• facebook
  • whatsapp
  • telegram

భారతదేశ స్వాతంత్య్రం, దేశవిభజన

      లార్డ్ వేవెల్ 1945లో తన ప్రణాళికను చర్చించడానికి భారతదేశంలోని అన్ని రాజకీయ పార్టీలతో సిమ్లాలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వేవెల్ ప్రణాళిక ప్రకారం వైస్రాయ్ పాలకమండలిలో సర్వ సైన్యాధ్యక్షుడు మినహా మిగిలినవారంతా భారతీయులే ఉంటారు. పాలకమండలిలో హిందువులు, ముస్లింలకు సమాన ప్రాతినిధ్యం కల్పిస్తారు. భారతదేశానికి కొత్త రాజ్యాంగం రూపొందించే వరకు ఈ తాత్కాలిక ఏర్పాటు కొనసాగుతుంది. అయితే మహమ్మద్ అలీ జిన్నా ఆధ్వర్యంలోని ముస్లింలీగ్ వైస్రాయ్ పాలక మండలిలోని ముస్లిం సభ్యులను ముస్లింలీగ్ మాత్రమే ఎంపిక చేయాలని పట్టుబట్టింది. దీన్ని కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకించింది.
 

మంత్రిత్రయ రాయబారం లేదా క్యాబినెట్ మిషన్ ప్రణాళిక (1946): ఇంగ్లండ్‌లో 1945లో జరిగిన సాధారణ ఎన్నికల్లో చర్చిల్ ఆధ్వర్యంలోని కన్జర్వేటివ్ పార్టీ లేబర్ పార్టీ చేతిలో ఓడిపోయింది. లేబర్ పార్టీ మొదటి నుంచి భారతదేశానికి స్వాతంత్య్రం ఇవ్వడం పట్ల సానుకూల ధోరణితో వ్యవహరిస్తూ వచ్చింది. ఇంగ్లండ్ కొత్త ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన సి.ఆర్. అట్లీ, వేవెల్‌ను ఇంగ్లండ్‌కు పిలిపించాడు. భారతదేశానికి స్వాతంత్య్రం ఇవ్వడానికి బ్రిటిష్ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు.
 

1946 మార్చి 24న లార్డ్ పెథిక్ లారెన్స్, సర్ స్టాఫర్డ్ క్రిప్స్, ఎ.వి. అలెగ్జాండర్‌లతో కూడిన ముగ్గురు క్యాబినెట్ మంత్రుల బృందం భారతదేశానికి వచ్చింది. దేశానికి వీలైనంత తొందరగా స్వాతంత్య్రం ఇవ్వడమే ఈ మిషన్ ప్రధాన లక్ష్యం. ఈ మంత్రుల బృందం అయిదు వారాలపాటు స్వదేశీ సంస్థానాలు, బ్రిటిష్ ఇండియా ప్రతినిధులతో చర్చలు జరిపింది. చివరగా 1946 మే 5న సిమ్లాలో కాంగ్రెస్, ముస్లింలీగ్ నాయకులతో సమావేశాన్ని ఏర్పాటు చేసింది.

1946 మే 16న మిషన్ తన సిఫారసులను ఒక ప్రకటన రూపంలో ప్రకటించింది. దీన్ని 'క్యాబినెట్ మిషన్ ప్రణాళిక' అంటారు.

1946 ఆగస్టు 12న వేవెల్ తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీని కోరాడు. ప్రారంభంలో ఈ తాత్కాలిక ప్రభుత్వంలో చేరడానికి ముస్లింలీగ్ అయిష్టత చూపింది.

తాత్కాలిక ప్రభుత్వంలో మొత్తం 14 మంది సభ్యులు (9 మంది కాంగ్రెస్, అయిదుగురు ముస్లింలీగ్) ఉన్నారు. ఈ ప్రభుత్వానికి ఉపాధ్యక్షుడిగా జవహర్‌లాల్ నెహ్రూ వ్యవహరించారు.

ప్రత్యక్ష చర్యా దినోత్సవం

ముస్లింలీగ్ 1946 జులై 30న సమావేశమై 1946 ఆగస్టు 16న భారతదేశమంతటా ప్రత్యక్ష చర్యాదినోత్సవంగా పాటించాలని నిర్ణయించింది. ఇలాంటి ఉద్రిక్త వాతావరణంలో లార్డ్ వేవెల్ తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం అగ్నికి ఆజ్యం పోసినట్లయ్యింది.
 

ముస్లింలీగ్ కలకత్తాలో ఆగస్టు 16న ప్రదర్శనలు, హర్తాళ్‌లు నిర్వహించడం గొడవలకు దారితీసింది. ఈ ఉద్రిక్తతలు నాలుగు రోజులపాటు కొనసాగాయి. బెంగాల్‌లో హెచ్.ఎస్. సుహ్రావర్డి ఆధ్వర్యంలోని ముస్లింలీగ్ ప్రభుత్వం ఆగస్టు 16ను సెలవుదినంగా ప్రకటించడంతో పరిస్థితులు మరింత దిగజారాయి. ప్రభుత్వం పరిస్థితి చేయిదాటేంత వరకు సైన్యాన్ని పిలవకపోవడం సమస్యను మరింత జఠిలం చేసింది.

మౌంట్‌బాటన్ ప్రణాళిక: 1947 మార్చిలో వేవెల్ స్థానంలో మౌంట్ బాటన్ వైస్రాయ్‌గా నియమితుడయ్యాడు. ఇతడు ఇంగ్లండ్ రాజుకు దగ్గరి బంధువు.
రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఆగ్నేయాసియా ప్రాంతానికి సర్వ సైన్యాధ్యక్షుడిగా వ్యవహరించాడు. మౌంట్ బాటన్ కాంగ్రెస్, ముస్లింలీగ్‌లతో సుదీర్ఘ చర్చలు జరిపిన తర్వాత 1947 జూన్ 3న ఒక రాజీ సూత్రాన్ని రూపొందించి, ప్రకటించాడు. దీన్నే జూన్ 3 ప్రణాళిక అంటారు. దీని ప్రకారం భారతదేశాన్ని భారత యూనియన్, పాకిస్థాన్‌గా విభజించి స్వాతంత్య్రం ఇస్తారు.

భారత స్వాతంత్య్ర చట్టం (1947): జూన్ 3 ప్రణాళిక ఆధారంగా ఒక బిల్లును రూపొందించి బ్రిటిష్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఇది 12 రోజుల స్వల్ప వ్యవధిలో (జులై 4 - జులై 16) పార్లమెంట్ ఆమోదముద్ర పొందింది. జులై 18న బ్రిటిష్ రాజు కూడా ఆమోదించారు. ఈ చట్టం ప్రకారం ఆగస్టు 14న పాకిస్థాన్‌కు, ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్య్రం ఇచ్చారు. భారత భూభాగాల విభజన, పంజాబ్, బెంగాల్‌లలో రెండు రాష్ట్రాల ఏర్పాటు గురించి ఈ చట్టంలో పేర్కొన్నారు. రెండు దేశాలకు ప్రత్యేక గవర్నర్ జనరల్, శాసనశాఖల ఏర్పాటుకు అవకాశం కల్పించారు.

దేశ విభజన అనేక అనర్థాలకు దారితీసింది. సుమారు 1.5 కోట్ల మంది హిందూ ముస్లింలు బలవంతంగా తమ ఇళ్లు, గ్రామాలు, నగరాలను వదిలి వెళ్లాల్సి వచ్చింది. ఇది వారిలో కోపాన్ని, ద్వేషాన్ని రగిల్చింది. రెండు నుంచి అయిదు లక్షల మంది ప్రజలు హత్యకు గురయ్యారు. మత ఘర్షణలకు కేంద్రమైన తూర్పు బెంగాల్‌లోని నోఖాలిలో 1947 ఆగస్టు 15న పర్యటించిన గాంధీజీ శాంతిని పునరుద్ధరించడానికి కృషిచేశారు. గాంధీజీ 1947 సెప్టెంబరు 9న ఢిల్లీకి చేరుకున్నారు. వాయవ్య భారతదేశంలో మతఘర్షణలను, ప్రజల భయాలను తొలగించడానికి ప్రయత్నించారు. కొంతమంది మతోన్మాదులు గాంధీజీ నిర్వహించే సర్వమత ప్రార్థనలకు ఇబ్బందులు సృష్టించారు.

గాంధీజీ 1948 జనవరిలో చివరిసారిగా నిరాహారదీక్ష చేపట్టారు. ఇందులో భాగంగా సర్దార్ వల్లభాయి పటేల్ మతపరమైన వైఖరిని నిరసించారు. గాంధీజీ మరణానికి రెండు రోజుల ముందు ఆయన హత్యకు విఫలయత్నం జరిగింది. 1948 జనవరి 28న గాంధీజీ మాట్లాడుతూ - 'ఒక పిచ్చివాడి బుల్లెట్‌కు నేను మరణించవలసి వస్తే, నేను చిరునవ్వుతో మరణిస్తాను. నాలో ఎలాంటి కోపం లేదు. దేవుడు నా హృదయంలోను, పెదాలపై ఉన్నాడు' అన్నారు.

స్వాతంత్య్రం వచ్చిన ఆరునెలల్లోపే 1948 జనవరి 30న సర్వమత ప్రార్థనకు వెళ్తున్న గాంధీజీ నాథూరామ్ గాడ్సే తుపాకి గుళ్లకు బలయ్యారు.

దేశ విభజనకు దారితీసిన పరిస్థితులు

భారత జాతీయ రాజకీయాల్లో విభజనవాదానికి ప్రధాన కారణం - అధిక సంఖ్యాకులైన హిందువులు అల్ప సంఖ్యాకులైన ముస్లింలపై (వ్యాపారం, పరిశ్రమలు, ప్రభుత్వ సర్వీసులు, విద్య లాంటివి) పలు విషయాల్లో ఆధిపత్యం వహించడం. భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన కాలం నుంచే బ్రిటిషర్లకు, ముస్లింలకు మధ్య మంచి సంబంధాలు లేవు. బ్రిటిషర్లు తమ నుంచి రాజకీయ అధికారాన్ని చేజిక్కించుకున్నారని ముస్లింలు భావించారు. ముస్లింలు తమ సామ్రాజ్యానికి ప్రధాన శత్రువులని బ్రిటిషర్లు భావించారు.
 

బ్రిటిషర్లు హిందువులను ముస్లింలకు వ్యతిరేకంగా రెచ్చగొట్టారు. 1857 విప్లవం తర్వాత ఈ పరిస్థితి తారుమారైంది. హిందువులు ఆంగ్ల విద్యను అభ్యసించి, పాశ్చాత్య భావాలను అంగీకరించారు. వారిలో క్రమంగా జాతీయతాభావం అభివృద్ధి చెందింది. ఇది బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి గొప్ప ఆటంకంగా పరిణమించింది. దీంతో ముస్లింల సహాయంతో హిందువులను దెబ్బతీయాలన్న ఉద్దేశంతో బ్రిటిష్‌వారు విభజించి, పాలించు విధానాన్ని అవలంబించారు.

1871లో సర్ విలియం హంటర్ రచించిన 'ది ఇండియన్ ముసల్మాన్స్' అనే గ్రంథం ప్రచురితమైంది. ముస్లింలతో విరోధాన్ని కొనసాగించడం కంటే వారితో స్నేహంగా ఉండటం బ్రిటిష్ సామ్రాజ్యానికి మేలు చేస్తుందనే భావన ఈ గ్రంథంలో వ్యక్తమైంది. అలీగఢ్‌లోని ఆంగ్లో-ఓరియంటల్ కళాశాల ప్రిన్సిపాల్ బెక్ ముస్లింలు బ్రిటిషర్లకు దగ్గరవడానికి తన వంతు ప్రయత్నం చేశాడు. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ముస్లింలు పాశ్చాత్య విద్యను అభ్యసించేలా, బ్రిటిషర్లకు విధేయులుగా ఉండేలా చేయడంలో సఫలీకృతుడయ్యాడు.

1906 డిసెంబరులో ఢాకాలో నవాబు వికార్ ఉల్‌ముల్క్ ముస్లింలీగ్ పార్టీని స్థాపించి, మొదటి సమావేశానికి అధ్యక్షత వహించాడు. ఈ పార్టీ స్థాపనలో ఆగాఖాన్ ప్రముఖ పాత్ర వహించాడు. 1906 నుంచి 1910 వరకు ముస్లింలీగ్ కేంద్ర కార్యాలయం అలీగఢ్ ఉండేది. ఆ కాలంలో దాని ప్రభావం పెద్దగా లేదు. పార్టీ ప్రధాన కార్యాలయం లక్నోకు మారడంతో, దీని రాజకీయ కార్యకలాపాలు పెరిగాయి.

ప్రత్యేక నియోజ‌క‌వ‌ర్గాలు

1906లో అప్పటి వైస్రాయ్ లార్డ్ మింటో వ్యక్తిగత కార్యదర్శి స్మిత్ భారతీయ ముస్లింల ప్రతినిధులకు వైస్రాయ్‌ని కలవమని సలహా ఇచ్చాడు. ఆగాఖాన్ నేతృత్వంలోని ఈ బృందం మింటోను కలిసి ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలను కేటాయించాలని కోరింది. దీని ఫలితంగా రూపొందిన 1909 చట్టం ప్రత్యేక నియోజకవర్గాలను కేటాయించింది.

భారతదేశం లోపల, వెలుపల సంఘటనలు కాంగ్రెస్, ముస్లింలీగ్‌లు చేరువకావడానికి దోహదం చేశాయి. ఖిలాఫత్ సమస్య పరిష్కారానికి కాంగ్రెస్ సహాయం అవసరమని ముస్లింలీగ్ గుర్తించింది. ఇది 1916లో లక్నో ఒడంబడికకు దారితీసింది. గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించడం ద్వారా ముస్లింల సానుభూతిని సంపాదించాలని ప్రయత్నించారు. అయితే ఈ ఉద్యమం నిలిపివేయడంతో హిందూ-ముస్లిం ఐక్యత బలహీనపడింది.

1928లో మోతీలాల్ నెహ్రూ రూపొందించిన నివేదికను కాంగ్రెస్ అంగీకరించగా, జిన్నా ముస్లింల కనీస డిమాండ్లుగా తన పద్నాలుగు సూత్రాలను ప్రతిపాదించాడు. 1930లో ప్రసిద్ధ ఉర్దూ కవి మహమ్మద్ ఇక్బాల్ ముస్లింలీగ్ అలహాబాద్ సమావేశంలో అధ్యక్ష ఉపన్యాసం చేస్తూ వాయవ్య భారత ముస్లిం రాజ్యాన్ని ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతను పేర్కొన్నారు.

1933లో కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయ విద్యార్థి చౌదరి రెహమత్ అలీ పాకిస్థాన్ పేరును మొదటగా ప్రతిపాదించాడు. పంజాబ్, అఫ్గన్, కశ్మీర్, సింధుల నుంచి మొదటి అక్షరాలు, బెలూచిస్థాన్‌లో చివరి పదంతో ఈ పేరును రూపొందించాడు.

1937లో జరిగిన ఎన్నికల్లో ముస్లింలకు కేటాయించిన 482 సీట్లలో ముస్లింలీగ్ 102 స్థానాలను గెలుచుకుంది. కాంగ్రెస్ 58 ముస్లిం స్థానాలకు పోటీచేయగా, 26 స్థానాలను గెలుచుకుంది. ముస్లింలీగ్ మొత్తం ముస్లిం ఓట్లలో 4.4 శాతం ఓట్లు మాత్రమే పొందగలిగింది.

యునైటెడ్ ప్రావిన్స్, బొంబాయి, మద్రాసులలో సీట్లు సాధించిన ముస్లింలీగ్ బెంగాల్, పంజాబ్, వాయవ్య సరిహద్దు రాష్ట్రాల్లో మాత్రం ఆధిక్యం ప్రదర్శించలేకపోయింది. సింధు రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలోనూ విఫలమైంది. అయితే 1946లో కేంద్ర, రాష్ట్ర అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో మొత్తం ముస్లిం సీట్లు గెలుచుకోవడంలో సఫలీకృతమైంది.

యునైటెడ్ ప్రావిన్స్‌లో ముస్లింలీగ్ తగినన్ని సీట్లు సాధించినా, దాంతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ నిరాకరించింది. కాంగ్రెస్‌లోని సభ్యులు ముస్లింలీగ్ సభ్యులుగా కొనసాగడాన్ని నిషేధించింది. దీన్ని కాంగ్రెస్‌లోని ముస్లిం నాయకులు వ్యతిరేకించడంతో 1938లో కాంగ్రెస్ సభ్యులు హిందూ మహాసభలో సభ్యత్వం కలిగి ఉండకూడదని పేర్కొంది.

విమోచ‌న దినం

1939 డిసెంబరు 22న బ్రిటిష్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా కాంగ్రెస్ మంత్రి వర్గాలు రాజీనామా చేశాయి. జిన్నా ఈ రోజును విమోచన దినంగా ప్రకటించారు.

1940, మార్చి 23న ముస్లింలీగ్ ముస్లిం మెజారిటీ ప్రాంతాలకు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలనే తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. అయితే ఈ తీర్మానంలో దేశ విభజన లేదా పాకిస్థాన్ గురించి ఎక్కడా పేర్కొనలేదు. తర్వాతి రోజుల్లో ఈ తీర్మానం పాకిస్థాన్ తీర్మానంగా ప్రసిద్ధి చెందింది.

1942లో కాంగ్రెస్ ప్రారంభించిన క్విట్ ఇండియా ఉద్యమాన్ని ముస్లింలీగ్ వ్యతిరేకించింది. ముస్లింలీగ్‌ను బలపరిస్తే ఇస్లాంను బలపరిచినట్లేనని బహిరంగంగా ప్రకటించారు. 1940-46 మధ్య ముస్లిం సాధారణ ప్రజానీకానికి ప్రత్యేక దేశం ద్వారా వచ్చే ప్రయోజనాల గురించి ముస్లింలీగ్ అవగాహన కల్పించింది. క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో బ్రిటిష్ ప్రభుత్వం కాంగ్రెస్ నాయకులను జైళ్లలో నిర్బంధించింది. ఈ సమయాన్ని ముస్లింలీగ్ తనకు అనుకూలంగా మలచుకుని బలపడింది.

సి. రాజగోపాలాచారి ఫార్ములా (1944), గాంధీజీ - జిన్నా చర్చలు (1944), భులాబాయ్ దేశాయ్, లియాఖత్ అలీఖాన్ ఒప్పందం (1945) కాంగ్రెస్, ముస్లింలీగ్‌ల మధ్య ఏర్పడిన అంతరాన్ని తగ్గించడానికి ప్రయత్నించి విఫలమయ్యాయి. సిమ్లా సమావేశం కూడా మహమ్మద్ అలీ జిన్నా మొండివైఖరి వల్ల విఫలమైంది.

1946 సాధారణ ఎన్నికల్లో కేంద్ర శాసనసభలో కాంగ్రెస్ 57 స్థానాల్లో గెలుపొందగా, ముస్లింలీగ్ ముస్లింలకు కేటాయించిన 30 స్థానాలను గెలుచుకుంది. రాష్ట్రాల్లో కాంగ్రెస్ 923 సీట్లు, ముస్లింలీగ్ 425 సీట్లు గెలుచుకున్నాయి. ముస్లింలీగ్ ఈ ఎన్నికల్లో 86 శాతం సీట్లు దక్కించుకోవడం విశేషం.

ప్రత్యేక పాకిస్థాన్ డిమాండ్‌ను అంగీకరించడంలో ప్రభుత్వం చేస్తున్న జాప్యానికి నిరసనగా ముస్లింలీగ్ 1946 ఆగస్టు 16ను ప్రత్యక్ష చర్యా దినంగా పాటించింది. చివరకు మౌంట్‌బాటన్ 1947 జూన్-3 ప్రణాళికను అనుసరించి భారత్‌ను భారత్ యూనియన్, పాకిస్థాన్‌గా విభజించారు.

Posted Date : 22-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌