• facebook
  • whatsapp
  • telegram

భారతదేశం - ఉనికి - అమరిక

ఉనికి: భారతదేశం ఉత్తరార్ధ గోళంలో 8º.4' ల ఉత్తర అక్షాంశం నుంచి 37º.6' ల వరకు, రేఖాంశాల పరంగా గ్రీని‌చ్ రేఖాంశానికి తూర్పున 68º.7' ల తూర్పు రేఖాంశం నుంచి 97º.25' ల వరకు (పూర్వార్ధ గోళంలో) విస్తరించి ఉంది. దీవులను కూడా కలిపితే భారతదేశం 6º.45' ల ఉత్తర అక్షాంశం నుంచి విస్తరించి ఉంది.

* 23 1/2º ల ఉత్తర అక్షాంశమైన కర్కటరేఖ భారతదేశం మధ్యగా, ఎనిమిది రాష్ట్రాల మీదుగా వెళ్తూ ఉంది. ఆ రాష్ట్రాలు తూర్పు నుంచి పశ్చిమానికి వరుసగా గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, పశ్చిమ్ బంగ, త్రిపుర, మిజోరాం. ఈ రేఖ రాజస్థాన్ మీదుగా తక్కువ దూరం, మధ్యప్రదేశ్ మీదుగా అత్యధిక దూరం ప్రయాణిస్తుంది.

* మనదేశం మీదుగా సుమారు 30 అక్షాంశాలు, 30 రేఖాంశాలు వెళుతున్నాయి. 82 1/2º ల తూర్పు రేఖాంశం భారతదేశ ప్రామాణిక రేఖాంశం. ఇది ఉత్తర - దక్షిణాలుగా అయిదు రాష్ట్రాల మీదుగా వెళ్తుంది. ఉత్తరం నుంచి ఆ రాష్ట్రాలు వరుసగా ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్. ఈ రేఖ ఉత్తర్ ప్రదేశ్‌లోని అలహాబాద్‌కు, ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ సమీపంలో ఉన్న యానాంకు సమీపంగా వెళుతుంది. ఈ రేఖాంశాన్ని ప్రపంచ ప్రామాణిక రేఖాంశంతో పోల్చి చూసినప్పుడు 5.30 గంటలు ముందు ఉంటుంది.

* భారతదేశ ఉత్తర - దక్షిణ సరిహద్దుల మధ్య దూరం సుమారు 3214 కి.మీ. తూర్పు - పడమరలుగా దీని పొడవు సుమారు 2933 కి.మీ. మనదేశానికి ఉత్తర సరిహద్దు కిలిక్‌దావన్ పాస్ దగ్గర ఉన్న 'ఇందిరా కాల్'. దక్షిణ సరిహద్దు నికోబార్ దీవుల్లోని గ్రేట్ నికోబార్ దక్షిణ కొన అయిన 'ఇందిరా పాయింట్'. దీన్ని పూర్వం 'పిగ్మోలియన్ పాయింట్' అని కూడా పిలిచేవారు.
భారతదేశ తూర్పు సరిహద్దు అరుణాచల్‌ప్రదేశ్‌లోని ఈశాన్య సరిహద్దులో ఉన్న ద్వీపు కనుమ లేదా కీబూటు ప్రాంతం. పశ్చిమ సరిహద్దు గుజరాత్ రాష్ట్రంలోని పశ్చిమ సరిహద్దులో ఉన్న రాణ్ ఆఫ్ కచ్ లేదా గౌర్‌మాత ప్రాంతం. ప్రధాన భూభాగానికి దక్షిణ సరిహద్దుగా తమిళనాడు రాష్ట్రంలోని దక్షిణభాగాన ఉన్న కన్యాకుమారిని పేర్కొంటారు.


విస్తీర్ణం


  భారతదేశ విస్తీర్ణం దాదాపు 32,87,263 చ.కి.మీ. ఇది ప్రపంచంలోని మొత్తం భూభాగంలో 2.4 శాతం. విస్తీర్ణపరంగా ప్రపంచంలో 7వ పెద్ద దేశం భారత్. మొదటి ఆరు స్థానాల్లో వరుసగా రష్యా, కెనడా, చైనా, అమెరికా, బ్రెజిల్, ఆస్ట్రేలియా నిలిచాయి.


* జనాభాపరంగా ప్రథమ స్థానంలో చైనా, తర్వాతి స్థానంలో భారతదేశం ఉన్నాయి. విస్తీర్ణపరంగా దేశంలో పెద్ద రాష్ట్రం రాజస్థాన్, చిన్న రాష్ట్రం గోవా. జనాభాపరంగా పెద్ద రాష్ట్రం ఉత్తర్ ప్రదేశ్, చిన్న రాష్ట్రం సిక్కిం.


ఉపఖండం


  భారతదేశంతోపాటు పాకిస్థాన్, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక దేశాలను కలిపి 'భారత ఉపఖండం' అని పిలుస్తారు. ఈ దేశాలన్నీ ఉమ్మడి వలస చరిత్రను కలిగి ఉన్నాయి. వీటి మధ్య చారిత్రక, సాంస్కృతికపరంగా దగ్గరి సంబంధాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ దేశాలన్నీ ఉమ్మడి భౌమ్య చరిత్రను కూడా కలిగి ఉన్నాయి.


ద్వీపకల్ప భారతదేశం:

 
  భౌగోళికంగా భారతదేశాన్ని రెండు భాగాలుగా విభజించవచ్చు. అవి.. ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం. చుట్టూ భూభాగంతో ఉత్తర భారతదేశం పరివృతమై ఉంది. దక్షిణ భారతదేశం మూడు వైపుల నీరు, ఒకవైపు భూభాగాన్ని కలిగి ఉంది. ఈ విధంగా మూడు వైపుల నీరు, ఒకవైపు భూభాగాన్ని కలిగి ఉన్న ప్రాంతాన్ని 'ద్వీపకల్పం' అని అంటారు. అందుకే దక్షిణ భారతదేశాన్ని 'ద్వీపకల్ప' భారతదేశం అని కూడా పేర్కొంటారు.

* దేశంలో సుమారు 7516 కి.మీ. పొడవైన సముద్ర సరిహద్దు (దీవులను కలిపి) ప్రాంతం ఉంది. దీవులు లేకుండా ప్రధాన భూభాగానికి సుమారు 6100 కి.మీ. పొడవైన సముద్ర సరిహద్దు ఉంది. ఈ సరిహద్దు ప్రాంతంలో 9 రాష్ట్రాలు ఉన్నాయి. గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ రాష్ట్రాలు పశ్చిమ తీరంలో, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ్ బంగ రాష్ట్రాలు తూర్పు తీరంలో ఉన్నాయి. వీటిలో గుజరాత్ రాష్ట్రానికి అత్యంత పొడవైన సముద్రం తీరం, గోవాకు అత్యల్ప సముద్ర తీరం ఉన్నాయి.

* ఒక్కొక్క తీరప్రాంతానికి స్థానికంగా ఒక్కో పేరు ఉంది. అవి: గుజరాత్ తీరం - సాబర్‌కాంత, మహారాష్ట్ర, గోవా తీరప్రాంతాలు - కొంకణ్, కర్ణాటక తీరం - కెనరా, కేరళ తీరం - మలబార్, తమిళనాడు, దక్షిణ కోస్తా ఆంధ్ర తీరప్రాంతాలు - కోరమాండల్, ఉత్తర కోస్తా, మధ్య కోస్తా ఆంధ్ర తీరప్రాంతాలు - సర్కార్, ఒడిశా తీరం - ఉత్కల్, పశ్చిమ్ బంగ తీరం - వంగ

* తీరప్రాంతం నుంచి సముద్ర జలాల్లోకి 12 నాటికల్ మైళ్ల వరకు ఉన్న ప్రాంతాన్ని 'ప్రాదేశిక జలాలు' అని అంటారు. ఇది సుమారు 21.9 కి.మీ.తో సమానం. 200 నాటికల్ మైళ్ల వరకు ఉన్న ప్రాంతాన్ని 'ప్రత్యేక ఆర్థిక మండలి' అని పేర్కొంటారు.

* భారతదేశానికి సుమారు 15,200 కి.మీ. పొడవైన అంతర్జాతీయ భూ సరిహద్దు ఉంది. ఈ సరిహద్దు వెంబడి ఏడు దేశాలు మనదేశంతో ఉమ్మడి సరిహద్దును కలిగి ఉన్నాయి. అవి: పాకిస్థాన్, అఫ్గనిస్థాన్, చైనా, నేపాల్, భూటాన్, మయన్మార్, బంగ్లాదేశ్. భారతదేశం అత్యంత పొడవైన అంతర్జాతీయ భూ సరిహద్దును బంగ్లాదేశ్‌తో, అత్యల్ప భూ సరిహద్దును అఫ్గనిస్థాన్‌తో కలిగి ఉంది. కొన్ని ప్రాంతాల్లో సహజ సిద్ధమైన భూ సరిహద్దులు, మరికొన్నింటిలో కృత్రిమ సరిహద్దులు ఉన్నాయి. వాటిలో పాకిస్థాన్‌తో రాడ్‌క్లిఫ్ రేఖ, అఫ్గనిస్థాన్‌తో డ్యూరాండ్ రేఖ, చైనాతో మెక్‌మోహన్‌రేఖ ప్రధానమైనవి. తూర్పు హిమాలయాలు భారతదేశానికి, మయన్మార్‌కు మధ్య సహజ సరిహద్దుగా ఉన్నాయి. దేశంలో సుమారు 17 రాష్ట్రాలు అంతర్జాతీయ భూ సరిహద్దును కలిగి ఉన్నాయి.

* మనదేశంలో అయిదు రాష్ట్రాలు అటు సముద్ర సరిహద్దు, ఇటు అంతర్జాతీయ భూ సరిహద్దు లేకుండా ఉన్నాయి. అలాంటి రాష్ట్రాలను 'భూ పరివేష్టిత' రాష్ట్రాలుగా పేర్కొంటారు. అవి: మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, హరియాణా, తెలంగాణ.


రాజకీయ విభాగాలు


  భారతదేశంలో మొత్తం 29 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాలు, 1 కేంద్ర ప్రాదేశిక రాజధాని నగరం ఉన్నాయి. స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో మనదేశంలో కేవలం 14 రాష్ట్రాలు మాత్రమే ఉండేవి. వాటి సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది.


* 2000లో మధ్యప్రదేశ్ నుంచి చత్తీస్‌గఢ్, ఉత్తర్ ప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్, బిహార్ నుంచి ఝార్ఖండ్‌లను వేరుచేసి కొత్త రాష్ట్రాలుగా ఏర్పాటు చేశారు. 2014 జూన్ 2న ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయిన తెలంగాణ 29వ రాష్ట్రంగా ఏర్పడింది.


కేంద్రపాలిత ప్రాంతాలు:


  మనదేశంలో అండమాన్ - నికోబార్ దీవులు, లక్షదీవులు, డయ్యూ - డామన్, దాద్రానగర్ - హవేలి, చండీగఢ్, పుదుచ్చేరిలు కేంద్రపాలిత ప్రాంతాలుగా ఉన్నాయి. వీటిలో అండమాన్ - నికోబార్ దీవులు అతిపెద్ద కేంద్రపాలిత ప్రాంతం, లక్షదీవులు అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతం.
భారతదేశంలో దాదాపు 247 దీవులున్నాయి. వీటిలో కొన్ని మాత్రమే నివాస యోగ్యమైనవి. ఈ దీవుల్లో దాదాపు 204 దీవులు బంగాళాఖాతంలో, మిగిలినవి అరేబియా సముద్రం, మన్నార్ సింధుశాఖలో విస్తరించి ఉన్నాయి.


అండమాన్ - నికోబార్ దీవులు:


  ఇవి భారతదేశ తూర్పు తీరంలోని బంగాళాఖాతంలో విస్తరించి ఉన్నాయి. ఇవి అండమాన్, నికోబార్ దీవుల సమూహంతో ఏర్పడ్డాయి. అండమాన్ దీవుల్లో ఉత్తర అండమాన్, మధ్య అండమాన్, దక్షిణ అండమాన్, లిటిల్ అండమాన్ దీవులు ప్రధానమైనవి. దక్షిణ అండమాన్ దీవిలోనే అండమాన్-నికోబార్ దీవుల రాజధాని 'పోర్ట్‌బ్లెయిర్' ఉంది. ఈ దీవుల సమూహంలోని బారెన్, నార్కొండమ్ దీవుల్లో అగ్నిపర్వతాలు విస్తరించి ఉన్నాయి.
* డంకన్ కనుమ దక్షిణ అండమాన్, లిటిల్ అండమాన్ దీవులను వేరు చేస్తుంది. 10 డిగ్రీల ఛానల్ లిటిల్ అండమాన్, కార్ నికోబార్ దీవులను వేరు చేస్తుంది. నికోబార్ దీవుల సముదాయంలో లిటిల్ నికోబార్, కార్ నికోబార్, గ్రేట్ నికోబార్ దీవులు ప్రధానమైనవి. వీటిలో అతిపెద్ద దీవి 'గ్రేట్ నికోబార్'.

Posted Date : 03-07-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌