• facebook
  • whatsapp
  • telegram

భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన

         భారత జాతీయ కాంగ్రెస్ స్థాపనకు ముందు అనేక రాజకీయ సంస్థలు ఏర్పాటయ్యాయి. అయితే వీటిలో ప్రధానమైంది 1876లో కలకత్తాలో సురేంద్రనాథ్ బెనర్జీ, ఆనంద మోహన్ బోస్ స్థాపించిన ఇండియన్ అసోసియేషన్. ఇది సివిల్ సర్వీస్ వ్యవస్థలో సంస్కరణలు, కౌలుదారుల హక్కుల రక్షణ, తేయాకు తోటల్లో పనిచేసే కార్మికుల హక్కులు మొదలైన విషయాలపై పోరాడింది. బెంగాల్‌లోని గ్రామాలు, పట్టణాల్లో, బెంగాల్ రాష్ట్రం బయట అనేక నగరాల్లో శాఖలను ఏర్పాటు చేసింది. దేశవ్యాప్త సంస్థగా ఎదగడానికి 1883, 1885లో రెండు జాతీయ సమావేశాలను కూడా నిర్వహించింది.
 

భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన
 

     భారత జాతీయ కాంగ్రెస్ స్థాపనకు ముందున్న సంస్థలన్నీ ఏదో ఒక ప్రయోజనం కోసం ఏర్పడినవే. అవన్నీ ఏదో ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమై, స్థానిక సమస్యల పట్ల దృష్టి సారించాయి. అయితే జాతీయ స్థాయిలో ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించే సంస్థను ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతను కొందరు జాతీయ నాయకులు గుర్తించారు. దీంతో దూరదృష్టి కలిగిన రాజకీయవేత్తలు దేశవ్యాప్త సంస్థను ఏర్పాటు చేయాలని భావించారు.
 

* పదవీ విరమణ పొందిన ఆంగ్లేయ ఉద్యోగి ఎ.ఒ. హ్యూమ్ అలాంటి సంస్థను ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించినప్పుడు వారంతా ఆయనకు తమ సహకారాన్ని అందించారు. 1883 లో కలకత్తా విశ్వవిద్యాలయ గ్రాడ్యుయేట్లకు రాసిన బహిరంగ లేఖలో హ్యూమ్ అఖిల భారత రాజకీయ సంస్థను ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతను పేర్కొన్నారు.

* 1885 లో భారత జాతీయ యూనియన్ అనే సంస్థను ఏర్పాటు చేసి మూడు ప్రెసిడెన్సీలలో పర్యటించాడు. అదే ఏడాది డిసెంబరులో పూనాలో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. అయితే పూనాలో కలరా వ్యాధి వ్యాపించడంతో సమావేశ వేదికను బొంబాయిలోని తేజ్‌పాల్ సంస్కృత పాఠశాలకు మార్చాల్సి వచ్చింది.
 

* దాదాబాయి నౌరోజీ సూచన మేరకు 'భారత జాతీయ యూనియన్‌'లో యూనియన్‌ను తొలగించి దాని స్థానంలో కాంగ్రెస్‌ను చేర్చారు.

* కాంగ్రెస్ మొదటి సమావేశం డిసెంబరు 28 న బొంబాయిలో ఉమేశ్‌చంద్ర బెనర్జీ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి దేశం నలుమూలల నుంచి వచ్చిన 72 మంది ప్రతినిధులు హాజరయ్యారు. మొదటి సమావేశానికి బెంగాల్ నాయకులను దూరంగా ఉంచారు.

*  కాంగ్రెస్ రెండో సమావేశం 1886 లో కలకత్తాలో జరిగింది. 436 మంది ప్రతినిధులు హాజరైన ఈ సభకు దాదాబాయి నౌరోజీ అధ్యక్షత వహించారు.

* మూడో సమావేశం 1887 లో మద్రాసులో జరిగింది. దీనికి బద్రుద్దీన్ త్యాబ్జీ అధ్యక్షత వహించారు. నాలుగో సమావేశం 1888 లో అలహాబాద్‌లో జరిగింది. దీనికి జార్జి యూల్ అధ్యక్షత వహించి, ఆ బాధ్యత చేపట్టిన తొలి విదేశీయుడయ్యారు.

* భారత జాతీయ ఉద్యమం మూడు దశల్లో సాగింది.
1. మితవాద యుగం (క్రీ.శ. 1885 - 1905)
2. అతివాద యుగం (క్రీ.శ. 1905 - 1919)
3. గాంధీయుగం (క్రీ.శ. 1919 - 1947)

మితవాద యుగం
 

      కాంగ్రెస్ మొదట్లో ప్రభుత్వ విధానాలను, చర్యలను విమర్శిస్తూ, సంస్కరణలు చేపట్టాలని కోరుతూ తీర్మానాలు చేసింది. ఏటా బ్రిటిష్ ప్రభుత్వానికి విధేయతను ప్రకటించింది. కాంగ్రెస్ చేపట్టిన మితవాద చర్యల వల్ల ఈ కాలాన్ని మితవాద యుగంగా పిలిచారు. కాంగ్రెస్ పట్ల బ్రిటిష్ ప్రభుత్వం కూడా సానుకూలంగా వ్యవహరించింది. అయితే ప్రభుత్వం కాంగ్రెస్‌ను అల్ప సంఖ్యాకులకు ప్రాతినిధ్యం వహించే సంస్థగా భావించింది. దీంతో 19 వ శతాబ్దం చివరి నాటికి కాంగ్రెస్ డిమాండ్లలో, పోరాట విధానాల్లో మార్పు వచ్చింది.
 

* ఇరవయ్యో శతాబ్దం ప్రారంభంలో మితవాద జాతీయ నాయకులు ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్ దేశాల్లోలాగా భారతదేశంలో కూడా బ్రిటిష్ సామ్రాజ్యంలో అంతర్భాగంగా ఉంటూనే స్వపరిపాలనకు అనుమతించాలని కోరారు. మొదటిసారిగా 1905 లో గోపాలకృష్ణ గోఖలే, 1906 లో దాదాబాయి నౌరోజీ కాంగ్రెస్ తరపున ఈ డిమాండ్ చేశారు.
 మితవాద నాయకుల్లో ముఖ్యులు: దాదాబాయి నౌరోజీ, మహదేవ గోవింద రనడే, సురేంద్రనాధ్ బెనర్జీ, ఫిరోజ్ షా మెహతా, బద్రుద్దీన్‌త్యాబ్జీ, గోపాలకృష్ణ గోఖలే, దీన్ షా వాచా, రాస్ బిహారి ఘోష్, ఆనందమోహన్ బోస్, రమేష్ చంద్రదత్, కె.టి. తెలాంగ్, ఎ.సి. మజుందార్, సుబ్రమణ్య అయ్యర్, ఆనందాచార్యులు, విలియం వెడ్డర్ బర్న్, హెన్రీ కాటన్ మొదలైనవారు.
 

ప్రధానమైన డిమాండ్లు:
 

* భారతీయులకు ఎక్కువ ప్రాతినిధ్యం కల్పిస్తూ గవర్నర్ జనరల్ కౌన్సిల్‌ను విస్తరించడం
* ఉప్పు మీద పన్నును, రక్షణ బడ్జెట్‌ను తగ్గించడం
* భారత వస్త్ర పరిశ్రమను తిరిగి అభివృద్ధి చేయడం
* ఆంగ్లేయ అధికారుల స్థానంలో భారతీయ అధికారులను నియమించడం
* భారతీయ పత్రికలకు తగినంత స్వేచ్ఛ ఇవ్వడం
* పోలీసు శాఖలో సంస్కరణలను ప్రవేశపెట్టడం
* భూస్వాముల అరాచకాల నుంచి రైతులకు రక్షణ కల్పించడం
* పోటీ పరీక్షలను భారతదేశంలోనూ నిర్వహించడం
* కరవు కాటకాలు సంభవించినప్పుడు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం
* రైతులకు రుణ సౌకర్యాలు కల్పించడం
* న్యాయవ్యవస్థను కార్యనిర్వాహక శాఖ నుంచి వేరు చేయడం
* మన దేశం నుంచి ఇంగ్లండ్‌కి సంపద తరలింపును ఆపడం
* భారతదేశంలో సాంకేతిక, పారిశ్రామిక విద్యను అభివృద్ధి చేయడం, మొదలైనవి.

 

మితవాదుల విధానాలు
 

మితవాదుల విధానాలను రాజ్యాంగబద్ధమైన పోరాటంగా పేర్కొనవచ్చు. వారు సమావేశాలు నిర్వహించడం, ప్రసంగాలు, తీర్మానాలు చేయడానికే పరిమితమయ్యారు. చాలా అరుదుగా మాత్రమే విదేశీ వస్తు బహిష్కరణ, స్వదేశీ వస్తువుల వాడకం లాంటి కార్యక్రమాలను చేపట్టారు. వారు తమ రాజకీయ కార్యకలాపాలను విద్యావంతులకే పరిమితం చేసి సామాన్య ప్రజలు జాతీయ ఉద్యమంలో పాలుపంచుకోవడానికి అవకాశం కల్పించలేదు. మితవాద నాయకులు రాజకీయ హక్కులు, స్వయంపాలనను క్రమంగా సాధించాలనుకున్నారే గానీ వెంటనే కావాలని కోరలేదు.
 

విజయాలు
 

* ప్రజల్లో రాజకీయ చైతన్యం కల్పించడం
* జాతి, మత, కుల, ప్రాంతీయ సంకుచిత భావాలను తొలగించి ప్రజాస్వామ్య, జాతీయ భావాలను ప్రచారం చేయడం.
* బ్రిటిష్ సామ్రాజ్యవాద విధానాలతో భారతదేశ సంపదను దోచుకుంటున్న విధానాన్ని ప్రజలకు తెలియజేయడం. ఉదా: దాదాబాయి నౌరోజీ ప్రతిపాదించిన సంపద తరలింపు సిద్ధాంతం.
* భవిష్యత్తులో భారత జాతీయ ఉద్యమం మరింత ఉద్ధృతం కావడానికి అవసరమైన గట్టి పునాదులు నిర్మించడం.
* బ్రిటిష్ ప్రభుత్వం 1892 లో భారత కౌన్సిళ్ల చట్టాన్ని రూపొందించడం.
* 1892 తర్వాత 'కాంగ్రెస్ ప్రాతినిధ్యం లేనిదే పన్నులు చెల్లించం' అనే నినాదాన్ని తేవడం.
* అటవీ చట్టాలు, పరిపాలనలో మార్పులు తీసుకురావడం.
* 1878 లో చేసిన ఆయుధాల చట్టాన్ని సవరించడం.
* సైన్యంలో భారతీయులను ఉన్నత పదవుల్లో నియమించడం.

 

అపజయాలు
 

* సామాన్య ప్రజలను జాతీయోద్యమంలో భాగస్వాములుగా చేయకపోవడం.
* చాలాకాలం వరకు బ్రిటిష్‌వారి నిజమైన స్వభావాన్ని గ్రహించలేకపోవడం.
* రాజ్యాంగబద్ధమైన పోరాటం ద్వారా బ్రిటిష్ ప్రభుత్వం నుంచి ఎలాంటి లాభం పొందకపోవటం.
* కాంగ్రెస్ సభ్యత్వం ప్రధానంగా జర్నలిస్టులు, విద్యావేత్తలు, సంస్కరణవాదులు, డాక్టర్లు, లాయర్లు, వ్యాపారులకే పరిమితం కావడం.
* 1892 - 1909 మధ్య కాలంలో కాంగ్రెస్ సమావేశాలకు హాజరయ్యే ప్రతినిధుల్లో 90% మంది హిందువులే ఉండటం.
* బ్రిటిష్ వారి 'విభజించి పాలించు విధానం', అలీగఢ్ ఉద్యమ నాయకులు ముస్లింలను కాంగ్రెస్‌కు దూరంగా ఉండమని కోరడంతో వారు కాంగ్రెస్‌లో ఎక్కువగా చేరకపోవడం.

 

కాంగ్రెస్ పట్ల బ్రిటిష్ ప్రభుత్వ వైఖరి...
 

     పదవీ విరమణ చేసిన ఆంగ్లేయ ఉద్యోగి ఎ.ఒ. హ్యూమ్ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని రక్షించడానికే కాంగ్రెస్‌ను స్థాపించాడనే విమర్శ ఉంది. అప్పటి వైస్రాయ్ డఫ్రిన్ 1886 లో కాంగ్రెస్ సదస్సుకు హాజరైన ప్రతినిధుల కోసం గొప్ప విందు ఏర్పాటుచేశాడు. అలాగే 1887 లో కాంగ్రెస్ మూడో సమావేశం సందర్భంగా మద్రాసు గవర్నర్ కాంగ్రెస్ ప్రతినిధులకు విందు ఏర్పాటు చేశాడు. కాంగ్రెస్ సమావేశాల్లో పాల్గొనడానికి ప్రభుత్వ ఉద్యోగులకు అనుమతి ఇచ్చారు.
 

* అయితే కాంగ్రెస్, బ్రిటిష్ ప్రభుత్వం మధ్య ఈ సంబంధాలు, సహకారం తాత్కాలికమే. క్రమేణా ప్రభుత్వం కాంగ్రెస్‌కు సహకరించడానికి బదులు కాంగ్రెస్ పట్ల అనుమానాన్ని పెంచుకుంది. కాంగ్రెస్ బలం పెరగడం, కాంగ్రెస్ సభ్యులు ప్రజలకు రాజకీయ శిక్షణ ఇవ్వడం, ప్రభుత్వాన్ని విమర్శించడం దీనికి ప్రధాన కారణాలు.
* గవర్నర్ జనరల్ మొదలు ప్రభుత్వ అధికారులంతా జాతీయ నాయకులను అవిధేయులైన బాబులు, కుట్రపూరితమైన బ్రాహ్మణులు, క్రూరమైన ప్రతినాయకులుగా వర్ణించారు.
* 1890 లో బెంగాల్ ప్రభుత్వం ఉద్యోగులు కాంగ్రెస్ సమావేశాలకు హాజరు కావడంపై ఆంక్షలు విధించింది. సర్ సయ్యద్ అహ్మద్‌ఖాన్, రాజా శివప్రసాద్, ప్రభుత్వానికి విధేయులైన మరికొంతమందిని కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఉద్యమాలు ప్రారంభించేలా ప్రోత్సహించింది.
* కాంగ్రెస్‌ను హిందూ సంస్థగా చిత్రించి, 1906 లో ముస్లింలీగ్‌ను ప్రారంభించేలా ముస్లింలను రెచ్చగొట్టింది. దీంతోపాటు ప్రభుత్వం అణిచివేత విధానాలను చేపట్టింది.

Posted Date : 22-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌