• facebook
  • whatsapp
  • telegram

1956 - 2014 మధ్య ముఖ్య సంఘటనలు

శ్రీకాకుళం సాయుధ తిరుగుబాటు

  శ్రీకాకుళం మద్రాసు ప్రెసిడెన్సీలోని గంజాం జిల్లాలో ఉండేది. 1936లో ఒరిస్సా రాష్ట్రం ఏర్పడినప్పుడు దీన్ని విశాఖ జిల్లాలో చేర్చారు. 1950లో ప్రత్యేక శ్రీకాకుళం జిల్లా ఏర్పాటైంది. పార్వతీపురం, పాలకొండ, సాలూరు లాంటి ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనులను వడ్డీ వ్యాపారులు, భూస్వాములు దోచుకునేవారు. 1959లో భారత కమ్యూనిస్టు పార్టీ గిరిజన సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఇది వెట్టిచాకిరి లాంటి దురాచారాలకు వ్యతిరేకంగా పోరాటం మొదలుపెట్టింది. 1962లో కమ్యూనిస్టు పార్టీ చీలిక వల్ల కార్యకర్తలు నైతిక బలం కోల్పోయారు. వెంకటపు చిన సత్యం, పంచాది కృష్ణమూర్తి, తేజేశ్వరరావు, నాగభూషణం పట్నాయక్, రామలింగాచారి లాంటి నాయకులు తెలంగాణ సాయుధ పోరాట స్పూర్తితో శ్రీకాకుళం సాయుధ పోరాటాన్ని ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లా మార్క్సిస్ట్ పార్టీ కార్యదర్శి వి.రామలింగాచారి 1965లో గిరిజన కూలీల సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. 1967లో వచ్చిన నక్సలబరీ ఉద్యమం సత్యం లాంటి వారిపై విశేష ప్రభావాన్ని చూపింది. పార్వతీపురం ఏజెన్సీ ప్రాంతంలో ఉపాధ్యాయుడైన సత్యం గిరిజనుల సమస్యల పట్ల అవగాహనతో ఉండేవాడు. 1967, అక్టోబరు 31న మొండెంఖల్ సమావేశం తర్వాత తిరిగివస్తున్న గిరిజనులపై లేవిడి ప్రాంతంలో మేడిత సత్యన్నారాయణ అనే స్థానిక భూస్వామికి చెందిన వ్యక్తులు కాల్పులు జరిపారు. ఇద్దరు గిరిజనులు ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా గిరిజనులు కురాపాం, సీతంపేట లాంటి ప్రాంతాల్లో హింసాత్మక చర్యలకు పాల్పడ్డారు.

1969, మార్చి 4న పెదకరాజ ప్రాంతంలో పోలీసు కాల్పుల్లో ఇద్దరు గిరిజనులు మరణించారు. గిరిజనులు సత్యం నాయకత్వంలో ఆయుధాలు ధరించి గెరిల్లా పోరాటాలు చేశారు. బెంగాల్‌లో నక్సల్బరీ ఉద్యమ నాయకుడైన చారు మజుందార్‌తో పంచాది కృష్ణమూర్తి, చౌదరి తేజేశ్వరరావు లాంటివారు ప్రత్యక్ష సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారు. తరిమెల నాగిరెడ్డి లాంటివారు మజుందార్ సాయుధ తిరుగుబాటును వ్యతిరేకించారు. కార్యకర్తలకు సైనిక శిక్షణ ఇవ్వాలన్నారు. కాని మజుందార్ చెప్పిన వర్గశత్రు నిర్మూలనకే శ్రీకాకుళం ఉద్యమ నాయకులు మొగ్గుచూపారు. 1968 అక్టోబరు 23 - 25 మధ్య బొడ్డపాడు వద్ద సమావేశమై సాయుధ తిరుగుబాటు ఉద్యమం చేయాలని నిర్ణయించారు. ఇది 1968 - 69 మధ్య శ్రీకాకుళం సాయుధ తిరుగుబాటుగా పరిణమించింది. 1969, ఫిబ్రవరిలో చారు మజుందార్ ఆంధ్రలో పర్యటించారు. మజుందార్‌తోపాటు తేజేశ్వరరావు, పంచాది కృష్ణమూర్తి, మామిడి అప్పలసూరి లాంటి నాయకులు గుంటూరు జిల్లాలోని గుత్తికొండ వద్ద సమావేశమై సమన్వయ సంఘాన్ని ఏర్పాటు చేశారు. వర్గశత్రు నిర్మూలన ఇష్టంలేని సత్యం అందులో చేరలేదు. 1969, ఏప్రిల్ 22న కాసు సన్యాల్ సీపీఐ (ఎంఎల్) పార్టీని స్థాపించారు. తరిమెల నాగిరెడ్డి ఈ పార్టీలో చేరకుండా 1969, మేలో ఆంధ్రప్రదేశ్ విప్లవ కమ్యూనిస్టు కమిటీ (ఏపీఆర్‌సీసీ) అనే సంస్థను ఏర్పాటు చేశాడు. 1969, మేలో శ్రీకాకుళం ఉద్యమకారులు విశాఖపట్నంలో సమావేశమై బహిరంగంగా వర్గశత్రు నిర్మూలనకు నిర్ణయించారు. సత్యం, కైలాసం లాంటి నాయకులు ఈ సమావేశానికి హాజరుకాలేదు. రైతాంగ సంఘర్షణ సమితి, ప్రజా న్యాయస్థానాలు ఏర్పాటుచేసి ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు. మల్లివీడు (1969, ఆగస్టు 4), పెద్దబుడిది (1969, నవంబరు) ప్రాంతాల్లో భూస్వాములు, వడ్డీ వ్యాపారులను ఉద్యమకారులు చంపేశారు. ఉద్యమాన్ని అణిచివేయడానికి ఆంధ్రా, ఒరిస్సా పోలీసులు సంయుక్తంగా దళాలను ఏర్పాటుచేసి 1969 మే, 27న జలాంత్రకోట వద్ద ఎదురు కాల్పుల్లో పంచాది కృష్ణమూర్తిని కాల్చి చంపారు.

   ప్రభుత్వం శ్రీకాకుళం ప్రాంతాన్ని కల్లోలిత ప్రాంతంగా ప్రకటించింది. కాసు సన్యాల్, సురేన్ బోస్‌లు 1969, జులైలో శ్రీకాకుళం వచ్చి ఉద్యమ ప్రగతికి ఆత్మాహుతి దళాలను ఏర్పాటు చేయాలని తీర్మానించారు. రైతాంగ సంఘర్షణ సమితి చేసిన ఉద్యమాలు, దాడులతో భయపడిన భూస్వాములు, వడ్డీ వ్యాపారులు ఏజెన్సీ ప్రాంతాన్ని వదిలి పట్టణాల్లో తలదాచుకోవాల్సి వచ్చింది. 1969లో ప్రభుత్వం తేజేశ్వరరావును అరెస్ట్ చేసింది. నాగిరెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావులను మద్రాస్‌లో అరెస్ట్ చేశారు. 1970, జులై 10న బోరికొండల వద్ద జరిగిన ఎదురు కాల్పుల్లో సత్యం, కైలాసం మరణించడంతో శ్రీకాకుళం సాయుధ పోరాటం మందగించింది. మామిడి అప్పలసూరి, నాగభూషణం పట్నాయక్‌లను కలకత్తాలో 1970, జులై 24న అరెస్టు చేశారు. 1967 - 70 మధ్య జరిగిన శ్రీకాకుళం సాయుధ పోరాటం ప్రపంచ కమ్యూనిస్టు దేశాల దృష్టిని ఆకర్షించింది. ఈ ఉద్యమం గురించి 1969, డిసెంబరు 29న నవచైనా వార్తాసంస్థ భారతదేశ అత్యాధునిక కోట బురుజు అనే వ్యాసాన్ని ప్రచురించింది. చారు మజుందార్ ఈ ఉద్యమానికి కారకుడని ఈ వ్యాసంలో పేర్కొంది. శ్రీకాకుళం ఉద్యమంలో పాల్లొన్న వారిపై పార్వతీపురం కుట్రకేసు (120 మంది) మోపారు. చారు మజుందార్ కస్టడీలోనే మరణించారు. నాగభూషణం పట్నాయక్ మరణశిక్ష రద్దు చేశారు.
 

జై తెలంగాణా ఉద్యమం (1969)

  పెద్ద మనుషుల ఒప్పందంలోని అంశాలను అమలు చేయకపోవడం వల్ల 1969లో తెలంగాణా ప్రాంత ప్రజలు జై తెలంగాణా ఉద్యమాన్ని ప్రారంభించారు. 1956లో నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా నియమితుడై, తెలంగాణా వారికి ఉపముఖ్యమంత్రి పదవిని ఇవ్వలేదు. పైగా ఉపముఖ్యమంతి పదవి అనేది చేతికి ఆరోవేలుగా, నిరుపయోగమైంది అని వ్యాఖ్యానించారు. తెలంగాణా ప్రాంతీయ మండలిని 1958 వరకు ఏర్పాటు చేయలేదు.

ఫలితంగా తెలంగాణా ప్రజలు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు నిరసన సమావేశాలను ఏర్పాటు చేయడం ప్రారంభించారు. 1969, జులై 10న తెలంగాణా పరిరక్షణ దినాన్ని (హామీల దినం) పాటించారు. తెలంగాణా వారి కోర్కెలను మన్నించనట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి విడిపోతామంటూ హైదరాబాద్ సమావేశంలో కార్మిక సంఘనాయకుడైన మహదేవ్ సింగ్ హెచ్చరించారు. తెలంగాణా ప్రాంతంలో ఆంధ్రులను ఉద్యోగులుగా ఎక్కువ సంఖ్యలో నియమించడం వల్ల 1969, జనవరి 1న రవీంధ్రనాథ్ అనే విద్యార్థి ఖమ్మం జిల్లా పాల్వంచలో నిరాహారదీక్ష ప్రారంభించాడు. దీంతో తెలంగాణాలో ఉద్యమ తీవ్రరూపం దాల్చింది. విద్యార్థుల్లో ఒక వర్గం తెలంగాణా వారికిచ్చిన వాగ్దానాలను అమలు చేయమని కోరగా, మరొక వర్గం ప్రత్యేక తెలంగాణా రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా కోరింది. ప్రత్యక్ష చర్యకు దిగుతామని నాన్‌గెజిటెడ్ ఉద్యోగులు హెచ్చరించారు. అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి 1969, జనవరిలో అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేసి తెలంగాణా ప్రాంతంలో ఉన్న ఆంధ్రా ఉద్యోగులను వెనక్కు పంపుతామని, తెలంగాణా మిగులు నిధులు వారికే ఖర్చు చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణాకు చెందిన జె. చొక్కారావును ఉపముఖ్యమంత్రిగా నియమించారు. కానీ, ఉద్యమం ఆగలేదు. 1969, జనవరి 20న హైదరాబాదులో పోలీసు కాల్పులు జరగడంతో ఆందోళనలు మరింతగా పెరిగాయి. ఆంధ్ర ఉద్యోగులను 1969, ఫిబ్రవరి, 28 నాటికి పంపివేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ సమయంలోనే నల్గొండలో డిప్యూటీ సర్వేయరుగా పనిచేస్తున్న ఆంధ్రుడిని సజీవ దహనం చేశారనే వదంతి వ్యాపించడంతో ఆంధ్రాలో పోటీ ఉద్యమం ప్రారంభమైంది. తెలంగాణాలో విద్యార్థి ఉద్యమానికి కె.వి. రంగారెడ్డి నాయకత్వం వహించారు.

1969, ఏప్రిల్ 11న లోక్‌సభలో ఎనిమిది అంశాల ప్రణాళికను ప్రకటించారు. కానీ ఉద్యమం తగ్గలేదు. తెలంగాణా ప్రజా సమితి (గుర్తు - పార) మర్రి చెన్నారెడ్డి నాయకత్వంలో ఆందోళనలు సాగించింది. 1969, మే 1న తెలంగాణా కోర్కెల దినం పాటించాలని TPS పిలుపునిచ్చింది. 1969, జూన్ 4న హైదరాబాద్‌లో 33 గంటలు కర్ఫ్యూ విధించారు. మర్రి చెన్నారెడ్డి, విద్యార్థి నాయకుడైన మల్లిఖార్జున్‌లను ప్రభుత్వం అరెస్టు చేసింది. చివరికి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి 1971, సెప్టెంబరులో రాజీనామా చేయగా సెప్టెంబరు 25న పి.వి. నరసింహారావును ముఖ్యమంత్రిగా నియమించారు. దీంతో జై తెలంగాణా ఉద్యమం నిలిచిపోయింది. TPS ను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు.
 

జై ఆంధ్రా ఉద్యమం (1972)
 
 పి.వి. నరసింహారావు తొలి తెలంగాణా ప్రాంతానికి చెందిన ముఖ్యమంత్రిగా 1971లో నియమితులయ్యారు. ముల్కీ నిబంధనలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఫలితంగా 1972లో జై ఆంధ్రా ఉద్యమం తలెత్తింది. 1956లో ముల్కీ నిబంధనలు అంగీకరిస్తూ పెద్దమనుషుల ఒప్పందం జరిగింది. కానీ ఆంధ్రులు ముల్కీ నిబంధనలు చెల్లవంటూ హైకోర్టును ఆశ్రయించారు. ఆంధ్రప్రదేశ్ అవతరణ అనంతరం ముల్కీ నిబంధనలు చెల్లవంటూ 1972, ఫిబ్రవరి 4న హైకోర్టు తీర్పునిచ్చింది. దీనిపై ముఖ్యమంత్రి పి.వి.నరసింహారావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఫలితంగా సుప్రీంకోర్టు 1972, అక్టోబరు 3న ముల్కీ నిబంధనలు న్యాయ సమ్మతమే అని తీర్చునిచ్చింది. దాంతో ఆంధ్రులు తమ రాజధానిలోనే తాము ద్వితీయ పౌరులుగా భావించబడటం అన్యాయమని పేర్కొంటూ జై ఆంధ్రా ఉద్యమాన్ని ప్రారంభించారు. కేంద్రప్రభుత్వం రాజీ ప్రతిపాదనలు చేస్తూ హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో 1977 వరకు, మిగిలిన తెలంగాణాలో 1980 వరకు మాత్రమే ముల్కీ నిబంధనలు అమల్లో ఉంటాయని 1972, డిసెంబరు 23న పార్లమెంటులో పేర్కొంది.

ఆ మేరకు శాసనాన్ని చేసింది. కానీ ఆంధ్రులు బి.వి. సుబ్బారెడ్డి నాయకత్వంలో 1972, డిసెంబరు 31న సమావేశమై ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం డిమాండు చేశారు. ఆంధ్ర ప్రాంత ఉద్యోగులు 108 రోజులు సమ్మె చేశారు. ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న మరొక నాయకుడు కాకాని వెంకటరత్నం 1972, డిసెంబరులో గుండె పోటుతో మరణించారు.

 పి.వి. నరసింహారావు 1973 జనవరిలో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో జనవరి 18న రాష్ట్రపతి పాలన విధించారు. 1973లో ఆంధ్రా నాయకులు మళ్లీ చిత్తూరులో సమావేశం నిర్వహించి ఉద్యమ కొనసాగింపునకు నిర్ణయించారు. కానీ అప్పటి గవర్నరు ఖండూభాయ్ దేశాయ్ ముఖ్య సలహాదారైన హెచ్.సి.శరీన్ సమర్థంగా పనిచేసి ఉద్యమ తీవ్రతను తగ్గించాడు. కాంగ్రెస్ అధిష్ఠానం మొదట అయిదు అంశాల ప్రణాళికను ప్రకటించింది. 1973లో న్యాయస్థానం తీర్పునిస్తూ ముల్కీ నిబంధనలు ఉద్యోగంలో చేరేటప్పుడే వర్తిస్తాయనీ, ప్రమోషన్, సీనియారిటీ లాంటి విషయాల్లో వర్తించవని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం 1973, అక్టోబరు

1న ఆరు సూత్రాల పథకాన్ని ప్రకటించింది. దీని ద్వారా...

1) ముల్కీ నిబంధనలు, తెలంగాణ ప్రాంతీయ కమిటీ రద్దు అవుతాయి.

2) నాన్ గెజిటెడ్ ఉద్యోగాలకు, అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగాలకు స్థానిక అభ్యర్థులకే ప్రాధాన్యం ఇస్తారు.

3) ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి ఉన్నతాధికార న్యాయసంఘం ఏర్పాటు అవుతుంది.

4) రాష్ట్రస్థాయి ప్రణాళికా బోర్డు, వెనుకబడిన ప్రాంతాల ఉపసంఘాలను ఏర్పాటు చేస్తారు.

5) హైదరాబాద్‌లో కేంద్రీయ విశ్వవిద్యాలయం స్థాపిస్తారు.

6) పై అయిదు సూత్రాలను అమలు చేసేందుకు రాజ్యాంగాన్ని సవరించడం జరుగుతుంది.

 ఆంధ్రా కమిటీ 1973, అక్టోబరు 1న ఆరు సూత్రాల పథకాన్ని ఆమోదిస్తూ జై ఆంధ్రా ఉద్యమాన్ని విరమించింది. 1973, డిసెంబరు 18న 33వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్రం ఆమోదించింది. 1858లో ఏర్పడిన తెలంగాణ ప్రాంతీయ కమిటీని 1974, జనవరి 1 నుంచి రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా రద్దు చేశారు. 1973, డిసెంబరు 10న రాష్ట్రపతి పాలన తొలగించి జలగం వెంగళరావును ముఖ్యమంత్రిగా నియమించారు.


                  
1978 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 175 స్థానాలను పొంది మర్రి చెన్నారెడ్డి ఆరో ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. 1980లో టి. అంజయ్యను ముఖ్యమంత్రిగా నియమించారు. ఈయన 63 మందితో జంబో మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి కారణంగా అంజయ్య రాజీనామా చేయగా, భవనం వెంకట్రామరెడ్డి 1982లో ముఖ్యమంత్రి అయ్యారు. అంజయ్య కాలంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో విజయవాడ మేయర్ పదవిని సిపీఐ, డిప్యూటీ మేయర్ పదవిని సిపీఐ(ఎం) సొంతం చేసుకోగా విశాఖపట్నం మేయర్ పదవిని భారతీయ జనతా పార్టీ దక్కించుకుంది.

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిణామాలు, ముఖ్యాంశాలు:

1956లో నీలం సంజీవరెడ్డి తొలి ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ అవతరించింది. 1958లో 90 మంది సభ్యులతో శాసనమండలి ఏర్పాటైంది. అప్పటి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ దాన్ని ప్రారంభించారు. 1958లోనే 371(D) అధికరణ ప్రకారం తెలంగాణా ప్రాంతీయ సంఘం ఏర్పడింది. కర్నూలు జిల్లా బస్సు రూట్ల జాతీయకరణపై కోర్టు తీర్పు కారణంగా నీలం పదవికి రాజీనామా చేశారు. అనంతరం దామోదరం సంజీవయ్య ముఖ్యమంత్రిగా (1960 - 62) నియమితులయ్యారు. భారతదేశంలోనే తొలి దళిత ముఖ్యమంత్రిగా పేరొందారు. కె.వి.రంగారెడ్డిని ఉప ముఖ్యమంత్రిగా 1961లో నియమించారు. కాసు బ్రహ్మానందరెడ్డి కాలం (1964 - 71)లోనే విశాఖ ఉక్కు ఉద్యమం, జై తెలంగాణ ఉద్యమాలు జరిగాయి. తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి ప‌దవి చేప‌ట్టిన తొలి వ్యక్తిగా పి.వి. న‌ర‌సింహారావు పేరొందారు.
1972 నాటి పట్టణ భూముల సీలింగ్ విధానం (ఆర్డినెన్స్), భూసంస్కరణల బిల్లును పీవీయే ప్రవేశపెట్టారు. జిల్లా పరిషత్‌లను రద్దు చేశారు. గౌతు లచ్చన్న ప్రత్యేక ఆంధ్రా జెండాను 1972, డిసెంబరు 10న రూపొందించారు. జలగం వెంగళరావు 1973 - 78 మధ్య ముఖ్యమంత్రిగా ఉన్నారు. 1975లో మొదటి ప్రపంచ తెలుగు మహాసభలు హైదరాబాద్‌లో జరిగాయి. కోస్తా జిల్లాల్లో పెను తుపాను (1977) సంభవించింది. 1978లో రంగారెడ్డి జిల్లా (22) ఏర్పడింది. మర్రి చెన్నారెడ్డి కాలంలో 1979లో విజయనగరం జిల్లా (23) ఏర్పడింది. 1982లో దేశంలోనే మొదటి సార్వత్రిక విశ్వవిద్యాలయాన్ని హైదరాబాద్‌లో ప్రారంభించారు. దాన్నే 1991లో అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంగా పేరు మార్చారు.

తెలుగుదేశం పార్టీ అవతరణ

నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) 1982, మే 29న తెలుగుదేశం పార్టీని స్థాపించారు. కాంగ్రెస్ 1982, అక్టోబరులో భవనం వెంకటరామిరెడ్డి స్థానంలో కోట్ల విజయభాస్కరరెడ్డిని ముఖ్యమంత్రిగా నియమించింది. 1983, జనవరి 5న జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 202 స్థానాలను పొంది ఎన్టీఆర్ తొలి కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. కేవలం తొమ్మిది నెలల్లోనే (పార్టీని స్థాపించిన) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ద్వారా టీడీపీ గిన్నీస్ బుక్ రికార్డు సాధించింది. 1983, జనవరి 9న ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 నుంచి 55కు తగ్గించింది. అవినీతిపరులైన ఉద్యోగులను విచారించేందుకు ధర్మ మహామాత్ర అనే కొత్త పదవిని ఏర్పాటు చేశారు. 1984 మేలో విశాఖపట్నంలో జరిగిన టీడీపీ రెండో మహానాడులో పార్టీ ఎమ్మెల్యేలపై ఎన్టీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. పార్టీలో నారా చంద్రబాబు నాయుడు, దగ్గుపాటి వెంకటేశ్వరరావులకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం వల్ల పార్టీలో అసంతృప్తి మొదలైంది. వంశపారంపర్యంగా వస్తున్న కరణం, మున్సబ్ పదవులను ఎన్టీఆర్ రద్దు చేశారు. అయితే కిలో 2 రూపాయల బియ్యం లాంటి పథకాల ద్వారా ప్రజాభిమానాన్ని పొందారు. ఎం. రామచంద్రరావు అనే మంత్రి ఇంటికి పోలీస్ అధికారిని మారువేషంలో పంపి, లంచం ఇచ్చి అవినీతి ఆరోపణలతో అతడిని తొలగించారు. గుంటూరు జిల్లాకు చెందిన నాదెండ్ల భాస్కరరావు, చెన్నారెడ్డి, అంజయ్య మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. పార్టీపై అసంతృప్తితో ఎన్టీఆర్‌తో కలిసి టీడీపీ పార్టీ స్థాపనకు కారకుడయ్యారు.

ఎన్టీఆర్ ప్రభుత్వంలో హోంమంత్రి పదవిని చేపట్టారు. 1984, జూన్‌లో ఎన్టీఆర్ అమెరికా వెళ్లగా నాదెండ్ల అధికారం హస్తగతం చేసుకునే ప్రయత్నం చేశారు. విషయం తెలిసిన ఎన్టీఆర్ 1984, ఆగస్టు 14న హైదరాబాద్ వచ్చి భాస్కరరావును మంత్రి పదవి నుంచి తొలగించాల్సిందిగా గవర్నరు రాంలాల్‌ను కోరారు. కానీ, నాదెండ్ల భాస్కరరావుతోపాటు జీవన్‌రెడ్డి, రామమునిరెడ్డి, సత్యన్నారాయణ అనే మంత్రులు రాజీనామాచేసి తెలుగుదేశం పార్టీలో చీలిక తెచ్చారు. 1984, ఆగస్టు 16న రాంలాల్ నాదెండ్ల భాస్కరరావును ముఖ్యమంత్రిగా నియమించారు. ఎన్టీఆర్ 1984, ఆగస్టు 21న తనకు మద్దతు ఇస్తున్న 161 మంది ఎమ్మెల్యేలతో ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతి జైల్‌సింగ్‌ను కలుసుకున్నారు. 1984, ఆగస్టు 24న రాంలాల్ గవర్నరు పదవికి రాజీనామా చేశారు. శంకర్ దయాళ్ శర్మ ఆంధ్రప్రదేశ్ గవర్నరుగా నియమితులయ్యారు. ఢిల్లీలో రాష్ట్రపతిని కలిసిన బృందంలో ఉన్న అసెంబ్లీ స్పీకర్ టి.సత్యన్నారాయణ, డిప్యూటీ స్పీకర్ భీంరెడ్డి తర్వాత నాదెండ్ల వర్గంలో చేరారు. ఈ తరుణంలో ఎన్టీఆర్ ఆగస్టు 29 సెప్టెంబరు 3 మధ్య ఆంధ్రదేశమంతటా పర్యటించి మద్దతు కోసం ప్రయత్నించారు. గవర్నరు శంకర్‌దయాళ్ శర్మ నాదెండ్ల భాస్కరరావును తన బలాన్ని నిరూపించుకోవాల్సిందిగా సెప్టెంబరు 11న శాసనసభను సమావేశపరిచారు. ఎం. బాగారెడ్డి ప్రొటెం స్పీకరుగా బాధ్యతలు చేపట్టారు. కానీ సభలోని సభ్యుల అనుచిత ప్రవర్తన వల్ల రాజీనామా చేశారు. అతడి స్థానంలో సలావుద్దీన్ ఒవైసీ ప్రొటెం స్పీకరుగా నియమితులయ్యారు. గవర్నరు హెచ్చరికతో నాదెండ్ల రాజీనామా చేయగా 1984, సెప్టెంబరు 21న ఎన్టీఆర్ తన మెజారిటీని నిరూపించుకున్నారు. కానీ నవంబరు 22న అసెంబ్లీని రద్దు చేయించారు.

 1984, డిసెంబరులో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ 30 స్థానాలు గెలిచింది. కాంగ్రెస్ పార్టీకి కేవలం 6 స్థానాలు మాత్రమే వచ్చాయి. 1985, మార్చి 5న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ 202 స్థానాలు పొందగా కాంగ్రెస్ 49 స్థానాలు మాత్రమే చేజిక్కించుకుంది. నాదెండ్ల భాస్కరరావు అభ్యుదయ తెలుగుదేశం పార్టీ పేరుతో 220 స్థానాల్లో అభ్యర్థులను నిలపగా ఒక్కరూ కూడా విజయం సాధించలేదు. మలక్‌పేట నియోజక వర్గం నుంచి పోటీ చేసిన నాదెండ్ల కూడా బీజేపీ అభ్యర్థి చేతిలో ఓటమి చెందారు. ఎన్టీఆర్ కు సంక్షోభంలో మద్దతు ఇచ్చిన 99 మందిలో శ్రీకాకుళం జిల్లా కొత్తూరు నియోజకవర్గం నుంచి ఒక్కరు మాత్రమే ఓడిపోయారు. 1985, మార్చి 9న ఎన్టీఆర్ మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 1983 ఎన్నికల్లో 38% ఓట్లను పొందిన కాంగ్రెస్ 1985 ఎన్నికల్లో 44% ఓట్లను పొందడం గమనార్హం. ఈ ఎన్నికల్లో టీడీపీకి 47% ఓట్లు వచ్చాయి. 1985లో ఎన్టీఆర్ మంత్రివర్గం తీసుకున్న తొలి చర్య విధాన పరిషత్ రద్దు చేయడం. 90 మంది సభ్యులున్న శాసన మండలిలో 48 స్థానాలు కాంగ్రెస్‌కు ఉండటంవల్లే ఈ పని చేశారు. 1985, ఏప్రిల్ 30న శాసన సభలో తీర్మానం చేసి 1985, జూన్ 1న విధానపరిషత్‌ను రద్దు చేశారు.
1985లో సుప్రీంకోర్టు ఉద్యోగుల పదవీ విరమణ వయసు తగ్గింపు చెల్లదని తీర్పు ఇచ్చింది. ఫలితంగా ఉద్యోగులకు 158 కోట్ల రూపాయలు చెల్లించాల్సి వచ్చింది. 1986, జులై 15న టీడీపీ ప్రభుత్వం రిజర్వేషన్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. బీసీలకు 25% నుంచి 44% కి, ఎస్సీలకు 14% నుంచి 15%, ఎస్టీలకు 4% నుంచి 6% పెంచింది. కానీ, కోర్టు బీసీలకు ఇచ్చిన పెంపును రద్దు చేసింది.

ఈ తరుణంలోనే కాంగ్రెస్ సభ్యుడు ద్రోణంరాజు సత్యన్నారాయణ ఎన్టీఆర్‌పై అధికార దుర్వినియోగాన్ని ఆరోపిస్తూ హైకోర్టులో కేసు వేశారు. కోర్టు దాన్ని పరిశీలించదగినదిగా వ్యాఖ్యానించింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్టీఆర్ పాత మంత్రి వర్గాన్ని తొలగించి 1988, ఫిబ్రవరి 15న నూతన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. 1989, మార్చి 29న 32 మంది కాంగ్రెస్ నాయకులకు అసెంబ్లీ 30 రోజుల జైలుశిక్ష విధించింది. దీనిపై కాంగ్రెస్ అసెంబ్లీకి శిక్ష విధించే హక్కు లేదని, స్పీకర్‌పై సుప్రీంకోర్టులో కేసు వేసింది. కోర్టు వారిని విడుదల చేయాల్సిందిగా తీర్పు ఇచ్చినప్పటికీ అప్పటి స్పీకర్ జి. నారాయణరావు దాన్ని అమలు చేయడానికి నిరాకరించారు. విశ్వామిత్ర సినిమా నిర్మాణంపై కూడా కాంగ్రెస్ నాయకులు న్యాయస్థానంలో కేసులు వేశారు. కానీ కోర్టు మంత్రుల ప్రవర్తనా నియమావళి తన పరిధిలోకి రాదని తిరస్కరించింది. 1989, నవంబరు సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ 180 స్థానాలు గెలవగా, టీడీపీ 74 స్థానాలనే పొందగలిగింది. ఎన్టీఆర్ కూడా హిందూపురంలో గెలిచినప్పటికీ కల్వకుర్తి (మహబూబ్‌నగర్) స్థానంలో ఓటమి పాలయ్యారు. 1989, డిసెంబరు 3న మర్రిచెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు.
కానీ ఒక సంవత్సరంలోపే పదవి కోల్పోగా నేదురుమల్లి జనార్ధనరెడ్డి, అతడి తర్వాత కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ముఖ్యమంత్రులుగా మారారు. 1991, జూన్ 21న పి.వి. నరసింహారావు ప్రధానమంత్రిగా నియమితులయ్యారు. 1994 డిసెంబరు నాటి శాసన సభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 214 స్థానాలు పొంది, 1994న, 12 డిసెంబరు ఎన్టీఆర్ నాలుగోసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. అయితే ఊహించనిరీతిలో 1995, ఆగస్టు 31న ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.

ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి ప్రవేశించడం, ఆమెను తన రాజకీయ వారసురాలిగా ఆయన ప్రకటించడం లాంటి పరిణామాల వల్ల టీడీపీలో సంక్షోభం తలెత్తింది. ఎన్టీఆర్ 1994 ఎన్నికల్లో హిందూపురం, టెక్కలి నియోజక వర్గాల నుంచి గెలిచారు. టెక్కలి స్థానానికి రాజీనామా చేసి లక్ష్మీపార్వతిని ఆ స్థానం నుంచి గెలిపించాలని భావించారు. కానీ, హరికృష్ణ తనకు టెక్కలి స్థానం ఇవ్వాల్సిందిగా అభ్యంతరం తెలిపాడు. ఎన్టీఆర్ ఇద్దరినీ కాదని అప్పయ్య దొరను గెలిపించారు. చంద్రబాబు నాయుడు వర్గం ఈ పరిణామాలకు భయపడి పార్టీని చీల్చింది. 1995, ఆగస్టు 23, 24 తేదీల్లో వైస్రాయ్ హోటల్‌లో తనవర్గ ఎంఎల్ఏలను ఉంచి సెప్టెంబరు 1న ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. 144 మంది ఎంఎల్ఏలు చంద్రబాబు నాయుడిని తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఎన్నుకున్నారు. వీరు గవర్నరు కృష్ణకాంత్‌ను కలిసి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా నియమించమని కోరారు. ఎన్టీఆర్ 1995, ఆగస్టు 25న తన మంత్రిమండలిని సమావేశ పరిచారు. ఈ సమావేశానికి హాజరుకాని చంద్రబాబు నాయుడు, అశోక గజపతిరాజు, దేవేందర్ గౌడ్, మాధవరెడ్డి, విద్యాధరరావులను మంత్రిమండలి నుంచి తొలగించారు. శాసనసభను రద్దు చేయవలసిందిగా ఎన్టీఆర్ గవర్నరును కోరారు. కానీ, 140 మంది చంద్రబాబు నాయుడు బృందం గవర్నరును కలిసి ఎన్టీఆర్ నాయకత్వంలో విశ్వాసం లేదని తీర్మాన పత్రాన్ని సమర్పించారు. అందులోని శాసన సభ్యుల సంతకాలను పరిశీలించాల్సిందిగా గవర్నరు స్పీకరు వై. రామకృష్ణుడిని కోరారు. స్పీకర్ సంతకాలు పరిశీలించడమే కాకుండా అసమ్మతి వర్గానికే మెజారిటీ ఉందని ప్రకటించారు. గవర్నరు ఎన్టీఆర్‌ను 1995, ఆగస్టు 30లోగా సభ విశ్వాసం పొందాల్సిందిగా ఆదేశించారు. ఎన్టీఆర్ కోరిక మేరకు ఆ గడువును ఆగస్టు 31 వరకు పెంచారు.

టీడీపీ సర్వసభ్య సమావేశం 1995, ఆగస్టు 30న కాచిగూడ బసంత్ థియేటర్‌లో జరిగింది. ఈ సమావేశంలో చంద్రబాబు నాయుడిని అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఫలితంగా 1995, ఆగస్టు 31న ఎన్టీఆర్ రాజీనామా చేయగా, సెప్టెంబరు 1న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. మంత్రివర్గం 11 మందిలో హరికృష్ణ ఒక్కడే కొత్త మంత్రి. చంద్రబాబు నాయుడు 1978లో చంద్రగిరి నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచి అంజయ్య మంత్రి వర్గంలో సినిమా పరిశ్రమ మంత్రిగా పనిచేశారు. ఎన్టీఆర్ అల్లుడు కాగలిగారు. కానీ, 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపునే పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత టీడీపీలో చేరి ఎన్టీఆర్ ఆంతరంగిక సలహాదారుగా మారారు. నాదెండ్ల భాస్కరరావు వల్ల పదవి కోల్పోయిన సమయంలో చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ సమస్యలను పరిష్కరించారు. కానీ లక్ష్మీపార్వతి ప్రవేశంతో రాజకీయంగా సంక్షోభం తలెత్తింది.
ఎన్టీఆర్ కాలంలో తెలుగుగంగ ప్రాజెక్టు, సింగిల్‌విండో పథకం, స్త్రీలకు తండ్రి ఆస్తిలో సమాన హక్కు కల్పించడం, బెజవాడ కనకదుర్గ వారధి నిర్మాణం లాంటి కార్యక్రమాలు చేపట్టారు.

 

నారా చంద్రబాబు నాయుడు

1995, సెప్టెంబరు 1న పదకొండవ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఇతడి పరిపాలనా కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో అనేక నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరిశ్రమ అభివృద్ధికి పునాది వేసింది చంద్రబాబు నాయుడే. 1997, జనవరి 1న జన్మభూమి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో ప్రజల వద్దకు పాలన, శ్రమదానం, ఫైళ్ల క్లియరెన్స్ లాంటి అంశాలకు ప్రాధాన్యం ఇచ్చారు. హైదరాబాద్‌లో హైటెక్ సిటీని ఏర్పాటు చేశారు. అమెరికాకు చెందిన మెక్‌కిన్లే సంస్థ సహకారంతో విజన్ 2020ను రూపొందించి స్వర్ణాంధ్రప్రదేశ్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు.

1999 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి 180 అసెంబ్లీ స్థానాలు లభించగా కాంగ్రెస్ పార్టీకి 90 స్థానాలు వచ్చాయి. బీజేపీ 12 అసెంబ్లీ స్థానాలను దక్కించుకుంది. చంద్రబాబు నాయుడు రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎలక్ట్రానిక్ పరిపాలనకు ప్రాధాన్యం ఇచ్చారు. సచివాలయంలో ఎలక్ట్రానిక్ ఫైల్ మానిటరింగ్ వ్యవస్థ కోసం స్కిమ్స్ (SKIMS - సెక్రటేరియట్ నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ సిస్టం) పథకాన్ని ప్రవేశపెట్టారు. 2003, అక్టోబరు 1న తిరుపతిలో అలిపిరి వద్ద నక్సలైట్లు చంద్రబాబు నాయుడిపై దాడి చేశారు.
చంద్రబాబు ప్రభుత్వం కోటి వరాలు పేరుతో అనేక సంక్షేమ పథకాలను ప్రారంభించింది. రేషన్ కార్డుల పంపిణీ, దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్లు మంజూరు; పాఠశాల విద్యార్థినులకు సైకిళ్ల పంపిణీ, మహిళలకు స్వయం సహాయక గ్రూపుల ఏర్పాటు లాంటి కార్యక్రమాలు చేపట్టింది. 2001లో కేంద్ర ప్రభుత్వ పథకమైన పనికి ఆహారం పథకాన్ని ఆంధ్రప్రదేశ్ తిరిగి ప్రారంభించింది. ఇ - సేవా కేంద్రాలు ఏర్పాటు చేసింది. SMART (Simple, Moral, Accountable, Responsive, Transparent) పేరుతో కొత్త విధానాన్ని ప్రారంభించారు. చంద్రబాబు నాయుడు 2001లో 610 జీవో పై గిర్‌గ్లానీ కమిషన్ వేశారు.

వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి (2004 - 2009)

వై.ఎస్. రాజశేఖర రెడ్డి 2004, మే 14న రాష్ట్ర 14వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. వ్యక్తిపరంగా 14వ ముఖ్యమంత్రి, కానీ, పరిపాలనా పరంగా ఇతడు 26వ ముఖ్యమంత్రి. ఈయన ఉచిత విద్యుత్ ఫైలుపై తొలి సంతకం చేశారు. రైతు రుణమాఫీ, జలయజ్ఞం, ఇందిరమ్మ ఇళ్లు, పావలావడ్డీ, రైతు రుణాలు, ఇందిరా క్రాంతి పథకం, ఇందిర ప్రభ, రాజీవ్ యువశక్తి, భూ భారతి, అంబేడ్కర్ జీవనధార లాంటి అనేక పథకాలు అమలు చేశారు. SMART పథకాన్ని CARINGగా మార్చారు. (CARING - కమిటెడ్, ఎకౌంటబుల్, రెస్పాన్సివ్, ఇన్‌స్పైరింగ్, నేషనలిస్ట్, జెన్యూన్).
ఇందిరమ్మ పథకాన్ని 2006, ఏప్రిల్ 1న తూర్పుగోదావరి జిల్లా, పడమర ఖండ్రిక గ్రామంలో ప్రారంభించారు. వెలుగు, డ్వాక్రా పథకాలను విలీనం చేసి ఇందిరా క్రాంతి పథకంగా మార్చారు. బీడు భూములను వ్యవసాయ భూములుగా మార్చడానికి ఇందిరప్రభ పథకాన్ని ప్రవేశపెట్టారు. పట్టణాల్లో 36 వేల రూపాయలలోపు వార్షిక ఆదాయం ఉండి, ఇల్లులేని పేదలకు ఇళ్లు నిర్మించడానికి రాజీవ్ గృహకల్ప ప్రారంభించారు. దేశంలోనే తొలిసారిగా సమీకృత భూ సమాచార వ్యవస్థ భూ భారతిని ప్రారంభించారు (2006, నవంబరు 5; నిజామాబాద్ జిల్లా సాలంపాడ్ వద్ద). దళిత వాడలకు మంచినీటి సౌకర్యం కోసం 2005, ఏప్రిల్ 14న హైదరాబాద్‌లో అంబేడ్కర్ జీవనాధార పథకాన్ని ప్రారంభించారు. 2009, మే 20న రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వైఎస్ఆర్ 2009, సెప్టెంబరు 2న హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు.

దాంతో సెప్టెంబరు 3న కె. రోశయ్యను ముఖ్యమంత్రిగా నియమించారు. శాసనమండలి నుంచి ముఖ్యమంత్రి అయిన రెండో వ్యక్తి రోశయ్య (1982లో భవనం వెంకటరామిరెడ్డి శాసనమండలి నుంచి నియమితులయ్యారు). ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 16 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన వ్యక్తిగా రోశయ్య రికార్డు సృష్టించారు. ఇతడి కాలంలోనే 2010, ఫిబ్రవరి 3న శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేశారు.
 

ఎన్. కిరణ్‌కుమార్ రెడ్డి (2010 - 2014)

రోశయ్య రాజీనామాతో నవంబరు 25, 2010న కిరణ్‌కుమార్ రెడ్డి 16వ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. 39 మందితో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర చరిత్రలో ఇంతమంది మంత్రులు ఒకేసారి ప్రమాణస్వీకారం చేయడం ఇదే తొలిసారి. ఇతడికాలంలోనే వైఎస్ జగన్ 2011, మార్చి 12న ఇడుపులపాయలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. రాష్ట్రపతి 14(F) అధికరణాన్ని తొలగిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ నేపథ్యం, రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా కిరణ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి పదవికి 2014, ఫిబ్రవరి 19న రాజీనామా చేశారు. దాంతో 2014, మార్చి 1న ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించారు. ఇంతకుముందు పి.వి. నరసింహారావు కాలంలో 1973, జనవరి 11 నుంచి 1973, డిసెంబరు 10 వరకు రాష్ట్రపతి పాలన విధించారు.

కిరణ్‌కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నకాలంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారు. రూపాయికే కిలోబియ్యం పథకాన్ని 2011, నవంబరు 1న ముఖ్యమంత్రి ఖైరతాబాద్‌లో ప్రారంభించారు. సబల, స్త్రీనిధి, రాజీవ్ యువకిరణాలు, అమ్మకొంగు, మార్పు, ఇందిర జలప్రభ, రైతులకు వడ్డీలేని రుణాలు లాంటి పథకాలు ప్రవేశపెట్టారు. 11 - 18 సంవత్సరాల వయసున్న బాలికలకు పౌష్టికాహారం, ఆరోగ్యం, లైంగిక విద్యపై అవగాహన కోసం అంగన్‌వాడీ కేంద్రాలను నోడల్ ఏజెన్సీలుగా సబల పథకం ప్రవేశపెట్టారు. 2011, అక్టోబరు 2న ఇందిర జలప్రభ పథకాన్ని ప్రకాశం జిల్లా జంగాలపల్లిలో ప్రారంభించారు. స్త్రీ ప్రసూతి మరణాలు, శిశుమరణాలు తగ్గించడానికి మార్పు పథకం ప్రవేశపెట్టారు. సంక్షేమ కార్యక్రమాల అమలు, పర్యవేక్షణకు ఇందిరమ్మ బాట కార్యక్రమం అమలు చేశారు. ఇతడి కాలంలోనే నాలుగో ప్రపంచ తెలుగు మహాసభలు 2012లో తిరుపతిలో జరిగాయి. చిత్తూరు జిల్లా శతదినోత్సవ ఉత్సవాలు (1911 - 2011) జరిగాయి. 2013, జులై 30న కేంద్రం ఆంధ్రా, తెలంగాణలను విభజిస్తూ నిర్ణయం తీసుకుంది. విభజన బిల్లును లోక్‌సభ 18-2-2014న, రాజ్యసభ 20-2-14న ఆమోదించాయి. 2014, మార్చి 1న రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. 2014, జూన్ 2న చట్టం అమల్లోకి రావడంతో తెలంగాణ 29వ రాష్ట్రంగా ఆవిర్భవించింది. కేంద్ర ప్రభుత్వం విభజన కోసం మొత్తం 14 కమిటీలను ఏర్పాటు చేసింది. మొత్తం విభజన ప్రక్రియను పర్యవేక్షించే అపెక్స్ కమిటీని సత్యప్రకాశ్ టక్కర్ కన్వీనర్‌గా 7 మంది సభ్యులతో ఏర్పాటు చేశారు. అపెక్స్ కమిటీని ప్రణాళికా శాఖ ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి గవర్నరు అధ్యక్షత వహిస్తారు (ఆంధ్రప్రదేశ్ గవర్నరు).

2014 ఏప్రిల్‌లో రెండు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం 175 స్థానాల్లో టీడీపీ 102, బీజేపీ 4 స్థానాలు పొందాయి. 25 లోక్‌సభ స్థానాల్లో టీడీపీ 15, బీజేపీ 2, వైఎస్ఆర్‌సీపీ 8 స్థానాలు పొందాయి.

ఈ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ మిత్ర పక్షానికి 46.53 శాతం ఓట్లురాగా, వైఎస్ఆర్‌సీపీకి 44.47 శాతం ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్కస్థానాన్ని పొందలేకపోయింది. 2014, జూన్ 8న నారా చంద్రబాబునాయుడు గుంటూరులో నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.
 

శ్రీకృష్ణ కమిటీ

ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం 2010, ఫిబ్రవరి 3న శ్రీకృష్ణ కమిటీని నియమించింది. ఇందులో మొత్తం అయిదుమంది సభ్యులున్నారు. బేలూరు నారాయణ స్వామి శ్రీకృష్ణ అధ్యక్షులుగా, వినోద్‌కుమార్ దుగ్గల్‌ను కార్యదర్శిగా నియమించారు. రవీందర్ కౌర్, రణబీర్ సింగ్, అబూసలేష్ షరీఫ్ మిగతా సభ్యులు. శ్రీకృష్ణ కమిటీ డిసెంబరు 30, 2010న కేంద్ర హోంశాఖకు తన నివేదికను సమర్పించింది. కమిటీ 6 రకాల పరిష్కార మార్గాలను సూచించింది. అవి:

1) యథాతథ స్థితిని కొనసాగించడం.

2) రాష్ట్రాన్ని సీమాంధ్ర, తెలంగాణాలుగా విభజించి హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయడం.

3) రాష్ట్రాన్ని రాయల తెలంగాణ, కోస్తాంధ్ర ప్రాంతంగా విభజించి హైదరాబాద్‌ను రాయల తెలంగాణలో అంతర్భాగం చేయడం.

4) సీమాంధ్ర, తెలంగాణలుగా విభజించి, హైదరాబాద్‌ను ప్రత్యేక కేంద్రపాలిత ప్రాంతంగా ఉంచి భౌగోళిక అనుసంధానతను కల్పించడం. అంటే నల్గొండ

జిల్లా నుంచి గుంటూరు జిల్లాకు, మహబూబ్‌నగర్ నుంచి కర్నూలు జిల్లాకు భౌగోళిక అనుసంధానం చేయడం.

5) రాష్ట్రాన్ని సీమాంధ్ర, తెలంగాణాలుగా విభజించడం, తెలంగాణకు హైదరాబాద్‌ను రాజధానిగా ఉంచి, సీమాంధ్రకు నూతన రాజధానిని నిర్మించడం.

6) రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం, తెలంగాణ ప్రాంత అభివృద్ధికి రాజ్యాంగపరమైన, చట్టపరమైన రక్షణలు కల్పించడం. కానీ తెలంగాణ ప్రజలు, నాయకులు దీన్ని తిరస్కరిస్తారని కూడా కమిటీ పేర్కొంది. శ్రీకృష్ణ కమిటీ బహిర్గతం చేయకుండా 8వ అధ్యాయాన్ని ఉంచింది. 8వ అధ్యయంలో శాంతిభద్రతలు నెలకొల్పడానికి అనుసరించాల్సిన నియమ నిబంధనాలు పొందుపరిచారు. ప్రాంతీయతత్వంతో ఉన్న ఏ ప్రాంతాల్లోనైనా తన సూచనలు అమలు చేయడానికి వీలుగా ఉంటాయని కూడా శ్రీకృష్ణ కమిటీ పేర్కొంది.
 

ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టం - 2014

2013, జులై 30న కేంద్రం ఆంధ్ర, తెలంగాణలను విభజించడానికి నిర్ణయం తీసుకుంది. లోక్‌సభ, రాజ్యసభలు ఆమోదించిన విభజన బిల్లును రాష్ట్రపతి 2014, మార్చి 1న ఆమోదించారు. ఫలితంగా 2014, జూన్ 2న ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టం అమల్లోకి వచ్చింది. ఫలితంగా తెలంగాణ 29వ రాష్ట్రంగా ఏర్పడింది.

పార్లమెంటరీ ప్రక్రియ - అసెంబ్లీలో చర్చలు

కేంద్రమంత్రి వర్గం ఆమోదించిన బిల్లు కేంద్రహోంశాఖ నుంచి రాష్ట్రపతి కార్యాలయానికి వెళ్లగా, ఈ ముసాయిదా బిల్లుపై 45 రోజులు/6 వారాల్లోగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, శాసనమండలి అభిప్రాయాలను తెలపాల్సిందిగా రాష్ట్రానికి పంపారు. 2013, డిసంబరు 16 న స్పీకర్ నాదెండ్ల మనోహర్ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టారు. సభలో గందరగోళ పరిస్థితులు నెలకొని వాయిదాల పర్వం కొనసాగింది. ఈ తరుణంలోనే శాసనసభ వ్యవహారాల శాఖ నుంచి శ్రీధర్‌బాబును తప్పించి శైలజానాథ్‌ను ఆ పదవిలో నియమించడంతో శ్రీధర్‌బాబు తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. తెలంగాణ జేఏసీ సభలోని వ్యవహారాలకు నిరసనగా జనవరి 7, 2014న ఇందిరాపార్కులో సంపూర్ణ తెలంగాణ సాధన దీక్ష నిర్వహించింది. జనవరి 8న విభజన బిల్లుపై మొదటిసారిగా మంత్రి వట్టి వసంతకుమార్ చర్చను ప్రారంభిస్తూ ప్రసంగించారు. జయప్రకాశ్ నారాయణ్ తెలంగాణ ఏర్పాటు ఆవశ్యకతను వివరించగా, శైలజానాథ్ సమైక్య ఆంధ్రప్రదేశ్ ఆవశ్యకతను గురించి ప్రసంగించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రూల్ 77 కింద బిల్లును తిరస్కరిస్తూ, పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు సిఫార్సు చేయవద్దని రాష్ట్రపతికి విజ్ఞప్తి చేసే తీర్మానాన్ని ప్రవేశపెడుతూ స్పీకర్‌కు నోటీసు ఇచ్చారు. తర్జన భర్జనల నడుమ జనవరి 29, 2014న బిల్లుపై 9072 సవరణ ప్రతిపాదనలు వచ్చాయని ప్రకటించారు. శాసనమండలిలో కూడా విభజన బిల్లుపై 1157 సవరణ ప్రతిపాదనలు వచ్చాయి. బిల్లును కేంద్ర హోంశాఖకు పంపగా తెలంగాణ బిల్లును ఆంధ్రప్రదేశ్ చట్టసభలు తిరస్కరించినప్పటికీ రాజ్యాంగం ప్రకారం పార్లమెంటు వాటికి కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని హోంశాఖ ప్రకటించింది. తెలంగాణ బిల్లు విషయంలో రాజ్యాంగ సవరణ అవసరంలేదని న్యాయశాఖ కూడా తన అభిప్రాయాన్ని తెలిపింది. 2014, ఫిబ్రవరి 18న లోక్‌సభ బిల్లును ఆమోదించగా, ఫిబ్రవరి 20న రాజ్యసభ ఆమోదం తెలిపింది. రాజ్యసభ డిఫ్యూటీ ఛైర్మన్ కురియన్, సి.పి.ఎం. నేత సీతారాం ఏచూరి తాము బిల్లుకు వ్యతిరేకమని ప్రకటించారు. వెంకయ్యనాయుడు 38 సవరణలు ప్రతిపాదించారు. నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్ ఆంధ్రప్రదేశ్‌కు 6 హామీలు ఇచ్చారు.

అందులో ముఖ్యమైనవి.

1) నవ్యాంధ్రప్రదేశ్‌కు 5 సంవత్సరాలపాటు ప్రత్యేక హోదా ఇవ్వడం

2) పారిశ్రామిక అభివృద్ధి సాధనకు ప్రోత్సాహకాలు కల్పించడం

3) అభివృద్ధి ప్యాకేజీ అందించడం

4) పోలవరం ప్రాజెక్టును కేంద్రమే పూర్తిచేయడం.

5) సిబ్బంది, ఆస్తులు అప్పుల పంపకం లాంటి చర్చల కోసం విభజన తేదీని నిర్ణయించడం,

6) ఆంధ్రప్రదేశ్‌కు తొలి సంవత్సరం ఏర్పడే లోటును 2014 - 2015 కేంద్ర బడ్జెట్ ద్వారా పూడ్చడం లేదా భర్తీ చేయడం.

2014, మార్చి 1న రాష్ట్రపతి సంతకం చేయడంతో ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లు - 2013, ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టం - 2014గా రూపొందింది. 2014, జూన్ 2ను విభజన తేదీ (అపాయింటెడ్ డే)గా నిర్ణయించారు. ఈ చట్టంలో 12 భాగాలు (పార్ట్‌లు), 108 అధికరణలు (సెక్షన్‌లు), 13 షెడ్యూళ్లు ఉన్నాయి.
 

చట్టంలోని 12 భాగాలు

1. ప్రవేశిక (1, 2 అధికరణలు)

2. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ (3 - 11 అధికరణలు)

3. చట్టసభల్లో ప్రాతినిధ్యం (12 - 29 అధికరణలు)

4. హైకోర్టు (30 - 41 అధికరణలు)

5. వ్యయానికి అధికారం, ఆదాయ పంపిణీ (44 - 46 అధికరణలు)

6. ఆస్తుల, అప్పుల పంపిణీ (47 - 67 అధికరణలు)

7. కొన్ని కార్పొరేషన్లకు సంబంధించిన నియమాలు (68 - 75 అధికరణలు)

8. అఖిల భారత సర్వీసులకు సంబంధించిన నిబంధనలు (76 - 83 అధికరణలు)

9. జలవనరుల అభివృద్ధి, నిర్వహణ (84 - 91 అధికరణలు)

10. మౌలిక వనరులు, ప్రత్యేక ఆర్థికచర్యలు (92 - 94 అధికరణలు)

11. ఉన్నత విద్యావకాశాలు (95వ అధికరణ)

12. న్యాయ సంబంధ నిబంధనలు (96 - 108 అధికరణలు)
 

చట్టంలోని 13 షెడ్యూల్స్

1. మొదటి షెడ్యూల్ (అధికరణ/సెక్షన్ 13): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు రాజ్యసభలోని 18 స్థానాల్లో ఏడు (7) స్థానాలను తెలంగాణకు కేటాయించే విధానాన్ని వివరిస్తుంది.

2. రెండో షెడ్యూల్ (13వ అధికరణ): ఇందులో 2008 నాటి పార్లమెంటు, అసెంబ్లీ నియోజక వర్గం ఉత్తర్వులకు ప్రతిపాదించిన సవరణలను పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన 25 లోక్‌సభ స్థానాల్లో నాలుగు స్థానాలు ఎస్సీలకు, 2 స్థానాలు ఎస్టీలకు కేటాయించారు. అక్షర క్రమంలో తమిళనాడు, తర్వాత 25వ స్థానంలో తెలంగాణ రాష్ట్రాన్ని చేర్చారు. తెలంగాణకు కేటాయించిన 17 లోక్‌సభ స్థానాల్లో ఎస్సీలకు 3, ఎస్టీలకు 2 కేటాయించారు. ఆంధ్రప్రదేశ్‌కు 175 అసెంబ్లీ స్థానాల్లో ఎస్సీలకు 29, ఎస్టీలకు 7 స్థానాలు రిజర్వ్ చేయగా, తెలంగాణలోని 119 అసెంబ్లీ స్థానాల్లో ఎస్సీలకు 19, ఎస్టీలకు 12 స్థానాలు కేటాయించారు.

3. మూడో షెడ్యూల్ (24వ అధికరణ): రెండు రాష్ట్రాల్లోని అసెంబ్లీ, శాసనమండలి, పార్లమెంటరీ నియోజక వర్గాలను గురించి పేర్కొన్నారు.

4. నాలుగో షెడ్యూల్ (22(2)వ అధికరణ): రెండు రాష్ట్రాల్లోని శాసనమండలి సభ్యులను గురించి పేర్కొన్నారు.

5. అయిదో షెడ్యూల్ (28వ అధికరణ): తెలంగాణ రాష్ట్రంలోని షెడ్యూల్డ్ కులాలు గురించి వివరిస్తుంది.

6. ఆరో షెడ్యూల్ (29వ అధికరణ): తెలంగాణ రాష్ట్రంలో షెడ్యూల్డ్ తెగల గురించి వివరిస్తుంది.

7. ఏడో షెడ్యూల్ (52వ అధికరణ): ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్ ఫండ్, బీమా ఫండ్‌ల గురించి; సింకింగ్ ఫండ్, గ్యారంటీ రిసంప్షన్ ఫండ్, రిజర్వ్ ఫండ్‌లు, ఇతర నిధుల గురించి వివరిస్తుంది.

8. ఎనిమిదో షెడ్యూల్ (59వ అధికరణ): పెన్షన్ చెల్లింపుల బాధ్యతల గురించి తెలియజేస్తుంది.

9. తొమ్మిదో షెడ్యూల్ (అధికరణలు 68, 71): ప్రభుత్వ సంస్థలు, కార్పొరేషన్‌ల జాబితాలను వివరిస్తుంది.

10. పదో షెడ్యూల్ (75వ అధికరణ): కొన్ని రాష్ట్ర సంస్థల జాబితా, ఆయా సంస్థల్లో సౌకర్యాల కొనసాగింపు లాంటి విషయాలను ప్రస్తావించారు.

11. పదకొండో షెడ్యూల్ (85(7)వ అధికరణ): నదీ జలాల నిర్వహణ బోర్డుల పని విధానాన్ని నిర్ధేశించే సూత్రాలను పేర్కొన్నారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న కల్వకుర్తి, నెట్టెంపాడు, హంద్రీ-నీవా, తెలుగుగంగ, గాలేరునగరి,

వెలిగొండ ప్రాజెక్టులను ఉమ్మడి రాష్ట్రంలో అనుకున్న ప్రకారమే పూర్తిచేయాలి.

12. పన్నెండో షెడ్యూల్ (92వ అధికరణ): బొగ్గు, చమురు, సహజవాయువు విద్యుత్‌ల గురించి వివరణలు ఉన్నాయి.

13. పదమూడో షెడ్యూల్ (93వ అధికరణ): ఇందులో విద్యారంగం, పారిశ్రామిక మౌలిక సదుపాయాలను గురించిన వివరణలను పొందుపరిచారు. జాతీయ ప్రాధాన్యం ఉన్న ఐఐటీ (IIT), ఎన్ఐటీ (NIT), ఐఐఎం (IIM), పెట్రోలియం, వ్యవసాయ, గిరిజన విశ్వవిద్యాలయాల స్థాపనకు కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు సహకరిస్తుంది. తగిన చర్యలు తీసుకుంటుంది. తెలంగాణలో గిరిజన విశ్వవిద్యాలయం, ఉద్యానవన విశ్వవిద్యాలయం ఏర్పాటును కేంద్రమే చేస్తుంది.

ఓడరేవులు, ఉక్కు పరిశ్రమలు, పారిశ్రామిక కారిడార్‌లు, విమానాశ్రయాలు, మెట్రోరైలు సౌకర్యాలు, విద్యుత్ ప్లాంట్లు లాంటి మౌలిక వసతుల కల్పనకు కేంద్రం చర్యలు తీసుకుంటుంది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక రైల్వేజోన్‌ను ఏర్పాటు చేస్తుంది. ఏపీలోని దుగ్గిరాజపట్నంలో భారీ ఓడరేవును నిర్మిస్తుంది. ఖమ్మం, కడప జిల్లాల్లో సమగ్ర ఉక్కు కర్మాగారాలు నెలకొల్పుతుంది. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి విమానాశ్రయాలు; విశాఖ, విజయవాడ, గుంటూరు మెట్రోరైలు సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకుంటుంది.
 

ఆంధ్రప్రదేశ్ పునర్‌విభజన చట్టంలోని 108 సెక్షన్‌లో కొన్ని ముఖ్యాంశాలు:

* 1, 2 సెక్షన్లు/అధికరణల్లో చట్టం పేరు, కొన్ని పదాల నిర్వచనాలు వివరించారు.

* 3వ సెక్షన్ తెలంగాణా రాష్ట్ర అవతరణ, భూభాగాల గురించి వివరిస్తుంది.

* 5వ సెక్షన్ ఉమ్మడి రాజధాని హైదరాబాద్, దాని పరిధిని వివరిస్తుంది.

* 8వ సెక్షన్ ఉమ్మడి రాజధానిలో నివసించే ప్రజల రక్షణ, గవర్నర్ బాధ్యతల గురించి వివరిస్తుంది.

* 10వ సెక్షన్ రాజ్యాంగం మొదటి షెడ్యూల్‌కు సవరణ చేసి ఆంధ్రప్రదేశ్ పునర్‌విభజన చట్టంలోని సెక్షన్ 3లో పేర్కొన్న ప్రాంతాలను చేర్చవలసిందిగా పేర్కొంటుంది.

* 12, 13 సెక్షన్లు రాజ్యసభలో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల సభ్యుల సంఖ్య, ప్రస్తుత సభ్యుల కేటాయింపు, పదవీకాలం గురించి వివరిస్తాయి (ఏపీ 11 + తెలంగాణ 7 స్థానాలు).

* 14వ సెక్షన్ లోక్‌సభలో సభ్యుల సంఖ్యను 25 (ఆంధ్ర), 17 (తెలంగాణ)గా విభజించింది.

* 17వ సెక్షన్ శాసన సభ స్థానాలను 175 (ఆంధ్ర), 119 (తెలంగాణ)గా విభజించింది.

* 18వ సెక్షన్ 333 అధికరణ ప్రకారం గవర్నరు ఆంధ్ర, తెలంగాణ శాసనసభల్లో ఆంగ్లో ఇండియన్ ప్రతినిధులను నియమించాలి (1 + 1).

* 20వ సెక్షన్ శాసనసభల పదవీకాలం గురించి పేర్కొంది.

* 22వ సెక్షన్ ప్రకారం శాసనమండలి సభ్యుల సంఖ్య ఆంధ్రాకు 50, తెలంగాణకు 40 మంది పేర్కొంది.

* 26వ సెక్షన్ నియోజక వర్గాల డీలిమిటేషన్ గురించి పేర్కొంటుంది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్థానాలను 175 నుంచి 225కు తెలంగాణలో 119 నుంచి 135కు పెంచాలని సూచిస్తుంది.

* 30వ సెక్షన్ ఉమ్మడి హైకోర్టు గురించి పేర్కొంటుంది. న్యాయమూర్తుల జీతభత్యాలు, జనాభా ప్రాతిపదికన రెండు రాష్ట్రాలు భరించాలి.

* హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, హైకోర్ట్ ఆఫ్ హైదరాబాద్‌ల గురించి వివరిస్తుంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎక్కడ ఉండాలనే అంశాన్ని రాష్ట్రపతి ఒక ఆదేశం ద్వారా తెలియజేస్తారని 31వ సెక్షన్ వివరిస్తుంది.

* 46వ సెక్షన్ 13వ ఆర్థిక సంఘం నిధులను ఇరు రాష్ట్రాలకు పంచే విధానాన్ని గురించి వివరిస్తుంది.

* 47వ సెక్షన్ లాభాలు, అప్పుల పంపకం విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య వివాదం వస్తే కాగ్‌ని సంప్రదించి కేంద్ర ప్రభుత్వమే దాన్ని ఒక ఉత్తర్వు ద్వారా పరిష్కరించాలని వివరిస్తుంది.

* 84వ సెక్షన్ ప్రకారం 60 రోజుల్లోగా గోదావరి నదీ జలాల నిర్వహణ బోర్డును, కృష్ణా నదీ జలాల నిర్వహణ బోర్డును కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. గోదావరి బోర్డు తెలంగాణలో, కృష్ణాబోర్డు ఆంధ్రప్రదేశ్‌లో ఉంటాయి.

* 90వ సెక్షన్ పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి కేంద్ర ప్రభుత్వమే దాని నిర్మాణ బాధ్యతలను స్వీకరిస్తుంది అని పేర్కొంటుంది.

* 91వ సెక్షన్ తుంగభద్రా బోర్డులో రెండు రాష్ట్రాలు సభ్యులుగా ఉంటాయని వివరిస్తుంది.

* 95వ సెక్షన్ రాజ్యాంగం 371(డి) అధికరణ ప్రకారం అన్నిరకాల విద్యావ్యవస్థల్లో, సంస్థల్లో 10 సంవత్సరాలపాటు ఇరురాష్ట్రాల విద్యార్థులకు సమాన అవకాశాలను కల్పిస్తారని పేర్కొంటుంది.

* 96వ సెక్షన్ రాజ్యాంగంలోని 168(1) (ఎ)లో తమిళనాడు, తెలంగాణ అనే పదాలు చేర్చాలి అని పేర్కొంది.

* 98వ సెక్షన్ ప్రకారం ప్రజాప్రాతినిధ్య చట్టం (1951)లోని సెక్షన్ 15కు సవరణ తేవాలి. 2014 ఆంధ్రప్రదేశ్ పునర్‌విభజన చట్టం కింద తెలంగాణ రాష్ట్రం శాసన పరిషత్ ఏర్పాటు అనే పదాలను చేర్చాలి.

* రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ చట్టం 1956లోని సెక్షన్ 15కు సవరణ చేయాలి. 15(బి)లో ఉన్న ఆంధ్రప్రదేశ్ పదానికి బదులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అనే పదాలు చేర్చాలని 99వ సెక్షన్ వివరిస్తుంది.

విభజన చట్టానికి కేంద్రప్రభుత్వం చేసిన సవరణలు

2014, మార్చి 1న చట్టం ఆమోదించిన మరునాడే అంటే మార్చి 2వ తేదీన రెండు ప్రధానమైన సవరణలు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. అందులో మొదటిది పోలవరం ప్రాజెక్టు కింద ముంపునకు గురయ్యే 7 మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో వినీనం చేయడం కాగా రెండోది ఆంధ్రప్రదేశ్‌లో కేంద్ర ప్రభుత్వరంగ విద్యుత్ సంస్థల్లో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌లో 85 శాతాన్ని గాడ్గిల్ ఫార్ములా ప్రకారం రెండు రాష్ట్రాలకు జనాభా ప్రాతిపాదికన పంపిణీ చేయడం. మిగిలిన 15 శాతం విద్యుత్‌ను గత 5 సంవత్సరాల వాస్తవ వినియోగ గణాంకాల ఆధారంగా పంపిణీ చేయడం. ఖమ్మం జిల్లాలోని కుక్కునూరు, వేలేరుపాడు, చింతూరు, కూనవరం, వీఆర్‌పురం మండలాలను పూర్తిగా, బూర్గం పహాడ్ (12 గ్రామాలు మినహాయించి), భద్రాచలం (భద్రాచలం రెవెన్యూ గ్రామం, సీతారామ ఆలయం మినహాయించి) మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేశారు.

అదేవిధంగా లోక్‌సభ పునర్విభజన బిల్లుకు 38 సవరణలు చేసింది. వాటిలో తెలంగాణ రాష్ట్రం అక్షర క్రమంలో 25వ రాష్ట్రంగా పేర్కొనడం, నిధుల జాబితాలో మొదటి బిల్లులో 41 సంస్థలుండగా వాటిని 69కు పెంచడం, కార్పొరేషన్లు ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు 44 నుంచి 89కి పెంచడం, రాష్ట్రస్థాయి సంస్థల సంఖ్య 42 నుంచి 101కి పెంచడం లాంటివి ఉన్నాయి.
 

నీలం సంజీవరెడ్డి (1950 - 60, 1962 - 64)

* 1958లో APSRTC, 1959లో AP రాష్ట్ర విద్యుత్ బోర్డు ఏర్పడ్డాయి.

* మర్రి చెన్నారెడ్డి నాయకత్వంలో డెమొక్రటిక్ పార్టీ, ఎన్జీ రంగా నాయకత్వంలో స్వతంత్ర పార్టీ, తెన్నేటి విశ్వనాథం నాయకత్వంలో ప్రజా పార్టీ ఏర్పడ్డాయి.

* తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తొలి వ్యక్తిగా పి.వి. నరసింహారావు పేరొందారు.

* ఆంధ్రప్రదేశ్‌లో 1959లో పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రారంభమైంది.

* 1960లో నీలం సంజీవరెడ్డి INC అధ్యక్షులయ్యారు.

* శాసనమండలి తొలి ఛైర్మన్ మాడపాటి హనుమంతరావు.

* 1966లో తెలుగును అధికార భాషగా ప్రకటించారు.

* 1967లో నాగార్జునసాగర్‌ను జాతికి అంకితం చేశారు.

* 1975లో పార్లమెంట్ పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్ చట్టాన్ని చేసింది.

* 1930లో అఖిల భారత ముల్కీ సంఘాన్ని స్థాపించారు.

* కాసు బ్రహ్మానందరెడ్డి (1964 - 71) నామినేట్ అయిన తొలి ముఖ్యమంత్రి.

* తెన్నేటి విశ్వనాథం 1966లో విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు అనే ఉద్యమం చేపట్టారు.

* పత్రికా స్వాతంత్య్రాన్ని హరించే ప్రెస్ యాక్ట్‌ను 1967లోనే చేశారు. 1969లో ఇందిరాగాంధీ అష్టసూత్ర పథకం ప్రవేశపెట్టారు. 1970లో ప్రకాశం జిల్లా ఏర్పాటైంది.
 

పీవీ నరసింహారావు (1971 - 73)

* 1972లో ఇందిరాగాంధీ అయిదు సూత్రాల పథకం ప్రవేశపెట్టారు.
జలగం వెంగళరావు సమయంలో (1973 - 78) 1975, జులై 25న ఎమర్జెన్సీ విధించారు. జనతాపార్టీ ప్రభుత్వం ఏర్పడింది. నంద్యాల నుంచి లోక్‌సభకు ఎన్నికైన నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతి అయ్యారు.

* 1978లో కాంగ్రెస్.... కాంగ్రెస్ (ఐ), కాంగ్రెస్ (ఆర్)గా విడిపోయింది. కాంగ్రెస్ (ఆర్) అధ్యక్షుడిగా కాసు బ్రహ్మానందరెడ్డి నియమితులయ్యారు. జలగం వెంగళరావు రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు.
 

మర్రి చెన్నారెడ్డి (1978 - 80)

* 1978లో రంగారెడ్డి, 1979లో విజయనగరం జిల్లాలు ఏర్పడ్డాయి.

* ఉద్యోగులకు 5 రోజుల పనిదినాలు ప్రవేశపెట్టారు. అంజయ్య కాలంలో దాన్ని రద్దు చేశారు.
 

అంజయ్య టంగుటూరి (1980 - 82)

* చంద్రబాబు నాయుడు గ్రంథాలయాలు, సినిమాటోగ్రఫీ మంత్రిగా, వై.ఎస్. రాజశేఖరరెడ్డి గ్రామీణ అభివృద్ధి శాఖామంత్రిగా పనిచేశారు. పోలవరం ప్రాజెక్టు శంకుస్థాపన, జూరాల ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమయ్యాయి.

భవనం వెంకటరామిరెడ్డి

* 1982 శాసనమండలి నుంచి ఎన్నికైన తొలి ముఖ్యమంత్రి. రెండో వ్యక్తి రోశయ్య.

* 1985లో మండల వ్యవస్థ ఏర్పాటు. 1104 మండలాలుగా విభజన.

* తండ్రి ఆస్తిలో కూతురుకు సమాన హక్కు కల్పించే వారసత్వ చట్టం 1985లో చేశారు.

* 610 జీవో అమల్లోకి వచ్చింది (1985, డిసెంబరు).

* 1985లో మండల వ్యవస్థ ఏర్పాటు. 1104 మండలాలుగా విభజన.

* తండ్రి ఆస్తిలో కూతురుకు సమాన హక్కు కల్పించే వారసత్వ చట్టం 1985లో చేశారు.

* 610 జీవో అమల్లోకి వచ్చింది (1985, డిసెంబరు).
 

నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి (1990 - 1992)

* 1991 లోక్‌సభ మధ్యంతర ఎన్నికలు జరిగాయి.

* రాజీవ్‌గాంధీ హత్య, పి.వి. నరసింహరావు ప్రధానిగా నియమకం.

* ప్రయివేటు మెడికల్, డెంటల్, ఇంజినీరింగ్ కాలేజీలకు అనుమతి

* గ్రానైట్ లీజ్ వ్యవహారంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు.
 

కోట్ల విజయభాస్కర్ రెడ్డి (1992 - 1994)

* సారా వ్యతిరేక ఉద్యమం జరిగింది.

* 1994లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 26 స్థానాలు మాత్రమే పొందింది. టీడీపీకి 219 స్థానాలు వచ్చాయి.

ఎన్టీఆర్ (1994 - 95)

* 1994 డిసెంబరు 12 న 4వ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. మద్యపాన నిషేధం అమలుపై తొలి సంతకం. ఎన్టీఆర్ మొత్తం 7 సంవత్సరాల 5 నెలల 28 రోజులు ముఖ్యమంత్రిగా పని చేశారు.

Posted Date : 11-07-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌