• facebook
  • whatsapp
  • telegram

భారత జాతీయోద్యమం - అతివాద యుగం

  1905 నుంచి 1920 వరకు గల జాతీయోద్యమ దశను అతివాద యుగంగా పేర్కొంటారు. బాలగంగాధర్‌ తిలక్‌ నాయకత్వంలో అతివాదులు వందేమాతరం, హోంరూల్‌ ఉద్యమాలను నిర్వహించి విజయవంతమైన ఫలితాలను సాధించారు. ఆంగ్లేయులు అనుసరిస్తున్న దౌర్జన్యకర విధానాలను ఎదుర్కోవాలంటే మరింత దృఢ వైఖరితో పోరాడాలన్నదే వీరి లక్ష్యం.

అతివాదం తలెత్తడానికి గల కారణాలు

  గోపాలకృష్ణ గోఖలే నాయకత్వంలో మితవాదులు ప్రార్థన - విజ్ఞప్తి - నిరసన లాంటి విధానాల ద్వారా ఎలాంటి ఫలితాలు సాధించలేదని, వారి వైఫల్యం కారణంగానే అతివాదం తలెత్తిందని చరిత్రకారుల భావన. 1905లో అతివాదం తలెత్తడానికి తక్షణ కారణం బెంగాల్‌ విభజన. 1896లో ఆఫ్రికా ఖండానికి చెందిన అబిసీనియా (ఇథియోపియా) చేతిలో ఐరోపాకు చెందిన ఇటలీ ఓడిపోవడం, రష్యాలో జార్‌ చక్రవర్తుల నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా శూన్యవాదం తలెత్తడం, 1905లో రష్యా ఆసియాలోని చిన్న దేశమైన జపాన్‌ చేతిలో ఓడిపోవడం లాంటి అంతర్జాతీయ కారణాలు కూడా భారతదేశంలో అతివాదం తలెత్తడానికి దోహదపడ్డాయి. వీటితో పాటు ఆంగ్లేయుల జాతి వివక్ష, విభజించు - పాలించు విధానాలు; అణచివేత చర్యలు అతివాదం ఏర్పడటానికి ప్రధాన కారణాలు.

బెంగాల్‌ విభజన

  1905లో అప్పటి వైస్రాయ్‌ లార్డ్‌ కర్జన్‌ పరిపాలనా సౌలభ్యం పేరుతో బెంగాల్‌ను విభజించాడు. 1903లోనే బెంగాల్‌ విభజనను ప్రకటించినప్పటికీ, 1905 జులై 19న విభజన జరిగింది. కానీ ఇది 1905 అక్టోబర్‌ 16 నుంచి అమల్లోకి వచ్చింది. నేటి బిహార్, పశ్చిమ్‌ బంగ, ఒడిశా, బంగ్లాదేశ్‌లతో కూడినదే అప్పటి బెంగాల్‌. నాటి బెంగాల్‌ జనాభా 78 మిలియన్లు. అందుకే కర్జన్‌ ‘పరిపాలనా సౌలభ్యం’ కోసం బెంగాల్‌ను విభజిస్తున్నట్లు ప్రకటించాడు. కానీ వాస్తవానికి జాతీయతా భావాన్ని అణచివేయడానికి, విభజించు - పాలించు విధానంతో హిందూ ముస్లింలను విడదీయడానికే కర్జన్‌ బెంగాల్‌ను విభజించాడు. అందుకే భారతీయులు దీనికి వ్యతిరేకంగా వందేమాతర ఉద్యమాన్ని ప్రారంభించారు.

వందేమాతర ఉద్యమం (1905 - 1911)

  ఇది అతివాదులు చేపట్టిన తొలి అఖిల భారత ఉద్యమం. దీన్నే స్వదేశీ ఉద్యమం అని కూడా పేర్కొంటారు. లార్డ్‌ కర్జన్‌ చేసిన బెంగాల్‌ విభజన 1905 అక్టోబరు 16న అమల్లోకి వచ్చింది. జాతీయ నాయకులు ఆ రోజును జాతీయ సంతాప దినంగా ప్రకటించి వందేమాతర ఉద్యమాన్ని ప్రారంభించారు. అదే రోజు కలకత్తాలో జరిగిన రెండు బహిరంగ సమావేశాల్లో సురేంద్రనాథ్‌ బెనర్జీ, ఆనందమోహన్‌ బోస్‌లు ప్రసంగించారు.

  అతివాద త్రయంగా పేరొందిన లాల్‌ - బాల్‌ - పాల్‌లు దేశమంతటా ఈ ఉద్యమాన్ని ప్రచారం చేశారు. తిలక్‌    ‘ఇది యాచన కాదు - శూరత్వం (బిచ్చమెత్తడం కాదు - శివమెత్తడం)’ అని పేర్కొంటూ పూనాలో స్వదేశీ నేత కంపెనీని స్థాపించి, సహకార విక్రయ కేంద్రాలను ప్రారంభించాడు. ఢిల్లీలో సయ్యద్‌ హైదర్‌రజా ఈ ఉద్యమానికి నాయకత్వం వహించాడు. చిదంబరం పిళ్లై మద్రాస్‌ రాష్ట్రంలోని ట్యుటికోరన్‌ రేవులో స్వదేశీ స్టీమ్‌ నావిగేషన్‌ కంపెనీని స్థాపించాడు.

  1905 సెప్టెంబరులో జి. సుబ్రహ్మణ్య అయ్యర్‌ అధ్యక్షతన మద్రాస్‌ బీచ్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి దేశభక్తి గీతాలను ఆలపించాడు. కృష్ణా పత్రిక సంపాదకుడైన ముట్నూరి కృష్ణారావు ఆహ్వానం మేరకు బిపిన్‌ చంద్రపాల్‌ ఆంధ్రదేశంలో పర్యటించి వందేమాతర ఉద్యమాన్ని ప్రచారం చేశారు. రాజమండ్రి సమావేశంలో పాల్‌ ఉపన్యాసాలను చిలకమర్తి లక్ష్మీనరసింహం తెలుగులోకి అనువదించారు. ఈ సందర్భంలోనే చిలకమర్తి ‘భరత ఖండంబు చక్కని పాడియావు’ అనే సుప్రసిద్ధ పద్యాన్ని ఆలపించారు. ఈ ఉద్యమ కాలంలోనే ఆంధ్రదేశంలో కాకినాడ కొట్లాట, తెనాలి బాంబు కేసు; రాజమండ్రి కళాశాల, కోటప్ప కొండ సంఘటనలు చోటు చేసుకున్నాయి. కరణం గున్నేశ్వరరావు ఇచ్చిన విరాళంతో గోదావరి స్వదేశీ స్టోర్స్‌ను ఏర్పాటుచేశారు. గుంటూరులో భావనాచార్యులు అనే వ్యక్తి చందాలు వసూలు చేసి పారిశ్రామిక శిక్షణ కోసం యువకులను విదేశాలకు పంపే ఏర్పాట్లు చేశాడు. మల్లాది వెంకట సుబ్బారావు (కాకినాడ), ఎస్‌.రామారావు (బళ్లారి) జపాన్‌ వెళ్లి శిక్షణ పొందారు. ఈ ఉద్యమ సమయంలోనే బందరు జాతీయ కళాశాల (మచిలీపట్నం)ను ఏర్పాటు చేశారు.
బెంగాల్‌లో 1906లో వంగలక్ష్మీ కాటన్‌ మిల్లును; జాతీయ శిక్షా పరిషత్‌ను, అరవింద్‌ ఘోష్‌ అధ్యక్షుడిగా (ప్రిన్సిపల్‌) బెంగాల్‌ జాతీయ కళాశాలను స్థాపించారు. పీసీ రే బెంగాల్‌ స్వదేశీ కెమికల్‌ స్టోర్స్‌ను ప్రారంభించారు. బెంగాల్‌ యువకులను విదేశాలకు పంపడానికి జోగేంద్ర చంద్ర ఘోష్‌ విరాళాలు సేకరించాడు. సుబోధ్‌ చంద్ర మల్లిక్‌ విద్యాభివృద్ధికి లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చాడు. వందేమాతర ఉద్యమ కాలంలోనే
లాలాలజపతిరాయ్, అజిత్‌ సింగ్‌లను దేశం నుంచి బహిష్కరించారు. ప్రభుత్వం ఉద్యమ అణచివేతకు అనేక చర్యలు చేపట్టింది. 1906లో అప్పటి వైస్రాయ్‌ రెండో మింటో సిమ్లాలో ముస్లింలను సమావేశపరచి ముస్లిం లీగ్‌ స్థాపనను ప్రోత్సహించాడు.

  సలీముల్లా నాయకత్వంలో సిమ్లా వెళ్లిన ముస్లింలు ఆగాఖాన్‌ అధ్యక్షతన ముస్లిం లీగ్‌ను స్థాపించారు. 1907లో సూరత్‌ సమావేశంలో భారత జాతీయ కాంగ్రెస్‌ అతివాదులు, మితవాదులుగా విడిపోయింది. దీన్నే ‘సూరత్‌ చీలిక’ అంటారు. 1907 నాటి సూరత్‌ సమావేశానికి రాస్‌ బిహారి ఘోష్‌ అధ్యక్షత వహించారు. సూరత్‌ చీలికలో మితవాదులు ఫిరోజ్‌షా మెహతాను, అతివాదులు లాలాలజపతిరాయ్‌ను తమ నాయకులుగా ఎన్నుకున్నారు. ఆంగ్లేయులు అతివాదులను సంతృప్తి పరచడానికి 1909లో మింటో - మార్లే సంస్కరణలను ప్రవేశపెట్టారు. ఈ చట్టం ద్వారా ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయించడాన్ని అతివాదులు వ్యతిరేకించారు. రెండో మింటోను భారతదేశంలో మతపరమైన నియోజకవర్గాల పితామహుడిగా పేర్కొంటారు. 

  1911లో భారతీయులు వందేమాతర ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు. ఫలితంగా అప్పటి వైస్రాయ్‌ రెండో హార్డింజ్‌ ఢిల్లీ దర్బార్‌ను ఏర్పాటు చేసి బెంగాల్‌ విభజనను రద్దు చేస్తున్నట్లు, భారతదేశ రాజధానిని కలకత్తా నుంచి ఢిల్లీకి మారుస్తున్నట్లు ప్రకటించారు. దీంతో వందేమాతర ఉద్యమాన్ని నిలిపివేశారు. ఇది అతివాదుల తొలి విజయం.

హోంరూల్‌ ఉద్యమం (1916 - 17)

  అతివాదులు నిర్వహించిన రెండో అఖిల భారత ఉద్యమమే హోంరూల్‌ ఉద్యమం. స్వయంపాలన (హోంరూల్‌) అనేది ఐర్లాండ్‌ దేశ భావన. మొదటి ప్రపంచయుద్ధ సమయంలో అతివాదులు ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు. తిలక్, అనిబిసెంట్‌ ఈ ఉద్యమ ప్రచారానికి ఎంతో కృషిచేశారు. 1916 ఏప్రిల్‌లో తిలక్‌ పూనా కేంద్రంగా, సెప్టెంబరులో అనిబిసెంట్‌ మద్రాస్‌ (అడయార్‌)లో హోంరూల్‌ లీగ్‌ను స్థాపించారు. 1916 నాటి లక్నో ఒడంబడిక ద్వారా అనిబిసెంట్‌ అతివాదులు - మితవాదులను, కాంగ్రెస్‌ - ముస్లింలీగ్‌లను కలిపి హోంరూల్‌ ఉద్యమం విజయవంతం కావడానికి కృషి చేశారు. 1916 నాటి భారత జాతీయ కాంగ్రెస్‌ లక్నో సమావేశానికి అంబికా చరణ్‌ మజుందార్‌ (ఎ.సి. మజుందార్‌) అధ్యక్షత వహించారు. హోంరూల్‌ ఉద్యమ కార్యనిర్వాహక కార్యదర్శిగా జి.ఎస్‌. అరుండేల్‌ను నియమించారు. తిలక్‌ తన కేసరి, మరాఠా పత్రికలు; అనిబిసెంట్‌ న్యూ ఇండియా, కామన్‌ వీల్‌ పత్రికల ద్వారా ప్రచారం చేశారు. ఈ ఉద్యమ కాలంలోనే తిలక్‌ ‘స్వరాజ్యం నా జన్మహక్కు - దాన్ని సాధించి తీరుతాను’ అని ప్రకటించాడు. అనిబిసెంట్‌ 1917లో ఆంధ్రదేశంలో ఉద్యమాన్ని ప్రచారం చేయడానికి వచ్చారు. ఇక్కడ ఆమె 52 హోంరూల్‌ లీగ్‌ శాఖలను స్థాపించారు. అదే ఏడాది మేలో చిత్తూరు జిల్లాలోని మదనపల్లెలో అనిబిసెంట్‌ ఒక జాతీయ కళాశాలను స్థాపించి, హెచ్‌.సి. కజిన్స్‌ను తొలి ప్రిన్సిపాల్‌గా నియమించారు. ఆంధ్రాలో హోంరూల్‌ ఉద్యమానికి గాడిచర్ల హరిసర్వోత్తమరావు నాయకత్వం వహించారు.

  బ్రిటిష్ ప్రభుత్వం ఈ ఉద్యమ అణచివేతకు అనేక హింసాత్మక చర్యలను చేపట్టింది. తిలక్‌ను పంజాబ్, ఢిల్లీలో పర్యటించకుండా ఆంక్షలు విధించింది. అనిబిసెంట్, ఆమె అనుచరులను ఊటీలో అరెస్ట్‌ చేసి కోయంబత్తూర్‌ చెరసాలలో నిర్బంధించారు. అనిబిసెంట్‌ అరెస్ట్‌కు నిరసనగా సుబ్రహ్మణ్య అయ్యర్‌ తన ‘సర్‌’ బిరుదును త్యజించి, అమెరికా అధ్యక్షుడికి సైతం లేఖ రాశాడు. తిలక్‌ 'ఇండియన్‌ అన్‌రెస్ట్'  గ్రంథ రచయిత వాలెంటైన్‌ చిరోల్‌ (సిస్టర్‌ నివేదిత)పై ఉన్న కేసు వాదించడానికి ఇంగ్లండ్‌ వెళ్లడం, అనిబిసెంట్‌ అరెస్ట్‌ లాంటి కారణాలతో ఈ ఉద్యమం క్షీణించింది. ముఖ్యంగా అప్పటి భారత రాజ్య కార్యదర్శి ఎడ్విన్‌ మాంటేగ్‌ 1917 ఆగస్టు 20న మొదటి ప్రపంచ యుద్ధానంతరం దశల వారీగా బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ఇస్తామని ప్రకటించడంతో ఉద్యమాన్ని పూర్తిగా నిలిపివేశారు. దీన్నే మాంటేగ్‌ ప్రకటన అంటారు. ఈ ప్రకటనను అనుసరించి బ్రిటిష్‌ ప్రభుత్వం మాంటేగ్‌ - చెమ్స్‌ఫర్డ్‌ సంస్కరణలను ప్రవేశపెట్టింది. ఈ సంస్కరణలను 1918లోనే ప్రకటించినప్పటికీ 1919లో అమల్లోకి వచ్చాయి. అందుకే దాన్ని 1919 చట్టం లేదా మాంటేగ్‌ - చెమ్స్‌ఫర్డ్‌ సంస్కరణలు అని పేర్కొంటారు. ఈ చట్టం ద్వారా రాష్ట్రాల్లో ద్వంద్వ ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టడంతో భారత జాతీయ కాంగ్రెస్‌ దీన్ని కూడా తిరస్కరించింది. ఈ విధంగా అతివాదులు వందేమాతరం, హోంరూల్‌ ఉద్యమాలను నిర్వహించి జాతీయోద్యమ అభివృద్ధికి కృషిచేశారు.

అతివాదనాయకులు

బాలగంగాధరతిలక్‌ (1856 - 1920)

  లోకమాన్య, దేశభక్తుల్లో రాజు, భారత అశాంతి జనకుడు లాంటి బిరుదులు పొందిన బాలగంగాధర్‌ తిలక్‌ 1856లో పూనాలో జన్మించాడుకేసరి (మరాఠా భాష), మరాఠా (ఆంగ్ల భాష) పత్రికలు ప్రారంభించి, వాటి ద్వారా జాతీయతా భావాలను ప్రచారం చేశాడు. సామాన్య ప్రజలకు చేరువగా ఉంటూ రాజద్రోహ నేరం కింద అరెస్టైన తొలి భారతీయుడిగా పేరొందాడు. హిందూమతంతో జాతీయోద్యమాన్ని ముడిపెట్టి 1893లో గణపతి, 1895లో శివాజీ ఉత్సవాలను నిర్వహించాడు. 1896లో మహారాష్ట్రలో కరవు సంభవించినప్పుడు భూమిశిస్తు నిరాకరణ ఉద్యమాన్ని నడిపాడు. 1905 నాటి బెనారస్‌ కాంగ్రెస్‌ సమావేశంలో ప్రసంగిస్తూ బిచ్చమెత్తడం కాదు - శివమెత్తాలి, యాచన కాదు - శూరత్వం చూపాలంటూ మితవాదుల విధానాలను విమర్శించాడు. వందేమాతర ఉద్యమ కాలంలో (1906) లాలాలజపతిరాయ్‌తో కలిసి బెంగాల్‌ వెళ్లి కలకత్తాలో శివాజీ ఉత్సవాలను, స్వదేశీ మేళాను నిర్వహించాడు. తిలక్‌ దీన్ని రాజకీయ పండుగగా వర్ణించాడు. స్వరాజ్యం నా జన్మహక్కు దాన్ని సాధించి తీరతానని నినదించాడు. భారతదేశంలోని పరిశ్రమల అభివృద్ధికి తిలక్‌ పైసా ఫండ్‌ను ఏర్పాటుచేశాడు. కేసరి పత్రికలో బ్రిటిష్‌ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ రాసినందుకు 1908లో తిలక్‌ను అరెస్టు చేసి 1914 వరకు ఆరేళ్ల పాటు మాండలే జైలులో బంధించారు. ఈ సమయంలోనే తిలక్‌ గీతారహస్యం, ఆర్కిటిక్‌ హోమ్‌ ఆఫ్‌ ది ఆర్యన్స్‌ అనే ప్రసిద్ధ గ్రంథాలను రచించాడు. 1916లో అనిబిసెంట్‌తో కలిసి హోంరూల్‌ ఉద్యమాన్ని ప్రారంభించాడు. 1916 ఏప్రిల్‌లో పూనాలో హోంరూల్‌ లీగ్‌ను స్థాపించాడు. 1920 ఆగస్టు 1న మరణించాడు.

లాలాలజపతిరాయ్‌ (1865 - 1928)

  పంజాబ్‌ కేసరిగా పేరొందిన లాలాలజపతిరాయ్‌ 1865, జనవరి 1న పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌ జిల్లాలో ఉన్న ఘడికే అనే గ్రామంలో జన్మించాడు. లాల్‌ ఆర్యసమాజ సభ్యుడిగా కళాశాల వర్గంలో చేరి దయానంద్‌ ఆంగ్లో - వేదిక్‌ కళాశాల స్థాపనలో ప్రధాన పాత్ర పోషించాడు. వందేమాతర ఉద్యమకాలంలో మాండలే జైలులో శిక్ష అనుభవించాడు. అనంతరం దేశ బహిష్కరణకు గురయ్యాడు. 1888 అలహాబాద్‌ కాంగ్రెస్‌ సమావేశంలో పాల్గొని విద్యా, పారిశ్రామిక సంబంధ విషయాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రసంగించాడు. సమైక్య భారతదేశానికి స్వదేశీ ధర్మమే మత ధర్మంగా ఉండాలని ప్రకటించాడు. 1920 నాటి కలకత్తా కాంగ్రెస్‌ సమావేశానికి అధ్యక్షత వహించాడు. లాలాలజపతిరాయ్‌ మాజినీని తన రాజకీయ గురువుగా పేర్కొన్నాడు. న్యూయార్క్‌ కేంద్రంగా 1917లో ఇండియన్‌ హోంరూల్‌ లీగ్‌ను స్థాపించి అక్కడి నుంచే హోంరూల్‌ ఉద్యమాన్ని నడిపాడు. ఆంగ్లంలో పీపుల్, ఉర్దూలో వందేమాతరం పత్రికలను నడిపాడు. 1921లో సర్వెంట్స్‌ ఆఫ్‌ పీపుల్‌ సొసైటీని స్థాపించాడు. 1922లో గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని నిలిపివేయడాన్ని లాలాలజపతిరాయ్‌ తీవ్రంగా విమర్శించాడు. ఒక గ్రామంలో జరిగిన పొరపాటుకు దేశం మొత్తాన్ని శిక్షించడం నేరమని పేర్కొన్నాడు. 1925లో స్వరాజ్య పార్టీలో చేరి కేంద్ర శాసనసభకు ఎన్నికయ్యాడు, హిందూ మహాసభకు అధ్యక్షుడయ్యాడు. 1926లో జెనీవాలో జరిగిన అంతర్జాతీయ కార్మిక సమావేశానికి భారతదేశ శ్రామిక వర్గ ప్రతినిధిగా హాజరయ్యాడు.
1928 అక్టోబరులో లాహోర్‌లో జరిగిన సైమన్‌ కమిషన్‌ వ్యతిరేక ఉద్యమానికి నాయకత్వం వహించాడు. ఆ సమయంలోనే సాండర్స్‌ అనే బ్రిటిష్‌ అధికారి కొట్టిన లాఠీ దెబ్బల వల్ల 1928 నవంబరు 17న మరణించాడు. లాల్‌ ‘మనపై (నాపై) పడే ప్రతి దెబ్బ ఆంగ్లేయులు స్వయంగా నిర్మించుకుంటున్న శవపేటికపై దిగుతున్న ఒక్కో మేకు’ అని ఆ సందర్భంలోనే అభివర్ణించాడు. ఇతడి మరణం పంజాబ్‌లో సమరశీల జాతీయోద్యమానికి, విప్లవవాదానికి ఆజ్యం పోసింది. 1928 డిసెంబరు 17న భగత్‌ సింగ్‌ లాహోర్‌లో సాండర్స్‌ను కాల్చి చంపాడు. ఆ సంఘటనే లాహోర్‌ కుట్రకేసుగా పేరొందింది. లాలాజీ లాంటి వ్యక్తులు భూమిపై సూర్యుడు ప్రకాశించినంత కాలం మరణించరని గాంధీజీ పేర్కొనగా, ఆయన మరణం జాతికి విపత్తు అని సుభాష్‌ చంద్రబోస్‌ పేర్కొన్నాడు.

బిపిన్‌ చంద్రపాల్‌ (1858 - 1932)

బెంగాల్‌ డాంటన్‌గా పేరొందిన బిపిన్‌ చంద్రపాల్‌ 1858, నవంబరు 7న ప్రస్తుత బంగ్లాదేశ్‌లోని సిల్హాట్‌లో జన్మించాడు. 1876లో పండిట్‌ శివనాథ శాస్త్రి సలహాతో బ్రహ్మసమాజంలో చేరాడు. 1901లో ‘న్యూ ఇండియా’ అనే ఆంగ్ల వారపత్రిక, అరబిందో ఘోష్‌తో కలిసి ‘వందేమాతరం’ పత్రికను నడిపాడు (అనిబిసెంట్‌ కూడా న్యూ ఇండియా పత్రికను నడిపారు). 1907లో వందేమాతరం పత్రికలో బ్రిటిష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాయడం వల్ల ఆరు నెలల జైలు శిక్ష అనుభవించాడు. 1887 నాటి మద్రాస్‌ కాంగ్రెస్‌ సమావేశంలో లిట్టన్‌ ప్రవేశపెట్టిన ఆయుధాల చట్టాన్ని రద్దు చేయాల్సిందిగా కోరాడు. భారత జాతీయవాదం (ఇండియన్‌ నేషనలిజమ్‌), జాతీయతా సామ్రాజ్యం అనే గ్రంథాలను రాశాడు.

అరబిందో ఘోష్‌ (1872 - 1950)

  ఈయన 1872, ఆగస్టు 15న కలకత్తాలో జన్మించాడు. 1890లో ఐసీఎస్‌ పరీక్షలో ఉత్తీర్ణుడై బరోడా సంస్థానంలో పనిచేశాడు. వందేమాతర ఉద్యమకాలంలో కలకత్తాలో నెలకొల్పిన జాతీయ కళాశాలకు ప్రిన్సిపాల్‌గా పనిచేశాడు. 1902లో అనుశీలన్‌ సమితి స్థాపనలో ప్రధానపాత్ర పోషించాడు. జాతీయత అనే మతానికి దేశమాత దైవమని పలికాడు. 1909 నాటి అలీపూర్‌ బాంబుకేసులో అరెస్టయినప్పుడు చిత్తరంజన్‌దాస్‌ ఇతడిని నిర్దోషిగా నిరూపించాడు. భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్య్రం కావాలని పలికిన తొలి భారతీయ వ్యక్తి ఈయనే. కర్మయోగిన్, ధర్మ అనే పత్రికల ద్వారా ఆధ్యాత్మికతతో కూడిన స్వాతంత్య్రోద్యమాన్ని ప్రచారం చేశాడు. 1910లో పాండిచ్చేరిలో ఆశ్రమాన్ని నిర్మించి ‘పాండిచ్చేరి యోగి’గా మారాడు. ది లైఫ్‌ డివైన్, సావిత్రి లాంటి గ్రంథాలను రచించాడు.

Posted Date : 24-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌