతీయ అభివృద్ధి మండలి ఆమోదిస్తేనే అవి అమల్లోకి వస్తాయి.
* అదేవిధంగా రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రణాళికా బోర్డు (State Planning Board) ఉంటుంది. ముఖ్యమంత్రి దీనికి అధ్యక్షుడిగా ఉంటారు.
జిల్లాల్లో కూడా జిల్లా ప్లానింగ్ బోర్డు (District Planning Board) ఉంటుంది. జిల్లా కలెక్టరు దీనికి ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. అదేవిధంగా జిల్లా ప్లానింగ్ కమిటీ (District Planning Committee) కి ఛైర్మన్‌గా జిల్లాపరిషత్ ఛైర్మన్ వ్యవహరిస్తారు.

 

ప్రణాళికలు - వ్యూహాలు: ప్రణాళికా వ్యూహానికి మూడు అంశాలు ఆధారం.
   1) ఆర్థిక వ్యవస్థలో కనుక్కున్న వనరుల సమగ్ర అంచనా.
   2) దేశ సమస్యల తీవ్రత ఆధారంగా నిర్ణీతకాలంలో సాధించాల్సిన లక్ష్యాలను నిర్ణయించడం.
   3) నిర్ణయించిన లక్ష్యాల సాధనకు పటిష్ట వ్యూహరచన.

 

ప్రణాళికలు - రకాలు:
 

ప్రభుత్వ పాత్రను బట్టి ప్రణాళికలు రెండు రకాలు.

    1) ఆదేశాత్మక ప్రణాళిక
    2) సూచనాత్మక ప్రణాళిక.

 

1) ఆదేశాత్మక ప్రణాళిక/ నిర్దేశాత్మక ప్రణాళిక
* ఇందులో ప్రణాళిక రచన, అమలు లాంటి వ్యవహారాలను సర్వాధికారాలున్న ఒక కేంద్ర సంస్థ నిర్వహిస్తుంది. దీనిలో ప్రజలకు, రాష్ట్రాలకు, వినియోగదారులకూ స్వేచ్ఛా స్వాతంత్య్రాలు ఉండవు.
* ఆర్థిక వ్యవస్థలోని వనరులు, ఆర్థిక కార్యకలాపాలన్నీ కేంద్ర సంస్థ దిశానిర్దేశం మేరకు జరుగుతాయి.
* సాధారణంగా ఇలాంటి ప్రణాళికలు రష్యా లాంటి సామ్యవాద దేశాల్లో అమలవుతాయి.

 

2) సూచనాత్మక ప్రణాళిక:
* దీనిలో ప్రభుత్వ స్థూల అంశాలను నిర్దేశించి, వాటిని సాధించడం కోసం ప్రైవేట్ రంగానికి అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తుంది. కానీ దిశానిర్దేశం చేయదు.
* ఇలాంటి ప్రణాళికలను మొదటిసారిగా 1947 - 50లో ఫ్రాన్స్ ప్రభుత్వం అమలు చేసింది.
* ఈ ప్రణాళికను మార్కెట్ ప్రణాళిక అని కూడా పిలుస్తారు.
* ఇది మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు తోడ్పడుతుంది.
* మనదేశంలో ఈ ప్రణాళికను 8వ పంచవర్ష ప్రణాళిక నుంచి అమలు చేస్తున్నారు.

 

ప్రజల భాగస్వామ్యం ఆధారంగా .......
    1) కేంద్రీకృత ప్రణాళిక
    2) వికేంద్రీకృత ప్రణాళిక

 

1) కేంద్రీకృత ప్రణాళిక:
* ప్రణాళిక రచన, అమలుకు సంబంధించిన వ్యవహారాలను సర్వాధికారాలు ఉన్న ఒక కేంద్ర సంస్థ చూస్తుంది.
 

2) వికేంద్రీకృత ప్రణాళిక:
* కిందిస్థాయి నుంచి (గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయుల్లో) ప్రణాళికలను తయారుచేసి, వాటి ఆధారంగా కేంద్ర ప్రణాళికలను తయారు చేయడాన్ని వికేంద్రీకృత ప్రణాళిక అంటారు.
 

వనరుల కేటాయింపుల ఆధారంగా.........
    1) భౌతిక ప్రణాళిక
     2) విత్త ప్రణాళిక

 

1) భౌతిక ప్రణాళిక:
* సహజ వనరులు, మానవ వనరులు, ముడిపదార్థాలు లాంటి వాస్తవిక అంశాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించే ప్రణాళికను భౌతిక ప్రణాళిక అంటారు.
 

2) విత్త ప్రణాళిక:
* నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనకు ద్రవ్యం రూపంలో వనరులను అంచనావేస్తే దాన్ని విత్త ప్రణాళిక అంటారు.
 

కాలం ఆధారంగా ప్రణాళికలు..........
    1) స్వల్పకాలిక ప్రణాళిక
    2) మధ్యకాలిక ప్రణాళిక
    3) దీర్ఘకాలిక ప్రణాళిక

 

1. స్వల్పకాలిక ప్రణాళిక:
* ఒక సంవత్సర కాలానికి రూపొందించే ప్రణాళికలను స్వల్పకాలిక ప్రణాళికలు అంటారు.
 

2. మధ్యకాలిక ప్రణాళిక:
* 4, 5, 6 సంవత్సరాల కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలను తయారుచేస్తే వాటిని మధ్యకాలిక ప్రణాళికలు అంటారు.
 

3. దీర్ఘకాలిక ప్రణాళిక:
* 15 నుంచి 20 సంవత్సరాల కాలానికి తయారుచేసే ప్రణాళికలను దీర్ఘకాలిక ప్రణాళికలు అంటారు.
 

సరళత్వం ఆధారంగా...........
      1) నిర్దిష్ట/స్థిర ప్రణాళిక
      2) నిరంతర ప్రణాళిక

 

1. నిర్దిష్ట/స్థిర ప్రణాళిక:
* కొన్ని సంవత్సరాల కాలాన్ని స్థిరంగా నిర్ణయించి ప్రణాళికను రూపొందిస్తే దాన్ని స్థిర/నిర్దిష్ట ప్రణాళిక అంటారు.
 

2. నిరంతర ప్రణాళిక:
* కొత్తగా, అనూహ్యంగా ఎదురయ్యే సమస్యలను బట్టి ప్రణాళిక లక్ష్యాలను కూడా నిరంతరం మార్చుకోవడానికి అవకాశం ఉండే ప్రణాళికను నిరంతర ప్రణాళిక అంటారు.
* ఈ నిరంతర ప్రణాళికను ప్రపంచంలో మొదటిసారిగా తయారుచేసింది గున్నార్ మిర్డాల్. ఈయన స్వీడన్ దేశస్థుడు.
* ఈ ప్రణాళికను మొదటిసారిగా నెదర్లాండ్స్‌లో అమలు చేశారు.
* ఇండియాలో ఈ నిరంతర ప్రణాళికా నమూనాను డాక్టర్ లక్‌డావాలా తయారుచేశారు.

వ్యవస్థ స్వరూపం ఆధారంగా ..........
     1) నిర్మాణాత్మక ప్రణాళికలు
     2) కార్యాత్మక ప్రణాళికలు

 

ప్రాంతాన్ని బట్టి..........
   1) ప్రాంతీయ ప్రణాళిక
   2) జాతీయ ప్రణాళిక
   3) అంతర్జాతీయ ప్రణాళిక

 

* ప్రణాళికలను పాక్షిక ప్రణాళిక, సాధారణ ప్రణాళిక, వార్షిక ప్రణాళికలుగా కూడా వర్గీకరించవచ్చు.
వార్షిక ప్రణాళికలు: ఒక సంవత్సర కాలాన్ని దృష్టిలో పెట్టుకుని తయారుచేసే ప్రణాళికను వార్షిక ప్రణాళిక అని పిలుస్తారు. దీన్ని పిగ్మీ ప్రణాళిక అంటారు.
భారత్‌లో వార్షిక ప్రణాళికల కాలం: 1966 - 69 (3 సంవత్సరాలు), 1990 - 92 (2 సంవత్సరాలు)

* ప్రణాళికలను వేరొక విధంగా కూడా పేర్కొనవచ్చు. అవి:
1. నియంతృత్వ ప్రణాళిక:
* ఒక నియంతృత్వ వ్యక్తి లేదా ప్రభుత్వం చేతిలో ప్రణాళిక నియంత్రణ ఉంటే అది నియంతృత్వ ప్రణాళిక.
 

2. ప్రజాస్వామ్య ప్రణాళిక:
* ఈ ప్రణాళికలో లక్ష్యాలు, వనరుల కేటాయింపులను ప్రజాప్రతినిధులు నిర్ణయిస్తారు.
* ఈ ప్రణాళికలో ఉత్పత్తి, ఆర్థిక కార్యకలాపాలను ప్రభుత్వం నిర్ణయించదు.
* ప్రణాళికా సంఘం తయారు చేసిన ప్రణాళికలను మార్చే అధికారం పార్లమెంటుకు ఉంటుంది.

 

3. శాశ్వత ప్రణాళిక:
* ఒకసారి ఆర్థిక వ్యవస్థలో ప్రణాళికలను రూపొందిస్తే అవి దీర్ఘకాలంలో కూడా అమలు అవుతాయి. వాటిని మధ్యలో ఆపివేయడం లాంటిది జరగదు.
 

4. అత్యవసర ప్రణాళిక:
* ఆర్థిక వ్యవస్థలో అసమతౌల్యాలు ఏర్పడినప్పుడు, వాటిని తొలగించడానికి తాత్కాలికంగా ప్రవేశపెట్టేదే అత్యవసర ప్రణాళిక. అత్యవసర పరిస్థితులు తొలిగిపోయిన తర్వాత ఈ ప్రణాళికను రద్దు చేస్తారు.
 

5. సాధారణ ప్రణాళిక:
* ఇందులో స్థూల సమస్యలనే ప్రస్తావిస్తారు. స్థూల మార్గదర్శకాలు మాత్రమే ఉంటాయి.
 

6. వివరణాత్మక ప్రణాళిక:
* స్థూల మార్గదర్శకాలే కాకుండా వాటిని సాధించడానికి పూర్తి వివరాలు కూడా ఉంటాయి.
 

7. కరెక్టివ్ ప్లాన్: (Corrective plan)
* బాగా అభివృద్ధి చెందిన దేశాల్లో తరచూ వ్యాపార చక్రాలు సంభవిస్తూ ఉంటాయి. ఆ వ్యాపార చక్రాల నియంత్రణకు తయారు చేసే ప్రణాళికను Anticyclical planning లేదా Corrective plan అని అంటారు.
 

8. డెవలప్‌మెంట్ ప్లాన్:
* ఆర్థికాభివృద్ధి సాధన కోసం వెనుకబడిన దేశాల్లో అవలంబించే ప్రణాళిక. ఆదాయం, ఉత్పత్తి, ఉద్యోగితను పెంచడమే దీని లక్ష్యం. ఇది కరెక్టివ్ ప్లాన్ కంటే కూడా విస్తృతమైంది.
 

9. మిశ్రమ ఆర్థిక ప్రణాళిక:
* ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలు కలిసి ఉండే ఆర్థిక వ్యవస్థను మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటారు. అందుకు తగిన ప్రణాళికే mixed economy planning.
* మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో ప్రయివేటు రంగానికి స్వేచ్ఛ ఉంటుంది. కానీ పెట్టుబడిదారీ వ్యవస్థకు ఉన్నంత స్వేచ్ఛ ఉండదు.

 

ప్రణాళికా విరామం (plan holiday):
* ఒక planకి మరొక planకి మధ్య వచ్చిన విరామాన్నే ప్రణాళికా విరామం (plan holiday) అంటారు.
* భారత్‌లో 1966 - 69 మధ్య 3 సంవత్సరాలు, 1990 - 92 మధ్య 2 సంవత్సరాలు ప్రణాళికా విరామం వచ్చింది.

 

భారత పంచవర్ష ప్రణాళికల దీర్ఘకాలిక లక్ష్యాలు:
   1. జాతీయ, తలసరి ఆదాయం పెంచడానికి గరిష్ఠ ఉత్పత్తి సాధించడం.
   2. వ్యవసాయ ఉత్పత్తుల్లో స్వయం సమృద్ధి.
   3. పారిశ్రామిక ప్రగతి.
   4. సంపూర్ణ ఉద్యోగిత సాధించడం.
   5. ఆదాయ సంపదల అసమానతలు తగ్గించడం.
   6. సాంఘిక న్యాయం చేకూర్చడం.
   7. ప్రాంతీయ అసమానతలను తగ్గించడం.
   8. జననాణ్యత మెరుగుపరచడానికి సాంఘిక రంగ అభివృద్ధి.

 

భారత ప్రణాళికల లక్షణాలు:
* ఇవి సూచనాత్మక ప్రణాళికలు
* సమగ్ర ప్రణాళికలు
* భౌతిక, విత్తప్రణాళికలు
ప్రజాస్వామ్య వికేంద్రీకృత ప్రణాళికలు
* దీర్ఘకాలిక స్వభావాన్ని కూడా కలిగి ఉన్నాయి.

 

ప్రణాళికా వనరులు:
   1. దేశీయ వనరులు
   2. విదేశీయ వనరులు
   3. లోటు విత్తం

 

1. దేశీయ వనరులు:
* ప్రభుత్వ రంగ సంస్థల లాభాలు
* మార్కెట్ నుంచి తీసుకునే రుణాలు
* చిన్న మొత్తాల పొదుపులు, PFలు
* ప్రభుత్వ సంస్థల ఉత్పత్తులు, ధరలు పెంచడం, అదనపు పన్ను విధించడం
* కరెంటు రెవెన్యూ నుంచి మిగులు

 

పంచవర్ష ప్రణాళికలు - వనరుల సేకరణ, కేటాయింపులు
* ప్రణాళికా పెట్టుబడులకు ద్రవ్య వనరులను మూడు రకాలుగా సేకరిస్తారు. అవి
      1. దేశీయ బడ్జెటు వనరులు
      2. విదేశీ సహాయం
      3. లోటు ద్రవ్యం

 

1. దేశీయ బడ్జెటు వనరులు: దేశీయ బడ్జెట్ వనరులు అంతర్గతంగా దేశ ప్రజలు, సంస్థల నుంచి ప్రభుత్వం సేకరిస్తుంది. ప్రణాళికా వ్యయానికి అవసరమైన విత్త వనరుల్లో అత్యధిక భాగం దేశీయ వనరులే. అవి:
ప్రస్తుత రాబడి మిగులు: ప్రస్తుతరాబడిలో వ్యయంపోగా మిగిలేది
* పబ్లిక్ రంగ సంస్థల వాటా

సేకరించిన అంతర్గత ప్రైవేటు పొదుపు: మార్కెటు రుణాలు, చిన్న పొదుపు మొత్తాలు, ప్రావిడెంట్ పన్ను లాంటివి.
* పన్నులు, సుంకాల ద్వారా అదనంగా వసూలైన ఆదాయం.

 

2. విదేశీ సహాయం/వనరులు
* విదేశాల నుంచి అందిన గ్రాంట్లు, రుణాలు.
* అంతర్జాతీయ ద్రవ్యసంస్థలైన IDBI, IMF, IDA, ADB ప్రపంచ బ్యాంకు నుంచి స్వీకరించిన రుణాలను విదేశీ సహాయంగా వ్యవహరిస్తారు.

 

3. లోటు ద్రవ్యం: దేశీయ బడ్జెట్ వనరులు, విదేశీ సహాయం వల్ల సేకరించిన ద్రవ్య వనరులు అభివృద్ధి పథకాల అమలుకు సరిపోవు. ప్రణాళికల వివిధ పథకాల అమలుకు ఏర్పడిన రాబడి లోటును ప్రభుత్వం లోటు ద్రవ్య విధానం ద్వారా సమకూర్చుకుంటుంది.
* ప్రణాళికల అమలుకు సేకరించే విత్త వనరుల్లో దేశీయ బడ్జెట్ వనరులు ఎంతో ముఖ్యమైనవి. దేశ పౌరులు, సంస్థల ప్రస్తుత రాబడి (current revenue) నుంచి సమకూరే దేశీయ వనరులను ప్రస్తుత వ్యయానికి ఉపయోగిస్తారు. ప్రస్తుత పబ్లిక్ వ్యయాన్ని తగ్గించి ప్రస్తుత రాబడి మిగులును ఆర్థికాభివృద్ధికి తప్పనిసరిగా ఉపయోగించాల్సిందని సూచించిన మొదటి Taxation enquiry commission ఛైర్మన్ వి.టి. కృష్ణమాచారి ప్రతిపాదనను ప్రణాళికా సంఘం 1950 - 51లో ఆమోదించింది. వాస్తవానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రస్తుత రాబడిలో మిగులు చూపించలేకపోతున్నాయి.
* వివిధ ప్రణాళికల్లో వ్యయానికి అవసరమైన ద్రవ్య వనరుల సేకరణ వివరాలు కింది పట్టికలో చూడొచ్చు.

 

మొదటి ప్రణాళిక నుంచి 8వ ప్రణాళిక వరకు వివిధ వ్యయాలకు ద్రవ్య వనరుల సేకరణ:

   
 

* పంచవర్ష ప్రణాళికల వనరులు అనేక రంగాల మధ్య కేటాయిస్తారు. అందులో ముఖ్యమైనవి.
1. వ్యవసాయం
2. ఇంధనం, నీటిపారుదల
3. పరిశ్రమలు
4. రవాణా, సమాచారం
5. సాంఘిక సేవలు
* దేశీయ వనరులు సరిపోకపోతే విదేశీ సహాయం తీసుకుంటారు. విదేశీ సహాయం గ్రాంట్ల రూపంలో లభిస్తుంది.

ప్రణాళికల్లో వృద్ధి నమూనాలు
* మన పంచవర్ష ప్రణాళికలకు రెండు వృద్ధి నమూనాలు ఆధారం అవి:
 

2 నుంచి 7వ ప్రణాళిక వరకు నెహ్రూ మహలనోబిస్ నమూనా:
  1956లో అమలు చేసిన రెండో పంచవర్ష ప్రణాళికను భారీ పెట్టుబడుల వ్యూహం ఆధారంగా రూపొందించారు. ఆర్థికాభివృద్ధికి అవసరమైన కీలక రంగాలు భారీ, మూలధన పరిశ్రమలు; అవస్థాపన, పబ్లిక్‌రంగ పెట్టుబడులతో జరగాలని, పబ్లిక్ రంగంలో ఈ రెండు రంగాలు అభివృద్ధి చెందితే ప్రైవేటు రంగ పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఏర్పడుతుందని భావించారు. 7వ పంచవర్ష ప్రణాళిక వరకు ఈ వృద్ధి నమూనా ఆధారంగా ప్రణాళికల రూపకల్పన జరిగింది. ఈ వృద్ధి నమూనాను 2వ పంచవర్ష ప్రణాళికలో చర్చించారు.

Posted Date : 31-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భారత ఆర్థిక ప్రణాళికా వ్యవస్థ

మాదిరి ప్ర‌శ్న‌లు

1. మొదటి పంచవర్ష ప్రణాళికలో ఆహారధాన్యాల ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రధాన కారణం ఏమిటి?

జ: అనుకూల రుతుపవనాలు
 

2. నాలుగో పంచవర్ష ప్రణాళిక విజయవంతం కాకపోవడానికి ఏర్పడిన ప్రధాన అవరోధం ఏది?

1) బంగ్లాదేశ్ కాందీశీకుల సమస్య      2) రుతుపవనాల వైఫల్యం      

3) పాకిస్థాన్‌తో యుద్ధం              4) అన్నీ

జ: 4(అన్నీ)
 

3. ఇందిరాగాంధీ రద్దు చేసిన ప్రణాళిక ఏది?

జ: నిరంతర ప్రణాళిక
 

4. ఏ పంచవర్ష ప్రణాళికా కాలంలో భారతదేశ అభివృద్ధికి సంబంధించిన ప్రధాన బాధ్యత ప్రభుత్వ రంగానికి మారింది?

జ: 2వ
 

5. కిందివాటిలో మహలనోబిస్ నాలుగు రంగాల నమూనాలో అంశం కానిది ఏది?

1) విదేశీ వ్యాపార రంగం                                      

2) వినియోగ వస్తువులను ఉత్పత్తి చేసే రంగం

3) మూలధన వస్తువులను ఉత్పత్తి చేసే రంగం

4) సేవలను ఉత్పత్తి చేసే రంగం

జ: 1(విదేశీ వ్యాపార రంగం)
 

6. నిరుద్యోగ నిర్మూలనకు ప్రాధాన్యం ఇచ్చిన పంచవర్ష ప్రణాళిక ఏది?

జ: 6వ
 

7. పంచవర్ష ప్రణాళికలు లేని కాలం ఏది?

జ: 1967
 

8. ప్రజా ప్రణాళికను రూపొందించింది ఎవరు?

జ: ఎం.ఎన్. రాయ్

9. సామ్యవాద దృక్పథంతో రూపొందించిన పంచవర్ష ప్రణాళిక ఏది?

జ: 2వ
 

10. కనీస అవసరాల కార్యక్రమం ప్రారంభించిన ప్రణాళిక ఏది?

జ: 5వ
 

11. ముఖర్జీ ఫార్ములా దేని స్థానంలో వచ్చింది?

జ: గాడ్గిల్ ఫార్ములా
 

12. మనదేశానికి ప్రణాళికా సంఘం అవసరమని సూచించిన మొదటి జాతీయ నాయకుడు ఎవరు?

జ: సుభాష్ చంద్రబోస్
 

13. కిందివాటిలో సరికానిది ఏది?

1) ప్రణాళికా సంఘం - 1950, మార్చి 15

2) ప్రణాళికలు - ఉమ్మడి జాబితా

3) భారత ప్రణాళికల రూపశిల్పి - జవహర్‌లాల్ నెహ్రూ

4) పిగ్మీ ప్రణాళికలు - రోలింగ్ ప్రణాళిక

జ: 4(పిగ్మీ ప్రణాళికలు - రోలింగ్ ప్రణాళిక)
 

14. కిందివాటిలో నాలుగో పంచవర్ష ప్రణాళికా కాలంలో చేపట్టని పథకం ఏది?

1) పనికి ఆహార పథకం           2) ఎంప్లాయిమెంట్ గ్యారంటీ స్కీమ్

3) కరవు ప్రాంతాల అభివృద్ధి పథకం     4) గ్రామీణ పనుల కార్యక్రమం

జ: 1(పనికి ఆహార పథకం)
 

15. ఆరో పంచవర్ష ప్రణాళిక అమలు చేసిన కాలం ఏది?

జ: 1980 - 85
 

16. భారత ఆర్థిక వ్యవస్థను సాధారణంగా కిందివిధంగా వర్ణిస్తారు?
1) పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ    2) మిశ్రమ ఆర్థిక వ్యవస్థ    
3) సామ్యవాద ఆర్థిక వ్యవస్థ     4) ఏదీకాదు

జ: 2(మిశ్రమ ఆర్థిక వ్యవస్థ)
 

17. హరడ్ - డోమర్ వృద్ధి నమూనా ఏ ప్రణాళికకు ఆధారమైంది?
జ: 1వ

 

18. మౌలిక, భారీ పరిశ్రమలకు అధిక ప్రాధాన్యం ఇచ్చిన ప్రణాళిక ఏది?
జ: 2వ

 

19. సామాజిక అభివృద్ధి పథకాన్ని (సీడీపీ) ఒక తీర్థయాత్రగా ఎవరు వర్ణించారు?
జ: ఎస్.కె. డే

 

20. ధైర్యంతో కూడిన ప్రణాళిక అని కిందివాటిలో ఏ ప్రణాళికను పిలుస్తారు?
1) 1వ      2) 2వ      3) 10వ      4) 11వ
జ: 2(2వ)

 

21. విదేశీ మారకద్రవ్య నిరోధక చట్టం (ఫెరా) రూపొందించిన సంవత్సరం ఏది?
జ: 1973

 

22. కిందివాటిలో నూతన ఆర్థిక సంస్కరణల్లో భాగం కానిది ఏది?
1) స్ట్రక్చరల్ రిఫారమ్స్ (నిర్మాణాత్మక సంస్కరణలు)     2) విత్తరంగ సంస్కరణలు
3) జనాభా విధానం                                4) కోశ సంస్కరణలు
జ: 3(జనాభా విధానం)

 

23. 3వ పంచవర్ష ప్రణాళిక ఎవరి నమూనా ప్రకారం రూపొందించారు?
జ: అశోక్ మెహతా

 

24. భారతదేశంలో నిరంతర ప్రణాళికలను రూపొందించిన ఆర్థికవేత్త ఎవరు?
జ: లకడవాలా

 

25. స్వాతంత్య్రం తర్వాత ప్రణాళికల్లో జరిగిన కృషి వల్ల భారత ఆర్థిక వ్యవస్థను ఏవిధంగా పేర్కొంటారు?
జ: అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ

 

26. 4వ పంచవర్ష ప్రణాళిక దేనిపై ఆధారపడి ఉంది?
జ: గాడ్గిల్ నమూనా

 

27. కిందివాటిలో 8వ పంచవర్ష ప్రణాళిక లక్ష్యాలు ఏవి?
ఎ) జనాభా వృద్ధిని నిరోధించడం
బి) వృద్ధి ప్రక్రియను కొనసాగించేందుకు అవస్థాపనా సదుపాయాలను బలోపేతం చేయడం
సి) శతాబ్ద అంతానికి సంపూర్ణ ఉద్యోగిత సాధించేందుకు సరిపడే ఉపాధి సృష్టించడం
జ: ఎ, బి, సి

 

28. కిందివాటిలో రాజా చెల్లయ్య కమిటీని ఏ సంస్కరణల కోసం నియమించారు?
1) పన్ను సంస్కరణలు    2) భూసంస్కరణలు    3) సేవా సంస్కరణలు    4) వర్తక సంస్కరణలు

జ: 1(పన్ను సంస్కరణలు)
 

29. భారత్‌లో ప్రణాళికల దీర్ఘకాలిక లక్ష్యం-
1) సాంఘిక న్యాయం                                                   
2) ఆర్థిక స్వావలంబన
3) ప్రజల జీవన ప్రమాణస్థాయిని పెంచుతూ అధికవృద్ధి రేటు 
4) అన్నీ
జ: 4(అన్నీ)

 

30. పేదరిక నిర్మూలన, స్వావలంబన లక్ష్యాలుగా ప్రారంభించిన ప్రణాళిక ఏది?
జ: 5వ

 

31. నిధుల మంజూరు విషయంలో మొదటిసారి ప్రణాళికా సంఘం విచక్షణాత్మక పరిధిని తగ్గించిన ఫార్ములా-
జ: గాడ్గిల్ ఫార్ములా

 

32. సాంద్ర వ్యవసాయ జిల్లాల కార్యక్రమాన్ని ఏ పంచవర్ష ప్రణాళికలో ప్రారంభించారు?
జ: 2వ

 

33. ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్ ఏ ప్రణాళికా కాలంలో ఏర్పడింది?
జ: 2వ

 

34. ఎడారి, కొండ ప్రాంతాల్లో 100 రోజులకు తక్కువ కాకుండా లాభదాయకమైన ఉపాధిని అందించేందుకు ప్రవేశపెట్టిన పథకం ఏది?
జ: ఉపాధి హామీ పథకం

 

35. అయిదో ప్రణాళిక ఎవరి నమూనా ప్రకారం రూపొందించారు?
జ: డి.పి. థర్

 

36. ప్రణాళికా సంఘానికి సంబంధించి కిందివాటిలో సరైంది ఏది?
1) రాజ్యాంగేతర సంస్థ                     2) సలహా సంఘం  
3) పార్లమెంటు చట్టంచే ఏర్పాటు చేసిన సంస్థ   4) అన్నీ సరైనవే
జ: 4(అన్నీ సరైనవే)

 

37. జాతీయ ఉపాధి గ్రామీణ హామీ పథకాన్ని (ఎన్ఆర్ఈపీ) ఏ ప్రణాళికా కాలంలో ప్రారంభించారు?
జ: 6వ

 

38. కిందివాటిలో పంచవర్ష ప్రణాళికా విరామం ఏది?
1) 1954 - 58      2) 1966 - 69      3) 1970 - 73      4) 1983 - 86
జ: 2(1966 - 69)

 

39. సింద్రీ ఎరువుల కర్మాగారం ఏర్పాటు చేసిన పంచవర్ష ప్రణాళిక ఏది?
జ: 1వ

 

40. మొదటి ప్రణాళికలో అధిక ప్రాధాన్యం దేనికి ఇచ్చారు?
జ: సత్వర వ్యవసాయాభివృద్ధి, యుద్ధం, దేశ విభజన వల్ల విచ్ఛిన్నమైన ఆర్థిక వ్యవస్థను నిర్మించడం

 

41. 10వ పంచవర్ష ప్రణాళికా ప్రారంభం నాటికి శ్రమశక్తిలో బ్యాక్‌లాగ్ నిరుద్యోగిత శాతం ఎంత?
జ: 9%

 

42. హరిత విప్లవం ప్రారంభించిన కాలం ఏది?
జ: వార్షిక ప్రణాళిక

 

43. రెండు విదేశీదాడులను ఎదుర్కొన్న ప్రణాళిక ఏది?
జ: 3వ

 

44. 9వ ప్రణాళికలో అధిక ప్రణాళికా కేటాయింపులు ఏ రంగంపై జరిగాయి?
జ: రవాణా - సమాచారం

 

45. బొకారో - ఇనుము ఉక్కు కర్మాగారం ఏ ప్రణాళికలో స్థాపించారు?
జ: 4వ

 

46. పేదరికాన్ని గుడ్డివాడు సైతం చూడగలడు అని వ్యాఖ్యానించింది ఎవరు?
జ: అమర్త్యసేన్

 

47. భారత ప్రణాళికల రూపశిల్పి ఎవరు?
జ: జవహర్‌లాల్ నెహ్రూ

 

48. రెండో పంచవర్ష ప్రణాళిక ప్రారంభం నుంచి భారతదేశం అవలంబించిన అభివృద్ధి వ్యూహం ఏ అంశాలపై ఆధారపడి ఉంది?
ఎ) ఎగుమతుల ప్రోత్సాహం   బి) దిగుమతుల ప్రతిస్థాపన  సి) భారీ పరిశ్రమలు డి) తేలిక పరిశ్రమలు
జ: బి, సి మాత్రమే

 

49. రోలింగ్ ప్రణాళికను ఏ కాలంలో రూపొందించారు?
జ: 1978 - 80

 

50. 5వ పంచవర్ష ప్రణాళిక ప్రధాన లక్ష్యం ఏమిటి?
జ: పేదరిక నిర్మూలన, ఆర్థిక స్వయంసమృద్ధిని సాధించడం

 

51. ఏ ప్రణాళికా కాలంలో సాధారణ ధరల స్థాయిలో తగ్గుదల ఏర్పడింది?
జ: 1వ

 

52. కిందివాటిలో ఆర్థికవేత్త లకడావాలా ప్రవేశపెట్టింది ఏది?
1) మానవ వనరుల ప్రణాళిక     2) రోలింగ్ ప్రణాళిక      
3) అభివృద్ధి ప్రణాళిక             4) ఆర్థిక ప్రణాళిక
జ: 2(రోలింగ్ ప్రణాళిక)

 

53. సేన్ పేదరికపు గీత సమాజంలో సంపద పంపిణీ కంటే సంక్షేమ పంపిణీని కొలిచిందని పేర్కొనడానికి కారణం...
జ: పేదరికపు గీతకు ప్రతి వ్యక్తి ఆదాయం ఎంత తక్కువ, ఎంత ఎక్కువ ఉందో కొలిచాడు

 

54. మన దేశ మొదటి పంచవర్ష ప్రణాళిక దేనికి ప్రాధాన్యం ఇచ్చింది?
జ: వ్యవసాయ రంగం

 

55. పంచాయతీరాజ్ వ్యవస్థను ఏ పంచవర్ష ప్రణాళికలో ప్రారంభించారు?
జ: 2వ

 

56. ప్రణాళికలను మొదటిసారిగా ప్రారంభించిన దేశం ఏది?
జ: రష్యా

 

57. 20 సూత్రాల కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రణాళిక ఏది?
జ: 5వ ప్రణాళిక (1975, జులై)

 

58. ఒరిస్సాలోని రూర్కెలా ఇనుము - ఉక్కు కర్మాగార స్థాపనకు సహాయం చేసిన దేశం ఏది?
జ: పశ్చిమ జర్మనీ

 

59. పేదరికపు తీవ్రతను అంచనా వేసేందుకు అతిపేద వర్గం అనే భావనను ఏ పంచవర్ష ప్రణాళికలో తీసుకొచ్చారు?
జ: 4వ

 

60. కిందివాటిలో రెండోతరం ఆర్థిక సంస్కరణలుగా వేటిని పిలుస్తారు?
1) శ్రామిక రంగంలో సంస్కరణలు       2) వ్యవసాయ రంగంలో సంస్కరణలు 
3) రాష్ట్రాలకు సంస్కరణల విస్తరణ       4) అన్నీ
జ: 4(అన్నీ)

 

61. 12వ పంచవర్ష ప్రణాళికా కాలం ఏది?
జ: 2012 - 17

 

62. భారతదేశంలో ప్రణాళికలు, వాటి లక్ష్యాలను ఏర్పరచుకోవడానికి మార్గదర్శకంగా పనిచేసేవి ఏవి?
జ: ఆదేశిక సూత్రాలు

 

63. Bold Plan అని ఏ ప్రణాళికను పిలుస్తారు?
జ: 2వ

 

64. Exim Bankను ఏ ప్రణాళికలో స్థాపించారు?
జ: 6వ

Posted Date : 16-09-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భారత ఆర్థిక సర్వే 

ఆర్థిక సర్వే  అంటే..?

* దేశ ఆర్థిక వ్యవస్థకు దిశా నిర్దేశం చేసేదిగా ఆర్థిక సర్వేను పేర్కొంటారు. ఏటా దీని ఆధారంగానే కేంద్ర బడ్జెట్‌ రూపకల్పన జరుగుతుంది.

*  సాధారణంగా కేంద్ర ముఖ్య ఆర్థిక సలహాదారు (Chief Economic Advisor-CEA) ఆధ్వర్యంలో ఈ నివేదికను రూపొందిస్తారు. ప్రస్తుత CEA వి.అనంత నాగేశ్వరన్‌.


ఆర్థిక సర్వే, బడ్జెట్‌  మధ్య తేడా

* ఆర్థిక సర్వేలో ప్రస్తుత ఏడాది దేశ ఆర్థిక వ్యవస్థ పనితీరును విశ్లేషిస్తారు. ఆర్థిక బలోపేతానికి రానున్న కాలంలో చేయాల్సిన చర్యలను పేర్కొంటారు.

* కేంద్ర బడ్జెట్‌లో వివిధ రంగాల్లో రాబడి, ఖర్చుల కేటాయింపులను మాత్రమే పేర్కొంటారు.


జీడీపీలో హెచ్చు, తగ్గులకు కారణం

* జీడీపీ పెరగాలంటే ప్రజల వినియోగం లేదా ఖర్చు లేదా కొనుగోలు శక్తి పెరగాలి. వినియోగం అధికమవ్వాలంటే ప్రజల ఆదాయం పెరగాలి. తద్వారా వినియోగం ఎక్కువై వస్తు, సేవలకు డిమాండ్‌ పెరిగి, ఉత్పత్తి అధికమవుతుంది. 

* ప్రజల ఆదాయం పెరగాలంటే వారికి దీర్ఘకాలిక ఉపాధి ఉండాలి. కాబట్టి ప్రభుత్వాలు దేశ ప్రజల జీవనోపాధికి రక్షణ కల్పించి, ప్రత్యక్ష నగదు సహాయం ద్వారా వారి కొనుగోలు శక్తిని మెరుగుపరచాలి.

ఉదా: జీడీపీ అనేది ఒక విద్యార్థి మార్కుల జాబితా లాంటిది. ఒక సంవత్సరంలో ఒక విద్యార్థి పనితీరును, ఆ పాఠ్యాంశాల్లో సదరు విద్యార్థికి ఏ విధంగా పట్టుందనే విషయాన్ని తనకు వచ్చే మార్కుల ద్వారా తెలుసుకోవచ్చు. అదేవిధంగా దేశ ఆర్థిక కార్యకలాపాల స్థాయిని, అందులో వివిధ రంగాలు, అంశాల బలాబలాలను జీడీపీ ద్వారా తెలుసుకోవచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వ్యవస్థ బాగుందో, లేదో కూడా ఇది పేర్కొంటుంది. మందగమనం ఉన్నట్లు జీడీపీ గణాంకాలు సూచిస్తే, దేశ ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలో ఉందని అర్థం. అంటే దేశంలో గడచిన సంవత్సరంతో పోలిస్తే తగినన్ని వస్తు, సేవల ఉత్పత్తి జరగడం లేదని భావించాలి.

* ప్రస్తుతం మన దేశంలో జాతీయ గణాంక కార్యాలయం(National Statistical Office - NSO)  ఏటా 4 సార్లు (ఏప్రిల్‌-జూన్, జులై-సెప్టెంబరు, అక్టోబరు-డిసెంబరు, జనవరి-మార్చి) జీడీపీని లెక్కిస్తుంది. 

* ప్రతి 3 నెలలకోసారి చేపట్టే ఈ లెక్కలను ఆర్థిక పరిభాషలో త్రైమాసిక గణాంకాలు అంటారు. భారత్‌ లాంటి అల్పాదాయ, మధ్య ఆదాయ దేశాలు పెరుగుతున్న జనాభా అవసరాలు తీర్చేందుకు ఏటా అధిక జీడీపీ సాధించడం ముఖ్యం.


2022-23 ఆర్థిక సర్వే - జీడీపీ వృద్ధిరేట్ల గణాంకాలు

*  భారత్‌ ప్రపంచ దేశాలతో పోలిస్తే, అత్యంత వేగంగా వృద్ధిని సాధిస్తోందని ఆర్థిక సర్వే తెలిపింది. 

*  దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు (జీడీపీ) 2022-23 లో 7 శాతం నమోదవుతుందని ప్రకటించింది. 2023-24 లో ఇది 6% నుంచి 6.8 శాతం మధ్య ఉండొచ్చని సర్వే అంచనా వేసింది.

* కొనుగోలు శక్తి (Purchasing Power  Parity - PPP) పరంగా ప్రపంచంలోనే భారత్‌ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉందని వెల్లడించింది. దేశీయంగా వినియోగం పెరుగుతున్నందున ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని సర్వే తెలిపింది.

* 202223 సర్వే ప్రకారం, నికర జాతీయ తలసరి ఆదాయం ప్రస్తుత ధరల వద్ద రూ.1,70,620 ఉండగా, స్థిర ధరల వద్ద రూ.96,522 గా ఉంది. 

* 2021లో ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగల మొదటి 10 దేశాల్లో భారత్‌ ఆరో స్థానంలో ఉందని 2022, జులై 1న ప్రపంచ బ్యాంకు తెలిపింది.

* స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రిసెర్చ్‌ విభాగం 2022, సెప్టెంబరు 1న విడుదల చేసిన నివేదిక ప్రకారం, ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగల మొదటి 10 దేశాల్లో (2022లో) భారత్‌ అయిదో స్థానంలో ఉందని పేర్కొంది. భారత ఆర్థిక వ్యవస్థ 6.5 - 7 శాతం వృద్ధితో 2025-26 నాటికి 5 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేరొచ్చని ఈ విభాగం అంచనా వేసింది. 

* గత 30 ఏళ్లుగా భారత జీడీపీ డాలర్ల రూపేణా సగటున 9 శాతం వార్షిక వృద్ధిని కనబరిచింది. డాలరుతో పోలిస్తే రూపాయి విలువ క్షీణించినప్పటికీ భారత్‌ ఈ వృద్ధిని నమోదు చేసింది.

* ఒకవేళ రూపాయి బలోపేతమైతే డాలర్ల రూపేణా 9 శాతం కంటే అధికవృద్ధిని సాధించే అవకాశం ఉంటుంది. అప్పుడు 2030 నాటికి 7 లక్షల కోట్ల డాలర్లకు ఆర్థిక వ్యవస్థ చేరొచ్చని సర్వే తెలిపింది. 

* 2022-023 ఆర్థిక సర్వే ప్రకారం, ప్రస్తుత ధరల వద్ద 2022-23 లో భారత జీడీపీ రూ.2,73,07,751 లక్షల కోట్లుగా ఉండగా, 202122లో 2,36,64,637 లక్షల కోట్లుగా ఉంది. అంటే గతేడాది నుంచి రూ.36,43,114 లక్షల కోట్లు మాత్రమే పెరిగింది.

* 2022-23లో ప్రైవేట్‌ అంతిమ వినియోగం (ప్రజల వినియోగం) ఎంతో ఆకర్షణీయంగా (60.1%) ఉంది. ద్రవ్యోల్బణం అధిక స్థాయుల నుంచి దిగి వచ్చినప్పటికీ, ఆర్‌బీఐ నిర్దేశించిన 6% కంటే అధికంగా (6.8%) ఈ ఆర్థిక సంవత్సరంలో నమోదు కావొచ్చని పేర్కొంది.

* భారత్‌లోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా కంపెనీలకు (MSME)  ఆర్థిక చేయూతను అందించేందుకు కేంద్రం ఉద్దేశించిన అత్యవసర రుణ అనుసంధానిత హామీ పథకం(Emergency Credit Line Guarantee Scheme - ECLGS) వాటి ప్రగతికి దోహదం చేసిందని సర్వే తెలిపింది. 

* దేశంలో 6 కోట్ల MSME ల్లో 12 కోట్ల మంది పని చేస్తున్నారు. జీడీపీలో ఎంఎస్‌ఎంఈల వాటా 35%. 

* ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23) తొలి ఎనిమిది నెలల కాలంలో కేంద్ర ప్రభుత్వ పెట్టుబడి వ్యయాలు 63.4% పెరిగాయి. ఈ ఏడాది నిర్దేశించుకున్న 7.5 లక్షల కోట్ల పెట్టుబడి వ్యయాల లక్ష్యం పూర్తి కావొచ్చని  ఆర్థిక సర్వే అంచనా వేసింది.


ఆర్థిక సర్వేలో ఉండే అంశాలు

* దేశ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉందనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. ముఖ్యంగా ప్రధాన రంగాలైన వ్యవసాయం, పారిశ్రామికోత్పత్తి, మౌలిక సదుపాయాలు, ఎగుమతి - దిగుమతులు, విదేశీ మారకనిల్వలు, నగదు చలామణి, ఉద్యోగాలు, ధరల పెరుగుదల లాంటి అంశాలను వివరిస్తుంది. 

* ప్రభుత్వ విధాన నిర్ణయాలు, వాటివల్ల వస్తోన్న ఫలితాలను విశ్లేషిస్తుంది.


ఆర్థిక సర్వే పరిణామ క్రమం

* బడ్జెట్‌ కంటే ముందు ఆర్థిక సర్వేను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టడం ఎన్నో ఏళ్లుగా ఆనవాయితీగా వస్తోంది. దీన్ని మొదటిసారి 195051లో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. 

*  1964 నుంచి దీన్ని బడ్జెట్‌కి ముందు ప్రత్యేకంగా ప్రవేశపెడుతున్నారు. 

* కేంద్ర బడ్జెట్‌లో కేటాయింపుల ప్రతిపాదనలను తేలిగ్గా అర్థం చేసుకోవడానికి  దీన్ని ప్రత్యేకంగా ప్రకటిస్తున్నారు.


స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు

* ఒక ఇంట్లో నలుగురు ఉంటే, అందరూ పనిచేసి సంపాదించిన మొత్తం సొమ్మును ఆ ఇంటి ఆదాయం అంటారు. అదే విధంగా ఒక దేశంలోని ప్రజలంతా కలిసి ఉత్పత్తిచేసే వస్తు, సేవల విలువను జీడీపీ అంటారు. 

* ప్రపంచంలోని దేశాల ఆర్థిక పరిస్థితిని జీడీపీ ఆధారంగానే అంచనావేస్తారు. ప్రస్తుత ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన మొదటి పది దేశాల జాబితాలో భారత్‌ ఉంది. 

* దేశ ఆర్థిక వ్యవస్థ ఒక సంవత్సరంలో ఉత్పత్తి చేసిన వస్తు, సేవల నికర విలువను జీవీఏ (Gross Value Added - GVA) అంటారు. 

* ఉత్పత్తికి ఉపయోగించిన ముడి పదార్థాల విలువను వస్తు, సేవల మొత్తం విలువ నుంచి మినహాయిస్తే జీవీఏ వస్తుది. దీనికి అన్ని ఉత్పత్తులకు సంబంధించిన పన్నులను కలిపి, సబ్సిడీలను మినహాయిస్తారు. ఈ విధంగా చేశాక వచ్చిన మొత్తమే జీడీపీ.


వివిధ సంస్థల ప్రకారం, 2023లో భారతదేశ జీడీపీ వృద్ధి రేట్ల అంచనాలు (శాతాల్లో)

సంస్థ  వృద్ధిరేటు
ఎస్‌ అండ్‌ పి 7.3
ఏషియన్‌ డెవలప్‌మెంట్‌బ్యాంక్‌    7
మూడీస్‌  7
ఫిచ్‌ 7
గోల్డ్‌మ్యాన్‌ సాక్స్‌ 7
ప్రపంచ బ్యాంకు 6.9

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) 

6.8
స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) 6.8
ఇంటర్నేషనల్‌ మానిటరింగ్‌  ఫండ్‌ (ఐఎంఎఫ్‌) 6.8
సిటీ గ్రూప్‌ 6.7
ఆర్గనైజేషన్‌ ఫర్‌ ఎకనమిక్‌ కో-ఆపరేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (ఓఈసీడీ)  6.6

ఆధారం: ఆర్థిక సర్వే 2022-23 


గమనిక: సగటు వృద్ధి రేటు 6.9 శాతం

Posted Date : 19-04-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

వ్యవస్థాగత ప్రగతికి మార్గదర్శకాలు!

ప్రణాళికలు

స్వాతంత్య్రానంతరం దేశ ప్రజల అవసరాలు, ఆకాంక్షలను తీర్చేందుకు అందుబాటులో ఉన్న  వనరులను పూర్తిస్థాయిలో వినియోగించుకునే ఉద్దేశంతో ప్రణాళికా సంఘం ఏర్పాటైంది. అయిదేళ్ల స్వల్పకాల లక్ష్యంతో వివరణాత్మక ప్రణాళికలను రూపొందించి పంచవర్ష ప్రణాళికలుగా అమలు చేసింది. వ్యవసాయంతో పాటు ఆర్థిక, పారిశ్రామిక రంగాల్లో ప్రగతి సాధనకు విధానాలను, చట్టాలను రూపొందించి వ్యవస్థాగత మార్పులు తీసుకొచ్చింది. ప్రణాళికల వారీగా ఎంచుకున్న ప్రాధాన్య రంగాలు, ప్రారంభించిన పథకాలు, అనంతర కాలంలో ఆయా పథకాల్లో జరిగిన మార్పుల గురించి పరీక్షార్థులు తెలుసుకోవాలి. ప్రణాళికల లక్ష్యసాధనలో ఎదురైన అవరోధాలు, అనుకోని పరిణామాలతో పాటు జాతీయ ప్రాధాన్యం ఉన్న పథకాల ఉద్దేశాలు, వాటి అమలుతీరు, అందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాలు, వివిధ రంగాలపై నియంత్రణ కోసం ఏర్పాటైన ఆర్థిక సంస్థలు, వాటి ప్రస్తుత సారథుల గురించి అవగాహన ఉండాలి.

ఆన్‌లైన్ ప‌రీక్ష కోసం క్లిక్ చేయండి...


1.    కిందివాటిలో సరికానిది?

1) లీడ్‌ బ్యాంకు  నారీమన్‌                  2) RWP - 1970

3) FEMA  2000 సంవత్సరం      4) బొకారో  ఛత్తీస్‌గఢ్‌


2.     4వ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు?

1) డి.పి.ధర్‌     2) డి.ఆర్‌.గాడ్గిల్‌  

3) సి.ఎమ్‌.త్రివేది     4) వి.టి.కృష్ణమాచారి


3.     ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులపై వేసిన కమిటీ?

1) ఆర్‌.సరయూ      2) నరసింహన్‌ 

3) ఎ.ఎమ్‌.ఖుస్రో     4) పైవన్నీ


4.     ఏ రాష్ట్రంలో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు లేవు?

1) సిక్కిం   2) గోవా  3) 1, 2     4) ఢిల్లీ


5.    ప్రస్తుతం CACP ఛైర్మన్‌?

1) అజయ్‌ భూషణ్‌ పాండే  2) దేబాషిస్‌ పాండే 

3) మాధబీ పురీ బుచ్‌       4) విజయ్‌ పౌల్‌ శర్మ


6.     NREP పథకంలో కేంద్ర రాష్ట్రాల వాటా?

1) 50 : 50      2) 80 : 20  

3) 75 : 25     4) 90 : 10 


7.     కిందివాటిలో సరికానిది ఏది?

1) NREP + RLEGP = JRY     2) UBS ని PMIUPEP లో విలీనం చేశారు

3) SEEUY - గ్రామీణ ఉపాధి    4) IAY - 1985


8. కిందివాటిని జతపరచండి. 

1) RLEGP         A) 1975

2) RRBS            B) 1977

3) FWP              C) 1969

4) Lead bank      D) 1983

1) 1-A, 2-B, 3-C, 4-D   2) 1-D, 2-A, 3-B, 4-C

3) 1-B, 2-C, 3-D, 4-A   4) 1-D, 2-C, 3-B, 4-A


9.     కిందివాటిలో సమగ్ర పంటల బీమా పథకానికి సంబంధించి సరైనవి?

ఎ) 1985 రబీలో ప్రారంభమైంది        బి) బీమా గరిష్ఠం రూ.10 వేలు

సి) 1997లో రద్దు అయ్యింది    డి) పంట రుణాలున్న వారికి వర్తిస్తుంది

1) ఎ, బి   2) బి, సి, డి     3) సి, డి     4) బి 


10. SICA చట్టాన్ని సిఫార్సు చేసినవారు?

1) ఎన్‌.డి.తివారీ     2) దాస్‌ గుప్త 

3) హజారీ     4) దత్‌


11. ప్రస్తుత సెబీ (SEBI) డైరెక్టర్‌?

1) అజయ్‌ త్యాగి     2) మాధబీ పురీ బుచ్‌

3) కె.వి.షాజీ     4) ఎన్‌.కె.సిన్హా 


12. కిందివాటిలో సరికానిది? 

1) NLM -- 1988 2) OBB -- 1987

3) JRY -- 1990 4) MDM -- 1995


13. ఏ ప్రణాళిక ఒక సంవత్సరం ముందుగానే ముగిసింది?

1) 4వ    2) 6వ     3) 5వ     4) 7వ


14. JRY పథకంలో కేంద్ర రాష్ట్రాల వాటాల శాతం?

1) 50 : 50 2) 80 : 20 3) 90 : 10 4) 75 : 25


15. రెపో రేటు అంటే?

1) స్వల్పకాలిక రుణం     2) స్వల్పకాలిక వడ్డీ 

3) దీర్ఘకాలిక రుణం     4) దీర్ఘకాలిక వడ్డీ


16. NRF పథకం ప్రారంభంలో ఎంత మొత్తం కేటాయించారు?     

1) రూ.1,000 కోట్లు     2) రూ.3,000 కోట్లు 

3) రూ.2,000 కోట్లు     4) రూ.10,000 కోట్లు


17. MPLADS పథకం ముఖ్య ఉద్దేశం?

1) గ్రామీణ మౌలిక వసతులు  2) గ్రామీణ ఉపాధి 

3) గ్రామీణ ఆహార భద్రత      4) పైవన్నీ 


18. జాతీయ వ్యవసాయ బీమా పథకం ఎప్పుడు ప్రారంభమైంది?  

1) 1997 - 98     2) 1999 - 2000 

3) 2000 - 01     4) 2004 - 05


19. కిందివాటిలో సమగ్ర శిక్షా అభియాన్‌కు సంబంధించి సరికానిది?

1) ఉపాధ్యాయుల నియామకం     2) పాఠ్యపుస్తకాల పంపిణీ

3) అదనపు తరగతి గదుల నిర్మాణం 4) ఉపాధ్యాయుల జీతభత్యాల ఏర్పాటు


20. భారత్‌ నిర్మాణ్‌లో ఎన్ని కార్యకలాపాలు ఉంటాయి? 

1) 6      2) 8     3) 7    4) 5


21. FRBM చట్టం ముఖ్య ఉద్దేశం?

1) రెవెన్యూ లోటును పూర్తిగా నిర్మూలించడం     2) కోశ లోటు పెంచడం 

3) ప్రాథమిక లోటు రద్దు 4) బడ్జెట్‌ వ్యయాన్ని తగ్గించడం


22. PURA ఉద్దేశం?

1) భౌగోళిక అనుసంధానాలు 2) మార్కెట్‌ అనుసంధానాలు

3) విజ్ఞాన అనుసంధానాలు         4) పైవన్నీ 


23. NREGAకి సంబంధించి సరైంది?

ఎ) 2005లో చట్టం చేశారు     బి) 100 రోజులు పని కల్పించాలి 

సి) కరవు రోజుల్లో పనిదినాలను 150 రోజులకు పెంచాలి 

డి) ఈ పథకంలో కేంద్రం వాటా 90%

1) ఎ, బి  2) ఎ, బి, సి, డి   3) ఎ, బి, డి  4) బి


24. జాతీయ ఆహార భద్రతా మిషన్‌కు సంబంధించి సరికానిది?

1) ఆహారధాన్యాల్లో వరిని అధికంగా పెంచాలి       2) పప్పుధాన్యాలు 2 మిలియన్‌ టన్నులకు పెంచాలి     

3) దీన్ని హైదరాబాద్‌లో ప్రారంభించారు     4) ఈ పథకంలో కేంద్రం వాటా 100%


25. రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజనలో వ్యవసాయ రంగంలో వృద్ధి లక్ష్యం?

1) 4%   2) 5%   3) 9.5%   4) 6% 


26. రాష్ట్రీయ స్వస్థ్యా బీమా యోజనలో ఇచ్చే నగదు రహిత మొత్తం ఎంత? 

1) రూ.10,000     2) రూ.20,000 

3) రూ.30,000     4) రూ.75,000


27. కిందివాటిలో ఆమ్‌ఆద్మీ బీమా యోజన ఎవరికి వర్తిస్తుంది?

1) గ్రామీణ కూలీలు     2) భూమి లేని గ్రామీణులు 

3) గ్రామీణ సంఘటిత కార్మికులు   4) 1, 2 


28. ఉజ్వల పథకం ఉద్దేశం?

1) గ్యాస్‌ పంపిణీ     2) ఎల్‌ఈడీ బల్బులు     

3) లైంగిక వృత్తి వారికి     4) మహిళలకు


29. సుకన్య సమృద్ధి యోజన ఎప్పుడు ప్రారంభమైంది?

1) 2015, జనవరి 23    2) 2015, జనవరి 22

3) 2014, జనవరి 22    4) 2016, జనవరి 22


30. దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ అంత్యోదయ యోజన లక్ష్యం? 

1) మహిళల స్వయంఉపాధి     2) మహిళల వేతన ఉపాధి 

3) మహిళల రాజకీయ ప్రవేశం    4) పైవన్నీ 


31. ప్రస్తుతం హెచ్‌డీఎఫ్‌సీ ఎండీ, సీఈఓ?

1) శశిధర్‌ జగదీశన్‌     2) నవీన్‌ ప్రకాష్‌ సింగ్‌

3) రాకేశ్‌ శర్మ     4) అశోక్‌ కేమినా


32. ప్రస్తుతం భారతదేశంలో ICDS ప్రాజెక్టుల సంఖ్య?

1) 55,607     2) 13.63 లక్షలు 

3) 8,70,000     4) 10.68 లక్షలు 


33. గ్రామీణ పనుల కార్యక్రమం (RWP) ప్రధాన ఉద్దేశం? 

1) 1000 గ్రామాల్లో 12 నెలలు ఉపాధి 

2) 1000 గ్రామాల్లో 10 నెలలు ఉపాధి 

3) 100 జిల్లాల్లో 10 నెలలు ఉపాధి 

4) 1000 మండలాల్లో 10 నెలలు ఉపాధి 


34. విజయా బ్యాంకును ఏ బ్యాంకులో విలీనం చేశారు? 

1) కెనరా బ్యాంకు     2) ఇండియన్‌ బ్యాంకు

3) బరోడా బ్యాంకు     4) ఆంధ్రా బ్యాంకు 


35. 4వ ప్రణాళిక విఫలం చెందడానికి కారణం?

1) 1975లో పాకిస్థాన్‌తో యుద్ధం 

2) 1973లో అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు పెరగడం 

3) బంగ్లాదేశ్‌ కాందిశీకుల భారం పెరగడం 

4) పైవన్నీ 


36. భారతదేశంలో తొలిసారిగా మూల్యహీనీకరణ చేసినవారు?

1) మన్మోహన్‌ సింగ్‌     2) సుచేంద్ర చౌదరి 

3) జాన్‌ మత్తాయ్‌     4) షణ్ముగం శెట్టి


37. బొకారో ఇనుము ఉక్కు కర్మాగారం సామర్థ్యం?

1) 10 మి.టన్నులు     2) 16,000 మి.టన్నులు

3) 10,000 మి.టన్నులు     4) 20,000 మి.టన్నులు 


38. కిందివాటిలో ఎవరికి కనీస మద్దతు ధరలు ప్రకటిస్తారు?

1) ప్రజాపంపిణీ వ్యవస్థకు     2) వ్యాపారులకు 

3) రైతులకు        4) పైవారందరికీ


39. ప్రస్తుతం ఫార్మాస్యూటికల్స్‌లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితి ఎంత శాతం? 

1) 74%  2) 51%  3) 100%  4) 26%


40. రెండో ప్రణాళిక విఫలం చెందడానికి కారణం?

1) యుద్ధాలు         2) విదేశీ మారకనిల్వలు తగ్గడం 

3) వాతావరణ పరిస్థితులు  4) రాజకీయ అనిశ్చితి


41. PURA నమూనాలో ఎన్ని అనుసంధానాలు ఉంటాయి?

1) 4          2) 5          3) 2         4) 10


42. నీతి ఆయోగ్‌ ప్రకారం ఎన్ని సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు ఉన్నాయి?

1) 16          2) 17         3) 20        4) 7


43. జాతీయ అభివృద్ధి మండలి స్థానంలో ఏర్పడిన సంస్థ?

1) ఈ-కౌన్సెలింగ్‌     2) ఈ-గవర్నెన్స్‌ 

3) ఈ-కామర్స్‌     4) ఈ-ఛాంబర్స్‌


44. మొదటి ప్రణాళిక ఎవరి నమూనా ఆధారంగా విజయవంతమైంది?

1) హరాడ్‌ - డోమర్‌  2) మోక్షగుండం విశ్వేశ్వరయ్య  

3) అశోక్‌ మెహతా   4) డి.ఆర్‌.గాడ్గిల్‌


45. రెండో ప్రణాళికా కాలంలో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ సంఖ్య ఎంత?

1) 32     2) 40     3) 16    4) 24



సమాధానాలు

1-4; 2-2; 3-4; 4-3; 5-4; 6-1; 7-3; 8-2; 9-2; 10-1; 11-2; 12-3; 13-3; 14-2; 15-2; 16-3; 17-1; 18-2; 19-4; 20-1; 21-1; 22-4; 23-2; 24-4; 25-1; 26-3; 27-4; 28-3; 29-2; 30-1; 31-1; 32-2; 33-2; 34-3; 35-4; 36-3; 37-3; 38-3; 39-3; 40-2; 41-1; 42-2; 43-2; 44-1; 45-2. 

ఆన్‌లైన్ ప‌రీక్ష కోసం క్లిక్ చేయండి...


ర‌చ‌యిత‌: ధ‌ర‌ణి శ్రీనివాస్‌
 

Posted Date : 07-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భారత ద్రవ్య వ్యవస్థ - కరెన్సీ

ద్రవ్యం - రకాలు

స్వభావం ఆధారంగా ద్రవ్యాన్ని కింది విధాలుగా వర్గీకరించారు. అవి:

1. పదార్థాన్ని బట్టి ద్రవ్యం రకాల

2. చట్టబద్ధతను బట్టి ద్రవ్యం రకాలు

3. ద్రవ్యత్వాన్ని బట్టి ద్రవ్యం రకాలు

 4. ఇతర రకాలు

ద్రవ్యత్వాన్ని బట్టి ద్రవ్యం రకాలు ద్రవ్యం, ద్రవ్యత్వం రెండూ వేర్వేరు. ద్రవ్యత్వం అంటే నగదుగా లేదా అతి తక్కువ కాలంలో నగదుగా మార్చుకోవడానికి వీలున్న లక్షణాన్ని కలిగి ఉండటం.


ద్రవ్యత్వం ఆధారంగా ద్రవ్యాన్ని రెండు రకాలుగా వర్గీకరించారు. అవి: 

1. సామాన్య ద్రవ్యం (Ordinary money)

2.  సమీప ద్రవ్యం (Near money)

సామాన్య ద్రవ్యం: ప్రజల వద్ద చలామణిలో ఉన్న కరెన్సీ నోట్లు, నాణేలు, బ్యాంకులోని డిమాండ్‌ డిపాజిట్లను సామాన్య ద్రవ్యంగా పేర్కొంటారు. వీటిలో కరెన్సీ నోట్లు, నాణేలు నగదు రూపంలో ఉంటాయి. డిమాండ్‌ డిపాజిట్లను అతి తక్కువ కాలంలో నగదుగా మార్చుకోవచ్చు.

సమీప ద్రవ్యం: ట్రెజరీ బిల్లులు, బాండ్లు, డిబెంచర్లు, కాలపరిమితి డిపాజిట్లు, ప్రామిసరీ నోట్లు మొదలైనవాటిని సమీప ద్రవ్యంగా పేర్కొంటారు.


ఇతర రకాలు

రిజర్వ్‌ ద్రవ్యం లేదా అధిక శక్తిమంతమైన ద్రవ్యం (High powerd money)

ఆర్‌బీఐ జారీ చేసిన డబ్బును ప్రజలు చలామణి చేస్తారు. వారు తమ వద్ద అధికంగా ఉన్న మొత్తాన్ని ఇతర బ్యాంకుల్లో నిల్వ చేసుకుంటారు. దీన్నే రిజర్వ్‌ ద్రవ్యం లేదా మూలాధార ద్రవ్యం అని కూడా అంటారు. ఇందులో మూడు భాగాలు ఉన్నాయి.

RM=C+OD+CR

ఇందులో C= కరెన్సీ; OD = రిజర్వ్‌ బ్యాంకు వద్ద ఉన్న ఇతర డిపాజిట్లు; CR= వాణిజ్య బ్యాంకుల వద్ద ఉన్న నగదు నిల్వలు.

* ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సరఫరా అనేది రిజర్వ్‌ ద్రవ్య పరిమాణం, ద్రవ్య గుణకంపై ఆధారపడి ఉంటుంది.

ద్రవ్య గుణకాన్ని కింది విధంగా నిర్వచిస్తారు.

ద్రవ్య సప్లయ్‌ లేదా నిల్వ ద్రవ్యం (రిజర్వ్‌ ద్రవ్యం)

M=m,RM

m=M/RM

ఇందులో M = ద్రవ్య సప్లయ్‌ 

RM = రిజర్వ్‌ లేదా నిల్వ ద్రవ్యం సప్లయ్‌

m = ద్రవ్య గుణకం

అకౌంట్‌ మనీ: దేశంలోని అకౌంట్స్‌ను నిర్వచించడానికి ఉపయోగించే ద్రవ్యాన్ని అకౌంట్‌ ద్రవ్యం అంటారు. 

ఉదా: భారత్‌లో రూపాయి, అమెరికాలో డాలర్, జపాన్‌లో యెన్‌.

వ్యవహారిక ద్రవ్యం: వ్యాపార వ్యవహారాలను నిర్వహించడానికి ఉపయోగించే సాధనాన్ని వ్యవహారిక ద్రవ్యం అంటారు.

వాస్తవ ద్రవ్యం: ఒక దేశంలో ఆచరణలో ఉన్న ద్రవ్యాన్ని వాస్తవ ద్రవ్యం అంటారు.

ఐచ్ఛిక ద్రవ్యం: ప్రజలు దీన్ని అంగీకరిస్తారు. కానీ వీటికి చట్టబద్ధ అనుమతి ఉండదు. ఉదా: చెక్కులు

ప్రాతినిధ్య ద్రవ్యం (Representative money) : చలామణిలో ఉండి, వినిమయ మాధ్యమంగా పనిచేసే ద్రవ్యం.

ఫ్లోటింగ్‌ మార్పిడి ధర

మార్కెట్‌ శక్తుల డిమాండ్, సప్లయ్‌ ఆధారంగా నిర్ణయించే మారకం ధరను ఫ్లోటింగ్‌ మార్పిడి ధర అంటారు. దీన్నే హెచ్చుతగ్గులు లేదా అనువైన మారకపు రేటు అని కూడా పిలుస్తారు.

పదార్థాన్ని బట్టి ద్రవ్యం రకాలు

ద్రవ్యంగా ఉపయోగించే పదార్థం ఆధారంగా ద్రవ్యం రెండు రకాలుగా ఉంటుంది. అవి: 1. లోహ ద్రవ్యం    2. కాగితం ద్రవ్యం

లోహ ద్రవ్యం: 

ప్రత్యేక లోహాన్ని ఉపయోగించి దీన్ని తయారు చేస్తారు. దీన్నే వస్తు ద్రవ్యం Commodity money అని కూడా అంటారు. లోహ ద్రవ్యంలో బంగారం, వెండి, రాగి, నికెల్‌ మొదలైన నాణేలు ఉంటాయి. పూర్వం అమెరికాలో 23.2 గ్రెయిన్‌ల బరువున్న బంగారాన్ని ఒక డాలర్‌గా వాడేవారు.

* లోహ ద్రవ్యంలో 3 రకాలు ఉన్నాయి.

ఎ) ప్రామాణిక ద్రవ్యం standard money : దీన్నే పూర్తి ప్రమాణం కలిగిన నాణేలు అంటారు. వీటిని బంగారం లేదా వెండితో తయారు చేస్తారు.

* ప్రామాణిక ద్రవ్యాన్ని ముఖ ద్రవ్యం లేదా పూర్తి ఆకారం ఉన్న ద్రవ్యంగా కూడా పిలుస్తారు.

* ప్రామాణిక నాణేన్ని ఒకే లోహంతో తయారుచేస్తే ఈ ద్రవ్యవ్యవస్థను ఏకధాతు విధానం అంటారు.

* ప్రామాణిక నాణేలను బంగారం, వెండి కలయికతో చేస్తే ద్విధాతు విధానం అంటారు. 

* ప్రామాణిక ద్రవ్యం ముఖ విలువ, అంతర్గత విలువ (లోహ విలువ) ఒకేలా ఉటుంది. ప్రస్తుతం ఇది చలామణిలో లేదు. 

ఉదా: 1835-93 మధ్య మన దేశంలో 10 గ్రా. బరువున్న వెండి రూపాయి నాణెం ఉండేది.


బి) చిహ్నద్రవ్యం/ లాంఛన ద్రవ్యం ( Token money) : చిహ్న ద్రవ్యం ముఖ విలువ కంటే దాని అంతర్గత విలువ (లోహ విలువ) తక్కువగా ఉంటుంది. ప్రస్తుతం చలామణిలో ఉన్న నాణేలు ఈ రకానికి చెందుతాయి.

* చిహ్న ద్రవ్యాన్ని కృతిక నాణేలు, తక్కువ ప్రమాణం ఉన్న నాణేలు అని కూడా పిలుస్తారు.

*  వీటిని సాధారణంగా రాగి, నికెల్‌ లాంటి నాసిరకం, తేలిక లోహాలతో తయారు చేస్తారు. 

ఉదా: ప్రస్తుతం దేశంలో అమల్లో ఉన్న 5 రూపాయల నాణెం.


సి) అనుబంధ ద్రవ్యం( Subsidiary money) : తేలిక లోహాలతో తయారుచేసిన తక్కువ విలువ ఉన్న నాణేలను అనుబంధ నాణేలు అంటారు. ఉదా: పావలా, పదిపైసల నాణేలు.

కాగితపు ద్రవ్యం: 

మన దేశంలో కాగితం ద్రవ్యాన్ని 3 రకాలుగా చెప్పొచ్చు. అవి: 

ఎ) పరివర్తనీయ కాగిత ద్రవ్యం( Convertible paper currency) : బంగారం, వెండి లాంటి లోహాలతో మార్పిడి చేసుకోవడానికి వీలుండే కాగితపు ద్రవ్యాన్ని పరివర్తనీయ కాగితపు ద్రవ్యం అంటారు.

బి) అపరివర్తనీయ కాగితం ద్రవ్యం( Non-Convertible paper currency)  : బంగారం, వెండి లాంటి లోహాలతో మార్పిడి చేసుకోవడానికి వీలుకాని కాగితపు ద్రవ్యాన్ని అపరివర్తనీయ కాగితపు ద్రవ్యం అంటారు.

సి) ఆజ్ఞాపూర్వక లేదా శాసన కాగితం ద్రవ్యం: కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో శాసనం ద్వారా ద్రవ్యంగా చలామణిలో ఉంచే ద్రవ్యం. ఇది కొద్ది కాలం మాత్రమే ఉపయోగంలో ఉంటుంది.


చట్టబద్ధతను బట్టి ద్రవ్యం రకాలు

చెల్లింపు మాధ్యమం ఆధారంగా చట్టప్రకారం సమ్మతించే బ్యాంకు నోట్లు, నాణేలను చట్టబద్ధమైన ద్రవ్యం(legal tender money) అంటారు. ఇందులో రెండు రకాలు ఉన్నాయి. అవి:

ఎ) పరిమిత చట్టబద్ధ ద్రవ్యం ( limmited legal tender money)

బి) అపరిమిత చట్టబద్ధ ద్రవ్యం (unlimited legal money)


పరిమిత చట్టబద్ధ ద్రవ్యం: 

ఒక పరిమితికి మించి అధిక మొత్తంలో ఒకేసారి చెల్లిస్తే చట్టప్రకారం నిరాకరించడానికి అవకాశం ఉన్న ద్రవ్యాన్ని పరిమిత చట్టబద్ధ ద్రవ్యం అంటారు. 

* భారతదేశంలో 25 పైసలు అంతకంటే తక్కువ విలువున్న నాణేలను ఒక పరిమితికి మించి అధిక మొత్తంలో చెల్లిస్తే చట్టప్రకారం నిరాకరించవచ్చు.

అపరిమిత చట్టబద్ధ ద్రవ్యం: 

ఒకేసారి ఎంత మొత్తంలో చెల్లించినా చట్టప్రకారం అంగీకరించి తీరాల్సిన కరెన్సీ నోట్లు, నాణేలను అపరిమిత చట్టబద్ధ ద్రవ్యం అంటారు.

* భారతదేశంలో 50 పైసల నాణేలు, ఒక రూపాయి నోటు, కేంద్రబ్యాంకు జారీ చేసే అన్ని రకాల కరెన్సీ నోట్లు ఈ ద్రవ్యం పరిధిలోకి వస్తాయి.


గ్రేషమ్‌ సూత్రం 

ఇంగ్లండ్‌ రాణి ఎలిజబెత్‌ - I ఆర్థిక సలహాదారుడు సర్‌ థామస్‌ గ్రేషమ్‌ ద్రవ్య చలామణి గురించి ఒక సూత్రాన్ని పేర్కొన్నాడు. దీన్ని గ్రేషమ్‌ సూత్రం అంటారు.

*  ఈ సూత్రం ప్రకారం, మంచి ద్రవ్యం (మేలైన నాణేలు), చెడు ద్రవ్యం (నాసిరకమైన నాణేలు) చట్టబద్ధంగా చలామణిలో ఉంటే మేలైన ద్రవ్యాన్ని నాసిరకమైన ద్రవ్యం చలామణి నుంచి తరిమేస్తుంది.

* కొత్త నాణేలు, పాత నాణేలకు ఒకే ద్రవ్య విలువ ఉంటే ప్రజలు కొత్తగా ఉన్న నాణేలను తమ వద్ద దాచుకుని; అరిగిపోయి, బరువు తగ్గిన పాత నాణేలను చలామణి చేస్తారు. 

* ఈ సూత్రం ఏకలోహ ప్రమాణం, ద్విలోహ ప్రమాణం, కాగితం కరెన్సీ అమల్లో ఉన్నప్పుడు కూడా పనిచేస్తుంది.

Posted Date : 21-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ఆర్థిక సంఘం

   విత్త వనరుల పంపకాల మార్గదర్శి!


 

సమాఖ్య వ్యవస్థ అవలంభిస్తున్న భారతదేశంలో పరిపాలన, ప్రజల సంక్షేమాన్ని చూడటంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సమాన ప్రాధాన్యం, బాధ్యత ఉంటుంది. అయితే ఆదాయ వనరుల పరంగా రాష్ట్రాల కంటే కేంద్రానికి ఎక్కువ పరిధి, అవకాశాలు ఉంటాయి. అందుకే ఆర్థిక వనరులను కేంద్ర, రాష్ట్రాల మధ్య సహేతుకంగా పంపిణీ చేసేందుకు ఏర్పాటైన రాజ్యాంగబద్ధ సంస్థే ఆర్థిక సంఘం. ప్రతి ఐదేళ్లకు రాష్ట్రపతి ఏర్పాటు చేసే ఈ సంస్థ సమయానుకూలంగా, పరిస్థితులకు తగినట్లుగా సమీక్షించి కేంద్ర, రాష్ట్రాల మధ్య ఆదాయ వనరుల పంపిణీ విషయంలో తగిన సిఫార్సులు చేస్తుంటుంది. వీటి ఆమోదం పూర్తిగా కేంద్రం చేతులోనే ఉన్నప్పటికీ, ఆ సిఫార్సులన్నీ దాదాపుగా ఆమోదం పొందుతుంటాయి. సహకార సమాఖ్య సజావుగా సాగడంలో, దేశ ఆర్థిక స్థిరత్వంలో కీలక ప్రాధాన్యం ఉన్న ఆర్థిక సంఘం నిర్మాణం, అధికారాలు, విధుల గురించి పరీక్షార్థులు తెలుసుకోవాలి. ఆర్థిక సంఘం సిఫార్సులు చేసే వనరుల పంపిణీ అంశాలు, ఇందులో క్రమానుగతంగా వచ్చిన మార్పులపై సమగ్ర అవగాహనతో ఉండాలి.

కేంద్ర, రాష్ట్రాల మధ్య ఆర్థిక వనరుల పంపిణీ; రాష్ట్రాల మధ్య వనరుల పంపిణీ బాధ్యత ఆర్థిక సంఘానిదే. రాజ్యాంగంలోని 280వ అధికరణ ప్రకారం భారత రాష్ట్రపతి ఐదేళ్లకు ఒకసారి ఆర్థిక సంఘాన్ని నియమిస్తారు. ఆర్థిక సంఘంలో ఛైర్మన్, నలుగురు సభ్యులు ఉంటారు. ప్రణాళికేతర విత్తవనరుల బదిలీని ఈ సంస్థ సూచిస్తుంది.

ఆర్థిక సంఘం విధులు

1) పన్నుల వల్ల సమకూరిన నికర రాబడిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పంపిణీ చేయడం, అందులో రాష్ట్రాల వాటా నిర్ణయించడం.

2) సంఘటిత నిధి నుంచి గ్రాంట్లు బదిలీ చేసేటప్పుడు అనుసరించాల్సిన నియమాలు సూచించడం.

3) రాష్ట్రపతి సూచించిన ఇతర ఆర్థిక అంశాలను విశ్లేషించడం.

ఇప్పటివరకు 14వ ఆర్థిక సంఘాల సిఫార్సులు అమలయ్యాయి. మనదేశంలో పన్ను వనరులు కేంద్రానికి అధికంగా, రాష్ట్రానికి లోటుగా ఉన్నాయి. అందుకే కేంద్రం నుంచి రాష్ట్రాలకు వనరుల బదిలీకి రాజ్యాంగం అవకాశం కల్పించింది. దీంతో పాటు రాజ్యాంగంలోని 275వ అధికరణ రాష్ట్రాలకు అవసరమైన గ్రాంట్లు అందించే సదుపాయం కల్పిస్తుంది. ఆర్థికంగా బలహీనమైన రాష్ట్రాలకు నిర్దిష్ట సహాయం కూడా అందిస్తుంది. 282వ అధికరణ ప్రకారం ప్రజాప్రయోజనాల దృష్ట్యా కేంద్రం రాష్ట్రాలకు తన విచక్షణపై గ్రాంట్లు ఇవ్వొచ్చు. అంటే 275వ అధికరణ ప్రకారం ఆర్థిక సంఘం సలహా ప్రకారం మాత్రమే గ్రాంట్లు ఇవ్వాలి. ఇందులో గ్రాంట్ల పరిమాణాన్ని ఆర్థిక సంఘం నిర్ణయిస్తుంది. 282వ అధికరణ ప్రకారం కేంద్రం తన విచక్షణతో గ్రాంట్లు ఇవ్వొచ్చు. దీనిలో గ్రాంట్ల పరిమాణాన్ని కేంద్రమే నిర్ణయిస్తుంది. రాష్ట్రాలు వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం నుంచి రుణాలు కూడా తీసుకోవచ్చు. పై అంశాల ఆధారంగా కేంద్రం నుంచి రాష్ట్రానికి వనరులు 3 విధాలుగా బదిలీ అవుతాయి. అవి: 1) పన్నులు, సుంకాలలో వాటా 2) గ్రాంట్లు 3) రుణాలు.

ఆర్థిక సంఘం ద్వారా వనరుల బదిలీ (1951 - 2000)

కేంద్ర, రాష్ట్రాల మధ్య నిధులు బదిలీ చేసేటప్పుడు దేశంలో మారే పరిస్థితుల ఆధారంగా వనరుల బదిలీకి ప్రాతిపదికను కూడా మారుస్తూ ఉంటారు.

1) ఆదాయపు పన్ను, ఎక్సైజ్‌ సుంకం: ఒకటో ఆర్థిక సంఘం ప్రకారం రాష్ట్రాలకు ఆదాయ పన్నులో 55% పంచాలని నిర్ణయించగా, 10వ ఆర్థిక సంఘం 77.5% పంపిణీ చేయాలని సూచించింది. మొదటి విత్త సంఘం కేంద్ర ఎక్సైజ్‌ సుంకాలలో 40%, 10వ విత్త సంఘం ప్రకారం 47.5% వాటా ఇవ్వాలని సూచించాయి. 10వ ఆర్థిక సంఘం ప్రకారం ఆదాయ పన్ను, ఎక్సైజ్‌ సుంకాల నుంచి విడివిడిగా రాష్ట్రాలకు వాటా అందించేవారు.

2) అదనపు ఎక్సైజ్‌ సుంకం: 1956లో జాతీయ అభివృద్ధి మండలి (ఎన్‌డీసీ)లో కుదిరిన ఒప్పందం ప్రకారం మిల్లువస్త్రాలు, పొగాకు, పంచదారపై అమ్మకం పన్ను స్థానంలో కేంద్రం అదనపు ఎక్సైజ్‌ సుంకం విధిస్తోంది. అందుకు ఈ ఆదాయం ఆ రాష్ట్రాల్లో వినియోగం మేరకు ఆ రాష్ట్రాలకే బదిలీ అవుతుంది.

3) ఎస్టేట్‌ సుంకం: ఈ పన్ను రాబడి పూర్తిగా రాష్ట్రాలకు పంపిణీ అవుతుంది. 1985లో దీన్ని రద్దు చేశారు.

4) కేంద్రం నుంచి రాష్ట్రాలకు గ్రాంట్లు: ఒకటో ఆర్థిక సంఘం ప్రకారం గ్రాంట్లు అందించేటప్పుడు బడ్జెట్‌ అవసరాలు, పన్ను ప్రయత్నాలు, రాష్ట్రాల వ్యయం లాంటి అంశాలు ప్రాతిపదికగా తీసుకుని అందించాలని సూచించింది. 9వ విత్త సంఘం బడ్జెట్‌ అంతరాలను భర్తీ చేయడానికి గ్రాంట్లు ఇచ్చే బదులు, కోశ అవసరాల ఆధారంగా గ్రాంట్లు ఇవ్వాలని సూచించింది.

5. కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వాలకు రుణాలు: రెండో ఆర్థిక సంఘం మార్కెట్‌ వడ్డీ రేటుకే కేంద్రం రాష్ట్రాలకు రుణం మంజూరు చేయాలని సిఫార్సు చేసింది. 6వ విత్త సంఘం రుణ చెల్లింపు కాలాన్ని 20 నుంచి 30 ఏళ్లకు పెంచి రాష్ట్ర ప్రభుత్వాలకు వెసులుబాటు కల్పించింది. 13వ విత్త సంఘం రెవెన్యూ లోటు తగ్గించడానికి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల రుణాలు స్థూల జాతీయోత్పత్తిలో 68 శాతం మించరాదని సిఫార్సు చేసింది.

6. విపత్తు నిధి: జాతీయ విపత్తులు సంభవించినప్పుడు రాష్ట్రాలకు కొంత సహాయం చేసే పద్ధతి 8వ విత్త సంఘం వరకు ఉండేది. దీనినే మార్జిన్‌ మనీ స్కీమ్‌ అంటారు. 9వ విత్త సంఘం విపత్తు నిధిని ప్రతి రాష్ట్రానికి ఏర్పాటు చేయాలని సూచించింది. దీనికి కేంద్రం రాష్ట్రాలు 75:25 నిష్పత్తిలో నిధులు అందిస్తాయి. 10వ విత్త సంఘం కూడా దీన్నే కొనసాగించడంతో పాటు, కేంద్రం సైతం ప్రత్యేక నిధిని నిర్వహించాలని సిఫార్సు చేసింది. ఇది వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. 11వ విత్త సంఘం వినీదిళి స్థానంలో ‘నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ కలామిటీ మేనేజ్‌మెంట్‌’ను సిఫార్సు చేసింది.

7. స్థానిక సంస్థలు: 1993లో తీసుకొచ్చిన 73, 74 రాజ్యాంగ సవరణలు పంచాయతీలు, మున్సిపాలిటీలు, స్థానిక ప్రభుత్వాల అభివృద్ధికి అవకాశం కల్పించాయి. స్థానిక సంస్థలకు నిధులు అందించాలని 11వ ఆర్థిక సంఘం మొదటిసారిగా సిఫార్సు చేసింది.

8. రుణ ఉపశమనం: 12వ విత్త సంఘం రాష్ట్రాలు రుణాల కోసం కేంద్రంపై ఆధారపడటం తగ్గించాలని, మార్కెట్‌ నుంచి నేరుగా రుణాలు సేకరించాలని సూచించింది.

14వ ఆర్థిక సంఘం (2015 - 20)

14వ ఆర్థిక సంఘం డాక్టర్‌ వై.వి.రెడ్డి అధ్యక్షతన ఏర్పాటైంది. పన్నులు, గ్రాంట్లు రాష్ట్రాలకు బదిలీ చేసేటప్పుడు 1971 జనాభా లెక్కలను ఇది పరిగణనలోకి తీసుకుంది. 1971 తర్వాత వచ్చిన జనాభా మార్పులను కూడా లెక్కలోకి తీసుకుంది.

1. కేంద్ర, రాష్ట్రాల మధ్య పన్నుల వాటా

కేంద్రం నుంచి రాష్ట్రాలకు వచ్చే పన్నుల వాటాని ఒక్కసారిగా 32% నుంచి 42% కి పెంచింది.

2. రాష్ట్రాల మధ్య పన్నుల బదిలీకి ప్రాతిపదిక

14వ విత్త సంఘం రాష్ట్రాల మధ్య పన్నుల బదిలీకి నూతన ఫార్ములాను సూచించింది.

* నోట్‌: 13వ ఆర్థిక సంఘం సిఫార్సుల్లో కోశ నిర్వహణను పరిగణనలోకి తీసుకోగా, 14వ ఆర్థిక సంఘం మినహాయించింది.

14వ విత్త సంఘం సిఫార్సులతో కేంద్రం నుంచి అధిక పన్నుల వాటా బదిలీ అయిన రాష్ట్రాలు ఉత్తర్‌ప్రదేశ్, బిహార్‌. తక్కువ వాటా పొందిన రాష్ట్రాలు సిక్కిం, గోవా.

3) గ్రాంట్లు: రెవెన్యూ లోటు, ప్రకృతి విపత్తుల నిర్వహణ, స్థానిక సంస్థలకు గ్రాంట్లను సిఫార్సు చేసింది.


4) జీఎస్టీ: 14వ విత్త సంఘం జీఎస్టీపై సూచనలు చేసింది. జీఎస్టీ అమల్లోకి వచ్చిన మొదటి 3 సంవత్సరాలు రాష్ట్రాలకు వచ్చే నష్టాన్ని 100%, నాలుగో సంవత్సరం 75%, ఐదో ఏడాది 50% కేంద్రం భరించాలి.


5) కేంద్ర ప్రాయోజిత పథకాలు: కేంద్ర ప్రాయోజిత పథకాల్లో 30 పథకాలను రాష్ట్రాలకు బదిలీ చేయాలని సిఫార్సు చేసినప్పటికీ పథకాల ప్రాముఖ్యతను, న్యాయపరమైన అంశాలను దృష్టిలో ఉంచుకుని 8 పథకాలను మాత్రమే బదిలీ చేశారు

15వ ఆర్థిక సంఘం (2020 - 25)

రాష్ట్రపతి 15వ ఆర్థిక సంఘాన్ని 2017, నవంబరు 17న ఎన్‌.కె.సింగ్‌ అధ్యక్షతన ఏర్పాటు చేశారు. ఈ సంఘం 2020-2025కి వర్తించేలా సిఫార్సులను 2019, అక్టోబరులో అందించాలి. అయితే ఈ మధ్య కాలంలో కొన్ని అనూహ్య సంఘటనలు సంభవించాయి. అవి:

1) జమ్ము-కశ్మీర్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టం (2019) 

2) ప్రపంచ ఆర్థిక వృద్ధి క్షీణత (3%)

3) కార్పొరేట్‌ పన్ను రాబడి 19% శాతానికి తగ్గింది

4) నిర్మాణాత్మక సంస్కరణలు కొనసాగాయి.

పై చర్యలన్నీ కొంతకాలం పాటు ప్రభావం చూపేవి కావడంతో 15వ విత్త సంఘం రెండు నివేదికల్ని సమర్పించాల్సి వచ్చింది. 2020-21 సంవత్సరానికి చేసిన మధ్యంతర సిఫార్సులతో తొలి నివేదికను 2019, డిసెంబరులో రాష్ట్రపతికి సమర్పించింది. ఈ నివేదిక 2020, ఫిబ్రవరిలో పార్లమెంటు ముందుకు వచ్చింది. ఇది 2020-21 సంవత్సరానికి ఈ సిఫార్సులు వర్తిస్తాయి. తుది నివేదికను 2020, నవంబరులో రాష్ట్రపతికి సమర్పించగా, 2021, ఫిబ్రవరిలో పార్లమెంటు ముందుకు వచ్చాయి. ఈ సిఫార్సులు 2021-22 నుంచి 2025-26 కాలానికి వర్తిస్తాయి.

2015 - 16లో కోశ సమాఖ్యలోనూ ప్రాథమికంగా పలు మార్పులు జరిగాయి. అవి..


1. ప్రణాళిక సంఘం రద్దు


2. ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయాల రద్దు


3. వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమలు


4. రాష్ట్రాలకు 41% పన్నుల వాటా బదిలీ


5. టాక్స్‌ జీడీపీ నిష్పత్తి 10.2% నుంచి 11 శాతానికి పెంపు


6. జీడీపీలో రక్షణ వ్యయం 2% నుంచి 1.5%కి తగ్గింపు


7. రాష్ట్రాల్లో కోశ లోటు 1.9% నుంచి 2.5%కి పెరిగింది


8. స్థూల పన్ను రాబడిలో సెస్‌లు, సర్‌ఛార్జీల వాటా 2018-19 నాటికి 19.9%కి పెంపు


పన్ను, కోశప్రయత్నం - 2.5%

------------------------------------------

              100%


నోట్‌: ఒక రాష్ట్ర స్థూల రాష్ట్ర ఉత్పత్తి (జీఎస్‌డీపీ)ని దేశంలో అత్యధిక జీఎస్‌డీపీ ఉన్న రాష్ట్రంతో పోల్చడం ద్వారా ఆదాయ దూరం నిర్ణయిస్తారు.

15వ ఆర్థిక సంఘంలో అత్యధిక వాటా పొందిన రాష్ట్రాలు.. ఉత్తర్‌ప్రదేశ్‌ (17.939%), బిహార్‌ (10.058%), మధ్యప్రదేశ్‌ (7.850%), పశ్చిమ బెంగాల్‌ (7.523%), మహారాష్ట్ర (6.317%); తక్కువ వాటా పొందిన రాష్ట్రాలు.. గోవా (0.386%), సిక్కిం (0.388%)

* 15వ ఆర్థిక సంఘం ప్రకారం కేంద్ర బదిలీలలో తెలుగు రాష్ట్రాల వాటా 

1) ఆంధ్రప్రదేశ్‌ - 4.047% 

2) తెలంగాణ - 2.102%

15వ ఆర్థిక సంఘం నిర్మాణం

1. ఛైర్మన్‌: ఎన్‌.కె.సింగ్‌ - ప్రభుత్వ మాజీ కార్యదర్శి 

సభ్యులు

1. శక్తికాంత్‌ దాస్‌ - మాజీ ప్రభుత్వ కార్యదర్శి (పూర్తికాల సభ్యుడు)


2. అజయ్‌ నారాయణ్‌ ఝా - ప్రభుత్వ మాజీ కార్యదర్శి


3. ప్రొఫెసర్‌ అనూప్‌ సింగ్‌ - (పూర్తికాల సభ్యుడు)


4. డా।। అశోక్‌ లహరి - బంధన్‌ బ్యాంకు ఛైర్మన్‌ (పార్ట్‌ టైం సభ్యుడు)


5. డా।। రమేష్‌ చంద్ర - నీతి ఆయోగ్‌ సభ్యుడు (పార్ట్‌ టైం సభ్యుడు)


5. అరవింద మెహతా - కార్యదర్శి


ఆర్థిక సంఘం ఛైర్మన్లు
 

క్ర.సం.        ఛైర్మన్‌        నియమించిన ఏడాది
 

1. కె.సి.నియోగి - 1951


2. కె.సంతానం - 1956


3. ఎ.కె.చందా - 1960


4. పి.వి.రాజమన్నార్‌ - 1964


5. మహావీర్‌ త్యాగి - 1968


6. కాసు బ్రహ్మానంద రెడ్డి - 1972


7. జె.ఎం.షెలాట్‌ - 1977


8. వై.బి.చవాన్‌ - 1983


9. ఎన్‌.కె.పి.సాల్వే - 1987


10. కె.సి.పంత్‌ - 1992


11. ఎం.ఎం.ఖుస్రో - 1998


12. సి.రంగరాజన్‌ - 2003


13. విజయకేల్కర్‌ - 2007


14. వై.వి.రెడ్డి - 2013


15. నందకిశోర్‌ సింగ్‌ - 2017


16. అరవింద పనగరియా - 2023


రచయిత: ధరణి శ్రీనివాస్‌


 

Posted Date : 07-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌