• facebook
  • whatsapp
  • telegram

భారత రాజ్యాంగం - విశిష్ట లక్షణాలు

అతి పెద్ద లిఖిత రాజ్యాంగం:

  ప్రపంచంలోని లిఖిత రాజ్యాంగాలన్నింటిలో భారత రాజ్యాంగం అతి పెద్దది. సర్ ఐవర్ జెన్నింగ్స్ భారత రాజ్యాంగాన్ని అత్యంత సుదీర్ఘమైంది అని అభివర్ణించగా హెచ్.వి.కామత్ భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ చిహ్నమైన ఐరావతంతో పోల్చాడు. మన దేశ రాజ్యాంగాన్ని ప్రారంభంలో ప్రవేశిక, 395 ఆర్టికల్స్, 8 షెడ్యూల్స్, 22 భాగాలుగా విభజించారు. ప్రస్తుతం రాజ్యాంగంలో 465 ఆర్టికల్స్, 12 షెడ్యూల్స్, 25 భాగాలు ఉన్నాయి.

* రాజ్యాంగం నుంచి 7వ భాగాన్ని తొలగించి 4(A), 9(A), 9(B), 14(A) అనే భాగాలను చేర్చారు.

* భిన్నత్వంలో ఏకత్వమున్న భారతదేశంలో విభిన్న మతాలు, కులాలు, భాషలు, తెగలు, అల్ప సంఖ్యాక వర్గాలు, వెనుకబడిన ప్రాంతాలు, వివిధ పరిమితులు, మినహాయింపులను సంపూర్ణంగా వివరించడం వల్ల మన రాజ్యాంగాన్ని సుదీర్ఘంగా రూపొందించారు.

* కేంద్ర, రాష్ట్ర సంబంధాల్లో శాసన, ఆర్థిక, పరిపాలనా సంబంధాలను విస్తృతంగా వివరించారు. మారుతున్న కాల పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగాన్ని ఎప్పటికప్పుడు సవరించడం, కొన్ని అంశాలను తొలగించడం, మరికొన్ని అంశాలను చేర్చడం వల్ల మన రాజ్యాంగం సువిశాలంగా రూపొందింది.

* 1951లో మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా జవహర్‌లాల్ నెహ్రూ ప్రభుత్వం 9వ షెడ్యూల్‌ను రాజ్యాంగానికి చేర్చింది.

* 1985లో 52వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజీవ్‌గాంధీ ప్రభుత్వం 10వ షెడ్యూల్‌ను రాజ్యాంగానికి చేర్చింది.

* 11వ షెడ్యూల్‌ను పి.వి.నరసింహారావు ప్రభుత్వం 73వ రాజ్యాంగ సవరణ చట్టం (1992) ద్వారా చేర్చింది.

* 12వ షెడ్యూల్‌ను పి.వి.నరసింహారావు ప్రభుత్వం 74వ రాజ్యాంగ సవరణ చట్టం (1992) ద్వారా చేర్చింది.

* మన దేశానికి సర్వోన్నత శాసనం రాజ్యాంగం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారాలు, విధులు రాజ్యాంగం నుంచే సంక్రమిస్తాయి.

* అధికారం ప్రజల నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నియమిత కాలానికి జరిగే ఎన్నికల ద్వారా బదిలీ అవుతుంది. కాబట్టి మనదేశంలో అధికారానికి మూలం ప్రజలు.


పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానం


* భారత రాజ్యాంగం కేంద్రంలోనూ, రాష్ట్రాల్లోనూ పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానాన్ని ప్రసాదించింది. ఈ విధానంలో కేంద్రంలో రాష్ట్రపతి, రాష్ట్రాల్లో గవర్నర్లు నామమాత్రపు కార్యనిర్వహణాధికారాలు కలిగి ఉంటారు. కేంద్రంలో ప్రధానమంత్రి నాయకత్వంలోని మంత్రి మండలి, రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల నాయకత్వంలోని మంత్రిమండళ్లు వాస్తవ కార్యనిర్వహణాధికారాలను చెలాయిస్తాయి.

* కేంద్రంలో ప్రధాని నాయకత్వంలోని మంత్రిమండలి వ్యక్తిగతంగా రాష్ట్రపతికి, సమష్టిగా లోక్‌సభకు బాధ్యత వహించాలి.

* రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి నాయకత్వంలోని మంత్రిమండళ్లు వ్యక్తిగతంగా గవర్నర్లకు, సమష్టిగా విధానసభలకు బాధ్యత వహించాలి.


సార్వజనీన వయోజన ఓటుహక్కు


* ఆర్టికల్ 326 ప్రకారం భారత పౌరులందరికీ కుల, మత, జాతి, లింగ, జన్మ, భాష, ప్రాంత, ఆస్తి సంబంధ వివక్ష లేకుండా వయోజన ఓటుహక్కును ప్రసాదించడమైంది. 1952లో జరిగిన మొదటి సాధారణ ఎన్నికల్లో ఓటుహక్కును వినియోగించుకునే వారి కనీస వయోపరిమితిని 21 సంవత్సరాలుగా నిర్ణయించారు.

* రాజీవ్‌గాంధీ ప్రభుత్వం 61వ రాజ్యాంగ సవరణ చట్టం - 1988 ద్వారా వయోజన ఓటుహక్కు కనీస వయోపరిమితిని 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు తగ్గించింది.

* ప్రపంచంలో మహిళలకు ఓటుహక్కును కల్పించిన తొలి దేశం న్యూజిలాండ్.

* అమెరికాలో 1965 నుంచి మాత్రమే మహిళలకు ఓటుహక్కును కల్పించారు.

* స్విట్జర్లాండ్‌లో 1971 తర్వాత నుంచి మాత్రమే మహిళలకు ఓటుహక్కును కల్పించారు.

* 2014లో జరిగిన 16వ లోక్‌సభ ఎన్నికల నాటికి మన దేశ ఓటర్లు 83 కోట్ల మంది.


ఏక పౌరసత్వం

* భారతదేశ సమగ్రత, సుస్థిరతల దృష్ట్యా భారత ప్రజలకు రాజ్యాంగం ఏక పౌరసత్వాన్ని ప్రసాదించింది. దీని ప్రకారం వివిధ ప్రాంతాల ప్రజలకు ఒకే పౌరసత్వం ఉంటుంది. వారి మధ్య ఎలాంటి వ్యత్యాసాన్ని చూపదు.

* అయితే ఆర్టికల్ 370 ప్రకారం జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక స్వయం ప్రతిపత్తి ఉండటం వల్ల ఆ రాష్ట్ర పౌరులకు ద్వంద్వ పౌరసత్వాన్ని కల్పించారు.

* అమెరికా, స్విట్జర్లాండ్ దేశాలు తమ పౌరులకు ద్వంద్వ పౌరసత్వాన్ని అందిస్తున్నాయి.


లౌకిక రాజ్యం

* మత ప్రమేయం లేని రాజ్యాన్ని లౌకిక రాజ్యం అంటారు.

* భారత రాజ్యాంగ ప్రవేశికలో 'లౌకిక' అనే పదాన్ని 42వ రాజ్యాంగ సవరణ చట్టం - 1976 ద్వారా ఇందిరాగాంధీ ప్రభుత్వం చేర్చింది. దీని ప్రకారం రాజ్యం మత వ్యవహారాల్లో తటస్థంగా ఉంటుంది. రాజ్యం ఏ ఒక్క మతానికీ అనుకూలం కాదు, వ్యతిరేకం కాదు.

* లౌకికతత్వ పరిధిని మరింత విస్తృతపరుస్తూ ప్రాథమిక హక్కుల్లో భాగంగా మత స్వాతంత్య్రపు హక్కును ఆర్టికల్ 25 నుంచి 28 వరకు వివరించారు. దీని ప్రకారం భారతీయులు తమకు ఇష్టమైన మతాన్ని స్వీకరించవచ్చు, ఆచరించవచ్చు, అభివృద్ధి చేసుకోవచ్చు.

* ప్రభుత్వ విద్యాలయాల్లోనూ, ప్రభుత్వ ధన సహాయం పొందే ఎయిడెడ్ విద్యాలయాల్లోనూ మతబోధన నిషిద్ధిం.


దృఢ, అదృఢ లక్షణాల సమ్మేళనం

* దృఢ రాజ్యాంగం అంటే సవరించడానికి కష్టమైంది. దీని ప్రకారం ఆ దేశ శాసన నిర్మాణ శాఖలో ప్రత్యేక మెజార్టీ 2/3 లేదా 3/4 వంతుతో సవరించేది.

ఉదా: అమెరికా రాజ్యాంగం.


* అదృఢ రాజ్యాంగం అంటే సవరించడానికి సులభమైంది లేదా సరళమైంది. దీని ప్రకారం ఆ దేశ శాసన నిర్మాణ శాఖలో సాధారణ మెజార్టీ ద్వారా సవరించేది.

ఉదా: బ్రిటన్ రాజ్యాంగం.


* భారత రాజ్యాంగం అమెరికా మాదిరి దృఢమైందీ కాదు, బ్రిటన్‌లా అదృఢమైందీ కాదు. దృఢ, అదృఢ లక్షణాల సమ్మేళనం.


* భారత రాజ్యాంగాన్ని ఆర్టికల్ 368 ప్రకారం 3 పద్ధతుల్లో సవరించవచ్చు. అవి:


1. సాధారణ మెజార్టీ పద్ధతి

* రాజ్యాంగంలోని కింద పేర్కొన్న 18 అంశాలను పార్లమెంటుకు హాజరై ఓటు వేసిన వారి సాధారణ మెజార్టీతో సవరించవచ్చు.

    1. ఆర్టికల్ - 2 ప్రకారం కొత్త రాష్ట్రాల విలీనం, ఏర్పాటు

    2. ఆర్టికల్ 3 - రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ

    3. ఆర్టికల్ 169 - రాష్ట్రాల్లో విధాన పరిషత్‌ల ఏర్పాటు, రద్దు.

    4. 2వ షెడ్యూల్ - రాజ్యాంగ ఉన్నత పదవులు, వారి జీతభత్యాలు

    5. ఆర్టికల్ 100(3) - పార్లమెంటు కోరం నిర్ణయించడం

    6. ఆర్టికల్ 105 - సభా హక్కులు

    7. ఆర్టికల్ 106 - పార్లమెంటు సభ్యుల జీతభత్యాలు

    8. ఆర్టికల్ 118 (12) - పార్లమెంటులో ఉభయసభల నిర్వహణకు రూపొందించిన నియమాలు

    9. ఆర్టికల్ 120(2) - పార్లమెంటులో ఇంగ్లిష్ వాడకం

    10. ఆర్టికల్ 124(1) - సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నియామకం

    11. ఆర్టికల్ 348 - అధికార భాషా విషయం

    12. ఆర్టికల్ 11 - పౌరసత్వాన్ని పొందే విధానాలు, రద్దు చేసే పద్ధతులు

    13. ఆర్టికల్ 327 - పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలకు ఎన్నికలు నిర్వహించడం

    14. ఆర్టికల్ 81 - నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ (డీలిమిటేషన్)

    15. ఆర్టికల్ 240 - కేంద్రపాలిత ప్రాంతాల విషయం

    16. 5వ షెడ్యూల్ - ఎస్సీ, ఎస్టీల పరిపాలనా విషయాలు

    17. 6వ షెడ్యూల్ - అసోం, మేఘాలయ, మిజోరం, త్రిపుర రాష్ట్రాల్లో ఎస్టీల పరిపాలన

    18. ఆర్టికల్ 135 - సుప్రీంకోర్టు అధికార పరిధిని విస్తృతపరచడం.


2. ఏకపక్ష ప్రత్యేక మెజార్టీ పద్ధతి

* రాజ్యాంగంలోని మరికొన్ని నిబంధనలను (సాధారణ మెజార్టీ పద్ధతి, ద్విపక్ష ప్రత్యేక మెజార్టీ పద్ధతిలో సవరించేవి తప్ప) పార్లమెంటు 2/3 వంతు ప్రత్యేక మెజార్టీ ద్వారా సవరించగలదు.

ఉదా: ప్రాథమిక హక్కులు, నిర్దేశిక నియమాలు, ప్రాథమిక విధులు


3. ద్విపక్ష మెజార్టీ పద్ధతి

* రాజ్యాంగంలోని సమాఖ్య లక్షణాలను సవరించాలంటే పార్లమెంటు 2/3 వంతు మెజార్టీతోపాటు భారతదేశంలో సగం కంటే ఎక్కువ రాష్ట్రాల్లో (15 రాష్ట్రాలు) ప్రతి శాసన నిర్మాణ శాఖలో సాధారణ మెజార్టీ అవసరం. అవి:

1. ఆర్టికల్ 54 - రాష్ట్రపతి ఎన్నిక, ఆర్టికల్ 55 - రాష్ట్రపతి ఎన్నిక విధానం

2. ఆర్టికల్ 73 - కేంద్ర కార్యనిర్వాహక శాఖ,

ఆర్టికల్ 162 - రాష్ట్ర కార్యనిర్వాహక శాఖల అధికార పరిధిని విస్తృతం చేయడం.

3. 5వ భాగం 4వ అధ్యాయం ఆర్టికల్స్ 124 నుంచి 147 వరకు - సుప్రీంకోర్టుకు సంబంధించిన అంశాలు

4. 6వ భాగం 5వ అధ్యాయం ఆర్టికల్స్ 214 నుంచి 232 వరకు - హైకోర్టుకు సంబంధించిన అంశాలు

5. 7వ షెడ్యూల్ - కేంద్ర, రాష్ట్రాల మధ్య అధికారాల విభజన

6. 4వ షెడ్యూల్‌ - రాజ్యసభలో రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేటాయించిన సీట్ల వివరాలు

7. ఆర్టికల్ 368 - రాజ్యాంగ సవరణ అంశాలు


అర్ధ సమాఖ్య:

* రాజ్యాంగ రీత్యా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాల పంపిణీ జరిగే వ్యవస్థను సమాఖ్య వ్యవస్థ అంటారు.

* కె.సి.వేర్ భారత రాజ్యాంగాన్ని అర్ధ సమాఖ్య (Quasi Federal)గా పేర్కొన్నాడు.

భారత రాజ్యాంగానికి కింద పేర్కొన్న సమాఖ్య లక్షణాలు ఉన్నాయి. అవి:

    1. లిఖిత రాజ్యాంగం, రాజ్యాంగ ఔన్నత్యం

    2. కేంద్ర, రాష్ట్రాల మధ్య అధికారాల విభజన

    3. దృఢ రాజ్యాంగం

    4. స్వయం ప్రతిపత్తి గల న్యాయవ్యవస్థ

    5. న్యాయ సమీక్ష విధానం

    6. ద్విసభా విధానం

భారత రాజ్యాంగానికి కింద పేర్కొన్న ఏకకేంద్ర లక్షణాలు ఉన్నాయి. అవి:

    1. ఒకే రాజ్యాంగం, ఒకే పౌరసత్వం

    2. ఏకీకృత న్యాయవ్యవస్థ

    3. అఖిల భారత సర్వీసుల భర్తీకి ఒకే యూపీఎస్సీ

    4. పార్లమెంటు, రాష్ట్ర శాసనసభల ఎన్నికల నిర్వహణకు ఒకే కేంద్ర ఎన్నికల సంఘం

    5. ఒకే కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)

    6. రాష్ట్రపతితో కేంద్ర ప్రతినిధులుగా రాష్ట్రాల్లో గవర్నర్ల నియామకం

    7. రాజ్యసభలో రాష్ట్రాలకు అసమాన ప్రాతినిధ్యం

    8. రాష్ట్రపతి అత్యవసర పరిస్థితి అధికారాలను కలిగి ఉండటం

ఉదా: ఆర్టికల్ 352 - జాతీయ అత్యవసర పరిస్థితిని విధించడం

     ఆర్టికల్ 356 - రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించడం

     ఆర్టికల్ 360 - ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధించడం

     ఆర్టికల్ 365 - కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసే అధికారం

     ఆర్టికల్ 248 - అవశిష్టాధికారాలను కేంద్రమే కలిగి ఉండటం

ఆర్టికల్ 249 - జాతీయ ప్రయోజనాల దృష్ట్యా రాజ్యసభ 2/3 ప్రత్యేక మెజారిటీతో ఒక తీర్మానాన్ని ఆమోదిస్తే రాష్ట్ర జాబితాలోని అంశాలపై కూడా పార్లమెంటు చట్టాలను రూపొందిస్తుంది.

* ఆర్టికల్ 200 ప్రకారం రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ ఆమోదించిన బిల్లు గవర్నరు సంతకంతో చట్టంగా మారుతుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఆ బిల్లును గవర్నరు ఆమోదించకుండా రాష్ట్రపతి పరిశీలనకు రిజర్వు చేస్తారు. అలాంటి సందర్భంలో ఆర్టికల్ 201 ప్రకారం రాష్ట్రపతి రాష్ట్ర శాసన నిర్మాణ శాఖపై అధికారాన్ని కలిగి ఉంటారు.

* పైన పేర్కొన్న విధంగా భారత రాజ్యాంగం సమాఖ్య, ఏక కేంద్ర లక్షణాల సమ్మేళనం.


స్వయం ప్రతిపత్తి గల న్యాయవ్యవస్థ:


మన దేశ న్యాయవ్యవస్థ స్వయం ప్రతిపత్తి గలది. సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రధాన, ఇతర న్యాయమూర్తులను నియమించేది రాష్ట్రపతి. కానీ వారిని తొలగించేది పార్లమెంటు 2/3 ప్రత్యేక మెజార్టీ ద్వారానే. దీనివల్ల న్యాయవ్యవస్థ పూర్తి స్వయంప్రతిపత్తిని కలిగి ఉందని తెలుస్తోంది.


న్యాయ సమీక్ష అధికారం:


* భారత న్యాయవ్యవస్థకు న్యాయ సమీక్షాధికారాన్ని రాజ్యాంగం ప్రసాదించింది. దీని ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించే శాసనాలు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంటే అవి చెల్లవు అని న్యాయస్థానాలు జారీ చేసే ఆదేశమే


న్యాయ సమీక్ష:

* ఇందిరాగాంధీ ప్రభుత్వం 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా న్యాయస్థానాలకు ఉన్న న్యాయ సమీక్షాధికారాన్ని తొలగించింది. మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా పునరుద్ధరించింది.

* న్యాయ సమీక్ష అనే భావనను మనం అమెరికా నుంచి గ్రహించాం.

* 1803లో మార్బురీ Vs మాడిసన్ వివాదంలో అమెరికన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జాన్ మార్షల్ ఇచ్చిన తీర్పు ప్రపంచంలో న్యాయ సమీక్ష భావనకు పునాదులు వేసింది.

అల్ట్రా వైర్స్: శాసనశాఖ శాసనాలు, ప్రభుత్వ పాలనా చర్యలు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంటే అవి చెల్లవనీ, రాజ్యాంగ విరుద్ధమని న్యాయవ్యవస్థ తీర్పు ఇవ్వడాన్ని అల్ట్రా వైర్స్‌గా పేర్కొంటారు.

ఇంట్రావైర్స్: శాసనశాఖ శాసనాలు, ప్రభుత్వ పాలనా చర్యలు రాజ్యాంగ పరిధికి లోబడి రాజ్యాంగానికి అనుగుణంగా ఉన్నట్లయితే అవి చెల్లుతాయనీ, అవి రాజ్యాంగబద్ధమేనని న్యాయవ్యవస్థ తీర్పు ఇవ్వడాన్ని ఇంట్రావైర్స్ అంటారు.

* రాజ్యాంగంలోని ఆర్టికల్ 50 ప్రకారం న్యాయశాఖను కార్యనిర్వాహక శాఖ నుంచి వేరు చేశారు.

* 1951 నాటి శంకరీ ప్రసాద్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు మొదలు 2007 నాటి అశోక్‌కుమార్ ఠాకూర్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు వరకు సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో తన న్యాయ సమీక్ష అధికారాన్ని వినియోగించుకుంది.

* 1980లో మినర్వా మిల్స్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ న్యాయ సమీక్ష అధికారాన్ని రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగంగా పేర్కొంది. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 368లో చేర్చిన 4, 5 క్లాజులు రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు కొట్టేసింది.


ఏకీకృత న్యాయ వ్యవస్థ:


* భారతదేశం న్యాయ వ్యవస్థ నిర్మాణాన్ని బ్రిటన్ నుంచి గ్రహించింది.

* భారతదేశం అనుసరించే న్యాయ వ్యవస్థను ఏకీకృత, సమీకృత న్యాయ వ్యవస్థగా పేర్కొంటారు.

* జాతీయ స్థాయిలో సుప్రీంకోర్టు, రాష్ట్ర స్థాయిలో హైకోర్టులు, జిల్లా స్థాయిలో జిల్లా కోర్టులు, డివిజనల్ స్థాయిలో మున్సిఫ్ కోర్టులు న్యాయ విధులను నిర్వహిస్తున్నాయి.

* ఒకే రాజ్యాంగాన్ని అమలుపరిచే క్రమంలో ఉన్నత న్యాయస్థానాలు దిగువ న్యాయస్థానాలపై అదుపు కలిగి ఉంటాయి.

* ఉన్నత న్యాయస్థానాలు జారీ చేసే ఆదేశాలను దిగువ న్యాయస్థానాలు తప్పనిసరిగా అమలుపరచాల్సి ఉంటుంది.

* న్యాయమూర్తుల నియామకంలో ఉన్నత న్యాయస్థానాలను సంప్రదించాల్సి ఉంటుంది.


ద్విసభా విధానం:


* 1919 మాంటేగ్ - ఛెమ్స్‌ఫర్డ్ సంస్కరణల ద్వారా కేంద్ర శాసనశాఖలో ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టారు. భారత ప్రభుత్వ చట్టం 1935 ద్వారా 6 రాష్ట్రాల్లో ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇది కేంద్రంలో లోక్‌సభ, రాజ్యసభలతో ద్విసభా విధానానికి దారితీసింది.

* రాష్ట్ర స్థాయిలో ద్విసభా విధానం ఏర్పాటు విషయమై రాజ్యాంగ నిర్మాతలు రాష్ట్రాల అభిమతాలకే వదిలిపెట్టారు. ఆర్టికల్ 169 ప్రకారం రాష్ట్ర విధానసభ 2/3 వంతు మెజార్టీతో ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదిస్తే, పార్లమెంటు సాధారణ తీర్మానంతో రాష్ట్రాల్లో ఎగువ సభ అయిన విధాన పరిషత్‌ను ఏర్పాటు చేయగలదు లేదా ఉన్నదాన్ని రద్దు చేయగలదు.


పబ్లిక్ సర్వీస్ కమిషన్లు:

* కారన్ వాలీస్ మన దేశంలో సివిల్ సర్వీసెస్ విధానాన్ని ప్రవేశపెట్టాడు.

* 1853 చార్టర్ చట్టం ద్వారా భారతీయులకు సివిల్ సర్వీసుల్లో అవకాశం కల్పించారు.

* 1926 నాటి లీ కమిషన్ సిఫార్సుల మేరకు మన దేశంలో సర్వీస్ కమిషన్లు ఏర్పడ్డాయి.

* భారత ప్రభుత్వ చట్టం 1935 ద్వారా జాతీయ స్థాయిలో ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఏర్పడ్డాయి. అఖిల భారత సర్వీసుల పితామహుడిగా పేరొందిన సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశంలో సివిల్ సర్వీసుల నిర్మాణానికి విశేష కృషి చేశారు. ప్రస్తుత ఉద్యోగస్వామ్యం (బ్యూరోక్రసీ), ఉద్యోగుల ఎంపిక ప్రక్రియ బ్రిటిష్ వారసత్వం నుంచే మనకు సంక్రమించింది.


స్వయం ప్రతిపత్తి ఉన్న కమిషన్లు:

* ఆర్టికల్ 148 - కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఖర్చులను, ఖాతాలను తనిఖీ చేసి ప్రజల సొమ్ముకు కాపలాగా ఉండేందుకు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ను ఏర్పాటు చేశారు.

* ఆర్టికల్ 280 - కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయాల పంపిణీకి కేంద్ర ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేశారు.

* ఆర్టికల్ 315 - మన దేశంలో ప్రతిభావంతులను పాలనలో భాగస్వామ్యం చేయడానికి, ప్రజలకు నాణ్యమైన సేవలను అందించడానికి కేంద్ర, రాష్ట్ర స్థాయుల్లో ఉద్యోగులను ఎంపిక చేసేందుకు పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఏర్పడ్డాయి.

* ఆర్టికల్ 324 - దేశంలో నిష్పక్షపాతంగా, స్వేచ్ఛాయుత, ఎన్నికల నిర్వహణ కోసం కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేశారు.

* ఆర్టికల్ 124 - రాజ్యాంగ సంరక్షణకు, వ్యాఖ్యానానికి, అర్థ వివరణకు సుప్రీంకోర్టును ఏర్పాటు చేశారు.

* ఆర్టికల్ 338 - జాతీయ ఎస్సీ కమిషన్‌ను ఏర్పాటు చేశారు.

* ఆర్టికల్ 338 (A) - జాతీయ ఎస్టీ కమిషన్‌ను ఏర్పాటు చేశారు.

* ఆర్టికల్ 340 - జాతీయ బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేశారు.

అధికారాల విభజన: భారత రాజ్యాంగం దేశాన్ని రాష్ట్రాల యూనియన్‌గా ప్రకటించింది. రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మూడు రకాలైన అధికారాల విభజన గురించి పేర్కొన్నారు.

1. కేంద్ర జాబితా: ఈ జాబితాలో ప్రారంభంలో 97 అంశాలుండగా ప్రస్తుతం 100 అంశాలు ఉన్నాయి.

2. రాష్ట్ర జాబితా: ఈ జాబితా ప్రారంభంలో 66 అంశాలుండగా ప్రస్తుతం 61 అంశాలు ఉన్నాయి.

3. ఉమ్మడి జాబితా: ఈ జాబితాలో ప్రారంభంలో 47 అంశాలుండగా ప్రస్తుతం 52 అంశాలు ఉన్నాయి.

పై మూడు జాబితాల్లో లేని అంశాలను అవశిష్ట అధికారాలు అంటారు. ఇవి కేంద్రానికి చెందుతాయి.

ప్రాథమిక హక్కులు:

రాజ్యాంగంలోని మూడో భాగంలో 12 నుంచి 35 వరకు ఉన్న ప్రకరణలను 7 వర్గాల ప్రాథమిక హక్కులుగా కల్పించారు. వ్యక్తుల స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు ప్రాధాన్యం ఇస్తూ ప్రాథమిక హక్కులను పేర్కొన్నారు. ప్రారంభంలో ప్రాథమిక హక్కుల సంఖ్య 7 వర్గాలుగా ఉండగా ఆస్తి హక్కును 1978లో 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం ప్రాథమిక హక్కుల నుంచి తొలగించి ఆర్టికల్ 300 (A)లో ఒక సాధారణ చట్టబద్ధ హక్కుగా మార్చింది.

ఆదేశిక సూత్రాలు:

రాజ్యాంగంలోని 4వ భాగంలో 36 నుంచి 51 వరకు ఉన్న ప్రకరణలు ఆదేశిక సూత్రాలు/ నిర్దేశిక నియమాల గురించి పేర్కొంటున్నాయి. సంక్షేమ రాజ్య స్థాపన, పరిపాలనా వ్యవస్థలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శకంగా ఉండేందుకు ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి గ్రహించిన వీటిని మన దేశ రాజ్యాంగంలో చేర్చారు.

ప్రాథమిక విధులు:

భారత రాజ్యాంగంలోని 4(A) భాగంలో 51(A) ఆర్టికల్‌లో ప్రాథమిక విధులను ప్రస్తావించారు. మొదట్లో రాజ్యాంగంలో ప్రాథమిక విధులు లేవు. జస్టిస్ స్వరణ్‌సింగ్ కమిటీ సిఫార్సుల మేరకు ఇందిరా గాంధీ ప్రభుత్వం 42వ రాజ్యాంగ సవరణ చట్టం - 1976 ద్వారా రష్యా నుంచి 10 ప్రాథమిక విధులను గ్రహించి రాజ్యాంగానికి చేర్చింది.

* ప్రస్తుతం రాజ్యాంగంలోని ప్రాథమిక విధుల సంఖ్య: 11

* 11వ ప్రాథమిక విధిని 86వ రాజ్యాంగ సవరణ చట్టం - 2002 ద్వారా చేర్చారు.

రాజ్యాంగ మౌలిక స్వరూపం:

భారతదేశానికి అత్యున్నత శాసనం రాజ్యాంగం. 1973లో కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు కీలకమైన తీర్పునిస్తూ రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతాన్ని నొక్కి చెప్పింది. భారత రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకు ఉన్నప్పటికీ రాజ్యాంగ మౌలిక స్వరూపం దెబ్బతినకుండా మాత్రమే సవరించాలని పేర్కొంది.

* రాజ్ నారాయణ్ Vs ఇందిరాగాంధీ, మినర్వా మిల్స్, ఎల్ఐసీ, ఎస్.ఆర్.బొమ్మై కేసుల్లోనూ సుప్రీంకోర్టు రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని పునరుద్ఘాటించింది.

రాజ్యాంగ విహంగ వీక్షణం

భాగం విషయం ఆర్టికల్స్
1వ భాగం భారత భూభాగ పరిధి 1 నుంచి 4 వరకు
2వ భాగం పౌరసత్వం 5 నుంచి 11 వరకు
3వ భాగం ప్రాథమిక హక్కులు 12 నుంచి 35 వరకు
4వ భాగం ఆదేశిక సూత్రాలు 36 నుంచి 51 వరకు
4(A) భాగం ప్రాథమిక విధులు 51(A)

» ఈ భాగాన్ని 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976 ద్వారా కొత్తగా చేర్చారు.

వ భాగం కేంద్ర ప్రభుత్వం 52 నుంచి 151 వరకు
మొదటి అధ్యాయం కేంద్ర కార్య నిర్వాహక శాఖ, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాని,
మంత్రిమండలి, అటార్నీ జనరల్
52 నుంచి 78 వరకు
రెండో అధ్యాయం కేంద్ర శాసన నిర్మాణ శాఖ (పార్లమెంటు) 79 నుంచి 122 వరకు
మూడో అధ్యాయం రాష్ట్రపతి - శాసన నిర్మాణ అధికారాలు 123
నాలుగో అధ్యాయం కేంద్ర న్యాయశాఖ (సుప్రీంకోర్టు) 124 నుంచి 147 వరకు
అయిదో అధ్యాయం కాగ్ 148 నుంచి 151 వరకు
6వ భాగం రాష్ట్ర ప్రభుత్వం 152 నుంచి 237 వరకు
ఒకటో అధ్యాయం రాష్ట్ర ప్రభుత్వ నిర్వచనం 152
రెండో అధ్యాయం రాష్ట్ర కార్యనిర్వాహక శాఖ గవర్నర్, ముఖ్యమంత్రి,
మంత్రిమండలి, అడ్వకేట్ జనరల్
153 నుంచి 167 వరకు
మూడో అధ్యాయం రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ (విధాన సభ, విధాన పరిషత్) 168 నుంచి 212 వరకు
నాలుగో అధ్యాయం గవర్నర్ శాసన నిర్మాణ అధికారాలు 213
అయిదో అధ్యాయం రాష్ట్ర న్యాయశాఖ (హైకోర్టు) 214 నుంచి 232 వరకు
ఆరో అధ్యాయం దిగువ కోర్టులు 233 నుంచి 237 వరకు
7వ భాగం B - రాష్ట్రాలు 238

» 7వ భాగాన్ని 7వ రాజ్యాంగ సవరణ చట్టం - 1956 ద్వారా తొలగించారు.

8వ భాగం కేంద్రపాలిత ప్రాంతాలు 239 నుంచి 242 వరకు
9వ భాగం పంచాయతీరాజ్ 243, 243 (A) నుంచి 243(O) వరకు

» 73వ రాజ్యాంగ సవరణ చట్టం - 1992 ద్వారా దీన్ని రాజ్యాంగంలో చేర్చారు.

9(A) భాగం పట్టణ ప్రభుత్వాలు 243(P), 243(Z, G) వరకు

» 74వ రాజ్యాంగ సవరణ చట్టం - 1992 ద్వారా దీన్ని రాజ్యాంగంలో చేర్చారు.

10వ భాగం షెడ్యూల్డ్ ప్రాంతాలు, షెడ్యూల్డ్ తెగలు 244 నుంచి 244(A) వరకు
11వ భాగం కేంద్ర, రాష్ట్ర సంబంధాలు 245 నుంచి 263 వరకు
ఒకటో అధ్యాయం కేంద్ర, రాష్ట్రాల మధ్య (శాసన సంబంధాలు) 245 నుంచి 255 వరకు
రెండో అధ్యాయం కేంద్ర, రాష్ట్రాల మధ్య (పరిపాలక సంబంధాలు) 256 నుంచి 263 వరకు
12వ భాగం కేంద్ర, రాష్ట్రాల మధ్య (ఆర్థిక సంబంధాలు) 264 నుంచి 300 (A)
ఒకటో అధ్యాయం ఆర్థికం 264 నుంచి 291 వరకు
రెండో అధ్యాయం అప్పులు 292 నుంచి 293 వరకు
మూడో అధ్యాయం ఆస్తి, ఒప్పందాలు, దావాలు, వివాదాలు 294 నుంచి 300 వరకు
నాలుగో అధ్యాయం ఆస్తి హక్కు 300(A)

» 44వ రాజ్యాంగ సవరణ చట్టం - 1978 ప్రకారం ఈ 4వ అధ్యాయాన్ని 12వ భాగంలో చేర్చారు.

13వ భాగం వ్యాపారం, వాణిజ్యం 301 నుంచి 307 వరకు
14వ భాగం కేంద్ర, రాష్ట్ర సర్వీసులు 308 నుంచి 323 వరకు
ఒకటో అధ్యాయం అఖిల భారత సర్వీసులు 308 నుంచి 314 వరకు
రెండో అధ్యాయం యూపీఎస్సీ, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లు 315 నుంచి 323 వరకు
14(A) భాగం ట్రైబ్యునళ్లు 323(A), 323 (B)

» ఈ భాగాన్ని 42వ రాజ్యాంగ సవరణ చట్టం - 1976 ద్వారా నూతనంగా చేర్చారు.

15వ భాగం ఎన్నికల సంఘం, ఎన్నికలు 324 నుంచి 329 వరకు
16వ భాగం ఎస్సీ, ఎస్టీ, ఇతరులకు ప్రత్యేక సదుపాయాలు 330 నుంచి 342 వరకు
17వ భాగం అధికార భాష 343 నుంచి 351 వరకు
18వ భాగం అత్యవసర పరిస్థితులు 352 నుంచి 360 వరకు
19వ భాగం ఇతర అంశాలు 361 నుంచి 367 వరకు
20వ భాగం రాజ్యాంగ సవరణ విధానం 368
21వ భాగం తాత్కాలిక, ప్రత్యేక రక్షణలు (జమ్మూకశ్మీర్, ఆంధ్రప్రదేశ్,
తెలంగాణ, నాగాలాండ్ రాష్ట్రాలు)
369 నుంచి 392 వరకు
22వ భాగం హిందీలో సాధికార రాజ్యాంగ తర్జుమా, రాజ్యాంగం అమల్లోకి రావడం 393 నుంచి 395 వరకు.
Posted Date : 26-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌