• facebook
  • whatsapp
  • telegram

ప్ర‌స్తుత‌ ఆంధ్రప్రదేశ్‌పై పునర్‌ వ్యవస్థీకరణ ప్రభావం

ఆస్తులు పోయి.. అప్పులు మిగిలి!

  ఉమ్మడి రాష్ట్ర విభజనతో నవ్యాంధ్రకు తీరని నష్టమే జరిగింది. తెలంగాణతో పోల్చుకుంటే గణనీయమైన ప్రతికూల పరిస్థితులు మిగిలాయి. విలువైన ఆస్తుల్లో అధికభాగం తెలంగాణకు దక్కితే, అప్పుల్లో ఎక్కువ భారం సరికొత్త ఆంధ్రపై పడింది. ఆర్థికం, వ్యవసాయం, సాగునీరు, విద్యుత్తు రంగాల్లో జరిగిన పంపకాలు నేటి రాష్ట్ర భవితకు, ప్రగతికి ప్రతిబంధకాలుగా నిలిచాయి.ఈ అంశాలపై పోటీ పరీక్షార్థులు అవగాహన పెంచుకోవాలి.

  ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ చట్టం-2014 అవశేష ఆంధ్రప్రదేశ్‌కు అనిశ్చిత పరిస్థితి  కల్పించింది. నవ్యాంధ్ర, తెలంగాణ మధ్య ఆర్థిక వనరుల పంపిణీలో తీవ్రమైన లోపాలు, స్థూల అన్యాయాలు, పొరపాట్లు చోటుచేసుకున్నాయి. ఫలితంగా అభివృద్ధి, క్రియాశీలతల పరంగా అసమతౌల్యత ఏర్పడింది. కీలక రంగాలపై ప్రభావం చూపి రాష్ట్రాన్ని పూర్తి ప్రతికూల పరిస్థితుల్లోకి నెట్టేసింది.

ఆర్థిక పరిస్థితి: అవశేష ఆంధ్రప్రదేశ్‌కు 2014-15 ఆర్థిక సంవత్సరం నుంచే ఆర్థిక సవాళ్లు   మొదలయ్యాయి. రెవెన్యూ రాబడి, వ్యయాల లెక్కలు ఈ విషయాన్ని స్పష్టం చేశాయి.

* రాష్ట్ర సొంత రెవెన్యూ సహా మొత్తం  రాబడులు, కేంద్ర పన్నుల్లో వాటా, గ్రాంట్లు, మార్కెట్‌ రుణాలన్నీ కలిసి ఉమ్మడి రాష్ట్రంలో వచ్చే రాబడుల్లో 50 శాతం కంటే తక్కువే ఉండవచ్చని తేలిపోయింది. అయితే రుణం, జీతాలు, పింఛన్లు, రాయితీలను జనాభా   నిష్పత్తిపై కేటాయించడంతో ఉమ్మడి     ఆంధ్రప్రదేశ్‌ ఖర్చులో దాదాపు 60 శాతం   అవశేష ఆంధ్రప్రదేశ్‌ భరించాల్సి వచ్చింది.

* నవ్యాంధ్రకు మునుపెన్నడూ లేనివిధంగా 2014-15 ఆర్థిక సంవత్సరంలో అధిక రెవెన్యూ లోటు, ఆర్థిక లోటు ఏర్పడింది. గతంలో ఎప్పుడూ ఆర్థిక లోటు జీఎస్‌డీపీలో 3 శాతం దాటలేదు. కానీ 2014-15లో రెవెన్యూ లోటు 4.8%, ఆర్థిక లోటు 7.18%కు చేరాయి.

* నవ్యాంధ్రలో జీతాలు, పింఛన్లు, ఇతర ఖర్చు రాష్ట్ర సొంత రాబడిలో 73 శాతానికి చేరింది (ఉమ్మడి రాష్ట్రంలో ఇది 58 శాతం మాత్రమే). దీంతో మూలధన వ్యయానికి వెసులుబాటు తగ్గిపోయింది.

* అవశేష ఆంధ్రప్రదేశ్‌ జీఎస్‌డీపీ ఉమ్మడి రాష్ట్ర జీఎస్‌డీపీలో 55.7%. అలాగే రాష్ట్ర  తలసరి ఆదాయం తెలంగాణ కంటే చాలా తక్కువ. ఉదాహరణకు 2013-14 ఆర్థిక   సంవత్సరంలో ఉమ్మడి రాష్ట్రంలో తలసరి ఆదాయం రూ.88,876 ఉండగా, అవశేష  ఆంధ్రప్రదేశ్‌లో రూ.85,797, తెలంగాణలో  రూ.93,151 ఉంది.

* నూతన ఆంధ్రప్రదేశ్‌కు సొంత రెవెన్యూ రాబడులు తెలంగాణ కంటే చాలా తక్కువ. జనాభాలో 58.32%తో ఉన్న కొత్త ఆంధ్రప్రదేశ్,  ఉమ్మడి రాష్ట్రంలోని వ్యాట్‌ (జుతిగి)లో 46.6% మాత్రమే పొందగలుగుతోంది.

* రాష్ట్రాల మధ్య రుణ పంపిణీకి జనాభా నిష్పత్తే ఏకైక ప్రాతిపదికగా ఉండటంతో   తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌పై అధిక రుణభారం పడింది. రుణం/జీఎస్‌డీపీ నిష్పత్తి ఆంధ్రప్రదేశ్‌కు 19.4 శాతం ఉండగా     తెలంగాణకు 18.1 శాతం వచ్చింది.

* 2014-15 ఆర్థిక సంవత్సరానికి వనరుల అంతరాన్ని అవశేష ఆంధ్రప్రదేశ్‌కు రూ.18,236 కోట్లుగా అంచనా వేశారు. దీన్ని దాదాపు 4.84 శాతం రెవెన్యూ లోటు, 7.18 శాతం ఆర్థిక లోటుగా చెప్పవచ్చు. ఇదేకాలంలో తెలంగాణలో రెవెన్యూ మిగులు ఉంది. విభజనకు ముందు వరకు మార్కెట్‌ రుణాలను మూలధన వ్యయం కోసం వినియోగించారు. అయితే రాబడి ఇవ్వని మూలధన ఆస్తుల నిర్వహణకు అయ్యే వ్యయాన్ని భరించేందుకు నవ్యాంధ్ర చాలా మొత్తం అప్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.


వ్యవసాయాభివృద్ధి: రాష్ట్ర విభజన నష్టాల్లో వ్యవసాయ పరిశోధన అభివృద్ధి అంశం మరొకటి. ఉమ్మడి రాష్ట్రంలో ఏకైక వ్యవసాయ విశ్వవిద్యాలయం హైదరాబాద్‌లో ఉంది. రాష్ట్రస్థాయి శిఖరాగ్ర వ్యవసాయ శిక్షణ సంస్థ (ళీతిలీనిగిఖి) కూడా అక్కడే ఉంది. అవి తెలంగాణలో అంతర్భాగమయ్యాయి. దీంతో నవ్యాంధ్రలో కొత్తతరం వ్యవసాయ శాస్త్రవేత్తలకు శిక్షణ సంస్థ అంటూ లేకుండా పోయింది.


* డీఎన్‌ఏ ఫింగర్‌ ప్రింటింగ్, టిష్యూ కల్చర్, ఆయిల్‌ అనాలసిస్‌ ల్యాబొరేటరీలు వంటి ముఖ్యమైన వ్యవసాయ సంస్థలన్నీ హైదరాబాద్‌లోనే ఉండిపోయాయి.


* ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విత్తన ధాన్యం   ఉత్పత్తిలో తెలంగాణ జిల్లాలే ప్రధానంగా ఉండేవి. నేటి ఆంధ్రప్రదేశ్‌లోని 309 యూనిట్లతో పోలిస్తే తెలంగాణలో 969 ప్రైవేటు విత్తన ప్రాసెసింగ్‌ యూనిట్లున్నాయి. దీంతో నవ్యాంధ్రలో వ్యవసాయ ఉత్పాదకత పెంచేందుకు      అవసరమైన విత్తన ఉత్పత్తి ప్రాసెసింగ్‌            సామర్థ్యం తగ్గిపోయింది.


* అవశేష ఆంధ్రప్రదేశ్‌ భౌగోళిక స్వభావం రీత్యా వరదలు, తుపానులు, కరవు పీడిత ప్రాంతం. 2008-09 నుంచి 2013-14 వరకు ఉమ్మడి రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాల వల్ల దెబ్బతిన్న వ్యవసాయ భూమి 20.18 లక్షల హెక్టార్లు ఉండగా, అందులో ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లోనే 15.16 లక్షల హెక్టార్లున్నాయి. అంటే 75 శాతం కంటే ఎక్కువ ప్రభావిత ప్రాంతం ఇక్కడే ఉంది.


సాగునీటి రంగం: తెలుగు రాష్ట్రాలకు సాగునీరు అందించే కృష్ణా, గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల్లోని ప్రాజెక్టుల నిర్వహణను విభజన చట్టం నదీ యాజమాన్య మండళ్ల నియంత్రణ కిందకు తెచ్చింది. దీంతో రాష్ట్రాల అధికార పరిధిలో ఉన్న జలవనరుల నిర్వహణను మొదటిసారిగా కేంద్రం తన చేతిలోకి తీసుకున్నట్లయింది. ఫలితంగా నీటి విడుదల పరిమాణం, సమయం వంటి అంశాల్లో రెండు రాష్ట్రాల అధికారం, విచక్షణ తగ్గిపోయాయి.

* శ్రీశైలం, నాగార్జునసాగర్‌ జలాశయాల క్రమబద్ధీకరణ అంతర్రాష్ట్ర అంశంగా, క్లిష్టతరంగా మారింది.

విద్యుత్తు రంగం: రాష్ట్ర విభజనతో నవ్యాంధ్రలో విద్యుత్తు రంగంపైనా ప్రతికూల ప్రభావం పడింది. 2014, మే 8 నాటి జీఓ నంబరు 20లో పేర్కొన్న ఏపీ జెన్‌కో స్టేషన్ల విద్యుత్తు ఉత్పత్తి లెక్కల ఆధారంగా కేటాయింపులు చేశారు. మొత్తం ఉత్పాదక సామర్థ్యంలో (నిర్మాణంలో ఉన్నవాటితో సహా)  కేవలం 46.11% మాత్రమే ఆంధ్రప్రదేశ్‌ వాటాగా నిర్ణయించారు.

* విద్యుదుత్పత్తి కేంద్రాలపై యాజమాన్యపు హక్కులు, వాటిని ఏర్పాటు చేసిన భౌగోళిక ప్రాంతం ఆధారంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకే ఇచ్చారు. అయితే విద్యుత్తును కేటాయించడంలో భౌగోళిక ఉనికిని పరిగణనలోకి తీసుకోలేదు. ఫలితంగా ఆంధ్రప్రదేశ్‌ 1,142 మెగావాట్ల ఉత్పాదక సామర్థ్యం కోల్పోయింది. ఏటా 8,700 మి.యూనిట్ల విద్యుత్తు కొరత తలెత్తింది. ఈ కొరతను అధిగమించేందుకు బహిరంగ మార్కెట్‌లో విద్యుత్తు కొనుగోలుకు ఏటా దాదాపు రూ.10 వేల కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది.

పాడి పశుగణాభివృద్ధి:  వెటర్నరీ బయోలాజికల్‌ రిసెర్చ్‌ సంస్థ తెలంగాణ రాష్ట్రానికి చెందడంతో పాడిపశువుల టీకా మందుల ఉత్పత్తి, వ్యాధి నిర్ధారణ సదుపాయాలు అవశేష ఆంధ్రప్రదేశ్‌లో లేకుండా పోయాయి.

* పాడిపశువుల రంగం, వృద్ధికి చెందిన అనేక జాతీయ సంస్థలు తెలంగాణలో ఉండిపోయాయి. నేషనల్‌ రిసెర్చ్‌ సెంటర్‌ ఆన్‌ మీట్, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బయోలాజికల్స్, సెంట్రల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ డ్రైలాండ్‌ అగ్రికల్చర్, సెంటర్‌ ఫర్‌ సెల్యూలార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయోలజీ, ఇండియన్‌ ఇమ్యూనోలాజికల్‌ ఇన్‌స్టిట్యూట్, కోళ్ల పెంపకం రంగానికి చెందిన ప్రాజెక్ట్‌ డైరెక్టరేట్‌ మొదలైనవన్నీ ఏపీకి లేకుండా పోయాయి.

స్థూలంగా..

రాష్ట్ర విభజనలో వివిధ విభాగాలకు వేర్వేరు ప్రాతిపదికలను ప్రమాణాలుగా తీసుకోవడంతో ఆంధ్రప్రదేశ్‌కు తీవ్రమైన అన్యాయం జరిగింది.

1) 58 శాతం జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు 46 శాతం ఆదాయమే ఉండేలా విభజించారు. దీన్ని 14వ ఆర్థిక సంఘం    నిర్ధారించింది.

2) భౌగోళిక ప్రాతిపదికన ఆస్తుల విభజన చేయడంతో విలువైన ఆస్తులన్నీ హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లోనే  ఉండిపోయాయి.

3) జనాభా ప్రాతిపదికన అప్పులు     పంచడంతో అధిక జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు అధిక అప్పులు మిగిలాయి.

4) వినియోగం ప్రాతిపదికన విద్యుత్తు   కేటాయింపులు చేయలేదు.

5) తిరిగి చెల్లించాల్సిన పన్నుల భారం (టాక్స్‌ రిఫండ్‌) జనాభా ప్రాతిపదికన అంటే ఆంధ్రప్రదేశ్‌కు 58.32 శాతం, తెలంగాణకు 41.68 శాతం కేటాయించారు. అదే సమయంలో వసూలు  కావాల్సిన పన్నులను భౌగోళిక ప్రాతిపదికన నిర్ణయించారు. దీనివల్ల ఆంధ్రప్రదేశ్‌కు రూ.3,800 కోట్ల నష్టం వచ్చింది.

6) తొమ్మిదో షెడ్యూల్‌ సంస్థ అయిన  సింగరేణి కాలరీస్‌లో తెలంగాణకు  భౌగోళిక ప్రాతిపదికన 51 శాతం వాటా కేటాయించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న సింగరేణి అనుబంధ సంస్థ ‘ఆంధ్రప్రదేశ్‌ హెవీ మిషనరీ ఇంజినీరింగ్‌ లిమిటెడ్‌’ కూడా తొమ్మిదో షెడ్యూల్‌ కంపెనీ  అయినప్పటికీ అదే భౌగోళిక      ప్రాతిపదికను పాటించలేదు.

7) మొత్తం రూ.లక్షా ముప్పై వేల కోట్ల అప్పుల భారాన్ని ఆంధ్రప్రదేశ్‌ ఖాతాకు బదలాయించారు. దీనికితోడు ఉమ్మడి రాష్ట్ర అవిభాజ్య అప్పు రూ.24 వేల కోట్లు కూడా ఆంధ్రప్రదేశ్‌ ఖాతా పుస్తకాల్లో ఉంచి తీరని భారం మోపారు. ఇది ఆంధ్రప్రదేశ్‌ వనరుల సమీకరణ పరిమితి (ఎఫ్‌ఆర్‌బీఎం)పై తీవ్ర ప్రభావం చూపింది.

8) అవిభాజ్య అప్పులపై వడ్డీని ఆంధ్రప్రదేశ్‌ చెల్లించాల్సి రావడంతో రాష్ట్ర ఆర్థిక   పరిస్థితులు మరింత దిగజారాయి.

9) ఉమ్మడి రాష్ట్రం చెల్లించాల్సిన పింఛన్లను జనాభా ప్రాతిపదికన విభజించడం నవ్యాంధ్రపై పెనుభారం మోపింది.

రచయిత: వి.కరుణ

Posted Date : 08-05-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌